నేనే, భయపడకుడి | యేసు నీటిపై నడిచిన కథ - మత్తయి 14:22-36

 



మత్తయి 14:22-36

యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తన కంటె ముందుగా ఆవలి దరికి చేరవలయునని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండమీదికి వెళ్ళెను. సాయంసమయము వరకు ఆయన ఏకాంతముగా అచటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలదూరము పోయెను. వేకువజామున యేసు నీటిపై నడచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై “ఇది భూతము” అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, “భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా!” అని పలికెను. పేతురు- అంతట “ప్రభూ! నిజముగా నీవే అయిన నీటిమీద నడచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ యిమ్ము” అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి, నిటిపై నడచి, ఆయన యొద్దకు వచ్చుచుండెను. కాని, ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగి పోవుచు “ప్రభూ! నన్ను రక్షింపుము" అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, “అల్పవిశ్వాసీ! నీవేల సందేహించి తివి?” అనెను. అంతటవారు పడవనెక్కగా గాలి అణగి పోయెను. పడవలో నున్న శిష్యులు “నీవు నిజముగా దేవుని కుమారుడవు” అని పలికి ఆయనను ఆరాధించిరి. వారు దరికి చేరి గెన్నెసరేతు ప్రాంతమునకు వచ్చిరి. అచట జనులు ఆయనను గుర్తించినపుడు పరిసర ప్రాంతమంతటికి ఆ వార్తను పంపి వ్యాధిగ్రస్తులనందరిని ప్రభుసన్నిధికి తీసికొని వచ్చిరి. వారిని కనీసము ఆయన అంగీ అంచునైనను తాకనీయుము అని ఆయనను ప్రార్థించిరి. అట్లు తాకినవారెల్లరును స్వస్థతపొందిరి

"వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా..."మత్తయి 14:27

రాత్రి సమయం... సముద్రం హోరెత్తుతోంది. ఎదురుగాలి పడవను ముంచెత్తాలని చూస్తోంది. అలసిన చేతులు తెడ్లను గట్టిగా పట్టుకున్నాయి, కానీ శరీరంలో బలం నశిస్తోంది. "మనం మునిగిపోతున్నామేమో!" అనే భయం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

ఈ దృశ్యం కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం గలిలయ సముద్రంలో పన్నెండు మంది శిష్యులు ఎదుర్కొన్న రాత్రికి మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రతి విశ్వాసి తన జీవిత యాత్రలో ఏదో ఒక దశలో తప్పక ఎదుర్కొనే భయంకరమైన రాత్రికి గుర్తు. ఈ సువిశేష భాగం మనకు కేవలం ఒక అద్భుత కథను చెప్పడం లేదు; జీవిత తుఫానుల మధ్య దేవుని సన్నిధిని ఎలా గుర్తించాలో, సందేహాల సుడిగుండంలో విశ్వాస దీపాన్ని ఎలా వెలిగించి ఉంచాలో నేర్పుతుంది.

ఇక్కడ మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఉత్తేజపరిచే మూడు ముఖ్యమైన విషయాలను చూడవచ్చు:

  1. కొండపై ఏకాంతంగా ప్రార్థించే యేసు ప్రభువు  (పరలోక మధ్యవర్తిత్వం)
  2. సముద్రంపై నడిచివచ్చే ప్రభువు, పేతురు అనుభవం (విశ్వాస పరీక్ష, రక్షణ)
  3. గెన్నెసరేతులో లభించిన స్వస్థత (దేవుని కృప)

ఈ మూడు దృశ్యాలు ప్రభువు తన ప్రజలను వారి  జీవిత తుఫానుల మధ్య ఎన్నటికీ ఒంటరిగా విడిచిపెట్టడు అనే సత్యమును తెలియజేస్తున్నాయి.

1. నేపథ్యం

ప్రభువు  ఐదు రొట్టెలు, రెండు చేపలతో ఐదు వేల మందికి పైగా ఆహారం అందించిన  తరువాత ఇది జరుగుతుంది. యోహాను సువార్త 6:15 ప్రకారం, అక్కడి ప్రజలు  యేసు ప్రభువును బలవంతంగా తమకు రాజుగా చేయాలని  ప్రయత్నించారు.

ఐహికంగా ఆలోచిస్తే ఇదొక గొప్ప అవకాశము!  ప్రభువుకు ప్రజాదరణ శిఖరాగ్రంలో ఉంది, అనుచరులు వేలల్లో ఉన్నారు. కానీ యేసు ప్రభువు  ఏం చేశాడు? ఆయన ఆ లోకసంబంధమైన మెప్పును స్వీకరించలేదు. బదులుగా, శిష్యులను వెంటనే పడవ ఎక్కించి ఆవలి తీరానికి పంపివేసి, తాను ఏకాంతంగా ప్రార్థించడానికి కొండపైకి వెళ్లాడు.

మన జీవితంలో అత్యున్నత విజయ క్షణాల్లోనే అతిపెద్ద శోధన పొంచి ఉంటుంది. జనం మనల్ని మెచ్చుకున్నప్పుడు, ఆత్మీయంగా లేదా భౌతికంగా గొప్ప విజయాలు సాధించినప్పుడు, దేవునికి దూరంమై,  వాటిని ఆనందించే పనిలో పడిపోయే ప్రమాదం ఉంది. యేసు ప్రభువు  దీనికి విరుద్ధంగా వ్యవహరించాడు. సేవలో  ఎంత గొప్ప ఫలితాలు వచ్చినా, అది తండ్రితో ఉండే "ప్రార్థనా జీవితాన్ని" ప్రక్కన పెట్టకూడదు అనే  విషయాన్ని ప్రభువు మనకు చూపిస్తున్నాడు.

2. కొండపై ప్రార్థన: ఏకాంతం బలహీనత కాదు, అపారమైన బలం!

"ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండమీదికి వెళ్ళెను. సాయంసమయము వరకు ఆయన ఏకాంతముగా అచటనే ఉండెను." - మత్తయి 14:23

పవిత్ర  గ్రంథంలో "కొండ" ఎల్లప్పుడూ దేవునితో సన్నిహిత సంబంధానికి, దేవునితో సంభాషణకు వేదికగా కనిపిస్తుంది. మోషే సీనాయి కొండపై దేవుని మహిమను చూశాడు; ఏలీయా హోరేబు కొండపై దేవుని మెల్లని స్వరంలో ఆయన సన్నిధిని అనుభవించాడు. యేసు ప్రభువు  కూడా తన పరిచర్యలోని ప్రతి కీలక ఘట్టంలో ప్రార్థన కోసం కొండలనే ఎంచుకున్నాడు.

ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక ఉంది:

  • యేసు ప్రభువు  కొండపై ప్రార్థిస్తున్నాడు: “ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవియై ఉన్నాడు. కావున తన ద్వారా దేవుని చేరువారిని రక్షించుటకు ఆయన ఇప్పుడును ఎల్లప్పుడును సమర్ధుడే” (హెబ్రీ 7:25).
  • శిష్యులు సముద్రం మధ్యలో పోరాడుతున్నారు: ఇది ఈ లోకమనే అస్థిరమైన సముద్రంలో ప్రయాణిస్తున్న మన ప్రస్తుత ఆధ్యాత్మిక స్థితికి ప్రతీక.

మనం ఈ లోకంలో ఒంటరిగా పోరాడుతున్నట్లు అనిపించినా, మన రక్షకుడు పరలోకంలో మన కోసం ప్రార్థిస్తున్నాడనే నిరీక్షణ మనకు బలాన్నిస్తుంది. ఈ కాలంలో నిరంతరం ఏదో ఒక సమాచారంతో అనుసంధానమై ఉండాలనే ఒత్తిడి మనపై ఉంది. ఈ వాతావరణంలో "ప్రశాంతమైన ఏకాంతం" చాలామందికి సాధ్యం కాదు.  కాని అది మన ఆత్మకు అత్యంత అత్యవసరమైన ఆహారం. ఈ ఏకాంతంలో ప్రభువుతో ఉండటం నేర్చుకోవాలి.

3. తుఫాను మధ్య పడవ: విధేయత చూపినా కష్టాలు రావచ్చు

ఇక్కడ మరొక సత్యాన్ని మనం గ్రహించాలి. శిష్యులు తమ సొంత నిర్ణయంతో పడవ ఎక్కలేదు! యేసు ప్రభువు వారిని ఆజ్ఞాపించి, బలవంతం చేసి ఆవలి తీరానికి పంపాడు. దేవుని మాటకు పూర్తిగా విధేయత చూపిన తర్వాత కూడా వారు తుఫానులో చిక్కుకున్నారు.

"అప్పటికి పడవ దరికి చాల దూరమున ఉండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టుకొనుచుండెను" - మత్తయి 14:24

ఇది మన కన్నులు తెరిపించే హెచ్చరిక: మనం దేవుని చిత్తంలో సరైన మార్గంలో నడుస్తున్నంత మాత్రాన జీవితంలో ఎలాంటి తుఫానులు  రావని అర్థం కాదు. కష్టాలు ఎదురైనంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడని లేదా మన మార్గం తప్పిందని భావించకూడదు.

యూదుల సాంప్రదాయంలో సముద్రం అనేది అస్తవ్యస్తతకు, భయానక వాతావరణానికి, చెడు శక్తులకు ప్రతిరూపం. కాబట్టి, ఆ రాత్రి గలిలయ సముద్రంలో సంభవించినది కేవలం ఒక భౌతిక వాతావరణ మార్పు కాదు; జీవితంలో సంభవించే అనిశ్చితికి, ఆకస్మిక ప్రతికూలతలకు అది ఒక రూపము. మనం ఎదుర్కొనే  తీవ్రమైన అనారోగ్యం, ఆర్థిక సంక్షోభం, మానసిక కుంగుబాటు, లేదా ఒంటరితనం ఇవన్నీ మన పడవను ఊపేస్తున్న "ప్రతికూల గాలులే!"

యేసు ప్రభువు  వారి వద్దకు ఎప్పుడు వచ్చాడు? "రేయి నాలుగవ జామున"  అంటే రాత్రి 3 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య! అప్పటికే శిష్యులు గంటల తరబడి అలలతో పోరాడి, శరీరకంగా, మానసికంగా తీవ్రమైన అలసటకు గురయ్యారు.

దేవుడు తరచుగా మనం అనుకున్న సమయానికి కాకుండా, మనకు అవసరమైన తన దివ్య సమయానికి వస్తాడు. ఆయన ఆలస్యంగా వచ్చాడని మన మానవ మనస్సుకు అనిపించవచ్చు; కానీ ఆయన ఎన్నటికీ నిజమైన ఆలస్యం చేయడు. తగిన సమయానికే దేవుడు వస్తాడు.

4. "నేనే ": నీటిపై నడిచే సృష్టికర్త దేవుడు

యేసు ప్రభువు  అల్లకల్లోలంగా ఉన్న నీటిపై నడిచి రావడం, ఆయన "దైవత్వానికి" స్పష్టమైన నిరూపణ. పాత నిబంధన ప్రకారం, సముద్రపు అలలను అణచివేసే అధికారం, నీటిపై అడుగులు వేసే శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది:

  • "ఆయనే ఆకాశమును దుప్పటివలె విప్పును. అలలను అణగదొక్కి సముద్రమును అదుపులో పెట్టుకొనును.."  యోబు 9:8
  • "నీవు సాగరముగుండ నడచితివి. లోతైన సముద్రముగుండ సాగిపోయితివి. కాని నీ అడుగుజాడలు మాత్రము కన్పింపరానివి."  కీర్తనలు 77:19

యేసు ప్రభువు  నీటిపై నడవడమే కాకుండా, శిష్యులతో "నేనే కదా" అని పలికాడు.  నిర్గమకాండము 3:14లో దేవుడు మోషేతో "నేను ఉన్నవాడను " అని తన దివ్య నామాన్ని వెల్లడించిన పదబంధమే ఇది! యేసు ప్రభువు  ఇక్కడ కేవలం "నేను యేసును, భయపడకండి" అని చెప్పడం లేదు; "సృష్టికి మూలకారకుడనైన దేవుడను నేనే, నా సమక్షంలో మీరు భయపడాల్సిన పనిలేదు" అని ప్రకటిస్తున్నాడు.

అయితే, భయంతో నిండిపోయిన శిష్యులు ఆయనను మొదట దేవునిగా గుర్తించలేకపోయారు. "ఇది భూతము!" అని భయంతో కేకలు వేశారు. ఎంతకాలం యేసు ప్రభువుతో కలసి ప్రయాణించినా, భయం అనేది మనుషుల కళ్లను కప్పేస్తుంది. నేడు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతము చేయడానికి దగ్గరగా వచ్చినప్పుడు, మన భయాలు, సందేహాలు ఆయన సన్నిధిని గుర్తించకుండా మన కళ్లను మూసివేస్తుంటాయి. భయానికి ఒకే విరుగుడు,  క్రీస్తు స్వరం వినడమే.

5. పేతురు: సాహసము, పతనము మరియు తక్షణ రక్షణ

ఈ సంఘటనలో నాటకీయమైన, హృదయాన్ని కదిలించే ఘట్టం పేతురు అనుభవం.

"పేతురు, ప్రభూ, నీవే అయితే నీటిమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పగా..." మత్తయి 14:28

మిగిలిన పదికొండు మంది శిష్యులు భయంతో పడవ అంచులను గట్టిగా పట్టుకుని కూర్చుంటే, పేతురు మాత్రం ఆ సురక్షితమైన సరిహద్దులను దాటి ప్రమాదకరమైన నీటిలోకి దిగడానికి సిద్దపడ్డాడు. నిజమైన శిష్యత్వానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ.  మన సొంత సౌలభ్యలను వదిలి, క్రీస్తు మాట ఆధారంగా అడుగు ముందుకు వేయడమే విశ్వాసం!

మనం గుర్తించాల్సిన అద్భుతం ఏమిటంటే, పేతురు నిజంగానే నీటిపై నడిచాడు! విశ్వాసంతో ఆయన చూపు యేసు ప్రభువుపై నిలిచి ఉన్నంత కాలం, ప్రకృతి నియమాలు ఆయన కాళ్ల కింద లొంగిపోయాయి. కానీ, ఎప్పుడైతే తన దృష్టిని యేసు ప్రభువు  నుండి తిప్పి, చుట్టూ వీస్తున్న పెనుగాలి వైపు, ఉగ్రంగా ఎగసిపడుతున్న అలల వైపు మళ్లించాడో... వెంటనే మునిగిపోవడం ప్రారంభమైంది!

ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయాలు:

  • సమస్య గాలి కాదు; సమస్య దృష్టి మారడం! జీవితంలో తుఫానులు ఉన్నంత మాత్రాన మనం మునిగిపోము; కానీ తుఫాను సృష్టికర్త కంటే పెద్దదని భావించి ఆయనపై నుండి దృష్టి తిప్పినప్పుడే మునిగిపోతాము.
  • చిన్నదైనా, శక్తివంతమైన ప్రార్థన: మునిగిపోతున్న క్షణంలో పేతురు పెద్ద ప్రార్థనలు చేయలేదు. కేవలం "ప్రభూ! నన్ను రక్షింపుము!" అని కేక వేశాడు. ఇది బైబిలులోనే అతి చిన్నది, అత్యంత హృదయపూర్వకమైన ప్రార్థన.
  • కృపా హస్తం: "వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని...". మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకోవడం కంటే, దేవుడు మన చేయి పట్టుకోవడమే మనకు భద్రత! రక్షణ అనేది మన బలంపై ఆధారపడి లేదు, ఆయన అపరిమితమైన కృపపై ఆధారపడి ఉంది.

యేసు ప్రభువు పేతురును "అల్పవిశ్వాసీ, నీవేల సందేహించితివి?" అని అడిగినప్పుడు, అది తిరస్కారంతో కూడిన గద్దింపు కాదు; అది ఒక ప్రేమపూర్వకమైన దిద్దుబాటు. ఆయన పేతురును "అవిశ్వాసీ" అని అనలేదు, "అల్పవిశ్వాసీ" అన్నాడు. అంటే విశ్వాసం ఆరంభమైంది, కానీ అది ఇంకా సంపూర్ణ పరిపక్వత సాధించాల్సి ఉంది.

యేసు  ప్రభువు మరియు పేతురు కలసి పడవ ఎక్కగానే, హోరెత్తుతున్న గాలి వెంటనే అణగిపోయింది! అప్పుడు పడవలోని శిష్యులందరూ సాష్టాంగపడి, "నీవు నిజముగా దేవుని కుమారుడవు" అని ఆయనను ఆరాధించారు. తుఫాను వారి విశ్వాసాన్ని నాశనం చేయడానికి వచ్చింది, కానీ చివరకు అది వారిని దేవుని  ఆరాధనలోనికి నడిపించింది!

6. పడవ - దేవుని సంఘానికి ఒక ప్రత్యక్ష ప్రతీక

తిరుసభ పితరుల ప్రకారం, అలల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ పడవ తిరుసభకు ప్రతిరూపం.

  • సముద్రం: లౌకిక ప్రపంచం, దాని శోధనలు.
  • అలలు, గాలి: తిరుసభ  యుగయుగాలుగా ఎదుర్కొంటున్న హింసలు, విరోధాలు, ఆధ్యాత్మిక పోరాటాలు.
  • కొండపై యేసు: తిరుసభ  కోసం నిరంతరం విజ్ఞాపన చేస్తున్న పరలోక క్రీస్తు.

బాహ్య ప్రపంచంలో శ్రమలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, క్రీస్తు మన జీవితములోనికి అడుగుపెట్టినప్పుడు ఆంతరంగిక సమాధానం, శాంతి నెలకొంటాయి. దేవుడు కొన్నిసార్లు బయట ఉన్న తుఫానును వెంటనే ఆపకపోవచ్చు, కానీ ఆయన సన్నిధి మన హృదయాలలో గొప్ప శాంతిని నింపుతుంది. అదే అసలైన అద్భుతం.

7. గెన్నెసరేతు: సమాజానికి విస్తరించిన దివ్య స్వస్థత

ఈ అద్భుత ఘట్టం క సముద్రం మీద జరిగిన వ్యక్తిగత అనుభవంతో ఆగిపోలేదు. వారు తీరానికి చేరి గెన్నెసరేతు ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన సామాజిక పరిణామం జరిగింది.

అక్కడి ప్రజలు యేసు ప్రభువును గుర్తించి, చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ వర్తమానం పంపి, వ్యాధిగ్రస్తులందరినీ ఆయన వద్దకు తీసుకువచ్చారు. విశ్వాసంతో "ఆయన అంగీ అంచునైనా తాకనీయుము" అని వేడుకున్నారు. తాకిన వారందరూ సంపూర్ణ స్వస్థత పొందారు.

తుఫానులో తాము పొందిన దైవ అనుభవాన్ని, శక్తిని శిష్యులు సమాజ క్షేమం కోసం ఉపయోగించారు. సమాజంలో మూలన పడినవారు, రోగులు, బలహీనులు కూడా క్రీస్తు స్పర్శ ద్వారా పునరుద్ధరించబడ్డారు.  తిరుసభ లేక సంఘ ప్రాథమిక బాధ్యత ఇదే, తుఫానుల నుండి లభించిన రక్షణ అనుభవంతో, లోకంలో గాయపడిన వారిని క్రీస్తు వద్దకు నడిపించడం!

8. మన అనుదిన జీవితానికి

ఈ సువిశేష  భాగం నుండి మనం గ్రహించాల్సినవి, గొప్ప ఆత్మీయ లేదా భౌతిక విజయాలు సాధించినప్పుడు ప్రార్థనను విడిచిపెట్టకుండా నమ్రతతో ప్రార్థనలో కొనసాగాలని యేసు ప్రభువు  కొండపైకి ప్రార్ధనకై  వెళ్లిన ఘట్టం మనకు నేర్పుతోంది. దేవుని చిత్తంలో నడుస్తున్నప్పుడూ కష్టాలు రావచ్చు,  శ్రమలు వచ్చాయంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడని అర్థం కాదు. జీవితంలో అత్యంత నిస్సహాయకరమైన, చీకటి క్షణాల్లోనే దేవుడు మన దగ్గరకు వస్తాడు. మన దృష్టి యేసు ప్రభువుపై ఉన్నంత కాలం ప్రతికూల పరిస్థితులపై విజయం సాధించగలము కానీ, సమస్యల వైపు చూస్తే మునిగిపోతాము. ఆత్మీయంగా మునిగిపోతున్నప్పుడు పెద్ద  ప్రార్థనలు అక్కర్లేదు; "ప్రభూ! రక్షించు" అనే ఆక్రందనను ఆయన వెంటనే వింటాడు. "అల్పవిశ్వాసం" అనేది అవమానకరం కాదు; అది పూర్ణ విశ్వాసంలోనికి ఎదగడానికి దేవుడు ఇచ్చే ఒక అవకాశం. ప్రతి తుఫాను అనుభవం మనలను దేవుని ఆరాధించేవారినిగా చేయాలి. మనం పొందిన ఆత్మీయ అనుభవాన్ని, స్వస్థతను మనలోనే దాచుకోక సమాజంలోని బలహీనులకు పంచిపెట్టాలి. గత పోస్టు చదవండి https://www.carmelshobha.com/2026/08/aakali-teerche-devuni-prema-bible-reflection.html

 ప్రార్ధన

ప్రభువా! జీవితమనే సముద్రంలో ఎదురుగాలులు వీస్తూ, భయాందోళనలు మమ్మల్ని ముంచెత్తుతున్న వేళ "నేనే , భయపడకుడి" అని మీరు ఇచ్చే అభయం మా హృదయాలకు ఎంతో ఓదార్పునిస్తోంది. ప్రభూ, విజయ క్షణాల్లో ప్రార్థన మరచిపోకుండా, శ్రమల వేళ మీపైనే చూపు నిలిపే కృపను మాకు ప్రసాదించండి. కష్టాల తుఫానులో మేము మునిగిపోతున్నప్పుడు, పేతురువలె "ప్రభూ! మమ్మల్ని రక్షించు" అని మొరపెట్టగానే మీ అభయహస్తాన్ని చాచి మమ్మల్ని పట్టుకోండి. మా అల్పవిశ్వాసాన్ని బలపరచి, మీ సన్నిధి ఇచ్చే శాంతితో నింపండి. మీ నుండి పొందిన ఈ రక్షణను, దివ్య కృపను సమాజంలోని బలహీనులతో పంచుకునే సాక్షులుగా మమ్మల్ని నడిపించండి. ఆమేన్.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు