మత్తయి 7:21-29
"ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు! కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు 'ప్రభూ! ప్రభూ! నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అనేక అధ్బుతములు చేసినది' అని నాతో చెప్పుదురు. అపుడు వారితో నేను దుష్టులారా! నా నుండి తొలగిపొండు. మిమ్ము ఎరుగనే ఏరుగను' అని నిరాకరింతును" నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాది పై తన యిల్లు కట్టుకొనిన బుద్దిమంతుని పొలియున్నాడు. జడివానలు కురిసి, వరదలు వెల్లువలై పారి, పెనుగాలులు వీచినను ఆ యిల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్దిహీనుని పొలియున్నాడు. జడివానలు కురిసి, వరదలు వెల్లువలై పారి, పెనుగాలులు వీచినపుడు ఆ యిల్లు కూలి నేలమట్టమయ్యేను. దాని పతనము చాల ఘోరమైనది." అంతట యేసు తన ప్రసంగమును ముగింపగా, ఆ జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడేను. ఏలన, వారి ధర్మ శాస్త్ర బోధకులవలె గాక అధికారము కలవాని వలె యేసు బోధించేను.
రాతి కట్టడమా? శిథిలమయ్యే ఇసుకపై కట్టడమా నీ జీవితం ?
మత్తయి 7:21–29 — కొండమీద
ప్రసంగపు అంతిమ హెచ్చరిక మరియు ఆత్మీయ అన్వయం
మానవ చరిత్రలోనే
అత్యంత ప్రభావవంతమైన, ప్రసంగం ఏది అంటే అది
యేసుక్రీస్తు ప్రభువు కొండమీద చేసిన ప్రసంగమే. ఈ ప్రసంగం ఈనాటి పఠనం తోముగుస్తుంది. ఈ ముగింపు హెచ్చరికలతో ముగుస్తుంది.
మత్తయి 7:21-29 యేసుప్రభువు ఒక తీర్పరిగా మాట్లాడుతున్నారు. ఇది ఒక వ్యక్తి తన జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రభువు
ఇచ్చిన నమూనా. ఇక్కడ యేసు ప్రభువు"నీ జీవితపు పునాది ఏమిటి?" అని అడుగుతున్నారు.
ఈ పఠనాన్ని మూడు భాగాలుగా చేయవచ్చు మొదటిది మీ నోటి మాటలకు ప్రభువు
ప్రాధాన్యత ఇవ్వరు. రెండవది మన దేవుని చిత్త ప్రకారం జీవంచిన వారికే ప్రభువు ప్రాధాన్యత
ఉంటుంది. మూడవదిగా యేసు ప్రభువు అధికారం
1. మాటల క్రైస్తవమా - నిజమైన శిష్యరికామా
"ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు
ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు! కాని, పరలోకమందలి నా తండ్రి
చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును." (మత్తయి 7:21)
యేసు ప్రభువు ఈ వచనాలలో శిష్యులను హెచ్చరిస్తున్నాడు. "ప్రభూ! ప్రభూ!" అని రెండుసార్లు పిలవడం అనేది
గ్రీకు మూలభాషలో అత్యంత ఆత్రుతను, ఉద్వేగాన్ని, ప్రాధేయపూర్వకమైన నిరాశను వ్యక్తం చేస్తుంది. ఇక్కడ ప్రస్తావించబడిన వ్యక్తులు
దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నవారు కాదు; వారు యేసు ప్రభువు పట్ల
తమ భక్తిని, విధేయతను సమాజంలో ఉత్సాహంగా
ప్రకటించుకుంటున్నవారు. స్వయానా యేసు ప్రభువు పేరిట పని చేసిన వారు. వీరు సాధారణ విశ్వాసులు కూడా కాదు; వీరు ప్రవచనాలు చెప్పారు, పిశాచాలను వెళ్ళగొట్టారు, యేసు ప్రభువు నామంలో అనేక అద్భుతాలు చేశారు. ఒక రకముగా క్రీస్తుకు సంబంధించిన
వారీగా ఎలా ఉండాలో చెప్పేవారు. అటువంటి వారి గురించి, అంతిమ తీర్పు దినాన యేసు
ప్రభువు ఇచ్చే సమాధానం దిగ్భ్రాంతికరం:
"నేను మిమ్ము
ఎరుగనే ఎరుగను; దుష్టులారా, నా నుండి తొలగిపొండు" అని అంటున్నాడు. నేను ఏరుగను అనే మాట చాలా ముఖ్యమైనది ఎందుకు ప్రభువు అలా అంటున్నారు, ఒకసారి ఆ పదం గురించి పరిశీలిద్దాం. ఇక్కడ వాడిన గ్రీకు పదం గినొస్కో.
'గినోస్కో' — మేధోపరమైన
జ్ఞానమా? ఆత్మీయమైన అనుబంధమా?
ఈ
పదానికి కేవలం ఒక వ్యక్తి గురించి సమాచారం తెలిసి ఉండడం అని అర్థం కాదు. ఇది వ్యక్తిగత
మరియు ఆత్మీయ బంధాన్ని సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండే అత్యంత సన్నిహిత
సంబంధాన్ని, హృదయానికి హృదయం
అనుసంధానమవ్వడాన్ని ఇది సూచిస్తుంది. అంటే ఒక విధముగా మీతో ఎటువంటి వ్యక్తి గత సంబంధం నాకు లేదు అని ప్రభువు చెబుతున్నారు.
వీరు ప్రభువు నా నామమును
ఉపయోగించి పరిచర్యలు చేశారు, కాని ఎన్నడూ వ్యక్తిగత సంబంధం పెట్టుకోలేదు. వీరి పరిచర్య వెనుక
ఉన్నది ప్రభువు పట్ల ప్రేమ కాదు, వారి స్వంత కీర్తి ప్రతిష్టలు మాత్రమే. అంటే ఈ కీర్తి ప్రతిష్టల కోసమె వారు చేసిన పరిచర్య మొత్తం కూడా, ఈ రోజులలో కూడా ఇటువంటి వారిని ఎంతో మందిని మనం చూస్తాము.
పరిచర్య రక్షణకు భరోసా కాదు
ఇక్కడ ఒక వాస్తవాన్ని
మనం గమనించాలి. యేసు ప్రభువు నామంలో అద్భుతాలు చేయడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం అనేది ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ
పరిశుద్ధతకు లేదా రక్షణకు నిదర్శనం కాదు. దేవుడు కొన్నిసార్లు తన నామ మహిమ కోసం, ప్రజల క్షేమం కోసం ఒకరి వ్యక్తిగత
జీవితంతో సంబంధం లేకుండా తన శక్తిని ప్రదర్శించవచ్చు (ఉదాహరణకు: బిలాము లేదా
ఇస్కరియోతు యూదా). ఈ నకిలీ శిష్యులు యేసు ప్రభువు
'నామమును' ఒక మంత్రంలా, తమ స్వలాభం కోసం వాడుకున్నారు కానీ, ఆ యేసు ప్రభువుతో నిజమైన అనుబంధాన్ని
కలిగి లేరు. పునీత సిలువ యోహాను గారి జీవితంలో కూడా ఇటువంటిదే ఒక విషయము జరిగినది. ఒక స్త్రీ, ఆ రోజులలో చాలా పేరు ప్రతిష్టలు కలిగిఉండేవారు. అక్కడి ప్రజలకు వారి గతమును, భవిష్యత్తును కూడా ఆమె చెప్పేవారు. ప్రజలు ఆమెకు దేవుడు అన్నీ విషయాలు తెలియజేస్తున్నారు అనుకునేవారు. ఒక రోజు సిలువ యోహాను గారు అక్కడకు వెళ్ళి పరిశీలించగా ఆమె తన సాతాను చేత పీడించబడుతుంది అని తెలుసుకున్నారు. అన్నీ ఇలా జరగనవసరం లేదు. కొన్ని సార్లు దేవునితో వ్యక్తిగత బంధం లేకుండా కూడా అద్భుతాలు చేసివుండవచ్చు. అవి మనకు దేవునితో సంబంధం ఉన్నందుకు జరుగలేదు అని ఆయనతో బంధం ఏర్పాటు చేసుకోవాలి. అది కేవలం ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారానే జరుగుతుంది.
- నోటి
ఒప్పుకోలు చాలదు: కేవలం
పెదవులతో "యేసే ప్రభువు" అని పలకడం ద్వారా రక్షణ రాదు,
హృదయ పరివర్తన అవసరం.
- మతపరమైన
కార్యకలాపాలతో రక్షణ కొనలేము : చర్చిలో మనం చేసే సేవలు, ఇచ్చే
కానుకలు దేవునితో మనకున్న వ్యక్తిగత బంధానికి ప్రత్యామ్నాయం కావు. కనుక వాటి మీద ఆధారపడి నేను రక్షణను పొందుతాను అనుకోకూడదు.
- తండ్రి
చిత్తమే కొలమానం: దేవుని
చిత్తాన్ని నెరవేర్చడం అంటే క్రీస్తు ప్రభువులాగా జీవించడం. ప్రేమ, దీనత్వం,
క్షమ, అంతరంగ పవిత్రత కలిగి జీవించడమే నిజమైన
శిష్యత్వానికి సాక్ష్యం, మరియు రక్షణకు మార్గం.
ఆత్మపరిశీలన: అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు 13:5 లో అన్నట్లు: "మీరు ఆత్మ పరీక్ష చేసుకొనుడు. మీరు విశ్వాసము కలిగి జీవించుచున్నారా? క్రీస్తు యేసు మీ యందు ఉన్నాడని నిజముగా మీకు తెలియదా? మీరు పూర్తిగా దిగజారిపోయి ఉండిననే తప్ప ఎట్లు తెలియకుండగలదు" మన విశ్వాసం కేవలం మనం దేవుని కోసం 'చేసే' పనులపై ఆధారపడి ఉందా, లేదా దేవునితో మనం 'కలిగి ఉన్న' సంబంధంపై ఆధారపడి ఉందా?
2. ఇల్లు కట్టు వారి ఉపమానం: ఆచరణాత్మక క్రైస్తవ్యం
యేసు ప్రభువు అక్కడ ఉన్నవారికి ఇల్లు కట్టు వారి ఉపమానము ద్వారా ఈ మాటలను వారు పూర్తిగా అర్ధం చేసుకొనేలా చెబుతున్నారు.
యూదయ దేశంలో
వేసవి కాలంలో ఎండిపోయిన వాగులను 'వాడీలు' (Wadis) అంటారు. ఇవి వేసవిలో ఇసుకతో నింపబడి, ఎంతో ప్రశాంతంగా, ఇల్లు కట్టుకోవడానికి అనువుగా, ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆ
ఇసుకపై ఇల్లు కట్టడం సులభంగా , వేగవంతంగా , తక్కువ ఖర్చు మరియు తక్కువ శ్రమతో జరుగుతుంది. కానీ ఋతువులు మారినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, ఆ ఇసుక మైదానాలు వాటి మీద కట్టబడినవి కుప్పకూలుతాయి.
బుద్ధిమంతుడైన వ్యక్తి కట్టే కట్టడం — రాతి నిర్మాణం
ఈ వ్యక్తి యేసు
మాటలు వింటాడు, వాటిని విశ్వస్తాడు, ప్రభువు మాటలపై ఆధారపడి తన దైనందిన
జీవితాన్ని నిర్మించుకున్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయమ ఏమిటి అంటే "వినడం + ఆచరించడం".
రాతిపై ఇల్లు
కట్టడం అంత సులభం కాదు. ఇసుకను, పైపైన ఉన్న మట్టిని తవ్వి, లోతుగా వెళ్ళి, దీనికి ఎంతో ఓర్పు, కఠిన శ్రమ, ఆత్మీయ క్రమశిక్షణ అవసరం. లోక
ఆశలను, స్వంత అహాన్ని తవ్వి అవతల పారవేసి, క్రీస్తు అనే రాతిని చేరుకోవడమే ఈ
లోతైన తవ్వకం. ఈ తవ్వకము లోతుగా రాళ్ళతో పేర్చి ఉండటముతో పునాది ఎంతో బలముగా ఉంటుంది.
కష్టాలు, శోధనలు అనే తుఫాను వచ్చినప్పుడు, "జడివానలు కురిసి, వరదలు వెల్లువలై పారి,
పెనుగాలులు వీచినను" ఆ ఇల్లు కదలలేదు, ఎందుకంటే దాని పునాది రాతిపై ఉంది. దేవుని వాక్కును ఆచరించే
వ్యక్తి జీవితం కూడా అంతే. శోధనలలో, అనారోగ్యంలో, నిరాశలో, జీవితములో అలజాడులు వచ్చిన తొణకడు. అంతిమ తీర్పులో కూడా ఆ జీవితం క్రీస్తులో స్థిరంగా నిలబడుతుంది.
బుద్ధిహీనుడు కట్టే కట్టడం
ఈ వ్యక్తి కూడా
బుద్ధిమంతునిలాగే క్రీస్తు చెప్పిన మాటలు వింటాడు. ఇద్దరికీ ఒకే బోధ, ఒకే అవకాశం లభించాయి. కానీ ఇతను
వినడంతోనే ఆగిపోయాడు, ఆచరించడం వదిలేశాడు. ఇసుకపై ఇల్లు కట్టడం తక్షణ ఫలితాలను
ఇస్తుంది, శ్రమ ఉండదు.
తుఫాను రాకముందు, పైకి చూసేటప్పుడు ఈ రెండు ఇళ్ళు
ఒకేలా అందంగా కనిపిస్తాయి. సమాజంలో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండవచ్చు, పైకి వారి
భక్తి సమానంగానే కనిపించవచ్చు. కాని పునాది లేని ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇల్లు, చుట్టు జారిపోతున్న స్వభావం ఉన్నది. గట్టిగా లేనిది.
కానీ తుఫాను
వచ్చినప్పుడు అసలు వ్యత్యాసం బయటపడుతుంది. పునాది లేని ఆ ఇల్లు "కూలి నేలమట్టమయ్యేను. దాని పతనము చాల ఘోరమైనది." ఇక్కడ గ్రీకులో "మెగాలే" (Megale) అనే పదం వాడబడింది. అంటే ఇది
సాధారణ పతనం కాదు; ఇది పూర్తిగా, కోలుకోలేని విధంగా సంభవించిన నాశనం. ఏమి మిగలకుండ పూర్తిగా నాశనం అవుతుంది, యేసు క్రీస్తు మాటలు వినని వారు భౌతికంగా మరియు ఆత్మీయముగా ఇటువంటి పరిస్థితికి గురి అవుతారు.
- తుఫాను
అందరికీ సమానమే: క్రైస్తవులైనంత
మాత్రాన కష్టాలు రావని కాదు. తుఫాను అందరి ఇళ్ళపైనా సమానంగా వస్తుంది. జీవితంలో కష్టాలు, బాధలు అన్నీ అందరకు వస్తాయి. వ్యత్యాసం వారు ఎదుర్కొన్న శ్రమలలో లేదు, వారు నిర్మించుకున్న ఇంటి మీద ఉంది.
- తక్షణ
ఫలితాల సంస్కృతి: నేటి
ఆధునిక లోకంలో "సులభమైన క్రైస్తవ్యం" అనే ఇసుక పునాది చాలా ఆకర్షణీయంగా
కనిపిస్తుంది. శ్రమ లేని రక్షణ, సిలువ
లేని కిరీటం కావాలని చాలామంది ఆశిస్తున్నారు. కానీ యేసు మనల్ని లోతైన,
కష్టమైన, జీవితాన్ని
పరివర్తన చేసే క్రమశిక్షణ గల మార్గానికి పిలుస్తున్నారు.
3. ప్రభువుని అసాధారణ అధికారం: "వారి ధర్మశాస్త్ర బోధకులవలె గాక
అధికారము కలవాని వలె యేసు బోధించేను."
|
ధర్మశాస్త్ర బోధకులు
|
యేసుక్రీస్తు ప్రభువు
|
|
మానవ సంప్రదాయాలు, రబ్బీల పేర్లు ఉదహరించేవారు.
|
స్వీయ అధికారంతో
మాట్లాడారు.
|
|
"ఫలానా రబ్బీ ఇలా సెలవిచ్చాడు..." అని బోధించేవారు.
|
"నేను మీతో చెప్పుచున్నాను..." అని ప్రకటించారు.
|
|
కేవలం ధర్మశాస్త్ర వివరణకు
మాత్రమే పరిమితమయ్యారు.
|
తానే అంతిమ న్యాయాధిపతినని
సార్వభౌమాధికారం చూపారు.
|
యేసు ఎవరి పేరూ
ప్రస్తావించలేదు. ఆయన కొండమీద ప్రసంగమంతటా ఒక ప్రత్యేకమైన, సూత్రాన్ని వాడారు: "పూర్వులతో ఇలా చెప్పబడినది గదా... అయితే నేను మీతో
చెప్పుచున్నాను." ఈ "నేను" అనే దైవ అధికారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన కేవలం ఒక నైతిక బోధకుడు కాదు, సృష్టికర్త, అంతిమ తీర్పరి. జీవమునకు ఏకైక పునాది ఆయనే అని ఈ అధికారం
నిరూపిస్తుంది.
మన అంతరంగ జీవితానికి
ఈ వాక్యభాగం క్రైస్తవ సమాజానికి ఒక సజీవమైన హెచ్చరిక. "నామమాత్రపు క్రైస్తవ్యం" అనే ప్రాణాంతకమైన వ్యాధి నేడు
విస్తరిస్తోంది. ఆదివారం చర్చికి వెళ్ళడం, క్రైస్తవ పదజాలం మాట్లాడటం,
సాంఘిక సేవలు చేయడం మంచిదే అయినప్పటికీ, హృదయంలో క్రీస్తు లేకపోతే అదంతా
ఇసుక పునాదియే అవుతుంది.
పరిచర్య కంటే
దేవునితో సంబంధం ముఖ్యం: గొప్ప కార్యాలు చేయడం కంటే,
ప్రతిరోజూ దేవుని వాక్యానికి లోబడటం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఏకాంత ప్రార్థనలో ఆయనతో సమయం గడపడం
ద్వారానే మన ఆత్మీయ పునాది స్థిరపరచబడుతుంది.
మన జీవితాల్లో
తుఫానులు అంటే హఠాత్తుగా వచ్చే అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయుల మరణం, లేదా అంతిమ దైవ తీర్పు ఇవి రాకుండా ఏ మతాచారాలు ఆపలేవు. కానీ
క్రీస్తు అనే రాతి పై నిర్మించబడిన జీవితం ఆ తుఫానులన్నింటినీ తట్టుకుని
నిలబడుతుంది. ఎందుకంటే ఆ పునాది నమ్మదగినది, సజీవమైనది.
మత్తయి 7:21–29 కేవలం ఒక భయానక హెచ్చరిక మాత్రమే
కాదు, అది కృపతో కూడిన ఒక మధురమైన
ఆహ్వానం. తుఫాను ఇంకా రాకముందే, సమయం ఉండగానే మన పునాదిని మార్చుకోవడానికి దేవుడు ఇస్తున్న అవకాశం. ఈ లేఖన భాగం మనల్ని మూడు ప్రశ్నలు అడుగుతోంది:
నేను
కేవలం పెదవులతో "ప్రభూ! ప్రభూ!" అని పిలుస్తున్నానా,
లేక నా జీవితం ద్వారా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నానా?
నా
జీవిత ఇల్లు దేవుని వాక్యమనే రాయిపై నిర్మించబడిందా,
లేక లోక సుఖాలు, ఆచారాలు
అనే ఇసుకపై ఉందా
నా
భక్తి, సేవ నన్ను దేవునికి దగ్గర చేస్తున్నాయా,
లేక స్వార్థ కీర్తి వైపు నడిపిస్తున్నాయా?
కొండమీద ప్రసంగం
ఒక నిశ్చితమైన నిర్ణయంతో ముగుస్తుంది. కేవలం వినేవారిగా ఉండి ఇసుకపై ఇల్లు కట్టి నాశనం అవుతామా? లేదా విని, ఆచరించి, రాతి పునాదిపై ఇల్లు కట్టి నిత్యజీవంలో
స్థిరంగా నిలుస్తామా?
ప్రార్థన:
మహోన్నతుడైన
దేవా, మా జీవితాలను పెదవులతోనే నిప్పుకున్నట్లు ఉన్నాయి. నీ మాటలకు లోబడే నిజమైన విధేయతతో జీవించే అనుగ్రహం మాకు దయచేయండి. తద్వారా క్రీస్తు అనబడే రాతిపై మా జీవితాన్ని నిర్మించుకోవడానికి నీ
కృపను దయచేయండి. మా అంతరంగాన్ని పరిశోధించి,
మాలో ఉన్న ఇసుకలాగా గట్టిగా లేని తనాన్ని తొలగించండి. రాబోయే తీర్పు
దినాన, జీవిత తుఫానులలో
మేము నీవనే సజీవ రాతిపైనే స్థిరంగా నిలబడే భాగ్యాన్ని ప్రసాదించండి. మా ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో
ప్రార్థిస్తున్నాము తండ్రీ. ఆమెన్.
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment