మత్తయి 17:14-20 వ్యాఖ్యానం | ఆవగింజంత విశ్వాసం, అసాధ్యమైనది ఏదీ లేదు | కార్మెల్ శోభ
మత్తయి 17:14-20
వారు అపుడు
జనసమూహమును చేరగా, అందు ఒకడు యేసు ముందు మోకరిల్లి, “ప్రభూ! నా పుత్రుని కరుణింపుము.
మూర్చరోగమువలన తీవ్రముగ బాధపడుచు అనేక పర్యాయములు నిప్పు లోను, నీళ్ళలోను పడుచున్నాడు. నేను ఇతనిని తమ శిష్యుల వద్దకు
తీసికొనివచ్చితిని; కాని వారు ఇతనిని స్వస్థపరుపలేకపోయిరి”
అనెను. అందుకు యేసు వారితో “మీరెంత అవిశ్వాసులు! ఎంత భ్రష్టులు! నేను మీతో
ఎంతకాలము ఉందును? ఎంతవరకు మిమ్ము సహింతును? వానిని నా యొద్దకు తీసికొని రండు” అని చెప్పెను. యేసు ఆ పిశాచమును
గద్దింపగా అది వదలిపోయెను. ఆ గడియనుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో
ఏకాంతముగా, “ఆ పిశాచమును మేమేల పారద్రోల లేకపోతిమి?”
అని అడిగిరి. యేసు వారితో “మీ అల్పవిశ్వాసమే అందుకు కారణము, ఆవగింజంత విశ్వాసము మీకుండినయెడల ఈ పర్వతముతో 'నీవిక్కడ
నుండి తొలగుము' అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును.
మీకు అసాధ్యమైనది ఏదియు ఉండదని మీతో వక్కాణించుచున్నాను.
పరిచయం
యేసు ప్రభువు రూపాంతరికరణ దివ్యమహిమను పేతురు, యాకోబు,
యోహానులకు చూపిన తరువాత , యేసు ప్రభువు వారితో కలిసి కొండ దిగి ప్రజల మధ్యకు వచ్చాడు. అక్కడ ఆయనకు మానవ దుఃఖం,
పిశాచ పీడ, శిష్యుల అసమర్థత ఎదురయ్యాయి. ఒక తండ్రి
మూర్చరోగంతో బాధపడుతున్న తన కుమారుని
"శిష్యుల వద్దకు తీసుకువచ్చినా శిష్యులు
స్వస్థపరచలేకపోయారు" ఆ విషయాన్ని
అతను యేసు ప్రభువు ముందుకు తీసుకువచ్చి, తన
కుమారునికి స్వస్థత ఇవ్వమని మొరపెట్టుకుంటున్నాడు.
యేసు ప్రభువు ఆ దురాత్మను గద్దించగానే
బాలుడు స్వస్థత పొందాడు. ఏకాంతంలో శిష్యులు ప్రభువు దగ్గరకువచ్చి "మేమెందుకు విఫలమయ్యాం?" అని అడుగుతున్నారు. యేసు
ప్రభువు వారికి "మీ అల్పవిశ్వాసమే
కారణం. మీకు ఆవగింజంత విశ్వాసమున్న పర్వతాన్ని తొలగిపొమ్మన్న తొలగిపోతుంది; మీకు
అసాధ్యమైనది ఏదీ ఉండదు." అని చెబుతున్నాడు.
1. సువిశేష భాగ అర్ధం
ఈ సంఘటన మూడు సువిశేషాలలో
కనిపిస్తుంది, మత్తయి 17:14-20, మార్కు
9:14-29, లూకా 9:37-43. ప్రతి
సువార్తికుడు దీన్ని తన దృష్టికోణం నుండి నమోదు చేశాడు. మత్తయి శిష్యుల విశ్వాసలేమిపై దృష్టి పెడితే,
మార్కు ఈ సంఘటనను మరింత విస్తృతంగా వివరిస్తూ తండ్రి ప్రార్థన
("అప్పుడు ఆ బాలుని తండ్రి “నేను నమ్ముచున్నాను. నాకు అవిశ్వాసము
లేకుండునట్లు తోడ్పడుము” అని ఎలుగెత్తి పలికెను" మార్కు 9:24) చేర్చాడు,
లూకా యేసు ప్రభువు
వ్యక్తిత్వం గురించి చెప్తాడు.
కుమారుని తండ్రి
యేసు ప్రభువు ముందు మోకరిల్లి "నా
పుత్రుని కరుణించి సాయముచేయుడు" అని వేడుకుంటాడు. "కరుణింపుము" అనే
మాట గ్రీకులో "ఎలెయ్ సొన్" (eleēson), కేవలం జాలి చూపమని అడగడం కాదు, దేవుని
రక్షణతో కూడిన దయ కోసం చేసే మొర. బాలుని
స్థితిని పట్టి అది "మూర్చరోగము" అని
వర్ణించారు. అది దురాత్మ ప్రభావంతో జరుగుతుంది అని తెలుస్తుంది.
ఆనాటి రోజులలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలు వేరుగా చూడని యూదుల
ప్రపంచ దృష్టికోణానికి ఇది అనుగుణంగా ఉంది.
శిష్యులు ఈ బాలుని
స్వస్థపరచలేకపోవడం విశేషమైనది, ఎందుకంటే మత్తయి 10:1,8లో యేసు ప్రభువు వారికి దురాత్మలను
వెళ్లగొట్టే అధికారం ఇచ్చాడు. వారి వైఫల్యం అధికారం లోపం వల్ల కాదు, విశ్వాస బలహీనత వల్ల అని యేసు ప్రభువు తేటతెల్లం చేస్తున్నాడు.
"మీరెంత అవిశ్వాసులు! ఎంత భ్రష్టులు!" అన్న మాటలో ద్వితీయోపదేశకాండము 32:5,20లో మోషే ఇశ్రాయేలు ప్రజలను వర్ణించిన మాటలు ప్రతిధ్వనిస్తాయి. యేసు ప్రభువు కేవలం శిష్యులను మాత్రమే కాదు, మొత్తం ఆ తరాన్ని గద్దిస్తున్నాడు.
యేసు ప్రభువు, తుఫానును గద్దించిన అదే అధికారంతో
దురాత్మను "గద్దించాడు (మత్తయి 8:26). ఇది
ఆయన మాట సృష్టికర్త మాట అని, దురాత్మలు కూడా దానికి లోబడతాయని
చూపిస్తుంది. కొద్ది విశ్వాసం ఉన్న వారు
అడిగినది జరిగేది అని ప్రభువు చెబుతున్నారు. ఆవగింజ చిన్న విత్తనం అయినా జీవశక్తి కలిగి ఉంది.
నాటితే మొలకెత్తుతుంది. అలాగే చిన్న విశ్వాసమైనా దేవునిపై ఆధారపడితే గొప్ప
కార్యాలు సాధించగలదు. "పర్వతం తొలగడం" యూదుయ భాషలో అసాధ్యమైన అడ్డంకిని అధిగమించడానికి వాడే అలంకారం.
(జెకర్యా 4:7తో
పోల్చవచ్చు). మార్కు సువార్త దీనికి
"ప్రార్థనవలనతప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్య పడదు"
(మార్కు 9:29) అని జోడిస్తుంది. కొన్ని ఆధ్యాత్మిక
పోరాటాలకు ప్రార్థన మాత్రమే సరిపోదు, పూర్తి అంకితభావం అవసరం.
ఈ ఘటన మత్తయి
సువార్తలో పేతురు, ప్రభువును "నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు"
అని ప్రకటించిన తరువాత, ప్రభువుని
రూపాంతరికరణ ద్వారా ప్రభువు ఎవరు అనేది ఒక దృవీకరణ వస్తుంది. . దాని తరువాతనే శిష్యులు వైఫల్యం చెందుతున్నారు. (17:14-20లో శిష్యుల వైఫల్య వైఫల్యం మనం చూస్తాం. ) తర్వాత 17:22-23లో
యేసు ప్రభువు తన మరణం, పునరుత్థానం గురించి రెండవసారి ప్రవచించడం వస్తుంది. ఈ క్రమం ఏమి చూపిస్తుంది. అంటే యేసు ప్రభువు ఎవరో తెలుసుకోవడం ఒక్కటే సరిపోదు; ఆ తెలుసుకున్నదానికి
అనుగుణంగా జీవించడం, ఆయనపై పూర్తిగా ఆధారపడటం అవసరం. శిష్యులు
క్రీస్తు ఎవరో సిద్ధాంతపరంగా ఒప్పుకున్నా, ఆచరణలో ఆ
విశ్వాసాన్ని జీవించడంలో ఇంకా ఎదగాల్సి ఉంది.
ఇది వారికి, మనకు కూడా వర్తించే పాఠం.
2. ఆధ్యాత్మిక కోణం
ఈ కథలోని ప్రతి
పాత్ర, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక కోణాన్ని చూపిస్తుంది. బాధపడుతున్న బాలుడు పాపం,
భయం, బంధనాల వల్ల "నిప్పులోను
నీళ్ళలోను" పడుతున్న మానవాళిని సూచిస్తాడు.
వ్యసనాలు, నిరాశ, ఆత్మనింద
వంటివి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నించే ఆధ్యాత్మిక శక్తులు. తండ్రి
ప్రార్థించే విశ్వాసిని సూచిస్తాడు. ఇతరుల
బాధను తన బాధగా భావించి దేవుని సన్నిధికి తీసుకువెళ్ళే ప్రతి తల్లి,తండ్రి,
గురువు, రూపం అతనిలో కనిపిస్తుంది. శిష్యులు
విశ్వాసంలో ఎదుగుతున్న సంఘాన్ని సూచిస్తారు. వారికి అధికారం ఉన్నా విఫలమయ్యారు.
ఎందుకంటే పరిచర్య కేవలం పద్ధతులు లేదా గత అనుభవాలపై ఆధారపడదు; అది దేవునితో ఉన్న సంబంధంపై ఆధారపడుతుంది. బహుశా వారు గత విజయాలపైనే
నమ్మకం పెట్టుకుని, ఆ క్షణంలో దేవునిపై పూర్తిగా ఆధారపడలేదు.
ఇది నేటి సంఘానికి కూడా ఒక హెచ్చరిక, మన
కార్యక్రమాలు, పద్ధతులు ఎంత గొప్పగా ఉన్నా, ప్రార్థన మరియు
దేవునిపై ఆధారపడటం తగ్గితే, ఫలితాలు కనిపించవు.
ప్రభువు
రూపాంతరికరణ మహిమానుభవం శిష్యులకు ఉన్న, క్రింద ఉన్న ప్రజల
వద్దకు వచ్చినప్పుడు వారి వైఫల్యం ఆధ్యాత్మిక జీవిత వాస్తవాన్ని చూపిస్తుంది, ఉన్నత
అనుభవాలు ఉంటాయి, కానీ వాటి తర్వాత దైనందిన సవాళ్లను
ఎదుర్కోవాల్సిందే. నిజమైన విశ్వాసం పర్వతం మీద మాత్రమే కాదు, లోయలో కూడా పరీక్షించబడుతుంది. "ఆవగింజంత విశ్వాసం" మనకు
గుర్తుచేసేది, ఏమిటంటె విశ్వాసం అంటే
"నేను చేయగలను" అనే ఆత్మవిశ్వాసం కాదు, "దేవుడు
చేయగలడు" అనే విశ్వాసం. చిన్నదైనా నిజమైన విశ్వాసం, దేవుని శక్తితో అనుసంధానమైతే అద్భుతాలను
సాధిస్తుంది.
యేసు ప్రభువు కరుణ కూడా ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఆయన గద్దించినా, స్వస్థపరిచాడు.
మనకు అల్పవిశ్వాసం ఉన్నా ఆయన కరుణ
చూపుతూనే ఉంటాడు. మానవ అసమర్థత దేవుని శక్తికి అడ్డంకి కాదు.
ఈ సంఘటనలో
"అగ్ని, నీరు" అనే రెండు అంశాలు ఉన్నాయి.
దురాత్మ ఆ బాలుడిని పదేపదే అగ్నిలోను, నీటిలోను
పడవేస్తుంది, నాశనం చేయడమే దాని లక్ష్యం. ఆధ్యాత్మికంగా చూస్తే, తీవ్రమైన కోపం అగ్నిలా, నిస్పృహ నీటిలా
మనలను ముంచెత్తుతాయి. ఈ రెండు తీవ్రతల
మధ్య నలిగిపోతున్న వారు మనలో, మన చుట్టూ ఎందరో ఉంటారు. అయితే క్రీస్తు
మాట ఆ నాశన శక్తులను ఆపగలదు, ఒక్క ఆజ్ఞతోనే ప్రభువు దీనిని చేయగలుగుతున్నాడు.
3. సంధర్భానుసార
వివరణ
ఈ వాక్యాన్ని
సరిగ్గా అర్థం చేసుకోవడానికి కొన్ని వ్యాఖ్యాన సూత్రాలు అవసరం. మొదటిది, చారిత్రక-సాంస్కృతిక సందర్భం, మొదటి
శతాబ్దపు యూదా సమాజంలో
దురాత్మలు, మూర్చరోగం సాధారణంగా ఒకదానితో ఒకటి ముడిపడేవి;
వాటిని పారద్రోలాడానికి భోదకులు
మంత్రాలు, ఆచారాలు
ఉపయోగించేవారు, కానీ యేసు ప్రభువు కేవలం ఆజ్ఞతోనే స్వస్థపరిచాడు. ఇది ఆయన ప్రత్యేకతను, దైవ
అధికారాన్ని చూపిస్తుంది.
రెండవది, సాహిత్య సందర్భం, మత్తయి
సువార్తలో ఈ ఘట్టం పేతురు ప్రభువును క్రీస్తు
అని ఒప్పుకున్న (16:13-20) తర్వాత,
యేసు ప్రభువు తన మరణం
గురించి చెప్పే ముందు (17:22-23) ఉంది. శిష్యుల శిక్షణ, యేసు ప్రభువు అధికారం మధ్య
సంబంధాన్ని ఇది నొక్కి చెబుతుంది.
మూడవదిగా ,
ఎఫెసీయులకు 6:12లో ఆధ్యాత్మిక యుద్ధం, యాకోబు 5:15లో విశ్వాస ప్రార్థన, మార్కు 11:23లో పర్వతం కదలడం వంటి వాక్యాలతో
పోల్చినప్పుడు విశ్వాసంపై బైబిల్ బోధన స్థిరత్వం కనిపిస్తుంది. ఈ వాక్యాన్ని
"ఏదైనా కోరుకుంటే వస్తుంది" అనే కోణంలో చూడకూడదు. యేసు ప్రభువు మాట్లాడుతున్నది దేవుని
చిత్తానికి అనుగుణమైన విశ్వాసం గురించి, మన కోరికల
నెరవేర్పు గురించి కాదు. అలాగే ప్రతి రోగం, దురాత్మ వల్లే వస్తుందని నిర్ణయించకూడదు.
మార్కు సువార్తలో
ఈ కథనం మరింత నాటకీయంగా ఉంటుంది. బాలుడు
నోరు కొరుక్కొని, నురుగు కక్కి, నేలపై
పడి కొట్టుకుంటాడు అని వివరంగా చెప్పబడింది. తండ్రి మాటలు కూడా మరింత
హృదయవిదారకంగా ఉంటాయి. "తమకిది
సాధ్యమగునేని మాపై కరుణించి సాయముచేయుడు." అందుకు యేసు ప్రభువు "సాధ్యమగునేని' అనుచున్నావా!
విశ్వసించు వానికి అంతయు సాధ్యమే" అని జవాబు ఇస్తున్నాడు. ఇది విశ్వాసానికి, అసాధ్యతకు
మధ్య సంబంధాన్ని మరింత స్పష్టం చేస్తుంది. అప్పుడు తండ్రి కేకవేస్తూ చెప్పిన మాట, క్రైస్తవ ప్రార్థనా జీవితంలో అత్యంత
ప్రామాణికమైన ఒప్పుకోలుగా నిలిచింది, "నేను నమ్ముచున్నాను. నాకు అవిశ్వాసము
లేకుండునట్లు తోడ్పడుము." ఈ ఒక్క వాక్యంలో విశ్వాసం, సందేహం
రెండూ కలిసి ఉన్నాయి. యేసు ప్రభువు ఆ అసంపూర్ణ విశ్వాసాన్ని కూడా తిరస్కరించలేదు,
దానికే స్పందించి బాలుడిని స్వస్థపరిచాడు. ఇది మనకు ఒక గొప్ప ఓదార్పు,
పరిపూర్ణ విశ్వాసం కోసం వేచి ఉండనవసరం
లేదు; సందేహంతో కూడిన చిన్న విశ్వాసాన్ని కూడా యేసు ప్రభువు స్వీకరిస్తాడు.
లూకా సువార్త సంక్షిప్తంగా
ఉన్నా, ఒక ప్రత్యేక వివరాన్ని జోడిస్తుంది, "వారు వచ్చు చుండగా దయ్యము వానిని క్రింద
పడద్రోసి విలవిలలాడించెను. యేసు అపవిత్రాత్మను గద్దించి, వానిని స్వస్థపరచి
తండ్రికి అప్పగించెను." (లూకా 9:42). ఈ చిన్న వాక్యం
లోతైన అర్థం కలిగినది, స్వస్థత అనేది కేవలం రోగాన్ని తొలగించడం మాత్రమే కాదు,
విచ్ఛిన్నమైన కుటుంబ సంబంధాన్ని పునరుద్ధరించడం కూడా. యేసు ప్రభువు బాలుడిని
తన దగ్గరే ఉంచుకోలేదు, తండ్రికి తిరిగి ఇచ్చాడు, కుటుంబాన్ని సంపూర్ణం చేశాడు.
4. సామాజిక వ్యాఖ్యానం
మొదటి శతాబ్దపు పాలస్తీనా సమాజంలో కుటుంబం ప్రధానం భాగం.
ఒక కుమారుని బాధ మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేసేది. పితృస్వామ్య సమాజంలో గౌరవం, వారసత్వం ముఖ్యం. ఇలాంటి స్థితిలో ఉన్నవారిని సమాజం తరచూ
బహిష్కరించేది లేదా భయపడేది; యేసు ప్రభువు ఆ బాలుని స్వీకరించి స్వస్థపరచడం ద్వారా
ఆ సామాజిక బహిష్కరణ నుండి కాపాడాడు. అతన్ని
కుటుంబంలో, సమాజంలో తిరిగి ప్రతిష్ఠించాడు.
శిష్యుల వైఫల్యం
అధికార నిర్మాణంపై ప్రశ్నలు లేవనెత్తింది, ధర్మ శాస్త్ర బోధకులు, పరిసయ్యులు
అధికారం కలిగి ఉండే సమాజంలో, యేసు శిష్యులు కొత్త అధికారాన్ని
ప్రదర్శించాల్సి వచ్చింది. వారి వైఫల్యం యేసు ప్రభువుని ఉద్యమాన్ని ప్రశ్నార్థకం చేసి ఉండొచ్చు, కానీ యేసు ప్రభువు విజయం
దాన్ని బలపరిచింది. ఇది సంఘానికి, మత అధికారులకు కూడా ఒక సవాలు. సేవ కేవలం బోధ కాదు, బాధితుని
పక్కన నిలబడటం.
ఆధునిక
అనువర్తనంలో చూస్తే, నేటి కుటుంబాలు కూడా మానసిక అనారోగ్యం,
వ్యసనాలు, హింస వంటి సమస్యలతో బాధపడుతున్నాయి.
విశ్వాస సమాజాలు, సంఘం, శిష్యుల్లా విఫలమవుతాయా, లేదా
యేసు ప్రభువు శక్తితో నిజంగా సహాయం
చేస్తాయా అనేది ఈనాటికీ ప్రశ్నే. అధికారం ఉన్నవారు విశ్వాసం లేకుండా పనిచేస్తే
విఫలమవుతారు; యేసు ప్రభువుని కరుణతో, శక్తితో
సేవ చేయడమే మార్గం.
ఈ కథలో బాలుడు
కేంద్రంగా ఉండటం కూడా గమనార్హం. యేసు ప్రభువు
పిల్లలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చాడు
(మత్తయి 18). నేటి సమాజంలో పిల్లల రక్షణ, ఆరోగ్యం, వారిపై జరిగే హింస, దోపిడీ వంటివి పరిగణించాల్సిన విషయాలు. ఈ వాక్యభాగం సామాజిక న్యాయం, కుటుంబ పునరుద్ధరణ, అధికారమును ఉపయోగించడం గురించి బోధిస్తుంది.
చరిత్రలో వెనక్కి
చూస్తే, నిజమైన విశ్వాసం ఎప్పుడూ కేవలం వ్యక్తిగత
అనుభవంగా మాత్రమే ఉండిపోలేదు, అది
సమాజాలను మార్చింది. బానిసత్వ నిర్మూలన ఉద్యమాలు, ఆసుపత్రుల
స్థాపన, అనాథ శరణాలయాలు, విద్యా
వ్యాప్తి, ఇవన్నీ "ఆవగింజంత విశ్వాసం" అనేక తరాలుగా పెరిగి సాధించిన
ఫలితాలే. ఒక వ్యక్తి విశ్వాసంతో మొదలుపెట్టిన చిన్న అడుగు, తరతరాలుగా
సమాజాన్ని మార్చే "పర్వతాన్ని కదిలించే" శక్తిగా మారింది. ఇది మనకు
గుర్తుచేసేది, వ్యక్తిగత విశ్వాసం, సామాజిక బాధ్యతతో వేరు చేయలేనంతగా
ముడిపడి ఉంటుంది. మనం దేవుని ముందు మోకరిల్లేది కేవలం మన సొంత సమస్యల కోసమే కాదు,
మన చుట్టూ ఉన్న బాధిత సమాజం కోసం కూడా అనే విషయం కూడా తెలుసుకోవాలి.
సందేశం
మత్తయి 17:14-20 విశ్వాసం, అధికారం, మానవ
బలహీనత, దైవ శక్తి గురించిన బోధ. యేసు ప్రభువుని గద్దింపు మనల్ని మేల్కొల్పుతుంది. అల్పవిశ్వాసం
నుండి బయటపడి, ఆవగింజంత విశ్వాసంతో ముందుకు సాగాలని ప్రోత్సాహిస్తుంది.
ప్రార్థన, ఉపవాసం,
యేసు ప్రభువు పై నమ్మకం ద్వారా అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. ఈ సందేశం
నేటికీ సజీవంగా ఉంది. బాధపడుతున్నవారిని
యేసు ప్రభువు వద్దకు తీసుకురావాలి, ఆయనే స్వస్థపరుస్తాడు. మన జీవితాల్లో
ఎన్ని "పర్వత" అనుభవాలు ఉన్నాపాపపు
అలవాట్లు, కుటుంబ విభేదాలు, నిరాశ,
అన్యాయం మనలను ముందుకు సాగనివ్వడం లేదు. ఆవగింజంత నిజమైన విశ్వాసం వాటిని అధిగమించడానికి
దేవుని శక్తిని మనకు తీసుకువస్తుంది.
"మీకు అసాధ్యమైనది ఏదియు ఉండదు" అన్న యేసు ప్రభువుని వాగ్దానం మనల్ని దేవుని శక్తితో వ్యక్తిగతంగా,
కుటుంబపరంగా, సామాజికంగా మార్పుకు సాధనాలుగా
మార్చగలదు. ఈ వాక్యభాగం ద్వార రెండు విధాలుగా మనం పిలువబడుతున్నాం. ఒకవైపు తండ్రిలా, మన బలహీనతలను, మన ప్రియమైనవారి బాధలను నిస్సంకోచంగా
యేసు ప్రభువు ముందుకు తీసుకురావాలని;
మరోవైపు శిష్యుల అనుభవం నుండి నేర్చుకుని, మన
సేవ, మన ప్రార్థన కేవలం అలవాటుగా కాకుండా, ప్రతిరోజూ
దేవునిపై కొత్తగా ఆధారపడే జీవన విధానంగా మారాలని. కొండపై మహిమానుభవాలు వచ్చిపోతాయి,
కానీ లోయలో జీవించే ప్రతిరోజూ నిజమైన విశ్వాసం ఏమిటో పరీక్షించబడుతుంది.
ఆ పరీక్షలో నిలబడేది నిజమైన, సజీవమైన, ఆవగింజంత
విశ్వాసమే.
5. సమకాలీన అన్వయం — నేటి విశ్వాసికి ఈ వాక్యం ఏం చెబుతుంది?
మనలో చాలామంది ఆ
తండ్రిలా ఉన్నాం. ఇంట్లో ఎవరో ఒకరు
వ్యసనంతో, అనారోగ్యంతో, నిరాశతో,
కుటుంబ కలహాలతో బాధపడుతుంటే, ఎన్నో వైద్యాలు,
సలహాలు ప్రయత్నించి కూడా పరిష్కారం దొరకక అలసిపోయి ఉంటాం. ఈ కథ మనకు
గుర్తుచేసేది, ఏమిటంటె మానవ ప్రయత్నాలు
విఫలమైనచోటే యేసు ప్రభువుని జోక్యం
మొదలవుతుంది. ఆయన ముందు మోకరిల్లి "ప్రభూ, కరుణించు"
అని మొరపెట్టుకోవడమే మొదటి అడుగు.
మరికొందరు మనలో
శిష్యుల్లా ఉన్నాం. సేవ చేయాలని ఆసక్తి
ఉన్నా, గతంలో అనుభవం ఉన్నా, ఏదో ఒక సందర్భంలో మన ప్రయత్నం ఫలించదు.
అలాంటప్పుడు నిరుత్సాహపడకుండా, యేసు ప్రభువు వద్దకు వెళ్ళి "నేను ఎందుకు విఫలమయ్యాను?"
అని అడగడం నేర్చుకోవాలి. జవాబు ఒక్కటే, నా స్వంత శక్తిపైనా, పద్ధతులపైనా
ఆధారపడుతున్నానా, లేక దేవునిపై నిజమైన నమ్మకంతో ముందుకు
వెళ్తున్నానా అని పరిశీలించుకోవడం.
ప్రార్థన మరియు
ఉపవాసం గురించి యేసు ప్రభువు (మార్కు
సువార్త ప్రకారం) ప్రస్తావించడం కూడా ఆచరణాత్మక సూచన. కొన్ని ఆధ్యాత్మిక పోరాటాలు ప్రార్థనతోనే
గెలవబడవు. అవి అంకితభావం, నిరంతర
ప్రార్థన, శరీరాక కోరికలను వీడి, ఆత్మను బలపరిచే ఉపవాసం ద్వారా మాత్రమే
జయించబడతాయి. ఇది ప్రత్యేకించి కుటుంబంలో దీర్ఘకాలిక సమస్యలు, వ్యసనాలు, మానసిక వేదన, సంబంధాల విచ్ఛిన్నత వంటివి,
ఎదుర్కొంటున్న విశ్వాసులకు ఆచరణాత్మక మార్గదర్శకం.
ప్రార్థన:
ప్రభువా! మీ అనంతమైన
కరుణకు వందనములు. మా బలహీనతలు, అల్పవిశ్వాసము మా జీవితంలోని సమస్యలను
చూసి మేము కృంగిపోకుండా, మీపై సంపూర్ణంగా ఆధారపడే కృపను
ప్రసాదించండి. "నేను నమ్ముచున్నాను, నా అవిశ్వాసము లేకుండునట్లు నాకు
తోడ్పడుము" అని మొరపెట్టిన ఆ తండ్రిలాగే మేము కూడా నీ పాద సన్నిధిలో
ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాల్లోని రోగాలు, వ్యసనాలు,
శోధనలు మరియు ఆధ్యాత్మిక పోరాటాల నుండి మాకు విడుదల దయచేయండి. మాలో
ఆవగింజంత సజీవమైన విశ్వాసమును రగిలించి, అనుదిన ప్రార్థన
మరియు ఉపవాసము ద్వారా మీ శక్తితో కలసి జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment