కార్మెల్ పర్వత ఆరోహణ- గాఢాంధకార రాత్రి - ఆధ్యాత్మిక కవిత | కార్మెల్ శోభ


ఓ గాఢాంధకార  రాత్రి 
ప్రియుని మీద కోరిక తో దహించుకు పోతూ 
 ఓ ఆనంద సమయాన    
నేను బయటకు కనపడకుండా  పోయాను 
నా ఆత్మ మొతం నిశ్చలంగ ఉంది 

2   అంధకారం లో సురక్షితంగా ,
రహస్య నిచ్చెన తో మరువేషం లో
ఆ  అదృష్ట  భాగ్యం
అంధకారం లో  దాగిఉన్నా
నా ఆత్మ ఇప్పుడు నిచ్చలంగా ఉంది

3 ఆ సంతోషకర   రాత్రి
రహస్యంగా నన్నెవరు   చూడకుండా ,
నేనేవారిని   చూడక
ఏ దీపమో  మార్గదర్శో   లేక
నా హృదిలో రగిలే జ్వాల  

4 ఇది నన్ను నడిపింప 
మధ్యాన్నపు వెలుకంటే మిన్నగా 
అతను నా కోరకు వేచిఉన్న చోటుకు
ఆయన నాకు బాగా  తెలుసిన
ఎవరు కనపడని చోటుకు

5 ఓ మార్గచుపరి అయ్యిన రాత్రి
ఓ తోలి సంధ్య కంటే   అందమైన  రాత్రి
ఓ ఐక్యం చేసిన రాత్రి
ప్రేయసిని  తన ప్రియునితో
ప్రియురాలుని తన ప్రియునిలో  మారుతున్న రాత్రి

6 నా   పుష్పిస్తున్న ఏద మీద
నా ప్రియుని కోసమే నే ఉంచిన
చోట  తాను పడుకొని నిద్రిస్తుండ
 నేను తనను లాలన చేస్తుండగా
అక్కడ దేవదారు వీచగా  ఓ చిరు గాలిలో

7 ఎప్పుడు  ఆ చిరుగాలి బురుజు నుండి విచిందో
తన వెంట్రుకలు విగినప్పుడు
తాను నా మెడను గాయపరిచాడు
తన  మృదువువైన చేతితో
నా ఇంద్రియాలని స్తంభింపచేస్తూ

8 నన్ను  నేను పరీత్యంజించి మరియు మరిచిపోయి
నా ప్రియుని మీద నా మొమును వాల్చి
అన్నియు నిలిచిపోగా నా నుండి నేను వెడలిపోతిని
నా జాగ్రత్తలన్ని వదలి
లిల్లీల మధ్య  మరచిపోతిని 


కార్మెల్ పర్వతారోహణం

పునీత సిలువ యోహాను  (1542–1591) రచించిన “కార్మెల్ పర్వతారోహణం” క్రైస్తవ ఆధ్యాత్మిక సాహిత్యంలో ఒక  గొప్ప నిధి. ఈ గ్రంథం ఆత్మ దేవునితో ఐక్యం కావడానికి చేసే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వివరిస్తుంది. ఇది కార్మెల్ కొండ (Mount Carmel)ను దేవుని లో ఐక్యమయ్యే మార్గంగా చిత్రిస్తుంది .

ఇది ఒక అసంపూర్ణ గ్రంథం; దీన్ని కొనసాగించే “గాడంధకార రాత్రి’ , రెండు భాగాలుగా ఉన్న  ఒకే పరిపూర్ణ ప్రణాళికలో భాగంగా పరిగణిస్తారు . ఈ గ్రంథం మొదటి భాగం (Active Night) గురించి వివరిస్తుంది. ఇది “ ఇంద్రియాల రాత్రి” (Book I) మరియు “ ఆత్మ రాత్రి ” (Book II & III)గా విభజించబడింది .

ఆధారం

 సిలువ యోహాను  ఈ కవితను తన ఆధ్యాత్మిక బోధనలకు సారాంశంగా తీసుకున్నాడు . ఆత్మ తన “ఇల్లు” (భావాలు మరియు కోరికలు) శాంతించిన రాత్రి సమయంలో, ప్రేమతో రగులుతూ, తన ప్రియుని (దేవుణ్ణి) కలవడానికి బయలుదేరుతుంది. ఈ ప్రయాణంలో ఆత్మకు ఏకైక మార్గదర్శి తన హృదయంలో మండుతున్న ప్రేమాగ్ని మాత్రమే .

 ఇంద్రియాల రాత్రి

ఆధ్యాత్మిక ప్రయాణంలో  ఆత్మకు మొదటి అడ్డంకి ఇంద్రియాల (senses), వీటిపై  పై దృష్టి పెడుతుంది. ఇంద్రియ ఆనందాలు మరియు భూలోక వస్తువుల పట్ల ఆత్మకు ఉన్న అన్ని బంధాలను తొలగించాల్సిన అవసరాన్ని ఇది బోధిస్తుంది . దేవుడు తనను తాను మానలో పూర్తిగా నింపుకోవడానికి, ఆత్మ శూన్యంగా మారాలని పేర్కొంటుంది .

మనస్సును  కలుషితం చేసే కోరికలు

ఈ అధ్యాయాల్లో, ఎంత చిన్న కోరిక అయినా ఆత్మను కలుషితం చేస్తుందని, దైవునిలో లీనమవ్వడానికి  ఆటంకం కలిగిస్తుందని వివరిస్తుంది . చిన్న కోరికలు కూడా ఆత్మను దేవుని నుండి దూరం చేస్తాయి.

ప్రసిద్ధ “నాదా ” (Nothing) సూత్రాలు

ఇందులోని అత్యంత ప్రసిద్ధ భాగం, ఆత్మ ఏ విధంగా ప్రవర్తించాలో వివరించే సూత్రాలు:

"ఇది కోరుకోని వానికి, ప్రతిదీ సమృద్ధిగా లభిస్తుంది" 

ఈ సూత్రం యొక్క సారాంశం: ఆత్మ కేవలం దేవుణ్ణి మాత్రమే కోరాలి, ఇతర ఆధ్యాత్మిక అనుభవాలను లేదా భావోద్వేగాలను కోరరాదు .

 “ప్రేమతో రగిలి” – ఉన్నత ప్రేమ

ఈ ప్రయాణంలో భూసంబంధమైన కోరికలను జయించడానికి, ఆత్మకు దైవ  ప్రేమతో రగిలిపోవాల్సిన అవసరం ఉందని వివరిస్తుంది. ఈ ఉన్నతమైన ప్రేమ ఆత్మకు శక్తినిస్తుంది .

ఆత్మకు రాత్రి   (విశ్వాసం)

 ఆత్మ యొక్క రాత్రి  ప్రారంభంలో, ఆత్మ  దేవునిలో లీనమవ్వడానికి మనలో నుండి దేవునిలో లీనం కాగలిగే  సమీప సాధనం  గా విశ్వాసం కనుక విశ్వాసం మీద  పై దృష్టి పెడుతుంది . ఇంద్రియాల రాత్రి కంటే ఇది చాలా కష్టతరమైన, లోతైన ప్రక్షాళన .

ఇరుకైన మార్గం

విశ్వాసం ఆత్మకు ఒక “రహస్య నిచ్చెన” లాంటిది. ఇది చీకటిగా ఉంటుంది, కానీ సురక్షితమైన మార్గదర్శి . ఈ మార్గంలో ఆత్మ “వేషం ధరించి” (disguised) ఉంటుంది, అంటే దాని సహజ స్థితి దైవికంగా మారుతుంది .

ఇక్కడ ఆత్మ యొక్క మూడు శక్తులను (faculties) ఎలా శూన్యం చేసి,  ఆత్మ దేవునిలో లీనమవ్వడానికి  సిద్ధం చేస్తాయో వివరించాడు: ఇక్కడ విశ్వాసం , నమ్మిక ప్రేమ అను మూడు ప్రధాన పుణ్యముల ద్వారా బుద్ది , జ్ఞాపక శక్తి, సకల్పాన్ని ఎలా శూన్యం చేయాలో చెపుతారు.

·        విశ్వాసం (Faith)బుద్ధి (Intellect) ను శూన్యం చేస్తుంది

·        నమ్మకం/ఆశ (Hope)జ్ఞాపకశక్తి (Memory) ను శూన్యం చేస్తుంది

·        ప్రేమ (Charity)సంకల్పం (Will) ను శూన్యం చేస్తుంది 

విశ్వాసం బుద్ధికి “చీకటి”గా ఉంటుంది. ఎందుకంటే ఇది మన సహజ తెలివి, అవగాహనలకు అందనిది. కాబట్టి ఆత్మ “చీకటిలో” నడవాలి .

ప్రత్యక్షతలు, దర్శనాలు, వాక్యాలు

 ఈ విధంగా ఉన్నప్పుడు ఆత్మ అనేక అతీంద్రియ అనుగ్రహాలు పొందుతుంది.  సిలువ యోహాను  దర్శనాలు, దేవుని స్వరం వినడం,వంటి అతీంద్రియ అనుభవాలను అంతిమ లక్ష్యం కాకుండా, అడ్డంకులుగా ఎలా చూడాలో వివరిస్తాడు. ఆత్మ వాటిని అంటిపెట్టుకుని ఉండరాదు; నేరుగా వాటి వెనుక ఉన్న సజీవ దేవుణ్ణి చేరుకోవాలి ..

ధ్యానం నుండి ధ్యాసకు మార్పు

ఆత్మ ధ్యానం (meditation) నుండి ధ్యాస/చింతన (contemplation) కు మారడానికి సిద్ధంగా ఉందని సూచించే మూడు సంకేతాలను ఇక్కడ వివరిస్తాడు .

 జ్ఞాపకశక్తి

ఇక్కడ జ్ఞాపకశక్తి మరియు సంకల్పం నుండి వచ్చే ఆటంకాలను గురించి చర్చిస్తుంది. జ్ఞాపకశక్తి ద్వారా వచ్చే స్పష్టమైన  భావాలు , ఆలోచనలు ఆత్మను దేవుని నుండి దూరం చేయకుండా, వాటిని ప్రేమతో దేవుని వైపు మళ్ళించాలి .

సంకల్పం (Will) – నాలుగు భావాలు

ఇది అతి పెద్ద భాగం, ఇది సంకల్పాన్ని ఆక్రమించే నాలుగు భావల గురించి వివరిస్తుంది :

1.     ఆనందం (Joy)

2.     నమ్మకం/ఆశ (Hope)

3.     విచారం/దుఃఖం (Sorrow)

4.     భయం (Fear)

ఈ భావాలు  ఆత్మను వినాశనం వైపు నడిపించవచ్చు, లేదా సరిగా మళ్ళించబడితే, ధర్మం మరియు దేవునిలో ఐక్యత  వైపు నడిపించవచ్చు . ఇక్కడ పునీత యోహాను గారు భౌతిక, సహజ, మరియు ఆధ్యాత్మిక వస్తువుల పట్ల ఆనందాన్ని ఎలా నియంత్రించాలో వివరిస్తాడు .

 ఆరాధనా సాధనాలు

జపమాల, పతకాలు, తీర్థయాత్రలు వంటి భక్తి సాధనాల కూడా ఆటంకాలు కాకుండా చూడాలి. ఇవి మంచివే అయినా, వీటి పట్ల మోహం కూడా దేవుని మార్గంలో అడ్డంకి కావచ్చు.

ముఖ్యమైన ఇతివృత్తాలు

నాదా ” (Nada – Nothing) సిద్ధాంతం

ఈ గ్రంథం యొక్క కేంద్ర బిందువు: దేవుణ్ణి “పొందాలంటే” మనం “అన్నింటికీ వద్దు, వలదు అని చెప్పాలి. ఆత్మ “శూన్యత, మౌనం” లోకి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు ఆ ఆత్మను తనతో  నింపగలడు . యోహాను గారు ఇక్కడ మూడు  మార్గాలను చూపిస్తాడు: “భూ వస్తువులు,” “పరలోక వస్తువులు,” మరియు “నాదా” (Nothing). దేవుణ్ణి చేరే మార్గం కేవలం “నాదా” మాత్రమే .

అనుభవాల పట్ల అతిశయోక్తి నివారణ

ఆధ్యాత్మిక అనుభవాలు, సంతోషాలు, కన్నీళ్ళు. ఇవి కూడా మనం ఆస్వాదించాల్సినవి కావు; వాటిని కూడా అధిగమించాలి. ఎందుకంటే అవి కూడా సృష్టికి చెందినవే, దేవుడు కాదు .

గాఢంధకార రాత్రి

పునీత సిలువ యోహాను దృష్టిలో " గాఢంధకార రాత్రి " అనేది ఒక భౌతికమైన రాత్రి కాదు. అది ఆత్మ తన ఆధ్యాత్మిక ప్రయాణంలో అనుభవించే ఒక తీవ్రమైన శూన్యత, అంధకారం, మరియు దేవుడు లేడనే వేదన కలిగే స్థితి.

చాలామంది అనుకునేటట్లు ఇది దేవుని శాపం కాదు, లేదా సాతాను ఆత్మను శోధించడం కాదు. ఇది దేవుని యొక్క అత్యంత  లోతుగా తన  ప్రేమ చూపించే  ప్రక్రియ. ఆత్మను తనతో శాశ్వతంగా ఏకం చేసుకోవడానికి, దేవుడే ఆత్మకు చేసేటువంటి  ఒక ఆధ్యాత్మిక శస్త్రచికిత్స (Spiritual Surgery).

ఈ ప్రయాణం ఎందుకు రాత్రిలా ఉంటుంది అంటే:

1.           ఆధ్యాత్మిక వస్తువుల ఉపసంహరణ: ఆత్మకు లోకం నుండి, చివరకు ప్రార్థనల నుండి వచ్చే ఆనందం ఆగిపోతుంది.

2.           బుద్ధికి అందని మార్గం: దేవుడు ఆత్మను నడిపించే మార్గం మానవ బుద్ధికి, తర్కానికి అంధకారంగా కనిపిస్తుంది.

3.           దేవుని గొప్ప  కాంతి: దేవుని పవిత్ర కాంతి ఆత్మపై పడినప్పుడు, ఆత్మ తనలోని పాపాలను చూసి భయపడి, ఆ కాంతినే ఒక చీకటిగా భావిస్తుంది.

1. ప్రయాణం ఎక్కడ ప్రారంభమవుతుంది? (The State of Beginners)

ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభంలో (Beginners) ఉన్న సాధకులు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వారు ప్రార్థనలు చేయడానికి, ఉపవాసాలు ఉండటానికి, దేవుని  విషయాల గురించి మాట్లాడటానికి ఎంతో ఇష్టపడతారు. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు వారికి ఎంతో "ఆధ్యాత్మిక మాధుర్యాన్ని " (Spiritual Sweetness or Consolations) ప్రసాదిస్తాడు. ప్రార్థన చేయగానే మనసుకు ప్రశాంతత కలగడం, కన్నీళ్లు రావడం, ఏదో తెలియని ఆనందం కలగడం జరుగుతుంది.

కానీ, సిలువ యోహాను గారి ప్రకారం, ఈ స్థితిలో ఉన్న సాధకులు ఆధ్యాత్మికంగా ఇంకా "పసిపిల్లలు". ఒక తల్లి తన చంటిబిడ్డకు పాలు ఇచ్చి, చంకన ఎత్తుకుని ఎలా ముద్దు చేస్తుందో, దేవుడు కూడా ప్రారంభ సాధకులను అలా ఆధ్యాత్మిక ఆనందాలతో ముద్దు చేస్తాడు.

ప్రారంభ సాధకులలో ఉండే ఏడు ప్రధాన పాపాలు (The Seven Spiritual Sins)

ఈ ఆధ్యాత్మిక ఆనందాల వల్ల సాధకులలో తెలియకుండానే కొన్ని అంతర్గత బలహీనతలు చోటు చేసుకుంటాయి. దేవుడు ఆత్మను చీకటి రాత్రిలోకి నెట్టడానికి ఇవే ప్రధాన కారణాలు:

ఆధ్యాత్మిక పాపం          సాధకుడి ప్రవర్తన

1. ఆధ్యాత్మిక అహంకారం: తాము ఇతరులకంటే బాగా ప్రార్థన చేస్తున్నామని, గొప్ప భక్తులమని భ్రమపడటం. ఇతరుల తప్పులను వేలెత్తి చూపడం. తమ గురువులు తమను ప్రత్యేకంగా చూడాలని కోరుకోవడం.

2. ఆధ్యాత్మిక లోభత్వం : ఎక్కువ పుస్తకాలు చదవడం, ఎక్కువ సిలువలు, జపమాలలు సేకరించడం. అంతర్గత భక్తి కంటే బాహ్య వస్తువులపై మనస్సు పెట్టడం.

3. ఆధ్యాత్మిక మోహం :   ప్రార్థన లేదా ధ్యాన సమయంలో కలిగే మానసిక ఆనందాన్ని, శారీరక లేదా ఇంద్రియ సుఖంలా మార్చుకుని ఆస్వాదించడం.

4. ఆధ్యాత్మిక కోపం :        ప్రార్థనలో అనుకున్న ఆనందం కలగనప్పుడు తమపై తామే కోప్పడటం, లేదా ఇతరులపై అసహనం ప్రదర్శించడం. తమకు ఇంకా పవిత్రత రాలేదని నిరాశ చెందడం.

5. ఆధ్యాత్మిక తిండిపోతుతనం :   ప్రార్థనను దేవుని కోసం కాకుండా, ప్రార్థన ద్వారా కలిగే "ఆనందం" కోసం చేయడం. దేవుడు ఇచ్చే బహుమతులను ప్రేమించడం, దేవుడిని ప్రేమించరు.

6. ఆధ్యాత్మిక అసూయ : ఇతరులు ఆధ్యాత్మికంగా తమకంటే ముందుకు వెళ్తుంటే ఓర్వలేకపోవడం. వారి భక్తి నకిలీదని నిరూపించడానికి ప్రయత్నించడం.

7. ఆధ్యాత్మిక సోమరితనం: ప్రార్థనలో ఆనందం తగ్గినప్పుడు, కష్టంగా అనిపించినప్పుడు ప్రార్థనను పూర్తిగా మానేయడం. ఆధ్యాత్మిక శ్రమకు వెరవడం.

ఈ ఏడు అంతర్గత లోపాలను తుడిచిపెట్టడానికి, ఆత్మను పసిపిల్లల దశ నుండి పెద్దవారి దశకు (Maturing) తీసుకువెళ్లడానికి దేవుడు ఆత్మను మొదటి చీకటి రాత్రిలోకి ప్రవేశపెడతాడు.

2. మొదటి దశ: ఇంద్రియాల గాఢంధకార రాత్రి (The Passive Night of the Senses)

ఒకరోజు అకస్మాత్తుగా ఆత్మకు ప్రార్థనలో ఉన్న ఆనందం అంతా ఆవిరైపోతుంది. రోజులాగే ప్రార్థన కూర్చున్నా మనసుకు ఏమాత్రం ప్రశాంతత కలగదు. బైబిల్ చదివినా ఏమీ అర్థం కాదు, విసుగు వస్తుంది. దీనినే "ఇంద్రియాల నిష్క్రియ రాత్రి" (Passive Night of the Senses) అంటారు.

తల్లి పాలు విడిపించే ఉపమానం

పునీత సిలువ యోహాను గారు ఇక్కడ ఒక అద్భుతమైన ఉపమానాన్ని ఇస్తారు. పసిబిడ్డ పెద్దవాడు కావాలంటే తల్లి పాలు ఇవ్వడం మాన్పించి, గట్టి ఆహారాన్ని అలవాటు చేయాలి. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం మానేసినప్పుడు ఆ పిల్లాడు ఏడుస్తాడు, తల్లి తనను ప్రేమించడం లేదనుకుంటాడు. కానీ నిజానికి తల్లి బిడ్డ ఎదుగుదల కోసమే అలా చేస్తుంది.

అలాగే, దేవుడు ఆత్మకు ఇచ్చే ఆధ్యాత్మిక పాలను (ఆనందాలను) నిలిపివేసి, కష్టాలను తట్టుకునే గట్టి ఆహారాన్ని అలవాటు చేస్తాడు.

ఇది గాడంధకార  రాత్రే అని గుర్తించడం ఎలా? (Three Signs)

ప్రార్థనలో ఆనందం లేకపోవడం అనేది మన శారీరక అనారోగ్యం వల్ల గానీ, లేదా మనం చేసిన ఏదైనా పాపం వల్ల గానీ జరగవచ్చు. కానీ అది దేవుడు పంపిన " గాడంధకార రాత్రి " అని నమ్మడానికి  సిలువ యోహాను గారు మూడు గుర్తులను ఇచ్చారు:

1.           ఎక్కడా ఆనందం లభించదు: ఆత్మకు దేవుని విషయాలలో ఆనందం ఉండదు, పోనీ లోకసంబంధమైన వస్తువులలో, స్నేహితులలో, వినోదాలలో కూడా సంతోషం కలగదు. అంతటా ఒక రకమైన విరక్తి ఉంటుంది.

2.           దేవుని గురించిన ఆందోళన: ఆత్మకు ప్రార్థన కష్టంగా ఉన్నా, "నేను దేవునికి దూరమయ్యానేమో, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందేమో" అనే నిరంతర తపన, ఆందోళన గుండెల్లో ఉంటుంది. సోమరితనం వల్ల ప్రార్థన మానేసేవారికి ఈ ఆందోళన ఉండదు.

3.           ధ్యానం చేయలేకపోవడం: ఆత్మ తన బుద్ధితో, ఊహాశక్తితో పూర్వపు రోజుల్లోలాగా ఆలోచించి ప్రార్థన చేయలేకపోతుంది. మనస్సు శూన్యంగా మారిపోతుంది.

ఈ దశలో సాధకుడు ఏమి చేయాలి?

ఈ స్థితిలో చాలామంది ప్రార్థన చేయడం మానేస్తారు లేదా పూర్వపు ఆనందం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ  సిలువ యోహాను గారు ఇచ్చే  సలహా: "ప్రశాంతంగా ఉండండి" (Be Still).

• దేవుడు మిమ్మల్ని నిశ్శబ్ద ప్రార్థనలోకి తీసుకువెళ్తున్నాడు.

• ఏమీ ఆలోచించకుండా, ఏమీ ఆశించకుండా, కేవలం దేవుని సన్నిధిలో ఒక ప్రేమపూర్వకమైన నిశ్శబ్దంతో గడపండి.

ఈ ఇంద్రియాల రాత్రి సాధారణంగా కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల వరకు కొనసాగుతుంది. దీనివల్ల ఇంద్రియాలు అదుపులోకి వచ్చి, ఆత్మ ప్రశాంత స్థితికి చేరుకుంటుంది.

3. అంతరాల కాలం: ప్రకాశం

ఇంద్రియాల గాఢంధకార రాత్రి ముగిసిన తర్వాత, ఆత్మ "ప్రకాశత” అనే స్థితిలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఆత్మకు ఒక కొత్త రకమైన ఆధ్యాత్మిక స్వేచ్ఛ, శాంతి లభిస్తాయి. బుద్ధికి దైవ  విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఆత్మ ఎంతో నమ్మకంతో, ధైర్యంతో దేవుని మార్గంలో నడుస్తుంది.

అయితే, ఇది ఇంకా చివరి దశ కాదు. ఆత్మ యొక్క పైపైన ఉన్న ఇంద్రియాలు మాత్రమే శుద్ధి చేయబడ్డాయి. కానీ ఆత్మ లోపల అంతరాలలో, అహంకారం యొక్క వేర్లు (Roots of self-love) ఇంకా అలాగే ఉంటాయి. ఇనుమును పైపైన తుడిచినా, లోపల ఉన్న తుప్పు పోవాలంటే దాన్ని నిప్పుల్లో కాల్చాల్సిందే. అందుకోసం దేవుడు అత్యంత భయంకరమైన రెండవ రాత్రిని పంపుతాడు.

4. రెండవ దశ: ఆత్మ యొక్క అంతర్గత గాఢంధకార రాత్రి  (The Passive Night of the Spirit)

పునీత సిలువ యోహాను మాత్రమే చెప్పే  అత్యంత లోతైన మరియు కఠినమైన భాగం. ఈ రాత్రి కేవలం ఇంద్రియాలకు సంబంధించింది కాదు, ఆత్మ యొక్క మూల శక్తులైన బుద్ధి, జ్ఞాపకశక్తి, సంకల్పాలను (Intellect, Memory, Will) పూర్తిగా దహించివేసే రాత్రి.

ఇది ఎంత కఠినంగా ఉంటుందంటే, మనిషి బ్రతికి ఉండగానే నరకయాతనను అనుభవించినట్లు ఉంటుంది.

కాలుతున్న కట్టె ఉపమానం (The Log of Wood)

పునీత సిలువ యోహాను ఇక్కడ ఒక ప్రసిద్ధమైన, అద్భుతమైన శాస్త్రీయ ఉపమానాన్ని ఇస్తారు. ఒక తడి కట్టెను తీసుకెళ్లి పెద్ద మంటలో వేసినప్పుడు ఏమి జరుగుతుంది?

1. మొదటి దశ: మంట యొక్క వేడి తగలగానే, కట్టె లోపల ఉన్న తడి, మురికి అంతా పొగ రూపంలో, నల్లటి నీటి రూపంలో బయటకు వస్తుంది. అప్పుడు ఆ కట్టె చాలా నల్లగా, అసహ్యంగా, దుర్వాసనతో కనిపిస్తుంది.

2. రెండవ దశ: కట్టె పూర్తిగా ఎండిపోయిన తర్వాత, మంట దాన్ని పూర్తిగా ఆవహించి, ఆ కట్టెను కూడా నిప్పుకణికగా మారుస్తుంది. అప్పుడు కట్టె కూడా మంటలాగే ఎర్రగా ప్రకాశిస్తుంది.

ఇక్కడ మంట అనేది దేవుని యొక్క పరిశుద్ధ ప్రేమ (Divine Love/Contemplation). కట్టె అనేది మానవ ఆత్మ. దేవుని ప్రేమ అనే మంట ఆత్మపై పడినప్పుడు, మొదట ఆత్మలోని పాపాలు, అపవిత్రత అంతా బయటకు వచ్చి, ఆత్మకు తను చాలా ఘోర పాపిలా, అసహ్యంగా కనిపిస్తుంది. ఆ బాధే ఆత్మ యొక్క అంతర్గత గాఢంధకార రాత్రి. చివరకు ఆ ఆత్మ దేవుని ప్రేమలో కాలి, దైవస్వరూపంగా మారుతుంది.

5. అంతర్గత రాత్రిలో ఆత్మ అనుభవించే వేదనలు

ఈ రెండవ గాఢంధకార రాత్రిలో ఆత్మ అనేక రకాల మానసిక, ఆధ్యాత్మిక వేదనలను అనుభవిస్తుంది:

ఎ) దేవుడు నన్ను తిరస్కరించాడు అనే భయం

ఆత్మకు తాను దేవుని చేత పూర్తిగా విసర్జించబడ్డాననే నమ్మకం కలుగుతుంది. "దేవుడు నన్ను నరకానికి పంపేసాడు, నా ప్రార్థనలు ఆయనకు వినబడవు" అని ఆత్మ ఏడుస్తుంది. దేవుని ఉనికి పూర్తిగా మరుగైపోయినట్లు అనిపిస్తుంది.

బి) అపవిత్రత యొక్క జ్ఞానం

దేవుని మహా పరిశుద్ధ కాంతి ఆత్మ అంతరంగంలోకి ప్రవేశించినప్పుడు, ఆత్మకు తనలోని చిన్న చిన్న తప్పులు కూడా కొండంతలుగా కనిపిస్తాయి. సూర్యకాంతి గదిలోకి వచ్చినప్పుడు గదిలోని దుమ్ము కణాలు ఎలా కనిపిస్తాయో అలా అన్నమాట. తన అపవిత్రతను చూసి ఆత్మ తట్టుకోలేకపోతుంది.

సి) శూన్యత మరియు అశక్తత

బుద్ధి ఆలోచించలేదు, జ్ఞాపకశక్తి దేనినీ గుర్తుంచుకోలేదు, సంకల్పం దేనినీ ప్రేమించలేదు. ఆత్మ పూర్తిగా పక్షవాతం వచ్చినదానిలా, ఎటూ కదల్లేని స్థితిలో శూన్యంలో పడిపోయినట్లు ఉంటుంది.

 సిలువ యోహాను గారి  మాటలలో: "ఇది ఒక మనిషిని బతికుండగానే సమాధిలో పెట్టినట్లు ఉంటుంది. చుట్టూ చీకటి, పైన దేవుని నిశ్శబ్దం... ఆత్మకు మరణమే శరణ్యం అనిపిస్తుంది."

6. గాఢంధకార రాత్రి ఎందుకు అవసరం? (The Divine Purpose)

దేవుడు ఆత్మను ఇంతగా ఎందుకు బాధపెడతాడు ? దీని వెనుక ఉన్న దైవ  రహస్యం ఏమిటి?  సిలువ యోహాను గారు దీనికి మూడు కారణాలు చెబుతారు:

1.  అహంకారం సమూల నాశనం చేయుటకు: మనిషిలో ఉన్న 'నేను', 'నా భక్తి', 'నా జ్ఞానం' అనే అహాన్ని పూర్తిగా చంపేయడానికి ఈ శూన్యత అవసరం. ఆత్మ తను "ఏమీ కాదు" అని గ్రహించినప్పుడే దేవుడు "అంతా" అవుతాడు.

2.  స్వచ్ఛమైన విశ్వాసం కలుగుటకు: ఎటువంటి ఆధారం లేనప్పుడు, దేవుడు కనిపిస్తాడనే నమ్మకం లేనప్పుడు కూడా దేవుడిని నమ్మడమే "నిజమైన విశ్వాసం". గాఢంధకార రాత్రి ఆత్మకు ఈ స్వచ్ఛమైన విశ్వాసాన్ని నేర్పుతుంది.

3. దైవ  రూపాంతరం: ఆత్మ తన పాత మానవ స్వభావాన్ని కోల్పోయి, దేవుని స్వభావాన్ని సంతరించుకోవడానికి ఈ కఠినమైన ప్రక్రియ అవసరం.

7. గాఢంధకార రాత్రి ముగింపు: ఉషోదయం మరియు ఐక్యత

 గాఢంధకార రాత్రి ఎల్లకాలం ఉండదు. ఆత్మ తనలోని అపవిత్రతను, అహాన్ని పూర్తిగా కోల్పోయినప్పుడు, ఆ చీకటి నెమ్మదిగా తొలగిపోతుంది. రాత్రి ముగిసి ఉదయం సూర్యుడు ఉదయించినట్లు, ఆత్మలో దేవుని ప్రేమ సజీవంగా ప్రకాశిస్తుంది.

ఈ స్థితిని పునీత సిలువ యోహాను గారు "ఆధ్యాత్మిక వివాహం" (Spiritual Marriage) లేదా సంపూర్ణ ఐక్యత అని పిలిచారు.

• నీటి చుక్క - సముద్రం ఉపమానం: ఆకాశం నుండి పడిన వర్షపు చుక్క సముద్రంలో పడగానే అది సముద్రంతో కలిసిపోతుంది. ఆ తర్వాత ఆ నీటి చుక్కను సముద్రం నుండి వేరు చేయలేము. అలాగే ఆత్మ దేవునితో కలిసి ఒకటే అయిపోతుంది.

• ఫలితం: ఆత్మలో పరిపూర్ణ శాంతి, అంతులేని ఆనందం, మరియు విశ్వజనీనమైన ప్రేమ వెల్లివిరుస్తాయి. ఆత్మ జీవన్ముక్త స్థితిని పొందుతుంది.

జీవన అన్వయం: ఆధునిక కాలంలో గాఢంధకార రాత్రి సెయింట్ జాన్ ఆఫ్ ది క్రాస్ వివరించిన "ఆత్మ యొక్క చీకటి రాత్రి" కేవలం సన్యాసులకు మాత్రమే కాదు, నేటి ఆధునిక మానవునికి కూడా ఎంతో ఉపయోగకరం.

• మానసిక నిరాశ (Depression) vs గాఢంధకార రాత్రి : నేటి కాలంలో చాలామంది అనుభవించే తీవ్రమైన మానసిక నిరాశ, ఒంటరితనం, జీవితంపై విరక్తి వంటి వాటిని అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథం సహాయపడుతుంది. మానసిక నిరాశ మనిషిని స్వార్థం వైపు, ఆత్మహత్య వైపు నడిపిస్తే; ఆధ్యాత్మిక చీకటి రాత్రి మనిషిని దేవుని వైపు, పవిత్రత వైపు నడిపిస్తుంది.

•  ఓర్పు: జీవితంలో కష్టాలు, శూన్యత ఏర్పడినప్పుడు నిరాశ చెందకుండా, అది మన అంతర్గత ఎదుగుదలకు దేవుడు ఇచ్చిన ఒక అవకాశంగా భావించే ఓర్పును ఈ గ్రంథం మనకు నేర్పుతుంది.

  ముగింపు

కార్మెల్ పర్వతారోహణం  ఆత్మను  దేవుని వైపు ప్రయాణించే మార్గంలోని ప్రతి దశను వివరిస్తుంది. ఇది కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు, సిలువ యోహాను గారు స్వయంగా జీవించిన సత్యం . ఆయన ఇచ్చే మార్గదర్శనం అత్యంత వ్యవహారికమైనది, మానసిక విశ్లేషణతో కూడుకున్నది, మరియు అత్యంత సున్నితమైన ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది . ఈ పుస్తకాన్ని ఒక ఆధ్యాత్మిక పటం లేదా “విశ్వాసులకు మార్గదర్శి” గా పిలవవచ్చు  " గాఢంధకార రాత్రి " మనకు ఇచ్చే గొప్ప సందేశం ఒక్కటే: రాత్రి  అనేది వెలుగు  లేకపోవడం  కాదు, అది కాంతి వెలుగు యొక్క  అత్యున్నత రూపం.మనం దేవునికి ఎంత దగ్గరవుతుంటే, మనలోని అంధకారం  అంత తొలగిపోతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టమైన రాత్రి వెనుక ఒక అందమైన ఉదయం దాగి ఉంటుందని, ఆ అంధకారాన్ని ధైర్యంగా దాటినప్పుడే ఆత్మ భగవంతునితో శాశ్వత ఐక్యత అనే అమృతత్వాన్ని పొందుతుందని ఈ గ్రంథం నిరూపిస్తోంది.

 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు