పునీత చిన్న తెరేజమ్మ చిరు మార్గం|కార్మెల్ శోభ
చిన్న తెరిజమ్మ
- "చిరు మార్గం"
పరిచయం
క్రైస్తవ ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత
ప్రభావవంతమైన, సులభమైన బోధనలలో చిన్న తెరేజమ్మ అందించిన "చిరు మార్గం" ప్రధానమైనది. పందొమ్మిదవ
శతాబ్దపు చివరి భాగంలో ఫ్రాన్స్‌లో జీవించిన ఈ యువ కార్మెలియ సన్యాసిని కేవలం ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే
మరణించింది. అయినప్పటికీ, ఆమె జీవితం, ఆమె రచనలు, ముఖ్యంగా
ఆమె ఆత్మకథ "ఒక ఆత్మ కథ" ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవుల
హృదయాలను ప్రభావితం చేశాయి. ఆమె బోధించిన "చిరు మార్గం" అనేది గొప్ప త్యాగాలు, అద్భుతమైన
పనులు, కఠోర తపస్సుల ద్వారా కాకుండా, రోజువారీ
జీవితంలోని అతి చిన్న చిన్న క్షణాలలో, పూర్తి విశ్వాసంతో, పసిపిల్లవాడి
నిష్కల్మషముతో దేవుని ప్రేమను అనుభవించి, ఆ ప్రేమను ఇతరులకు పంచే ఒక
ఆధ్యాత్మిక మార్గం.
చిన్న తెరేజమ్మ
జీవిత నేపథ్యం
చిన్న తెరిజమ్మ 1873వ సంవత్సరంలో జనవరి 2న ఫ్రాన్స్‌లోని అలెన్సన్ అనే పట్టణంలో
జన్మించింది. ఆమె తల్లిదండ్రులు లూయీ మార్టిన్, సేలీ
మార్టిన్ ఇద్దరూ గొప్ప విశ్వాసం కలిగిన కతొలికులు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు తల్లిదండ్రులను కూడా
తిరుసభ పునీతులుగా ప్రకటించింది. తెరిజమ్మ తన తల్లిని చిన్న
వయసులోనే (నాలుగేళ్ల వయసులో) కోల్పోయింది. ఆ తరువాత ఆమె తండ్రి, అక్కలు
ఆమెను పెంచారు. తల్లిని కొల్పవడం ఆమె జీవితంపై చాలా ప్రభావం చూపింది, ఆమెను
సున్నితమైన, భావోద్వేగపరమైన బాలికగా మార్చింది. ప్రతి చిన్న విషయానికి
అలగడం, ఏడవడం ఆమె చిన్న తనంలో పరిపాటి అయ్యింది.
తెరిజమ్మకు నలుగురు అక్కలు ఉన్నారు, నలుగురూ
కూడా సన్యాసినులుగా మారారు. వీరిలో
ముగ్గురు కార్మెల్ మఠంలోనే చేరారు. తెరిజ చిన్నతనం నుండే దేవుని పట్ల, ప్రార్థన
పట్ల ప్రగాఢమైన ఆకర్షణ కలిగి ఉంది. కానీ ఆమె బాల్యం సులభమైనది కాదు. తల్లి మరణం, తరువాత తనకు
తల్లి లాంటి అక్క పౌలిన్ కూడా కార్మెల్‌లో
చేరడం వల్ల కలిగిన వేదన ఆమెను తీవ్రమైన అనారోగ్యానికి గురిచేసింది. ఈ కష్టకాలంలో, 1883లో క్రిస్మస్ రోజున, ఆమె తన
జీవితంలో "క్రిస్మస్ మార్పు" (Christmas Conversion) అని పిలిచే
ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందింది. ఈ అనుభవం ద్వారా ఆమె అతి సున్నితమైన మనస్సు , ఏడుపు
గుణాన్ని వదిలి, బలమైన, పరిణతి
చెందిన ఆత్మగా మారింది. అంతకు ముందు
ప్రతి చిన్న విషయానికి నొచ్చుకునేది, ఏడిచేది. ఆమెను ఈ
సంఘటనను తన స్వంత మాటల్లో "ఒక్క క్షణంలో దేవుడు నా హృదయాన్ని
మార్చివేశాడు" అని వర్ణించింది.
తెరిజ చిన్న వయసు నుండే సన్యాసినిగా మారాలని
కోరుకుంది. సాధారణంగా కార్మెలియ మఠంలో
చేరాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండాలి. కానీ తెరిజా కేవలం పదిహేను సంవత్సరాల
వయసులోనే కార్మెల్ మఠంలో చేరాలని పట్టుదలతో ఉండేది. ఈ కోరిక కోసం
ఆమె తన స్థానిక బిషప్‌ను, చివరికి రోమ్‌నగరం వెళ్ళి పదమూడవ లియో
పోపు గారిని కూడా అనుమతి
కోరింది. ఆ చిన్న వయసులో ఒక అమ్మాయి
అసాధారణమైన ధైర్యం, పట్టుదలతో 1888లో, పదిహేనేళ్ల
వయసులో లిసియో కార్మెల్ మఠంలో ప్రవేశించింది.
కార్మెల్ మఠంలో జీవితం తెరిజ ఊహించినంత
సులభమైనది కాదు. అక్కడ రోజువారీ జీవితం సాధారణమైనది కాని, ఎక్కువగా ఏకాంతంతో కూడినది, తరచుగా
విసుగు కలిగించేది. ఆమెతో పాటు ఉన్న కొందరు సన్యాసినులు ఆమెతో కఠినంగా, అసహనంగా
ప్రవర్తించేవారు. ఇక్కడే తెరిజమ్మ తన
"చిరు మార్గం" యొక్క బీజాలను
కనుగొంది. ఆమె గొప్ప అద్భుత కార్యాలు చేయలేకపోయినా, ప్రతి చిన్న
క్షణంలో, ప్రతి చిన్న ఇబ్బందిలోను, ప్రేమతో, ఓర్పుతో, నవ్వుతూ
దేవుని సేవ చేయవచ్చని గ్రహించింది.
1896-97లో తెరిజాకు క్షయవ్యాధి (tuberculosis)
సోకింది. ఈ వ్యాధి ఆమెను తీవ్రమైన శారీరక బాధకు, అంతకంటే
ఎక్కువగా ఆధ్యాత్మిక "అంధకార రాత్రి"కి (dark night of faith) కి గురిచేసింది. ఈ కాలంలో ఆమె దేవుని ఉనికిపై, పరలోకంపై సందేహాలతో
పోరాడింది. అయినప్పటికీ, ఆమె తన నమ్మకాన్ని వదలకుండా, తన బాధను
ప్రేమతో స్వీకరించింది. 1897 సెప్టెంబర్ 30న, తన ఇరవై
నాలుగవ యేట, తెరిజ మరణించింది. మరణించే ముందు ఆమె "నేను నా
పరలోకాన్ని భూమిపై మంచి చేయడంలో గడుపుతాను" (I will spend my heaven doing
good on earth) అని ప్రకటించింది. ఈ మాటలు ఆమె పొందిన అపారమైన ఆధ్యాత్మిక అనుభవానికి ఒక సూచనగా నిలిచాయి.
తెరిజమ్మను 1925లో పదకొండవ భక్తినాధ పాపుగారు ఆమెను పునీతురాలిగా ప్రకటించాడు, ఆమె మరణించిన 28 సంవత్సరాలకే ఆమెను పునీతురాలిగా ప్రకటించారు. ఇది అసాధారణంగా వేగవంతంగా తిరుసభలో ఒక వ్యక్తిని పునీతురాలిగా ప్రకటించిన ప్రక్రియ. తరువాత 1997లో రెండవ జాన్ పాల్ పోపుగారు ఆమెను "తిరుసభ పండితురాలిగా " (Doctor of the Church) ప్రకటించారు. ఈ గౌరవం పొందిన నలుగురు మహిళల్లో ఆమె ఒకరు.
"చిరు మార్గం" అంటే ఏమిటి?
"చిరు మార్గం" అనేది చిన్న తెరిజమ్మ స్వయంగా కనుగొన్న ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతం. దీని సారాంశాన్ని ఆమె
తన ఆత్మకథలో ఇలా వివరించింది: "నేను ఎప్పుడూ గొప్ప పనులు చేయాలని కోరుకోను...
నేను చిన్నదానిగా, బలహీనురాలిగా ఉన్నాను, అయినా నేను
దేవుని పాదాల చెంతకు నా చిన్నతనంతో, నా బలహీనతతో వెళ్తాను."
ఈ మార్గం సాంప్రదాయిక ఆధ్యాత్మిక "పెద్ద మార్గాల" కు పూర్తి భిన్నమైనది.
మధ్యయుగపు క్రైస్తవ ఆధ్యాత్మికతలో, పరిశుద్ధత (holiness) సాధించడానికి
తీవ్రమైన తపస్సులు, కఠోర ఉపవాసాలు, శారీరక
కష్టాలు, గొప్ప త్యాగాలు అవసరమని భావించేవారు. కానీ చిన్న
తెరిజమ్మ ఇందుకు భిన్నంగా, పరిశుద్ధత
సాధించడానికి ఒక "ఎలివేటర్" లాంటి సులభమైన మార్గం ఉందని బోధించింది.
ఆమె తన ఆత్మకథలో ఒక అందమైన రూపకాన్ని
ఉపయోగించింది. ఆ కాలంలో కొత్తగా వచ్చిన లిఫ్ట్‌లు (ఎలివేటర్లు) ప్రజలను మెట్లు
ఎక్కకుండానే పైకి తీసుకువెళ్లేవి. "నేను దేవుని దగ్గరకు చేరుకోవడానికి ఒక
ఎలివేటర్‌ను కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను పరిపూర్ణత అనే
కఠినమైన మెట్లను ఎక్కేంత గొప్పదానిని కాదు" అని రాసింది. ఆమెకు ఈ "ఎలివేటర్" యేసుక్రీస్తు రెండు
చేతులు. పసిపిల్లవాడు మెట్లు
ఎక్కలేకపోయినప్పుడు, తన చేతులను తండ్రి వైపు చాచి, "నన్ను పైకి
ఎత్తుకో" అని అడుగుతాడు. అదే విధంగా, ఆత్మ తన స్వంత బలహీనతను
గుర్తించి, దేవుని బలమైన చేతులకు తనను తాను అప్పగించుకుంటే, దేవుడే ఆ
ఆత్మను పరిశుద్ధత అనే ఎత్తుకు తీసుకువెళతాడని తన అభిప్రాయాన్ని వ్యక్తపరచింది.
ఇది "ఆధ్యాత్మిక బాల్యం" (Spiritual Childhood) అనే భావనకు మూలం. ఇది బలహీనత, అమాయకత్వం కాదు, కానీ దేవుని మీద సంపూర్ణ నమ్మకం, ఆయన మీద పూర్తిగా ఆధారపడటం అనే అర్థంలో ఉండే బాల్యం. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రిపై ఎంత నమ్మకంతో ఆధారపడతాడో, అదే నమ్మకంతో, అదే నిష్కల్మషతతో ఆత్మ దేవునిపై ఆధారపడాలని తెరిజమ్మ బోధించింది.
బైబిల్
మూలాలు
చిన్న తెరిజమ్మ తన చిరు మార్గాన్ని కేవలం తన స్వంత ఊహ నుండి
సృష్టించలేదు. ఆమె దీనిని బైబిల్ గ్రంథం నుండి, ముఖ్యంగా
యేసుక్రీస్తు బోధనల నుండి తీసుకుంది. మత్తయి సువార్తలో యేసు ప్రభువు, “మీరు
పరివర్తనచెంది చిన్నబిడ్డలవలె రూపొందిననే తప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని మీతో
వక్కాణించు చున్నాను." అని చెప్తారు. (మత్తయి 18:3). ఈ వాక్యం తెరిజమ్మ ఆధ్యాత్మికతకు పునాది రాయిగా నిలిచింది. అలాగే, " తనను తాను
తగ్గించుకొని ఈ బాలునివలె రూపొందువాడే పరలోకరాజ్యమున గొప్పవాడు." (మత్తయి 18:4) అనే వాక్యం
కూడా ఆమెకు ప్రేరణగా నిలిచింది.
అంతేకాక, పాత నిబంధనలోని సామెతల గ్రంథం, యెషయా
గ్రంథంలోని కొన్ని వాక్యాలు కూడా ఆమెను ప్రభావితం చేశాయి. యెషయా గ్రంథంలో దేవుడు
తన ప్రజలను " యెరూషలేము
అనుతల్లి మీకు చంటిబిడ్డలకువలె పాలిచ్చును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును. తన
వడిలో కూర్చుండబెట్టుకొని లాలించును.తల్లి బిడ్డలను ఓదార్చినట్లు నేను మిమ్ము
ఓదార్చును యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు" అని ఓదారుస్తారు. ఈ వాక్యాలు ఆమెకు దేవుని తల్లి ప్రేమ లక్షణాన్ని బోధించాయి. ఈ వాక్యాలను
ఆధారంగా చేసుకుని, చిన్న తెరిజమ్మ దేవుడు తనను శిక్షించే న్యాయమూర్తిగా కాకుండా, తనను
అపారంగా ప్రేమించే, తన బలహీనతలను కూడా అర్థం
చేసుకునే తండ్రిగా, తల్లిగా చూసింది.
తెరిజమ్మ జీవించిన కాలంలో, ప్రాన్సు లో "జాన్సెనిజం" (Jansenism) అనే సిద్దాంతం బలంగా ఉండేది. ఇది ఒక కఠినమైన, భయాన్ని ప్రేరేపించే వేదాంత ధోరణి. ఈ ధోరణి దేవుని న్యాయాన్ని, శిక్షను ఎక్కువగా నొక్కిచెప్పేది, మనుషులు తమ పాపభారంతో దేవుని ముందు భయపడాలని బోధించేది. చిన్న తెరిజమ్మ ఈ కఠిన ధోరణికి పూర్తి భిన్నంగా, దేవుని అపారమైన కరుణను, ప్రేమను నొక్కిచెప్పింది. ఈ కారణంగానే ఆమె బోధనను "దేవుని కరుణ సువార్త" అని కూడా పిలుస్తారు.
చిరు మార్గంలోని ప్రధాన అంశాలు
1. ఆధ్యాత్మిక బాల్యం (Spiritual
Childhood)
ఆధ్యాత్మిక
బాల్యం అనేది చిరు మార్గానికి పునాది. ఇందులో మూడు ముఖ్య లక్షణాలు
ఉన్నాయి. తన స్వంత బలహీనతను నిజాయితీగా గుర్తించడం, దేవునిపై
పూర్తి నమ్మకం ఉంచడం, మరియు ప్రేమతో, ధైర్యంగా దేవుని చేతుల్లోకి తనను తాను అప్పగించుకోవడం. చిన్న
తెరిజమ్మ తనను తాను "చిన్న
పక్షి" (little bird) అని
పోల్చుకునేది, గరుడ పక్షిలా ఎత్తుగా ఎగరలేకపోయినా, తన చిన్న
రెక్కలతో సూర్యుని వైపు చూస్తూ, ప్రేమతో నిండిన హృదయంతో
దేవుని దగ్గరకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నానని రాసింది.
2. చిన్న చిన్న పనులలో గొప్ప ప్రేమ
చిన్న తెరిజమ్మ బోధన సారాంశం ఏమిటంటే, మనం చేసే పని ఎంత గొప్పది
అనేది ముఖ్యం కాదు, ఆ పనిలో మనం ఎంత ప్రేమను
నింపుతున్నామనేది ముఖ్యం. ఒకసారి తన అక్కకు, "నా ప్రియమైన సోదరీ, ఇక్కడ నేను
నీకు నేర్పించే మార్గం అద్భుతమైన పనుల మార్గం కాదు. దీనికి విరుద్ధంగా, నేను నీకు 'చిరు మార్గాన్ని', చాలా నేరుగా, చూపిస్తాను."
ఈ సూత్రం ప్రకారం, మఠంలో ఒక చికాకు కలిగించే
సన్యాసిని పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడటం, ఒక అసౌకర్యమైన పరిస్థితిలో
ఫిర్యాదు చేయకుండా ఉండటం, ఒక చిన్న త్యాగాన్ని మౌనంగా
భరించడం, ఇవన్నీ గొప్ప తపస్సుల కంటే
తక్కువ విలువైనవి కావు, ఎందుకంటే వీటిలో అంతటి ప్రేమను
ఆమె నింపింది.
ఆమె తన ఆత్మకథలో ఒక ప్రసిద్ధమైన సంఘటనను
వివరించింది, మఠంలో ఒక వృద్ధ సన్యాసిని ఆమెకు అనేక ఇబ్బందులు కలిగించేది, ఆమెను
తరచుగా అసహనంతో మందలించేది. చిన్న తెరేజమ్మ ఆమెకు వ్యతిరేకముగా
ఎప్పుడూ ఫిర్యాదు చేయకుండా, ఎప్పుడూ నవ్వుతూ, ప్రేమతో
ప్రవర్తించేది, ఎంతగా అంటే ఆ వృద్ధ సన్యాసిని
తెరిజమ్మ తనను నిజంగా ఇష్టపడుతుందని
అనుకునేది. మరియు తనకు సహాయం చేయడానికి తెరేజమ్మే కావాలని కోరుకుంది. ఇది "చిన్న మార్గం" యొక్క ఆచరణాత్మక
ఉదాహరణ, రోజువారీ చిరాకులను, ఇబ్బందులను
ప్రేమతో, ఓర్పుతో స్వీకరించడం. ఇది సిలువ యోహను గారు చెప్పిందే, “ప్రేమ
లేని చోట, ప్రేమను పంచు తిరిగి ప్రేమను పొందుతావు.”
3. దేవుని కరుణపై సంపూర్ణ నమ్మకం
చిన్న తెరిజమ్మ బోధనలో అత్యంత కీలకమైన అంశం "నమ్మకం”. ఆమె తన
స్వంత పాపాలను, బలహీనతలను ఒప్పుకుంటూనే, దేవుని
కరుణపై అపరిమితమైన నమ్మకాన్ని ఉంచింది. ఆమె ఇలా చెప్పింది: "నేను ఏమీ గొప్ప పని చేయకపోయినా, నేను దేవుని
ముందు నిలబడగలను, ఎందుకంటే నేను ఏమీ కోరుకోను, నేను కేవలం
నా బలహీనతను, నా నిస్సహాయతను దేవుని అనంతమైన కరుణలో
మార్చుకోవాలని కోరుకుంటాను." ఈ నమ్మకం భయం లేని ఆధ్యాత్మికతకు దారితీసింది. తెరిజమ్మ దేవుని శిక్షకు భయపడలేదు, బదులుగా ఆమె
దేవుని ప్రేమలో పూర్తి భరోసాతో జీవించింది. ఒకసారి “లోకములో సాధ్యమైనన్ని
పాపములు చేసిన, నేను భయపడను, నమ్మకంతో నన్ను నేను ప్రభువు చేతులలోనికి అప్పగించుకుంటాను”,
దేవుని కరుణ మీద అంత నమ్మకం ఆమెకు ఉంది.
ఈ సందర్భంలో ఆమె "ఆత్మ సమర్పణ" (Act of Oblation to Merciful Love) అనే ప్రార్థనను రాసింది, దీనిలో ఆమె తనను తాను దేవుని అనంతమైన కరుణకు పూర్తిగా అర్పించుకుంది. ఇది కేవలం మాటలలో మాత్రమే కాదు, ఆమె జీవితమంతా, ముఖ్యంగా ఆమె చివరి అనారోగ్య దినాలలో దేవుని మీద చూపిన నమ్మకం అంత గొప్పది.
4. దైనందిన జీవితంలో ప్రార్థన
చిన్న తెరిజమ్మకు ప్రార్థన అనేది సుదీర్ఘమైన, సంక్లిష్టమైన
ఆధ్యాత్మిక సాధన కాదు. ఆమె ప్రార్థనను హృదయం ఉప్పొంగి, దేవుని వైపు చూసే చూపు, కృతజ్ఞత, ప్రేమతో
కష్టంలోనూ సంతోషంలోనూ దేవుని తో మాట్లాడటం అని చెప్పింది. ఈ నిర్వచనం ప్రార్థనను
ప్రతి సాధారణ వ్యక్తికి అందుబాటులోకి తెచ్చింది. విద్యావంతులకు మాత్రమే కాదు, నిరక్షరాస్యులకు
కూడా, పిల్లలకు కూడా, పెద్దలకు
కూడా. ప్రార్థన కోసం ప్రత్యేక పదాలు అవసరం లేదు, హృదయపూర్వకమైన
ఒక చూపు చాలు.
5. బాధను ప్రేమగా స్వీకరించడం
తెరిజమ్మ జీవితంలో చివరి సంవత్సరం అత్యంత బాధాకరమైనది. శారీరకంగా
క్షయవ్యాధి బాధ, ఆధ్యాత్మికంగా
"విశ్వాసపు చీకటి రాత్రి." ఈ కాలంలో ఆమెకు పరలోకం, దేవుని
ఉనికిపై తీవ్రమైన సందేహాలు కలిగాయి. "నేను చీకటి గోడలతో చుట్టుముట్టబడిన
గదిలో ఉన్నాను... నేను ఆకాశాన్ని చూడలేను." అయినప్పటికీ, ఈ చీకటి
మధ్యలో కూడా ఆమె తన నమ్మకాన్ని వదలలేదు. ఆమె ఈ బాధను తనలాంటి విశ్వాసం లేని వారి
కోసం ఒక ప్రార్థనగా, ఒక త్యాగంగా అర్పించింది. ఈ
విధంగా, ఆమె బాధను వ్యర్థమైనదిగా కాకుండా, ప్రేమతో
నిండిన అర్పణగా మార్చింది. ఇది చిరు మార్గం యొక్క లోతైన కోణం.
6. ప్రేమ యొక్క సర్వోన్నత స్థానం
చిన్న తెరిజమ్మ తన ఆత్మకథలో ఒక కీలకమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని వివరించింది. ఆమె తనకు తిరుసభలో ఏ పాత్ర సరిపోతుందా అని ఆలోచిస్తూ, తాను మిషనరీగా, వేద సాక్షిగా, గురువుగా కావాలని కోరుకున్నా, ఏదీ తన హృదయాన్ని పూర్తిగా సంతృప్తిపరచలేదని గ్రహించింది. అప్పుడు కొరింథీయులకు వ్రాసిన పౌలు పత్రికలోని ప్రేమ గీతాన్ని (1 కొరింథీయులు 13) చదువుతున్నప్పుడు, ఆమెకు ఒక గొప్ప అవగాహన కలిగింది. తిరుసభ అనే శరీరంలో ప్రేమే హృదయం, ప్రేమే అన్ని కలిగి ఉంటుంది. అందుకు "నేను తిరుసభ హృదయంలో ప్రేమనే అవుతాను... ఆ విధంగా నేను అన్నీ అవుతాను." ఈ అవగాహన ఆమె జీవితానికి, ఆమె బోధనకు కేంద్ర బిందువుగా నిలిచింది. గొప్ప పదవులు, గొప్ప కార్యాలు అవసరం లేదు, కేవలం ప్రేమతో నిండిన హృదయమే సరిపోతుంది.
"ఒక ఆత్మ కథ" ఆమె రచన
చిన్న తెరిజమ్మ ఆత్మకథ, "ఒక ఆత్మ కథ" (Story of a
Soul), అనే పేరుతో ప్రచురితం అయ్యింది. ఆమె తన
అక్కల కోరిక మేరకు, మఠాధిపతుల ఆజ్ఞ మేరకు దీనిని రాసింది. ఇది మూడు వేర్వేరు మాన్యుస్క్రిప్ట్‌లుగా
రాయబడింది, తరువాత వాటిని కలిపి ఒక పుస్తకంగా ప్రచురించారు.
ఈ పుస్తకం భాష చాలా సరళమైనది, నేరుగా హృదయాన్ని తాకేది.
ఇందులో సంక్లిష్టమైన వేదాంత పరిభాష కనిపించదు, బదులుగా
రోజువారీ జీవితంలోని చిన్న చిన్న అనుభవాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను
వ్యక్తపరుస్తుంది.
ఈ పుస్తకం 1898లో, తెరిజమ్మ మరణించిన ఒక సంవత్సరం తరువాత ప్రచురించబడింది.
మొదట్లో కేవలం కొన్ని కార్మెల్ మఠాలలో
మాత్రమే పంపిణీ చేయబడినా, క్రమంగా ఇది ప్రపంచవ్యాప్తంగా
అందరికీ అందుబాటులోనికి వచ్చింది, తరువాత అనేక భాషలలోకి అనువదించబడింది, కోట్లాది
ప్రతులు అమ్ముడయ్యాయి. ఈ పుస్తకం చిన్న తెరిజమ్మ బోధన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి ప్రధాన
కారణమైంది.
ఆధ్యాత్మిక పరమైన
ప్రాముఖ్యత
చిన్న తెరిజమ్మ బోధనలు కేవలం భావోద్వేగపరమైన ఆలోచనలు కాదు, వాటిలో లోతైన సత్యాలు ఇమిడి
ఉన్నాయి. 1997లో, ఆమె మరణించిన వందవ
వార్షికోత్సవం సందర్భంగా, రెండవ జాన్ పాల్ పోపుగారు ఆమెను "తిరుసభ పండితురాలిగా" (Doctor of
the Church) ప్రకటించారు.
చిన్న తెరేజమ్మ బోధన యొక్క దైవశాస్త్ర పరమైన ప్రాముఖ్యత ఏమిటంటే, ఆమె
పరిశుద్ధతను ప్రత్యేకమైన, అసాధారణమైన వ్యక్తులకు
మాత్రమే సాధ్యమయ్యే విషయంగా కాకుండా, ప్రతి సాధారణ వ్యక్తికి
అందుబాటులో ఉండే విషయంగా మార్చింది. మధ్యయుగ కాలంలో పునీతుల జీవిత చరిత్రలు తరచుగా
అద్భుతాలు, అసాధారణ తపస్సులు, గొప్ప
త్యాగాలతో నిండి ఉండేవి, ఇవి సాధారణ ప్రజలకు అందని
ద్రాక్షలా అనిపించేవి. చిన్న తెరిజమ్మ ఈ
అవగాహనను సమూలంగా మార్చింది. ఆమె బోధన
ప్రకారం, ఒక సాధారణ గృహిణి, ఒక
కార్మికుడు, ఒక విద్యార్థి, ఎవరైనా సరే, తమ దైనందిన
జీవితంలోని చిన్న చిన్న కర్తవ్యాలను ప్రేమతో నిర్వర్తించడం ద్వారా పవిత్రతను సాధించగలరు.
రెండవ వాటికన్ కౌన్సిల్ (Second
Vatican Council) బోధించిన "అందరు పరిశుద్దతకు పిలవబడ్డారు"
అనే భావనకు ముందుగానే మార్గం సుగమం చేసింది.
అంతేకాక, చిన్న తెరిజమ్మ బోధన దైవ కరుణ (Divine Mercy) అనే అంశంపై కూడా గొప్ప ప్రభావం చూపింది. ఆమె తరువాత, పోలండ్‌కు చెందిన పునీత పౌష్టిన కూడా దైవిక కరుణపై బోధించింది.
మిషనరీల పాలక
పునీతురాలు
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తెరిజమ్మ తన జీవితమంతా కార్మెల్ మఠం లోపలే గడిపింది, ఎప్పుడూ
విదేశాలకు వెళ్లి మిషనరీ పని చేయలేదు. అయినప్పటికీ, 1927లో పదకొండవ భక్తినాధ పోపు గారు ఆమెను, పునీత ఫ్రాన్సిన్ శౌరి
గారితో పాటు, మిషనరీల
పాలక పునీతురాలిగా ప్రకటించారు. ఇది ఆమె
బోధనలోని ఒక ముఖ్యమైన సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రార్థన, చిన్న
త్యాగాలు, ప్రేమతో కూడిన జీవితం కూడా ప్రపంచవ్యాప్త మిషనరీ
పనికి సమానమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుంది. తెరిజమ్మ తన మఠంలో ఉన్న మిషనరీల కోసం ప్రార్థించడం, వారికి
లేఖలు రాయడం ద్వారా, తాను భౌతికంగా వెళ్లలేకపోయినా, ఆధ్యాత్మికంగా
ప్రపంచవ్యాప్త సువార్త ప్రచారంలో పాలుపంచుకుంది.
మఠ జీవితంలో సవాళ్లు
మఠంలో ప్రవేశించిన తరువాత, తెరిజమ్మ జీవితం ఆమె ఊహించినంత "
గొప్ప"గా ఏమి లేదు. మఠాధిపతి
మరియ గోంజాగ కఠినమైన స్వభావం కలిగినది, చిన్న
తెరేజమ్మను తరచుగా కఠినంగా మందలించేది.
మఠంలోని కొందరు వృద్ధ సన్యాసినులు తెరిజాను చిన్నపిల్లగా చూసి తక్కువ అంచనా
వేసేవారు. ఆహారం, వసతి సౌకర్యాలు చాలా
సాధారణమైనవి, కఠినమైనవి. చలికాలంలో మఠంలో వేడి తక్కువగా
ఉండేది, తెరిజమ్మ
చలితో వణికేది, కానీ ఎప్పుడూ ఫిర్యాదు
చేయలేదు.
ఈ సవాళ్ల మధ్యే తెరిజమ్మ తన చిరు
మార్గాన్ని రూపొందించుకుంది. చిన్న తెరేజమ్మ, అనారోగ్యంతో
ఉన్న ఒక వృద్ద సన్యాసినిని భోజన శాలకు
నడిపించి తీసుకువెళ్లే బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరించింది. ఈ వృద్ధ సన్యాసిని
చాలా కఠినంగా, నిష్కర్షగా ఉండేది, చిన్న చిన్న
విషయాలకు కూడా ఫిర్యాదు చేసేది. తెరిజమ్మ
ప్రతిరోజూ ఈ కష్టమైన పనిని, ఎంత అలసిపోయినా, బయటకు
మాత్రం చిరునవ్వుతో, ఓర్పుతో నిర్వర్తించేది.
కొద్దిగా కదలడంలో మార్పు వచ్చిన వెంటనే నన్ను పడేస్తున్నవా? అని అరిచేది, అటువంటి
సన్యాసిని చేత తెరేజమ్మ నాకు సాహాయం చేయాడనికి కావాలి అని కోరుకునేలా తన ప్రేమను
పంచింది.
ఇటువంటి చిన్న చిన్న సంఘటనలే, ఫిర్యాదు చేయకుండా ఉండటం, చికాకు కలిగించే వ్యక్తులతో దయగా ప్రవర్తించడం, గుర్తింపు రాకపోయినా నిశ్శబ్దంగా సేవ చేయడం, తెరిజమ్మ "చిరు మార్గం" యొక్క నిజమైన ప్రయోగశాలగా మారాయి.
చిరు మార్గం - ఆధునిక జీవితంలో అనువర్తనం
నేటి వేగవంతమైన, పోటీతత్వంతో
నిండిన ప్రపంచంలో, తెరిజమ్మ చిరు మార్గం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆధునిక
సమాజం మనలను నిరంతరం "గొప్పగా" ఉండాలని, పెద్ద
విజయాలు సాధించాలని, ప్రత్యేకంగా నిలబడాలని
ఒత్తిడి చేస్తుంది. ఈ నేపథ్యంలో, తెరిజమ్మ బోధన ఒక భిన్నమైన, ఉపశమనమైన
సందేశాన్ని అందిస్తుంది, మీరు గొప్పవారు
కానవసరం లేదు, మీరు అసాధారణమైన పనులు చేయనవసరం లేదు, కేవలం మీ
దైనందిన జీవితంలోని చిన్న చిన్న కర్తవ్యాలను ప్రేమతో నిర్వర్తించండి చాలు.
కుటుంబ
జీవితంలో
ఒక తల్లి తన పిల్లలను పెంచడంలో, ఒక తండ్రి
తన కుటుంబం కోసం కష్టపడి పనిచేయడంలో, ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల
మాట వినడంలో, ఈ చిన్న చిన్న దైనందిన కర్తవ్యాలలో ప్రేమను నింపడం ద్వారా, ఏ కుటుంబ
సభ్యుడైనా చిరు మార్గాన్ని ఆచరించవచ్చు.
ఇంట్లో అలసిపోయినా చిరునవ్వుతో పనులు చేయడం, కుటుంబ సభ్యుల చిన్న చిన్న
తప్పులను ఓర్పుతో క్షమించడం, ఎవరూ గమనించకపోయినా
నిశ్శబ్దంగా సేవ చేయడం, ఇవన్నీ చిరు మార్గం యొక్క ఆచరణాత్మక రూపాలు.
వృత్తి
జీవితంలో
ఆధునిక వృత్తి జీవితంలో కూడా చిరు మార్గం అనువర్తించవచ్చు. ఒక ఉద్యోగి తన
కార్యాలయంలో నిజాయితీగా, శ్రద్ధగా పనిచేయడం, తోటి
ఉద్యోగులతో దయతో ప్రవర్తించడం, గుర్తింపు రాకపోయినా తన
కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం, ఇవన్నీ "చిరు మార్గం" స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి.
తెరిజమ్మ బోధన ప్రకారం, ఒక పని ఎంత
చిన్నదిగా కనిపించినా, దానిలో నింపిన ప్రేమ, నిజాయితీ
దానిని గొప్పదిగా మారుస్తుంది.
వ్యక్తిగత
ఆధ్యాత్మిక జీవితంలో
చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో నిరాశకు
గురవుతారు, ఎందుకంటే వారు తమను తాము గొప్ప సాధువులతో, గొప్ప
ఆధ్యాత్మిక అనుభవాలున్న వ్యక్తులతో పోల్చుకుంటారు. తెరిజమ్మ చిన్న మార్గం ఈ నిరాశకు ఒక చక్కని పరిష్కారాన్ని
అందిస్తుంది. ప్రతి వ్యక్తి తమ స్వంత
బలహీనతలను అంగీకరించి, దేవుని కరుణపై నమ్మకం ఉంచి, తమ చిన్న
చిన్న ప్రయత్నాలను ప్రేమతో అర్పించవచ్చు. గొప్ప ధ్యాన అనుభవాలు, దర్శనాలు
అవసరం లేదు, కేవలం నిజాయితీగా, నమ్రతతో
నిండిన హృదయం చాలు.
బాధను
ఎదుర్కోవడంలో
జీవితంలో అనారోగ్యం, నష్టం, వైఫల్యం వంటి కష్టాలను ఎదుర్కొనేవారికి తెరిజమ్మ జీవితం, బోధన గొప్ప ఓదార్పును అందిస్తుంది. ఆమె స్వయంగా తీవ్రమైన శారీరక బాధను, ఆధ్యాత్మిక చీకటిని అనుభవించింది, అయినప్పటికీ నమ్మకాన్ని వదలలేదు. ఈ ఉదాహరణ, తమ సొంత కష్టాలలో దేవుని ఉనికిని అనుమానించే వారికి, తమ బాధలో కూడా అర్థం, విలువ ఉందని బోధిస్తుంది.
చిన్న తెరిజమ్మ
రాసిన కవితలు మరియు నాటకాలు
చిన్న తెరిజమ్మ కేవలం ఆత్మకథ మాత్రమే కాదు, తన మఠ
జీవితంలో అనేక కవితలు, ప్రార్థనలు, చిన్న
నాటకాలు కూడా రాసింది. మఠంలో ప్రతి సంవత్సరం జరిగే పండుగలలో ప్రదర్శించడానికి ఆమె
సన్యాసినుల కోసం చిన్న నాటకాలు రాసేది, వాటిలో నటించేది కూడా. ఈ
రచనలలో ఆమె తన ఆధ్యాత్మిక దృష్టిని, తన హాస్యచతురతను, తన కళాత్మక
సృజనాత్మకతను వ్యక్తపరిచింది. ఆమె సుమారు అరవై కవితలు రాసింది, వీటిలో
అనేకం సంగీతంగా కూడా మలచబడ్డాయి.
ఆమె రాసిన లేఖలు కూడా ఎంతో విలువైనవి. తన
అక్కలకు, తన ఆధ్యాత్మిక సోదరులకు (ఆమె ప్రార్థనలలో
పాలుపంచుకున్న ఇద్దరు మిషనరీ గురువులకు ) రాసిన లేఖలలో ఆమె తన ఆధ్యాత్మిక
అనుభవాలను, తన బోధనలను వివరంగా పంచుకుంది.
మనోవిజ్ఞాన
దృక్కోణం నుండి చిన్న తెరేజమ్మ
ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మిక
రచయితలు చిన్న తెరేజమ్మ జీవితాన్ని మానసిక
ఆరోగ్యం దృక్కోణం నుండి కూడా అధ్యయనం చేశారు. ఆమె బాల్యంలో ఎదుర్కొన్న నష్టాలు
(తల్లి మరణం, అక్కల మఠ ప్రవేశం), తీవ్రమైన
భావోద్వేగ సున్నితత్వం, నాడీ సంబంధిత అనారోగ్యం, ఇవన్నీ ఆధునిక మనోవిజ్ఞాన భాషలో "attachment
trauma" లేదా "anxiety" వంటి
పరిస్థితులను గుర్తుచేస్తాయి. అయితే, చిన్న తెరేజమ్మ ఈ మానసిక సవాళ్లను తన ఆధ్యాత్మిక పరిపక్వత
ద్వారా అధిగమించడం విశేషమైనది.
ఈమె బోధనలో ఒక ఆసక్తికరమైన మానసిక అంశం ఏమిటంటే, ఆమె తన స్వంత బలహీనతలను అణచిపెట్టుకోకుండా, వాటిని నిజాయితీగా అంగీకరించడం. ఆధునిక మానసిక చికిత్సలో కూడా, తనను తాను నిజాయితీగా అంగీకరించడం (self-acceptance), పరిపూర్ణతావాదాన్ని (perfectionism) వదిలిపెట్టడం మానసిక ఆరోగ్యానికి కీలకమని భావిస్తారు. ఈమె బోధన, తనను తాను గొప్పదానిగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, కేవలం దేవుని ప్రేమను నమ్మి, తన చిన్నతనాన్ని అంగీకరించడం ద్వారా శాంతిని పొందవచ్చని బోధిస్తుంది. ఇది నేటి ఒత్తిడితో కూడిన, పరిపూర్ణతను కోరుకునే సమాజంలో ఎంతో ఉపశమనకరమైన సందేశం.
చిన్న
మార్గాన్ని ఆచరించడానికి సూచనలు
చిన్న తెరిజమ్మ బోధనను నిజ జీవితంలో ఆచరించాలనుకునే వారికి
కొన్ని ఆచరణాత్మక సూచనలు మొదటిది, ప్రతిరోజూ, ఆ రోజు
ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలను, అసౌకర్యాలను దేవునికి ప్రేమతో
అర్పించాలని నిర్ణయించుకోవడం. ఇది ఒక చిన్న మానసిక అలవాటుగా ప్రారంభమవుతుంది, కానీ
కాలక్రమేణా ఇది జీవితాన్ని పూర్తిగా మార్చే ఆధ్యాత్మిక దృక్పథంగా మారుతుంది.
రెండవది, ఇతరుల పట్ల చిన్న దయాపూర్వక
చర్యలను చేయడం, ఒక చిరునవ్వు, ఒక
సహాయకరమైన మాట, కొద్దిగా ఓపికతో ఒకరిని బాధను వినడం. ఇవి
చిన్నవిగా కనిపించినా, చిన్న తెరిజమ్మ ప్రకారం ఇవే నిజమైన పరిశుద్ధతకు మార్గాలు.
మూడవది, తనను తాను ఇతరులతో
పోల్చుకోకుండా ఉండటం. ప్రతి ఆత్మ దేవుని ముందు తనదైన ప్రత్యేక స్థానాన్ని కలిగి
ఉంటుంది, ఒక చిన్న పువ్వు గులాబీలా కాకుండా, తనదైన
అందంతో ఉండటమే దాని పరిపూర్ణత అని చిన్న తెరేజమ్మ చెప్పేది.
నాలుగవది, వైఫల్యాల తరువాత కూడా
నిరుత్సాహపడకుండా, వెంటనే మళ్లీ దేవుని కరుణపై నమ్మకం ఉంచడం. చిన్న తెరిజమ్మ ప్రకారం, పడిపోవడం సమస్య కాదు, పడిపోయిన
తరువాత లేవకుండా అక్కడే ఉండిపోవడమే నిజమైన సమస్య.
ఐదవది, ప్రార్థనను సులభంగా, హృదయపూర్వకంగా ఉంచడం, దీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రార్థనా పద్ధతుల కంటే, దేవునితో ఒక సాధారణ, నిజాయితీ గల సంభాషణను కొనసాగించడం ముఖ్యం.
చిరు మార్గంపై ధ్యానం చేయడానికి ప్రశ్నలు
తెరిజమ్మ బోధనను వ్యక్తిగత జీవితంలో లోతుగా
అన్వయించుకోవాలనుకునే వారికి కొన్ని ధ్యాన ప్రశ్నలు. నేను నా దైనందిన జీవితంలో
ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను ఎలా స్వీకరిస్తున్నాను. ఫిర్యాదుతోనా, లేక
ప్రేమతోనా? నేను నా స్వంత బలహీనతలను నిజాయితీగా
అంగీకరిస్తున్నానా, లేక వాటిని దాచిపెట్టడానికి
ప్రయత్నిస్తున్నానా? నేను దేవుని కరుణపై ఎంత
నమ్మకం ఉంచుతున్నాను, లేక నా స్వంత యోగ్యతలపైనే
ఎక్కువగా ఆధారపడుతున్నానా? నేను ఇతరులతో పోల్చుకుంటూ నా
స్వంత జీవితంలోని విలువను తక్కువగా అంచనా వేస్తున్నానా? ఈ ప్రశ్నలు
ఆత్మపరిశీలనకు, తెరిజమ్మ బోధనను వ్యక్తిగతంగా అన్వయించుకోవడానికి
సహాయపడతాయి.
విమర్శలు
మరియు అపార్థాలు
చిన్న తెరిజమ్మ బోధనను కొందరు మొదట్లో తేలికగా భావించారు. ఆమె రచనా శైలి సరళంగా, పసిపిల్లల
భాషలో ఉండటం వల్ల, కొందరు బోధనలో లోతు లేదని
అపార్థం చేసుకున్నారు. కానీ లోతైన అధ్యయనం తరువాత, ఆమె బోధనలో
అసాధారణమైన దైవశాస్త్ర పరిపక్వత ఉందని
గుర్తించారు, అందుకే ఆమెను "తిరుసభ పండితురాలుగా”ప్రకటించారు. సరళమైన
భాషలో లోతైన సత్యాలను వ్యక్తపరచడం ఆమె ప్రత్యేకత.
మరో అపార్థం ఏమిటంటే, "చిరు మార్గం" అంటే నిష్క్రియాత్మకత, సోమరితనం అని కొందరు భావిస్తారు. కానీ వాస్తవానికి, ఈ మార్గం అత్యంత క్రియాశీలమైనది. ప్రతి క్షణంలో ప్రేమను ఎంచుకోవడం, ప్రతి చిన్న అవకాశాన్ని ప్రేమతో నింపడం అనేది నిరంతర ఆధ్యాత్మిక అప్రమత్తతను, క్రియాశీలతను కోరుతుంది. తెరేజమ్మ స్వయంగా అనేక అంతర్గత పోరాటాలను, స్వభావ లోపాలను అధిగమించడానికి నిరంతరం కృషి చేసింది.
ముగింపు
చిన్న తెరేజమ్మ "చిరు మార్గం"
క్రైస్తవ ఆధ్యాత్మికతలో ఒక విప్లవాత్మకమైన, అదే సమయంలో లోతైన సరళతతో
కూడిన బోధన. ఇది గొప్ప త్యాగాలు, అసాధారణ కార్యాల ద్వారా
కాకుండా, దైనందిన జీవితంలోని అతి చిన్న క్షణాలలో, దేవుని పూర్తి
నమ్మకంతో, పసిపిల్లవాడి నిష్కల్మషతతో దేవుని ప్రేమను
అనుభవించి, ఆ ప్రేమను ఇతరులకు పంచే మార్గం. ఇరవై నాలుగు
సంవత్సరాల చిన్న జీవితకాలంలో, మఠం లోపల నాలుగు గోడల మధ్య
జీవించిన ఒక సాధారణ సన్యాసిని, తన సరళమైన, హృదయపూర్వకమైన
బోధన ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను మార్చింది.
చిన్న తెరేజమ్మ బోధన మనకు ఏమి గుర్తు చేస్తుంది
అంటే, పరిశుద్ధత, ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేది
దూరపు, అసాధ్యమైన లక్ష్యం కాదు. ఇది మన దైనందిన
జీవితంలో, మన కుటుంబంలో, మన పని
స్థలంలో, మన సాధారణ సంబంధాలలో ప్రేమను ఎంచుకోవడం ద్వారా
సాధించగలిగే విషయం. "చిరు మార్గం" మనకు నేర్పేది ఏమిటంటే, గొప్పతనం
అనేది గొప్ప కార్యాలలో కాదు, చిన్న కార్యాలలో నింపిన గొప్ప
ప్రేమలో ఉంది.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment