చీకటి నుండి వెలుగులోకి: మత్తయి 8:28-34 ధ్యానం | కార్మెల్ శోభ
జులై 01, 2026
చీకటి నుండి వెలుగులోకి
మత్తయి 8 : 28-34
ఆవలి తీరమందలి గదరెనీయుల ప్రాంతమునకు యేసు చేరగా, దయ్యములు పట్టిన వారిద్దరు సమాధులలో నుండి వెలుపలికి వచ్చిరి. వారు ఉగ్రస్వరూపులు, వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవరికిని ధైర్యము చాలకుండెను. "దేవుని కుమారుడా! మాతో నీకేమి పని? సమయము ఆసన్నము కాక మునుపే మమ్ము శిక్షింప వచ్చితివా?" అని, వారిద్దరు బిగ్గరగ కేకలు వేసిరి. ఆ సమీపముననే ఒక పెద్ద పందుల మంద మేత మేయు చుండెను. "మమ్ము ఇచట నుండి పారద్రోల దలచిన ఎడల ఆ పందుల మందలలోనికి పోనిమ్ము" అని దయ్యములు యేసును కోరగా ఆయన "అట్లే పొండు" అని సెలవిచ్చేను. అంతట అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించేను. వెంటనే నిట్టనిలువున నున్న ఆ మిట్టనుండి ఆ పందుల మంద సముద్రములో పడి మునిగి ఊపిరాడక చచ్చేను. ఆ మంద కాపరులు పట్టణము లోనికి పరుగెత్తి, జరిగిన విషయములనేల్ల ప్రజలకు తెలిపిరి. అంతట ఆ పట్టణవాసులేల్లరు వచ్చి, యేసును కలిసి, తమ ప్రాంతమును విడిచి పొమ్మని బ్రతిమాలిరి.
"దేవుని కుమారుడా! మాతో నీకేమి పని ?సమయము ఆసన్నము కాక మునుపే మమ్ము శిక్షింప వచ్చితివా?" — మత్తయి 8:29
గలిలియ సముద్రంలో చెలరేగిన తుఫానును
ఒక్క మాటతో ఆపిన ప్రభువు తన ప్రయాణాన్ని ఆపక అవతలి ఒడ్డుకు, గదరేనీయుల అన్యదేశ
ప్రాంతానికి వెళుతున్నాడు. అది అన్యుల ప్రదేశం. అపవిత్రమైన దేశం. అక్కడ ఆయనను చూడగానే దయ్యములు పట్టిన ఇద్దరు పెద్దగా అరుస్తున్నారు. వారు సామాన్య వ్యక్తుల వలె లేరు. సమధులలో ఉన్నారు. వాటి మధ్య నివసిస్తున్నారు. వారి ప్రవర్తన చాలా భయంకరంగా ఉంది. వారు గోలుసులతో కట్టివేయబడ్డారు, వాటిని తెంపుకొనుటకు ప్రయత్నిస్తున్నారు. తమను తామే గాయపరచుకొంటున్నారు. వీరు కట్టివేయబడ్డారు, సమాధులలో ఉంచబడ్డారు అంటే ఆ ఊరి ప్రజలు వీరిని వేరు చేశారు. వీరిని తమ మధ్య నుండి దూరంగా పెడుతున్నారు. వీరు దయ్యములుచే శోదింపబడుతున్నందునా వీరితో ఉండుటకు ఎవరు సహాసించడంలేదు. అటువంటి పరిస్తితులలో ఉన్న వారి దగ్గరకు యేసు ప్రభువు వెళుతున్నారు. ఆ దయ్యము పట్టిన వారు ఆయన దేవుని కుమారుడని చెబుతున్నారు. ఆయన సమయం ఇంకా రాలేదు అని కూడా ఆ దయ్యములకు తెలుసు కనుక ఆ మాటలనే వారు అంటున్నారు. దీని వెనుక ఒక సత్యం ఉంది. యేసు క్రీస్తు ప్రేమకు హద్దులు లేవు. ఆశలేని చోట, చీకటిలో ఉన్న వారికి, భయంతో బ్రతికే చోటకు కూడా ప్రభువు వస్తారు. కుటుంబము, సమాజం అందరు దూరం పెట్టిన ప్రభువు మన చెంతకు వస్తారు.
సమాధుల మధ్య బంధించబడిన జీవితం: అంతర్గత నరకం
ఆ ఇద్దరు మనుష్యులు ఇళ్లను వదిలి సమాధుల్లో
జీవిస్తున్నారు. శారీరకంగా వారు బ్రతికే ఉన్నప్పటికీ, ఆధ్యాత్మికంగా
మరియు సామాజికంగా వారు మృతులతో సమానం. వారిలో ఉన్న క్రూరత్వం ఎంత భయంకరమైనదంటే, ఆ మార్గంలో
నడవడానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు. సమాజం వారిని గొలుసులతో బంధించడానికి
ప్రయత్నించింది, కానీ ఆ బంధనాలను వారు
తెంచుకున్నారు.
ఇది కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక
చారిత్రక సంఘటన మాత్రమే కాదు. ఇది నేటి ఆధునిక మానవుని అంతర్గత స్థితికి అద్దం
పడుతోంది.
- ఆధునిక సమాధులు: నేడు ఎంతోమంది మనుషులు బాహ్యంగా విలాసవంతమైన ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ, అంతర్గతంగా ఏదో ఒక "సమాధి"లోనే బ్రతుకుతున్నారు. గతం యొక్క చేదు జ్ఞాపకాలు, క్షమించలేని కోపం, పగ, అసూయ, రహస్య పాపాలు మరియు వీడని వ్యసనాలు అనే సమాధులలో మనుషులు బందీలవుతున్నారు.
- తమను తామే హింసించుకొనుట : దయ్యంచె పీడితులు రాళ్లతో తమ్ముతాము గాయపరుచుకున్నట్లుగానే, నేడు మనుషులు తమ తప్పుడు నిర్ణయాల ద్వారా, డిప్రెషన్ (కుంగుబాటు) గురవుతున్నారు. తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు.
- ఒంటరితనం మరియు వేరుపాటు: పాపం ఎప్పుడూ మనిషిని దేవునికి, సమాజానికి, చివరికి తన స్వంత కుటుంబానికి దూరం చేస్తుంది. ఒంటరితనం అనే చీకటి గదిలో బంధిస్తుంది. గదరేనీయుల దయ్యం పిడుతుల వలె, నేటి మానవుడు కూడా బంధాలను తెంచుకుని, ఒంటరితనపు సమాధుల్లో కాలం వెళ్లదీస్తున్నాడు.
చీకటి శక్తులు కూడా ఆయనను గుర్తించాయి
శిష్యులు యేసు ప్రభువు తోనే ఉంటూ, ఆయన చేసిన
అద్భుతాలు చూస్తూ కూడా, సముద్రం శాంతించినప్పుడు
"ఈయన ఎవరో?" అని ఇంకా సందేహిస్తూనే
ఉన్నారు. కానీ ఆశ్చర్యకరంగా, చీకటి శక్తులు (దయ్యాలు)
యేసు ప్రభువును చూడగానే దూరం నుండే గుర్తుపట్టాయి. "దేవుని కుమారుడా, మాతో నీకేమి పని ?" అని కేకలు
వేశాయి. తమ అంతిమ తీర్పు సమయం రాకముందే తమను బాధించడానికి వచ్చావా అని వణికాయి. " దేవుడు ఒక్కడే అని నీవు విశ్వసింతువు కదా ? మంచిదే ! పిశాచములును విశ్వసించును. భయముతో గజ గజ లాడును. " యాకోబు 2:19
- యేసు ప్రభువు దేవుని కుమారుడని దయ్యాలకు తెలుసు, ఆయనకు ఉన్న సర్వాధికారం గురించి వాటికి స్పష్టత ఉంది. కానీ ఆ జ్ఞానం వాటిని మార్చలేదు, వాటికి రక్షణను ఇవ్వలేదు.
- మనలో చాలామందికి బైబిల్ వాక్యాలు తెలుసు, సంప్రదాయాలు తెలుసు, యేసుక్రీస్తు చరిత్ర తెలుసు. కేవలం ఈ "బుద్ధిపరమైన జ్ఞానం" మనల్ని రక్షించలేదు. దయ్యాల జ్ఞానానికి, ఒక నిజమైన విశ్వాసికి ఉండవలసిన తేడా ఏమిటంటే లొంగుబాటు మరియు ప్రేమ. దేవుని ఉనికిని నమ్మడం మాత్రమే కాదు, ఆయన చిత్తానికి మన జీవితాలను పూర్తిగా అప్పగించినప్పుడే ఆ విశ్వాసానికి జీవము పొందే అవకాశం ఉంటుంది.
ఒక్క మాట- సృష్టికర్త వాక్కు
యేసు ప్రభువు ఆ దయ్యాలతో సుదీర్ఘమైన చర్చలు జరపలేదు.
ఎటువంటి మంత్రతంత్రాలు, క్రతువులు, లేదా
సుదీర్ఘమైన విమోచన ప్రార్థనలు చేయలేదు. ఆయన కేవలం ఒక్క మాటతో ఆజ్ఞాపించాడు: “పొండు ”. ఆ ఒక్క
మాటతో శతాబ్దాలుగా ఆ మనుషులను పీడిస్తున్న చీకటి శక్తుల సామ్రాజ్యం కూలిపోయింది.
- దైవ వాక్కు యొక్క శక్తి: ఆదికాండంలో శూన్యంలో నుండి, చీకటిలో నుండి "వెలుగు కలుగును గాక" అని పలికిన అదే వాక్కు ఇక్కడ మానవ శరీరధారియై నిలబడింది. సృష్టిని కలుగజేసిన వాక్కుకు, సృష్టిలోని ప్రతి శక్తీ లొంగి తీరాల్సిందే.
- విశ్వాసికి ధైర్యం: ఈ సత్యం ప్రతి విశ్వాసికి ఒక గొప్ప నిరీక్షణను ఇస్తుంది. మన జీవితాల్లో శతాబ్దాలుగా గూడు కట్టుకున్న ఏ పాపపు అలవాటైనా, వంశపారంపర్యంగా వస్తున్న ఏ శాపమైనా, సైతాను విసిరే ఏ శోధన అయినా సరే క్రీస్తు యొక్క ఒక్క మాట ముందు నిలబడలేదు. ఆయన మన వైపు తిరిగి "విడుదల కలుగును గాక" అని పలికితే, ఎలాంటి కటిక చీకటైనా వెలుగుగా మారాల్సిందే.
విలువల పోరాటం ఆత్మ అమూల్యత
యేసు ప్రభువును నేరుగా ఎదిరించలేక, దయ్యాలు
తమను ఆ ప్రాంతంలో మేస్తున్న పందుల మందలోకి వెళ్లడానికి అనుమతించమని వేడుకుంటాయి.
యేసు ప్రభువు పొండు అనగానే , అవి ఆ పందుల
మందలోకి వెళ్ళాయి . ఆ వెంటనే, ఆ మందంతా కొండచరియ నుండి
సముద్రంలోకి దూకి, నీటిలో మునిగి చనిపోతుంది. ఈ విషయం రెండు ముఖ్యమైన సత్యాలను మనకు
బోధిస్తుంది:
ఎ) సాతాను
పరిమిత శక్తి:
సాతాను ఎంత నాశన కారి అయినప్పటికీ , సర్వశక్తి వంతుడు కాదు, సర్వాధికారి అంతకన్నా కాదు. అంతట ఉండేవాడు కాదు, ఎందుకంటే యేసు ప్రభువు వస్తుండగానే భయంతో ఎందుకు వచ్చావు మా దగ్గరకు అంటున్నాయి. అంటే ప్రభువు సాన్నిధ్యంలో ఉండలేవు. అపవిత్రమైన పందులలోకి వెళ్లడానికి కూడా సాతానుకు యేసుక్రీస్తు అనుమతి
కావాల్సి వచ్చింది. దేవుని అనుమతి లేనిదే సాతాను విశ్వాసి జీవితాన్ని తాకలేడు.
బి) సాతాను
నాశనాత్మక స్వభావం:
దయ్యాలు ప్రవేశించిన వెంటనే పందుల మంద నాశనమైపోయింది. ఇది సాతాను యొక్క అసలు నైజాన్ని చూపిస్తుంది. వాడు ఏ
జీవితంలోకి, ఏ కుటుంబంలోకి ప్రవేశించినా అక్కడ నాశనాన్ని, మరణాన్ని
మాత్రమే మిగుల్చుతాడు.
సి) ఒక ఆత్మ
విలువ:
లౌకిక కోణంలో చూస్తే పందుల నష్టం చాలా
పెద్ద ఆర్థిక సంక్షోభం. కానీ యేసు ప్రభువు దృష్టిలో, ఆ ఇద్దరు మనుషుల ఆత్మల విలువ
ఆ పందుల కంటే, ఈ లోకంలోని సమస్త సంపద కంటే
ఎంతో గొప్పది. దేవుడు నష్టాన్ని లెక్కచేయలేదు; నలిగిపోయిన
మానవ ప్రాణాల విడుదలకు ప్రాధాన్యతనిచ్చాడు.
గ్రామస్థుల విషాదకరమైన ఎంపిక
పందుల కాపరులు పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రామంలో
జరిగినదంతా చెప్పారు. ప్రజలంతా యేసు వద్దకు వచ్చారు . అక్కడ వారు చూసిన దృశ్యం
అద్భుతమైనది: ఒకప్పుడు గొలుసులుతో కత్తివేయబడి, వాటిని తెంచుకునుటకు ప్రయత్నిస్తూ, వారిని వారు హింసించుకునుచు అందరినీ భయపెట్టిన ఆ ఇద్దరు
మనుషులు ఇప్పుడు స్వస్థత పొంది , బట్టలు ధరించుకుని, ప్రశాంతంగా
యేసు ప్రభువు పాదాల చెంత కూర్చుని ఉన్నారు.
నిజానికి ఆ గ్రామస్థులు ఆనందించాలి, దేవునికి
కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. కానీ వారు అలా చేయలేదు. వారు భయపడి, "మా ప్రాంతం
విడిచి వెళ్ళిపొండి" అని యేసును బ్రతిమాలుకున్నారు. గ్రామస్తులకు పందులు చాలా విలువ కలిగినవిగా ఉన్నవి. మనిషికి ఎటువంటి విలువ వారు ఇవ్వలేదు.
ఇది మానవ చరిత్రలోనే అత్యంత విచారకరమైన ఘట్టం.
గ్రామస్థుల హృదయాలలో రెండు వేల పందుల విలువ, దేవుని కుమారుని ఉనికి కంటే
ఎక్కువైంది. వారు తమ ఆర్థిక నష్టాన్ని తట్టుకోలేకపోయారు. యేసు ప్రభువు తమ మధ్య ఉంటే ఇంకా
ఏమేం కోల్పోవాల్సి వస్తుందోనని భయపడ్డారు.
ఈ రోజు మన
జీవితాలలో కూడా యేసు ప్రభువు ప్రవేశించినప్పుడు, ఆయన మనలోని తప్పుడు
వ్యాపారాలను, అపవిత్రమైన అలవాట్లను, స్వార్థపూరితమైన
భద్రతా భావాలను కదిలిస్తాడు. ఆ సమయంలో మనం యేసు ప్రభువును మన
హృదయంలో ఉంచుకుంటామా? లేక మన పాపపు లాభాలను
కాపాడుకోవడానికి "ప్రభువా, నన్ను వదిలి వెళ్ళిపో"
అని ఆయనను దూరం పెడతామా?
- మారిన జీవితమే అతిపెద్ద సాక్ష్యం: ఒకప్పుడు ఆ ఊరి ప్రజలు ఎవరిని చూసి భయపడ్డారో, ఎవరి పేరు చెప్తే పిల్లలు వణికిపోయారో, ఎవరైతే ఆ ప్రాంతానికి ఒక పెద్ద శాపంగా మారారో ఇప్పుడు అదే వ్యక్తి ఆ ఊరికి దేవుని కృపను చాటే ఒక గొప్ప వరంగా మారాడు.
- దెకపొలిలో సువార్త: అతడు వెళ్ళి దెకపొలి అంతటా యేసు తనకు చేసిన కార్యాలను ప్రకటించడం ప్రారంభించాడు. విన్నవారందరూ ఆశ్చర్యపోయారు. ఇదే సువార్త యొక్క అసలైన సారాంశం. దేవుడు మన గతాన్ని చూసి మనల్ని వదిలిపెట్టడు; మన వర్తమానాన్ని మార్చి, మన భవిష్యత్తును తన మహిమ కొరకు వాడుకుంటాడు. అత్యంత పతనమైన జీవితాన్ని కూడా ఆయన పునర్నిర్మించగలడు.
ఆత్మపరిశీలన
గదరేనీయుల తీరంలో జరిగిన ఈ సంఘటన మనల్ని ఒక
అద్దం ముందు నిలబెడుతుంది. నేడు మనం ఈ కథలోని ఏ పాత్రలో ఉన్నాం?
సమాధుల మధ్య బందీలమా? ఇంకా గతం యొక్క గాయాల్లో, కోపంలో, వ్యసనాల్లో జీవిస్తూ, విమోచకుడైన యేసును చూసి
భయపడుతున్నామా?
గ్రామస్థుల లాంటివారమా? మన ఆస్తులు, లౌకిక లాభాలు, స్వార్థపూరిత అలవాట్లను కాపాడుకోవడం కోసం రక్షకుడైన క్రీస్తును మన
జీవిత సరిహద్దుల నుండి బయటకు పంపేస్తున్నామా?
విడుదల పొందిన సాక్షులమా? క్రీస్తు కృపను రుచి చూసి, మన స్వంత ఇళ్లలో, మన చుట్టుపక్కల సమాజంలో ఆయన ప్రేమను ప్రకటించే సజీవ సాక్షులుగా
జీవిస్తున్నామా?
క్రీస్తు వాక్కు ఇప్పటికీ అదే శక్తితో, అదే
అధికారంతో మనతో మాటలాడుతుంది. ఏ బంధనమైనా ఆయన నామము ముందు, ఆయన రక్తం
ముందు నిలబడలేదు. మనం చేయవలసిందల్లా ఒక్కటే మన హృదయాల తలుపులు తెరిచి, మన పాపపు అలవాట్లను వదులుకోవడానికి సిద్ధపడి, ఆయనను మన
జీవితాల్లోకి సంపూర్ణంగా ఆహ్వానించడమే. అప్పుడే చీకటి సమాధుల లాంటి మన జీవితాలు
వెలుగుమయమైన దైవమందిరాలుగా మారుతాయి.
ప్రార్థన
ప్రభువా, నన్ను
బంధిస్తున్న, కృంగదీస్తున్న ప్రతి అంతర్గత చీకటి శక్తి
నుండి నాకు సంపూర్ణ విడుదల దయచేయి. నా జీవితంలోని "సమాధుల" లాంటి చేదు
జ్ఞాపకాలను, కోపాన్ని, వ్యసనాలను వీడి, నీ
అద్భుతమైన వెలుగులోకి నడిచే ధైర్యాన్ని నాకు ప్రసాదించు.
నా తాత్కాలిక సౌకర్యాల కోసం, నా లౌకిక
లాభాల కోసం నిన్ను నా జీవితం నుండి దూరం పెట్టకుండా, నిన్ను నా
సర్వస్వంగా స్వీకరించే నిజమైన విశ్వాసాన్ని నాకు అనుగ్రహించు. నీ కృప ద్వారా
విడుదల పొందిన ఆ గదరేనీయుని వలె, నా జీవితం ద్వారా నీ
అపరిమితమైన ప్రేమను ఇతరులకు చాటిచెప్పే నమ్మకమైన సజీవ సాక్షిగా నన్ను మలచుము. ఆమెన్.
📚 ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపించిందా?
మీ కుటుంబం & స్నేహితులతో share చేయండి! 🙏
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment