క్రీస్తు రాజు మహోత్సవం (Christ the King Sunday Homily): కాపరి, విజేత, న్యాయాధిపతి
విశ్వరాజు: కాపరి, విజేత, న్యాయాధిపతి
ఈ రోజు దైవార్చన సంవత్సరపు చివరి ఆదివారం. వచ్చే ఆదివారంతో తిరుసభ
కొత్త దైవార్చన సంవత్సరం మొదలవుతుంది. గడిచిన
సంవత్సరమంతా మనం క్రీస్తు జీవితాన్ని ధ్యానించాం, ఆయన రాక, జననం, పరిచర్య, శ్రమలు, పునరుత్థానం, పవిత్రాత్మ రాక
ఆత్మ లాంటి విషయాలను ధ్యానించాం. ఇప్పుడు తిరుసభ ఈ ధ్యానాలన్నింటినికి మూలం యేసుక్రీస్తు
ప్రభువు, ఆయనే
విశ్వానికి రాజు అని చెబుతుంది.
అయితే "రాజు" అనే మాట వినగానే మన
మనసులో ఎలాంటి ఊహ మెదులుతుంది? బంగారు కిరీటం, వైభవమైన
సింహాసనం, సైన్యాలు, భయపడే ప్రజలు. కానీ ఈ రోజు తిరుసభ
మన ముందు ఉంచిన రాజు వేరు. ఆయన కిరీటం ముళ్ళతో అల్లినది. ఆయన సింహాసనం సిలువ
కొయ్య. ప్రజలు భయం వల్ల కాక, ప్రేమ వల్ల ఆయనను
అనుసరిస్తారు. ఈ రోజు పఠనాలు ఈ రాజును మనకు మూడు రూపాల్లో చూపిస్తాయి. ఆయన కాపరి, విజేత, న్యాయాధిపతి.
తప్పిపోయిన వారిని వెదికే కాపరి
యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా
బానిసత్వంలో ఉన్నపుడు వారికి ప్రభువు మాటలను చెబుతున్నాడు. అపుడు యెరూషలేము
కూలిపోయింది, దేవాలయం నాశనమైంది, రాజు లేడు, దేశం లేదు.
ప్రజలు చెల్లాచెదురై పరదేశంలో చిక్కుకున్నారు. ఆ చీకటిలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్త
ద్వారా నేనే నా గొర్రెలను వెదకి, వాటిని కనుగొంటానని చెబుతున్నాడు.
ఇశ్రాయేలు నాయకులు తమను "కాపరులు" అని
పిలుచుకున్నారు. ప్రాచీన కాలంలో రాజులందరూ తమను ప్రజల కాపరులని అనేవారు. కానీ ఆ
కాపరులు మందను పోషించలేదు, తమనే పోషించుకున్నారు.
బలహీనులను బలపరచలేదు, రోగులను స్వస్థపరచలేదు, గాయపడిన
వారికి కట్టు కట్టలేదు, తప్పిపోయిన వారిని వెదకలేదు.
గొర్రెలు చెల్లాచెదురయ్యాయి. అందుకే దేవుడు ఇక నేనే వస్తాను అని అంటున్నాడు.
ఈ మాటలలో ఎంత ఓదార్పు ఉంది. దేవుడు దూరం నుండి
ఆజ్ఞలు జారీ చేసే రాజు కాదు. ఆయన పొలాల్లోకి దిగి వచ్చి, ముళ్ళ
పొదల్లో చిక్కుకున్న గొర్రెను వెదికే కాపరి. ఇక్కడ వాడిన పదాలు చాలా ముఖ్యమైనవి.
అవి వెదకుతాను, తిరిగి
తెస్తాను, కట్టు కడతాను, బలపరుస్తాను.
ఇవన్నీ రాజుల పనులుగా మనం ఊహించేవి కావు. కానీ మన ప్రభువైన రాజుకు ఇవే రాజరికపు పనులు.
ఈ వాగ్దానం యేసు ప్రభువు ద్వారా నెరవేరింది. ఆయన
తాను "మంచి కాపరిని" చెప్పాడు. తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం తొంభై
తొమ్మిదిని విడిచి వెదకడానికి వెళ్ళే కాపరి కథ ఆయన చెప్పాడు. పాపుల మధ్య భోజనం
చేశాడు, సుంకరులను పిలిచాడు, సమరయ
స్త్రీతో మాట్లాడాడు, వ్యభిచారంలో పట్టుబడిన
స్త్రీకి విముక్తిని ఇచ్చాడు. చివరికి ఈ కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్నే
అర్పించాడు. ఇదే ఈ రాజు వైభవం.
ఈ రోజు భక్తి కీర్తన కూడా అదే చెబుతోంది,
"ప్రభువే నా కాపరి, నాకు కొదువ లేదు." మీలో
ఎవరైనా ఈ సంవత్సరం చీకటి లోయ గుండా నడిచి ఉండవచ్చు. ఉద్యోగం పోయి ఉండవచ్చు, ఇంట్లో
ఒకరిని కోల్పోయి ఉండవచ్చు, ఒక వ్యాధితో పోరాడి ఉండవచ్చు, మనసులో
ఎవరికీ చెప్పుకోలేని బాధ ఉండవచ్చు. ఈ రోజు ఈ రాజు మీతో అంటున్నాడు, "నేనే
నిన్ను వెదకుతాను. నీ గాయానికి నేనే కట్టు కడతాను." కీర్తనకారుడు, చీకటి
లోయలో నడిచినా నేను భయపడను, ఎందుకంటే నీవు నాతో ఉన్నావు అంటున్నాడు.
ఈ రాజు సింహాసనం మీద కూర్చుని చూసే రాజు
కాదు; మన పక్కనే ఉండి మనతో నడిచే రాజు. ఈ రాజు కాపరి మాత్రమే కాదు, న్యాయం
చేసేవాడు కూడా. ఈ మాట సువార్తలో మరింత స్పష్టంగా వినిపిస్తుంది. కానీ దాని ముందు, మనం ఈ రాజు
విజయం గురించి వినాలి.
మరణాన్ని జయించిన విజేత
రెండవ పఠనంలో పునీత పౌలు ఒక గొప్ప దృశ్యాన్ని మన
ముందు ఉంచుతున్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేచాడని, మరణమున నిద్రించినవారి
నుండి లేచిన వారిలో ఆయన ప్రథమ ఫలమయ్యాడని చెబుతున్నాడు.
ప్రథమ ఫలం అంటే ఏమిటో మీకు తెలుసు. పొలంలో మొదట పండిన పంటను మనం ప్రభువుకు
అర్పిస్తాం; అది మిగిలిన కోతకు హామీ. పునీత పౌలు చెబుతున్నది
ఇదే. క్రీస్తు పునరుత్థానం ఒక్క సంఘటన
కాదు, రాబోయే గొప్ప కోతకు మొదటి గుత్తి. ఆదాము ద్వారా
మరణం లోకంలోకి వచ్చింది; క్రీస్తు ద్వారా జీవం, పునరుత్థానం
వస్తాయి.
ఇక్కడ పునీత పౌలు రాజరిక భాషను వాడతాడు. దేవుడు
శత్రువులందరినీ ఓడించి క్రీస్తు తన పాదముల
క్రింద ఉంచే వరకు క్రీస్తు పరిపాలించాలి అని చెబుతున్నాడు. ఆ శత్రువులు ఎవరు? మన చుట్టూ
ఉన్న ఎవరో వ్యక్తులు కాదు. పాపం, దుష్టశక్తులు, అన్యాయం, చివరికి
"చివరి శత్రువైన మరణం." ఈ రాజు యుద్ధం మనుషులతో కాదు; మనుషులను
బందీలుగా చేసే ఈ శక్తులతో.
తన ప్రజలను తీర్పు తీర్చే న్యాయాధిపతి
ఈనాటి సువిశేషంలో, మనుష్యకుమారుడు తన మహిమతో, సమస్త
దూతలతో కలిసి వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడవుతాడు. సకల జాతులు ఆయన
ముందు సమకూడుతారు.
ఎంత గొప్ప దృశ్యం! సింహాసనం, దూతలు, సమస్త
జాతులు ఉన్నారు. ఇక్కడే మనం యేసు ప్రభువును రాజుగా చూస్తాం. ఇంతవరకు ఆయన కాపరిగా, విజేతగా
కనిపించాడు. ఇప్పుడు న్యాయాధిపతిగా కనిపిస్తాడు. కానీ ఆయన తీర్పు ఏ ప్రమాణం మీద
ఆధారపడి ఉంటుందో చూడండి.
ఆయన, "నీవు ఎన్ని ప్రార్థనలు చేశావు? ఎంత పెద్ద
చర్చిలో కూర్చున్నావు? ఎంత గొప్ప పదవిలో ఉన్నావు? ఎంత
సంపాదించావు?" అనేటి ఏ ప్రశ్న
ఆయన అడగడం లేదు. "నేను ఆకలిగొన్నప్పుడు నాకు భోజనం పెట్టావా? దప్పిగొన్నప్పుడు
నీళ్ళిచ్చావా? పరదేశినైనప్పుడు ఆదరించావా? వస్త్రహీనుడినైనప్పుడు
బట్టలిచ్చావా? రోగినైనప్పుడు చూడవచ్చావా? చెరసాలలో
ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చావా?" అనే ప్రశ్నలను
ఆయన అడుగుతున్నాడు.
ఈ ఆరు ప్రశ్నలను నెమ్మదిగా వినండి. వీటిలో
ఒక్కటి కూడా ఆలయంలో జరిగే ఆరాధన గురించి కాదు. ఒక్కటి కూడా సిద్ధాంత పరీక్ష కాదు.
ఇవన్నీ మన రోజువారీ జీవితంలో, వీధుల్లో, ఆసుపత్రుల్లో, జైళ్ళలో, ఇళ్ళ
ముంగిళ్ళలో జరిగేవి. ఈ రాజు "ఈ అత్యల్పుల్లో నేనున్నాను" అని చెబుతున్నాడు.
ప్రభువును
నీతిమంతులు, "ప్రభూ, మేము నిన్ను
ఎప్పుడు ఆకలితో చూశాం?" అని అడుగుతున్నారు.
ఒక
ఆకలిగొన్న మనిషికి అన్నం పెట్టారు, అంతే. వారు క్రీస్తును
సేవిస్తున్నామని అనుకోలేదు; రాజు మాత్రం,
"నా సోదరులలో ఈ అత్యల్పులకు మీరు ఏమి చేశారో, అది నాకే
చేశారు" అని చెబుతున్నాడు.
ఇక్కడ ఈ రాజు పేదల పక్షాన నిలబడతాడు అనడం
సరిపోదు; ఆయన పేదలతో తనను తాను ఐక్యం చేసుకున్నాడు. మన
వీధి మలుపులో చేయి చాచిన వృద్ధురాలిలో, ఆసుపత్రి మంచంపై ఒంటరిగా పడి
ఉన్న రోగిలో, పనికోసం ఊరు వదిలి వచ్చిన వలస కార్మికునిలో, జైలు గోడల
వెనుక మరచిపోబడిన ఖైదీలో క్రీస్తు ఉన్నాడు. మనం గుడిలో ఎవరి ముందు మోకరిల్లుతున్నామో
ఆ క్రీస్తే, వారిలో కూడా
ఉన్నాడు. దివ్య సత్ప్రసాదంలో ఆయనను ఆరాధించే కళ్ళతోనే మనం పేదవాని ముఖంలో కూడా
ఆయనను చూడాలి.
ఇక్కడ ఒక కఠినమైన సత్యాన్ని కూడా మనం వినాలి.
ఎడమ వైపు నిలిచిన వారిని రాజు ఖండిస్తాడు. వారు హత్యలు చేశారని కాదు, దొంగతనం
చేశారని కాదు. వారు ఏమీ చేయలేదని. "నేను
ఆకలిగొన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు." ఇది పాపంలోని ఒక ప్రత్యేక రూపం,
ఉదాసీనత, నిర్లక్ష్యం.
చెడు చేయకపోవడం సరిపోదు; మంచి చేయకపోవడం కూడా తీర్పుకు
కారణమవుతుంది. తలుపు బయట ఒక లాజరు పడి ఉండగా, లోపల విందు చేసుకున్న
ధనవంతుని కథ మనకు గుర్తుకు రావాలి. అతడు లాజరును కొట్టలేదు; అతడిని
చూడనే లేదు.
అయితే ఈ రోజు మనం భయంతో కాదు, ఆశతో ఈ
సువార్తను వినాలి. ఎందుకంటే ఈ న్యాయాధిపతే మన కాపరిగా ఉన్నాడు. ఆయన మనను
ఖండించడానికి కాదు, రక్షించడానికి వచ్చాడు. తీర్పు
రోజు కోసం ఎదురుచూడక, ఈ రోజే, ఈ వారమే, ఈ క్షణమే మనలను
మనం మార్చుకునే అవకాశం మనకు ఉంది.
ఈ రాజు కింద
మనం ఎలా జీవించాలి?
కాపరి మనలను వెదికి కనుగొన్నాడు. విజేత మన కోసం
మరణాన్ని ఓడించాడు. న్యాయాధిపతి మన జీవితాన్ని ప్రేమ కొలమానంతో కొలుస్తాడు. ఈ రాజు
ప్రజలుగా మనం ఎలా జీవించాలి?
11 వ భక్తినాధ పోపుగారు 1925లో ఈ
పండుగను స్థాపించినప్పుడు, ఆత్మ పరిశీలనకు చేసుకునేలా కొన్ని
మాటలు చెప్పాడు, వాటి ఆధారంగా
యేసు క్రీస్తు మన మనసును పరిపాలించాలి:
మనం ఏమి నమ్ముతున్నాం, ఏమి చదువుతున్నాం, ఏమి
ఆలోచిస్తున్నాం.
ఆయన మన సంకల్పాన్ని పరిపాలించాలి: మనం ఏమి ఎంచుకుంటున్నాం, ఏ నిర్ణయాలు
తీసుకుంటున్నాం.
ఆయన మన హృదయాన్ని పరిపాలించాలి:
మనం అన్నిటికంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాం.
ఆయన మన శరీరాన్ని పరిపాలించాలి: మన సమయం, మన బలం, మన తలాంతులు
ఎవరి సేవలో ఉన్నాయి.
ఈ రోజు దైవార్చన సంవత్సరపు చివరి
ఆదివారం కాబట్టి, ఇది ఈ సంవత్సరం మొత్తాన్ని పరిశీలన చేసుకునే సమయం. కనుక ఈ సంవత్సరం నా మనసు ఎవరి మాటలతో నిండింది? నా సంకల్పం
ఎవరి చిత్తాన్ని వెతికింది? నా హృదయం ఏ వస్తువుల వెంట
పరుగెత్తింది? నా సమయం, నా శక్తి ఎవరికి ఇవ్వబడ్డాయి? అనే ఈ నాలుగు ప్రశ్నలను మీ మనసును అడుగండి.
ఈనాటి సువిశేషం మనలను ఆచరణకు పిలుస్తోంది. మీ ఇంట్లో, మీ గ్రామంలో, మీ కాలనీలో
ఈ వారం ఒక్క "అత్యల్పుని" కోసం మీరు ఏమి చేయగలరు? ఆకలిగొన్న
ఒకరికి భోజనం పంచవచ్చు. ఒంటరిగా ఉన్న ఒక వృద్ధుని ఇంటికి వెళ్ళి కాసేపు
కూర్చోవచ్చు. ఆసుపత్రిలో ఉన్న ఒక రోగిని పలకరించవచ్చు. ఎవరినైనా క్షమించవచ్చు.
పేదవానికి సహాయం చేసే ఒక సంస్థకు చేయూత ఇవ్వవచ్చు. ఇవన్నీ చిన్న పనులే; కానీ ఈ రాజు
అలా చేసినది నాకే చేశారు అని చెబుతున్నాడు.
బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తు యాజక, ప్రవక్త, రాజ
విధుల్లో పాలుపంచుకుంటారు. రాజ విధిలో మన భాగం ఏమిటి? ఇతరులపై
అధికారం చెలాయించడం కాదు. మనలోని పాపాన్ని జయించడం, ఇతరులలో
క్రీస్తును సేవించడం, ఈ లోకాన్ని ఆయన సత్యం వైపు
మళ్ళించడానికి ప్రయత్నించడం. అంటే ప్రతి క్రైస్తవుడు ఆత్మనిగ్రహం ద్వారా, సేవ ద్వారా
పరిపాలించాలి. ఇదే నిజమైన రాజరికం.
ముగింపు
ఈ రోజు మనం క్రీస్తు రాజు పండుగను
జరుపుకుంటున్నాం, ఆయన తన సింహాసనం నుండి
కిందికి దిగి వచ్చినవాడు. ఆయన కాపరిగా మనలను వెదికాడు. ఆయన విజేతగా మన కోసం
మరణాన్ని ఓడించాడు. ఆయన న్యాయాధిపతిగా ఒక రోజు మనల్ని కలుస్తాడు; ఆ రోజు ఆయన
అడిగే ప్రశ్న ఒక్కటే, నీవు ప్రేమించావా అని.
కాబట్టి ఈ రోజు ఈ దివ్యబలిపూజ నుండి మనం ఒక
సంకల్పంతో వెళ్దాం. నన్ను వెదికిన కాపరిని నేను నమ్ముతాను. నా కోసం మరణాన్ని
జయించిన విజేతను కలుసుకొనుటకు నేను ధైర్యంగా ఉంటాను. నన్ను ప్రేమ కొలమానంతో కొలిచే
న్యాయాధిపతిని నా సోదరుల్లో, సోదరీల్లో సేవిస్తాను అని నిర్ణయించుకుందాం.
యేసుక్రీస్తు రాజా, నీ రాజ్యం
మా హృదయాల్లో, మా కుటుంబాల్లో, మా సమాజంలో, ఈ
లోకమంతటిలో స్థాపించబడును గాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకంలో వలె
భూమిపై నెరవేరునుగాక.
ఆమెన్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి