సిలువ యోహాను బోధన ప్రకారం దేవునితో ఐక్యత | Spiritual Union with God| కార్మెల్ శోభ

 


                                 దేవునితో ఐక్యత

                   సిలువ యోహాను బోధన ప్రకారం

ఆత్మ దేవునితో ఎలా ఒక్కటి కాగలదు

1. సిలువ యోహాను ఎవరు?

దైవశాస్త్రజ్ఞులలో, ముఖ్యంగా క్రైస్తవ మార్మిక  సాహిత్యంలో, సిలువ యోహాను పేరు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. స్పెయిన్ దేశంలోని ఒక పేద కుటుంబంలో పుట్టిన ఈ కార్మెలీయ  సన్యాసిఆవిలాపురి తేరేసమ్మ  (St. Teresa of Ávila) తో కలిసి కార్మెల్ సభ  సంస్కరిచడంలో  తన వంతు పాత్ర   (Discalced Carmelite Reform) ఎంతో ధృడంగా పోషించాడు. తన చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి, పేదరికంలో పెరిగిన యోహాను, తర్వాత మెదినా దెల్ కాంపో నగరంలో విద్యాభ్యాసం చేసి, 1563లో కార్మెలీయ  సన్యాస సభలో  చేరాడు. అనంతరం సలమాంకా విశ్వవిద్యాలయంలో దైవశాస్త్రం అభ్యసించి, 1567లో గురువుగా అభిషేక పొందాడు. అదే సంవత్సరం అవిలాపూరి తేరేసమ్మను కలవడం ఆయన జీవితంలో ఒక మలుపు, ఆమె ప్రేరణతో సన్యాస సభలో సంస్కరణకు నడుంకట్టాడు.

ఆయన జీవితం కష్టాలతో నిండినది. సంస్కరణను వ్యతిరేకించిన సొంత  సభ సభ్యులే ఆయనను బలవంతంగా బంధించి, తోలేదోలో ఒక ఇరుకైన, చీకటి గదిలో దాదాపు తొమ్మిది నెలలపాటు నిర్బంధించారు. ఆ గదిలో ఆయనకు దాదాపు ఏ వెలుతురూ లేదు, ప్రతివారం శారీరక శిక్షలు అనుభవించాడు. అయితే ఆశ్చర్యకరంగా, ఆ చీకటి గదిలోనే ఆయన తన అత్యంత  ముఖ్యమైన  కవితలను, దైవానుభవాలను రచించాడు.  ముఖ్యంగా 'ఆధ్యాత్మిక గీతిక' కవితలో అధిక భాగం ఇక్కడే జన్మించింది. చివరకు 1578లో ఆయన ఆ నిర్బంధం నుండి తప్పించుకున్నాడు. తర్వాతి సంవత్సరాలలో ఆయన ఆ కవితలకు లోతైన ఆధ్యాత్మిక  వ్యాఖ్యానాలు రాశాడు. కార్మెల్ పర్వత  ఆరోహణ (Ascent of Mount Carmel), గాఢంధకార  రాత్రి (Dark Night of the Soul), ఆధ్యాత్మిక గీతిక (Spiritual Canticle), మరియు ప్రేమ జీవం జ్వాల (Living Flame of Love). ఈ నాలుగు రచనలు కలిసి క్రైస్తవ మార్మిక సాహిత్యంలో అత్యంత క్రమబద్ధమైన, లోతైన బోధనగా పరిగణించబడతాయి. 1926లో పదకొండవ  వ భక్తినాధ్ పోపు గారు    ఈయనను తిరుసభ పండితునిగా  (Doctor of the Church) గా ప్రకటించారు.   ఈ బిరుదు ఆయన బోధన యొక్క లోతును, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

సిలువ యోహాను బోధన కేవలం సన్యాసులకో, సన్యాసినులకో పరిమితమైనది కాదు. ప్రతి క్రైస్తవునికీ, జ్ఞానస్నానం పొందిన ప్రతి ఆత్మకూ దేవునితో సంపూర్ణ ఐక్యత అనేది అంతిమ లక్ష్యం అని ఆయన బోధిస్తాడు. ఆయన రచనలు మొదటిసారి చదివేవారికి కఠినంగా, పాండిత్యపరమైనవిగా  అనిపించవచ్చు, కానీ వాటి వెనుక ఉన్న సందేశం చాలా సున్నిత మైనది.  దేవుడు ప్రతి ఆత్మనూ ప్రేమిస్తున్నాడు, మరియు ఆ ప్రేమలో పూర్తిగా మునిగిపోవడమే మానవ జీవితపు అంతిమ గమ్యం. ఈ వ్యాసంలో ఆయన బోధనను ఒక సాధారణ విశ్వాసి కూడా అర్థం చేసుకొని ఆచరించగలిగే రీతిలో వివరించడానికి ప్రయత్నిస్తాను.  ఆయన ప్రధాన రచనలైన కార్మెల్ పర్వత  ఆరోహణ, గాఢాంధకార  రాత్రి, ఆధ్యాత్మిక గీతిక, ప్రేమ జీవ  జ్వాలలలోని ప్రధాన బోధనలను పరిశీలిస్తూ ఈ ప్రయత్నం చేస్తాను. 

“నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవనియందు ఉందునో అతడు అధికముగ ఫలించును. ఏలయన, నేను లేక మీరు ఏమియు చేయజాలరు. యోహాను 15:5

2. ఐక్యత అంటే ఏమిటి

సిలువ యోహాను ప్రకారం, దేవునితో ఐక్యత అంటే ఆత్మ తన సొంత స్వభావాన్ని కోల్పోవడం కాదు, కానీ ప్రేమ ద్వారా ఆత్మ దేవుని చిత్తంతో పూర్తిగా ఏకమవడం. అంటే ఇనుము అగ్నిలో పడినప్పుడు ఎలా అగ్నివలె మారిపోతుందో, ఆత్మ కూడా దేవుని ప్రేమాగ్నిలో మునిగి దేవుని పోలికగా రూపాంతరం చెందుతుంది. ఇనుము ఇనుముగానే ఉంటుంది, కానీ అగ్నిలా వేడిని, వెలుగును కలిగి ఉంటుంది. అలాగే ఆత్మ ఆత్మగానే ఉంటుంది, కానీ దేవుని లక్షణాలను, దేవుని ప్రేమను తనలో పంచుకుంటుంది. ఇది దైవత్వంలో పాలు పంచుకోవడం. ఒక వ్యక్తి  దేవుడు కాడు, కానీ ఆయన కృప ద్వారా దేవుని స్వభావంలో భాగస్తులమవుతాము.

“ఈ విధముగ ఆయన మనకు అమూల్యములును, అత్యుత్తమములును అగు వాగ్దానములను ఒనర్చెను. ఆయన వాగ్దానము ఒనర్చిన వానిని పొందుటద్వారా మీరు దురాశవలన కలిగెడి భ్రష్టత్వమునుండి తప్పించుకొనగలరు. కనుకనే దైవస్వభావములో భాగస్వాములు అగుదురు.” 2 పేతురు 1:4

ఈ ఐక్యత అకస్మాత్తుగా జరిగేది కాదు. అది ఒక ప్రయాణం, ఒక క్రమమైన ఎదుగుదల. సిలువ యోహాను ఈ ప్రయాణాన్ని మూడు ప్రధాన దశలుగా, ఆ దశల లోపల అనేక చిన్న  భాగాలుగా  విభజిస్తాడు. ఈ ప్రయాణానికి మూల సూత్రం ఒక్కటే: ఆత్మ దేవుడు కానటువంటి ప్రతిదాని నుండి  (వస్తువులకు, కోరికలకు, అనుభవాలకు, స్వీయత్వానికి) తనను తాను రిక్తుని (ఖాళీ) చేసుకోవాలి, తద్వారా దేవుడు మాత్రమే ఆ స్థానాన్ని  తనతో నింపగలడు. ఈ రిక్తుని  చేసుకోవడం నిష్క్రియాత్మకమైన నష్టం కాదు, అది ప్రేమతో నిండిన ఎంపిక.  ఒక పాత్రలో మురికి నీరు నిండి ఉంటే, ఆ పాత్రలో స్వచ్ఛమైన నీటిని పోయాలంటే ముందు మురికి నీటిని ఖాళీ చేయాలి. అలాగే ఆత్మలో లోకసంబంధమైన కోరికలు, స్వార్థం నిండి ఉంటే, దేవుని ప్రేమ అనే స్వచ్ఛమైన నీటిని నింపడానికి ముందుగా వాటిని ఖాళీ చేయాలి. ఒక వ్యక్తిలో అహం అనేది పూర్తిగా నిండిపోయి ఉంటే దానిని కొద్ది కొద్దిగా ఖాళీ చేసుకుంటూ ఉండి, ఆ ఖాళీని దేవుడు తనతోటి నింపుతాడు. చివరకు పునీత పౌలు గారిలా జీవించేది నేను కాదు క్రీస్తే అని చెప్పగలం. 

ఈ బోధనలో మనం మర్చిపోకూడని విషయం ఏమిటంటే, ఈ మొత్తం ప్రయాణానికి చొరవ దేవునిదే. ఆత్మ తనంతట తానుగా దేవుని దగ్గరకు చేరుకోలేదు; దేవుడే ముందుగా ఆత్మను ప్రేమించి, పిలుస్తాడు. ఆత్మ చేయవలసినదల్లా ఆ పిలుపుకు 'అవును' అని జవాబివ్వడం, తనను తాను ఆ ప్రేమకు అప్పగించుకోవడం. కాబట్టి ఐక్యత అనేది మానవ ప్రయత్నం ద్వారా 'సాధించే' విజయం కాదు, అది దేవుని కృపకు, ఆత్మ సహకారానికి మధ్య జరిగే ప్రేమ ఫలితం.

సిలువ యోహాను ఈ ఐక్యతను వివరించడానికి మరో ఉపమానాన్ని కూడా ఉపయోగిస్తాడు,  ఒక కిటికీ  గాజు (అద్దం)  గుండా సూర్యకాంతి ప్రసరించినప్పుడు, ఆ గాజు   ఎంత శుభ్రంగా, మరకలు లేకుండా ఉంటే అంత ఎక్కువ కాంతి లోపలికి ప్రసరిస్తుంది. గాజుపై ధూళి, మరకలు ఎంత ఎక్కువగా ఉంటే, కాంతి ప్రసారం అంత తక్కువగా ఉంటుంది. అలాగే, ఆత్మ ఎంత శుద్ధి చేయబడితే, దేవుని ప్రేమ కాంతి అంత సంపూర్ణంగా దానిగుండా ప్రసరిస్తుంది. అంతిమ ఐక్యతలో, గాజు, కాంతి వేరు వేరుగా కనిపించనంతగా ఏకమైపోతాయి,  అయినప్పటికీ గాజు తన సొంత స్వభావాన్ని కోల్పోదు, అది కేవలం కాంతితో నిండిపోతుంది. ఇది ఆత్మ, దేవుని మధ్య జరిగే రూపాంతర ఐక్యతకు ఒక చక్కటి ఉపమానం.

ఈ ఐక్యత లక్ష్యం కేవలం వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవం కోసం కాదు. సిలువ యోహాను ప్రకారం, ఆత్మ దేవునితో ఎంత ఎక్కువగా  ఐక్యమైతే, అంత ఎక్కువగా అది ప్రపంచానికి, సంఘానికి మేలు చేయగలదు. నిజమైన ఐక్యత ఎప్పుడూ స్వార్థపూరితం కాదు,  అది ఆత్మను మరింత ప్రేమతో, కరుణతో , ఇతరుల సేవకు సిద్ధంగా మారుస్తుంది.  కాబట్టి ఈ ప్రయాణం లక్ష్యం కేవలం 'నేను దేవునితో ఐక్యం కావడం' అని మాత్రమే కాదు, 'నేను దేవుని ప్రేమకు వాహికగా మారి, ఆ ప్రేమను ఇతరులకు పంచడం' అని కూడా అర్థం చేసుకోవాలి.

మన జీవితాలలో ఈ బోధనను అన్వయించుకుంటే, రోజువారీ కుటుంబ జీవితంలో, ఉద్యోగంలో, సంఘ సేవలో ఎదురయ్యే సాధారణ పరిస్థితులే ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి వేదికలు అవుతాయి. ఒక గృహిణి తన కుటుంబ బాధ్యతలను ప్రేమతో, సహనంతో నిర్వహించడంలో, ఒక ఉద్యోగి తన పనిలో నిజాయితీగా, అంకితభావంతో వ్యవహరించడంలో, ఒక విద్యార్థి తన చదువులో క్రమశిక్షణతో ఉండటంలో, ఈ అన్నిటిలో సిలువ యోహాను చెప్పిన 'నాదా ' సూత్రాన్ని, అంటే స్వార్థాన్ని వదిలి దేవుని చిత్తానికి  మాత్రమే లోబడటాన్ని ఆచరించవచ్చు. ఆధ్యాత్మిక జీవితం సన్యాసుల మఠాలకే పరిమితం కాదు, ప్రతి ఇంటిలో, ప్రతి పనిలో దేవుడు మనలను ఐక్యత వైపుకు పిలుస్తున్నాడు.

3. మూడు మార్గాలు — శుద్ధి, ప్రకాశం, ఐక్యత

క్రైస్తవ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఆత్మ ప్రయాణం మూడు మార్గాలుగా వర్ణించబడుతుంది. ఇవి వేరువేరుగా జరిగే మూడు ప్రత్యేక దశలు కావు, కానీ ఒకదానితో ఒకటి పెనవేసుకున్న, ఎదుగుదల మెట్లు:

శుద్ధి మార్గం (Purgative Way) — పాపాలను, అస్తవ్యస్త కోరికలను శుద్ధి చేసుకునే దశ. ఇది ప్రధానంగా ప్రారంభ దశలో ఉన్నవారికి, తమ జీవితంలో పాపపు అలవాట్లను, ప్రాపంచిక అనుబంధాలను వదిలించుకోవడంపై దృష్టి పెడుతుంది.

 ప్రకాశ మార్గం (Illuminative Way) — దేవుని గురించిన సత్యాలు, సద్గుణాలు ఆత్మలో వెలుగొందే దశ. ఇక్కడ ఆత్మ దేవుని పట్ల లోతైన అవగాహనను, సద్గుణాలలో స్థిరత్వాన్ని పొందుతుంది, తన జీవితాన్ని క్రీస్తు మాదిరిగా మలుచుకోవడం మొదలుపెడుతుంది.

 ఐక్య మార్గం (Unitive Way) — ఆత్మ దేవునితో ప్రేమలో పరిపూర్ణంగా ఏకమయ్యే దశ. ఇది ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం, ఇక్కడ ఆత్మ, దేవుని చిత్తంతో సంపూర్ణంగా ఐక్యమై, శాంతిని, స్థిరత్వాన్ని అనుభవిస్తుంది.

సిలువ యోహాను ఈ మూడు మార్గాలను రెండు 'రాత్రులు' (Nights) అనే చిహ్నాల   ద్వారా వివరిస్తాడు.  ఇంద్రియ రాత్రి, ఆత్మ రాత్రి. ఇక్కడ  'రాత్రి' అంటే శిక్ష కాదు, దేవుడు ఆత్మను శుద్ధి చేయడానికి ప్రేమతో నడిపించే మార్గం. ఈ అంధకారంలోనే  నిజమైన వెలుగు ఉదయిస్తుంది. ఆయన ఈ చిహ్నాన్ని  ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే, రాత్రి సమయంలో మన సాధారణ ఇంద్రియ దృష్టి పనిచేయదు, కానీ అదే సమయంలో నక్షత్రాలు, చంద్రుని వెలుగు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే ఆధ్యాత్మిక 'రాత్రి'లో మన సహజమైన బుద్ధి, భావావేశాల ద్వారా దేవుని గ్రహించే సామర్థ్యం మసకబారుతుంది, కానీ అదే సమయంలో విశ్వాసం అనే వెలుగు ద్వారా దేవుడు మరింత స్పష్టంగా ప్రత్యక్షమవుతాడు.

ఈ మూడు మార్గాలు, రెండు రాత్రులు కలిపి ఆత్మ ప్రయాణానికి ఒక సంపూర్ణమైన  నమూనాను ఇస్తాయి. ఈ నమూనాలో  ప్రతి దశకు దాని స్వంత లక్షణాలు, సవాళ్లు, కృపలు ఉంటాయి.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి,  ఈ మూడు మార్గాలు ఖచ్చితమైన, స్పష్టమైన సరిహద్దులతో వేరు వేరుగా ఉండవు. వాస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తి శుద్ధి మార్గంలో ఉండి కూడా అప్పుడప్పుడు ప్రకాశ మార్గపు వెలుగులను అనుభవించవచ్చు, లేదా ఐక్య మార్గంలో ఉన్నవారు కూడా అప్పుడప్పుడు శుద్ధీకరణ అనుభవాలను పొందవచ్చు. సిలువ యోహాను ఈ దశలను ఖచ్చితమైన అంచెలుగా కాక, సాధారణ దిశానిర్దేశంగా ఇచ్చాడు.  ఇవి ఆత్మ ఎక్కడ ఉందో అర్థం చేసుకోవడానికి, ముందుకు సాగడానికి ఒక పటంలా ఉపయోగపడతాయి, ఖచ్చితమైన కాలపట్టికలా కాదు.

4. మొదటి అడుగు: ఇంద్రియ రాత్రి (Night of Sense)

4.1. క్రియాశీల ఇంద్రియ రాత్రి (Active Night of Sense)

ఇది ఆత్మ స్వయంగా అంటే ఒక వ్యక్తి దేవునిలో ఐక్యం కావాలని తనను తాను శుద్ది చేసుకొనే పక్రియ, ఇది కూడా దేవుని కృపతో కలిసి చేసే ప్రయత్నం. ఇందులో వ్యక్తి తన ఇంద్రియ కోరికలను (భోజనం, సుఖం, గౌరవం, వస్తువులపై మమకారం వంటివి) క్రమశిక్షణతో నియంత్రించుకుంటాడు. ఇది కేవలం బాహ్య త్యాగం కాదు, అంతరంగంలో దేవుని కంటే ఇతర దేనిపైనా అధిక మమకారం లేకుండా ఉండటం. సిలువ యోహాను దీన్ని 'నాదా' (Nada) సూత్రంగా చూస్తాడు.   'ఏదీ కాదు, ఏదీ కాదు, ఏదీ కాదు' అని  కార్మెల్ పర్వతం అధిరోహించే మార్గం పటంలో రాశాడు. ఈ దశలో వ్యక్తి తన ఐదు ఇంద్రియాల ద్వారా వచ్చే అనుభూతులను, ముఖ్యంగా అస్తవ్యస్తమైన కోరికలను (అతిగా తినడం, అతిగా మాట్లాడటం, అనవసర వినోదాలు) గుర్తించి, వాటిని క్రమంగా నియంత్రించుకోవడం నేర్చుకుంటాడు.

సమస్త రుచిని కలిగి ఉండాలంటే, దేని రుచిని కోరుకోకు. సమస్తాన్ని తెలుసుకోవాలంటే, దేనినీ తెలుసుకోవాలని కోరుకోకు. సమస్తాన్ని కలిగి ఉండాలంటే, దేనినీ కలిగి ఉండాలని కోరుకోకు. దేవుణ్ణి పొందలనుకుంటే దేనిని పొందాలని కోరుకోకు —కార్మెల్  పర్వత ఆరోహణ, పుస్తకం 1

ఈ దశలో సాధించవలసిన ఆచరణాత్మక అడుగులు,  ప్రతిరోజూ కొంత సమయం నిశ్శబ్ద ప్రార్థనకు కేటాయించడం, అనవసర సుఖాలను, వ్యర్థ మాటలను, అతిగా వినోదాన్ని తగ్గించడం, దేవుని పట్ల కోరికను అన్నిటికంటే మిన్నగా పెంచుకోవడం. ఇక్కడ సిలువ యోహాను ప్రత్యేకంగా ఒక హెచ్చరిక చేస్తాడు అంది ఏమిటంటె, ఈ త్యాగం ప్రతికారంతో, కోపంతో, తనను తాను హింసించుకోవడం ద్వారా చేయకూడదు. అది ప్రేమతో, సంతోషంతో, దేవుని కోసం అనే ఉద్దేశంతో చేయాలి. ఎందుకంటే బలవంతంగా చేసే త్యాగం కేవలం బాహ్య మార్పు తెస్తుంది, కానీ ప్రేమతో చేసే త్యాగం అంతరంగాన్ని  మారుస్తుంది. ఎప్పుడైతే ఆత్మ వీటిని సరిగా చేయ గలుగుతుందో అప్పుడు దేవుడు ప్రార్దనలో ఆనందంను ఆత్మకు కలుగచేస్తాడు ఇది క్రియాశీల ధ్యాననందం, ఇది ప్రతి వ్యక్తికి దేవుడు  తమను తాము శుద్దిని చేసుకొనుటకు చేసిన ప్రయత్నానికి పనికి ఇచ్చే ఫలితం. 

4.2. నిష్క్రియ ఇంద్రియ రాత్రి (Passive Night of Sense)

ఇది దేవుడే స్వయంగా ఆత్మలో చేసే పని. ఈ దశలో వ్యక్తికి ప్రార్థనలో పూర్వం ఉన్న రుచి, ఆనందం మాయమైపోతుంది. ధ్యానం కష్టంగా అనిపిస్తుంది, ఆధ్యాత్మికముగా  ఎండిపోయినట్టుగా (aridity) అనిపిస్తుంది. చాలామంది ఈ దశలో నిరుత్సాహపడి ప్రార్థనను మానేస్తారు, కానీ సిలువ యోహాను ఇది వెనుకడుగు కాదు, ముందడుగు అని బోధిస్తాడు,  ఇది దేవుడు ఆత్మను ఇంద్రియ స్థాయి నుండి ఆధ్యాత్మిక స్థాయికి తీసుకువెళ్తున్న సంకేతం. ఇది శిశువును తల్లి పాలు మాన్పించి, ఘనాహారానికి అలవాటు చేసే ప్రక్రియతో పోల్చవచ్చు. పాలు మాన్పించే సమయంలో శిశువుకు బాధగా అనిపించినా, అది శిశువు ఎదుగుదలకు అవసరమైన దశ.

ఈ నిష్క్రియ రాత్రిని గుర్తించడానికి సిలువ యోహాను మూడు సంకేతాలను ఇస్తాడు.  మొదటిది, ధ్యానంలో పూర్వపు రుచి పోవడమే కాక ఇతర దేనిలోనూ రుచి దొరకకపోవడం; రెండవది, దేవుని పట్ల శ్రద్ధ, ఆందోళన కొనసాగుతూనే ఉండటం (అంటే వ్యక్తి దేవుడిని మరచిపోలేదు, ఆయనకు దూరమైపోతున్ననని బాధపడుతున్నాడు); మూడవది, ఊహాశక్తితో ధ్యానించే సామర్థ్యం తగ్గి, కేవలం ప్రశాంతంగా, ప్రేమతో దేవుని సముఖంలో ఉండాలనే అంతరంగిక కోరిక పెరగడం. ఈ మూడు సంకేతాలు కలిసి కనిపించినప్పుడు మాత్రమే ఇది నిజమైన నిష్క్రియ రాత్రి అని నిర్ధారించుకోవాలి. కేవలం సోమరితనం వల్ల లేదా అశ్రద్ధ వల్ల కలిగే  అధ్యాత్మికంగా ఎండిపోయినట్లు ఉన్న అనుభూతిని దీనితో పొరపడకూడదు. ఈ తేడాను గుర్తించడంలో ఆధ్యాత్మిక దిశానిర్దేశకుని సహాయం చాలా విలువైనది.

ఈ దశలో దేవుడు ఇంద్రియ స్థాయి భక్తిని క్రమంగా తగ్గించి, ఆత్మను మరింత ఆధ్యాత్మిక, పరిపక్వమైన ప్రార్థనా విధానానికి సిద్ధం చేస్తాడు. దీన్ని అనుభవించే వ్యక్తులు సాధారణంగా ఇప్పటికే కొంత కాలంగా ప్రార్థనా జీవితంలో నిబద్ధతతో ఉన్నవారై ఉంటారు.  వారు తమ ఇంద్రియ కోరికలపై చెప్పుకోదగ్గ నియంత్రణ సాధించారు, కానీ ఇప్పుడు దేవుడు వారిని మరింత లోతైన దశకు నడిపిస్తున్నాడు.

5. రెండవ అడుగు: ఆత్మ రాత్రి (Night of the Spirit)

ఇంద్రియ రాత్రి తర్వాత, ఆత్మ మరింత లోతైన శుద్ధీకరణలోకి ప్రవేశిస్తుంది .  దీన్ని సిలువ యోహాను 'ఆత్మ గాడాంధకార  రాత్రి' అని పిలుస్తాడు. ఇది తీవ్రమైనది, బాధాకరమైనది, కానీ అత్యంత ఫలప్రదమైనది. ఇక్కడ దేవుడు ఆత్మ యొక్క  అంతరంగ  శక్తులను  బుద్ధి (intellect), జ్ఞాపకశక్తి (memory), చిత్తం (will)  శుద్ధి చేస్తాడు, తద్వారా అవి పూర్తిగా  సద్గుణాలైన విశ్వాసం, నమ్మిక , ప్రేమలతో నింపబడతాయి. ఇంద్రియ రాత్రి కేవలం ప్రారంభ శుద్ధీకరణ మాత్రమే; ఆత్మ రాత్రి అనేది మరింత నిగూఢమైన , మూలాధారమైన మార్పు తెచ్చేది.  ఇది ఆత్మ యొక్క లోతైన మూలాలలో ఉన్న అహంకారం, స్వార్థపూరిత అనుబంధాలను తొలగిస్తుంది.

ఈ దశలో వ్యక్తి తనలో దేవుని ఉనికే లేదని, తాను త్యజించబడ్డాడని, తన పాపాలు, అసంపూర్ణతలు స్పష్టంగా కనిపిస్తూ గాఢమైన  ఆధ్యాత్మిక వేదనను అనుభవిస్తాడు. సిలువ యోహాను దీన్ని 'ఆత్మ యొక్క ఉత్తరించు స్థలం' అని కూడా పిలుస్తాడు.   ఇది నరకం కాదు, కానీ ప్రేమ ద్వారా జరిగే లోతైన శుద్ధీకరణ, ఇది ఆత్మను దేవునితో ప్రత్యక్ష ఐక్యతకు సిద్ధం చేస్తుంది. ఈ సమయంలో వ్యక్తికి దేవుడు తనను విడిచిపెట్టాడని, తన ప్రార్థనలు వ్యర్థమని అనిపించవచ్చు; కొందరికి తమ మోక్షంపైనే అనుమానాలు కలగవచ్చు. ఇది సాధారణ మానసిక దుఃఖం కాదు, ఆధ్యాత్మిక శుద్ధీకరణ యొక్క ప్రత్యేక అనుభవం అని సిలువ యోహాను స్పష్టం చేస్తాడు.

ఓ చీకటి రాత్రి, ప్రేమికునితో ప్రేమికురాలిని ఏకం చేసిన మార్గదర్శినీ, ప్రేమికురాలిని ప్రేమికునిగా రూపాంతరం చెందించిన ఓ రాత్రి!

— గాడాంధకార  రాత్రి, కవిత

ఈ ఆత్మ రాత్రిలో దేవుడు ఆత్మకు 'నిగూఢ ధ్యానం' అనే ప్రత్యేక కృపను ఇస్తాడు. ఇది బుద్ధికి అర్థంకాని, గ్రహించలేని రీతిలో దేవుడు నేరుగా ఆత్మపై పనిచేసే విధానం. ఇది అంధకారంగా  అనిపిస్తుంది ఎందుకంటే బుద్ధి తన సాధారణ మార్గాల ద్వారా దాన్ని గ్రహించలేదు, కానీ వాస్తవానికి అది అత్యంత ప్రకాశవంతమైన దైవ వెలుగు.   అది మన బలహీనమైన కళ్ళకు చీకటిలా కనిపిస్తుంది, సూర్యుని వెలుగు గుడ్డివాని కళ్ళకు చీకటిలా అనిపించినట్టు. సిలువ యోహాను ఈ పోలికను మరింత విపులీకరిస్తాడు.  ఒక కిటికీలో ధూళి కణాలు సూర్యకాంతిలో స్పష్టంగా కనిపిస్తాయి, కానీ స్వచ్ఛమైన గాలి కంటికి కనిపించదు. అలాగే అసంపూర్ణమైన ఆత్మకు దైవ వెలుగు తనలోని లోపాలను, ధూళిని స్పష్టంగా చూపిస్తుంది, అందుకే అది బాధాకరంగా అనిపిస్తుంది.

ఈ దశలో వ్యక్తికి కలిగే మరో ముఖ్యమైన అనుభవం ఏమిటంటే, తనకంటూ ఏ ఆధ్యాత్మిక ఆస్తులు లేవని, తన స్వంత ప్రయత్నాలు అన్నీ వ్యర్థమని అనిపించడం. ఇది వాస్తవానికి ఆత్మను తనపై కాక పూర్తిగా దేవుని కృపపై ఆధారపడేలా చేసే ప్రక్రియ. సిలువ యోహాను దీన్ని 'ఆత్మ యొక్క రెండవ, లోతైన మరణం' అని పిలుస్తాడు.  పాత అహం  చనిపోయి, క్రీస్తులో కొత్త జీవితం ప్రారంభమయ్యే ప్రక్రియ. ఈ మరణం బాధాకరమే అయినా, అది పునరుత్థానానికి ముందు అవసరమైన అడుగు.

6. మూడు దైవ సద్గుణాలు — ఆత్మ శక్తుల శుద్ధీకరణ

సిలువ యోహాను బోధన మధ్యలో ఒక కీలకమైన సూత్రం ఉంది. అది  ఆత్మలోని మూడు శక్తులు (బుద్ధి, జ్ఞాపకశక్తి, చిత్తం) మూడు దైవ సద్గుణాల ద్వారా శుద్ధి చేయబడాలి. ఈ బోధన ' కార్మెల్ పర్వత  ఆరోహణ' గ్రంథంలోని రెండు, మూడు పుస్తకాలలో వివరంగా చర్చించబడింది. ఈ మూడు శక్తులు మానవ ఆత్మ యొక్క ఆధ్యాత్మిక అవయవాలు వంటివి.  శరీరానికి కళ్ళు, చెవులు, చేతులు ఉన్నట్టే, ఆత్మకు బుద్ధి, జ్ఞాపకశక్తి, చిత్తం ఉన్నాయి. ఇవి పరిపూర్ణంగా దేవుని వైపు మళ్ళినప్పుడే ఆత్మ పరిపూర్ణ ఐక్యతను చేరుకోగలదు.

6.1. విశ్వాసం బుద్ధిని శుద్ధి చేస్తుంది

బుద్ధి సహజంగా  ప్రతి దానిని అర్థం చేసుకోవాలని, స్పష్టత కోరుకుంటుంది. కానీ దేవుడు అనంతుడు, మన బుద్ధికి అందడు. కాబట్టి బుద్ధిని దేవుని వైపుకు నడిపించే ఏకైక సరైన మార్గం విశ్వాసం.   స్పష్టంగా చూడకపోయిన  దేవుని మాటను నమ్మడం. సిలువ యోహాను ప్రకారం, ఏ ప్రత్యేక దర్శనాలు, ప్రవచనాలు, అనుభూతులు కూడా విశ్వాసానికి ప్రత్యామ్నాయం కాలేవు; వాటిని విశ్వసించడం కంటే వాటిని పక్కన పెట్టి, కేవలం విశ్వాసంతో ముందుకు సాగడమే సురక్షితమైన మార్గం.  దర్శనాలు, స్వరాలు వినడం, అద్భుత అనుభూతులు కొన్నిసార్లు నిజమైనవి అయినప్పటికీ, వాటిపై ఆధారపడటం ఆత్మను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది  అని వాటి గురించి ఆయన ప్రత్యేకంగా హెచ్చరిస్తాడు, ఎందుకంటే మనిషి బుద్ధి వాటిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి, ఏదైనా అసాధారణ ఆధ్యాత్మిక అనుభవం కలిగినా, దాన్ని గుడ్డిగా నమ్మకుండా, వినయంతో ఆధ్యాత్మిక గురువుకు  తెలియజేసి, ఆయన నిర్ణయానికి లోబడటం మంచిది.

6.2. నమ్మిక  జ్ఞాపకశక్తిని శుద్ధి చేస్తుంది

జ్ఞాపకశక్తి గతాన్ని పట్టుకుని ఉంటుంది.   గత అనుభవాలు, గత సుఖాలు, గత బాధలు.  ఈ జ్ఞాపకశక్తిని దేవుని వైపుకు మళ్ళించడానికి కావలసిన సద్గుణం దైవ నమ్మిక.  ఇది  భవిష్యత్తులో దేవుడు ఇచ్చే శాశ్వతమైన మేలు కోసం ఎదురు చూడటం, గతంలో ఉన్న దేనిపైనా, తెలిసిన దానిపైన  ఆధారపడకపోవడం. చాలామంది తమ గత తప్పులను తలుచుకుని నిరాశలో మునిగిపోతారు, లేదా గత విజయాలు, గత సుఖాలను తలుచుకుని వర్తమానంలో దేవుని పట్ల నిండైన శ్రద్ధ పెట్టలేకపోతారు. దైవ నమ్మిక  అనే సద్గుణం ఈ రెండు అవరోధాలను అధిగమించి, జ్ఞాపకశక్తిని పూర్తిగా దేవుని వాగ్దానాలపై నిలబెడుతుంది.

6.3. దైవ ప్రేమ చిత్తాన్ని శుద్ధి చేస్తుంది

చిత్తం అనేక వస్తువులను, వ్యక్తులను, అనుభవాలను కోరుకుంటుంది. ఈ చిత్తాన్ని పూర్తిగా శుద్ధి చేసేది ప్రేమ మాత్రమే.  అది దేవుని పట్ల సంపూర్ణమైన, విభజించబడని ప్రేమ. చిత్తం దేవుని పట్ల తప్ప మరి దేనిపట్లా అధిక మమకారం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అది నిజమైన స్వేచ్ఛను పొందుతుంది. సిలువ యోహాను ప్రకారం, చిత్తం నాలుగు ప్రధాన భావావేశాలను (సంతోషం,ఆశ , భయం, బాధ  ) కలిగి ఉంటుంది, మరియు ఈ నాలుగింటినీ దేవుని వైపుకు మళ్ళించాలి.  అంటే, సంతోషం దేవునిలో మాత్రమే వెతకాలి, ఆశ దేవునిపైనే ఉంచాలి, భయం దేవుని నుండి దూరమవడం పట్లనే ఉండాలి, దుఃఖం పాపం, దేవుని నుండి దూరమవడం పట్లనే ఉండాలి.

ఈ మూడు సద్గుణాలు కలిసినప్పుడు ఆత్మ యొక్క మూడు శక్తులు పూర్తిగా దేవునిపై కేంద్రీకృతమవుతాయి, అప్పుడే ఆత్మ ఐక్యతకు సిద్ధపడుతుంది. ఇది ఒక త్రిభుజం వంటిది, బుద్ధి, జ్ఞాపకశక్తి, చిత్తం అనే మూడు కోణాలు విశ్వాసం, నమ్మిక, ప్రేమ అనే మూడు రేఖల ద్వారా ఒకదానితో ఒకటి కలిసి, పరిపూర్ణమైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి.

ఆచరణలో ఈ బోధనను అన్వయించుకోవడం ఎలాగో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఒక వ్యక్తికి భవిష్యత్తు గురించి తీవ్రమైన భయం, అనిశ్చితి ఉందనుకుందాం. ఆ భయం జ్ఞాపకశక్తి, ఊహాశక్తులలో గత చేదు అనుభవాల నుండి పుడుతుంది. ఈ భయాన్ని అధిగమించడానికి సిలువ యోహాను సూచించే మార్గం ఆశ అనే సద్గుణాన్ని బలపరచుకోవడం.   అంటే, గతంలో ఏమి జరిగినా, భవిష్యత్తులో ఏమి జరిగినా, దేవుడు తనను ఎప్పుడూ విడిచిపెట్టడని దృఢంగా నమ్మడం. అలాగే, ఎవరైనా తమ బుద్ధి ద్వారా దేవుని గురించి అన్నీ 'అర్థం చేసుకోవాలని' తీవ్రంగా ప్రయత్నిస్తూ, సందేహాలతో సతమతమవుతుంటే, వారికి కావలసింది మరింత తర్కం కాదు, మరింత లోతైన విశ్వాసం,  అంటే, అర్థం కాకపోయినా దేవుని మాటను నమ్మే ధైర్యం.

7. 'నాదా' సూత్రం - త్యజించడం ద్వారా అంతా పొందడం

సిలువ యోహాను తన ప్రసిద్ధ కార్మెల్ పర్వతం చిత్రంలో (Sketch of Mount Carmel) ఒక వైరుధ్యాన్ని  చిత్రించాడు: పర్వతం శిఖరానికి చేరుకోవాలంటే, రెండు వైపులా ఉన్న మార్గాలను కాదు, మధ్యలో ఉన్న ఇరుకైన 'నాదా' (ఏదీ కాదు) మార్గాన్ని ఎన్నుకోవాలి. ఈ చిత్రంలో పర్వతం రెండు వైపులా 'ఐహిక వస్తువుల మార్గం' (the way of possessing earthly goods), 'ఆధ్యాత్మిక వస్తువుల మార్గం' (the way of possessing heavenly goods) అని ఉంటాయి.  ఈ రెండు మార్గాలు కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపించినా, అవి శిఖరానికి నేరుగా చేర్చవు. మధ్యలో ఉన్న ఇరుకైన మార్గంలో 'నాదా , నాదా , నాదా ... మరియు పర్వత శిఖరంపై కూడా నాదా ' అని ఉంటుంది. ఇది రాసి క్రీస్తు స్వయంగా చెప్పిన మాటకు ప్రతిధ్వని: 'తన ప్రాణాన్ని కోల్పోయినవాడు దానిని దక్కించుకుంటాడు' (మత్తయి 16:25).

తన ప్రాణమును కాపాడు కొనచూచువాడు, దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు, దానిని దక్కించు కొనును.  — మత్తయి 16:25

ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టడం అంటే: వస్తువులపై మమకారం వదులుకోవడం (కానీ వాటిని ఉపయోగించడం మానేయడం కాదు), తన సొంత అభిప్రాయాలను, తీర్పులను దేవుని చిత్తానికి లోబరచడం, ఇతరుల నుండి గౌరవం, ప్రశంస కోరుకోకపోవడం, తన సొంత ఆధ్యాత్మిక అనుభూతులను కూడా అంటిపెట్టుకోకుండా ఉండటం. ఇది నిరాశావాదం కాదు, ఇది ఆత్మను అస్తవ్యస్త అనుబంధాల నుండి విడిపించి, దేవునితో మాత్రమే నింపగల స్థలాన్ని ఖాళీగా ఉంచడం. సిలువ యోహాను ఈ 'నాదా ' అంటే వస్తువులను, సంబంధాలను, బాధ్యతలను త్యజించడం కాదు; ఒక వ్యక్తి తన కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, బాధ్యతలను వదిలిపెట్టనవసరం లేదు. బదులుగా, ఆ వస్తువులు, సంబంధాల పట్ల అస్తవ్యస్తమైన, అధిక మమకారాన్ని వదిలించుకోవడమే ఇక్కడ ముఖ్యాంశం అని స్పష్టంగా చెబుతాడు.

ఈ బోధనలో ఒక ముఖ్యమైన సూక్ష్మభేదం ఉంది, మనం వస్తువులను, అనుభవాలను వాడుకోవచ్చు, ఆనందించవచ్చు, కానీ వాటిని మన హృదయపు కేంద్రంగా చేసుకోకూడదు. హృదయపు కేంద్రంలో దేవుడు మాత్రమే ఉండాలి. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ప్రేమించవచ్చు, తన వృత్తిలో రాణించవచ్చు, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు, కానీ ఈ అన్నిటినీ దేవుని ప్రేమకు లోబడి, ఆయన చిత్తానికి అనుగుణంగా మాత్రమే కలిగి ఉండాలి. ఇదే నిజమైన 'నాదా' అంటే  వస్తువుల లేమి కాదు, వాటి పట్ల అస్తవ్యస్త మమకారపు లేమి.

8. ప్రేమ నిచ్చెన — పది మెట్లు (Dark Night, Book 2)

సిలువ యోహాను 'గాఢాంధకార  రాత్రి' గ్రంథం రెండవ పుస్తకంలో, పన్నెండవ అధ్యాయం నుండి, ఆత్మ ప్రేమలో ఎదిగే పది దశలను ఒక నిచ్చెనగా వర్ణిస్తాడు. ఈ బోధనకు ఆధారం మధ్యయుగపు ఆధ్యాత్మిక రచయితలు ఉపయోగించిన 'ప్రేమ నిచ్చెన' (Ladder of Divine Love) అనే సంప్రదాయిక చిత్రం. ఈ మెట్లు ఆత్మ దేవుని పట్ల ప్రేమలో క్రమంగా ఎదుగుతూ, చివరకు పరిపూర్ణ ఐక్యతకు చేరుకునే మార్గాన్ని చూపిస్తాయి. ప్రతి మెట్టు ఒక్కొక్క దశలో ఆత్మలో కలిగే ప్రేమ యొక్క తీవ్రతను, స్వభావాన్ని సూచిస్తుంది:

        1 మెట్టు: ఆత్మ అనారోగ్యంగా అవుతుంది (దేవుని కోసం ఆరాటపడుతూ).  ఇది ప్రేమ యొక్క తొలి కదలిక. ఆత్మ తనలో ఏదో లోటు ఉందని, దేవుని అవసరం ఎంత ఎక్కువో గ్రహించడం మొదలుపెడుతుంది.

        2 మెట్టు: ఆత్మ దేవుని నిరంతరం వెతుకుతుంది, విశ్రాంతి పొందదు. ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో దేవుని ఉనికిని వెతకడం మొదలుపెడుతుంది.

        3 మెట్టు: ఆత్మ దేవుని కోసం పనిచేయాలని తీవ్రమైన ఆసక్తితో ఉంటుంది, తన శక్తులన్నీ దేవుని సేవలో ధారపోయాలని కోరుకుంటుంది.

        4 మెట్టు: దేవుని కోసం బాధపడటంలో ఆత్మకు సంతోషం కలుగుతుంది. కష్టాలు, సిలువలు ఇక భారంగా అనిపించవు, ప్రేమకు నిదర్శనంగా కనిపిస్తాయి.

        5 మెట్టు: ఆత్మ దేవుని కోసం అసహనంగా, తీవ్రంగా ఆరాటపడుతుంది.  ఇది ప్రేమికుడు తన ప్రియమైన వ్యక్తిని కలవాలని ఆరాటపడే విధంగా ఉంటుంది.

        6 మెట్టు: ఆత్మ దేవుని వైపుకు వేగంగా, తేలికగా పరుగెత్తుతుంది.  ఇక ఆధ్యాత్మిక జీవితం భారంగా అనిపించదు, ప్రేమతో తేలికగా సాగుతుంది.

        7 మెట్టు: ఆత్మ ధైర్యంతో నిండి, దేవుని కోసం ఏ అడ్డంకినైనా ఎదుర్కొంటుంది. భయాలు, సంశయాలు తగ్గిపోయి, ప్రేమ ధైర్యంగా మారుతుంది.

        8 మెట్టు: ఆత్మ దేవుణ్ణి పట్టుకుంటుంది, ఆయనతో ఉంటుంది, కానీ ఇంకా విడిచిపెట్టదు.  ఇది క్లుప్తమైన, తీవ్రమైన ఐక్యత అనుభవాలు కలిగే దశ.

        9 మెట్టు: ఆత్మ ప్రేమలో మధురంగా దహించుకుపోతుంది. ఇది ఇక బాధ కాదు, పరిపూర్ణమైన ఆనందదాయకమైన అనుభవం.

        10 మెట్టు: ఆత్మ దేవునితో పూర్తిగా రూపాంతరం చెంది ఐక్యమవుతుంది.  ఇది జీవితంలో పరిపూర్ణతకు అత్యున్నత స్థాయి, ఇక్కడ ఆత్మ శాశ్వతానందపు తొలి రుచిని ఇహలోకంలోనే అనుభవిస్తుంది.

ఈ పది మెట్లు ఒక్కసారిగా ఎక్కబడేవి కావు; ఇవి జీవితకాల ప్రయాణంలో క్రమంగా, దేవుని కృప ద్వారా, ఆత్మ సహకారంతో సాధించబడతాయి. ప్రతి మెట్టు ఎక్కడానికి ముందు, ఆత్మ ఆ దశకు తగినంతగా శుద్ధి చేయబడి ఉండాలి; తొందరపడి ముందుకు దూకడం సాధ్యం కాదు, అలా చేయడం ఆధ్యాత్మిక గర్వానికి దారితీయవచ్చు. ఓర్పుగా, వినయంగా, దేవుని వేగానికి అనుగుణంగా నడవడమే ఈ నిచ్చెన ఎక్కడానికి సరైన మార్గం అని సిలువ యోహాను స్పష్టం చేస్తాడు.

9. ఆధ్యాత్మిక వివాహం - ఆధ్యాత్మిక గీతిక బోధన

సిలువ యోహాను 'ఆధ్యాత్మిక గీతిక' (Spiritual Canticle) గ్రంథంలో ఆత్మకూ, క్రీస్తుకూ మధ్య సంబంధాన్ని వధూవరుల ప్రేమగా చిత్రిస్తాడు.  ఇది పరిశుద్ధ గ్రంథంలోని 'పరమగీతం' (Song of Songs) పై ఆధారపడింది. ఈ కవితలో ఆత్మ తన ప్రియుడైన క్రీస్తును వెతుకుతూ కొండలు, లోయలు, అడవులు దాటుతూ ప్రయాణిస్తుంది. ఈ ప్రేమ ప్రయాణంలో మూడు ప్రధాన దశలు ఉన్నాయి.  ఇవి మానవ వివాహ సంబంధంలోని దశలను పోలి ఉంటాయి:

9.1. నిశ్చితార్థం (Spiritual Betrothal)

ఈ దశలో ఆత్మ దేవునితో లోతైన సాన్నిహిత్యాన్ని అనుభవిస్తుంది, కానీ ఇంకా పూర్తి స్థిరత్వం లేదు. దేవుని సన్నిధి అనుభవం వస్తుంది పోతుంది, ఆత్మ ఇంకా పరిపూర్ణ శుద్ధీకరణలో ఉంటుంది. ఇది మానవ వివాహంలో నిశ్చితార్థ కాలంతో పోల్చవచ్చు, ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు బాగా ఎరిగినప్పటికీ, ఇంకా పూర్తి, శాశ్వతమైన కలయిక జరగలేదు. ఈ దశలో ఆత్మకు దేవుని సన్నిధి తీపి అనుభవాలను ఇస్తుంది, కానీ ఇంకా ఎడబాటు భయం, అస్థిరత కూడా మిగిలి ఉంటాయి.

9.2. ఆధ్యాత్మిక వివాహం (Spiritual Marriage)

ఇది సిలువ యోహాను బోధనలో ఐక్యత యొక్క అత్యున్నత స్థాయి. ఇక్కడ ఆత్మమరియు  క్రీస్తు  శాశ్వతంగా, స్థిరంగా, విడదీయరాని రీతిలో ఏకమవుతారు. ఆత్మ ఇక తనలో జీవించదు, క్రీస్తులో జీవిస్తుంది (గలతీయులు 2:20 స్ఫూర్తిలో). ఈ దశలో ఆత్మ శక్తులు (బుద్ధి, జ్ఞాపకశక్తి, చిత్తం) పూర్తిగా త్రిత్వ దేవునితో ఐక్యమవుతాయి, మరియు ఆత్మ దేవుని కార్యకలాపాలలో పాలుపంచుకోవడం మొదలుపెడుతుంది. ఈ దశకు చేరుకున్న ఆత్మలు (చరిత్రలో కొద్దిమంది పునీతులు  మాత్రమే) సాధారణంగా అసాధారణమైన శాంతిని, స్థిరత్వాన్ని, ఇతరుల పట్ల లోతైన కరుణను ప్రదర్శిస్తారు.

కనుక ఇక జీవించునది నేను కాదు. క్రిస్తే నాయందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రునియందలి విశ్వాసముచేతనే ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితమును గడుపుచున్నాను. — గలతీయులు 2:20

ఈ ఆధ్యాత్మిక వివాహంలో ఆత్మ లోతైన శాంతిని, స్థిరత్వాన్ని అనుభవిస్తుంది. ఇక దానికి ఎలాంటి ఆధ్యాత్మిక అలజడులు, భయాలు తాకవు, ఎందుకంటే అది పూర్తిగా దేవుని చిత్తంలో నిలిచిపోయింది. సిలువ యోహాను ఈ దశను వర్ణిస్తూ, ఆత్మ ఇక 'రెండు స్వభావాలు ఉన్న ఒకే వస్తువు' వలె మారుతుందని చెబుతాడు. సూర్యకిరణం గాజు కిటికీలో ప్రసరించినప్పుడు గాజు, కాంతి రెండూ ఒకే వెలుగుగా కనిపించినట్టు, ఆత్మ, దేవుని ప్రేమ ఒకే జ్యోతిగా ప్రకాశిస్తాయి. ఇది ఆత్మ దేవుడే అయిపోవడం కాదు.   ఆత్మ తన సృష్టించబడిన స్వభావాన్ని కోల్పోదు, కానీ కృప ద్వారా దేవుని జీవితంలో పూర్తిగా భాగస్వామి అవుతుంది.

ఈ దశలో ఆత్మకు కలిగే మరో లక్షణం, అది ఇక తన సొంత ప్రయోజనం కోసం జీవించదు, పూర్తిగా దేవుని మహిమ కోసం, ఇతరుల మేలు కోసం జీవిస్తుంది. ఇలాంటి ఆత్మలు సాధారణంగా తిరుసభలో గొప్ప సేవలు చేసినవారిగా, ఇతరులకు ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా నిలుస్తారు.  ఎందుకంటే వారు దేవుని ప్రేమను స్వయంగా అనుభవించి, ఆ ప్రేమను ఇతరులకు పంచగలుగుతారు.

10. దహించే ప్రేమ జ్వాల - జీవం గల ప్రేమ జ్వాల బోధన

సిలువ యోహాను చివరి, అత్యంత పరిపక్వమైన రచన ' ప్రేమ జీవ  జ్వాల' (Living Flame of Love). ఇందులో ఆయన ఆధ్యాత్మిక వివాహంలో ఉన్న ఆత్మ అనుభవాన్ని వర్ణిస్తాడు.  పరిశుద్ధాత్మ అనే అగ్ని ఆత్మలో ఇప్పటికే మండుతూ, ఆత్మను పూర్తిగా దేవుని ప్రేమతో దహించివేసి, రూపాంతరం చేస్తుంది. ఇది ఇక బాధాకరమైన శుద్ధీకరణ కాదు, మధురమైన, ఆనందదాయకమైన అనుభవం. ఈ గ్రంథంలో సిలువ యోహాను నాలుగు 'గాయాలు' (wounds) గురించి మాట్లాడతాడు ఇవి పరిశుద్ధాత్మ ఆత్మలో కలిగించే ప్రేమ గాయాలు, ఇవి బాధాకరమైనవి కావు, అమితమైన ఆనందాన్ని, దేవుని పట్ల మరింత  గాఢమైన కోరికను కలిగించేవి.

  ప్రేమ జీవ  జ్వాలా, నా ఆత్మ యొక్క లోతైన కేంద్రాన్ని ఎంత మృదువుగా గాయపరుస్తావు! ఇక నీవు అడ్డంకి లేనిదానివి కనుక, దయచేసి ఈ కలయికను ముగించు, తెరను చించివేసి మనలను కలుపు!

  ప్రేమ జీవ  జ్వాల, కవిత

ఈ దశలో దేవుడే ఆత్మలో నేరుగా, నిరంతరంగా, ప్రేమతో పనిచేస్తాడు. ఆత్మ ఇక తన స్వంత ప్రయత్నాలపై ఆధారపడదు; అది పూర్తిగా దేవుని క్రియకు లోబడి, ఆయన ప్రేమను నిష్క్రియంగా (passively) స్వీకరిస్తుంది, అదే సమయంలో ఆ ప్రేమకు స్వేచ్ఛగా ప్రతిస్పందిస్తుంది. సిలువ యోహాను దీన్ని 'దీపాలు' (lamps) అనే మరో ప్రతీక ద్వారా కూడా వివరిస్తాడు  దేవుని లక్షణాలు (జ్ఞానం, శక్తి, ప్రేమ మొదలైనవి) ఆత్మలో ప్రకాశించే దీపాలుగా మారి, ఆత్మ మొత్తాన్ని వెలుగుతో, వేడితో నింపుతాయి.

ఈ రచనలో సిలువ యోహాను ఐక్యత యొక్క అనుభవాన్ని 'మేల్కొలుపు' (awakening) అనే పదంతో కూడా వర్ణిస్తాడు ఆత్మ ఒక గాఢ నిద్ర నుండి మేల్కొన్నట్టు, దేవుని సన్నిధిని అకస్మాత్తుగా, లోతుగా గ్రహిస్తుంది. ఇది ఆత్మ జీవితంలో అత్యంత ఉన్నతమైన, పరిపూర్ణమైన అనుభవంగా ఆయన వర్ణిస్తాడు. ఇది  ఇహలోకంలోనే పరలోక జీవితపు ఒక ముందస్తు రుచిని అనుభవించడం. అయితే, ఈ స్థాయికి చేరుకున్న ఆత్మలు కూడా ఇంకా పూర్తి పరలోక మహిమను అనుభవించలేదని, అది మరణానంతరమే పరిపూర్ణమవుతుందని ఆయన స్పష్టం చేస్తాడు.

11. ప్రార్థనా జీవితం - ధ్యానం నుండి నిశ్శబ్ద సన్నిధి వరకు

సిలువ యోహాను బోధనలో ప్రార్థనా పద్ధతి కూడా క్రమంగా, ఆత్మ ఎదుగుదలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. ప్రారంభ దశలో వ్యక్తి 'ధ్యానం' (meditation) అనే పద్ధతిని అభ్యసిస్తాడు  అంటే, పరిశుద్ధ గ్రంథంలోని ఒక సంఘటనను, క్రీస్తు జీవితంలోని ఒక భాగాన్ని బుద్ధితో, ఊహాశక్తితో లోతుగా పరిశీలించడం, దానిపై ఆలోచించడం, దాని నుండి పాఠాలు నేర్చుకోవడం. ఈ పద్ధతి ప్రారంభకులకు చాలా ఉపయోగకరమైనది, ఎందుకంటే ఇది బుద్ధిని, ఊహాశక్తిని దేవుని వైపుకు మళ్ళిస్తుంది.

అయితే, ఆత్మ పరిపక్వం చెందుతున్న కొద్దీ, ఈ ధ్యాన పద్ధతి క్రమంగా సరిపోకుండా పోతుంది. ఇక్కడే పైన చెప్పిన 'నిష్క్రియ ఇంద్రియ రాత్రి' ప్రవేశిస్తుంది. వ్యక్తికి ఇక ధ్యానం చేయడం కష్టంగా అనిపిస్తుంది, ఊహాశక్తి పనిచేయదు. ఈ సమయంలో సిలువ యోహాను సూచించే మార్గం 'నిశ్శబ్ద ధ్యానం' (contemplative prayer) వైపు మళ్ళడం అంటే, ఆలోచనలతో, మాటలతో నింపకుండా, కేవలం ప్రేమతో, శ్రద్ధతో దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండటం. ఇది చురుకైన ఆలోచనా ప్రక్రియ కాదు, నిష్క్రియంగా దేవుని ప్రేమను స్వీకరించే స్థితి. ఈ మార్పు ఆధ్యాత్మిక జీవితంలో ఒక కీలకమైన మలుపు,  దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే, వ్యక్తి తాను ప్రార్థనలో వెనుకబడిపోతున్నానని తప్పుగా భావించి నిరుత్సాహపడవచ్చు.

ఆచరణలో, ఈ నిశ్శబ్ద ప్రార్థనను అభ్యసించడానికి సిలువ యోహాను సూచించే మార్గం సరళమైనది.  ఒక ప్రశాంతమైన స్థలంలో కూర్చుని, శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి, మనసులో మాటలు, చిత్రాలతో నింపకుండా, కేవలం దేవుని సన్నిధిని ప్రేమతో గుర్తుంచుకోవడం. మొదట్లో మనసు అనేక ఆలోచనలతో సంచరించవచ్చు, కానీ ప్రతిసారీ మృదువుగా, తొందరపడకుండా దేవుని సన్నిధికి తిరిగి రావడం సాధన చేయాలి. ఇది క్రమంగా ఆత్మను లోతైన శాంతికి, దేవునితో ప్రత్యక్ష సాన్నిహిత్యానికి నడిపిస్తుంది.

12. శ్రమల  పాత్ర - సిలువ, శుద్ధీకరణ మార్గం

సిలువ యోహాను బోధనలో శ్రమలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.  ఆయన పేరులోనే 'సిలువ' ఉన్నట్టుగా, ఆయన జీవితం, బోధన రెండూ క్రీస్తు సిలువతో లోతుగా ముడిపడి ఉన్నాయి. ఆయన ప్రకారం, శ్రమలు  అనేవి  స్వయంగా మంచివి  కావు, కానీ దేవుని కృప దానిని ఆత్మ శుద్ధీకరణకు, ప్రేమలో ఎదుగుదలకు ఒక శక్తివంతమైన సాధనంగా మారుస్తుంది. క్రీస్తు స్వయంగా సిలువ ద్వారా మానవాళిని రక్షించినట్టు, ప్రతి క్రైస్తవుడు తన సొంత చిన్న సిలువలను క్రీస్తుతో కలిపి మోయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు.

 “నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తికొని నన్ను అనుసరింపవలయును. — లూకా 9:23

అయితే, సిలువ యోహాను ఇక్కడ ఒక సూక్ష్మమైన హెచ్చరిక చేస్తాడు అది ఏమిటంటె శ్రమలను  కోరుకోవడం, స్వీయ హింసను ఆధ్యాత్మికతగా భావించడం తప్పు. ఆయన ఉద్దేశం బాధను వెతకమని కాదు, జీవితంలో సహజంగా ఎదురయ్యే కష్టాలను, అవమానాలను, అనారోగ్యాలను, అపార్థాలను ప్రేమతో, దేవుని చిత్తానికి లోబడి స్వీకరించమని మాత్రమే.  ఈ వైఖరి ఆత్మను క్రమంగా స్వార్థం నుండి విడిపించి, క్రీస్తు పోలికలో మలుస్తుంది. వాస్తవానికి, పైన చర్చించిన ఇంద్రియ రాత్రి, ఆత్మ రాత్రి రెండూ ఒక విధమైన అంతరంగిక బాధను కలిగి ఉంటాయి.  కానీ ఆ బాధ శిక్ష కాదు, ప్రేమతో కూడిన శుద్ధీకరణ.

13. ఏడు మూల పాపాల ఆధ్యాత్మిక రూపాలు

కార్మెల్ పర్వత  ఆరోహణ గ్రంథం మొదటి భాగంలో సిలువ యోహాను ఒక ఆసక్తికరమైన, లోతైన పరిశీలన చేస్తాడు అది  సాంప్రదాయ ఏడు ప్రధాన దుర్గుణాలు (అహంకారం, లోభం, మొహం, మాత్సర్యం, కోపం, భోజన ప్రియత్వం , సోమరితనం) కేవలం బాహ్య జీవితంలోనే కాదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా సూక్ష్మ రూపాలలో కనిపిస్తాయని ఆయన హెచ్చరిస్తాడు. ఉదాహరణకు, ఆధ్యాత్మిక అహంకారం అంటే తన ప్రార్థనా అనుభవాలను, తపస్సులను ఇతరులతో పోల్చుకుని గర్వపడటం; ఆధ్యాత్మిక లోభం అంటే ప్రార్థనా పుస్తకాలు, జపమాలలు, పవిత్ర వస్తువులను శాంతి కంటే ఎక్కువగా కూడబెట్టుకోవడం; ఆధ్యాత్మిక సోమరితనం అంటే ప్రార్థన కష్టంగా అనిపించినప్పుడు దాన్ని పూర్తిగా వదిలేయడం.

ఈ సూక్ష్మ దుర్గుణాలను గుర్తించడం ఆత్మ శుద్ధీకరణలో ఒక ముఖ్యమైన అడుగు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నామని అనుకుంటున్నవారు కూడా, వాస్తవానికి ఈ సూక్ష్మ రూపాలలో అహంకారాన్ని, స్వార్థాన్ని పెంచుకుంటూ ఉండవచ్చు. కాబట్టి సిలువ యోహాను నిరంతర ఆత్మపరిశీలనను, వినయాన్ని, ఆధ్యాత్మిక గురువు సలహాను పాటించమని గట్టిగా సూచిస్తాడు.

14. పరిశుద్ధ మరియమ్మ, సంఘం పాత్ర

సిలువ యోహాను తన రచనలలో నేరుగా మరియమాతను  పెద్దగా ప్రస్తావించకపోయినా, ఆయన కార్మెలీత ఆధ్యాత్మికతలో మరియమాతకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. కార్మెల్ రాణిగా మరియమాతను  ఆత్మ ప్రయాణానికి మార్గదర్శినిగా, తల్లిగా కార్మెలీత సంప్రదాయం చూస్తుంది. ఆమె విశ్వాసంలో, లొంగుబాటులో, దేవుని చిత్తానికి సంపూర్ణ 'అవును' చెప్పడంలో ప్రతి ఆత్మకు ఆదర్శంగా నిలుస్తుంది. మరియమ్మ జీవితం, ముఖ్యంగా ఆమె 'నీ చిత్తమే నాయందు జరుగును గాక' (లూకా 1:38) అనే మాట, ఆత్మ దేవుని ముందు తీసుకోవలసిన వైఖరికి పరిపూర్ణ నమూనా.

అంతట మరియమ్మ “ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!” అనెను. అంతట ఆ దూత వెళ్ళి పోయెను — లూకా 1:38

అలాగే, తిరుసభ  (Church) పాత్ర కూడా ఈ ప్రయాణంలో అత్యవసరం. సిలువ యోహాను ఎప్పుడూ తన సొంత అనుభవాలను, బోధనలను తిరుసభ అధికారానికి, బోధనకు లోబరుస్తూ ఉంటాడు. వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాలు, దర్శనాలు ఎంత లోతైనవైనా, అవి తిరుసభ  బోధనకు విరుద్ధంగా ఉంటే వాటిని నమ్మకూడదని ఆయన స్పష్టం చేస్తాడు. దివ్య బలిపూజ, ప్రార్థనా జీవితం, పరిశుద్ధ గ్రంథం, కూటమి ఇవన్నీ ఆత్మకు దేవునితో ఐక్యత చెందడానికి సాధారణ, సురక్షితమైన మార్గాలు.

15. ఆచరణాత్మక అడుగులు - సాధారణ విశ్వాసి కోసం

సిలువ యోహాను బోధన ఎంత లోతైనదైనా, అది కేవలం సిద్ధాంతం కోసం కాదు, అది  జీవించడానికి. ఆయన స్వయంగా చెప్పినట్టు, 'జీవిత సాయంత్రంలో మనలను మన  ప్రేమను దేవుడు  తీర్పు తీరుస్తారు.  కాబట్టి ఈ బోధన అంతిమంగా ప్రేమను పెంచుకోవడం గురించే. కింద ఇచ్చిన అడుగులు ప్రతి విశ్వాసి తన దైనందిన జీవితంలో అనుసరించగలిగేవి, ఇవి పైన వివరించిన దశలను ఆచరణలో అనువదిస్తాయి:

        1. ప్రతిరోజూ నిశ్చితమైన సమయంలో నిశ్శబ్ద ప్రార్థన చేయడం.  మాటలు తక్కువగా మాట్లాడి, దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉండటం. కనీసం పదిహేను నిమిషాలైనా పూర్తి నిశ్శబ్దంలో దేవుని ముందు కూర్చోవడం అలవాటు చేసుకోవాలి.

        2. చిన్న చిన్న త్యాగాలతో ప్రారంభించి, క్రమంగా ఇంద్రియ కోరికలను, అదుపు లేని ఆహారం, వినోదం, మాటలను నియంత్రించుకోవడం. ఉదాహరణకు, వారానికి ఒకరోజు ఉపవాసం, అనవసర సామాజిక మాధ్యమ వినియోగాన్ని తగ్గించడం వంటివి.

        3. ప్రార్థనలో 'పొడిబారిన  అనుభూతి' (dryness) వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా, అది దేవుడు తనను పైకి లేపే సంకేతంగా అర్థం చేసుకోవడం, మరియు ఆ సమయంలో మరింత విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్థన కొనసాగించడం.

        4. అనుదిన జీవితంలో ఎదురయ్యే చిన్న సిలువలను (అవమానాలు, అపార్థాలు, కష్టాలు, అనారోగ్యం) ప్రేమతో స్వీకరించడం, ఇవి ఆత్మ శుద్ధీకరణకు దేవుడు ఇచ్చే సాధనాలుగా భావించడం.

        5. తన సొంత అభిప్రాయాలను, తీర్పులను వదిలి, స్వచ్ఛమైన విశ్వాసంతో దేవుని వాక్కుకు, సంఘపు బోధనకు లోబరచడం, మరియు ఆధ్యాత్మిక గురువుల  సలహాను వినయంగా స్వీకరించడం.

        6. వ్యక్తిగత కీర్తి, గౌరవం కోసం ఆరాటపడకుండా, అణకువలో జీవించడం - ముఖ్యంగా ఇతరులు గుర్తించని చిన్న సేవలను ప్రేమతో చేయడం.

        7. పరిశుద్ధ గ్రంథాన్ని, ముఖ్యంగా క్రీస్తు జీవితాన్ని, ఆయన శ్రమానుభవాన్ని ధ్యానిస్తూ, ఆయన పోలికలో మారుతూ ఉండటం.

        8. క్రమం తప్పకుండా పాపసంకీర్తనం  (Confession), దివ్య బలిపూజలో పాల్గొనడం ద్వారా కృపను పొందడం, ఇవి ఆత్మ శుద్ధీకరణకు, ఐక్యతకు సాధారణ మార్గాలు.

        9. ఆధ్యాత్మిక గురువుని (spiritual director) సలహాతో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని క్రమం తప్పకుండా పరిశీలించుకోవడం, ముఖ్యంగా 'రాత్రి' అనుభవాలు వచ్చినప్పుడు.

        10. అన్నిటికంటే మించి, దేవుని పట్ల ప్రేమను తన జీవితంలో అత్యున్నత విలువగా ఉంచుకోవడం, మరియు ఆ ప్రేమను రోజువారీ చిన్న చిన్న క్రియలలో, ఇతరుల పట్ల దయలో వ్యక్తపరచడం.

జీవితకాల  సాయంసమయమున ప్రేమను బట్టి నివ్వు  పరీక్షింపబడుదువు .— సిలువ యోహాను, సూక్తులు

16. ఈ ప్రయాణంలో వచ్చే సవాళ్లు, జాగ్రత్తలు

సిలువ యోహాను తన బోధనలో కొన్ని హెచ్చరికలు కూడా చేస్తాడు. ముఖ్యంగా, ఆధ్యాత్మిక అనుభూతులను, దర్శనాలను, ప్రత్యేక వరాలను అతిగా వెతకడం పట్ల జాగ్రత్త వహించాలని చెబుతాడు. ఇలాంటి అనుభూతులు వచ్చినా, వాటిపై ఆధారపడకూడదు, వాటిని అంటిపెట్టుకోకూడదు,  ఎందుకంటే నిజమైన ఐక్యత అనుభూతుల ద్వారా కాదు, విశ్వాసం, నమ్మిక  ప్రేమ అనే ప్రధాన పుణ్యాల ద్వారా వస్తుంది. కొందరు ఆధ్యాత్మిక అనుభూతుల వెంట పడి, వాటిని దేవుని ప్రేమకు గుర్తుగా భావిస్తారు, కానీ సిలువ యోహాను ప్రకారం ఇది ప్రమాదకరమైన మార్గం, ఎందుకంటే ఇది ఆత్మను అనుభూతుల బానిసగా మార్చి, నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వతకు అడ్డుపడుతుంది.

అలాగే, ఈ ప్రయాణంలో ఆధ్యాత్మిక పొడిబారిన  అనుభూతి (spiritual dryness), అంతః సంఘర్షణలు సహజం అని, వీటిని చూసి భయపడి వెనుకకు తగ్గకూడదని ఆయన బోధిస్తాడు. ఓర్పు, పట్టుదల, దేవునిపై సంపూర్ణ నమ్మకం ఈ ప్రయాణంలో అత్యవసరం. మరో ముఖ్యమైన హెచ్చరిక  ఈ శుద్ధీకరణ ప్రక్రియను ఎవరూ తమంతట తామే వేగవంతం చేయలేరు, లేదా బలవంతంగా తప్పించుకోలేరు. ఇది దేవుని కాలవ్యవధి ప్రకారం జరుగుతుంది, మరియు ఆత్మ చేయవలసినదల్లా నమ్మకంతో, ప్రేమతో సహకరించడం.

చివరిగా, ఈ బోధనలను చదివి, తమను తాము ఏదో ఒక దశలో ఉన్నామని తొందరపడి నిర్ధారించుకోకూడదు. ప్రతి ఆత్మ ప్రయాణం ప్రత్యేకమైనది, మరియు ఏ దశలో ఉన్నామో నిర్ధారించడం అనుభవజ్ఞుడైన ఆధ్యాత్మిక గురువు  పనే తప్ప, స్వీయ నిర్ధారణ కాదు. వినయమే ఈ మొత్తం ప్రయాణానికి పునాదిగా ఉండాలని సిలువ యోహాను హెచ్చరిస్తాడు 

17. ముగింపు

సిలువ యోహాను బోధన సారాంశంగా చెప్పాలంటే: దేవునితో ఐక్యత అనేది ప్రేమ ద్వారా సాధించబడే లక్ష్యం, మరియు ఆ ప్రేమకు మార్గం త్యజించడం, శుద్ధీకరణ, విశ్వాసంతో నడవడం. ఈ ప్రయాణంలో ఇంద్రియ రాత్రి, ఆత్మ రాత్రి అనే రెండు చీకటి దశల గుండా ఆత్మ వెళ్ళి, విశ్వాసం, నమ్మిక , ప్రేమ అనే మూడు ప్రధాన సద్గుణాల ద్వారా తన శక్తులను శుద్ధి చేసుకుని, ప్రేమ నిచ్చెన పది మెట్లు ఎక్కుతూ, చివరకు ఆధ్యాత్మిక నిశ్చితార్థం, ఆధ్యాత్మిక వివాహం అనే పరిపూర్ణ ఐక్యతకు చేరుకుంటుంది. ఈ మొత్తం ప్రయాణంలో దేవుని కృప ప్రధాన పాత్ర పోషిస్తుంది, కానీ ఆత్మ సహకారం, త్యాగం, పట్టుదల కూడా అవసరం.

ప్రతి విశ్వాసి ఈ ఉన్నత లక్ష్యాన్ని దేవునితో సంపూర్ణ ఐక్యతను  తన జీవిత అంతిమ గమ్యంగా ఉంచుకోవాలి. ఇది కేవలం సన్యాసుల కోసం కాదు, ప్రతి జ్ఞానస్నానం పొందిన ఆత్మ కోసం దేవుడు తలపెట్టిన ప్రణాళిక. ఈ ప్రయాణం కష్టతరమైనదిగా అనిపించవచ్చు, కానీ దాని ముగింపు అనిర్వచనీయమైన ఆనందం, శాంతి, దేవుని ప్రేమలో సంపూర్ణ విశ్రాంతి. చిన్న చిన్న అడుగులతో, నిత్య ప్రార్థనతో, త్యాగంతో, ప్రేమతో ముందుకు సాగుదాం.  ఎందుకంటే సిలువ యోహాను స్వయంగా చూపిన మార్గం మనలను తప్పక దేవుని హృదయానికి చేరుస్తుంది.

“వారందరు ఒకరుగ ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రీ! నేను నీయందును, నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగ ఐక్యమై ఉండనిమ్ము.  యోహాను 17:21

 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు