మగ్దలా మరియమ్మ జీవిత చరిత్ర | పాపం నుండి పునరుత్థాన సాక్షిగా విశ్వాస యాత్ర| కార్మెల్ శోభ



యోహాను 20:1-2,11-18  

ఆదివారము తెలతెలవారకముందే మగ్ధలా మరియమ్మ సమాధియొద్దకు వెళ్ళి, ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతట ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యునియొద్దకు పరుగెత్తుకొనిపోయి, “వారు ప్రభువును సమాధినుండి ఎత్తికొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము" అని చెప్పెను.   కాని, మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు, ఆమె వంగి సమాధి లోనికి తొంగిచూడగా, ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి, కాళ్ళవైపున ఒకరు, తలవైపున ఒకరు యేసు భౌతికదేహమును ఉంచినచోట కూర్చుండియుండిరి. “అమ్మా! ఎందుకు నీవు ఏడ్చుచున్నావు?” అని వారు అడిగిరి. “నా ప్రభువును ఎవరో ఎత్తుకొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను” అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి, ఆమె వెనుకకుతిరిగి, యేసు నిలువబడి ఉండుటను చూచెను. కాని, ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో "అమ్మా! నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదకుచున్నావు?” అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, "అయ్యా! నీవు ఆయనను తీసికొని వెళ్ళినయెడల, ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము. నేను వెళ్ళి తీసికొనిపోయెదను" అనెను. “మరియమ్మా" అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో "రబ్బూని” అని పిలిచెను. (అనగా 'బోధకుడా' అని అర్ధము). యేసు ఆమెతో “నన్ను ముట్టుకొనవద్దు. నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము: నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను” అని చెప్పెను. మగ్ధలా మరియమ్మ వెళ్ళి, శిష్యులతో, “నేను ప్రభువును చూచితిని” అని వారికి ప్రభు సందేశమును అందజేసెను.

మగ్దలా  మరియమ్మ- పాపం నుండి పరిశుద్ధతకు, భయం నుండి విశ్వాసానికి నడిచిన ఒక స్త్రీ కథ

విశ్వాస యాత్ర

పరిచయం

సువార్తల్లో పేర్కొనబడిన స్త్రీలలో మగ్దలా  మరియమ్మ  అంత గొప్ప స్థానం పొందిన మరొక స్త్రీ లేదని చెప్పవచ్చు. ఆమె పేరు నాలుగు సువార్తలలోనూ, ముఖ్యంగా యేసు ప్రభువు మరణం, సమాధి, పునరుత్థానం జరిగిన  సంఘటనలలో  పదే పదే కనిపిస్తుంది. క్రైస్తవ ఆధ్యాత్మిక రచనలలో ఆమె వ్యక్తిత్వం ఎన్నో రూపాలలో చిత్రించబడింది.  కొన్నిసార్లు పశ్చాత్తాపపడిన పాపిగా, కొన్నిసార్లు నమ్మకమైన శిష్యురాలిగా, మరికొన్నిసార్లు పునరుత్థానానికి మొదటి సాక్షిగా. ఈ వ్యాసంలో సువార్తల ఆధారంగా ఆమె జీవితాన్ని, సంప్రదాయం ఆమెకు ఇచ్చిన స్థానాన్ని, కార్మెలీయ ఆధ్యాత్మికతలో ఆమె ప్రాముఖ్యతను పరిశీలిద్దాం.

నాలుగు సువార్తలలో కలిపి మగ్దలా  మరియ పేరు పన్నెండు సార్లకు పైగా ప్రస్తావించబడింది.  ఇది  మరియమాతను మినహాయిస్తే, సువార్తలలో అత్యధికంగా పేర్కొనబడిన స్త్రీ పేరుగా నిలుస్తుంది. నాలుగు సువార్త రచయితలు, వేర్వేరు సమయాలలో, వేర్వేరు సమాజాలకు రాస్తూ కూడా, మగ్దలా  మరియమ్మ  ఉనికిని విస్మరించలేదు. ఇది ఆమె సాక్ష్యానికి తొలి క్రైస్తవ సమాజం ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఆమె జీవితం పాపం, స్వస్థత, శిష్యరికం, నమ్మకత్వం, దుఃఖం, పునరుత్థాన ఆనందం అనే క్రైస్తవ విశ్వాస ప్రయాణంలోని ప్రతి దశను ప్రతిబింబించే ఒక సంపూర్ణ చిత్రం.

మగ్దలా  మరియమ్మ  ఎవరు?

"మగ్దలా" అనే పేరు ఆమె స్వస్థలాన్ని సూచిస్తుంది. ఇది గలిలయ సముద్రం ఒడ్డున ఉన్న మగ్దలా అనే పట్టణం. ఈ ఊరు అప్పటి కాలంలో చేపల వ్యాపారానికి, ఉప్పు తయారీకి ప్రసిద్ధి చెందిన ఒక చిన్న పట్టణం. ఇతర స్త్రీల మాదిరిగా ఆమెను తండ్రి పేరుతో లేదా భర్త పేరుతో కాకుండా, ఆమె సొంత ఊరు పేరుతో గుర్తించడం విశేషమైనది. దీన్నిబట్టి ఆమెకు తనదైన ఒక గుర్తింపు ఉండేదని, బహుశా ఆమె ఆర్థికంగా స్వతంత్రురాలిగా ఉండి ఉండవచ్చని కొందరు పండితులు అభిప్రాయపడతారు. లూకా సువార్త ఆమెను యేసు ప్రభువు  పరిచర్యకు తమ సొంత ధనంతో సేవ చేసిన స్త్రీలలో ఒకరిగా పేర్కొంటుంది. ఇది ఆమెకు ఒక నిర్దిష్ట సామాజిక స్థాయి, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండేవని సూచిస్తుంది.

ఆ కాలపు గలిలయ ప్రాంతం రోమా సామ్రాజ్యంలో భాగంగా ఉన్నప్పటికీ, యూదా మతపరమైన, సాంస్కృతిక సంప్రదాయాలు బలంగా ఉండేవి. స్త్రీలు సాధారణంగా ఇంటికే పరిమితమై, తండ్రి లేదా భర్త అధీనంలో జీవించేవారు. ఇలాంటి సమాజంలో మగ్దలా  మరియమ్మ  తనదైన పేరుతో, తన సొంత ఆర్థిక వనరులతో ఒక మతబోధకుని పరిచర్యకు మద్దతునివ్వడం నిజంగా అసాధారణమైన విషయం. ఇది ఆమె వ్యక్తిత్వంలో ఉన్న ఒక స్వతంత్ర స్వభావాన్ని, తాను నమ్మిన సత్యం కోసం సామాజిక కట్టుబాట్లను అధిగమించే ధైర్యాన్ని సూచిస్తుంది, ఈ లక్షణమే తరువాత సిలువ దగ్గర, సమాధి వద్ద ఆమె చూపిన నిబద్ధతలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

ఏడు దయ్యాల నుండి విముక్తి

లూకా సువార్త 8వ అధ్యాయంలో మనకు మగ్దలా  మరియమ్మ  గురించి మొదటి స్పష్టమైన వివరణ కనిపిస్తుంది. యేసు ప్రభువు  దైవ  రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఊరూరా తిరుగుతున్న సమయంలో, తనతోపాటు పన్నెండుమంది శిష్యులే కాక, తాను దయ్యాల నుండి, రోగాల నుండి బాగుచేసిన కొందరు స్త్రీలు కూడా ఆయనను వెంబడించారని లూకా రాసాడు. వారిలో "ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్దలా  మరియమ్మ" ఒకరు.

ఏడు దయ్యాల నుండి విముక్తి పొందడం అంటే ఆమె జీవితం ఎంతటి తీవ్రమైన బాధలలో, చీకటిలో మునిగి ఉండేదో అర్థమవుతుంది. బైబిల్ సంప్రదాయంలో "ఏడు" అనే సంఖ్య పరిపూర్ణతను, సంపూర్ణతను సూచిస్తుంది.  కాబట్టి ఏడు దయ్యముల ప్రస్తావన కేవలం ఏడు ప్రత్యేక దయ్యాలను మాత్రమే కాక, ఆమె జీవితాన్ని పూర్తిగా ఆవరించిన బానిసత్వాన్ని కూడా సూచించవచ్చు. ఈ స్థితి నుండి ఆమెను స్వతంత్రురాలిగా చేసినది యేసు ప్రభువు  కరుణ, ఆయన స్వస్థపరిచే శక్తి. మగ్దలా  మరియమ్మ  కథ మొదలయ్యేది ఆమె స్వంత బలం లేదా యోగ్యతతో కాదు, దేవుని కృపతో. ఈ కృప ఆమెను శాశ్వతంగా మార్చివేసింది, తన మిగిలిన జీవితమంతా ఆమె ఆ కృపకు కృతజ్ఞతతో స్పందించింది.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, సువార్తలలో ఎక్కడా మగ్దలా  మరియమ్మను ఒక వ్యభిచారిణిగా గానీ, పాపభరితమైన స్త్రీగా గానీ నేరుగా వర్ణించలేదు. ఆమెను "దయ్యాల నుండి బాగుపడిన స్త్రీ"గా మాత్రమే సువార్తలు పేర్కొంటాయి.

మనలో చాలామంది తమను తాము ఏదో ఒక బానిసత్వంలో చిక్కుకున్నట్టు భావించే క్షణాలు ఉంటాయి.  వ్యసనాలు, భయాలు, పాత గాయాలు, పదేపదే వెంటాడే పాపపు అలవాట్లు చాలా ఉండవచ్చు అనే విషయాన్ని  మగ్దలా  మరియమ్మ  కథ మనకు గుర్తుచేస్తుంది.   ఎంతటి లోతైన బానిసత్వమైనా యేసు ముందు శాశ్వతం కాదు. ఆమెను ఏడు దయ్యాల నుండి విడిపించిన అదే శక్తి, అదే కరుణ, నేడు మనలను కూడా విడిపించగలదు. ముఖ్యమైనది ఏమిటంటే, ఆమె ఈ విముక్తి పొందిన తరువాత గతంలో బతికినట్టు జీవించలేదు.  ఆమె పూర్తిగా కొత్త దిశలో, యేసు ప్రభువు  సేవలో తన శక్తిని, తన వనరులను వినియోగించింది. నిజమైన మారుమనసు కేవలం పాత చెడు నుండి బయటపడటమే కాదు, కొత్త మంచి కోసం జీవించడం కూడా.

శిష్యురాలిగా యేసు పరిచర్యలో

మగ్దలేనే మరియ కేవలం స్వస్థత పొంది వెళ్ళిపోయిన వ్యక్తి కాదు. ఆమె యేసు ప్రభువు పరిచర్య అంతటా ఆయనను వెంబడించింది. లూకా 8:1-3 ప్రకారం, యోహన్న, సూసన్న అనే మరికొందరు స్త్రీలతో పాటు మగ్దలా  మరియమ్మ  కూడా "తమ ఆస్తులతో" యేసుకు, ఆయన శిష్యులకు సేవ చేసింది. ఈ చిన్న వాక్యం వెనుక గొప్ప అర్థం దాగి ఉంది.   యేసు ప్రభువు  పరిచర్య కేవలం పన్నెండుమంది పురుష అపొస్తలుల మీదే ఆధారపడలేదు, స్త్రీల ఔదార్యం, భక్తి, ఆచరణాత్మక సహాయం మీద కూడా ఆధారపడింది. ఆ కాలపు యూదా సమాజంలో స్త్రీలు బహిరంగంగా ఒక బోధకుని వెంట తిరగడం అసాధారణమైన విషయం. అయినప్పటికీ యేసు ప్రభువు  తన చుట్టూ స్త్రీలను  అంగీకరించాడు, వారి సేవను గౌరవించాడు.

మగ్దలా  మరియమ్మ  యేసు బోధలను విన్నది, ఆయన అద్భుతాలను కళ్ళారా చూసింది, ఆయనతో పాటు గలిలయ నుండి యెరూషలేము వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణాలలో పాల్గొంది. ఈ సాన్నిహిత్యం వల్లనే బహుశా ఆమెకు యేసు ప్రభువు  పట్ల అంతటి లోతైన ప్రేమ, నమ్మకత్వం ఏర్పడి ఉంటాయి.  ఆ నమ్మకం  ఆయన కష్టకాలంలో, అంటే సిలువ మరణ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ స్త్రీల బృందం: మగ్దలా  మరియమ్మ, యోహన్న, సూసన్న, మరికొందరు యేసు పరిచర్యలో కనపడకుండా  ముఖ్యమైన పాత్ర పోషించారు.  వారు బహిరంగంగా బోధించలేదు, అద్భుతాలు చేయలేదు, కానీ వారి ఆచరణాత్మక సహకారం లేకుండా యేసు ప్రభువు, ఆయన శిష్యుల రోజువారీ అవసరాలు తీరేవి కావు. తినడానికి ఆహారం, బసచేయడానికి స్థలం, ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు ఇలాంటి వాటిని ఈ స్త్రీలు తమ ఔదార్యంతో సమకూర్చారు. సువార్త రచయితలు ఈ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, దేవుని రాజ్య పనిలో కనిపించే బోధన, అద్భుతాలతో పాటు, కంటికి కనిపించని సేవ, ఔదార్యం కూడా అంతే ముఖ్యమైనవని బోధిస్తున్నారు.

సిలువ మార్గంలో, కల్వరి కొండపై

యేసు ప్రభువును బంధించిన రాత్రి, ఆయన శిష్యులు అందరూ భయపడి పారిపోయారు. పేతురు కూడా ఆయనను ఎరుగనని మూడుసార్లు బొంకాడు. అయితే సువార్తలు నాలుగింటిలోనూ ఒక విషయం స్థిరంగా కనిపిస్తుంది.  మగ్దలా  మరియమ్మ , మరికొందరు స్త్రీలు యేసును విడిచిపెట్టలేదు. మత్తయి 27:55-56, మార్కు 15:40-41, యోహాను 19:25 ప్రకారం, యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలా  మరియమ్మ  సిలువ దగ్గరే నిలబడ్డారు. పురుష శిష్యులు దూరంగా, భయంతో దాక్కున్న సమయంలో, ఈ స్త్రీలు తమ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ యేసు ప్రభువుకు అత్యంత సమీపంలో నిలిచారు.

ఈ దృశ్యం మగ్దలా  మరియమ్మ  వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. భయం ఆమెను ఆపలేదు. సమాజం ఏమనుకుంటుందో అనే చింత ఆమెను వెనక్కి లాగలేదు. ప్రేమ, కృతజ్ఞత ఆమెను సిలువ కింద నిలబెట్టాయి. ఆమె యేసు ప్రభువు  శ్వాస వదిలేదాకా, ఆయన శరీరాన్ని సమాధిలో ఉంచేదాకా అక్కడే ఉంది. మార్కు 15:47 ప్రకారం, మగ్దలా  మరియమ్మ,  ప్రభువు   తల్లి మరియ మాత,  యేసు ప్రభువు  శరీరాన్ని ఎక్కడ ఉంచారో గమనించి చూశారు.  ఈ చిన్న వివరం తరువాత జరగబోయే గొప్ప సంఘటనకు వేదిక సిద్ధం చేస్తుంది.

సమాధి వద్ద - తెల్లవారుజామున

విశ్రాంతి దినం ముగిసిన వెంటనే, ఆదివారం తెల్లవారుజామున, మగ్దలా  మరియమ్మ  మరికొందరు స్త్రీలతో కలిసి సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి వద్దకు వెళ్ళింది. యూదా సంప్రదాయం ప్రకారం మృతదేహాలకు సుగంధ ద్రవ్యాలు పూయడం ఒక పవిత్రమైన కర్తవ్యం, గౌరవసూచకమైన చివరి సేవ. ఈ స్త్రీలు ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి తెల్లవారకముందే బయలుదేరారు, వారి భక్తికి ఇది సాక్ష్యం.

నాలుగు సువిశేషాలు  సమాధి వద్దకు వెళ్ళిన స్త్రీల సంఖ్య, పేర్లలో స్వల్ప తేడాలు చూపినప్పటికీ, మగ్దలా  మరియమ్మ  పేరు మాత్రం అన్ని కథనాలలోనూ మొదటి స్థానంలో కనిపిస్తుంది.  ఇది ఆమె ఆ సంఘటనలో పోషించిన పాత్రను నొక్కి చెబుతుంది. మార్కు, మత్తయి సువార్తలు దూత సందేశాన్ని స్త్రీలందరికీ కలిపి వర్ణిస్తే, యోహాను సువార్త ప్రత్యేకంగా మగ్దలా  మరియమ్మ  వ్యక్తిగత అనుభవం మీద దృష్టి కేంద్రీకరిస్తుంది, ఆమె భావోద్వేగాలను, ఆమె సంభాషణలను సవివరంగా చిత్రిస్తుంది.

యోహాను సువార్త 20వ అధ్యాయం మగ్దలా  మరియమ్మ  అనుభవాన్ని అత్యంత వివరంగా, హృదయాన్ని కదిలించే రీతిలో వర్ణిస్తుంది. ఆమె సమాధి వద్దకు వెళ్ళినప్పుడు, సమాధి ద్వారం మీద ఉన్న పెద్ద రాయి తీసివేయబడి ఉండటం చూసింది. లోపల యేసు ప్రభువు  శరీరం లేదు. భయాందోళనతో ఆమె పరుగెత్తుకుంటూ వెళ్ళి  పేతురు, "యేసు ప్రేమించిన శిష్యుడు" అని పిలువబడే యోహానుల వద్దకు వెళ్ళి, "ప్రభువును సమాధి నుండి ఎత్తుకుపోయారు, ఆయనను ఎక్కడ ఉంచారో మాకు తెలియదు" అని చెప్పింది. ఆమె స్పందనలో మనం గమనించవలసినది ఏమిటంటే,  ఆ క్షణంలో ఆమెకు పునరుత్థానం అనే ఆలోచన రాలేదు. ఆమె మనసులో ఉన్నది కేవలం దుఃఖం, గందరగోళం, తన ప్రభువు శరీరం కూడా దొంగిలించబడిందేమో అనే భయం మాత్రమే.

పునరుత్థాన యేసును కలుసుకొనుట

పేతురు, యోహాను సమాధి వద్దకు పరుగెత్తుకు వచ్చి, లోపల నార బట్టలు మాత్రమే ఉండటం చూసి తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. కానీ మగ్దలా  మరియమ్మ  అక్కడే ఏడుస్తూ నిలిచిపోయింది. అంటే ఆమె ప్రేమ ఆమెను వెళ్ళిపోనివ్వలేదు, జవాబు దొరికేదాకా వేచి ఉండేలా చేసింది. ఏడుస్తూ ఆమె సమాధిలోకి వంగి చూసినప్పుడు, తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దూతలు యేసు ప్రభువు  శరీరం ఉంచిన స్థలంలో కూర్చుని ఉండటం చూసింది. "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని వారు అడిగినప్పుడు, "నా ప్రభువును ఎత్తుకుపోయారు, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదు" అని ఆమె బదులిచ్చింది.

అప్పుడు ఆమె వెనుకకు తిరిగి చూసినప్పుడు యేసు ప్రభువు  నిలబడి ఉండటం చూసింది, కానీ ఆయనను గుర్తుపట్టలేదు.  తోటమాలి అనుకుంది. దుఃఖం, ఆశ్చర్యం, అలసట కళ్ళను మసకబార్చాయేమో, లేదా పునరుత్థాన శరీరం భిన్నంగా కనిపించిందేమో. "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు?" అని యేసు ప్రభువు  అడిగినప్పుడు, ఆమె "అయ్యా, నీవు ఆయనను తీసుకువెళ్ళి ఉంటే, ఆయనను ఎక్కడ ఉంచావో నాకు చెప్పు, నేను ఆయనను తీసుకువెళ్తాను" అని అంటుంది. ఇక్కడ ఆమె ప్రేమ గాఢత  మనకు కనిపిస్తుంది. మృతదేహాన్ని కూడా ఒంటరిగా మోసుకుపోగలననే ధైర్యం, సంకల్పం ఆమెలో ఉంది.

ఆ క్షణంలో యేసు  ప్రభువు ఆమెను ఒకే ఒక్క మాటతో పిలుస్తాడు  "మరియా". ఆ పేరు పలికే విధానంలో, ఆ స్వరంలో ఆమె తన ప్రభువును గుర్తుపడుతుంది. ఆమె వెంటనే తిరిగి "రబ్బూనీ" (అంటే బోధకుడా) అని పలుకుతుంది. ఇది వ్యక్తిగత సంబంధపు లోతును తెలియజేస్తుంది.   దేవుడు మనలను పేరు పెట్టి పిలుస్తాడు, మనం ఆయన స్వరాన్ని గుర్తుపడతాము.

అయితే యేసు ప్రభువు  వెంటనే "నన్ను తాకవద్దు" అని చెబుతాడు, ఎందుకంటే తాను ఇంకా తండ్రి వద్దకు ఆరోహణం కాలేదని వివరిస్తాడు. బదులుగా ఆమెను ఒక పని అప్పగిస్తాడు.  "నా సహోదరుల వద్దకు వెళ్ళి, 'నేను నా తండ్రి వద్దకు, మీ తండ్రి వద్దకు, నా దేవుని వద్దకు, మీ దేవుని వద్దకు ఆరోహణమవుతున్నాను' అని వారికి తెలియజేయి" అని చెబుతాడు.

శిష్యుల అనుమానం, విశ్వాసానికి పరీక్ష

మగ్దలా  మరియమ్మ, మరికొందరు స్త్రీలు తాము చూసిన దానిని అపొస్తలులకు చెప్పినప్పుడు, వారి స్పందన నిరాశపరిచేదిగా ఉంది. లూకా 24:11 ప్రకారం, స్త్రీల మాటలు అపొస్తలులకు "పిచ్చి కథలుగా" అనిపించాయి, వారు వారిని నమ్మలేదు. ఇది ఆ కాలపు సామాజిక వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది.   స్త్రీల సాక్ష్యాన్ని అంతగా గౌరవించని సమాజంలో, పునరుత్థానం అనే అసాధారణ సత్యాన్ని ప్రకటించడం మగ్దలా  మరియమ్మకు ఎంతో ధైర్యం అవసరమైన పని. తన మాటలను ఎవరూ నమ్మకపోయినా, ఆమె వెనుకంజ వేయలేదు. ఇది ఆమె వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని చూపుతుంది.  సత్యం పట్ల ఆమెకున్న నిబద్ధత, ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడకుండా తాను చూసిన, అనుభవించిన సత్యాన్ని ప్రకటించే ధైర్యం ఎప్పటికీ మెచ్చుకోదగినవి.

ఆసక్తికరంగా, పేతురు, యోహాను మాత్రం స్త్రీల మాటలు విన్న వెంటనే సమాధి వైపు పరుగెత్తారు (యోహాను 20:3-4). బహుశా మగ్దలా  మరియమ్మ  మాటలలోని ఆత్రుత, నిజాయితీ వారిని కదిలించి ఉండవచ్చు. ఏదేమైనా, పునరుత్థాన సందేశం మొదట స్త్రీల ద్వారా, ప్రత్యేకించి మగ్దలా  మరియమ్మ  ద్వారా ప్రపంచానికి చేరిందనే వాస్తవం క్రైస్తవ విశ్వాసానికి పునాది వేసిన సంఘటనలలో స్త్రీల పాత్రను నొక్కి చెబుతుంది.

అపొస్తలులకు అపొస్తరాలు

మగ్దలా  మరియమ్మ  వెంటనే వెళ్ళి శిష్యులతో "నేను ప్రభువును చూశాను" అని చెప్పింది, ఆయన తనతో చెప్పిన మాటలను వారికి తెలియజేసింది. ఈ కారణంగానే క్రైస్తవ సంప్రదాయంలో ఆమెను "అపొస్తలులకు అపొస్తరాలు" (అపొస్తోలా అపొస్తలోరుమ్) అని పిలుస్తారు.  ఎందుకంటే పునరుత్థాన సందేశాన్ని అపొస్తలులకు ప్రకటించిన మొదటి వ్యక్తి ఆమె. ఇది అసాధారణమైన విషయం.  ఆ కాలపు యూదా న్యాయస్థానాలలో స్త్రీల సాక్ష్యానికి చట్టపరమైన విలువ తక్కువగా ఉండేది. అయినప్పటికీ, పునరుత్థానం అనే క్రైస్తవ విశ్వాసానికి పునాదిరాయి వంటి సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఎంచుకున్నది ఒక స్త్రీని, అదీ గతంలో దయ్యాల బాధితురాలిగా ఉన్న స్త్రీని. ఇది దేవుని కృప ఎలా పనిచేస్తుందో, ఆయన మానవ లెక్కలను, సామాజిక కట్టుబాట్లను ఎలా అధిగమిస్తాడో చూపే గొప్ప ఉదాహరణ.

2016లో ఫ్రాన్సిస్ పోపు గారు  మగ్దలా  మరియమ్మ  (జూలై 22) సాధారణ స్మరణ రోజును  పండుగగా  (ఫీస్ట్) ప్రకటించారు, ఇది ఇతర అపొస్తలుల పండుగలతో సమానంగా ఆమెను కూడా గౌరవించడం. అప్పటి ఆ  ప్రకటన ఆమెను స్పష్టంగా "అపొస్తలులకు అపొస్తరాలు"గా పేర్కొంది, ఆధునిక సంఘంలో స్త్రీల గౌరవప్రదమైన పాత్రకు, సువార్త ప్రకటనలో వారి భాగస్వామ్యానికి ఆమెను ఒక చిహ్నంగా చేసింది.

సంప్రదాయం, గుర్తింపు వివాదం

శతాబ్దాలుగా, మగ్దలా  మరియమ్మను మూడు వేర్వేరు సువార్త స్త్రీ పాత్రలతో ముడిపెట్టే సంప్రదాయం ఏర్పడింది.  ఏడు దయ్యముల నుండి బాగుపడిన మగ్దలా  మరియమ్మ  (లూకా 8), యేసు పాదాలను తన కన్నీళ్ళతో కడిగి, తన వెంట్రుకలతో తుడిచిన "పాపభరితమైన స్త్రీ" (లూకా 7:36-50), మరియు బేతనియలో మార్త సోదరి మరియ (లూకా 10, యోహాను 11-12).

కాని ఈ మూడు స్త్రీలను వేర్వేరు వ్యక్తులుగా చూడటమే సరైనదని పవిత్ర గ్రంధ నిపుణులు  చెబుతారు.   సువార్తలలో వారిని ఏకం చేసే స్పష్టమైన ఆధారం లేదు. 1969లో తిరుసభ దైవార్చన క్యాలెండర్‌ను సవరించినప్పుడు, మగ్దలా  మరియమ్మను ఆ ఇతర పాత్రల నుండి అధికారికంగా వేరు చేసింది. అయినప్పటికీ, కళలో, భక్తి సాహిత్యంలో, ప్రజాదరణ పొందిన ఊహాచిత్రణలో ఈ మిశ్రమ చిత్రం ఇప్పటికీ బలంగా నిలిచి ఉంది.   

ఈ చారిత్రక వివరాలతో సంబంధం లేకుండా, రెండు అంశాలు మనకు ఆధ్యాత్మికంగా విలువైనవి. మొదటిది, పాపం ఎంత లోతైనదైనా, దేవుని కృప దానికంటే గొప్పదని; రెండవది, ఆయనను నిజాయితీగా ప్రేమించిన ప్రతి హృదయాన్ని యేసు ప్రభువు ఎంతో గౌరవంగా చూస్తాడని. మగ్దలా  మరియమ్మ  కథ, ఆమె అసలు గతం ఎలాంటిదైనప్పటికీ ఆమె  పరివర్తన, ఆమె ప్రభువు కోసం జీవించడం నిజం.

తరువాతి జీవితం గురించి సంప్రదాయ కథనాలు

సువార్తలు మగ్దలా  మరియమ్మ  పునరుత్థాన సందేశం ప్రకటించిన తరువాత ఆమె జీవితం గురించి పెద్దగా చెప్పవు. అయితే వివిధ క్రైస్తవ సంప్రదాయాలలో ఆమె తరువాతి జీవితం గురించి భిన్నమైన కథనాలు వృద్ధి చెందాయి. ఒక సంప్రదాయం ప్రకారం, ఆమె యెరూషలేము నుండి ఎఫెసుకు వెళ్ళి, యోహాను అపొస్తలుడితో కలిసి అక్కడే జీవించి, మరణించిందని చెబుతారు. బైజాంటైన్ సంప్రదాయంలో ఆమె అవశేషాలు కాన్‌స్టాంటినోపుల్‌కు తరలించబడ్డాయని నమ్ముతారు.

ఫ్రెంచ్ సంప్రదాయంలో మరో కథనం ప్రాచుర్యం పొందింది.  మగ్దలా  మరియమ్మ, లాజరు, మార్త దక్షిణ ఫ్రాన్స్‌కు ఓడలో ప్రయాణించి, అక్కడ సువార్త ప్రకటించారని, ఆమె తన చివరి సంవత్సరాలు ఒక గుహలో ఏకాంతంగా, ప్రార్థనలో గడిపిందని చెబుతారు. ఈ కథనాలకు చారిత్రక ఆధారాలు పరిమితమే అయినప్పటికీ, అవి మధ్యయుగ ఐరోపా భక్తిలో మగ్దలా  మరియమ్మ  పట్ల ఉన్న గాఢమైన ప్రేమను, ఆమెను ఏకాంత ప్రార్థనా జీవితానికి, పశ్చాత్తాపానికి నమూనాగా చూసే దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి.

కళలో మగ్దలా  మరియమ్మ

మగ్దలా  మరియమ్మ  క్రైస్తవ కళలో అత్యంత ఎక్కువగా చిత్రించబడిన స్త్రీ పాత్రలలో ఒకరు.  మరియమాత తరువాత బహుశా ఆమే. మధ్యయుగ చిత్రకారులు ఆమెను తరచుగా పొడవైన, విరబోసిన వెంట్రుకలతో, సుగంధ ద్రవ్యాల పాత్రతో చిత్రించారు.   ఈ పాత్ర ఆమెను సమాధి వద్దకు సుగంధ ద్రవ్యాలు తీసుకువెళ్ళిన స్త్రీగా, అలాగే యేసు పాదాలకు అభిషేకం చేసిన స్త్రీగా గుర్తుచేసేలా ఉంటుంది. కొందరు ఆమెను తపస్సు చేసే ఏకాంతవాసిగా, మరికొందరు సిలువ దగ్గర దుఃఖించే శిష్యురాలిగా, ఇంకొందరు పునరుత్థాన యేసును కలుసుకున్న ఆనంద క్షణంలో చిత్రించారు.

"నన్ను తాకవద్దు " దృశ్యం:  యేసు ప్రభువు  మగ్దలా  మరియమ్మను తాకవద్దని చెప్పే క్షణం, ప్రత్యేకంగా కళాకారులకు ప్రియమైన అంశంగా నిలిచింది, ఎందుకంటే అది మానవ కోరిక, దైవ  పరిమితి మధ్య ఉన్న సున్నితమైన ఉద్రిక్తతను చిత్రించే అవకాశాన్నిస్తుంది. ఈ దృశ్యాలన్నీ కలిపి చూస్తే, మగ్దలా  మరియమ్మ  శతాబ్దాలుగా క్రైస్తవ ఊహాశక్తిని ఎంతగా ఆకర్షించిందో అర్థమవుతుంది.  ఆమె పాపం, పశ్చాత్తాపం, ప్రేమ, విశ్వాసం అనే మానవ అనుభవంలోని లోతైన అంశాలన్నింటినీ ఏకకాలంలో ప్రతిబింబించే పాత్రగా నిలిచింది.

కార్మెలీయ  ఆధ్యాత్మికతలో మగ్దలేనే మరియ ప్రాముఖ్యత

కార్మెలీయ  సంప్రదాయంలో మగ్దలా  మరియమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఆమెను తరచుగా చింతనాత్మక ఆత్మకు నమూనాగా చూస్తారు.  మార్త చురుకైన సేవకు ప్రతినిధి అయితే, మరియ (మార్త సోదరి అయినా, మగ్దలా  మరియమ్మ  అయినా, సంప్రదాయం వీరిద్దరినీ తరచూ కలిపి చూసినందున) యేసు ప్రభువు  పాదాల చెంత కూర్చుని ఆయన మాటలు వినడమనే "శ్రేష్ఠమైన భాగాన్ని" ఎంచుకున్న ఆత్మకు ప్రతినిధి. సిలువ యోహాను, అవిలాపూరి తెరెసామ్మ వంటి కార్మెలీయ  గురువులు  దేవుని అన్వేషణను, "నీ హృదయ ప్రియుడు ఎక్కడ దాక్కున్నాడు?" అనే వెతుకులాటను వర్ణించేటప్పుడు తరచుగా మగ్దలా  మరియమ్మ  సమాధి వద్ద అనుభవాన్ని ప్రస్తావిస్తారు.

యోహాను సువార్తలోని సమాధి దృశ్యం మగ్దలా  మరియమ్మ  దుఃఖంతో వెతకడం, తన ప్రభువును కనుగొనలేకపోవడం, చివరికి ఆయన పేరు పిలిచినప్పుడు గుర్తుపట్టడం,  ఇది ప్రతి ఆత్మ దేవుని అన్వేషణలో అనుభవించే "అంధకార  రాత్రి" అనుభవానికి ఒక చిత్రం. సిలువ యోహాను తన రచనలలో వర్ణించే ఆత్మ గాఢాంధకార  రాత్రిలో  దేవుడు దూరమైనట్టు అనిపించే స్థితి, కానీ వాస్తవానికి ఆయన అతి సమీపంలోనే ఉండి, ఆత్మను శుద్ధి చేస్తున్న స్థితి,  మగ్దలా  మరియమ్మ  అనుభవంతో సారూప్యత కలిగి ఉంటుంది. ఆమె యేసు ప్రభువును పోగొట్టుకున్నానని అనుకున్న క్షణంలోనే ఆయన ఆమెకు అత్యంత సమీపంలో ఉన్నాడు.

అంతేకాక, "నన్ను తాకవద్దు" అనే యేసు ప్రభువు  మాట ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తుంది.   దేవునితో మన సంబంధం భౌతిక అనుభూతులకో, భావోద్వేగ తృప్తికో పరిమితం కాకూడదని, అది విశ్వాసంలో, ఆయన మాటను నమ్మి ముందుకు సాగే విధేయతలో పరిపక్వం చెందాలని తెలియచేస్తుంది. మగ్దలా  మరియమ్మను యేసుప్రభువు  తనను పట్టుకుని  అక్కడే ఉండనివ్వకుండా, సువార్త ప్రకటనకు  పంపడం, ప్రతి ఆధ్యాత్మిక అనుభవం చివరికి సేవలో, ప్రేమలో పండాలనే సత్యాన్ని గుర్తు చేస్తుంది.

 ఆవిలాపురి తెరెసామ్మ  తన రచనలలో మగ్దలా  మరియమ్మను ధైర్యంతో కూడిన  ప్రేమకు  నమూనాగా ప్రశంసిస్తుంది.  లోకం ఏమనుకుంటుందో అనే భయం లేకుండా, సమాజపు కళ్ళెదుటే యేసు ప్రభువు  పట్ల తన ప్రేమను వ్యక్తం చేసిన స్త్రీగా ఈమెను చూస్తుంది.

ముగింపు

మగ్దలా  మరియమ్మ  కథ మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. మొదటిది, గతం ఎంత చీకటిగా ఉన్నా, దేవుని కృప మనలను పూర్తిగా మార్చగలదు, కొత్త జీవితాన్ని  ఇవ్వగలదు. రెండవది, నిజమైన ప్రేమ భయాన్ని జయిస్తుంది.   సిలువ దగ్గర నిలబడిన ధైర్యం, సమాధి వద్ద వేచి ఉన్న సహనం ఇందుకు సాక్ష్యం. మూడవది, దేవుడు మనలను వ్యక్తిగతంగా పేరు పెట్టి పిలుస్తాడు, మన దుఃఖంలో మనలను వెతుకుతాడు, మనకు ప్రత్యేకమైన పనిని  అప్పగిస్తాడు. నాలుగవది, ఆధ్యాత్మిక అనుభవం మనలను స్వార్థపూరిత తృప్తిలో ఉంచకూడదు, అది మనలను ఇతరుల వద్దకు, సువార్త ప్రకటనకు పంపాలి.

జూలై 22న తిరుసభ  మగ్దలా  మరియమ్మ పండుగను ఆచరిస్తుంది. ఈ రోజు  కేవలం ఒక చారిత్రక వ్యక్తిని స్మరించుకోవడం మాత్రమే కాదు.  ఇది ప్రతి విశ్వాసి హృదయంలో ఆమె అనుభవించిన అదే ప్రయాణాన్ని, పాపం నుండి విముక్తికి, భయం నుండి విశ్వాసానికి, దుఃఖం నుండి ఆనందానికి సాగే ప్రయాణాన్ని కొత్తగా జీవించే అవకాశం. ఆమె జీవితంలోని ప్రతి ఘట్టం, ఏడు దయ్యాల నుండి విముక్తి, యేసు ప్రభువు  వెంట సాగిన శిష్యరికం, సిలువ దగ్గర నిలబడిన ధైర్యం, సమాధి వద్ద చూపిన సహనం, పునరుత్థాన యేసు ప్రభువును గుర్తుపట్టిన ఆనందం, సువార్త ప్రకటనకు అప్పగించుకున్న విధేయత, ఇవన్నీ కలిపి ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక జీవిత చిత్రాన్ని మనకు అందిస్తాయి.

ఈ రోజు మనం మగ్దలా  మరియమ్మను స్మరించుకుంటూ, ఆమెలా మనం కూడా మన బలహీనతలను, గత పాపాలను దేవుని కృపకు అప్పగించి, ఆయన ప్రేమ మనలను పూర్తిగా బాగుచేయగలదని విశ్వసిద్దాం. ఆమెలా మనం కూడా భయం లేకుండా యేసును ప్రేమించి, ఆయనను వెతకడంలో పట్టుదల చూపి, చివరికి ఆయన మన పేరు పిలిచినప్పుడు ఆయనను గుర్తుపట్టి, "రబ్బూనీ" అని పలుకుతూ ఆయన సేవకు మనలను అప్పగించుకుందాం.  

ప్రార్థన: ప్రభువా, నీవు మగ్దలా  మరియమ్మను ఏడు దయ్యాల బానిసత్వం నుండి విడిపించి, ఆమెను నీ నమ్మకమైన శిష్యురాలిగా, పునరుత్థాన సందేశానికి మొదటి సాక్షిగా చేసుకున్నావు. ఆమె విశ్వాసం, ప్రేమ, ధైర్యం కలిగిన  హృదయాన్ని మాకు దయచేయుము.   మా బలహీనతలను గుర్తించి నీ కృపకు అప్పగించే వినయాన్ని, సిలువ కష్టకాలంలో నిన్ను విడువకుండా నిలబడే విశ్వసనీయతను, నిన్ను వెతకడంలో సహనాన్ని, నీవు పిలిచినప్పుడు వెంటనే స్పందించే సిద్ధతను మాకు దయచేయుము. మేము కూడా మా జీవితాలలో నీ పునరుత్థాన శక్తిని అనుభవించి, ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకునేలా మాకు సహాయం చేయండి. ఆమెన్

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు