నేను ఏ చేపను? | మత్తయి 13:47-53 ఉపమానం| కార్మెల్ శోభ
మత్తయి 13:47-53
"ఇంకను పరలోకరాజ్యము సముద్రములో వేయబడి, అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినపుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి, పనికిరాని వానిని పారవేయుదురు. అటులనే అంత్యకాలమందును జరుగును; దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతులనుండి వేరుపరచి,అగ్ని గుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు, పండ్లు కొరుకుకొందురు.”“వీనినన్నింటిని మీరు గ్రహించితిరా?” అని యేసు అడిగెను. “అవును” అని వారు సమాధాన మిచ్చిరి. ఆయన “పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన, పురాతన వస్తువులను వెలికితెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు” అనెను. యేసు ఈ ఉపమానములను ముగించి అచటనుండి వెడలి,తన పట్టణమును చేరెను.
"నేను ఏ చేపను?"
గలిలయ సముద్రపు తీరం ప్రశాంతంగా ఉంది. సాయంకాల సమయానికి సూర్యుడు తన బంగారు వర్ణపు కాంతులను నీటిపై చల్లుతుంటే, దూరంగా కొందరు మత్స్యకారులు తమ వలలను ఒడ్డుకు లాగుతున్నారు. ప్రతిరోజూ అక్కడి ప్రజలు చూసే ఒక సాధారణమైన దృశ్యమిది. వల బరువుగా ఉంది; నీటిలో అనేక చేపలు కొట్టుకుంటున్నాయి. వలను ఒడ్డుకు చేర్చిన వెంటనే మత్స్యకారులు తీరాన కూర్చుని, ఓపికగా మంచి చేపలను గంపల్లోకి చేరుస్తూ, పనికిరాని వాటిని పారవేస్తున్నారు.
ఆ దారిన వెళ్తున్న ప్రజలకు అది కేవలం ఒక దైనందిన వృత్తి వ్యాపకం
మాత్రమే. కానీ, యేసు ప్రభువుకు
అది పరలోకరాజ్యపు అంతరంగాన్ని ఆవిష్కరించే ఒక దివ్య ప్రతిబింబం.
ఆయన ఆ సాధారణ సంఘటనను తీసుకొని, మానవాళి నిత్య జీవన స్థితికి అద్దం పట్టే ఉపమానంగా మార్చాడు. " పరలోకరాజ్యము సముద్రములో వేయబడి, అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది" (మత్తయి 13:47) అని ప్రభువు చెబుతున్నాడు. ఈ ఉపమానం నేడు మన హృదయపు తలుపు తడుతున్న ఒక నిశ్శబ్ద ప్రశ్న: "ఈ మహా సముద్రం లాంటి లోకంలో, దేవుని వలలో చిక్కిన వందలాది జీవితాల్లో, నేను ఏ చేపను?"
1.వల నాకోసం కూడా వేయబడింది
ఒక మత్స్యకారుడు సముద్రంలో వల విసిరినప్పుడు, ఆ వల నీటి లోతుల్లోకి వెళ్తూ ఎలాంటి తారతమ్యం
చూపదు. "నువ్వు అందమైన చేపవా? పెద్ద చేపవా? లేక పొలుసులు లేని చేపవా?" అని వల ఏ జీవినీ అడగదు. తన పరిదిలోకి వచ్చిన
ప్రతిదానినీ అది తన లోనికి తీసుకుంటుంది. పాత నిబంధన ప్రకారం పొలుసులు లేని చేపలు అశుద్దుమయినవి.
దేవుని సువార్త ఆహ్వానం నా విద్యను బట్టి, నా ఆస్తిపాస్తులను బట్టి, లేదా నాకున్న మతపరమైన అర్హతలను బట్టి రావడం
లేదు. నేను ఎంత ఉత్తముడిని అనే దానికంటే, దేవుడు ఎంత
దయగలవాడు అనేదే సువార్తకు పునాది.
దైవ కృపపరిది: వల సముద్రపు
అగాధాల్లోకి కూడా చేరుకున్నట్లే, సువార్త నా గతం
ఎలాంటిదైనా, నా పాపపు
లోతులు ఎంత తీవ్రమైనవైనా నన్ను చేరుకోగలదు.
స్వయం అర్హత అనేది లేదు: ఏ చేప తన స్వంత బలంతో వలలోకి రాదు; వల దానిని చుట్టుముడుతుంది. అలాగే, నా స్వంత నీతి క్రియల ద్వారా నేను దేవుని
రాజ్యానికి చేరుకోలేను; ఆయన ప్రేమ కృపను
పట్టే నేను పరలోకానికి అర్హత సాధించగలను.
ఉపమానంలోని ఆంతర్యం నుండి ఉదయించే సవాలు
దేవుని ఉచిత కృపను అర్థం చేసుకున్న వెంటనే ఒక సవాలు తలెత్తుతుంది. వలలో ఉండటం మాత్రమే ఒకని
భవిష్యత్తును సురక్షితం చేయదు. చేప వలలో
చిక్కుకున్నంత మాత్రాన దానికై అదే "మంచి చేప" అయిపోదు. దాని జాతి, దాని స్వభావం బట్టే దాని నాణ్యత ఆధారపడి
ఉంటుంది.
అలాగే, ఒకడు తిరుసభలో సభ్యుడా ? రోజూ ప్రార్థన చేసుకుంటున్నాడా? బాప్తిస్మం పొంది ఉన్నాడా ? అన్నది మాత్రమే ఆధ్యాత్మిక జీవాన్ని నిర్ధారించలేదు. "నేను వలలో పడ్డానా?" అనే ప్రాథమిక ప్రశ్న కంటే, "వలలో ఉన్న నేను రూపాంతరం చెందిన మంచి చేపనా, లేక స్వభావం మారని చెడ్డ చేపనా?" అనేది ఒకని అంతరంగాన్ని తొలిచే అసలైన ఆధ్యాత్మిక ప్రశ్న.
2. సముద్రం లాంటి లోకం: గందరగోళం మధ్యలోనే దేవుని వల
ఈ ఉపమానంలో సముద్రం అనేది స్థిరత్వం లేని, అలలతో కొట్టుమిట్టాడే లోకానికి ప్రతీక.
సముద్రంలో ప్రశాంతత ఎల్లప్పుడూ ఉండదు; అనుకోని
తుఫానులు, చీకటి లోతులు, స్థిరత్వం లేని అలలు దాని లక్షణం. అనుదిన జీవితం
కూడా ఈ సముద్రం లాంటిదే. అనిశ్చితి, ఆందోళన, విభిన్న లోకసంబంధమైన ఆకర్షణలు, అంతరంగ పోరాటాలతో హృదయ సముద్రం కలత చెందుతూనే
ఉంటుంది.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, దేవుడు సురక్షితమైన, ప్రశాంతమైన ఒడ్డుకు రమ్మని పిలిచి ఆ తర్వాత తన
వలను వేయలేదు. ఆయన అలజడితో ఉన్న సముద్రం మధ్యలోనే తన వలను విసిరాడు.
1. పరిస్థితులతో
సంబంధం లేని పిలుపు: దేవుడు ఒకని జీవితంలోని గందరగోళమంతా సద్దుమణిగాక, అన్ని విషయాల్లో వాడు సమర్థుడనయ్యాక వాడిని చేరడం
లేదు. మన బలహీనతలు, మన అనుమానాలు, మన జీవితంలోని తుఫానుల మధ్యలోనే ఆయన ప్రేమ మనలను చుట్టుముడుతుంది.
2. ప్రస్తుత
క్షణపు వాస్తవికత: "నేను సిద్ధపడినప్పుడు దేవుని దగ్గరకు వెళ్తాను"
అనుకోవడం ఆధ్యాత్మిక అజ్ఞానం. దేవుని వల ఈ క్షణంలోనే, నా ప్రస్తుత బలహీన స్థితిలోనే నన్ను
పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.
సముద్రం వంటి లోకంలో చిక్కుకున్న మనలను దేవుని కృప పట్టుకునేది నిజమే. కానీ ఆ వలలో మనలను ఉంచిన దేవుడు వెంటనే ఒడ్డుకు లాగి తీర్పు తీర్చడం లేదు. ఇక్కడే ఆయన అపారమైన ఓర్పు బయటపడుతుంది.
3. కాలం మరియు కృప: దేవుని సహనం యొక్క లోతు
మత్స్యకారులు వల వేసిన మరుక్షణమే దానిని పైకి లాగేయరు. వల నిండే వరకు, సరైన సమయం వచ్చేవరకు ఓపికగా వేచి ఉంటారు. ఇది దేవుని
రక్షణ ప్రణాళికలోని అత్యంత ముఖ్యమైన దైవ లక్షణాన్ని బయటపెడుతోంది. అదే "దేవుని సహనం".
అపోస్తలుడైన పేతురు రాసినట్లు: "కొందరు భావించునట్లు ప్రభువు తన
వాగ్దానమును నెరవేర్చుటయందు ఆలస్యముచేయడు. అంతేకాక మీతో ఎంతయో ఓపికగా ఉండును. ఏలయన, ఎవరును నాశనము కావలెనని ఆయన కోరడు. కాని అందరును పాపము నుండి విముఖులు
కావలెననియే ఆయన వాంఛ." (2 పేతురు 3:9). మన జీవితంలో ఎన్నోసార్లు దేవునికి దూరంగా వెళ్ళినా, ఆధ్యాత్మికంగా సన్నగిల్లిపోయినా, దేవుడు మనలను పక్కన పారవేయకపోవడానికి కారణం ఆయన సహణమే.
ఈ దీర్ఘశాంతం మనలో కలిగించాల్సిన రెండు స్పందనలు:
ఆశ మరియు ఓదార్పు: నేను ఇంకా సంపూర్ణత సాధించలేదని, నాలో అనేక లోపాలున్నాయని అనిపించినప్పుడు, దేవుని ఓర్పు నాకు నిరీక్షణను ఇస్తుంది. ఆయన
నన్ను ఇంకా విసిరిపారేయలేదు;కనుక
అది మారడానికి నాకు
ఇంకనూ అవకాశం ఇస్తున్నాడు.
తీవ్రత మరియు హెచ్చరిక: ఈ దీర్ఘశాంతం శాశ్వతం కాదు. వల ఒకరోజు
నిండుతుంది. తీరానికి చేర్చే సమయం తప్పక వస్తుంది. దేవుని ఓర్పును నిర్లక్ష్యానికి, అలసత్వానికి సాకుగా మార్చుకోకూడదు. "రేపు
మారతాను," "వచ్చే వారం
బాగుపడతాను" అనేవి నా పతనానికి
దారితీసే పరిణామాలు.
సముద్రం నుండి ఒడ్డుకు రావడం ఎంత నిశ్చయమో, దేవుని దీర్ఘశాంతపు కాలం ముగిసి, లెక్క అడిగే ఘడియ రావడం కూడా అంతే నిశ్చయం.
4. తీర్పు తీర్చడం నా పని కాదు: అంతరంగ విముక్తి
మత్స్యకారులు తీరానికి వచ్చాక, చేపలను
వేరుచేస్తారు. అయితే, యేసు ప్రభువు ఒక స్పష్టమైన సరిహద్దును గీశాడు: "అటులనే
అంత్యకాలమందును జరుగును; దూతలు బయలుదేరి దుష్టులను
నీతిమంతులనుండి వేరుపరచి, అగ్ని గుండములో పడద్రోయుదురు."
(మత్తయి 13:49).
తీర్పును దేవునికి వదిలివేయడం:
అనుదిన జీవితంలో లేదా సంఘ జీవితంలో ఇతరులను చూసి తీర్పు తీర్చే అలవాటు తరచుగా ఉంటుంది. "ఫలానా వ్యక్తి నిజమైన క్రైస్తవుడు కాదు," "అతని భక్తి వేషధారణ" అని చాలా తేలికగా వేలిత్తి చూపుతుంటాను. కానీ యేసు ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు వలలో ఉన్న నీతిమంతులను, దుష్టులను వేరుచేసే బాధ్యత దేవదూతలది, నాది కాదు. నేను ఇతరులకు తీర్పరిని కాను అని గ్రహించినప్పుడు, నా భుజాలపై ఉన్న అనవసరమైన భారం దిగిపోతుంది. నా పని ఇతరుల స్వభావాన్ని గమనించి వ్యాఖ్యానించడం కాదు; నా స్వంత హృదయంలో దేవుని ముద్ర ఉందో లేదో అని నిరంతరం పరిశీలించుకోవడమే.
5. అగ్నిగుండం మరియు తీర్పు వాస్తవికత: ఒక హెచ్చరిక
నేటి జీవితాలలో, "నరకం," "అగ్నిగుండం," "ఏడ్పు,"
"పండ్లు కొరుకుట" అనే మాటలు మాట్లాడటం సౌకర్యవంతంగా ఉండదు.
చాలామంది వీటిని దాటవేయడానికి ప్రయత్నిస్తారు. కానీ యేసు ప్రభువు ప్రేమమూర్తి
అయినప్పటికీ, నిత్యజీవపు భయంకరమైన వాస్తవికతను మృదువుగా చేసి చెప్పలేదు.
"అగ్ని గుండములో
పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు, పండ్లు కొరుకుకొందురు"
(మత్తయి 13:50), అని హెచ్చరిస్తున్నాడు.
ఈ తీవ్రమైన హెచ్చరిక భయ పెట్టడానికి కాదు, ప్రేమతో కూడిన ఒక హెచ్చరికగా దీనిని స్వీకరించాలి.
ఒక తండ్రి తన చిన్నారి ప్రమాదకరమైన మంటల వైపు వెళ్తుంటే ఎంత తీవ్రంగా గద్దిస్తాడో, దేవుడు కూడా నిత్య వేరుపాటులోని బాధను నాకు
ముందే తెలియజేస్తున్నాడు.
ఆలస్యమైన పశ్చాత్తాపం: "పండ్లు కొరుకుట" అనేది సమయం
మించిపోయాక కలిగే శాశ్వత వేదనకు, స్వయంకృతాపరాధానికి
ప్రతీక. అవకాశం ఉన్నా, దానిని వినియోగించుకోలేకపోయామనే బాధ అక్కడ వ్యక్తమవుతుంది.
ఈ క్షణపు ప్రాముఖ్యత: ఈ హెచ్చరిక మన ఆధ్యాత్మిక నిర్లక్ష్యానికి ముగింపు పలకాలి. ఇది మనలను ఈరోజే, ఈ క్షణంలోనే పూర్ణహృదయంతో దేవుని వైపు తిరిగేలా ప్రేరేపించాలి.
6. "గ్రహించితిరా?": సమాచారం నుండి జీవన శైలికి పరివర్తన
ఈ ఉపమానాన్ని ముగిస్తూ యేసు ప్రభువు తన శిష్యులను ఒక ప్రశ్న అడిగాడు: "మీరు
వీనినన్నిటిని గ్రహించితిరా?" (మత్తయి 13:51). శిష్యులు వెంటనే "గ్రహించితివి" అని
సమాధానమిచ్చారు.
ఈ ప్రశ్న నేడు మనలను కూడా
నిలదీస్తోంది. నేను సమాధానం "అవును" అని చెప్పవచ్చు. కానీ బైబిల్
పరిజ్ఞానంలో "గ్రహించడం" అంటే కేవలం సిద్ధాంతాన్ని మదిలో ఉంచుకోవడం కాదు; దానిని జీవన విధానంగా మార్చుకోవడం.
తెలుసుకోవడం (విజ్ఞానం) తెలుసుకున్న దానిని
విశ్వసించడం (అంతరంగం) విశ్వసించినదానిని
ఆచరించడం (జీవన శైలి)ఇవి మూడు మార్గాలు
సరిగా జరిగినప్పుడు మాత్రమే జీవితం సన్మార్గంలో ఉంటుంది.
1. సమాచారమా? రూపాంతరమా?: బైబిల్
అధ్యాయాలు చదవడం, ఉపదేశాలు వినడం
మంచిదే. కానీ ఆ వాక్యం నా రోజువారీ నిర్ణయాలను, కోపాన్ని, ఆశలను, ఇతరులతో నా సంబంధాలను మార్చకపోతే నేను నిజంగా
"గ్రహించినట్లు" కాదు.
2. అనువర్తన
పరీక్ష: ఈ ఉపమానం చదివిన తర్వాత నా ప్రవర్తనలో ఏ మార్పు వస్తోంది? నా స్వార్థాన్ని చంపుకుని, క్రీస్తు స్వభావాన్ని ధరించడానికి నేను
సిద్ధపడుతున్నానా?
7. కోశాగారపు
యజమాని: నూతన మరియు పురాతన సత్యాల సమతుల్యత , శిష్యుల అంగీకారాన్ని విన్న తర్వాత, యేసు ప్రభువు వారి బాధ్యతను వివరించడానికి మరొక గొప్ప విషయాన్ని వారికి చెప్పాడు. " పరలోక
రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన, పురాతన వస్తువులను వెలికితెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు" (మత్తయి
13:52).
ఇది ఆధ్యాత్మిక పరిపక్వతకు కావలసిన సమతుల్యతను తెలియజేస్తుంది: పురాతన వస్తువులు (మూలాలు): మన పితరులు, సంప్రదాయాలు, దేవుడు గతంలో అందించిన పునాది సత్యాలు. వీటిని
మనం గౌరవించాలి, భద్రపరచాలి.
నూతన వస్తువులు (తాజా అనుభవాలు): పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం మన
జీవితాల్లో చేసే నూతన కార్యాలు, వర్తమాన
కాలానికి తగిన ఆత్మీయ జీవితానికి తగిన భోదనలు.
ఒక మంచి కోశాగారపు యజమాని ప్రాచీన సత్యాల పునాదిపై నిలబడి, దేవుడు అనుదినం ఇచ్చే తాజా అనుభవాలను స్వీకరిస్తూ ఇతరులకు పంచుతాడు. మన జీవితంలో మనం దేవుని వాక్యాన్ని ఏ విధంగా నిల్వ చేసుకుంటున్నాను? అవసరంలో ఉన్నవారికి ఆ వాక్య కోశాగారము నుండి పంచగలుగుతున్నామా?
తీరంలో మిగిలే ఏకైక ప్రశ్న
గలిలయ సముద్రపు తీరం నుండి యేసు ప్రభువు తన ప్రయాణాన్ని ముందుకు సాగించినట్లు, మనం కూడా మన అనుదిన బాధ్యతల్లోకి, కుటుంబంలోకి, ఉద్యోగంలోకి తిరిగి వెళ్తాను. కానీ, నా హృదయంలో ఒక పవిత్రమైన అలజడి మిగిలిపోవాలి.
ఈ ఉపమానం మనకు అందించే నాలుగు
ప్రధాన అంశాలు
1. దేవుని వల
నాకోసం వేయబడింది.
2. వలలో ఉన్నంత
మాత్రాన చాలదు, రూపాంతరం
చెందాలి.
3. దేవుని
దీర్ఘశాంతం అమూల్యమైనది, కానీ
పరిమితమైనది.
4. మంచి చెడును వేరుచేయడం నిజమైనది.
"నేను దేవుని రాజ్యపు వలలో కేవలం కొట్టుమిట్టాడుతున్న వ్యర్థమైన చేపనా? లేక క్రీస్తు రక్తం చేత కడుగబడి, ఆయన కృప చేత మంచి రూపం దాల్చిన ఫలభరితమైన చేపనా?" ఈ ప్రశ్నకు సమాధానం నా పెదవుల మీద కాదు, నేను జీవించే విధానంలో, ఇతరులను ప్రేమించే తీరులో, దేవుని వాక్యానికి చూపే విధేయతలోనే వ్యక్తమవ్వాలి.
ప్రార్ధన
ప్రభువా! ఈ విశాలమైన లోకమనే సముద్రంలో, నా అర్హతలను బట్టి కాక, కేవలం మీ అపారమైన కృప ద్వారా నన్ను మీ సువార్త అనే వలలోకి చేర్చుకున్నందుకు మీకు వందనాలు. ప్రభువా, నేను మీ కృప ద్వారా రూపాంతరం పొందిన "మంచి చేపగా" మారాలని నాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నా హృదయములోని పాపాన్ని, స్వార్థాన్ని తీసివేయండి. ఇతరులకు తీర్పు తీర్చే అహంకారాన్ని నా నుండి తొలగించి, నన్ను నేను నిరంతరం పరీక్షించుకునే దీనమనస్సును ప్రసాదించండి. మీ అపారమైన దీర్ఘశాంతాన్ని నేను అలసత్వానికి సాకుగా మార్చుకోకుండా, మీ చిత్తానికి లోబడి నా జీవితాన్ని సమర్పించుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యమనే కోశాగారము నుండి నూతన, పురాతన ఆత్మీయ సత్యాలను గ్రహించి, క్రీస్తు స్వరూపంలోకి రూపాంతరం చెందే భాగ్యాన్ని నాకు దయచేయండి. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment