మత్తయి 13:54-58: పరిచయం వెనుకున్న అంధత్వం మరియు అవిశ్వాసం|కార్మెల్ శోభ
మత్తయి 13:54-58
తన పట్టణమును చేరెను, అచట
ప్రార్థనామందిరములో ఉపదేశించుచుండగా, ప్రజలు ఆశ్చర్యచకితులై, “ఇతనికి
ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచటనుండి లభించినవి?” అని
అనుకొనిరి. “ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు
ఇతని సోదరులుకారా? ఇతని సోదరీమణులు అందరు మన మధ్యనలేరా? అటులయిన
ఇవి అన్నియు ఇతడు ఎట్లు పొందెను?” అని, ఆయనను
తృణీకరించిరి. అపుడు యేసు వారితో “ప్రవక్త స్వదేశమందును, స్వగృహమందును
తప్ప మరెందును సన్మానింపబడకపోడు” అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసమువలన ఆయన అచట
ఎక్కువగా అద్భుతములను చేయలేదు.
అనేక మందికి పవిత్ర గ్రంధమును ప్రార్థనాపూర్వకంగా చదివే అలవాటు ఉంటుంది. కానీ
కొన్ని వాక్యభాగాలు మన ప్రశాంతతను చెరిపేసి, మన విశ్వాస పునాదులను కదిలిస్తాయి.
మత్తయి 13:54-58 లోని సంఘటన అలాంటిదే. యేసు ప్రభువు
తన స్వంత ఊరైన నజరేతుకు వెళ్లి ప్రార్థనామందిరంలో బోధించినప్పుడు, అక్కడి ప్రజలు
ఆశ్చర్యపడ్డారు కానీ ఆయనను విశ్వసించలేదు. “ఇతడు వడ్రంగి కుమారుడు కాడా?” అని ప్రశ్నించారు.
ఈ వాక్యం చదివిన ప్రతిసారీ ఒక రకమైన ఆందోళన కలగడం సహజం. ఎందుకంటే, ఇది రెండు వేల
సంవత్సరాల క్రితం నజరేతు వీధుల్లో జరిగిన కథ మాత్రమే కాదు; ఇది నేటి మన ఆధ్యాత్మిక
జీవితానికి ప్రతిబింబం లాంటిది.
ఈ సంఘటనను మనం ధ్యానిస్తే పరిచియం నుండి పక్షపాతం, అక్కడి నుండి అవిశ్వాసం, దాని ద్వారా మనకు కలిగే నష్టం, చివరకు ప్రభువు విమోచన మరియు నిజమైన విశ్వాసం వైపు సాగే ఒక ప్రయాణం మనకు కనిపిస్తుంది.
1. పరిచయమనే ప్రమాదకరమైన ముసుగు
ఈ సువిశేషభాగంలో మొదటగా మనల్ని ఆలోచింపజేసేది "పరిచయత్వం"
(Familiarity). చిన్నప్పటి నుండి చర్చిలో పెరిగిన వారికి, బైబిలు కథలు
కొట్టినపిండిగా మారిన వారికి ఒక నిశ్శబ్ద ప్రమాదం పొంచి ఉంటుంది. యేసు పుట్టుక, ఆయన అద్భుతాలు, సిలువ శ్రమలు, పునరుత్థానం ఇవన్నీ
మనకు ఎంత పరిచియమంటే, కాలక్రమేణా వాటిలోని "ఆశ్చర్యం" లేదా "పవిత్రత" చచ్చిపోతుంది. చాలా సాధారణముగా అనిపిస్తుంది.
నజరేతు ప్రజలకు యేసు ప్రభువు బాగా తెలుసు. ఆయన బాల్యం తెలుసు, ఆయన కుటుంబం
తెలుసు, ఆయన
చేసిన వడ్రంగి పని తెలుసు. ఆయనను "వారిలో ఒకడు"గా చూడడమే వారు చేసినది, అది వారిని ఆయనను
తేలికగా తీసుకొనుటకు ఆస్కారం అయ్యింది. వారు ఆయనలోని దైవత్వాన్ని చూడలేకపోయారు, కేవలం ఆయన
మానవత్వాన్ని మాత్రమే చూశారు.
మన అనుదిన క్రైస్తవ జీవితంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఆదివారం దేవాలయానికి వెళ్లడం, వాక్యం వినడం, పాటలు పాడటం మనకు ఒక సాధారణ "అలవాటు"గా మారిపోయినప్పుడు, దేవుని సన్నిధిని మనం అతి సాధారణంగా తీసుకోవడం ప్రారంభిస్తాం. యేసు ప్రభువు మనకు ఒక చారిత్రక వ్యక్తిగా, ఒక మంచి బోధకునిగా, లేదా మన సంస్కృతిలో ఒక మతపరమైన చిహ్నంగా మాత్రమే మిగిలిపోతే, ఆయన జీవించుచున్న ప్రభువుగా మన హృదయాన్ని పాలించాడానికి మనము ఒప్పుకోము. ఈ పరిచియమనే ముసుగు మన కళ్లకు కప్పినప్పుడు, దేవునికి మనకు మధ్య జరిగించే నిత్య అద్భుతాలు కూడా మనకు సాధారణ విషయాలుగానే కనిపిస్తాయి.
2. పరిచయం నుండి పుట్టే సామాజిక పక్షపాతాలు, అసూయలు
పరిచయం కేవలం దేవుని పట్ల మనకున్న దృష్టిని మాత్రమే
కాదు, మన
తోటి మనుషుల పట్ల మనకున్న వైఖరిని కూడా దిగజార్చుతుంది. పరిచయం నుండి పక్షపాతం, అసూయ జన్మిస్తుంది, నజరేతు ప్రజలు యేసు ప్రభువును
తిరస్కరించడానికి అది ఒక కారణం. ఆయన వృత్తి (వడ్రంగి), ఆయన కుటుంబ
నేపథ్యం, ఆయన నివసించిన సామాన్య వాతావరణం. "ఈ సాధారణ వాతావరణం నుండి ఒక
గొప్ప ప్రవక్త లేదా మేస్సీయా ఎలా రాగలడు?" అనేది వారి అహంకారంతో కూడిన ప్రశ్న. మనలో ఉన్న వ్యక్తి, మనతో తిరిగిన వ్యక్తి ఇంత గొప్పవాడా
? అని అంగీకరించడానికి స్వార్ధంతో,
అసూయతో, పక్షపాతంతో ఉండే మనసులు సిద్దపడవు. “ప్రవక్త
స్వదేశమందును, స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు” అని యేసు ప్రభువు చెప్పిన మాటలు మానవ నైజానికి అద్దం పడుతాయి.
మనం మనకు అతి సమీపంలో ఉన్నవారిని, వారి బలహీనతలు, గత చరిత్ర తెలిసిన
వారిని తక్కువగా అంచనా వేస్తాం. ఈ పక్షపాతం వల్లనే, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో
దేవుడు మన పక్కన ఉన్నవారి ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం వినలేకపోతున్నాం. దేవుడు
రాజరికపు నేపథ్యం లేని దావీదును గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎన్నుకున్నాడు. సరిగా మాట్లాడలేని
మోషేను నడిపించే నాయకునిగా చేశాడు. విద్య లేని పేతురు, సంఘ పునాదిగా
మార్చాడు.
3. పక్షపాతం నుండి రాయిలామారే అవిశ్వాసం
మనుష్యుల పట్ల పక్షపాతం, దేవుని సన్నిధి
పట్ల అలసత్వం పెరిగినప్పుడు, అది హృదయంలో అవిశ్వాసంగా రూపాంతరం చెందుతుంది. మత్తయి 13:58 పవిత్ర
గ్రంధంలోనే అత్యంత విషాదకరమైన వాక్యాలలో ఒకటి: “ప్రజల అవిశ్వాసమువలన ఆయన ఎక్కువగా
అద్భుతములను చేయలేదు.”
ఈ మాట దేవుని సార్వభౌమాధికారాన్ని గాని, ఆయన శక్తిని గాని
బలహీనపరచదు. యేసు ప్రభువు శక్తి
అపరిమితమైనది. కానీ మానవ అవిశ్వాసం అనేది దేవుని శక్తిని అనుభవించకుండా మనల్ని మనం
నిర్బంధించుకునే ఒక జైలు. అవిశ్వాసం అంటే కేవలం చిన్న సందేహం కాదు; అది దేవుని
సత్యాన్ని, ఆయన సమర్థతను తిరస్కరించడం.
మనం ప్రార్థన చేసేటప్పుడు "ఇది సాధ్యమా?" అని హృదయంలో అనుకుంటే, అక్కడ మనం దేవుని శక్తికి హద్దులు గీస్తున్నాం. నజరేతు ప్రజల అవిశ్వాసం వల్ల వారి పట్టణంలో స్వస్థతలు, విడుదలలు ఆగిపోయాయి. అలాగే మన జీవితాల్లో, మన ప్రార్థనల్లో, మన సంఘాల్లో అవిశ్వాసం రాజ్యం ఏలితే, దేవుడు చేయాలనుకున్న గొప్ప కార్యాలు ఆగిపోతాయి. అవిశ్వాసమనే తలుపు మూసి ఉన్నంత కాలం, దేవుని కృప బయటే నిలబడి ఉంటుంది.
4. అవిశ్వాసం తెచ్చే ఆధ్యాత్మిక నష్టం: నజరేతు దౌర్భాగ్యం
అవిశ్వాసానికి, విశ్వాసానికి మధ్య
ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి మనం సువార్తలలోని ఇతర సంఘటనలను చూడాలి.
యేసు ప్రభువు పరిచర్య అంతటిలో విశ్వాసం ఉన్న చోట అద్భుతాలు వరదలా పారాయి."నీ
విశ్వాసము నిన్ను స్వస్థపరచను" అని యేసు ప్రభువు రక్తస్రావ రోగమున్న స్త్రీతో చెప్పాడు. శతాధిపతి
విశ్వాసాన్ని చూసి, ఇస్రాయేలులోనైనను నేను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని మెచ్చుకున్నాడు.
విశ్వాసము అంతముఖ్యమైనది అందుకే కాబోలు,
"విశ్వాస రహితుడగు ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడు." అని హెబ్రీయులకు రాసిన
లేఖలో మనం చదువుతాము.
నజరేతు ప్రజలు యేసును కళ్లారా చూశారు, ఆయన బోధలను
చెవులారా విన్నారు, ఆయన విజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ వారికి "విశ్వాసపు
కళ్లు" లేవు. ఫలితంగా, వారు అద్భుతాలను,
ఆత్మవిడుదలను, రక్షణను కోల్పోయారు. దేవుని సన్నిధి పక్కనే ఉండి కూడా, ఆయన ఇచ్చే
ఆశీర్వాదాలకు వారు దూరమయ్యారు.
మన ఆత్మీయ జీవితంలో కూడా, "నాకు బైబిలు అంతా తెలుసు" అనుకునే ఆధ్యాత్మిక అహంకారం వచ్చినప్పుడు, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన లవొదికయ సంఘం స్థితికి చేరుకుంటాం. లవొదికయ సంఘం "నేను భాగ్యవంతుడను, నాకేమీ కొదవలేదు" అనుకుంది, కానీ దేవుని దృష్టిలో అది హీనమైనది, గుడ్డిది. మన పరిచయత్వం మనల్ని గుడ్డివారిగా చేస్తే, అంతకంటే పెద్ద ఆధ్యాత్మిక నష్టం మరొకటి ఉండదు.
5. తిరస్కరణలో కూడా దేవుని ప్రణాళిక మరియు మాతృక
నజరేతులో జరిగిన ఈ తిరస్కరణతో యేసు ప్రభువు పరిచర్య ఆగిపోలేదు. మానవ అవిశ్వాసం
దేవుని కార్యాన్ని తాత్కాలికంగా ఒక చోట నియంత్రించవచ్చు ఏమో కానీ, దేవుని నిత్య
ప్రణాళికను ఎన్నటికీ ఆపలేదు. యేసు ప్రభువు నజరేతు నుండి ముందుకు సాగిపోయాడు. ఆయన ఇతర
గ్రామాలు, పట్టణాలకు వెళ్లాడు;
చివరకు రక్షణ మార్గాన్ని అన్యజనులందరికీ అందుబాటులోకి తెచ్చాడు.
ఈ సంఘటన మనకు ఒక గొప్ప ధైర్యాన్ని
ఇస్తుంది. మనం సత్యం కోసం నిలబడినప్పుడు, దేవునికి నమ్మకంగా జీవిస్తున్నప్పుడు, మన స్వంత ప్రజలు, మన కుటుంబ సభ్యులు
లేదా మిత్రులు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, తిరస్కరించవచ్చు. మన గత బలహీనతలను
ఎత్తిచూపుతూ మనల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు. కానీ యేసు ప్రభువు మనకు
నేర్పించేదేమిటంటే, మనుష్యుల గుర్తింపు కోసం కాక, దేవుని మహిమ కోసం సేవ చేయాలి.
దేవుడు మానవుల తిరస్కరణను కూడా తన మహిమార్థమై, తన ప్రణాళిక విస్తరణ కోసం ఉపయోగించుకుంటాడు. స్వదేశీయులు నిరాకరించిన మూలరాయి, సమస్త రక్షణ భవనానికి ప్రధాన మూలరాయిగా మారింది.
6. యేసు ప్రభువుని మానవజన్మ రహస్యం మరియు నిజమైన దృష్టి
మనం యేసు ప్రభువును సరిగ్గా అర్థం
చేసుకోవాలంటే, ఆయన మానవు జన్మ
రహస్యాన్ని సరిగ్గా గ్రహించాలి. యేసు ప్రభువు పరలోక మహిమను
విడిచిపెట్టి, తనను తాను రిక్తుని చేసుకొని ఒక దాసుని రూపం ధరించి,
మనుష్యుల పోలికగా ఈ లోకానికి వచ్చాడు (ఫిలిప్పీయులకు 2:6-8).
నజరేతు ప్రజల పొరపాటు ఏమిటంటే, వారు ఆయనను కేవలం ఒక
సాధారణ మనిషి లానే చూశారు. ఆయనలో ఉన్న "దైవత్వాన్ని" చూడలేకపోయారు. ఆయన
వడ్రంగి కుమారుడే అని అనుకున్నారు. అది
ఆయన సంపూర్ణ మానవునిగా జీవించాడాని తెలియజేస్తుంది కాని ఆయన నిజ దేవుని కుమారుడు. తండ్రి దేవునితో సమానత్వం కలిగినవాడు. తన
సమనత్వాన్ని పట్టుకొని వేలాడలేదు. మానవుని రక్షించడానికి మానవ రూపం వెత్తాడు. ఆయన చేసిన
పనులు కేవలం మానవుడు మాత్రమే అయితే చేయలేడు, ఇది ఆలోచించలేకపోయారు నజారేతు వాసులు.
వారికి యేసు ప్రభువు పరిచయం ఆయన చేసిన పనులను తేలికగా చూడటానికి పనికివచ్చింది కాని
ఆయనను నిజంగా ఎవరు అని గుర్తించడానికి పనికిరాలేదు. అందరు ఇలా ఉండనవసరం లేదు, నేను
ఎలా ఉన్నాను? అని నేను ఆలోచించుకోవాలి.
ఆయన సజీవుడగు దేవుని కుమారుడు
విశ్వాసియైనవాడు ఈ రెండు సత్యాలను కలిపి చూడగలగాలి. దేవుడు సామాన్యమైన విషయాల ద్వారా, సామాన్యమైన మనుష్యుల ద్వారా, సామాన్య వాతావరణంలో తన అద్భుతమైన మహిమను బయలుపరుస్తాడు. బాహ్య రూపాన్ని మాత్రమే చూసే, శరీర సంబంధమైన కళ్లు దేవుని కార్యాలను గుడ్డిగా చూస్తాయి; కానీ ఆత్మ సంబంధమైన విశ్వాసపు కళ్లు ముసుగులను దాటి దేవుని హృదయాన్ని చూడగలుగుతాయి.
7. ఆత్మపరిశీలన
మత్తయి 13:54-58 మనల్ని నిర్ణయం ముందు నిలబెడుతుంది. ఈ
రోజు మన ముందు రెండు మార్గాలు ఉన్నాయి. నజరేతు ప్రజల మార్గం: పరిచియత్వంతో దేవుని
సన్నిధిని తేలికగా చూడటం, పక్షపాతాలతో ఇతరులకు తీర్పు
తీర్చడం, అవిశ్వాసంతో దేవుని కార్యాలను మన జీవితాల్లో ఆపివేయడం.
విశ్వాసి మార్గం: దేవుని సన్నిధిని
నిత్యనూతనంగా ఆరాధించడం, వినయంతో దేవుని మాటలను అంగీకరించడం, చూడకయే నమ్మే సజీవ విశ్వాసంతో ఆయన
అద్భుతాలకు హృదయ తలుపులు తెరవడం. దేవుడు ఏ రూపంలో, ఏ వ్యక్తి ద్వారా మాట్లాడినా వినే
వినమ్రతను పెంచుకోవాలి.
ప్రార్థన
ప్రభువా! నా హృదయపు లోతులలో ఉన్న ఆలోచనలు
మీకు తెలుసు, నేను చూసే వారితో, కలిసే వారితో నాకున్న
పరిచయం నన్ను గుడ్డిగా మార్చకుండా కాపాడుము.
నీ సన్నిధిని, నీ వాక్యమును సాధారణ విషయములుగా చూసే అలసత్వము నుండి నను మళ్లింపుము.
నా హృదయములో ఉన్న అవిశ్వాసమును,
సందేహములను క్షమించుము. నజరేతు ప్రజలవలె పక్షపాతముతో, బాహ్య రూపాన్ని
బట్టి మనుష్యులను తీర్పు తీర్చే పాపము నుండి నన్ను శుద్ధి చేయుము. నీవు సామాన్యుల
ద్వారా, నేను
ఊహించని మార్గాలలో మాట్లాడే దేవుడవని నమ్మే పవిత్రమైన విశ్వాసాన్ని నాకు
ప్రసాదించుము. నిన్ను కేవలం చారిత్రక బోధకునిగా కాక, నా హృదయమును పాలించే సజీవుడగు ప్రభువుగా
చూసే కృపనిమ్ము. విశ్వాసమనే తలుపును నా హృదయములో ఎల్లప్పుడూ తెరిచి ఉంచుట నాకు నేర్పించు.
ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment