కార్మెల్ మాత – ఆశాదీపం | స్కాపులర్ వెనుక గల ఆధ్యాత్మిక అర్థం| కార్మెల్ శోభ
కార్మెల్ మాత - ఆశాదీపం
కార్మెలియ సన్యాసులు, కార్మెల్ గుహలలో నివసిస్తూ ఒక తల్లిని వెతుక్కుంటూ వచ్చారు. ఏలీయా ప్రవక్త తరువాత, కార్మెల్ పర్వతం మీద ప్రార్థనలో బ్రతికిన ఆ తొలి సన్యాసులు, తమ చిన్న సముదాయానికి ఒక రక్షకురాలిని, ఒక తల్లిని కోరుకున్నారు. వారు ఆ కొండలో మరియమాతకు ఒక దేవాలయం నిర్మించి అక్కడ నివసిస్తూ ఆమె ప్రార్ధన విధాన్యమును, దేవుని విషయాలను మనసులో దాచుకొని వాటిని ధ్యానిస్తూ జీవించ సాగారు. అప్పటినుండి కార్మెల్ సభకు మరియ మాత కేవలం గౌరవనీయ వ్యక్తి కాదు ఆమె సభ యొక్క తల్లి, రక్షకురాలు, మరియు మార్గదర్శకురాలు.
ఈ రోజు మనం ఆమెను 'కార్మెల్
మాత' అని పిలుస్తాము. ఆమె పేరు వినగానే మన మనసులో మెదిలేది కాఫీ రంగు ఉత్తరీయం,
ఆ చిన్న పై వస్త్రం, భుజాలపై వేలాడుతూ, హృదయానికి
దగ్గరగా ఉండేది. కానీ ఉత్తరీయం కేవలం ఒక
వస్త్రం కాదు; అది ఒక వాగ్దానం. మరియ మాత తన బిడ్డలను
తన వస్త్రపు అంచుతో కప్పి ఉంచుతానని చేసిన వాగ్దానం. తుఫాను వచ్చినా, చీకటి కమ్మినా, ఆమె వస్త్రం క్రింద ఆశ్రయం ఉంటుందని
ఇచ్చిన హామీ.
"ఆయన తల్లి సేవకులతో “ఆయన చెప్పినట్లు
చేయుడు” అనెను."- యోహాను
2:5
కానా పెళ్ళి విందులో మరియ మాత పలికిన ఈ
ఒక్క వాక్యం, ఆమె జీవితమంతటికీ సారాంశం. ఆమె ఎప్పుడూ
తనను తాను చూపించుకోలేదు; ఎల్లప్పుడూ కుమారుని వైపు చూపించింది.
కార్మెలియ ఆధ్యాత్మికత ఇదే బోధిస్తుంది. మరియ మాత మనలను తన వైపుకు కాదు, క్రీస్తు వైపుకు నడిపిస్తుంది. అమ్మ చేయి పట్టుకుని నడిచే పసిబిడ్డలా,
ఆమె వెంట నడిస్తే మనం చేరుకునేది ఆమె కుమారుని హృదయమే.
తెరేసమ్మ, తన
అంతరంగిక కోటలో, మరియ
మాతను 'ప్రార్థనకు ఉపాధ్యాయిని' గా భావించింది. హృదయపు
లోతైన గదులలోకి ప్రయాణించమని ఆమె బోధించినపుడు, ఆ
మార్గదర్శకత్వం మరియ మాత అనుభవించిన మౌన ధ్యానాన్ని పోలి ఉంటుంది, సువార్త చెప్పినట్లు 'మరియ
ఈ సంగతులన్నిటిని తన హృదయములో పదిలపరచుకొని
ధ్యానించుచుండెను' (లూకా 2:19) పునీత సిలువ యోహాను, తన గాఢంధకార రాత్రి అనుభవంలో, మరియ
మాతను విశ్వాసంతో నడిచిన మార్గదర్శిగా చూశాడు. ఆమెకు కూడా అర్థంకాని రాత్రులు ఉండేవి (శిలువ
దగ్గర నిలబడిన ఆ రాత్రి), అయినా ఆమె దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు.
మనం కూడా అలాంటి రాత్రులు ఎదుర్కొంటాము.
ఆరోగ్యం విషయంలో భయం, కుటుంబంలో అపార్థాలు, భవిష్యత్తు గురించి ఆందోళన, ఇవన్నీ మన హృదయాన్ని చీకటిలో
ముంచేస్తాయి. అలాంటి క్షణాలలో కార్మెల్ మాత మనకు ఏమి బోధిస్తుంది? ప్రశాంతంగా ఉండమని కాదు; నిజాయితీగా,
నమ్మకంతో నిలబడమని. ఆమె సిలువ దగ్గర నుండి పారిపోలేదు. కుమారుని
బాధను తానూ భరించింది, మాట్లాడకుండా, కానీ
దృఢంగా నిలబడి ఆ బాధను భరించింది.
ఆమె ఉత్తరీయం ధరించడం అంటే ఒక తాయత్తు, మంత్రవస్తువు ధరించడం కాదు. అది నేను
మరియ మాత బిడ్డనని, ఆమె వస్త్రపు అంచు క్రింద జీవించాలని
కోరుకుంటున్నానని ఆమెకు తెలియజేయడం. అది
ప్రతిరోజూ దేవునికి మరియమాత 'ఇదిగో ప్రభువు
దాసురాలిని' అని పలికినట్లు (లూకా 1:38), దేవునికి
మనం కూడా మన చిన్న రోజువారీ కష్టాలలో, నిర్ణయాలలో
ఆ మాటను పునరావృతం చేయాలి.
ఏలీయా ప్రవక్త కార్మెల్ పర్వతం మీద చిన్న
మేఘం కోసం ఎదురుచూసినట్లు (1 రాజులు 18:44), మనం
కూడా కొన్నిసార్లు నిరీక్షణలోనే ఉండిపోతాము, మన జీవితాల్లో ప్రార్థన ఫలించనట్లు అనిపించే క్షణాలు వుండవచ్చు.
కానీ ఆ చిన్న మేఘమే వర్షాన్ని తెచ్చింది. మరియ మాత మన జీవితంలో అలాంటి చిన్న మేఘమే,
నిశ్శబ్దంగా, గమనించకుండానే, ఆమె
సన్నిధి మనకు దేవుని కృప అనే వర్షాన్ని తెస్తుంది.
ఈ రోజు, కార్మెల్
మాతను జ్ఞాపకం చేసుకుంటూ, ఆమెకు ఒక్క విన్నపం చేద్దాం. ఆ విన్నపము ఏమంటే
మా భయాలను, మా
చీకటి రాత్రులను, మా నిస్సహాయతను నీ వస్త్రపు అంచుతో కప్పి
ఉంచు తల్లీ. మేము దారి తప్పినపుడు, నీ కుమారుని వైపుకు మా వేలును తిప్పు.
ప్రార్ధన
కార్మెల్ మాతా, కార్మెల
సభకు తల్లివి, రక్షకురాలివి. నీ స్కాపులర్ ధరించిన
ప్రతి హృదయాన్ని నీ వస్త్రపు అంచు క్రింద కాపాడుము. మా జీవితపు చీకటి రాత్రులలో,
తెరీసమ్మ, యోహాను నడిచిన విశ్వాస మార్గములో మమ్మును
నడిపింపుము. మేము ఎప్పుడూ నీ కుమారుని వైపే చూచుచు, 'ఆయన చెప్పినట్లు చేయుడి' అను నీ మాటను
జీవితాంతం పాటించునట్లు చేయుము. ఆమెన్.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment