విశ్వాసం, వినయం మరియు యేసు ప్రభువు అద్భుత స్వస్థతలు | మత్తయి 8| కార్మెల్ శోభ
మత్తయి 8: 5–17
విశ్వాసం, వినయం మరియు యేసు స్పర్శ
యేసు కఫర్నాములో ప్రవేశించు చుండగ, శతాధిపతి యొకడు ఆయనను సమీపించి, "ప్రభూ! నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి యున్నాడు" అని తెలుపగ, "నేను వచ్చి వానిని స్వస్థపరతును" అని యేసు ఆ శతాధిపతి పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, "ప్రభూ! నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు ఒక్క మాట పలికిన చాలును . నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారము గలవాడను, నా ఆధీనమందున్న ఏ సైనికుడినైనను నేను రమ్మనిన వచ్చును, పొమ్మనిన పోవును. నా సేవకుడు నేను చేయుము, అనిన దానిని చేయును, అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి , తన వచ్చు చున్న వారితో యిస్రాయేలు ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు" అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఈసాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు. కాని రాజ్య వారసులు వెలుపల చీకటి గదిలోనికి త్రోయబడుదురు. అచట వారు విలపించుచు పండ్లు కొరుకుకొందురు" అని పలికెను. అంతట యేసు ఆ శాతాధిపతితో, "నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లు నీకు అగును గాక!" అని పలికెను. ఆ క్షణముననే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను. ఆ తరువాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి, అచట జ్వరపీడితయై మంచము పట్టిన అతని అత్తాను చూచి ఆమె చేతిని తాకినంతనే జ్వరము వీడిపోయేను. అంతట ఆమె లేచి ఆయనకు పరిచర్య చేయసాగెను. ఆ సాయం సమయమున పిశాచి పీడితులగు పలువురిని యేసు వద్దకు తీసుకొని రాగా ఒక్క మాటతో ఆయన పిశాచములను పారద్రోలి, రోగులందరిని స్వస్థపరచెను. "ఆయన మన బలహీనతలను తనపై వేసికొనేను. మన రోగములను తానే భరించేను" అని యోషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరెను.
విశ్వాసం, వినయం మరియు దైవ స్పర్శ
మత్తయి సువార్త 8వ అధ్యాయం
యేసుక్రీస్తు పరిచర్యలో ఒక నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుంది. కొండ మీద యేసు ప్రభువు
బోధించిన వాటిని తన చేతలలో
చూపిస్తున్నారు. మత్తయి 7:29లో ప్రజలు "ఆయన ధర్మ శాస్త్ర
బోదకుల వలె కాక అధికారము గలవానివలె బోధించెను" అని ఆశ్చర్యపోయారు. ఆ
అధికారానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచేవే ఈ అధ్యాయంలో మనకు కనిపించే అద్భుతాలు.
ముఖ్యంగా 5 నుండి 17 వచనాల వరకు ఉన్న భాగం కేవలం
శారీరక స్వస్థతల గురించి మాత్రమే మాట్లాడటం లేదు; అది
విశ్వాసం యొక్క లోతును, వినయం యొక్క గొప్పతనాన్ని, దేవుని
అపారమైన కృపను మనకు తెలియజేస్తుంది.
1. శతాధిపతి విశ్వాసం: వినయం మరియు అధికారాల అద్భుత సంగమం
కఫర్నాము నగరంలోనికి యేసు ప్రభువు ప్రవేశించగానే ఒక రోమన్ శతాధిపతి ఆయనను
సమీపించాడు. శతాధిపతి అంటే వంద మంది సైనికులను శాసించే రోమన్ అధికారి. అతడు రోమన్
సామ్రాజ్య ప్రతినిధి, అన్యుడు, మరియు
సామాజికంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి. కానీ, ఒక యూద
బోధకుడైన యేసు ప్రభువు ఎదుట అతడు
మోకరించిన విధానం తన వినయాన్ని తెలియజేస్తుంది.
సేవకుని పట్ల ప్రేమ
ఈ సన్నివేశంలో మొదటి విశేషం ఏమిటంటే, శతాధిపతి తన
స్వంత అవసరం కోసం రాలేదు. పక్షవాతంతో మంచం పట్టి, తీవ్ర వేదన
అనుభవిస్తున్న తన సేవకుని కోసం వచ్చాడు. ఆ కాలపు రోమన్ సంస్కృతిలో సేవకులకు లేదా
దాసులకు ఎలాంటి హక్కులూ ఉండేవి కావు. వారిని కేవలం వస్తువులుగా, పనిముట్లుగా
మాత్రమే చూసేవారు. ఒకవేళ దాసుడు అనారోగ్యం పాలైతే అతడిని వదిలేయడం లేదా
నిర్లక్ష్యం చేయడం సర్వసాధారణం. కానీ ఈ శతాధిపతి తన సేవకుని వేదనను తన వేదనగా
భావించాడు. ఇది అతనిలోని నిష్కల్మషమైన ప్రేమకు, కనికరానికి
నిదర్శనం.
"నేను యోగ్యుడను కాను" — నిజమైన వినయం
యేసు ప్రభువు "నేను వచ్చి వానిని
స్వస్థపరతును" అన్నప్పుడు, ఆ శతాధిపతి పలికిన మాటలు
అమూల్యమైనవి:
"ప్రభూ! నీవు నా యింటిలోనికి
వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు ఒక్క మాట పలికిన చాలును; నా సేవకుడు
స్వస్థత పొందును."
ఈ మాటలు ఎంత శక్తివంతమైనవంటే, శతాబ్దాలు
దాటిన నేటికీ ప్రతి పవిత్ర బలిపూజలో
(దివ్య సత్ప్రసాద స్వీకరణకు ముందు) కతోలిక సంఘం ఈ మాటలనే పునరుద్ఘాటిస్తూ దేవుని
పవిత్రత ముందు తన అయోగ్యతను ఒప్పుకుంటుంది. శతాధిపతికి రోమన్ అధికార గర్వం లేదు.
యేసు ప్రభువు ఎవరో అతడు గుర్తించాడు. ఆయన
పరిశుద్ధుడని, ఆయన దైవ శక్తి గలవాడని గ్రహించాడు. నిజమైన విశ్వాసం
ఎల్లప్పుడూ అహంకారాన్ని చంపి, హృదయంలో వినయాన్ని
నింపుతుంది.
యేసు ప్రభువు ఆశ్చర్యం
శతాధిపతి సైనిక క్రమశిక్షణలో ఉన్నవాడు కాబట్టి, ఆజ్ఞకు ఉన్న
శక్తి అతనికి తెలుసు. "నేను నా ఆధీనంలో ఉన్న సైనికుడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే
వస్తాడు. అలాగే నీవు రోగాన్ని పొమ్మని ఒక్క మాట చెప్తే అది వెళ్ళిపోతుంది"
అని నమ్మాడు. రోగాన్ని శాసించగల అధికారం యేసు మాటలో ఉందని అతడు గ్రహించాడు.
సువార్తలలో మనుషులు యేసు ప్రభువును ను చూసి
ఆశ్చర్యపోవడం మనం చూస్తాం, కానీ ఇక్కడ యేసు ప్రభువు ఒక మనిషిని చూసి ఆశ్చర్యపడ్డారు! ఇశ్రాయేలు ప్రజలలో, అంటే దేవుని
వాగ్దానాలు పొందిన సొంత ప్రజలలో కూడా ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని తాను చూడలేదని
యేసు ప్రభువు చెబుతున్నారు. విశ్వాసానికి
కుల, మత, ప్రాంతీయ భేదాలు లేవని, హృదయ శుద్ధి
మాత్రమే ముఖ్యమని ఇక్కడ తెలుస్తుంది. "నీవు విశ్వసించినట్లు నీకు అగును
గాక" అని యేసు పలకగానే, ఆ క్షణంలోనే ఆ సేవకుడు
స్వస్థత పొందాడు. ఇది జరుగును గాక అని ఆదిలో దేవుడు చెప్పినప్పుడు వెంటనే అవి జరుగుతున్నవి.
ఇక్కడ కూడా అంతే యేసు ప్రభువు ఒక మాట అంటే అది వెంటనే జరుగుతుంది. యేసు ప్రభువు
దేవుడు అని చెప్పుటకు ఇది నిదర్శనం.
2. పేతురు అత్తయ్య స్వస్థత: దేవుని కృప
రెండవ సంఘటన పేతురు ఇంట్లో జరుగుతుంది. శతాధిపతి
విషయంలో యేసు ప్రభువు దూరం నుండి మాట
ద్వారా స్వస్థతనిస్తే, ఇక్కడ పేతురు అత్తయ్య విషయంలో
ఆయన స్వయంగా ఆమె మంచం వద్దకు వెళ్ళి, ఆమె చేతిని తాకారు. దేవుడు
ఒక్కో వ్యక్తి జీవితంలో ఒక్కోలా పనిచేస్తాడని ఈ భిన్నమైన పద్ధతులు మనకు
చెప్తున్నాయి. ఆయన ఏదో ఒకే విధానంలోనే పని చేయడు.
యేసు క్రీస్తు స్పర్శ
పేతురు అత్తయ్య తీవ్రమైన జ్వరంతో మంచం పట్టి
ఉంది. ఆమె యేసు ప్రభువును ఏమీ అడగలేదు, అడగలేని స్థితిలో ఉంది.
అయినప్పటికీ యేసు ప్రభువు ఆమె దీనస్థితిని
చూసి ఆమె చేతిని తాకారు. యూదా ఆచారాల ప్రకారం జ్వరం ఉన్న రోగిని తాకడం వల్ల
ఆచారపరమైన అపవిత్రత వస్తుంది. కానీ, జీవాధిపతియైన యేసు ప్రభువు ఆమెను
తాకినప్పుడు అపవిత్రత ఆయనకు అంటుకోలేదు; బదులుగా ఆయనలోని పవిత్రత, జీవము
ఆమెలోనికి ప్రవహించాయి. యేసు ప్రభువుని చూపు, స్పర్శ చాలా ప్రభావం
కలిగినవి. ఆయన చూపుతో మత్తయి మొత్తాన్ని వదలి ఆయనను అనుసరిస్తారు. అలానే ఆయన స్పర్శతో
ఎంతో మంది స్వస్థత పొందుతున్నారు.
మన జీవితాలలో కూడా మనం అడగకముందే, మన హృదయ
వేదనలను చూసి దేవుడు ఇచ్చే అనుగ్రహాలు ఎన్నో ఉన్నాయి. దేవుని స్పర్శ, మరియు ఆయన చూపు ఎల్లప్పుడూ మనతోనే
ఉండేలా ప్రభువును వేడుకోవాలి.
స్వస్థత ఫలం సేవ
"జ్వరము ఆమెను విడిచెను; వెంటనే ఆమె
లేచి ఆయనకు పరిచర్య చేయసాగెను." ఈ వాక్యం
దేవుని అనుగ్రహాలను పొందిన వారు ఏమి చేయాలో చూస్తాము. దేవుడు మనకు ఇచ్చిన ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం, ఆత్మీయ
వరాలు కేవలం మన స్వార్థ సుఖాల కోసం కాదు. మనకు లభించిన ప్రతి స్వస్థత, ప్రతి
విడుదల చివరికి సేవగా మారాలి. దేవుని కృపను పొందుకున్న వ్యక్తి ఇతరులకు మంచి చేయకుండ ఉండకూడదు. దేవుని కృప ఇతరుల సేవ వైపు నడిపిస్తుంది. పేతురు
అత్తయ్య పొందిన స్వస్థత ఆమెను కృతజ్ఞతతో కూడిన సేవకురాలిగా మార్చింది.
3. సాయంత్రపు స్వస్థతలు
సాయంకాలమైనప్పుడు, ప్రజలు
దయ్యాలు పట్టిన వారిని, వివిధ రోగాలతో బాధపడుతున్న
వారిని అనేకమందిని యేసు వద్దకు తీసుకొచ్చారు. అది విశ్రాంతి దినం ముగిసిన సమయం
కావచ్చు, ప్రజలు స్వేచ్ఛగా రోగులను తీసుకురాగలిగారు. యేసు
ప్రభువు పగలు అంతా పరిచర్య చేసి అలసిపోయి ఉన్నప్పటికీ, తన వద్దకు
వచ్చిన వారిలో ఒక్కరిని కూడా తిరస్కరించకుండా, తన అధికారంతో
కూడిన మాటలతో దయ్యాలను వెళ్ళగొట్టి, రోగులందరినీ స్వస్థపరిచాడు.
యెషయా ప్రవచన నెరవేర్పు
మత్తయి ఈ అద్భుతాలన్నింటినీ పాత నిబంధన
ప్రవచనంతో యెషయా (53:4) ప్రవక్త చెప్పిన
మాట నెరవేరుతుంది.
"ఆతడు మన బాధలను భరించేను మన దుఃఖములను వహించేను.”
యేసుప్రభువు రోగాలను కేవలం ఏదో మంత్రం వేసినట్లు గాలిలో
తీసివేయలేదు; ఆయన వాటిని "భరించాడు". అంటే, మానవుల పాపాలను, వాటి ద్వారా వచ్చిన రోగాలను, శాపాలను, వేదనలను
కల్వరి సిలువపై ఆయన తనపై వేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత
చేకూరింది. ఆయన కేవలం వైద్యుడు మాత్రమే కాదు, మన బాధలలో పాలుపంచుకునే బాధమయ సేవకుడు.
మత్తయి సువార్తలోని ఈ మూడు సంఘటనలు నేటి ఆధునిక
క్రైస్తవునికి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను నేర్పుతున్నాయి:
- రక్షణ అందరికీ సమానమే: శతాధిపతి అన్యుడు, పేతురు అత్తయ్య యూదురాలు, సాయంత్రం వచ్చిన వారు సమాజంలో వెలివేయబడిన రోగులు. దేవుని దృష్టిలో ఎలాంటి వివక్ష లేదు. ఆయన కృప అందరికీ లభ్యమవుతుంది. మనం కూడా ఇతరులను కుల, మత, వర్గ భేదాలతో చూడకుండా దైవ ప్రేమను పంచాలి.
- మతాచారాల కంటే విశ్వాసమే ముఖ్యం: "రాజ్య వారసులు వెలుపలి చీకటిలో త్రోయబడతారు" అని యేసు ప్రభువు హెచ్చరించాడు. అంటే, కేవలం సాంప్రదాయబద్ధంగా ఒక మతంలో పుట్టినంత మాత్రాన లేదా బాప్తిస్మం పొందినంత మాత్రాన రక్షణ రాదు. హృదయపూర్వక విశ్వాసం, మారుమనస్సు లేకపోతే ఎంతటి గొప్ప స్థానంలో ఉన్నవారైనా దేవుని రాజ్యానికి దూరం అవుతారు.
- విశ్వాసంతో కూడిన వినయ ప్రార్థన: మన ప్రార్థనలలో శతాధిపతి చూపిన వినయం ఉండాలి. "నేను యోగ్యుడను కాను, కానీ నీ ఒక్క మాట చాలు ప్రభూ" అని మన పాపాలను ఒప్పుకుంటూ, ఆయన సార్వభౌమాధికారాన్ని నమ్మినప్పుడు మన ప్రార్థనలు ఆలకించబడతాయి.
ప్రార్థన: ఓ పరమ
వైద్యుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. శతాధిపతి లాంటి
నిష్కల్మషమైన విశ్వాసాన్ని, వినయాన్ని మాకు ప్రసాదించు.
మా అయోగ్యతను క్షమించి, నీ ఒక్క మాటతో మా ఆత్మలను, శరీరాలను
స్వస్థపరచు. నీవు మాకు దయచేసిన ప్రతి అనుగ్రహమునకు గాను మీకు వందనాలు. మా రోగాలను, పాపాలను
సిలువపై భరించిన తండ్రీ, మీకు కృతజ్ఞతలు. ప్రభువా మీ అనుగ్రహాలు పొంది, ఆ శక్తితో ఇతరులకు సేవ చేసే అనుగ్రహాన్ని దయ చేయండి. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment