18 వ సామాన్య ఆదివారం

 

ఆకలి తీర్చే దేవుని ప్రేమ 

యెషయా 55:1-3 | రోమా 8:35, 37-39 | మత్తయి 14:13-21

పరిచయం

ఈనాటి మూడు పఠనాలు ఒకే హృదయ స్పందనతో మనలను పలకరిస్తున్నాయి.  మనిషికి రెండు రకాల ఆకలి  ఉంటుంది. అది  శరీర ఆకలి, ఆత్మ ఆకలి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు "దప్పిక గొనిన వారెళ్ళరు నీటి చెంతకు రండు, ధనము లేని వారు వచ్చి ధాన్యము గొని ఆరగింపుడు" అని పిలుస్తున్నాడు. పౌలు అపొస్తలుడు, ఏ శక్తీ దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేదని ధైర్యం చెబుతున్నాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభువు  స్వయంగా ఐదువేల మందిని కేవలం ఐదు రొట్టెలు, రెండు చేపలతో తృప్తిపరుస్తాడు. ఈ మూడు పఠనాలు ఒకే సత్యాన్ని ప్రకటిస్తున్నాయి. అది  దేవుడు తన ప్రజల ఆకలిని పట్టించుకునే దేవుడు, దేవుని ప్రేమ మనకు ఉన్న  కొరతను సమృద్ధిగా మారుస్తుంది.

1. యెషయా 55:1-3 ఉచిత ఆహ్వానం

యెషయా 55వ అధ్యాయం బబులోను చెరలోఉన్న ఇశ్రాయేలు గురించి వ్రాయబడింది, నిరాశలో, ఆర్థిక దుర్భరతలో జీవిస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు ఇది ఒక ఆశ జ్యోతిలా ఉంది. ఈ ప్రజల దుర్భర పరిస్థితిలో దేవుడు వారిని ఆహ్వానిస్తున్నాడు. " దప్పిక గొనిన వారెళ్ళరు నీటి చెంతకు రండు, ధనము లేని వారు వచ్చి ధాన్యము గొని ఆరగింపుడు " (55:1). ఈ సమాజంలో డబ్బులు లేనివానికి  ఇచ్చే స్థానం ఏమిటో మనకు తెలుసు. కానీ దేవుని రాజ్య వ్యవస్థలో, డబ్బు లేనివారే మొదటి అతిథులు. "నీళ్లు", "ద్రాక్షారసము", "పాలు" వీటిని అన్నిటినీ దేవుడు వారికి ఉచితముగా ఇస్తాను అంటున్నాడు. వారిని వచ్చి ఆరగించమని ఆహ్వానిస్తున్నాడు. నీరు, ద్రాక్షరసము, పాలు ఇవి దేవుని నిబంధన ప్రేమను సూచించే గుర్తులు.

యెషయా ద్వార దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు,  "ఆకలి తీర్ప జాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేల ? మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేల?" (55:2).  ఈ ప్రశ్న మనము ఎప్పటికీ తృప్తి చెందని వాటి గురించే, మన  చీకు చింతలు, వెంపర్లాటలు సంపద, హోదా, భోగలాలసత, ఇవి తాత్కాలికముగా  ఆకలిని తీర్చినట్టు అనిపించినా, అంతిమంగా ఆత్మను తృప్తిపరచవు. మూడవ వచనంలో ఒక మలుపు వస్తుంది.  "నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులు ఆలింపుడు , మీరు జీవమును బడయుదురు. నేను మీతో  శాశ్వతమైన నిబంధనను చేసుకొందును. దావీదుకు వాగ్దానము చేసిన దీవెనలను మీకిత్తును." (55:3). ఇది కేవలం ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు,  ఇది ఒక సంబంధాన్ని, శాశ్వత నిబంధనను ప్రతిపాదిస్తుంది. ఈ ఆహ్వానం సార్వత్రికమైనది; కులం, ఆర్థిక స్థితి అనే వివక్షలు లేకుండా "ప్రతివాడు" పిలవబడ్డాడు. మానవునికి   ప్రస్తుతం ఆనందం ఇచ్చే ఏది కూడా శాశ్వతంగా ఆనందంగా మానవుణ్ణి ఉంచలేవు ,  మానవుని కుటుంబ బంధాలా, కులానుబంధాలా,  కీర్తి కిరీటాల, సంపదలా ఇవి ఏమి మానవుణ్ణి ఎల్లకాలం మానవుణ్ణి తృప్తి పరచవు. దేవుడు ఇచ్చేటువంటి ఆహ్వానము మాత్రమే మానవుణ్ణి తృప్తి పరచగలదు. ఈ ఆహ్వానం నిన్ను ఎవరు, ఏమిటి, ఎందుకు ఏమి అడుగదు, అసంతృప్తితో ఉన్నవా? ఆకలితో ఉన్నవా? బాధలో ఉన్నావా? కష్టంలో ఉన్నవా? అన్నిటినీ తీసివేసేవాడు, పూర్తిగా నిన్ను అన్నీ విధాలుగా తృప్తి చేసేవాడు దేవుడు మాత్రమే, అందుకు ఈ ఆహ్వానము ఇస్తున్నాడు.

 2. రోమా 8: 35, 37-39 - వేరుచేయలేని ప్రేమ

పౌలు రెండవ పఠనంలో ఒక  ప్రశ్న అడుగుతాడు: "క్రీస్తు యొక్క ప్రేమనుండి మనలను ఎవరు వేరుచేయగలరు? బాధగాని, కష్టముగాని, హింసగాని, క్షామము గాని, వస్తహీనతగాని, ప్రమాదముగాని, యుద్ధము గాని, మరణముగాని అట్లు చేయకలదా?" (8:35). ఇది సిద్ధాంతపరమైన ప్రకటన కాదు, పౌలు స్వయంగా హింసలు, ఆకలి, వస్త్రహీనత అనుభవించిన వ్యక్తి తన శరీరంపై అనుభవించిన బాధల నుండి వ్రాస్తున్నాడు. ఇన్ని అనుభవిస్తున్నా, దేవుని  ప్రేమ వలన, ఈ కష్టాలలోకూడా దేవుని అనుగ్రహము పొందారు కాబట్టి ఆనందముగా ఉన్నారు.  "కరవు", "వస్త్రహీనత" అనే పదాలు యెషయా 55లో ప్రస్తావించిన ఆకలి, దాహంతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాయి.

37వ వచనంలో పౌలు “ అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు ఎక్కువ విజయము కలదు సుమా!" (8:37) అని ప్రకటిస్తాడు. ఇది కష్టాలు లేకపోవడం వల్ల వచ్చే విజయం కాదు కష్టాల మధ్యలోనే వచ్చే విజయం. " ఏలయన, మన ప్రభువైన క్రీస్తు యేసుద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువుగాని, జీవముగాని, దేవదూతలు గాని, లేక ఇతర పాలకులుగాని, ఇక్కడ ఉన్నవిగాని, రానున్నవిగాని, శక్తులుగాని, ఊర్ధ్వలోకముగాని, అథోలోకముగాని, సృష్టిలో మరి ఏదియు వేరుచేయ జాలదనుట నాకు నిశ్చయమే." (8:38-39). ఇది శ్రమలను తిరస్కరించడం లేదు.  శ్రమల వాస్తవికతను అంగీకరిస్తూనే, వాటికి అతీతమైన ప్రేమను ప్రకటిస్తుంది. ప్రభువు ప్రేమలో అంతటి మాధుర్యము ఉంది, ఎన్ని బాధలు అనువించిన, ఆ ప్రేమను వదులుకొనుటకు ఇష్టపడము.

 3. మత్తయి 14:13-21 - ఐదు రొట్టెలు, రెండు చేపలు

బాప్తిస్మ యోహాను శిరచ్ఛేదనం వార్త విన్న యేసు ప్రభువు  ఏకాంతం కోసం అరణ్యప్రదేశమునకు వెళ్తాడు (14:13). కానీ ప్రజలు  ఆయనను వెంబడించారు. తనకు దుఃఖం ఉన్నప్పటికీ, " యేసు ఒడ్డునుచేరి గొప్ప జన సమూహమును చూచి, జాలిపడి, వారిలోని వ్యాధి గ్రస్తులను స్వస్థపరచెను." (14:14) ప్రభువు అలసిపోయి ఉన్నారు. సాయంకాలం  యేసు ప్రభువు శిష్యులు ఆచరణాత్మక పరిష్కారం సూచిస్తున్నారు. "జనసమూహములను పంపివేయుము అంటున్నారు.  (14:15).  కాని యేసు  ప్రభువు దానికి భిన్నంగా స్పందిచాడు " వీరిని పంపివేయవలసిన అవసరము లేదు. మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు" (14:16) అంటున్నాడు కాని  శిష్యుల దగ్గర ఉన్నదల్లా ఐదు రొట్టెలు, రెండు చేపలు, ఇది ఏ విధముగా వారికి సరిపోదు. యేసు ప్రభువు  వాటిని తీసుకుని, ఆశీర్వదించి, విరిచి, శిష్యులకిచ్చాడు; శిష్యులు అక్కడ ప్రజలకు పంచారు (14:19). అప్పుడు "అందరు తిని తృప్తిపొందారు; మిగిలిన ముక్కలు పండ్రెండు గంపలు ఎత్తారు" (14:20). దేవుని సమృద్ధి కేవలం అవసరాన్ని తీర్చడమే కాదు,  అవసరానికి మించి పొంగిపొర్లేది. యేసు ప్రభువు  రొట్టెలను తీసుకున్నాడు, ఆశీర్వదించాడు, విరిచాడు, ఇచ్చాడు, ఈ నాలుగు క్రియలు కడరా భోజనంలో పునరావృతమవుతాయి.

 4. మూడు పఠనాల అనుసంధానం

దేవుని చొరవ: యెషయా గ్రంధంలో దేవుడే ఆహ్వానిస్తాడు, మత్తయిలో యేసు ప్రభువే  చొరవ తీసుకుంటాడు, రోమియులకు రాసిన లేఖలో దేవుని ప్రేమే మనలను వెతుక్కుంటూ వస్తుంది. మూడు పఠనాలలోను  దేవుడే మొదట కదులుతాడు. ఇది దేవుని ప్రేమకు చిహ్నం.

కొరత మధ్యలో సమృద్ధి: యెషయాలో డబ్బులేనివారికి సమృద్ధమైన విందు వాగ్దానం, మత్తయిలో కొరతగల ఐదు రొట్టెలు  ఐదువేల మందికి సరిపడా సమృద్ధిగా మారుతుంది, రోమియులకు రాసిన లేఖలో వలె  శ్రమల మధ్య కూడా ప్రేమ "అత్యధిక విజయము" ఇస్తుంది. మానవ దృష్టిలో కొరతగా కనిపించేది, దేవుని చేతిలో సమృద్ధిగా మారుతుంది. మనలో ఉన్న ప్రతి కొరతను ప్రభువు తీసివేసి సమృద్దిని దయచేస్తాడు.

నిబంధన: యెషయా 55:3లో "శాశ్వతమైన నిబంధన" వాగ్దానం రోమి 8లో పరిపూర్ణమవుతుంది. దేవుని ప్రేమ ఎన్నటికీ విడిపోని నిబంధనగా నిలుస్తుంది. మత్తయిలో రొట్టెలు పంచే క్రియ ద్వారా ఈ నిబంధన ఆచరణలో కనిపిస్తుంది.

మధ్యవర్తిత్వం: యేసు ప్రభువు స్వయంగా రొట్టెలను పంచలేదు. శిష్యులు ఆ రొట్టెలను  పంచుతారు. దేవుడు తన అనుగ్రహాన్ని పంచడానికి మానవ చేతులను వాడుకుంటాడు.

 5. సామాజిక  కర్తవ్యం 

ఆకలి నేటికీ వాస్తవం. యెషయా, మత్తయి కాలంలో లాగే నేటికీ ప్రపంచంలో కోట్లాదిమంది ఆకలితో అలమటిస్తున్నారు. యేసు ప్రభువు  జనసమూహాన్ని చూసి "కనికరపడ్డాడు" అనే మాట మనలను సవాలు చేస్తుంది. మనం ఆకలితో ఉన్నవారిని చూసినప్పుడు మన అంతరంగం కదులుతుందా, లేక  శిష్యుల వలె  "పంపివేయుము" అని  అవసరములో ఉన్న వారి నుండి దూరాన్ని కోరుకుంటున్నమా?

" మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు" అనడం ద్వారా యేసు ప్రభువు తనను అనుసరించే వారి మీద ఒక బాధ్యత పెడుతున్నాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, కానీ మానవ భాగస్వామ్యం ద్వారా అది జరుగుతుంది. ఇతరుల  మనం అవసరాలను కూడా పట్టించుకోవాలి,  "దేవుడు తీరుస్తాడు" దూరం చేయడం సరికాదు.

"మనయొద్ద ఉన్నది" శిష్యుల దగ్గర ఉన్నది కేవలం ఐదు రొట్టెలు, రెండు చేపలు.  వారి దృష్టిలో "ఏమీ లేనట్టే". దేవుని చేతిలో సమర్పించినప్పుడు మన కొద్దిపాటి వనరులు,  సమయం, నైపుణ్యం, ఆర్థిక సహాయం గొప్ప మార్పుకు దారితీయగలవు. ఇక్కడ కొరత ఉన్నది అని మనం చెబుతున్నప్పుడు మన దగ్గర కొంత ఉన్నది అని గుర్తుంచుకోవాలి, ఏమి లేదని దాని అర్ధం కాదు.

సమాన పంపిణీ. అద్భుతం తరువాత పండ్రెండు గంపల మిగులు ఉంది. ప్రపంచంలో ఆహార కొరత వాస్తవానికి ఉత్పత్తి కొరత వల్ల కాదు, పంపిణీ అసమానత వల్ల ఏర్పడుతుంది. ఈ సువార్త భాగం మనలను అన్నీ వనరులను సమానముగా పంపిణీ చేసుకోమని సూచిస్తుంది. అప్పుడు సమృద్దే కాని కొరత అనేది ఉండదు.

అణగారినవారికి ఓదార్పు. శ్రమలు, హింస, కరవు, వస్త్రహీనత,  సామాజిక, రాజకీయ అణచివేత  మనం చూస్తూనే ఉంటాం. పౌలు చెప్పినట్లు  దేవుని ప్రేమ వారి బాధను తొలగించకపోయినా, ఆ బాధ మధ్యలో వారితో పాటు నిలిచి ఉంటుంది, అంతిమ విజయాన్ని వాగ్దానం చేస్తుంది.

 ఆధ్యాత్మిక అన్వయం

ఆహ్వానాన్ని అంగీకరించండి. ధనం, హోదా, భౌతిక సుఖాలు తాత్కాలిక సంతృప్తినిచ్చినా, శాశ్వతమైన ఆత్మ దాహాన్ని తీర్చలేవు. దేవుని వాక్యం వైపు, ప్రార్థన వైపు తిరగడమే నిజమైన తృప్తికి మార్గం.

భయం లేకుండా జీవించండి. ఏ శక్తీ మనలను దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు అనే నమ్మకంతో జీవితంలోని అనిశ్చితులను ఎదుర్కోగలం.

మీ చేతిలో ఉన్నదాన్ని సమర్పించండి. మనలో ప్రతి ఒక్కరి దగ్గర "ఐదు రొట్టెలు, రెండు చేపలు" లాంటిది ఏదో ఉంది. దేవుని చేతిలో సమర్పించినప్పుడు, అది ఊహించని విధంగా సమృద్దికి కారణం అవుతుంది.

పంచడాన్ని జీవన విధానంగా మార్చుకోండి. మన చుట్టూ ఉన్న ఆకలిగొన్నవారిని గుర్తించి, మనకు చేతనైనది పంచడం మన బాధ్యత ప్రభువు తన పనిలో మన భాగసౌమ్యాన్ని కోరుకుంటున్నాడు.

 సందేశం 

ఈనాటి మూడు పఠనాలు మనలను ఒక సత్యం వైపు నడిపిస్తున్నాయి.  దేవుడు మన ఆకలిని చూస్తాడు, మన కొరతను చూసి కరుణపడతాడు, మన కొద్దిపాటి వనరులను తీసుకుని అద్భుతంగా సమృద్దిపరుస్తాడు, మరియు ఏ శక్తీ మనలను  ఆ ప్రేమ నుండి వేరు చేయలేదని హామీ ఇస్తాడు. ఈ సత్యం మన ఆధ్యాత్మిక అనుభవానికే పరిమితం కాదు, ఇది సమాజంలో న్యాయమైన పంపిణీకి, కరుణతో కూడిన సేవకు, అణగారినవారి పక్షాన నిలబడటానికి పిలుపు.

 ప్రార్థన

 ప్రభువా, మా ఆకలిని తీర్చి , మా కొరతను చూసి కరుణపడే దేవా, మా చుట్టూ ఉన్న ఆకలిగొన్నవారిని చూసే హృదయాన్ని మాకు దయచేయుము. మా చేతిలో ఉన్న కొద్దిపాటిదాన్ని నీ చేతికి సమర్పించే విశ్వాసాన్ని మాకు ఇమ్ము, దాని ద్వారా  నీ ప్రేమ మా లోకానికి సమృద్దిగా పంచబడటానికి మమ్ములను వినియోగించు. ఆమెన్  

 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు