"మరియమాత రాణిత్వం — పరలోక భూలోక రాజ్ఞి | కార్మెల్ శోభ"
గెబీరా నుండి పరలోక రాణి వరకు-మరియమాత రాణిత్వం
మరియమాతను "పరలోక భూలోక రాజ్ఞి"గా గౌరవించడం క్రైస్తవ విశ్వాసంలో, ప్రముఖమైన ఆధ్యాత్మిక సత్యం. ఇది కేవలం ఒక గౌరవసూచక బిరుదు మాత్రమే కాదు. క్రీస్తు రాజ్యంలో మరియమాతకు దేవుడు ప్రసాదించిన ప్రత్యేక స్థానాన్ని, ఆమె పుత్రుడైన యేసుక్రీస్తుతో ఆమెకున్న అనన్యమైన సంబంధాన్ని, విశ్వాసుల రక్షణ చరిత్రలో ఆమె పోషించిన పాత్రను తెలియజేసే సత్యం.
1. మరియమాత భూలోక పరలోక రాణి
క్రైస్తవ విశ్వాసంలో "రాణి" అనే పదాన్ని లౌకిక లేదా రాజకీయ అర్థంలో అర్థం చేసుకుంటే తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మరియమాతకు ఏ దేశంపైనా రాజకీయ అధికారమో, సైన్యమో, భౌతిక సింహాసనమో లేవు. లౌకిక ప్రపంచంలో రాజత్వం అంటే అధికార ప్రదర్శన, ఆధిపత్యం మరియు పాలన. కానీ క్రైస్తవ విశ్వాసంలో నిజమైన రాజత్వం అంటే ప్రేమ, సేవ, వినయం, త్యాగం మరియు దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయత.
యేసుక్రీస్తు సిలువపై తనను తాను అర్పించుకోవడం ద్వారా, తన ప్రాణాన్ని సమర్పించడం ద్వారాఈ రాజత్వాన్ని సంపూర్తిగా చూపించాడు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అదేవిధంగా మరియమాత కూడా లౌకిక అధికార దాహంతో కాక, వినయం, విశ్వాసం, కల్వారి సిలువ వద్ద అనుభవించిన ఆత్మ త్యాగం ద్వారా "రాణి"గా నిలిచింది.
2. బైబిల్ మూలాలు — పాత నిబంధన "గెబీరా" సంప్రదాయం
మరియమాత రాణిత్వానికి ప్రాథమిక పునాది పాత నిబంధనలోని దావీదు రాజవంశ సంప్రదాయంలో అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. పురాతన ఇశ్రాయేలు రాజ్యంలో, రాజు యొక్క భార్యకు కాక, రాజు యొక్క తల్లికి "గెబీరా" (Great Lady / Queen Mother — రాణి తల్లి) అనే ప్రత్యేక గౌరవప్రదమైన రాజ్యాంగ స్థానం ఉండేది. పాత నిబంధన కాలంలో రాజ్యంలో అత్యున్నత అధికారిక స్థానం, రాజు తర్వాత రెండవ స్థానం రాజు తల్లికి దక్కేది.
ఈ రాణి రాజ ఆస్థానంలో రాజు సింహాసనం పక్కన తనకంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై కూర్చునేది. ప్రజలు తమ విన్నపాలను, బాధలను రాజు వద్దకు చేర్చడానికి ఆమెను ఒక మధ్యవర్తిగా ఆశ్రయించేవారు. 1 రాజులు 2వ అధ్యాయంలో సొలొమోను రాజు మరియు అతని తల్లి బత్షెబ సంఘటన దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బత్షెబ తన కుమారుడైన సొలొమోను రాజును దర్శించడానికి వచ్చినప్పుడు, సొలొమోను తన సింహాసనం నుండి లేచి నిలబడి, ఆమెకు ఎదురెళ్లి నమస్కరించి, తన కుడి పక్కన ఆమె కోసం ఒక ప్రత్యేక సింహాసనాన్ని ఏర్పాటు చేయిస్తాడు. ఇది రాజు తల్లికి ఇశ్రాయేలు రాజ్యంలో ఉండే అధికారిక గౌరవానికి, రాజ్యాంగ స్థానానికి నిదర్శనం.
ఈ పాత నిబంధన సంప్రదాయం క్రొత్త నిబంధనలో నెరవేరింది. యేసుక్రీస్తు దావీదు సింహాసనానికి శాశ్వతమైన రాజు. లూకా సువార్త 1:32-33 లో గాబ్రియేలు దేవదూత మరియమాతకు ప్రత్యక్షమై, " ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసన మును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు” అని ప్రకటిస్తాడు. ఈ శాశ్వతమైన రాజైన యేసుక్రీస్తుకు తల్లిగా, మరియమాత సహజంగానే దావీదు రాజవంశ సంప్రదాయం ప్రకారం " తల్లి రాణి " (గెబీరా) హోదాను పొందుతుంది. ఇతర మానవ రాజుల తల్లుల వలె ఆమె స్థానం తాత్కాలికమైనది కాదు, ఆమె కుమారుని రాజ్యం శాశ్వతమైనది గనుక ఆమె రాణిత్వం కూడా నిత్యమైనది.
అంతేకాకుండా, ఎలిశబెత్తమ్మను మరియమాత దర్శించినప్పుడు, పరిశుద్ధాత్మతో ప్రభావంతో ఆమె "నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగు ప్రాప్తించెను?" (లూకా 1:43) అని కీర్తిస్తుంది. ఇక్కడ ఎలిశబెత్తమ్మ ఉపయోగించిన "నా ప్రభువు తల్లి" అనే పదం సాధారణమైన పదం కాదు. దావీదు రాజవంశంలో రాజును "ప్రభువు" అని పిలిచేవారు, కాబట్టి "నా ప్రభువు తల్లి" అనడం ద్వారా ఎలిశబెత్తమ్మ మరియమాతను తల్లి రాణిగా, ఆధ్యాత్మిక హోదా కలిగిన వ్యక్తిగా గుర్తించి గౌరవించింది.
3. క్రొత్త నిబంధనలోని చిత్రణలు- కానా విందు మరియు ప్రకటన గ్రంథం
పాత నిబంధనలో సూచించబడిన తల్లి రాణి భావన క్రొత్త నిబంధనలో మరియమాత ప్రవర్తన ద్వారా అపొస్తలుడైన యోహానుకు కలిగిన దర్శనాల ద్వారా మరింత బలపడింది.
యోహాను సువార్త 2వ అధ్యాయంలో వర్ణించబడిన కానా వివాహ విందు సంఘటన మరియమాత మధ్యవర్తిత్వ పాత్రను ప్రస్ఫుటంగా చూపుతుంది. ఆ వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు, కుటుంబంలో తలెత్తిన ఆ అసౌకర్యాన్ని గుర్తించిన మరియమాత వెంటనే యేసు ప్రభువు వద్దకు వెళ్తుంది. ఆమె యేసు ప్రభువుతో "వారికి ద్రాక్షారసము లేదు" అని చెప్పి, అనంతరం పరిచారకులను పిలిచి "ఆయన చెప్పినట్లు చేయుడి" అని అంటుంది. ఇది సరిగ్గా పాత నిబంధనలో తల్లి రాణి పోషించిన మధ్యవర్తిత్వ పాత్రనే ప్రతిబింబిస్తుంది. ప్రజల అవసరాలను రాజు వద్దకు తీసుకువెళ్లడం, రాజు చెప్పిన మాటలను వినేలా ప్రజలను నడిపించడం ఇక్కడ మరియమాత చేసిన ముఖ్యమైన పని. మరియమాత ఇక్కడ తనవైపుకు కాక ఎల్లప్పుడూ తన కుమారుడైన యేసు ప్రభువు వైపే మనలను నడిపిస్తుంది. ఇదే నిజమైన మరియమాత భక్తికి కేంద్రబిందువు.
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మహిమాన్వితమైన దర్శనం కనిపిస్తుంది. "అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను: ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు. చంద్రుడు ఆమె పాదములక్రింద ఉండెను. ఆమె శిరముపై పండ్రెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను. " (ప్రకటన 12:1). ఈ స్త్రీ " సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించగా, ఆమె శిశువు దేవుని వద్దకును, ఆయన సింహాసనము వద్దకును తీసికొనిపోబడెను." ఈ శిశువు స్పష్టంగా లోకరక్షకుడైన క్రీస్తును సూచిస్తుంది. తిరుసభ సంప్రదాయం ఈ స్త్రీని మరియమాతగా గుర్తిస్తుంది. ఆమె శిరస్సుపై ఉన్న పన్నెండు నక్షత్రాల కిరీటం ఇశ్రాయేలు 12 గోత్రాలను, 12 మంది అపొస్తలులను, అంతిమంగా ఆమె పరలోక రాణిత్వాన్ని సూచిస్తుంది. తిరుసభ బోధనల ప్రకారం, మరియమాత ఆకాశంలో కిరీటధారియైన రాణిగా దర్శనమిస్తుంది.
4. చారిత్రక పరిణామం మరియు తిరుసభ పితరుల బోధనలు
మరియమాతను రాణిగా గౌరవించే సంప్రదాయం ఆధునిక కాలంలో హఠాత్తుగా పుట్టుకొచ్చినది కాదు. క్రైస్తవ చరిత్రలో తొలి శతాబ్దాల నుండే తిరుసభ పితరులు మరియమాతను రాణిగా గౌరవించారు.
మూడవ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ దైవశాస్త్ర పండితుడు ఓరిజెన్ (Origen) మరియమాతను "డొమినా" (Domina) అని పిలిచారు. లాటిన్ భాషలో డొమినా అంటే "ప్రభువురాలు" లేదా "రాణి" అని అర్థం. నాల్గవ శతాబ్దానికి చెందిన సిరియా దేశపు పునీత ఎఫ్రెము తన ఆధ్యాత్మిక రచనలలో మరియమాతను "మా మహారాణి", "పరలోక రాణి" అని పదే పదే సంబోధించాడు.
క్రీస్తు శకం 431 లో జరిగిన ఎఫెసు మహాసభ (Council of Ephesus చరిత్రలో ఒక గొప్ప మలుపు. ఈ మహాసభ మరియమాతను "థియోటోకోస్" (Theotokos) అంటే "దేవుని తల్లి" అని అధికారికంగా ప్రకటించింది. ఇది మరియమాత రాణి అనే బోధనకు గట్టి పునాదిగా నిలిచింది. ఎందుకంటే విశ్వానికంతటికీ రాజైన దేవునికి జన్మనిచ్చిన తల్లిగా ఆమెకు రాణి హోదా లభించడం అత్యంత సహజమైన పరిణామం.
తర్వాతి శతాబ్దాలలో పునీత జాన్ డమసీన్ ఆమెను "సకల సృష్టికి రాణి" అని కొనియాడగా, క్రీట్కు చెందిన పునీత ఆండ్రూ ఆమెను "విశ్వరాణి" అని కీర్తించారు. ఏడవ శతాబ్దం నుండి తూర్పు మరియు పశ్చిమ తిరుసభలలో మరియమ మాతను రాణిగా కీర్తించే ప్రార్థనలు నిత్య వాడుకలోకి వచ్చాయి. మధ్యయుగాల నుండి తిరుసభ లో పాడబడుతున్న ప్రసిద్ధమైన "సాల్వె రెజీనా" (Salve Regina) అనే మరియ గీతం "రాణీ, కృపారసముగల తల్లీ, మా జీవమా, మా మాధుర్యమా" అని మొదలవుతుంది. అలాగే, జపమాల (Rosary) ప్రార్థనలోని ఐదవ మహిమ రహస్యంగా "మరియమాతను పరలోక రాణిగా స్థాపింపబడుట" చేర్చబడింది.
5. పన్నెండవ భక్తినాధ పోపు గారి అధికారిక ప్రకటన (1954)
మరియమాతను రాణిగా తిరుసభ అధికారికంగా బోధించిన ముఖ్యమైన చారిత్రక ఘట్టం 1954, అక్టోబరు 11న జరిగింది. పన్నెండవ భక్తినాధ పోపుగారు "పరలోక రాణి వైపు") అనే విశ్వలేఖ ద్వారా మరియమాత రాణిత్వ దినోత్సవాన్ని తిరుసభ దైవార్చన క్యాలెండర్‌లో అధికారికంగా స్థాపించారు. ఈ లేఖలో పన్నెండవ భక్తినాధ పోపుగారు మరియమాత రాణిత్వానికి నాలుగు ప్రధాన కారణాలను వివరించారు.
మొదటిది, దైవమాతృత్వం. మరియమాత దేవుని కుమారుని తల్లి. యేసు ప్రభువు తన దైవస్వభావం చేత శాశ్వతమైన రాజు గనుక, ఆయనకు జన్మనిచ్చిన తల్లిగా మరియమాత దైవ సంబంధం వల్ల రాణి అవుతుంది. పునీత జాన్ డమసీన్ చెప్పినట్లు, "ఆమె సృష్టికర్త తల్లి అయినప్పుడు, సకల సృష్టికి రాణి అయింది."
రెండవది, విమోచనలో సహకారం. యేసు తన బలిదానం ద్వారా, సిలువ మరణం ద్వారా సాతానుపై, పాపంపై విజయం సాధించాడు. మరియమాత కల్వారి సిలువ వద్ద క్రీస్తు శ్రమలలో, ఆయన త్యాగంలో సంపూర్ణంగా పాలుపంచుకోవడం ద్వారా ఈ విమోచన పోరాటంలో సహకారిణిగా నిలిచింది. ఇది ఆమెను "శ్రమల రాణి"గా నిలబెడుతుంది. అయినప్పటికీ ఆమె స్వయంగా రక్షకురాలు కాదు; క్రీస్తు మాత్రమే ఏకైక రక్షకుడు.
మూడవది, నిష్కళంక కన్యక. మరియమాత దేవుని ప్రత్యేక కృప ద్వారా జన్మపాపరహితురాలిగా పవిత్రపరచబడింది. ఈ ప్రత్యేకమైన పరిశుద్ధత ఆమెను మానవ సృష్టిలో అత్యున్నత స్థానానికి అర్హురాలిని చేస్తుంది.
నాల్గవది, మోక్షారోపణ. మరియమాత తన భూలోక జీవితం ముగియగానే శరీరాత్మలతో సశరీరంగా పరలోకమునకు తీసుకెళ్లబడింది. 1950లో పోపు గారు ఈ సత్యాన్ని విశ్వాస సిద్ధాంతంగా ప్రకటించారు. సశరీరంగా పరలోకానికి చేరుకున్న మరియమాత అక్కడ తన కుమారుని పక్కన రాణిగా మహిమాన్వితురాలైంది.
6. క్రీస్తు రాజత్వం మరియు మరియమ్మ రాణిత్వం - కీలకమైన భేదం
ఇక్కడ ఒక కీలకమైన భేదాన్ని అర్ధం చేసుకోవాలి. మరియమాత రాణిత్వం, యేసుక్రీస్తు రాజత్వం ఒకే స్థాయిలో లేవు. క్రీస్తు దేవుడు, సృష్టికర్త, విశ్వానికి సర్వాధికారి అయిన రాజు. ఆయన రాజత్వం స్వతహాగా, దైవత్వం వలన, తన స్వంత శక్తి వలన వచ్చినది.
కానీ మరియమాత రాణిత్వం "భాగస్వామ్య రాణిత్వం" (Participated Queenship). ఆమె స్వతహాగా దేవుడు కాదు, రాణి కాదు. తన కుమారుడైన రాజు నుండి, ఆయనతో తనకున్న ప్రత్యేక దైవ సంబంధం వలన ఈ గౌరవం ఆమెకు లభించింది. ఆమె రాజుకు సమానురాలు కాదు; ఆమె రాజు తల్లిగా, ఆయన నుండి ఈ పదవిని పొందిన సేవకురాలిగా నిలుస్తుంది.
7. మధ్యవర్తిత్వం - రాణిత్వానికి హృదయ స్పందన
మరియమాత రాణిత్వ భావనలో మధ్యవర్తిత్వం అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తుంది. పురాతన ఇశ్రాయేలు రాజ్యంలో తల్లి రాణి పాత్ర ఎలా ఉండేదో, పరలోక రాజ్యంలో మరియమాత పాత్ర కూడా అలానే ఉంటుంది. ఆమె తన కుమారుని వద్దకు విశ్వాసుల ప్రార్థనలను, అవసరాలను, కష్టాలను తీసుకువెళుతుంది. కతొలిక విశ్వాసులు మరియమాతను దేవునిగా ఆరాధించరు, వారు ఆమెను గౌరవిస్తారు, ఆమె ద్వారా దేవుని కృపను వేడుకుంటారు. తల్లిగా ఆమె కుమారునికి చేసే విన్నపం ఎల్లప్పుడూ ఆలకించబడుతుందనేది విశ్వాసుల నమ్మకం.
8. సిలువ క్రింద నిలిచిన రాణి - ఆధ్యాత్మిక మాతృత్వం
మరియమాత రాణిత్వం కేవలం బెత్లెహేములోని ఆనందకరమైన ఘట్టాలలో మాత్రమే కాదు, కల్వారి సిలువ క్రింద దుఃఖంలో కూడా పరిపూర్ణమైంది. యేసు ప్రభువు సిలువపై ఉన్నప్పుడు శిష్యులలో చాలామంది భయపడి పారిపోయారు, కానీ మరియమాత ధైర్యంగా సిలువ క్రిందే నిలిచింది (యోహాను 19). ఒక తల్లి తన కుమారుడు శ్రమలు అనుభవిస్తూ మరణించడం చూస్తూ కూడా, దేవుని చిత్తాన్ని తిరస్కరించలేదు. అందుకే మరియమాత రాణిత్వం కిరీటం కంటే ముందు సిలువను ధరించిన రాణిత్వం. ఆమె మహిమలో భాగస్వామ్యం కావడానికి ముందు, తన కుమారునితో శ్రమలలో సంపూర్ణంగా పాలుపంచుకుంది.
సిలువపై వేలాడుతున్న యేసు ప్రభువు మరియమాతను చూసి "అమ్మా, ఇదిగో నీ కుమారుడు" అని, ప్రియశిష్యుడైన యోహానుతో "ఇదిగో నీ తల్లి" అని చెప్పాడు (యోహాను 19:26-27). కతొలిక సంప్రదాయం, ఈ సంఘటనను మరియమాత ఆధ్యాత్మిక మాతృత్వానికి మూలస్తంభంగా చూస్తుంది. ఆ ప్రియశిష్యుడు విశ్వాసులందరికీ ప్రతీక అయితే, మరియమాత ప్రతి విశ్వాసికి ఆధ్యాత్మిక తల్లిగా మారి, తన పిల్లలుగా సంరక్షిస్తుంది.
9. ఆగస్టు 22 - రాణిత్వ దినోత్సవ ప్రాముఖ్యత
పన్నెండవ భక్తినాధ పోపు గారు మొదట మరియమాత రాణిత్వ దినోత్సవాన్ని మే 31న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రెండవ వాటికన్ మహాసభ అనంతరం చేసిన క్యాలెండర్ సంస్కరణలలో, ఆరవ పౌలు పోపుగారు ఈ దినోత్సవాన్ని ఆగస్టు 22వ తేదీకి మార్చారు.
దీనికి ఒక వేదాంతపరమైన అర్ధం ఉంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మరియమ్మ మోక్ష రోపణం మహోత్సవం జరుపుకుంటాం. దానికి సరిగ్గా ఎనిమిదవ రోజున అంటే ఆగస్టు 22న రాణిత్వ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ అమరిక మోక్షరోపణానికి, రాణిత్వానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. మరియమాత శరీరాత్మలతో పరలోకానికి చేరుకోగానే, అక్కడ రాణిగా పట్టాభిషిక్తురాలైంది. వాటికన్ II మహాసభ కూడా ఆమెను "సకల సృష్టిపై రాణి"గా, తన కుమారునికి అనుగుణంగా హెచ్చించబడినది అని అభివర్ణించింది.
10. మరియ రాణి మన ఆధ్యాత్మిక జీవితానికి నేర్పే పాఠాలు
మరియరాణి సిద్ధాంతం ప్రతి క్రైస్తవుని ఆధ్యాత్మిక జీవితానికి లోతైన అర్థాన్ని, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. మొదటిగా, వినయం. మరియమ్మ దేవుని తల్లిగా గొప్ప స్థానాన్ని పొందినప్పటికీ ఎన్నడూ తన్ను తాను గొప్పగా ప్రకటించుకోలేదు. ఆమె "నేను ప్రభువు దాసురాలిని" అని ఆమె పలికింది. తన (Magnificat) గీతంలో "ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించేను ... అధిపతులను సింహాసనముల నుండి పడద్రోసి దీనులను లేవనేత్తెను" (లూకా 1:46-52) అని పలికింది. ఆమె రాణిత్వం ఈ మాటలకు పరిపూర్ణ నెరవేర్పు. నిజమైన ఆధ్యాత్మిక మహిమ స్వయం ప్రకటన నుండి రాదు, వినయం నుండే వస్తుందని ఆమె నిరూపించింది.
రెండవది, సంపూర్ణ విధేయత. దేవుని చిత్తం తన జీవితంలో ఎంత కష్టతరమైనది, అర్థం కానిది అయినప్పటికీ మరియమాత "నీ మాట చొప్పున నాకు జరుగునుగాక " అని చెప్పింది. ఇది ప్రతి విశ్వాసికి దేవునిపై పూర్తి నమ్మకంతో, ఆయన ప్రణాళికకు లోబడి జీవించమని బోధిస్తుంది.
మూడవది, ప్రేమ పూర్వక సేవ. మరియమాత గర్భవతిగా ఉన్నప్పటికీ, తన బంధువైన ఎలిశబెత్తమ్మకు సేవ చేయడానికి కొండ ప్రాంతములో ఉన్న ఆమె వద్దకు వెళ్లింది. రాణిత్వం అంటే ఇతరులపై అధికారం చలాయించడం కాదు, ఇతరులకు దీనమనస్సుతో సేవ చేయడం అని ఆమె నిరూపించింది.
నాల్గవది, శ్రమలలో విశ్వాసం. సిలువ క్రింద కుమారుడు మరణిస్తున్న వేదనలో కూడా మరియమాత విశ్వాసంతో నిలిచింది. మన జీవితాల్లో కష్టాలు, శోధనలు, దుఃఖాలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా స్థిరంగా నిలబడాలని ఆమె మనకు నేర్పుతుంది.
ఐదవది, పరలోక నిరీక్షణ. మరియమాత మనలాంటి సామాన్య మానవురాలు. మనలాగే విశ్వాసం ద్వారా, దేవునికి విధేయత చూపడం ద్వారా జీవించిన వ్యక్తి. ఆమె పరలోకంలో పొందిన మహిమ ప్రతి విశ్వాసికి ఒక గొప్ప నిరీక్షణను ఇస్తుంది. దేవునికి నమ్మకంగా ఉంటే, తాము కూడా ఒకనాడు దేవుని రాజ్యంలో ఆ మహిమను పంచుకుంటారనే ఆశను కలిగిస్తుంది.
ముగింపు
ఈ సిద్దాంతం పాత నిబంధనలో తల్లి రాణి
సంప్రదాయంలో మూలాలను కలిగి, క్రొత్త నిబంధనలో
యేసుక్రీస్తు నిత్య రాజత్వం ద్వారా బలపడి, తిరుసభ పితరులలో బోధనలలో క్రమంగా పెరిగి, 1954లో పన్నెండవ భక్తినాధ పోపు గారి అధికారిక ప్రకటన ద్వారా స్పష్టమైన రూపాన్ని
పొందింది. మరియమాత రాణి ఎందుకంటే ఆమె విశ్వానికే రాజైన
యేసుక్రీస్తు తల్లి. ఆమె రాణి ఎందుకంటే దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయురాలు.
ఆమె రాణి ఎందుకంటే సిలువ క్రింద విశ్వాసంతో, ధైర్యంతో నిలిచింది. ఆమె రాణి
ఎందుకంటే క్రీస్తు మహిమలో ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని పొందింది. కానీ ఆమె రాణిత్వం ఈ ప్రపంచపు రాణుల అధికార
దర్పం లాంటిది కాదు, ఆమె కిరీటం వినయంతో తయారైంది, ఆమె సింహాసనం ప్రేమ పూర్వక సేవ, ఆమె రాజదండం కరుణ, ఆమె రాజ్యం ఆధ్యాత్మిక తల్లితనం, ఆమె శక్తి నిరంతర ప్రార్థన. మరియమాత మనలను తన వద్దే నిలిపివేయదు, ఆమె ఎల్లప్పుడూ తన కుమారుడైన యేసుక్రీస్తు వైపే
చూపుతుంది. కానాలో ఆమె చెప్పిన మాట ఈరోజుకూ ప్రతి విశ్వాసికి మార్గదర్శకం. "ఆయన
చెప్పినట్లు చేయండి.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment