సున్నముకొట్టిన సమాధులు - మత్తయి 23:27-32 వ్యాఖ్యానం| కార్మెల్ శోభ
మత్తయి 23:27-32
అయ్యో! కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా!
పరిసయ్యులారా! మీరు సున్నము కొట్టిన సమాధులవలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను,
లోపల మృతుల ఎముకలతోను, దుర్గంధ
పదార్దముతోను నిండియుండును. అటులనే
మీరును బయటకు నీతిమంతులవలె కనపడినను, లోపల కపటముతోను,
కలుషముతోను నిండియున్నారు. “అయ్యో! కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా! పరిసయ్యులారా! మీరు
ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను
నిర్మింతురు. 'మా పితరుల కాల
మందు మేము జీవించియున్నయెడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండెడి
వారము కాము' అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి
వారసులమని మీకు మీరే రుజువుచేసికొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తిచేయుడు.
సున్నముకొట్టిన సమాధులు
మత్తయి సువార్త 23వ అధ్యాయములో యేసు ప్రభువు యెరూషలేము దేవాలయములో, తన శ్రమల వారమునకు కొద్ది దినముల ముందు, బహిరంగముగా పలికిన అత్యంత తీక్షణమైన బోధలలో ఒకటి. ధర్మశాస్త్ర ఉపదేశకులను, పరిసయ్యులను ఉద్దేశించి ఆయన వరుసగా ఏడు "అయ్యో" అను వాక్యములు (Woes) పలుకుతారు. ఈ సువిశేష భాగములో ఆరవ, ఏడవ "అయ్యో" అయ్యో అనే పదాలను కలిగియున్నవి. "సున్నముకొట్టిన సమాధుల" ఉపమానము, మరియు ప్రవక్తల సమాధులు కట్టు కపటభక్తి. ఈ రెండు చిత్రముల ద్వారా యేసు ప్రభువు ఒకే సత్యమును బోధించుచున్నాడు. అది ఏమిటంటె బాహ్యముగా భక్తిపరులవలె కనిపించుట మాత్రమే సరిపోదు; దేవుడు హృదయమును చూచువాడు. కనుక హృదయమును శుద్ది చేసుకొనవలెను.
I. దైవ వాక్య కోణం
1. మూలపాఠము మరియు స్థానము
ఈ వచనములు యేసు ప్రభువు బోధన లేక పరిచర్య
ముగింపు దశలో, ఆయన శ్రమల పొందే
ముందు బోధించినది.
ఇది కేవలము యాదృచ్ఛికము కాదు, దేవాలయ
నాయకత్వముపై విమర్శ నుండి దేవాలయ నాశన ప్రవచనమునకు మత్తయి సువార్తికుడు నడిపించు వేదిక ఇది.
2. "అయ్యో" వాక్యముల రూపము
"అయ్యో" అను పదము పాతనిబంధన ప్రవక్తల ప్రవచనములలో సుపరిచితమైనది (యెషయా 5:8-23; హబక్కూకు 2:6-19). యేసు ప్రభువు
ఈ ప్రవచనాత్మక శైలిలో, తానే అంతిమ
ప్రవక్తగా, న్యాయాధిపతిగా మాట్లాడుచున్నాడు. ఇది వ్యక్తిగత
ఆగ్రహ ప్రకటన కాదు, ప్రేమతో కూడిన దైవ న్యాయనిర్ణయ ప్రకటన.
3. సమాధుల ఉపమానము - ధర్మశాస్త్ర నేపథ్యము
యూదుల ఆచారము ప్రకారము, పాస్క పండుగకు వచ్చు యాత్రికులు అపవిత్రత చెందకుండ ఉండుటకు, సమాధులను
సున్నముతో తెల్లగా చేయు ఆచారము ఉంది. (సంఖ్యాకాండము 19:11-16 ప్రకారము
శవమును తాకిన వారు ఏడు దినములు అపవిత్రులగుదురు). ఈ సున్నపు పూత వలన అవి దూరముగా కూడా యాత్రికులుకు కనిపించి, వారు సమాధిని తాకకుండ, అపవిత్రులు కాకుండ ఉండుటకు ఉపయోగపడేవి.
యేసు ప్రభువు ఉపయోగించిన ఈ ఉపమానము యూదుల
మతాచార నేపథ్యమునకు అత్యంత సన్నిహితమైనది.
4. అంతరార్థపు వైరుధ్యము
ఈ వచనము
యొక్క కేంద్ర బిందువు "బయట-లోపల" అనే ద్వంద అర్ధం కలిగి
ఉంది.
బయట: తెల్లగా అందముగా ఉంటుంది. తెలుపు, అనేది నీతిమంతుని రూపము.
లోపల: మృతుల ఎముకలు, "సమస్త
అపవిత్రత" ఉంటుంది. ఇది కేవలము
శారీరక అపవిత్రతను మాత్రమే కాక నైతిక, ఆధ్యాత్మిక భ్రష్టత్వమును
సూచిస్తుంది.
ఒకే వ్యక్తిలో రెండు రకాల రూపాలును ఇది చూపిస్తుంది. బయట కనపడేది, లోపల ఉండేది
ఒకటి కాదు. బయట అత్యంత శుద్ది చేయబడినట్లు ఉన్న లోపల అంతయు అశుద్దమే.
5. ప్రవక్తల సమాధులు 29-31 వచనములు
పరిసయ్యులు ప్రవక్తల సమాధులను అలంకరించుచు, "మా పితరుల
కాలమందు మేము జీవించియున్నయెడల ప్రవక్తలను చంపుటలో భాగస్థులమై యుండెడివారము
కాము" అని చెప్పుదురు. ఇక్కడ యేసు ప్రభువు ఒక వ్యంగ్యోక్తిని ఉపయోగిస్తున్నాడు. వారు తమను తాము పితరుల పాపము నుండి
వేరుపరచుకొనుటకు ప్రయత్నించుచున్నను, తమ మాటలచేతనే తాము
"ప్రవక్తలను చంపినవారి కుమారులము" అని ఒప్పుకొనుచున్నారు.
1. పరిసయ్యుల నేపథ్యము
పరిసయ్యులు క్రీ.పూ. 2వ
శతాబ్దములో ఉద్భవించిన సంస్కరణోద్యమము. వారు మౌఖిక ధర్మశాస్త్రమును కఠినముగా
పాటించువారు, మందిరములలో బోధకులుగా, సామాన్య
ప్రజల మధ్య నైతిక మార్గదర్శకులుగా గౌరవింపబడేవారు. వారి ఉత్సాహము కాలక్రమేణా బాహ్య
ఆచారములపై కేంద్రీకృతమై, అంతరంగిక శుద్దిని నిర్లక్ష్యము
చేయుటకు దారితీసింది.
2. దేవాలయ రాజకీయ నేపథ్యము
యేసు ప్రభువు
మతనాయకుల అధికారమును బహిరంగముగా సవాలు
చేయుట, రోమా పాలనలో సున్నితమైన సమతూకముతో మనుగడ సాగించుచున్న
యూదా నాయకత్వమునకు యేసు ప్రభువు ఒక ముప్పుగా
కనపడ్డాడు. అలా కనుబడటానికి యేసు ప్రభువు మాటలు కారణము అయ్యాయి.
3. ప్రవక్తల హత్యల చరిత్ర
యేసు ప్రభువు ప్రస్తావించిన "ప్రవక్తలను చంపుట" అనేది పాతనిబంధన చరిత్రలో వాస్తవముగా జరిగిన
సంఘటనలను సూచించుచున్నది. జెకర్యా ప్రవక్త హత్య (2 రాజుల దినచర్య 24:20-22), ఏలీయా
కాలములో ప్రవక్తలను హింసించుట (1 రాజులు 19:10) వంటివి.
మత్తయి 23:35లో "ఆబెలు రక్తము మొదలుకొని జెకర్యా రక్తము
వరకు" అను ప్రస్తావన, పవిత్ర గ్రంధములో ఎలా నీతి మంతులను, ప్రవక్తలను వారు హింసించినది
చూపిస్తుంది.
4. క్రీ.శ. 70 దేవాలయ నాశనముతో సంబంధము
మత్తయి సువార్తను క్రీ.శ. 70 తరువాతనే అందుబాటులోనికి వచ్చినది, అప్పటికి దేవాలయం
రోమా సేనల చేత నాశనం చేయబడింది. కావున వారికి ఈ "అయ్యో" వాక్యములు, తరువాత
సంభవించిన చారిత్రక విషాదమునకు ప్రవచనాత్మక ముందస్తు హెచ్చరికగా అర్ధం అయ్యింది.
III. వివరణాత్మక కోణము
1. మత్తయి-లూకా పోలిక
ఇదే బోధన లూకా 11:37-52లో వేరొక సందర్భములో కనబడుతుంది.
2. వ్యాఖ్యాన సాంప్రదాయములు
ప్రారంభ సంఘము ఈ భాగమును కపటత్వమునకు
వ్యతిరేకముగా హెచ్చరికగా అర్థము చేసుకున్నారు. 16 వ శాతాబ్దంలో పండితులు దీనిని బాహ్య ఆచారాల పట్ల
హెచ్చరికగా చూచారు.
3. అన్వయ సూత్రములు
దీనిని నేటి సందర్భమునకు అన్వయించునపుడు మూడు జాగ్రత్తలు అవసరము: మొదటిది, ఇది యూదులందరిపై నింద కాదు. ఇది నిర్దిష్ట నాయకత్వ వర్గపు ప్రవర్తనపై విమర్శ, కావున దీనిని జాతి వ్యతిరేకతకు ఉపయోగించరాదు. రెండవది, ఈ మాటలను "వారు-మేము" దృక్పథముతో కాక, స్వీయ పరిశీలనకు వర్తింపజేయాలి. "వాళ్లు పరిసయ్యులు" అని చెప్పి తప్పించుకొనుట సులభము, "నాలో పరిసయ్య ధోరణి ఏదైనా ఉందా?" అని ప్రశ్నించుకొనుటయే సరైన మార్గము. మూడవది, సందర్భమును (23:1-36 మొత్తము) పరిగణించి, వ్యక్తిగత వచనములను వేరుచేసి తప్పుగా అన్వయించకూడదు.
IV. ఆధ్యాత్మిక కోణము
1. బాహ్య మతాచారము - అంతరంగ మార్పు
దేవుడు హృదయమును చూచువాడు (1 సమూయేలు 16:7). బాహ్యముగా
ఆచారాల పాటింపు, మతపరమైన హోదా కలిగియున్నను, అంతరంగములో
పరివర్తన లేనిచో అది "సున్నపు సమాధి"యే. కనుక ప్రతి విశ్వాసి తనను తాను నా
భక్తి బాహ్య ప్రదర్శనమా, లేక హృదయపూర్వక సంబంధమా? అని ప్రశ్నించుకోవాలి.
2. కపటత్వము యొక్క ఆధ్యాత్మిక ప్రమాదము
"కపటత్వం" అను పదం గ్రీకుభాషలో హిపోక్రీసి అనే మూల పదము నుండి వస్తుంది. అది నాటకరంగములో "నటుడు" అను అర్థము ఇచ్చే
పదం. అంటే కపటత్వమంటె ఒక పాత్రను ధరించి జీవించుట, నిజమైన రూపము దాచి, ఇతరులు
ఆశించు రూపమును ప్రదర్శించుట. ఇది ఆధ్యాత్మిక జీవితములో అత్యంత సూక్ష్మమైన, ప్రమాదకరమైన
పాపము, ఎందుకంటే ఇది తనను తాను
మోసగించుకొను స్థితికి దారితీస్తుంది.
3. మారుమనస్సుకు పిలుపు
యేసు ప్రభువు మాట్లాడిన ఈ కఠిన మాటలు కేవలము
ఖండనకు మాత్రమే కాదు, ఇవి ప్రేమతో కూడిన
హెచ్చరిక. యేసు ప్రభువు ఈ అధ్యాయము
ముగించునది యెరూషలేముపై విలాపముతో, దానిని కాపాడాలనే కోరికను తెలియజేస్తాడు.
ఇవి కోపపు మాటలు కాదు, హృదయవిదారకమైన
ప్రేమ పలుకులు.
4. ప్రతి విశ్వాసికి వర్తించు హెచ్చరిక
మనము దివ్య బలిలో పాల్గొంటు, సేవాకార్యములు చేయుచు, బాహ్యముగా భక్తులముగా కనిపించుచున్నను, క్షమాగుణము, దయ, న్యాయము (23:23లో ప్రస్తావించిన "ధర్మశాస్త్రములోని ప్రధానాంశములు") లోపించినచో, మనమును ఈ హెచ్చరికకు అతీతులము కాము. ఒక వ్యక్తి ప్రతిదినము ప్రార్థించవచ్చు, ఉపవాసములు చేయవచ్చు, మత పరమైన వస్త్రములు ధరించవచ్చు, కాని హృదయములో అసూయ, గర్వము, క్షమించలేని మనస్తత్వము ఉన్నచో బాహ్య భక్తి దేవుని దృష్టిలో సంపూర్ణమైనది కాదు.
V. సామాజక కోణము
1. మతపరమైన అధికార నిర్మాణము
పరిసయ్యులు తమ మతపరమైన జ్ఞానమును, ఆచార
పాటింపును సామాజిక అధికారముగా, ఆధిపత్యముగా మార్చుకొన్నారు. (23:5-7). ఇది మత అధికారులలో
సాధారణముగా జరుగు ఒక పరిణామము, ఆధ్యాత్మిక
అధికారము క్రమముగా సామాజిక, రాజకీయ మూలధనముగా రూపాంతరము
చెందుట వలన అనేక రుగ్మతలకు అవకాశం ఉంటుంది. అందుకే మనం కొన్ని అవాంఛనీయ సంఘటనలను చూస్తుంటాము.
2. వర్గభేదము మరియు ప్రజల భారము
యేసు ప్రభువు మత్తయి 23:4
లో స్పష్టముగా " వారు మోయ
సాధ్యముకాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయువారికి
సాయపడుటకు తమ చిటికెనవ్రేలైనను కదపరు" అని చెబుతున్నారు. ఇది నాయకులు కఠిన
నియమములను ఇతరులపై విధించుచు, తామే వాటి నుండి మినహాయింపు
పొందు వర్గభేద ప్రవర్తనపై పదునైన విమర్శ. అలవికానివి ఇతరులకు వదలి సౌకర్యముగా ఉండేవి
వారు చేస్తుండటము వంటివి ప్రభువు గమణిస్తూనే ఉంటారు. దీనిని ప్రభువు కోరుకొనుటలేదు.
3. ప్రజాదరణ కోసము వెంపర్లాట
సమాజములో తమ ప్రతిష్ఠను కాపాడుకొనుటకు వ్యక్తులు
తమ బాహ్య ప్రవర్తనను జాగ్రత్తగా రూపొందించుకొను ధోరణిని కూడా ప్రభువు ఖండిస్తున్నారు.
సామాజిక మాధ్యమముల యుగములో జీవించుచున్న నేటి తరమునకు ఈ వచనము విశేషముగా ఔచిత్యము
కలిగి ఉంది. బాహ్య ప్రదర్శన, నిజమైన పరివర్తన లేకుండగనే వృద్ధి చెందితే అది చాలా ఆధ్యాత్మిక ప్రమాదమునకు దారి తీస్తుంది.
4. తరాల మధ్య పాపపు బదిలీ, మార్పు పట్ల ప్రతిఘటన
గతించిన సంస్కర్తలను గౌరవించుట సులభము, ఎందుకనగా వారు ఇక ప్రస్తుత అధికార నిర్మాణమునకూ ముప్పు కలిగింపరు; కాని వర్తమానములో సవాలు విసురు గొంతులను తిరస్కరించుట మానవ సమాజములలో పదేపదే కనబడు నమూనా. ఒక సమాజము గతములోని అన్యాయమును సులభముగా ఖండించుట మనము చూస్తాము. కాని మన కాలములోని అన్యాయమును గుర్తించుట కష్టము, మరియు ఖండించము.
ముగింపు
మత్తయి 23:27-32లోని ఈ మాటలు కేవలము ఒక
వర్గముపై విమర్శ మాత్రమే కాదు. ఇవి ప్రతి యుగపు, ప్రతి
మతసంఘపు, ప్రతి విశ్వాసి హృదయపు అద్దము. వాఖ్య పరంగా చూచినపుడు ఇవి యూదయ ఆచార నేపథ్యమునుండి బలమైన ఉపమానమును తీసుకుంటున్నవి; చారిత్రకముగా
ఇవి ఒకటవ శతాబ్దపు మతరాజకీయ సందర్భములో నాటుకొన్నవి, ఆధ్యాత్మికముగా ఇవి బాహ్య-అంతరంగ ఐక్యతకు
పిలుపునిస్తున్నవి; సమాజకముగా ఇవి అధికారము, హోదా, ప్రజాదరణల
దుర్వినియోగముపై శాశ్వతమైన హెచ్చరికగా నిలిచియున్నవి.
చివరిగా, ఈ వచనములను చదువు ప్రతి
విశ్వాసి తనను తాను ప్రశ్నించుకొనవలసిన ప్రశ్న ఇది. నా విశ్వాసము సున్నపు పూతవలె
బాహ్యమేనా, లేక క్రీస్తు కృపచే నా అంతరంగము నిజముగా
పరిశుద్ధపరచబడుచున్నదా? ఈ ప్రశ్నకు నిజాయితీగా
సమాధానము వెదకుటయే, ఈ కఠిన వచనములను చదివిన
తరువాత మనలో కలుగవలసిన నిజమైన ఫలము.
" దేవా! నన్ను
పరిశీలించి నా హృదయమును తెలిసికొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను గుర్తింపుము. నాలో
చెడు ఏమైన ఉన్నదేమో చూడుము. శాశ్వతమార్గమున నన్ను నడిపింపుము."
(కీర్తనలు 139:23-24).
ప్రార్ధన
ప్రభువా! బాహ్యగా నీతిమంతులవలె కనిపిస్తూ, అంతరంగములో
కపటము, కలుషము కలిగియుండే "సున్నముకొట్టిన సమాధుల
వంటి" దాంబిక భక్తి నుండి మమ్మును రక్షించుము. మనుష్యుల మెప్పు కోసం
ప్రదర్శించే వేషధారణను మా నుండి తొలగించి, నీ దృష్టికి ప్రీతికరమైన
సత్యమైన అంతరంగ శుద్ధిని మాకు అనుగ్రహించుము. మా
హృదయములను పరిశోధించి, మాలోని సమస్త దుర్మార్గతను, గర్వమును, అసూయను
కడిగివేయుము. పితరుల తప్పులను ఖండిస్తూనే అదే పాపములో పడిపోయిన పరిసయ్యులవలె కాక, నిజమైన
మారుమనస్సు కలిగి జీవించే కృపను దయచేయుము. మనుష్యులు రూపమును చూతురు గాని నీవు
హృదయమును చూచు దేవుడవు. అందుచేత మా ప్రార్థనలు, ఆరాధనలు
కేవలము బాహ్య ఆచారములుగా మిగిలిపోకుండా, హృదయపూర్వకమైన ప్రేమతోను, పరిశుద్ధతతోను
నిండియుండునట్లు నడిపించుము. నన్ను పరిశీలించి నా హృదయమును తెలిసికొని,. నా
ఆలోచనలను గుర్తించి, నాలో చెడు ఏమైన
ఉన్నదేమో చూచి, శాశ్వతమార్గమున నన్ను
నడిపించుము. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment