ఆగమన కాలం మొదటి ఆదివారం ప్రసంగం (B): మెలకువగా ఉండండి – మార్కు 13:33-37
మెలకువగా ఉండండి: ప్రేమ దీపాన్ని ఆరనివ్వదు
ఆగమన కాలం మొదటి ఆదివారం, సంవత్సరం B
ఒక తల్లి తన కుమారుడు పట్టణానికి చదువుల నిమిత్తము వెళ్ళి సెలవులకు ఇంటికి
వస్తున్నాడు. తన
తల్లికి కుమారుడు ఆ రోజు వస్తున్నాడు అని మాత్రమే తెలుసు అంతకు మించిన సమాచారం
లేదు. సమాచారం ఇచ్చే సాధనం కూడా లేదు. అతడు
ఏ బస్సులో వస్తాడో ఆమెకు తెలియదు. సాయంత్రమైనా రావచ్చు, అర్ధరాత్రి
అయినా రావచ్చు, తెల్లవారుజామున కూడా రావచ్చు.
అప్పుడు ఆ తల్లి ఏమి
చేస్తుంది. ఆమె నిద్రపోదు. అన్నం వెచ్చగా ఉంచుతుంది. ఇంటి
ముందు దీపం వెలిగిస్తుంది. రోడ్డు మీద ఏ అడుగుల చప్పుడు వినిపించినా తలుపు వైపు
చూస్తుంది. తన కుమారుడు వచ్చాడు ఏమో అని చూస్తుంది.
ఆమెను ఎవరూ మేలుకువగా ఉండమని ఆజ్ఞాపించలేదు. నిద్రపోతే
శిక్ష ఉంటుంది అని చెప్పలేదు. ఎవరూ భయపెట్టలేదు. కాని తల్లి మాత్రమే నిద్ర
పోదు, ఎందుకు అంటే ప్రేమే ఆమెను
మేల్కొలిపి ఉంచుతోంది. ఇలా చేసేది తల్లి మాత్రమే కాదు. ఎవరైతే మనలను నిజముగా
ప్రేమిస్తారో వారు మన కోసము అలానే
చేస్తారు.
ఈ తల్లి గురించి ముందు చెప్పడానికి కారణం ఉంది.
ఈ రోజు యేసు ప్రభువు మననుండి కోరుతున్న ఎదురుచూపు ఇలాంటిదే. ఆయన "మెలకువగా
ఉండండి" అన్నప్పుడు మనల్ని భయపెట్టడం లేదు. ప్రేమించమని ఆహ్వానిస్తున్నాడు. ఆ
ప్రేమ మన హృదయ ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించి ఉంచాలని కోరుతున్నాడు.
కొత్త సంవత్సరం, భిన్నమైన ఆరంభం
జనవరి 1న లోకం శుభాకాంక్షలతో, తీర్మానాలతో
కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటుంది. కానీ తిరుసభ తన సంవత్సరాన్ని ఈ రోజు
నిశ్శబ్దంగా మొదలుపెడుతోంది. ఊదా వస్త్రాలతో, ఒకే ఒక కొవ్వొత్తితో. దైవార్చన
సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది.
ఇది మనకు చెప్పేది ఏమిటంటె మన జీవితం మన
విజయాలతో మొదలుకాదు. ఒక రాకడతో మొదలవుతుంది. "ఆగమనం" అంటే అదే, రాక. ఆ
రాకను తిరుసభ సంప్రదాయం మూడు విధాలుగా చూస్తుంది. క్రీస్తు ప్రభువు ఒకసారి బేత్లెహేములో శిశువుగా వచ్చాడు. లోకాంతంలో
మహిమతో మళ్ళీ వస్తాడు. ఈ రెంటి మధ్య
ప్రతిరోజూ ఆయన మన దగ్గరకు వస్తున్నాడు. వాక్యంద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, అవసరంలో
ఉన్నవారి ద్వారా ప్రభువు వస్తున్నాడు.
నేటి మూడు పఠనాలు ఆయన కోసం ఎలా ఎదురుచూడాలో
నేర్పుతున్నాయి. యెషయా మనకు ఒక ఆక్రందన వినిపిస్తున్నాడు. పౌలు ఒక భరోసా ఇస్తున్నాడు. యేసు ప్రభువు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు.
మొదటి పఠనం: ఆక్రందన: "గగనాన్ని చీల్చుకొని దిగిరా"
యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు ధీర్ఘకాలం బానిసత్వం తరువాత
స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రజల తరఫున మాట్లాడుతున్నాడు. వారు గొప్ప ఆశలతో
వచ్చారు. కానీ ఏం చూశారు? శిథిలమైన పట్టణం, కూలిన
దేవాలయం, బీడుపడిన పొలాలు, తమలో తామే
కలహాలు. దేవుడు వాగ్దానం చేసిన మహిమ
ఎక్కడా కనిపించలేదు. దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించింది.
ఈ నిరాశ నుండి లేఖనాల్లోని అత్యంత నిజాయితీ గల
ప్రార్థన ఒకటి పుట్టింది. అది ఎలా మొదలవుతుందో చూడండి, " ప్రభూ! నిక్కముగా
నీవే మాకు తండ్రివి. "అబ్రహాము మమ్మెరుగకపోయినను, యాకోబు మమ్మును అంగీకరింపకపోయినను, యావే, నీవే మా
తండ్రివి. అనాదికాలము నుండి మా విమోచకుడవని నీకు పేరు కదా!" అబ్రాహాము, ఇశ్రాయేలు
వంటి పితరులు కూడా తమను ఆదుకోలేని స్థితిలో, వారికి ఒకటే ఆశ మిగిలింది. అది
వారికి ఒక తండ్రి ఉన్నాడు.
హీబ్రూ భాషలో "విమోచకుడు" అంటే గోయెల్. ప్రాచీన
ఇశ్రాయేలులో ఒక కుటుంబ సభ్యుడు అప్పుల్లో కూరుకుపోయినా, బానిసగా మారినా, అతణ్ణి
విడిపించి గౌరవాన్ని తిరిగి ఇచ్చే బాధ్యత దగ్గరి బంధువుది. అంటే ప్రజలు , "ప్రభువా, నీవు దూరంగా
ఉన్న అధికారివి కావు. మాకు అతి సమీప బంధువువి. మమ్మల్ని విడిపించడం బాధ్యత” అని
చెబుతున్నారు.
తరువాత ఆశ్చర్యకరమైన ఒక విన్నపం వస్తుంది, అది “నీవు గగనమును చీల్చుకొని క్రిందికి దిగిరావేల? అప్పుడు కొండలు నిన్ను చూచి గడగడవణకును!"
తమను తాము రక్షించుకోలేమని తెలిసినవారి ప్రార్థన ఇది. ఇది మన ప్రార్థన కూడా కాదా? రాత్రంతా
నిద్రలేకుండా పడుకున్న రోగిని తలచుకోండి. కలహాలతో చీలిపోయిన కుటుంబాన్ని
తలచుకోండి. ఉద్యోగం లేని యువకుణ్ణి, అప్పుల భారంతో కుంగిన రైతును
తలచుకోండి. సంవత్సరాలుగా పోరాడినా వదలని మన స్వంత పాపపు అలవాట్లను తలచుకోండి.
ఇలాంటి వేళల్లో మనం కూడా "ప్రభువా, ఇంకెంతకాలం? వచ్చి నాకు
సాయము చెయుము!" అని మొరపెడతాము.
యెషయా మనకు నిజాయితీని కూడా నేర్పుతున్నాడు.
" మేమెల్లరమును
అపవిత్రులమైతిమి. మా పుణ్యక్రియలు మలినవస్త్రము వంటివయ్యెను. మేము ఆకులవలె
ఎండిపోయితిమి. మా కిల్బిషములు మమ్ము గాలివలె ఎగురగొట్టెను." ఇది కఠినమైన మాట.
మన మంచిపనులు కూడా గర్వంతో, లేదా
పదిమంది చూడాలనే కోరికతో మలినం కావచ్చని దీని అర్థం. ఆ తరువాత అన్నిటికన్నా
విచారకరమైన వాక్యం ఏమిటంటె " నీకు ప్రార్థనచేయు వాడెవడును లేడయ్యెను.
నిన్నాశ్రయించు వాడెవడును కన్పింపడయ్యెను. నీవు నీ దివ్యముఖమును మా నుండి మరుగు
జేసికొంటివి. మా అపరాధములను చూచి మమ్ము చేయి విడచితివి." అసలైన ప్రమాదం పాపం మాత్రమే కాదు. మనం
ప్రార్థించడం మానేయడం. మనకు నిద్రమత్తు ఆవహించడం.
అయినా ఈ ప్రార్థన నిరాశతో ముగియదు. ఒక చిన్న మాట
దిశను మార్చేస్తుంది, అది "అయిననను." “అయినను ప్రభూ! నీవు మాకు తండ్రివి. మేము
మట్టిమి, నీవు కుమ్మరివి. నీవే
మమ్మెల్లరిని సృజించితివి."
కుమ్మరి చక్రం మీద ఉన్న మట్టికి సొంత అందం లేదు.
అది తనను తాను మలచుకోలేదు. కానీ అది మెత్తగా ఉండాలి, చక్రం మీద
నిలిచి ఉండాలి. ఎండిపోయి గట్టిపడితే కుమ్మరి దానితో ఏమీ చేయలేడు. అలాగే ఒక కుండ
చేతిలో చెడిపోతే కుమ్మరి ఆ మట్టిని పారవేయడు. మళ్ళీ ముద్దచేసి, మళ్ళీ
మలుస్తాడు.
ఆగమన కాలం మనల్ని ఇదే చేయమంటోంది. మనల్ని మనం
మళ్ళీ ఆ చక్రం మీద పెట్టుకోమని ఆహ్వానిస్తుంది. గర్వం, పగ, పాతకోపాలు, పాపపు
అలవాట్లు హృదయాన్ని ఎండిన మట్టిలా గట్టిపరుస్తాయి. ప్రార్థన, పశ్చాత్తాపం, దివ్య సంస్కారాలు
దాన్ని మెత్తబరిచే నీరు. ఈ కాలంలో పాపసంకీర్తనానికి వెళ్ళండి. భయంతో కాదు. మళ్ళీ
మలచబడాలని కోరుకునే మట్టిగా వెళ్ళండి.
రెండవ పఠనం: భరోసా: "దేవుడు నమ్మదగినవాడు"
రెండవ పఠనంలో పునీత పౌలు కొరింతు సంఘానికి లేఖ రాస్తున్నాడు. ఆ సంఘం సమస్యల మయంగా ఉంది. వర్గాలు, ఆధ్యాత్మిక వరాల గురించి
గర్వం, నైతిక లోపాలు, ప్రభురాత్రి
భోజనంలో పేదల పట్ల నిర్లక్ష్యం వంటి సమస్యలతో ఈ సంఘం ఉంది. ఇటువంటి సమస్యలతో ఉన్న సంఘానికి కాపరిగా నీవు
ఉంటే ఎటువంటి లేఖ రాసేవాడివో ఊహించుకోండి. పునీత పౌలు మాత్రం కృతజ్ఞతతో
మొదలుపెడుతున్నాడు. " యేసుక్రీస్తు
ద్వారా దేవుడు మీకు తన కృపానుగ్రహమును ఒసగెను. కనుక, మీ కొరకై
నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలను అర్పింతును."
మన కుటుంబాలకు, మన సంఘాలకు ఎంత గొప్ప
పాఠం ఇది! ఎవరినైనా సరిదిద్దే ముందు, దేవుడు ఆ వ్యక్తిలో ఉంచిన
మంచిని గుర్తించి దానికి కృతజ్ఞత చెప్పగలమా? తప్పులను మాత్రమే ఎత్తిచూపే
తల్లిదండ్రులు భయపడే పిల్లలను పెంచుతారు. ఫిర్యాదులు మాత్రమే చేసే విచారణ తన
ఆనందాన్ని కోల్పోతుంది. పౌలు మంచి మార్గం చూపుతున్నాడు, ముందు కృపను చూడు అని చెబుతున్నాడు.
కొరింతియులకు ఏ కృపావరంలోనూ కొదువ లేదని, వారు
"మన ప్రభువైన యేసుక్రీస్తు రాక" కోసం ఎదురుచూస్తున్నారని ఆయన చెబుతాడు.
గ్రీకు పదం అపోకలిప్సిస్, అంటే తెరను
తొలగించడం. యెషయా కోరుకున్న ఆకాశం చీలడం, క్రీస్తు ప్రభువు పూర్తిగా
ప్రత్యక్షమయ్యే ఆ రోజున సంపూర్ణమవుతుంది.
తరువాత మన ఆగమనమంతటికీ ఆధారమైన వాక్యాన్ని పునీత పౌలు పలుకుతున్నాడు. ఆ మాటే " మన ప్రభువును అగు యేసుక్రీస్తుతో సహవాస మునకు
మిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు." అంటే మన విశ్వాసం తడబడవచ్చు. మన
ప్రేమ చల్లారవచ్చు. కానీ దేవుని విశ్వసనీయత మారదు. మనల్ని నిలబెట్టేది ఆయన
విశ్వాసనీయతే. " కనుకనే “ఆయన మన ప్రభువగు యేసుక్రీస్తు దినమున మీరు
దోషరహితులుగ ఉండునట్లు, ఆయన మిమ్ము
తుదివరకు సుస్థిరముగ ఉంచును" అని పౌలు చెబుతున్నాడు. క్రీస్తు
దినాన మనం నిందారహితులుగా నిలబడేలా. మనం పరిపూర్ణులం కాబట్టి కాదు, ఆయన
నమ్మదగినవాడు కాబట్టి ఇది జరుగుతుంది.
కాబట్టి మన వైఫల్యాలను చూసి "నేను ఎలా
సిద్ధపడగలను?" అని అనుకున్నప్పుడు పునీత పౌలు మాటలనే వినండి, నీ స్వశక్తితో సిద్ధపడమని
ఎవరూ అడగడం లేదు. దేవుని కృపకు నీ హృదయాన్ని
తెరిచి ఉంచు. నిన్ను పిలిచినవాడే ఆరంభించిన పనిని పూర్తి చేస్తాడు.
సువిశేష పఠనం: యేసు ప్రభువు మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు: "మెలకువగా ఉండండి"
ఒలీవు కొండ మీద తన సుదీర్ఘ ప్రసంగం ముగింపులో యేసు
ప్రభువు ఒక చిన్న ఉపమానం చెబుతున్నాడు. ఒక యజమాని ప్రయాణం మీద
వెళ్తున్నాడు. వెళ్ళే ముందు ఆయన మూడు పనులు చేశాడు. సేవకులకు అధికారం ఇచ్చాడు, ప్రతి
ఒక్కరికి ఒక పని అప్పగించాడు, ద్వారపాలకుడిని మెలకువగా
ఉండమని ఆజ్ఞాపించాడు.
యజమాని వెళ్ళిపోయాడు. ఆయన ఇంటిని ఖాళీగా వదిలి
వెళ్ళలేదు. ప్రతి సేవకునికి ఒక పని ఉంది. ఈ ఇంట్లో ఎవరూ ప్రేక్షకులు కారు. తల్లికి
పని ఉంది, తండ్రికి ఉంది, విద్యార్థికి, రైతుకి, నర్సుకి, గురువుకి
ఉంది. మంచం దిగలేక కుటుంబం కోసం ప్రార్థించే అమ్మమ్మకి కూడా ఉంది. మెలకువగా
ఉండటమంటే చేతులు కట్టుకొని ఆకాశం వైపు చూస్తూ కూర్చోవడం కాదు. మోక్షారోహణ సమయంలో
దేవదూతలు శిష్యులను "మీరెందుకు ఆకాశం వైపు చూస్తూ నిలబడ్డారు?" అని
అడిగారు. అంటే, వెళ్ళి మీ పని చేయండి అని.
క్రీస్తు కోసం ఎదురుచూడటమంటే ఆయన మనకు అప్పగించినదాన్ని నమ్మకంగా చేయడమే.
యజమాని సాయంత్రమైనా, అర్ధరాత్రి
అయినా, కోడికూసే వేళ అయినా, తెల్లవారుజామున
అయినా రావచ్చని యేసు ప్రభువు చెబుతున్నాడు. రోమన్ల రాత్రిలోని ఈ నాలుగు జాములలో ఒక
రహస్యం ఉంది. మార్కు సువార్తలో శ్రమల కథనంలో ఇవే గడియలు కనిపిస్తాయి. సాయంత్రం
యేసు ప్రభువు స్నేహితులతో భోజనానికి కూర్చున్నాడు.
అర్ధరాత్రి గెత్సేమనే తోటలో మెలకువగా ఉండమని అడిగాడు, వారు
నిద్రపోయారు. కోడి కూసినప్పుడు పేతురు ఆయన ఎవరో తెలియదని బొంకాడు. తెల్లవారగానే ఆయనను పిలాతు వద్దకు
అప్పగించారు.
అంటే రాత్రి జాములు శిష్యుల బలహీనత యొక్క
గడియలు. సరిగ్గా ఆ గడియలలోనే యేసు ప్రభువు "మెలకువగా ఉండండి"
అంటున్నాడు. ఇక్కడ గొప్ప ఓదార్పు ఉంది. శిష్యులు నాలుగు జాములలోనూ విఫలమయ్యారు.
అయినా పునరుత్థానమైన ప్రభువు వారిని విడిచిపెట్టలేదు. ఆయన మీకంటే ముందు గలిలయకు
వెళ్తున్నాడు, ఆయన శిష్యులకు, పేతురుకు
చెప్పండని కబురు పంపాడు. మన నిద్ర కూడా ఆయనను మన నుండి దూరం చేయలేదు.
మరి మనం మేల్కొనవలసిన ఆ నిద్ర ఏమిటి? యేసు ప్రభువు
శారీరక నిద్ర గురించి మాట్లాడటం లేదు. ఆత్మ నిద్ర గురించి
మాట్లాడుతున్నాడు. ఈ నిద్ర రేపటికి వాయిదా వేసిన ప్రార్థన. శరీరంతో హాజరై, హృదయం దేవునికి
దూరంగా ఉండి హాజరయిన దివ్యబలిపూజ. మనం పట్టించుకోవడం మానేసిన చిన్న
రాజీ. పదేళ్ళుగా మోస్తున్న పగ. మన గుమ్మం ముందున్న పేదవాణ్ణి చూడకుండా అలవాటు
చేసుకున్న కళ్ళు. ఈ నిద్ర శబ్దం చేయదు. మెల్లగా వస్తుంది. అందుకే యేసు ప్రభువు మేలుకువగా ఉండండి అనే ఆజ్ఞను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు.
"మీకు చెప్పునదే అందరికీ చెప్పుచున్నాను. జాగరుకులై
ఉండుడు!” ఈ బోధ విన్నది నలుగురు శిష్యులే. కానీ ఇది అందరి కోసం. యువతకు, వృద్ధులకు, చదువుకున్నవారికి, చదువులేనివారికి, గురువుకు, రైతుకు, ప్రతి
శతాబ్దపు తిరుసభకు.
భయం కాదు, ప్రేమ
కొందరు "సిద్ధంగా ఉండండి, ప్రభువు
వస్తున్నాడు" అనే మాట వినగానే భయపడతారు. మళ్ళీ ఆ తల్లిని తలచుకోండి. ఆమె
ఎందుకు ఎదురుచూస్తోంది? ప్రేమ వల్ల. వచ్చేవాడు
అపరిచితుడో, పన్ను వసూలు చేసేవాడో కాదు. యెషయా "నీవే మా
తండ్రివి" అని మొరపెట్టిన ఆ తండ్రి కుమారుడే. ఆయన విమోచకుడిగా వస్తున్నాడు.
మనల్ని కొత్తగా మలచాలని కోరుకునే కుమ్మరిగా వస్తున్నాడు. యజమాని తన సేవకులను
మెలకువగా చూస్తే, తానే నడుము కట్టుకొని వారికి
వడ్డిస్తాడని యేసు ప్రభువు వాగ్దానం కూడా
చేశాడు. మనం ఎదురుచూసేది సేవ చేయడానికి వచ్చే ప్రభువు కోసం.
ఆ సమయం మనకు తెలియకుండా వస్తుంది కాబట్టి ప్రతి
దినం విలువైనదవుతుంది. ఆ చివరి రోజు మనకు తెలియకపోవడం, ప్రతి రోజు అప్రమత్తత
నేర్పిస్తుంది. లోకాంతానికి తేదీలు లెక్కవేస్తూ శక్తిని వృథా చేయకూడదు. ఆ సమయం
ఎవరికీ తెలియదని ప్రభువే చెప్పాడు. కనుక మనకు అప్పగించిన పనిని ఈ రోజే చేయడం మన కర్తవ్యం.
మరియమాత మాతృక
ఆగమన కాలానికి ఒక గురువు కావాలంటే మరియమాతను చూస్తే చాలు. ఆమె దేవుని వాక్యాన్ని విన్నది.
దాన్ని హృదయంలో భద్రపరచి ధ్యానించింది. అవసరంలో ఉన్న ఎలిశబెత్తమ్మ దగ్గరకు వెళ్ళి సేవ చేసింది. వినడం, ధ్యానించడం, సేవించడం, ఆమె
చేసిన పని, మెలకువగా ఉండటమంటే ఇదే. ఆమె
కోసం ఆకాశం చీలలేదు, కానీ ఆమె హృదయం తెరుచుకుంది.
"నీ మాట ప్రకారం నాకు జరుగును గాక" అని పలికి, కుమ్మరి
చేతిలో పాత్ర అయింది, ఆ పాత్ర ద్వారానే దేవుడు
లోకంలోకి ప్రవేశించాడు.
ఈ వారానికి ఒక సరళమైన ప్రణాళిక
ఆగమనకాల మొదటి వారం కోసం నాలుగు చిన్న పనులు చేద్దాం.
మొదటిది, ప్రతిరోజూ
కొన్ని నిమిషాలు నిశ్శబ్ద ప్రార్థన చేయండి. యెషయా ప్రవక్త చెప్పిన "ప్రభూ, నీవు మాకు తండ్రివి; మేము మట్టిమి, నీవు కుమ్మరివి"
అనే మాటను ఉదయం లేవగానే, రాత్రి
నిద్రపోయే ముందు ఇది పలకండి.
రెండవది, సంధి
చేసుకోండి. నెలలుగా, సంవత్సరాలుగా మాట్లాడని
వ్యక్తి ఉంటే ఈ కాలంలో ఒక అడుగు ముందుకు వేయండి. మనస్సాక్షి బరువుగా ఉంటే
పాపసంకీర్తనం చేయండి. కుమ్మరి ఆ మట్టిని మెత్తబరచనివ్వండి.
మూడవది, పంచుకోండి.
క్రిస్మస్ కొత్త బట్టలు, విందుల కంటే ముందు, అవసరంలో
ఉన్న ఒక కుటుంబం కోసం మీ వంతు ప్రక్కన పెట్టండి. పశువుల పాకలో వచ్చిన ప్రభువు
ఆకలితో ఉన్నవారిలో, ఒంటరివారిలో కూడా
వస్తున్నాడు.
నాలుగవది, కుటుంబంతో
కలిసి ఆగమన కొవ్వొత్తి వెలిగించండి. ఎందుకు వెలిగిస్తున్నామని పిల్లలు
అడగనివ్వండి. జవాబు తేలికగా ఉండనివ్వండి. మనం యేసు ప్రభువు కోసం ఎదురుచూస్తున్నాం, ప్రేమ ఈ
దీపాన్ని ఆరిపోనివ్వదు.
ముగింపు
మనం ఎదురుచూసేది. మనల్ని మలిచేవాడు, మనల్ని అంతం వరకు పట్టుకొని ఉండేవాడు, నమ్మదగిన వాడు అయిన దేవుడుకోసం. రాబోయే ప్రభువు బేత్లెహేములో ఇప్పటికే మన దగ్గరకు వచ్చాడు, ప్రతిరోజూ ఇప్పటికీ వస్తున్నాడు. కాబట్టి మనం నిద్రపోక. ఆ తల్లి తన కుమారుని కోసం ఎదురుచూసినట్లే ఎదురుచూద్దాం. దీపం వెలిగించి, తలుపు తెరిచి, మన హృదయాన్ని ప్రేమతో నింపి ఎదురుచూద్దాం. తొలి క్రైస్తవులు మారనాతా, అని అరమాయిక్ భాషలో చెప్పేవారు. అంటే "ప్రభువా, రమ్ము!"అని దాని అర్ధం.మనం కూడా ఆ ప్రభువుని మన లోనికి ఆహ్వానిద్దాం. ఆమెన్

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి