అధికారంతో పలికిన మాట - కఫర్నాములో యేసు (లూకా 4:31-37)
లూకా సువార్త 4:31-37
పిదప ఆయన గలిలీయసీమలోని కఫర్నామునకు వచ్చి, విశ్రాంతిదినమున ప్రజలకు బోధించు చుండెను. ఆయన బోధకు వారందరు ఆశ్చర్య పడిరి. ఏలయన, ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను. ఆ ప్రార్థనామందిరములో దయ్యముపట్టిన వాడొకడు కేకలువేయుచు, “ఆహా! నజరేతు నివాసియగు యేసూ! మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి” అని అరచెను.“నోరు మూసుకుని వీనినుండి వెడలిపొమ్ము” అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వానిని విలవిల లాడించి వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయెను. ఇది చూచి జనులందరు ఆశ్చర్యపడి “ఇతడు అధికారముతోను, శక్తితోను, అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగనే అవి వెడలిపోవుచున్నవి” అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. అపరిసరములందంతట ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను.
“ఆయన బోధకు వారందరు ఆశ్చర్య పడిరి. ఏలయన, ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను.”- లూకా 4:32
నజరేతు తన సొంత ఊరు. అక్కడ ప్రజలు ఆయనను కొండ అంచు వరకూ తీసుకెళ్ళి తోసివేయాలని చూశారు. తనను పెంచిన వీధులు, తాను నడయాడిన ప్రార్ధనామందిరం, తనను చిన్నతనం నుండి ఎరిగిన మనుషులు, వీరందరూ ఆయనను తిరస్కరించారు. ఆ తిరస్కరణ తరువాత యేసు ప్రభువు , కఫర్నాముకు వెళ్ళాడు. తిరస్కారణ తరువాత యేసు ప్రభువు విశ్రమించడానికి కాని, మౌనంగా గాయాన్ని నొక్కుకుంటూ దాక్కోవడానికి కాని వెళ్లలేదు, తన పనిని ఆపకుండా మరో ఊరిలో, మరో ప్రార్ధనామందిరంలో, మళ్ళీ బోధించడానికి ప్రభువు వెళ్ళాడు, యేసు ప్రభువుకు మనుషులు ఎలా ఆయనతో ప్రవర్తించినది, ముఖ్యం కాదు తన రక్షణ కార్యం తండ్రి చిత్తము నెరవేర్చడమే ముఖ్యం. ఇది మన మొదట ప్రభువు నుండి మనం నేర్చుకోవాలి. తిరస్కరణ దేవుని పిలుపును ఆపలేదు; అది కేవలం దాని వేదికను మాత్రమే మార్చింది.
కఫర్నాము ఒక చిన్న మత్స్యకార పట్టణం, గలిలయ సముద్రం ఒడ్డున ఉంది. వాణిజ్యం, రవాణా, భిన్న సంస్కృతుల కలయిక ఉన్న చోటు, రోమా సైనిక స్థావరానికి దగ్గరలో ఉన్న సందడిగా ఉండే పట్టణం. కాని నజరేతు కొండ ప్రాంతంలో, చిన్న గ్రామం అయిన కఫర్నాము తెరిచిన ద్వారం లాంటిది, రాకపోకలు, వర్తకులు, భిన్న మనుషులు నిత్యం కలిసే చోటు. యేసు ప్రభువు పరిచర్యకు ఈ తెరిచిన ద్వారాన్నే ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. మూసుకుపోయిన హృదయాల కంటే తెరిచిన హృదయాల మధ్యే సువార్త వేగంగా వ్యాపిస్తుంది.
"అక్కడ యేసు ప్రభువు విశ్రాంతిదినాన సమాజమందిరానికి వెళ్ళి బోధించడం మొదలుపెట్టాడు. ఇది సాధారణ దృశ్యమే, ఒక యూదుడు, విశ్రాంతిదినాన, ప్రార్థనామందిరంలో లేఖనం వివరిస్తున్నాడు. కానీ ఏదో అసాధారణమైనది జరిగింది. ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే ఆయన అధికారపూర్వకముగా బోధిస్తున్నాడు.
అధికారం
ఆనాటి
పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వారి బోధనలో ఎప్పుడూ
ఒక దొరణిని ఉపయోగించేవారు. అది ఎలా అంటే ఈ
రబ్బీ ఇలా చెప్పారు,పూర్వీకుల సంప్రదాయం ప్రకారం ఇలా ఉంది, అనే వారు. వారి మాటలకు ఎప్పుడూ మరొకరి మాట భరోసాగా ఉండేది. వారి అధికారం అరువు తెచ్చుకున్నది,
సంప్రదాయం మీద ఆధారపడినది. యేసు ప్రభువు అలా చేయలేదు. ఆయన నేరుగా మాట్లాడాడు, తనలో నుండి, తన స్వంత గుర్తింపు నుండి తన స్వంత జ్ఞానము
నుండి చెప్పారు. మీరు వినియున్నారు.కాని నేను మీతో చెప్పునది ఏమన .. నేను మీతో
చెప్పుచున్నాను అని ప్రభువు మాటలు
ఉండేవి.
నిజమైన
ఆధ్యాత్మిక అధికారం అనేది స్వరం యొక్క గట్టిదనం కాదు, పదవి
యొక్క ఎత్తు కాదు, పాండిత్యం యొక్క లోతు కాదు. అది జీవం
నుండి పుడుతుంది. యేసు ప్రభువు మాటలు
ప్రజల చెవులను తాకడమే కాదు, వారి హృదయాలను
కదిలించాయి, ఎందుకంటే ఆ మాటలు ఆయన ఎవరో దానికి
ప్రతిబింబంగా ఉన్నాయి. మాట, జీవితం రెండూ ఒకటిగా ఉన్నాయి.
ధర్మశాస్త్ర
పండితులు, గ్రంధాలలో,
చర్చల్లో తమ అధికారాన్ని కూర్చుకున్నారు. యేసు ప్రభువు ఎడారిలో,
ఏకాంతంలో, ప్రార్థనలో తన అధికారాన్ని పొందాడు. ఈ
వ్యత్యాసం సూక్ష్మంగా అనిపించినా అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే గ్రంథాలయంలో సంపాదించే జ్ఞానం మాటలను
సానపెడుతుంది, కానీ ఏకాంతంలో దేవునితో గడిపే సమయం
మాత్రమే మాటలకు జీవాన్ని ఇస్తుంది.
ఇది
బోధించే ప్రతి ఒక్కరికీ, తల్లిదండ్రులకు,
గురువులకు, ఒక ప్రశ్న వేస్తుంది: మన మాటలకు వెనుక
ఏముంది? పదాలు మాత్రమేనా, లేక
వాటి వెనుక జీవించిన సత్యం ఉందా?"
ఇంటిలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలకు వందసార్లు ఉపదేశాలు చెప్పవచ్చు, కానీ ఆ మాటలు వారి సొంత జీవితంలో కనిపించనప్పుడు అవి గాలిలో కలిసిపోతాయి. దీనికి భిన్నంగా, ఒక తల్లి తన స్వంత జీవితంలో క్షమాపణను, ఓర్పును, ప్రార్థనను ఆచరిస్తూ ఉంటే, ఆమె పలికే ఒక్క మాట కూడా పిల్లల హృదయంలో లోతుగా నాటుకుంటుంది. అధికారం అంటే గొంతు హెచ్చించడం కాదు; అది జీవించిన సాక్ష్యం నుండి పుట్టేది.
పవిత్ర స్థలంలో దాగిన అంధకారం
ఆ ప్రార్థనామందిరంలో, ఆరాధన మధ్యలో, ఊహించని ఒక అంతరాయం వచ్చింది.
దయ్యముపట్టిన ఒక వ్యక్తి పెద్దగా కేకలువేశాడు. ఇది గమనించదగినది. అతను ప్రార్థనామందిరం బయట కాదు, లోపలే ఉన్నాడు. బహుశా చాలా కాలంగా ఆ సమాజంలో సభ్యుడిగా, తన బాధను దాచుకుంటూ, ఆరాధనలో పాల్గొంటూ కూర్చుని ఉండేవాడేమో.
యేసు ప్రభువు వచ్చేవరకూ ఎవరూ ఆ అంతర్గత
బంధనాన్ని గుర్తించలేదు.
ఇది మనకు ఒక సున్నితమైన సత్యాన్ని
బోధిస్తుంది. పవిత్ర స్థలంలో ఉండటం
మాత్రమే మనలను నయం చేయదు. చర్చికి వెళ్ళడం, ప్రార్థనలు
వల్లించడం, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం,
ఇవన్నీ మంచివే, అవసరమైనవే, కానీ
ఇవి మాత్రమే హృదయంలోని లోతైన గాయాలను నయం చేయలేవు. దేవుని సన్నిధి వచ్చినప్పుడే దాగిన వాస్తవం వెలుగులోకి
వస్తుంది. సిలువ యోహాను చెప్పినట్టు, ఆత్మ దేవుని
వెలుగుకు దగ్గరవుతున్న కొద్దీ, తనలోని అంధకారం మరింత స్పష్టంగా
కనిపిస్తుంది. అది కొత్తగా వచ్చిన అంధకారం
కాదు, ఎప్పటినుండో అక్కడే ఉన్నది, వెలుగు రాకముందు
కనిపించనిది మాత్రమే.
కాబట్టి
ఎవరైనా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు తమలో అణచివేయబడిన భయాలు, పాత గాయాలు, ఒప్పుకోలేని అలవాట్లు పైకి తేలితే,
అది వైఫల్యం కాదు. అది ప్రారంభం. వెలుగు వచ్చినప్పుడే చీకటి
కనిపిస్తుంది; అది వెలుగు యొక్క దోషం కాదు, దాని బహుమానం.
అపవిత్రాత్మ యేసు ప్రభువును, నజరేతు నివాసియగు యేసూ! మాతో నీకేమి పని?
మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను
ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని చెబుతుంది. ఆ ఊరి ప్రజలు, ఆ
మతపెద్దలు యేసు ప్రభువుని నిజస్వరూపాన్ని
ఇంకా పూర్తిగా గ్రహించలేదు; కానీ అపవిత్రాత్మ తక్షణమే గుర్తించింది. జ్ఞానం ఒక్కటే సరిపోదు అనే సత్యం ఇక్కడ
కనిపిస్తుంది. ఆ ఆత్మకు యేసు ఎవరో తెలుసు, కానీ ఆ తెలివి, ఆ జ్ఞానం దానికి విధేయతను తీసుకురాలేదు. అది ఇంకా ఎక్కువగా ప్రతిఘటనకు దారితీసింది.
దేవుని గురించి తెలుసుకోవడం వేరు, దేవునికి లోబడటం వేరు. ఒక వ్యక్తి బైబిలును కంఠస్థం చేయవచ్చు,
లోతుగా చదవవచ్చు, ప్రతి సిద్ధాంతాన్ని వివరించవచ్చు, కానీ తన జీవితాన్ని క్రీస్తుకు అప్పగించకపోతే,
ఆ జ్ఞానం అతనిని మార్చదు.
విశ్రాంతిదినపు నిజమైన అర్థం
ఈ సంఘటన విశ్రాంతిదినాన జరగడం కూడా అర్థవంతమైనది. యూదుల సంప్రదాయంలో సబ్బాతు అంటే విశ్రాంతి దినం. కానీ యేసు ప్రభువు ఆ దినాన బోధించడమే కాదు, ఒక బంధిత మనిషిని విడుదల చేశాడు. దీని ద్వారా ఆయన సబ్బాతుకు దాని నిజమైన అర్థాన్ని పునరుద్ధరిస్తున్నాడు, విశ్రాంతి అంటే కేవలం చేతులు ఆపడం కాదు, అది బంధనాల నుండి విముక్తి. నిజమైన విశ్రాంతి దేవునిలో మాత్రమే లభిస్తుంది, మరియు ఆయన ఆ విశ్రాంతిని ఇవ్వడానికే వచ్చాడు.
రెండు రాజ్యాల ఘర్షణ
దయ్యం అడిగిన ప్రశ్నలో ఒక సత్యం దాగి
ఉంది. మమ్ము నాశనము చేయవచ్చితివా? అని అడుగుతుంది.
యేసు ప్రభువు రాకడతో రెండు
రాజ్యాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది, అది వెలుగు రాజ్యం, చీకటి
రాజ్యం. ఈ ఘర్షణలో అవి రెండూ సమాన శక్తులు కావు. దేవుడు, సాతాను
ఒకదానికొకటి ప్రత్యర్థులుగా బైబిలు చూపదు; దేవునికి
సరిసమానమైన శక్తి దానికి లేదు. అందుకే యేసు ప్రభువు ఒక్క ఆజ్ఞతోనే ఆ ఆత్మను వెళ్లగొట్టాడు.
అరణ్యంలో
వ్యక్తిగతంగా శోధింపబడిన యేసు ప్రభువు, ఇప్పుడు బహిరంగంగా,
ప్రజల మధ్య చీకటి శక్తిని ఎదుర్కొంటున్నాడు. దేవుని రాజ్యం వచ్చిన
చోట, చీకటి రాజ్యం తప్పకుండా వెనుకంజ వేయాలి.
ఒక్క మాట, పరిపూర్ణ అధికారం
యేసు ప్రభువుని స్పందన ఎంత సాధారణముగా ఉందో గమనించండి, నోరు మూసుకుని వీనినుండి వెడలిపొమ్ము. ఎటువంటి పెద్ద ప్రార్థన లేదు, ఆచారబద్ధమైన
క్రతవులు లేవు. ఆనాటి యూద సంప్రదాయంలో
దయ్యాలను వెళ్లగొట్టేవారు తరచుగా పేర్లు, వస్తువులు,
సుదీర్ఘమైన ప్రార్ధనలు ఉపయోగించేవారు. యేసు ప్రభువుకు వాటి అవసరం లేదు.
ఆయన ఒక్క మాట పలికిన అది వెంటనే కార్యరూపం
దాల్చుతుంది.
మనం
మన సొంత జీవితాల్లో దీనిని అన్వయించుకోవచ్చు. మనలోని భయాలను, పాత గాయాలను, పదేపదే వెంటాడే పాపపు అలవాట్లను
జయించడానికి మనకు పెద్ద తంత్రాలు అవసరం లేదు. అవసరమైనది యేసు ప్రభువుని నామంలో స్పష్టంగా, నిశ్చయంగా
నిలబడటం. నీవు ఇక ఇక్కడ ఉండకూడదు అని
చెప్పగల ధైర్యం, అది మన సొంత శక్తి నుండి
రాదు, ఆయన అధికారం నుండి వస్తుంది.
ప్రభువుని వాక్కే కార్యము
ఆదిలో
సృష్ఠి జరిగినప్పుడు, దేవుడు కేవలం తన వాక్కు ద్వారానే మొత్తం చేస్తాడు. ఇది జరుగుగాక
అనగానే అది జరుగుతుంది, ఇక్కడ
వాక్కు , కార్యము వేరు వేరు కాదు, అలానే యేసు ప్రభువు మాట పని వేరు వేరు కాదు. యేసు ప్రభువుని మాటలు బోధన కాదు, అవి కార్యాలు. కేవలం బోధన మాత్రమే ఉంటే అది సిద్ధాంతంగా, ఉపన్యాసంగా
మిగిలిపోతుంది. కేవలం అద్భుత కార్యాలు మాత్రమే ఉంటే, అవి
అర్థం లేని ఆశ్చర్యంగా మిగిలిపోతాయి. యేసు ప్రభువులో సత్యం ప్రకటించడం, ఆ సత్యం యొక్క శక్తిని జీవితంలో చూపించడం రెండూ ఒకటిగా కలిసిపోతాయి.
హాని లేని విడుదల
లూకా సువార్తికుడు ఒక చిన్న వివరణను జోడిస్తాడు అది ఏమిటంటె, దయ్యం ఆ వ్యక్తిని విలవిలలాడించింది, కానీ వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయింది. వైద్యుడైన లూకా ఫలితాలను జాగ్రత్తగా గమనించే తత్వం
ఇక్కడ కనిపిస్తుంది. కానీ దీని ఆధ్యాత్మిక అర్థం మరింత లోతైనది. దుష్టశక్తి తన చివరి క్షణంలో కూడా బాధించే
ప్రయత్నం చేసినా, అది యేసు ప్రభువు నియంత్రణను దాటి వెళ్ళలేదు. యోబు గ్రంథంలో
సాతాను దేవుని అనుమతి లేకుండా యోబును తాకలేకపోయినట్టే, ఇక్కడ
కూడా ప్రతిదీ యేసు ప్రభువు అధికారం
క్రిందే జరిగింది.
ఇది మనకు ఒక గొప్ప ఓదార్పు. మన జీవితంలో పోరాటం కొన్నిసార్లు తీవ్రంగా, బాధాకరంగా అనిపించవచ్చు, పాత అలవాటును వదిలిపెట్టడం, క్షమించడం, ఒక సంబంధం నుండి బయటపడటం, భయాన్ని ఎదుర్కోవడం, ఈ ప్రక్రియ సాఫీగా సాగకపోవచ్చు, అంతరంగంలో కొన్ని కుదుపులు కలిగించవచ్చు. కానీ చివరికి, యేసు ప్రభువు అనుమతి లేకుండా అది మనలను శాశ్వతంగా నాశనం చేయలేదు. “వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయెను,” అనే వాక్యం మనకు హామీ ఇస్తుంది. విముక్తి ప్రక్రియ బాధాకరంగా అనిపించినా, దాని ముగింపు నాశనం కాక స్వేచ్ఛను ఇస్తుంది.
అపవిత్రాత్మ- మానసిక ఆరోగ్యం
దయ్యం
పట్టడం అనే వర్ణన నిజమైన ఆధ్యాత్మిక వాస్తవికతను
సూచిస్తుంది, కానీ నేటి ప్రతి మానసిక సంఘర్షణను,
ప్రతి భయాన్ని, డిప్రెషన్‌ను, ఆందోళనను
దానితో సమానంగా చూడటం సరైనది కాదు. సువార్త రచయితలు కూడా జ్వరాన్ని, రోగాలను, దయ్యం పట్టడాన్ని వేర్వేరు వర్గాలుగా
చూశారు, అన్నింటినీ ఒకేలా కలిపేయలేదు.
కాబట్టి ఎవరైనా తీవ్రమైన మానసిక సంఘర్షణతో, భయంతో, వ్యసనంతో పోరాడుతుంటే, దానిని కేవలం ఆధ్యాత్మిక సమస్యగా చూడకుండా, అవసరమైతే వైద్యులను, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం తప్పు కాదు, అది కూడా దేవుడు మనకు ఇచ్చిన సహాయమే. ప్రార్థన, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, వైద్య సహాయం, ఇవన్నీ ఒకదానికొకటి విరోధులు కావు; ఇవి మనిషిని సంపూర్ణంగా బాగుచేయడానికి పనిచేస్తాయి. ఆధ్యాత్మిక వివేచనతో పాటు, శాస్త్రీయ, వైద్యపరమైన అవగాహనను గౌరవించడం విశ్వాసానికి వ్యతిరేకం కాదు, అది కూడా దేవుడు మనుషులకు ఇచ్చిన బుద్ధి, జ్ఞానం ద్వారా వచ్చిన బహుమానమే.
మౌనం అనే ఆజ్ఞ
యేసు ప్రభువు
దయ్యాన్ని కేవలం వెళ్లగొట్టడమే కాదు,
ముందుగా మౌనంగా ఉండమని ఆజ్ఞాపించాడు. ఆ దయ్యము చెప్పింది సత్యమే, నీవు దేవుని పవిత్రమూర్తివి అనేది
తప్పు కాదు. కానీ యేసు ప్రభువు ఆ
సాక్ష్యాన్ని అంగీకరించలేదు. ఎందుకు? ఎందుకంటే సత్యం
ఎవరి నోటి నుండి వస్తుందో అది కూడా ముఖ్యమే. చెడు మూలం నుండి వచ్చిన సత్యం కూడా
మంచి ప్రయోజనాన్ని నెరవేర్చదు; అది గందరగోళాన్ని, తప్పుడు
ప్రచారాన్ని సృష్టించగలదు. యేసు ప్రభువు తన
గుర్తింపును తానుగా, తగిన సమయంలో, తగిన
విధంగా వెల్లడించాలనుకున్నాడు, దయ్యాల ద్వారా ప్రచారం కాదు.
ఇది మనకు వివేచన యొక్క ప్రాముఖ్యతను
గుర్తుచేస్తుంది. మనం వినే ప్రతి మాట, చదివే ప్రతి
సందేశం సరైనదిగా అనిపించినా, దాని మూలాన్ని, దాని
ఉద్దేశాన్ని పరిశీలించడం అవసరం. సిలువ యోహాను ఆధ్యాత్మిక అనుభవాల విషయంలో ఇదే
హెచ్చరిక చేస్తాడు, ప్రతి ఆధ్యాత్మిక అనుభూతి దేవుని నుండి వచ్చినదని
అనుకోకూడదు; ఆత్మ నిజమైన విశ్వాసం, వినయం, సంఘపు మార్గదర్శకత్వం ద్వారా
పరీక్షించబడాలి.
యేసు ప్రభువు తన గుర్తింపును జనాదరణ ద్వారా కాకుండా, తండ్రితో తనకున్న సంబంధం ద్వారా స్థాపించుకున్నాడు. నిజమైన ఆధ్యాత్మిక అధికారం లోకం మెచ్చుకోలు మీద ఆధారపడదు; అది దేవుని ముందు నిజాయితీగా నిలబడటం మీద ఆధారపడుతుంది.
నేటి అపవిత్రాత్మలు
ప్రతి
తరానికి తనదైన బంధనాలు ఉంటాయి. నేటి
మనుషులను బంధించే శక్తులు కూడా వేరే రూపాల్లో కనిపిస్తాయి. నిరంతర భయం, తీర్చుకోలేని
అసూయ, వదులుకోలేని వ్యసనం, తనను తాను నిరంతరం తక్కువగా చూసుకునే
అలవాటు, క్షమించలేని పాత గాయం, సోషల్ మీడియా వేదికల మీద నిరూపించుకోవాల్సిన ఒత్తిడి. వీటన్నింటినీ దయ్యాలని పిలవాల్సిన అవసరం లేదు, కానీ అవి కూడా అదే విధంగా పనిచేస్తాయి, మనిషిని తనలో బంధించి,
అతని నిజ స్వరూపాన్ని కనిపించకుండా చేస్తాయి.
యేసు ప్రభువు నేటికీ అదే అధికారంతో ఉన్నాడు. ఆయన ఆ ఆత్మతో మాట్లాడినట్టుగానే, మన భయాలతో, మన బంధనాలతో మాట్లాడగలడు. అయితే ఈ మాట మనం వినాలంటే, ముందుగా మనం ఆయన సన్నిధిలో నిలబడాలి, ఆ ప్రార్థనామందిరంలో ఉన్న మనిషిలా, తనను తాను దాచుకోకుండా, తన నిజస్థితిని ఒప్పుకోవాలి.
వార్త వ్యాపించింది
ప్రజలు ఆశ్చర్యపడి, ఈ సంగతిని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, ఆ
సమాచారం చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వ్యాపించింది. ఆశ్చర్యం విశ్వాసానికి మెట్టు
కావచ్చు, కానీ అదే విశ్వాసం కాదు.
దేవుని కార్యం రహస్యంగా ఉండదు. ఒక హృదయం నిజంగా విముక్తి పొందినప్పుడు, ఒక జీవితం నిజంగా మార్పు చెందినప్పుడు, ఆ సాక్ష్యం దానంతట అదే వ్యాపిస్తుంది. మనం గొప్పగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు; నిజాయితీగా జీవించిన విశ్వాసమే మాట్లాడుతుంది.
సంఘం బాధితులను ఎలా చూడాలి
మనిషిని కేవలం ఒక సమస్యగా చూడకూడదు.
అతను ఒక మనిషి తన సొంత పేరు, తన సొంత కుటుంబం, తన
సొంత చరిత్ర కలిగిన వ్యక్తి, సంవత్సరాలుగా బంధనంలో బాధపడుతూ, బహుశా సమాజం అతనిని దూరం పెట్టి ఉండవచ్చు. యేసు ప్రభువు అతనిని మొదట గద్దించడు, తీర్పు
తీర్చడు; ఆయన అతనిని విడుదల చేయడానికే వచ్చాడు.
సంఘం కూడా ఇదే మనోభావాన్ని కలిగి ఉండాలి. వ్యసనంతో, భయంతో, పాత పాపంతో పోరాడుతున్న వ్యక్తులను సంఘం దూరం పెట్టకూడదు, వారిని సమస్యలుగా ముద్రవేయకూడదు. వారు గౌరవం, ప్రేమ, ఓపిక, ప్రార్థన అవసరమైన దేవుని పిల్లలు. యేసు ప్రభువు ఆ ప్రార్థనామందిరంలో మొదట ఆ మనిషి విముక్తినే కోరుకున్నాడు, సంఘం కూడా తీర్పు చెప్పే వేదికగా కాకుండా, స్వస్థత, విముక్తి లభించే ఆశ్రయంగా ఉండాలి.
ముగింపు
ఈ చిన్న సంఘటన కేవలం పురాతన అద్భుత కథ
కాదు. ఇది యేసు ప్రభువు ఎవరు? అనే ప్రశ్నకు జీవం కలిగిన సమాధానం. ఆయన అధికారంతో బోధించే గురువు,
పవిత్రుడు, చెడుపై సంపూర్ణ ఆధిపత్యం కలిగిన ప్రభువు,
బంధితులను నాశనం చేయకుండా విడుదల చేసే రక్షకుడు. నజరేతు ఆయనను
తిరస్కరించింది, అపవిత్రాత్మ ఆయనను ప్రతిఘటించింది, కానీ
ఏదీ ఆయన పరిచర్యను ఆపలేదు. ఆయన ముందుకు సాగుతూనే ఉన్నాడు, బాధపడేవారికి
విడుదల, వెతుక్కునేవారికి సత్యం, భయపడేవారికి ధైర్యం ఇస్తూనే ఉన్నాడు.
మన జీవితంలో ఎలాంటి బంధనం ఉన్నా, ఎంతకాలంగా అది దాగి ఉన్నా, ఆయన మాటకు
ఇప్పటికీ అదే అధికారం ఉంది. అవసరమైనది కేవలం ఆయన సన్నిధిలో నిలబడటం, ఆయన పలికే మాట మనలను స్వతంత్రులను చేయగలదు.
ప్రార్ధన
ప్రభువా! నా జీవితానికి నీవే అధిపతివై యుండుము. నా
హృదయంలో దాగి ఉన్న ప్రతి భయాన్ని, ప్రతి పాత గాయాన్ని నీ వెలుగు ముందుకు
తీసుకురమ్ము. నేను నిన్ను గురించి తెలుసుకోవడంతో ఆగిపోకుండా, ప్రతిదినం నీకు లోబడే హృదయాన్ని నాకు అనుగ్రహించుము. నీ మాటకున్న
అధికారముతో నా జీవితంలోని ప్రతి బంధనం నుండి
విడుదల దయచేయుము. నన్ను తిరస్కరించిన చోట్ల కూడా ముందుకు సాగే ధైర్యాన్ని, బాధపడుతున్న సోదర సోదరీమణులను గౌరవంతో, ప్రేమతో
చూసే హృదయాన్ని నాకు అనుగ్రహించుము. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment