హృదయపు గమ్యాన్ని నిర్ణయించే మూడు నిత్య సత్యాలు | మత్తయి 6:19-23| carmelshobha
హృదయపు గమ్యాన్ని నిర్ణయించే మూడు నిత్య సత్యాలు
మన దైనందిన జీవిత గమనంలో మనం ఎటు వైపు పయనిస్తున్నాం? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన ఆలోచనలు, ప్రయాసలు దేని చుట్టూ తిరుగుతున్నాయి? ఆధునిక సమాజం విజయానికి నిర్వచనాన్ని మార్చేసింది. ఎవరి దగ్గర ఎక్కువ సంపద ఉందో, ఎవరు విలాసవంతమైన భవనాలలో జీవిస్తున్నారో, సమాజం వారిని 'విజేతలు' అంటోంది. కానీ, సమస్త సృష్టికి కర్త అయిన యేసు ప్రభువు దృష్టిలో అసలైన విజయం ఏమిటి? మన హృదయ గమ్యస్థానం ఎక్కడ ఉంది?
మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 23 వచనాలలో యేసు క్రీస్తు ప్రభువు ఎన్నటికీ మరువలేని మూడు నిత్య సత్యాలను మన ముందు ఉంచారు. కొండమీది ప్రసంగంలో భాగమైన ఈ వాక్య భాగం, కేవలం కొన్ని నైతిక సూత్రాల సముదాయం కాదు. ఇది దైవరాజ్య పౌరుల అంతరంగాన్ని శోధించి, సరిచేసే ఒక ఆధ్యాత్మిక శస్త్రచికిత్స.
సువిశేషం : మత్తయి 6:19-23
“ఈ లోకాపు సంపదలు కూడబెట్టుకొనవలదు, చెదలు, త్రుప్పు వానిని తినివేయును. దొంగలు కన్నమువేసి వానిని దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. అచట వానిని చెదలు త్రుప్పు తినివేయవు; దొంగలు కన్నమువేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును.”
“నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో, నీ దేహమంతయు కాంతిమంతమై యుండును. నీ కన్ను చెడినట్లయిన, నీ దేహమంతయు చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగ మారినచో, ఆ చీకటి మహాఘోరమైనది!”
మూడు సత్యాలు — ఒక దైవిక పిలుపు
యేసు ప్రభువు ఈ వాక్య భాగంలో మన అంతరంగాన్ని ప్రతిబింబించేలా రెండు శక్తివంతమైన ఉదాహరణలను ఉపయోగించారు: 'రెండు నిధులు' మరియు 'శరీరపు దీపమైన కన్ను'. ఈ రెండు ఉదాహరణల ద్వారా ఆయన మనల్ని ప్రతిరోజూ మూడు ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలని పిలుపునిస్తున్నారు:
నేను దేని కోసం శ్రమిస్తున్నాను? (నా నిధి ఎక్కడ ఉంది?)
నా ఆత్మీయ దృష్టి దేనిపై ఉంది? (నా కన్ను ఎలా ఉంది?)
నేను నిజంగా ఎవరికి లోబడి జీవిస్తున్నాను? (నా యజమాని ఎవరు?)
ఈ మూడు ప్రశ్నలకు మనం హృదయపూర్వకంగా ఇచ్చే సమాధానమే మన ఆత్మీయ స్థితిని, మన నిత్యత్వపు గమ్యాన్ని నిర్ణయిస్తుంది. రండి, ఈ మూడు నిత్య సత్యాలను లోతుగా ధ్యానిద్దాం.
మొదటి సత్యం: భూసంబంధమైన సంపద యొక్క అనిత్యము
“ఈ లోకాపు సంపదలు కూడబెట్టుకొనవలదు, చెదలు, త్రుప్పు వానిని తినివేయును. దొంగలు కన్నమువేసి వానిని దోచుకొందురు.” (మత్తయి 6:19)
సంపద పాపమా? దేవుని ఉద్దేశం ఏమిటి?
యేసు ప్రభువు ఈ మాటలు చెప్పినప్పుడు, భౌతిక సంపద కలిగి ఉండటాన్ని లేదా డబ్బు సంపాదించడాన్ని పాపంగా చిత్రీకరించడం లేదు. బైబిలు గ్రంథంలో మనం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోబు, దావీదు, సొలొమోను వంటి ఎందరో భక్తులను చూస్తాం. వారు అపారమైన సంపద కలిగి ఉన్నారు. దేవుడే వారిని భౌతికంగా ఆశీర్వదించాడు. వారు దేవుని స్నేహితులుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చినవారిగా జీవించారు.
అయితే, యేసు ప్రభువు ఇక్కడ ఖండిస్తున్నది దేన్ని? 'మీ కొరకు మీరు స్వార్థపూరితంగా కూడబెట్టుకోవడాన్ని'. దేవుని కంటే సంపదే మనకు నిజమైన రక్షణ మరియు భద్రత ఇస్తుందనే 'భ్రమ'ను ఆయన ఖండిస్తున్నారు. "నా దగ్గర డబ్బు ఉంది, నాకేం పర్వాలేదు" అనే గర్వాన్ని ఆయన హెచ్చరిస్తున్నారు.
భూసంబంధమైన ఆస్తికి లేని భద్రత
యేసు ప్రభువు కాలంలో ఐశ్వర్యానికి మూడు ప్రధాన గుర్తులు ఉండేవి: ఖరీదైన వస్త్రాలు, ధాన్యపు నిల్వలు, మరియు బంగారం/వెండి. ఈ మూడింటి బలహీనతలను యేసు చాలా చక్కగా వివరించారు:
చెదలు: మనం ఎంతో దాచుకునే ఖరీదైన పట్టు వస్త్రాలను, బ్రాండెడ్ దుస్తులను చిన్న చెదపురుగు నాశనం చేయగలదు.
త్రుప్పు: మనం దాచుకునే లోహాలు, ఆస్తులు, వస్తువులు కాలక్రమేణా క్షీణించిపోతాయి (తుప్పు పడతాయి).
దొంగలు: ఆ రోజుల్లో మట్టి గోడలకు కన్నం వేసి దొంగలు దోచుకునేవారు. ఈనాడు సైబర్ నేరాలు, బ్యాంక్ మోసాలు, స్టాక్ మార్కెట్ పతనాలు రూపంలో దొంగలు మన కంటికి కనపడకుండానే సంపదను హరించివేస్తున్నారు.
మనం ఎంత జాగ్రత్తగా దాచుకున్నా, భూసంబంధమైన ఏ సంపదకూ సంపూర్ణ భద్రత లేదు. ఒక్క అనారోగ్యం మన జీవితకాల సంపాదనను క్షణాల్లో తుడిచిపెట్టగలదు. ఒకే ఒక్క ప్రకృతి వైపరీత్యం మన సామ్రాజ్యాలను కూల్చేయగలదు. అనిత్యమైన దాని మీద నిత్యుడైన దేవుని కంటే ఎక్కువ ఆధారపడటమే అసలైన ఆత్మీయ ప్రమాదం.
రెండవ సత్యం: పరలోక సంపద యొక్క నిత్యత్వం
“కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. అచట వానిని చెదలు త్రుప్పు తినివేయవు; దొంగలు కన్నమువేసి దోచుకొనరు.” (మత్తయి 6:20)
భూసంబంధమైన నిధులు వద్దని చెప్పిన ప్రభువు, మనల్ని ఖాళీ చేతులతో ఉండమనలేదు. దానికి బదులుగా శ్రేష్ఠమైన, శాశ్వతమైన 'పరలోక సంపదను' కూడబెట్టుకోమన్నారు. అసలు పరలోకంలో ధనాన్ని కూడబెట్టడం అంటే ఏమిటి?
పరలోకపు ఖాతాలో జమ అయ్యే సంపదలు:
ఆత్మ ఫలాలు: మన హృదయంలో పెంపొందించుకునే ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనం, విశ్వసనియత , సాత్వికత , నిగ్రహం (గలతీయులకు 5:22-23). ఇవి నిత్యత్వంలో మనతో కూడా వచ్చే ఆస్తులు.
క్రీస్తు కొరకు త్యాగాలు: దేవుని పరిచర్య కొరకు, సువార్త వ్యాప్తి కొరకు మనం చేసే సమయ, ధన, ప్రాణ త్యాగాలు పరలోకంలో మహిమ కిరీటాలుగా మారుతాయి.
దీనులకు, పేదలకు సహాయం చేయడం: "పేదలను ఆదుకున్నచో ప్రభువుకే అప్పిచ్చినట్లు ఆ అప్పును అతను తప్పక తీర్చును " (సామెతలు 19:17). నిరుపేదలకు, అనాథలకు, వితంతువులకు మనం ప్రేమతో ఇచ్చే ప్రతి రూపాయి పరలోకపు ఖాతాలో జమ అవుతుంది.
ఆత్మల రక్షణ: నశించిపోతున్న ఆత్మలకు సువార్త అందించి, వారిని క్రీస్తు వైపు నడిపించడం పరలోకంలో అత్యంత విలువైన సంపద.
ఈ పరలోక సంపదకు ఎన్నటికీ ఎక్స్పైరీ డేట్ ఉండదు. దీనిని ఏ చెదలూ తినలేవు, ఏ ఆర్థిక మాంద్యమూ తగ్గించలేదు, ఏ దొంగూ దొంగిలించలేడు. ఇది దేవుని హృదయంలో భద్రంగా ఉంటుంది.
"నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును." (మత్తయి 6:21)
ఇది నిత్య సత్యం. మన పెట్టుబడి ఎక్కడ ఉంటే, మన ఆలోచనలు, మన ఆశలు, మన ఆవేదనలు అక్కడే ఉంటాయి. మనం పరలోకం వైపు పెట్టుబడి పెడితే, మన హృదయం ఎల్లప్పుడూ దేవునితోనే ముడిపడి ఉంటుంది.
మూడవ సత్యం: ఆత్మీయ దృష్టి యొక్క ప్రాముఖ్యత
“నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో, నీ దేహమంతయు కాంతిమంతమై యుండును. నీ కన్ను చెడినట్లయిన, నీ దేహమంతయు చీకటిమయమగును.” (మత్తయి 6:22-23)
ధనము, నిధుల గురించిన బోధ నుండి యేసు ప్రభువు 'కంటి చూపు' విషయానికి వెళ్ళడం మనకు వింతగా అనిపించవచ్చు. కానీ యూదా సంప్రదాయంలో, 'కన్ను' అనేది కేవలం శారీరక అవయవం కాదు,అది హృదయ ప్రాధాన్యతకు, ఆత్మీయ దృష్టికి ప్రతీక.
1. తేటగా ఉన్న కన్ను (వెలుగుమయమైన జీవితం)
ఇక్కడ 'తేటగా' అనే పదానికి 'ఏకైక లక్ష్యం కలిగిన' (Single-focused) లేదా 'ఉదార స్వభావం కలిగిన' అని అర్థం. ఎవరి దృష్టి అయితే కేవలం దేవునిపై మాత్రమే నిలిచి ఉండి, ఉదారంగా జీవిస్తుందో, వారి జీవితం వెలుగుమయంగా ఉంటుంది. వారి నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి, వారి మనస్సు దైవిక శాంతితో నిండి ఉంటుంది. వారు దేవుని నడిపింపును సులభంగా గ్రహించగలరు.
2. చెడిన కన్ను (చీకటిమయమైన అంతరంగం)
'చెడ్డ కన్ను' అంటే లోభత్వం, అసూయ, స్వార్థం. సామెతలు చెడ్డకన్ను గలవాడు ఐశ్వర్యము నొందవలెనని ఆతురపడును అని వింటాము ఎప్పుడైతే ఒక వ్యక్తి కన్ను ధనాశతో, ఇతరులను చూసి ఈర్ష్యపడటంతో నిండిపోతుందో, అప్పుడు అతని అంతరంగమంతా చీకటి ఆవరిస్తుంది.
నేటి సమాజంలో 'చెడ్డ కన్ను' ఎలా పనిచేస్తోంది?
నేటి సమాజంలో ఈ 'చెడ్డ కన్ను' మరింత ప్రమాదకరంగా మారింది. ఇతరుల విలాసవంతమైన జీవితాలు, వారి కొత్త ఇళ్లు, ఖరీదైన కార్లు, విదేశీ ప్రయాణాల ఫోటోలు చూస్తూ, మనలో తెలియకుండానే అసంతృప్తి, నిరాశ, అసూయ పెరుగుతున్నాయి. "నాకెందుకు ఇది లేదు? నేను కూడా ఎలాగైనా సంపాదించాలి" అనే లోకపు పరుగుపందెంలో పడి ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం.
భయంకరమైన హెచ్చరిక:
"నీలోని వెలుగు చీకటిగ మారినచో, ఆ చీకటి మహాఘోరమైనది!" (మత్తయి 6:23)
శారీరక అంధుడికి తాను చూడలేకపోతున్నానని తెలుసు, కాబట్టి సహాయం కోసం అర్ధిస్తాడు. కానీ, తనలోని లోభత్వాన్ని, స్వార్థాన్ని, ధనాశను 'దేవుని ఆశీర్వాదం' అని భ్రమించే ఆత్మీయ అంధుని స్థితి అత్యంత ప్రమాదకరమైనది. యేసు ప్రభువు కాలంలో పరిసయ్యులు ఇందుకే నాశనమయ్యారు. వారు తాము వెలుగులో ఉన్నామనుకున్నారు, కానీ ఘోరమైన చీకటిలో ఉన్నారు.
మన హృదయాలను పరీక్షించుకుందాం
యేసు ప్రభువు ఈ బోధ చేసి రెండు వేల సంవత్సరాలు గడిచినా, నేటి ఆధునిక సమాజానికి ఇది మరింత ఎక్కువగా అవసరమైంది. నేడు మనిషి విలువను అతని వ్యక్తిత్వాన్ని బట్టి కాక, అతనికి ఉన్న సంపదను బట్టి చూస్తున్నారు. ఇటువంటి లోకంలో ఒక నిజమైన క్రైస్తవుడు ఎలా జీవించాలి?
మనం నిజంగా పరలోక నిధిని కూడబెడుతున్నామా లేదా అని తెలుసుకోవడానికి మనల్ని మనం ఈ క్రింది మూడు ఆత్మీయ ప్రశ్నలతో పరీక్షించుకుందాం:
మన ఆదాయంలో దేవుని రాజ్యానికి, సువార్తకు, పేదలకు ఎంత శాతం ఖర్చు చేస్తున్నాం? మన నెలవారీ ఖర్చుల డైరీ లేదా బడ్జెట్ బుక్కే మన హృదయ స్థితికి నిజమైన అద్దం. మనం దేవుని కంటే మన విలాసాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా?
మనకు దొరికే ఖాళీ సమయాన్ని దేని కోసం వెచ్చిస్తున్నాం? 24 గంటల్లో ఎక్కువ సమయం వ్యాపార ప్రణాళికలు, అదనపు సంపాదన ఆలోచనలు, లోకసంబంధమైన వినోదాలకే సరిపోతుందా? లేదా ప్రార్థన, వ్యక్తిగత వాక్య ధ్యానం, కుటుంబ బలిపీఠం, సంఘ సహవాసానికి సమయం ఇస్తున్నామా?
మనల్ని రాత్రి పూట నిద్రపోనివ్వకుండా చేసే భయాలు ఏవి? ఆస్తి తగ్గిపోతుందనా, ఉద్యోగం ఊడిపోతుందనా, ఆర్థిక ఇబ్బందులు వస్తాయనా? లేక దేవునితో మనకున్న సంబంధం బలహీనమవుతుందనే ఆత్మీయ ఆందోళనా? మన భద్రత దేవుని హస్తాలలో ఉందా, లేదా ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంక్ డిపాజిట్లపై ఉందా?
సిలువపై క్రీస్తు చూపిన నిజమైన పెన్నిధి
మత్తయి 6:19–23 లో యేసు మన ముందు ఉంచిన ఎంపిక చాలా స్పష్టమైనది: నశించిపోయే భూసంపదలను పోగుచేసుకుంటూ చీకటిలో బ్రతుకుతామా, లేదా నిత్యమైన పరలోక నిధులు సంపాదిస్తూ దేవుని వెలుగులో నడుస్తామా?
ఈ బోధను దేవుడు మనల్ని ఏదో నియంత్రించడానికి ఇచ్చిన ఆజ్ఞగా చూడకూడదు; దీనిని ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానంగా చూడాలి. ఎందుకంటే, మనల్ని పరలోక నిధి వైపు నడిపించడానికి యేసుక్రీస్తు స్వయంగా ఒక గొప్ప ఉదాహరణగా నిలిచాడు.
అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు:
"మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను." (2 కొరింథీయులకు 8:9)
ఆయన పరలోకంలో సమస్త దూతల ఆరాధనను, మహిమను కలిగిన ధనవంతుడు. కానీ మనల్ని పరలోక ధనవంతులుగా చేయడానికి, మన పాపము నుండి మనల్ని విడిపించడానికి భూమిపై దీనుడిగా జన్మించాడు. పక్షులకు గూళ్లు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ, ఈ సృష్టికర్తకు తలవాల్చుకోవడానికి స్థలం లేకుండా జీవించాడు. చివరికి సొంత సమాధి కూడా లేకుండా, పరాయి సమాధిలో పెట్టబడ్డాడు. తన ప్రాణాన్నే మన కోసం నిధిగా సిలువపై అర్పించాడు.
క్రీస్తు ద్వారా మనం పొందుకున్న రక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవం, మరియు పరిశుద్ధాత్మ సాన్నిధ్యమే మన జీవితంలో అత్యంత విలువైన, శ్రేష్ఠమైన పరలోక నిధి. ఈ సత్యాన్ని గ్రహించిన ఏ విశ్వాసి కూడా భూసంబంధమైన అనిత్యమైన ఆస్తుల కొరకు, తాత్కాలిక ఘనత కొరకు ప్రాకులాడడు.
అందుకే పౌలు ఫిలిప్పీయులకు చాలా స్పష్టంగా గుర్తుచేశాడు: 'మన పౌరసత్వము పరలోకమందున్నది.' (ఫిలిప్పీయులకు 3:20).
మన ఆత్మీయ దృష్టిని పరిశుద్ధపరచుకోవాలి. లోకపు ఆశలనే చీకటి నుండి బయటపడాలి . మన హృదయాలను దేవుని సింహాసనం వైపు తిప్పి, నిత్యత్వంలో నిలిచిపోయే పరలోక సంపదను కూడబెట్టుకుంటూ, దేవుని మహిమకరమైన వెలుగులో ముందుకు సాగాలి.
ప్రార్థన
పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రీ, నశించిపోయే, తుప్పుపట్టే భూసంబంధమైన సంపదలపై కాకుండా, ఎన్నటికీ క్షీణించని నిత్యమైన పరలోక ధనాన్ని ఆశించే ఆత్మీయ హృదయాన్ని మాకు దయచేయండి. ప్రభువా , మా ఆత్మీయ దృష్టిని స్వచ్ఛపరచండి; మా కన్ను తేటగా ఉండునట్లు సహాయం చేయండి, తద్వారా మా అంతరంగము, మా జీవితాలు నీ వెలుగుతో నిండిపోవును గాక. ధనాశ యొక్క దాసత్వం నుండి, లోకపు పరుగుపందెం నుండి మమ్మల్ని విడుదల చేసి, నీకు మాత్రమే సంపూర్ణంగా లోబడే మనస్సును ప్రసాదించండి. మా పౌరసత్వము పరలోకమందున్నదని గ్రహించి, నిత్యత్వపు పెట్టుబడి పెట్టే జ్ఞానాన్ని మాకు దయచేయమని, వేడుకొనుచున్నాము. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment