దైవ ఆతిథ్యం, ఆత్మత్యాగం, క్రీస్తులో నూతన జీవం| 13 ordinary sunday | కార్మెల్ శోభ
రాజుల రెండవ గ్రంధం 4:8-11, 14-16, రోమా 6:3-4, 8-11 and మత్తయి 10:37-42
దైవ ఆతిథ్యం, ఆత్మత్యాగం మరియు క్రీస్తులో నూతన జీవం
ఆశ్చర్యకరమైన అంతస్సూత్రం
పరిశుద్ధ గ్రంథములో కొన్ని కథనాలు ఒకదానితో ఒకటి అద్భుతంగా కలసిపోతాయి. శతాబ్దాల వ్యత్యాసం ఉన్నప్పటికీ, వేర్వేరు కాలాల్లో రాసిన పవిత్ర గ్రంధంలోని భాగాలు మన హృదయాలను కదిలిస్తాయి.
ఈ రోజు మనం చదువుకున్న మూడు లేఖన భాగాలు—రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మరియు మత్తయి సువార్త 10వ అధ్యాయం—పైకి వేర్వేరు సందర్భాలుగా, భిన్నమైన చారిత్రక నేపథ్యాలు కలవిగా కనిపించినప్పటికీ, భావం ఒక్కటే. అది: "దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వడం, ఆయన పిలుపునకు సంపూర్ణంగా లోబడటం, దాని వలన వచ్చే నూతన జీవపు ఆశీర్వాదం పొందటం ఈ పఠనాల సారాంశం.
పాత నిబంధనలో ఒక సామాన్య, ధనవంతురాలైన స్త్రీ దైవజనుడిని గుర్తించి ఆతిథ్యమిస్తే, నూతన నిబంధనలో యేసు క్రీస్తు తన కొరకు సమస్తాన్ని త్యాగం చేయమని, సిలువను ఎత్తుకోమని మనల్ని పిలుస్తున్నారు. అదే సమయంలో, అపొస్తలుడైన పౌలు ఆ త్యాగం మరియు క్రీస్తుతో కూడిన మరణం ద్వారా మనకు లభించే మహిమయుక్తమైన పునరుత్థాన జీవాన్ని గురించి వివరిస్తున్నారు. ఇతరులను మనం ఎలా ఆహ్వానిస్తాము,వారికి మన ఇళ్లను, హృదయాలను ఎలా తెరుస్తాం అనేది మనం దేవుణ్ణి ఎలా అంగీకరిస్తాం అనే దానితో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది.
1. షూనేమీయురాలి ఆతిథ్యం: దైవజనుడిని గుర్తించడం మరియు ఘనపరచడం
2 రాజులు 4:8-11, 14-16
ఎలీషా ప్రవక్త కాలంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను ఇక్కడ చూస్తాం. షూనేము అను ఊరిలో స్త్రీ ఉండేది. ఆమె ధనవంతురాలు మాత్రమే కాదు, అంతకంటే మిన్నగా ఇతరులకు అతిద్యం ఇవ్వడంలో ఆమె గొప్పతనం మనము చూడవచ్చు వివేచన కలిగిన గొప్ప స్త్రీ. ఆమె ఎలీషా ప్రవక్తను కేవలం ఒక సాధారణ బాటసారిగానో లేదా యాదృచ్ఛిక ప్రయాణికుడిగానో చూడలేదు.
"ఆమె తన భర్తతో " ఈ అతిధి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చి పోవుచున్నాడు, ఇతడు దైవ భక్తుడు. " (2 రాజులు 4:9)
ఆమెలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే ఎలిషా ప్రవక్త దేవుని ప్రవక్త అని గుర్తించడం. ఎలీషా ప్రవక్త భౌతికంగా సామాన్యంగా కనిపించినప్పటికీ, అతనిలో ఉన్న దైవత్వాన్ని, పరిశుద్ధతను ఆమె గుర్తించింది. కేవలం గుర్తించి ఊరుకోలేదు; ఆమె ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన గదిని సిద్ధం తమ ఇంటిమీద ఏర్పాటు చేయాలని తన భర్తకు విన్నవించింది.
ఆమె ఆ గదిలో నాలుగు వస్తువులను అమర్చింది:
ఒక మంచము: ప్రయాణ బడలిలో ఉన్న దైవజనుడి విశ్రాంతి కొరకు.
ఒక బల్ల: ఆయన వాక్య ధ్యానం లేదా భోజనం చేయడం కొరకు.
ఒక కుర్చీ : కూర్చోవడానికి మరియు ప్రార్థించడానికి అనువుగా.
ఒక దీపస్తంభము: చీకటిని తోలిగించే వెలుగు కొరకు
ఇది మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తోంది. మన జీవితాల్లో దేవునికి, ఆయన వాక్యానికి, ఆయన సేవకులకు మనం ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నాం? మన హృదయాలలో, మన దైనందిన జీవితంలో దేవుని కొరకు ఒక "ప్రత్యేక గది" ఉందా? షూనేమీయురాలు ఎలిషా ప్రవక్త ఎప్పుడు వచ్చినా విశ్రమించడానికి వీలుగా సమస్తాన్ని సిద్ధం చేసింది. ఆమె ఇచ్చిన ఈ ఆతిథ్యం తాత్కాలికమైనది కాదు, అది ఖరీదైనది మరియు శాశ్వతమైనది.
నిస్వార్థ సేవకు దక్కిన పరలోక ప్రతిఫలం
ఆమె ఎలీషా నుండి ఏమీ ఆశించి ఈ సేవ చేయలేదు. ఆమె ఆతిథ్యానికి ముగ్ధుడైన ఎలీషా ఆమెను పిలిచి, నీకు రాజు దగ్గరగాని, సైన్యాధిపతి దగ్గర కాని విన్నవించుకొనవలసింది ఏమైనా ఉందా అని అడిగారు. ఆమె నేను నా స్వజనుల మధ్య హాయిగా జీవిస్తున్నాను, నాకేమీ వద్దు అంది. ఎంతటి తృప్తి గల హృదయం! లోకసంబంధమైన అధికారాలు, సిఫార్సులు ఆమెకు అవసరం లేదు.
మన దేవుడు నిస్వార్థమైన సేవను ఎన్నడూ మరువడు. దేవునికి చేసిన ఆ త్యాగము ఊరికే పోదు. ఆమెకు గర్భఫలం లేదు, ఆమె భర్త వృద్ధుడు. మానవ మేధస్సుకు, వైద్య శాస్త్రానికి అసాధ్యమైన కార్యాన్ని దేవుడు ఎలీషా ద్వారా ప్రవచించాడు. వచ్చే సంవత్సరం ఈ కాలమున నీవు ఒక కుమారుణ్ణి కౌగిలించుకుంటావు అని ప్రవచించాడు. ఆమె నమ్మలేకపోయింది, నీ సేవకురాలనైన నాకు అబద్ధం చెప్పకు అంది. కానీ దేవుని వాక్యం నెరవేరింది; ఆమె ఒక కుమారుడిని కన్నది. దేవుని సేవకులను గౌరవించినవారు. దేవుని చేత సత్కరించబడతారు అనేదానికి ఈ షూనేమీయురాలి జీవితమే నిదర్శనం. ఆతిథ్యం అనేది గొడ్రాలు అయిన ఆమె జీవితంలోనికి నూతన జీవాన్ని మోసుకొచ్చింది. అంతే కాదు ఆ కుమారుడు చనిపోయిన తరువాత కూడా ఆమె ఎలిషాతో అంటున్నది నేను నిన్ను బిడ్డను అడిగానా? ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు అని చెప్పగా ఆమె బిడ్డను మరల ఏలీషా ఆ బిడ్డను బ్రతికిస్తున్నాడు.
2. క్రీస్తుతోటి మరణం మరియు పునరుత్థానం
మొదటి పఠనంలో ఒక ప్రవక్తకు ఇచ్చిన ఆతిధ్యం ద్వారా ఎలా గొడ్రాలు కుమారున్నీ పొందుతుందో, మరల చనిపోయిన వాడిని పొందుతుందో చూస్తాము. రెండవ పఠనంలో క్రీస్తును అంగీకరించి, ఆయనను మన హృదయంలోనికి స్వాగతించడం ద్వారా మనకు ఆధ్యాత్మికమైన నూతన జీవం ఎలా లభిస్తుందో అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన లేఖలో వివరిస్తున్నారు.
షూనేమీయురాలి కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఒకరోజు పొలంలో తలనొప్పితో హఠాత్తుగా మరణించాడు. అప్పుడు ఆమె మరలా ఎలీషాను ఆశ్రయించింది. ఎలీషా వచ్చి చనిపోయిన ఆ బాలుని మీద తనను తాను బోర్లించుకొని, తన నోరు బాలుని నోటి మీద, తన కళ్లు బాలుని కళ్ల మీద ఉంచి ప్రార్థించినప్పుడు బాలుని శరీరం వెచ్చబడి, అతడు బ్రతికాడు. క్రీస్తు పాపము చేత చనిపోయిన మానవాళిని లేపడానికి పరలోకాన్ని విడిచి వచ్చి, మన మరణాన్ని తనపై వేసుకొని మనలను రక్షించాడు.
"కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలన, తండ్రి నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే, మనము ఒక క్రొత్త జీవితము గడుపుటకు అట్లు జరిగెను." (రోమీయులు 6:4)
జ్ఞానస్నానము
జ్ఞానస్నానము అనేది కేవలం ఒక బాహ్య ఆచారం కాదు; అంతరంగికంగా ఒక వ్యక్తి రూపాంతరం చెందడం. నీటిలో మునగడం అనేది క్రీస్తుతో పాటు మన పాత పాపపు స్వభావం, పాత అలవాట్లు, పాత ఆశలు సిలువ వేయబడి, పాతిపెట్టబడటానికి సాదృశ్యం. నీటిలో నుండి పైకి రావడం అనేది క్రీస్తు పునరుత్థాన శక్తి ద్వారా నూతన సృష్టిగా లేపబడటానికి సాదృశ్యం.
పాపమునకు మృతులుగా, దేవునికి సజీవులుగా
పునీత పౌలు మనకు ఒక ఆత్మీయ రహస్యాన్ని చెప్తున్నారు, మనం క్రీస్తుతో మరణించినట్లయితే, ఆయనతో లేవనెత్తబడతాం. పాపమునకు సంబంధించి మనలను చనిపోయిన వారిగా ఉండమని ఎందుకు చెబుతున్నారు అంటే చనిపోయిన వ్యక్తి ముందు ఎంతటి ధనము , కనకము వస్తువులు , వాహనాలు ఉంచిన, ఎంతటి శోధనలు ఎదురైనా అతడు స్పందించడు. ఎందుకంటే అతడు మృతుడు. అలాగే, లోక ఆశలు, శరీరేచ్ఛలు, పాపపు తలంపులు మనల్ని శోధించినప్పుడు, మనం వాటి విషయమై "చనిపోయిన వారిలా" నిర్లిప్తంగా ఉండాలి. పాపానికి మన ప్రతిస్పందన శూన్యమై ఉండాలి.
ఆదేవిధముగా దేవుని విషయములో మనలను సజీవులుగా వుండమంటున్నాడు: దేవుని వాక్యానికి, ప్రార్థనకు, సంఘ సహవాసానికి, పరిశుద్ధతకు మనం ఎల్లప్పుడూ జీవముతో, ఉత్సాహంతో స్పందించాలి. క్రీస్తు మన హృదయంలో నివసిస్తున్నాడు గనుక ఆ నూతన జీవపు నడక మన దైనందిన ప్రవర్తనలో కనిపించాలి.
3. క్రీస్తు శిష్యరికం వెల
మత్తయి 10:37-42
నూతన జీవంలో నడవడం అంటే ఏమిటో, దానికి ఎంతటి త్యాగం అవసరమో యేసు క్రీస్తు ఈనాటి సువిశేషంలో తన శిష్యులకు తేటతెల్లం చేస్తున్నారు. ఈ వాక్యాలు వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇవి నిజమైన పరలోక రాజ్యనికి రాజమార్గాలు.
"తన తండ్రిని లేదా తల్లిని, నా కంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని లేదా కుమార్తెను నా కంటే మిన్నగా ప్రేమించు వాడు నాకు యోగ్యుడు కాడు" (మత్తయి 10:37)
ప్రథమ స్థానం క్రీస్తుకే (Priority of Love)
యేసు ప్రభువు ఇక్కడ మనల్ని తల్లిదండ్రులను లేదా పిల్లలను ద్వేషించమని చెప్పడం లేదు. పవిత్ర గ్రంధంలో అంతటా తల్లిదండ్రులను గౌరవించమని , పిల్లలను దైవ ప్రేమతో పెంచమని స్పష్టంగా ఉంది. కానీ, ఇక్కడ ప్రశ్న "ప్రాధాన్యత" గురించినది. మన హృదయ సింహాసనంపై ఎవరు కూర్చోవాలి? దేవుడా లేక మన కుటుంబమా? ఖచ్ఛితముగా జవాబు దేవుడే.
దేవుని స్థానాన్ని ఏ మనుష్యుడికి గానీ, ఏ వస్తువుకు గానీ, ఏ బంధానికి గానీ ఇచ్చినట్లయితే అది "విగ్రహారాధన" అవుతుంది. మన ప్రేమల క్రమాన్ని మనం పునర్వ్యవస్థీకరించాలి. మనం దేవుడిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించినప్పుడే, మన కుటుంబాన్ని కూడా సరైన దైవ ప్రేమతో ప్రేమించగలం. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మిగిలినవన్నీ వాటి వాటి సరైన స్థానాల్లోకి వస్తాయి.
సిలువను ఎత్తుకొని నడవడం
"తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు." (మత్తయి 10:38)
యేసుప్రభువు జీవించిన కాలంలో "సిలువ" అనేది ఒక అలంకారం కాదు; అది ఘోరమైన శిక్షకు, అత్యంత అవమానానికి, ఖచ్చితమైన మరణానికి గుర్తు. ఆ కాలంలో ఒక వ్యక్తి సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడంటే, అతడు తిరిగి తన ఇంటికి రాడు; అతడు తన స్వంత ఇష్టాన్ని, గౌరవాన్ని , హక్కులను పూర్తిగా చంపుకొని వెళ్తున్నాడని అర్థం.
క్రీస్తును వెంబడించడం అంటే కేవలం భౌతిక ఆశీర్వాదాలు, స్వస్థతలు పొందడం మాత్రమే కాదు. క్రీస్తు కొరకు నిందలు, అవమానాలు భరించడానికి, మన స్వంత ఇష్టాన్ని దేవుని చిత్తం కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడటం.
తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దానిని కోల్పోవును: లోక సుఖాలు, స్వార్థం, మరియు తాత్కాలిక ప్రయోజనాల కోసం దేవుడిని విడిచిపెట్టేవాడు నిత్యజీవాన్ని కోల్పోతాడు.
నా కొరకు తన ప్రాణమును కోల్పోవు వాడు దానిని దక్కించుకొనును: క్రీస్తు కొరకు, సువార్త కొరకు సమస్తాన్ని నష్టపోవడానికి సిద్ధపడేవాడు మహిమగల నిత్యజీవాన్ని సంపాదించుకుంటాడు.
చిన్నవారికి ఇచ్చే గిన్నెడు చల్లని నీరు
ఈ అధ్యాయం ముగింపులో యేసు మళ్లీ పాత నిబంధనలోని శూనేమీయురాలి ఆతిథ్య వృత్తాంతాన్ని గుర్తుకుతెచ్చేలా ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. శిష్యరికం యొక్క ఖరీదు ఎంత పెద్దదో చెప్పిన ప్రభువు, దాని ప్రతిఫలాన్ని ఎంత సూక్ష్మమైన విషయాలతో ముడిపెట్టారో చూడండి:
" నా శిష్యుడని ఈ నా చిన్నవారలలో ఒకనికి ఎవడేని ఒక గృక్కెడు మంచి నీరోసగిన వాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ." (మత్తయి 10:42)
దేవుని పేరిట, దేవుని సేవకులకు లేదా విశ్వాసులకు చేసే ఏ చిన్న సహాయమైనా పరలోకంలో లెక్కించబడుతుంది. దేవుని రాజ్యంలో పెద్ద పెద్ద కార్యాలు, ప్రపంచం మెచ్చే గొప్ప ప్రసంగాలు మాత్రమే కాదు, హృదయపూర్వకంగా, క్రీస్తు నిమిత్తం ఇచ్చే గుక్కెడు నీళ్లకైనా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎందుకంటే, దేవుని ప్రతినిధిని చేర్చుకోవడం అంటే దేవుణ్ణి చేర్చుకోవడమే. ఆనాటి యూదా సాంప్రదాయంలో ఒక సామెత ఉండేది: "ఒక మనిషి యొక్క ప్రతినిధి ఆ మనిషిలాంటివాడు." కాబట్టి, క్రీస్తు సేవకులను చేర్చుకుంటే క్రీస్తునే చేర్చుకున్నట్లు లెక్క.
మనకు ఈ పఠనాలు ఏమి నెరపుతున్నవి
ఈ రోజు దేవుని వాక్యం మనల్ని మూడు ముఖ్యమైన విషయాల వైపు నడిపిస్తోంది.
ఆతిథ్య హృదయం కలిగియుండటం: షూనేమీయురాలి వలె దేవుని విషయాలకు, దైవజనులకు, సంఘానికి మన జీవితాల్లో, ఇళ్లలో స్థానమిద్దాం. మన ఇళ్లను కేవలం మన స్వార్థ సుఖాల కోసం కాకుండా, దేవుని మహిమ కొరకు, ఆత్మీయ సహవాసం కొరకు తెరుద్దాం. నిస్వార్థంగా సేవ చేద్దాం. మన ఆతిథ్యం కొత్త ఆత్మీయ జీవానికి జన్మస్థలం కావాలి.
నూతన జీవన విధానంలో నడవడం: మన జ్ఞానస్నానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. మనం పాపపు విషయాలలో చనిపోయినవారిలా, నీతి విషయమై బ్రతికినవారిలా ప్రతిరోజూ జీవిస్తున్నామా? మన పాత అలవాట్లను, పాత క్రోధాన్ని, పాత జీవితాన్ని సమాధి చేసి, క్రీస్తు పునరుత్థాన శక్తితో ప్రతి ఉదయం నడుద్దాం. శోధనలు వచ్చినప్పుడు 'నేను క్రీస్తుతో కూడా చనిపోయాను' అని ప్రకటిద్దాం.
క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వడం: మన జీవితాల్లో, నిర్ణయాల్లో, కుటుంబాల్లో అన్నిటికంటే ఎక్కువగా యేసునే ప్రేమిద్దాం. మన స్వంత సిలువను (అహం, గౌరవం, ఆస్తిపాస్తులను పక్కకు పెట్టి)వినయంతో ఎత్తుకొని ఆయనను వెంబడిద్దాం. మన చుట్టూ ఉన్న దీనులు, చిన్నవారికి సహాయం చేస్తూ ప్రభువు పేరిట పరలోక ప్రతిఫలాన్ని పొందుకుందాం.
ఈ లోకం విభజనలతో, స్వార్థంతో, ద్వేషంతో నిండి ఉంది. కానీ క్రీస్తు సంఘం ఆతిథ్యంతో, ప్రేమతో, త్యాగంతో నిండిన జీవితానికి ప్రతిరూపంగా ఉండాలి. ఒక చిన్న గది నిర్మాణమైనా, క్రీస్తుతో కూడిన మరణమైనా, లేదా ఒక గృక్కెడు నీరైన దేవుని రాజ్యంలో ఏదీ వ్యర్థం కాదు.
మనం ఇతరులను స్వాగతించినప్పుడు, మనం క్రీస్తును స్వాగతిస్తాము. మనం క్రీస్తును స్వాగతించినప్పుడు, మన తండ్రియైన దేవుణ్ణి స్వాగతిస్తాము. అటువంటి పవిత్ర జీవనంలో మనమందరం సాగిపోవుదాము. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment