రూతు మరియు నవొమి: విశ్వసనీయత మరియు దేవుని కృప | Ruth & Naomi Story|కార్మెల్ శోభ

 


రూతు మరియు నవొమి: విశ్వసనీయత మరియు దేవుని కృప

"నీవు వెళ్ళిన చోటికి నేనును వచ్చెదను, నీవు బసచేయు స్థలములో నేనును బసచేసెదను; నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు." ఈ మాటలు బైబిలు గ్రంథమంతటిలో నమ్మకానికి, ప్రేమకు సంబంధించిన  అత్యంత శక్తివంతమైన ప్రకటనలలో ప్రముఖమైనవిగా నిలిచిపోయాయి. ఇవి ఒక కుమార్తె తన తల్లికి చెప్పిన మాటలు కావు; ఒక కోడలు తన అత్తగారికి చెప్పిన మాటలు. ఈ ఒక్క వాక్యంలోనే రూతు గ్రంథం మొత్తం సారాంశం ఇమిడి ఉంది. నష్టంలో కూడా  నమ్మకం, దుఃఖంలో కూడా  విశ్వసనీయత, మరియు మానవ కంటికి కనిపించని దేవుని కృప  నిశ్శబ్దంగా అల్లుకుపోతున్న ఒక కథ.

రూతు గ్రంథం బైబిలులో అతి చిన్న గ్రంథాలలో ఒకటి  కేవలం నాలుగు అధ్యాయాలు మాత్రమే. కానీ దాని లోతు, దాని సందేశం అపారమైనది. ఇది న్యాయాధిపతుల కాలంలో జరిగిన కథ.  ఇశ్రాయేలు చరిత్రలో అది అస్తవ్యస్తమైన, హింసాత్మకమైన, నైతిక పతనం చెందిన కాలం. "ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతివాడును తనకిష్టము వచ్చినట్టు ప్రవర్తించెను" అని న్యాయాధిపతుల గ్రంథం ముగింపులో వ్రాయబడింది. ఈ  నేపథ్యంలోనే, ఒక సామాన్య కుటుంబం యొక్క వ్యక్తిగత గాథ వెలుగులా ప్రకాశిస్తుంది.  దేవుడు చరిత్రలోని పెద్ద  పెద్ద సంఘటనలలో మాత్రమే కాదు, సామాన్య మనుషుల  నిత్య జీవితంలో కూడా పనిచేస్తున్నాడని రూతు జీవితం  చూపిస్తుంది.

ఈ చిన్న గ్రంథం నాలుగు అధ్యాయాలుగా, నాలుగు దృశ్యాలుగా విభజించబడింది.  మొదటి అధ్యాయంలో నష్టం మరియు నిబద్ధత (మోవాబు నుండి బేత్లెహేముకు తిరుగుప్రయాణం); రెండవ అధ్యాయంలో కలయిక మరియు దేవుని కృప (బోవసు  పొలంలో); మూడవ అధ్యాయంలో ధైర్యం మరియు ప్రతిపాదన (కళ్ళం వద్ద రాత్రి); నాలుగవ అధ్యాయంలో విమోచన మరియు ఆశీర్వాదం (గుమ్మం వద్ద, ఓబేదు జననంతో). ఈ కథను చదివేటప్పుడు ఒక సహజమైన లయ, ఒక క్రమమైన ఎదుగుదల కనపడుతుంది.  దుఃఖం నుండి నిండుదనానికి, శూన్యత  నుండి సంపూర్ణతకు కథ నెమ్మదిగా, నమ్మకంగా కదులుతుంది. ఇది దేవుడు  పనిచేసే విధానానికే ఒక దృష్టాంతం.

1. కరువు మరియు వలస: బేత్లెహేము నుండి మోవాబుకు

కథ బేత్లెహేములో మొదలవుతుంది.  వింతగా అనిపించే విషయం ఏమిటంటే, "బేత్లెహేము" అనే పేరుకు అర్థమే "రొట్టెల ఇల్లు" అని. అయినా, ఈ "రొట్టెల ఇంట్లో" కరువు వచ్చింది. ఆహారం లేని ఆ కాలంలో, ఎలీమెలెకు అనే వ్యక్తి, అతని భార్య నవొమి, మరియు వారి ఇద్దరు కుమారులు మహలోను, కిల్యోను ఈ కుటుంబం మొత్తం తమ స్వదేశాన్ని విడిచి, పొరుగున ఉన్న మోవాబు దేశానికి వలస వెళ్ళారు.

ఈ నిర్ణయం సులభమైనది కాదు. మోవాబీయులు ఇశ్రాయేలీయులకు చారిత్రకంగా శత్రువులు, వారి మూలం లోతు, అతని కుమార్తెల కథలో (ఆదికాండము 19) ఉంది, మరియు ధర్మశాస్త్రం ప్రకారం మోయాబీయులు ఇశ్రాయేలు సమాజంలో పూర్తిగా చేరలేని వారు (ద్వితీయోపదేశకాండము 23:3-6). అయిన, ఆకలి ఎలీమెలెకు కుటుంబాన్ని తరచుగా శత్రుత్వం చూపే భూమిలోకి నడిపించింది. జీవితంలోని కష్ట పరిస్థితులు కొన్నిసార్లు మనలను మనం ఊహించని, కోరుకోని ప్రదేశాలలోకి నడిపిస్తాయి. కానీ దేవుడు మన అడుగుజాడలను వదిలిపెట్టడు, అవి ఎంత అపరిచిత భూమి మీద పడినా, ఆయన సంరక్షణ ఎల్లప్పుడూ మనకు ఉంటుంది.

మోవాబులో జీవితం మొదట్లో స్థిరపడినట్లే కనిపించింది. వెంటనే, మొదటి విషాదం సంభవించింది  వొమి భర్త ఎలీమెలెకు మరణించాడు. ఒక విదేశీ భూమిలో, తన సొంత జనుల నుండి దూరంగా, నవొమి ఒంటరిగా  వితంతువుగా, ఇద్దరు కుమారులతో మిగిలిపోయింది.

కాలం గడిచేకొద్దీ, మహలోను మరియు కిల్యోను ఇద్దరూ మోయాబీయ స్త్రీలను వివాహం చేసుకున్నారు.   వారు పేర్లు ఒర్పా మరియు రూతు. పది సంవత్సరాల పాటు ఈ కుటుంబం మోయాబులో జీవించింది. అయితే ఈ వివాహాలకు సంతానం కలుగలేదు. ఇది ఆ కాలపు సమాజంలో ఒక పెద్ద విషాదంగా పరిగణించబడేది, ఎందుకంటే సంతానం లేకపోవడం అంటే వంశం కొనసాగదని అర్థం.

తర్వాత, రెండవ మరియు మూడవ విషాదాలు వచ్చాయి.  మహలోను, కిల్యోను ఇద్దరూ కూడా మరణించారు. ఇప్పుడు నవొమి కేవలం తన భర్తను మాత్రమే కాదు, తన ఇద్దరు కుమారులను కూడా కోల్పోయింది. ముగ్గురు  వితంతువులు, నవొమి, ఒర్పా, రూతు,  ఒక విదేశీ భూమిలో, పురుషులు లేకుండా, ఆర్థిక భద్రత లేకుండా మిగిలిపోయారు. ఆ కాలపు సమాజంలో, పురుషుడు లేని స్త్రీ జీవితం  అత్యంత దుర్బలమైన స్థితి.  ఆస్తి హక్కులు లేవు, రక్షణ లేదు, జీవనోపాధి మార్గం లేదు.

ఈ విషాద పరంపర చదువుతున్నప్పుడు, మనం ఆగి ఆలోచించాలి.  దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఒక కుటుంబం మొత్తం ఆకలి కారణంగా స్వదేశం విడిచి, ఆ తర్వాత ముగ్గురు పురుషులను కోల్పోవడం చూస్తుంటే, దేవుని  సంరక్షణ ఎక్కడ కనిపిస్తుంది? రూతు గ్రంథం యొక్క గొప్పతనం ఇక్కడే ఉంది,  ఇది దేవుని సంరక్షణను  నాటకీయ అద్భుతాల ద్వారా కాకుండా, నిశ్శబ్దంగా, రోజువారీ సంఘటనల వెనుక, మానవ విశ్వసనీయత ద్వారా చూపిస్తుంది. దేవుడు ఇక్కడ ఆకాశం నుండి మాట్లాడడు; ఆయన ఒక కోడలి హృదయంలో పనిచేస్తాడు.

2. నవొమి నిర్ణయం: స్వదేశానికి తిరుగు ప్రయాణం

మోవాబులో ఉండగా, నవొమికి ఒక వార్త చేరింది. యావే  తన ప్రజలను దీవించాడు, బేత్లెహేములో మళ్ళీ ఆహారం సమృద్ధిగా దొరుకుతోందని, కరువు ముగిసిందని విన్నది. ఈ వార్త వినగానే,  నవోమి తన ఇద్దరు కోడళ్ళతో తన స్వదేశానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్న విషయం చెపుతుంది.  మొదటిసారిగా, దీర్ఘకాల విషాదం తర్వాత, ఒక ఆశాకిరణం కనిపిస్తుంది.

అయితే,  నవొమి, తన కోడళ్ళతో త్రోవలోనే "అమ్మలార! మీరిక తిరిగి మీ పుట్టినిండ్లు చేరుకొనుడు. మీరు నాయెడల, ఆ గతించిన వారియెడల మిగుల దయచూపిరి. ప్రభువు కూడ మిమ్ము కరుణతో చూచును గాక! యావే అనుగ్రహము వలన మీరు మరల పెండ్లియాడి మీ కుటుంబములను నిలబెట్టుకొందురు గాక!” అని పలికి వీడ్కోలు సూచనగా వారిని ముద్దు పెట్టుకొనెను.." ఈ మాటలలో నవొమి నిస్వార్థం  స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తన స్వంత ఒంటరితనాన్ని పక్కన పెట్టి, తన కోడళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించింది. ఆమెకు తెలుసు తనతో పాటు బేత్లెహేముకు వెళ్తే, వారు ఒక విదేశీ భూమిలో, మోవాబీయ స్త్రీలుగా, పునర్వివాహపు అవకాశం లేకుండా, పేదరికంలో జీవించవలసి వస్తుంది.

నవొమి తర్కం వాస్తవికమైనది, నిరాశాజనకమైనది కూడా, "మీరిక తిరిగిపొండు. మరల వివాహమాడుటకు నేనా ప్రాయముచెల్లినదానను. ఒక వేళ నేను ఇంకను ఆశ కలదులే అనుకొని పెండ్లి చేసికొని ఈ రేయినే పెనిమిటినికూడి గర్భముతాల్చి కుమారులను కనినను, ఆ పుత్రులు పెరిగి పెద్దవారగు వరకును పెండ్లి యాడకుండ కనిపెట్టుకొని ఉందురా? నాకు కలుగబోవు సుతులను నమ్ముకొని మీరు మరల వివాహమాడకుందురా? అట్లు జరుగరాదు. బిడ్డలారా! మిమ్ము చూడగా నా కడుపుతరుగుకొని పోవుచున్నది. ప్రభువు నన్నిట్లు శిక్షించెను. నేనేమి చేయుదును? అని పలికెను." ఇది కేవలం ఆచారబద్ధమైన మాట కాదు, ఇది ఆ కాలపు దేవర నియమ ఆచారాన్ని ప్రస్తావిస్తోంది ద్వితీయోపదేశకాండము 25:5-10 ప్రకారం ఒక వితంతువు వంశాన్ని కొనసాగించడానికి తన మరణించిన భర్త సోదరుడిని వివాహం చేసుకోవచ్చు. నవొమికి ఇక కుమారులు పుట్టే అవకాశం లేదు, కాబట్టి ఆమె తన కోడళ్ళను తమ సొంత జనుల వద్దకు, తమ సొంత భవిష్యత్తు వైపు వెళ్ళమని కోరుతోంది.

ఈ క్షణం రూతు గ్రంథంలో అత్యంత హృదయవిదారకమైనది.ఈ సమయంలో  ముగ్గురు స్త్రీలు  నవొమి, ఒర్పా, రూతు, దారి మధ్యలో నిలబడి, గట్టిగా ఏడ్చారు. ఒర్పా, చాలా బాధతో, తన అత్తగారి మాట విని, ముద్దుపెట్టుకుని, తన సొంత జనుల వద్దకు, తన సొంత దేవుళ్ళ వద్దకు తిరిగి వెళ్ళిపోయింది. పవిత్ర గ్రంధం  ఒర్పాను దుర్మార్గురాలిగా చిత్రించదు,  ఆమె నిర్ణయం అర్థమయ్యేదే, తార్కికమైనదే. ఆమె వాస్తవికతను అనుసరించింది.

కానీ రూతు వెళ్ళిపోలేదు. " కాని రూతు మాత్రము నవోమిని వదలిపెట్టదయ్యెను" అని గ్రంథం చెబుతుంది. నిజానికి ఇక్కడ వాడబడిన పదం "హత్తుకొనియుండెను". ఇది   హీబ్రూ భాషలో గాఢమైన, తెగని బంధాన్ని సూచించే పదం. ఇదే పదం ఆదికాండము 2:24లో భర్త భార్యను "హత్తుకొనుట" గురించి వాడబడింది. రూతు యొక్క నిర్ణయం కేవలం భావోద్వేగపరమైనది కాదు,  అది ఒక ఒడంబడిక వంటి నిబద్ధత.

3. రూతు ప్రమాణం: బైబిలులోని గొప్ప విశ్వసనీయ  ప్రకటన

నయోమి రూతును కూడా వెళ్ళిపొమ్మని మరోసారి ప్రోత్సహించింది  " అమ్మా! నీ తోడి కోడలు తన బంధువుల యొద్దకు వెళ్ళిపోయినది. ఆమె తన జాతిజనులదేవుని కొలుచును. మరి నీవుకూడ వెళ్ళి పోరాదా? " అని అడిగింది. కానీ రూతు ఇచ్చిన సమాధానం చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే ప్రమాణాలలో ఒకటిగా నిలిచిపోయింది.  ఆ మాటలు ఏమిటి అంటే, " నీవు నన్ను వెళ్ళిపొమ్మని నిర్బంధ పెట్టవలదు. నేనును నీ వెంటవత్తును. నీవు వెళ్ళుచోటునకే నేనును వత్తును. నీవు వసించుచోటనే నేనును వసింతును. నీ బంధువులు నా బంధువులగుదురు. నీ దేవుడు నా దేవుడగును. నీవు మరణించు చోటుననే నేనును మరణింతును. నిన్ను పాతిపెట్టు చోటుననే నన్నును పాతిపెట్టుదురు. మృత్యువు తప్ప మరియొకటి , మనలను వేరుపరచినచో ప్రభువు నాకు ఎంతటి కీడైనను చేయునుగాక!."

ఈ ప్రమాణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, దీని లోతు అర్థమవుతుంది. రూతు కేవలం "నేను నీతో ఉంటాను" అని చెప్పడం లేదు. ఆమె నాలుగు స్థాయిలలో తనను తాను నవొమికి, నవొమి ప్రజలకు, నవొమి దేవుడికి అర్పించుకుంటోంది: భౌగోళికంగా (ఎక్కడికి వెళ్తావో అక్కడికి వస్తాను), సామాజికంగా (నీ జనులే నా జనులు), ఆధ్యాత్మికంగా (నీ దేవుడే నా దేవుడు), మరియు అంతిమంగా (మరణంలో కూడా విడిపోను). ఇది కేవలం మానవ ప్రేమ కాదు, ఇది ఒక మతమార్పిడి ప్రకటన కూడా. రూతు, ఒక మోవాబీయ స్త్రీ, తన సొంత దేశపు దేవుళ్ళను  విడిచిపెట్టి, ఇశ్రాయేలు దేవుడైన యావేను  తన దేవుడిగా స్వీకరిస్తోంది.

ఇది ఎందుకు అంత విశేషమైనది? ఎందుకంటే రూతుకు ఈ నిర్ణయం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఆమె నవొమిని వెంబడించడం వల్ల ఆమెకు ఆర్థిక భద్రత రాదు; పైగా, ఆమె పేదరికంలో, విదేశీయురాలిగా, పునర్వివాహపు అవకాశం లేకుండా జీవించవలసి రావచ్చు. బోవసుతో వివాహం జరుగుతుందని రూతుకు ఏమాత్రం తెలియదు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా నిస్వార్థమైనది.  ప్రతిఫలం ఆశించకుండా చేసిన ప్రేమ చర్య. ఇదే నిజమైన "హెసెద్" (חֶסֶד)  హీబ్రూ భాషలో "నిబద్ధత కలిగిన ప్రేమ" లేదా "ఒడంబడిక ప్రేమ" అని అర్థం. నవొమి రూతు దృఢనిశ్చయాన్ని చూసి, ఇక ఆమెను ఒప్పించడం మానుకుంది. ఇద్దరు స్త్రీలు కలిసి బేత్లెహేము వైపు ప్రయాణం సాగించారు.

4. ఖాళీ చేతులతో బేత్లెహేముకు తిరుగు రాక

ఇద్దరు వితంతువులు బేత్లెహేముకు చేరుకున్నప్పుడు, ఊరు మొత్తం కదిలిపోయింది. "ఈమె నవొమియేనా?" అని స్త్రీలు ఆశ్చర్యంతో అడిగారు. సంవత్సరాలు గడిచాయి, మరియు దుఃఖం నవోమి  రూపురేఖలను మార్చేసింది. ఆమె సమాధానం హృదయవిదారకంగా ఉంటుంది: "నన్ను నయోమి అని పిలువకుడి, నన్ను మారా అని పిలువుడి; సర్వశక్తుడు నాకు మిక్కిలి చేదు అనుభవము కలుగజేసెను. సంపూర్ణముగా నేను వెళ్లితిని, యావే  నన్ను వట్టిచేతులతో మరల రప్పించెను."

"నవొమి" అనే పేరుకు అర్థం "మనోహరమైనది," "ఇంపైనది." లేక “సుందరాంగి” "మారా" అనే పేరుకు అర్థం "చేదు." ఈ పేరు మార్పు నవొమి హృదయంలోని లోతైన వేదనను వ్యక్తం చేస్తుంది. ఆమె తన బాధను దేవుని ఎదుట నిజాయితీగా ఒప్పుకుంటుంది, "సర్వశక్తుడు నాకు చేదు అనుభవము కలుగజేసెను" అని. ఇది మనకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠం నేర్పుతుంది. దేవుని ఎదుట మన నిజమైన బాధను దాచుకోవలసిన అవసరం లేదు. దుఃఖాన్ని వ్యక్తం చేయడం అవిశ్వాసం కాదు.  అది విశ్వాసపు ఒక భాగం. యోబు, కీర్తనల గ్రంథకర్తలు కూడా ఇదే విధంగా తమ వేదనను దేవుని ఎదుట కుమ్మరించారు.

అయితే, ఈ దుఃఖపు మాటల మధ్యలో కూడా పవిత్ర గ్రంధం  ఒక చిన్న, కీలకమైన వివరాన్ని జోడిస్తుంది: వారు యవ పంట  కోతకాలము ఆరంభమందు బేత్లెహేమునకు వచ్చిరి అని చెబుతుంది.  ఈ వాక్యం చదవడానికి సాధారణంగా అనిపించవచ్చు, కానీ చాలా ముఖ్యమైనది. నవొమి ఖాళీ చేతులతో తిరిగి వచ్చిందని అనుకుంటుండగా, దేవుడు ఇప్పటికే ఆమె తిరుగు రాకను కోతకాలంతో సమయానుకూలంగా మర్చాడు. మానవ కంటికి కనిపించని దేవుని సంరక్షణ  ఇక్కడ మొదటిసారి సూక్ష్మంగా కనిపిస్తుంది.

5. బోవసు  పొలంలో పరిగె ఏరుకొనుట

బేత్లెహేములో స్థిరపడిన తర్వాత, జీవనోపాధి కోసం రూతు ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. ఆమె నవొమితో ఇలా చెప్పింది: "నేను పొలమునకు పోయి పరిగలేరుకొని వత్తును. ఎవరైన నన్ను కరుణించి తమ చేనిలో కోతముగిసిన పిమ్మట జారిపోయిన కంకులు ఏరుకొననీయకపోరు." ధర్మశాస్త్రంలో ఒక కరుణాపూరిత నిబంధన ఉంది, పొలం యజమానులు కోత కోసేటప్పుడు పొలం చివరలో, మూలలలో మిగిలిన పంటను పూర్తిగా కోయకూడదు; అది పేదలకు, వితంతువులకు, విదేశీయులకు, అనాథలకు వదిలివేయాలి (లేవీయకాండము 19:9-10, ద్వితీయోపదేశకాండము 24:19-22). దేవుడు తన ప్రజల ద్వారా పేదలను ఆదుకోవాలని కోరుకున్నాడు.

రూతు ఈ కరుణాపూరిత నిబంధనను ఉపయోగించుకోవడానికి బయలుదేరింది. పవిత్ర గ్రంథం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుపుతుంది.  "రూతు పొలమున వెళ్ళి కోతకాండ్ర వెనుక తిరుగాడుచు వారు వదలిపెట్టిన వెన్నులు ఏరుకొనెను. పొలములో ఆమె తిరుగాడిన భాగము ఎలీమెలెకు బంధువగు బోవసునకు చెందినది."

బోవసు  ఎవరు? అతను ఎలీమెలెకు బంధువు, మరియు "గొప్ప ఐశ్వర్యవంతుడు" ఒక గౌరవనీయమైన, దైవభక్తిగల వ్యక్తిగా చిత్రించబడ్డాడు. అతను తన పొలానికి వచ్చినప్పుడు, తన పనివారిని "యావే  మీకు తోడైయుండునుగాక" అని పలకరించాడు, వారు "యావే  నిన్ను ఆశీర్వదించునుగాక" అని జవాబిచ్చారు. ఈ చిన్న వివరం బోవసు స్వభావాన్ని వెల్లడిస్తుంది, అతను తన పనివారితో  కూడా దైవభక్తితో, గౌరవంతో వ్యవహరించే వ్యక్తి.

బోవసు  వెంటనే రూతును గమనించి, ఆమె ఎవరో అడిగాడు. తన సేవకుడు ఆమెను "నవొమితో మోవాబు దేశములోనుండి వచ్చిన మోవాబీయ స్త్రీ" అని పరిచయం చేశాడు, ఆమె ఉదయం నుండి అలసట లేకుండా కష్టపడి పనిచేస్తోందని చెప్పాడు. బోవసు  రూతుతో “అమ్మా! నా మాటవినుము. నీవు ఇంకెక్కడికిని వెళ్ళనక్కరలేదు. మా పొలముననే పరిగలేరుకొనుము. మా పనికత్తెల దగ్గర ఉండిపొమ్ము. వారు పంటకోసిన తావున వారి వెను వెంటవచ్చి కంకులేరుకొనుము. నిన్ను బాధింపవలదని మా పనివాండ్రకు ఆజ్ఞయిచ్చితిని. నీకు దప్పిక అయినపుడు వారు చేదుకొని వచ్చిన కుండలనుండి నీరు త్రాగుము” అని చెప్పాడు.  అతను ఆమెను తన పనివారితో సమానంగా చూసుకోమని, దాహం వేసినప్పుడు నీళ్ళు తాగమని, మరియు తన పనివారిని ఆమెను ముట్టుకోకుండా హెచ్చరించాడు.

రూతు, ఈ అపారమైన దయకు ఆశ్చర్యపోయి, నేలను తాకి నమస్కరిస్తూ అడిగింది: "అయ్యా! నీవు నా పట్ల ఎంత దయచూపితివి? పరదేశీయురాలనైన నన్ను ఇంతగా కరుణింపవలయునా?" బోవసు  జవాబు గొప్పది, "నీవు నీ మగడు చనిపోయిన పిదప మీ అత్తకు నీవు ఎంత ఉపకారముచేసితివో నేను వింటిని. నీ తల్లిదండ్రులను, నీ జన్మదేశమును విడనాడి ముక్కుమొగము తెలియని ఈ క్రొత్త ప్రజల చెంతకు వచ్చితివి. నీ మంచితనమునకు గాను ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక! నీవు యిస్రాయేలు దేవుని నమ్మి ఆయనను శరణుజొచ్చితివి. ఆ ప్రభువు నిన్ను దండిగా దీవించునుగాక!”

ఇక్కడ మనం ఒక సత్యాన్ని చూస్తాము.  రూతు నవొమి  పట్ల చూపిన నిబద్ధత రహస్యంగా ఉండిపోలేదు, అది ఊరు మొత్తం తెలిసిన, గౌరవించబడిన కథగా మారింది. మనం చేసే మంచి పనులు, ప్రేమతో చేసిన త్యాగాలు, తరచుగా మనకు తెలియకుండానే ఇతరుల హృదయాలను తాకుతాయి, మరియు దేవుడు వాటికి తగిన సమయంలో ప్రతిఫలమిస్తాడు.

ఆ రోజు మధ్యాహ్న భోజన సమయంలో, బోవసు  రూతును తన పనివారితో కలిసి భోజనం చేయమని ఆహ్వానించాడు, తనే స్వయంగా ఆమెకు వేపిన ధాన్యం అందించాడు. రూతు కడుపు నిండా తిన్న తర్వాత కూడా కొంత మిగిల్చింది,  బహుశా నవొమి కోసం తీసుకెళ్ళడానికి కావచ్చు. సాయంత్రం వరకు రూతు పరిగె ఏరుకుంది, ఆమె తీసుకెళ్ళిన ధాన్యం పరిమాణం చూసి నయోమి ఆశ్చర్యపోయింది. దాదాపు ఒక ఏఫా (సుమారు 22  కిలోల) యవలు! జరిగినది మొత్తం రూతు నవోమికి చెప్పింది.

వొమి ఈ అద్భుతమైన అదృష్టం గురించి విన్నప్పుడు, మొదటిసారిగా కథలో ఆమె నోటి నుండి ఆశీర్వాద మాటలు వెలువడతాయి.  "సజీవులను, మృతులను కూడ కరుణించు ప్రభువు బోవసును దీవించునుగాక! అతడు మనకు దగ్గరి చుట్టము. మన సంగతి' చూడవలసినది కూడ అతడే!"

6. "గోయేల్" -విమోచకుని భావన

ధర్మశాస్త్రంలో "గోయేల్" (גֹּאֵל) అనే భావన ఉండేది. "బంధు విమోచకుడు" లేదా "సన్నిహిత బంధువు" అని అర్థం. ఈ వ్యక్తి కుటుంబంలో అనేక బాధ్యతలు నిర్వర్తించాలి.  ఒక బంధువు పేదరికం వల్ల తన భూమిని అమ్మవలసి వస్తే, దానిని తిరిగి కొనుగోలు చేసి కుటుంబ ఆస్తిగా కాపాడాలి (లేవీయకాండము 25:25); ఒక బంధువు సంతానం లేకుండా మరణిస్తే, అతని వితంతువును వివాహం చేసుకుని, ఆమెకు పుట్టే మొదటి కుమారుడు మరణించిన వ్యక్తి పేరును కొనసాగించేలా చూడాలి (ద్వితీయోపదేశకాండము 25:5-10, లెవరేట్  వివాహం అని పిలువబడే ఆచారం). ఈ వ్యవస్థ వెనుక ఉన్న  ఉద్దేశం స్పష్టం  వంశాన్ని, కుటుంబ ఆస్తిని, మరియు దుర్బల సభ్యులను  ముఖ్యంగా వితంతువులను  కాపాడటం.

నవొమికి, బోవసు  ఈ "గోయేల్" బాధ్యత నిర్వర్తించగల బంధువులలో ఒకడు అని తెలుసు. అయితే, పవిత్ర గ్రంథం తర్వాత వెల్లడించినట్లు, బోవసు  కంటే మరింత సన్నిహిత బంధువు ఒకడు ఉన్నాడు,అతనికి ఈ బాధ్యతను స్వీకరించే మొదటి హక్కు ఉంది.

కోతకాలం మొత్తం, యవ కోత మరియు గోధుమ కోత రెండూ ముగిసేవరకు రూతు బోవసు  పొలంలో పరిగె ఏరుకుంటూనే ఉంది. ఈ కాలం అంతటా, నవొమి ఒక ప్రణాళిక రూపొందిస్తోంది. యవ మరియు గోధుమ కోతలు పూర్తయిన తర్వాత, నవొమి రూతుతో ఒక ధైర్యంతో  సూచన ఇచ్చింది.  " తల్లీ! నిన్నొక యింటిదానిని చేయవలసినదానను నేనేకదా." అని  ఆమె రూతుతో స్నానం చేసి, పరిమళతైలం పూసుకుని, మంచి వస్త్రాలు ధరించి, ఆ రాత్రి బోవసు  కళ్ళం (ధాన్యం నూర్చే స్థలం) వద్దకు వెళ్ళమని సూచించింది.  బోవసు  భోజనం చేసి నిద్రించే వరకు కనిపించకుండా వేచి ఉండి, తర్వాత అతని పాదాల వద్ద పండుకొని అతని కాళ్ళ మీద వస్త్రమును  తీయమని చెప్పింది.

ఈ సూచన మనకు వింతగా, ఇబ్బందికరంగా కూడా అనిపించవచ్చు. కానీ ఆ కాలపు సాంస్కృతిక సందర్భంలో, ఇది ఒక సాహసోపేతమైన, కానీ గౌరవప్రదమైన చర్య.  బోవసుకు అతని "గోయేల్" బాధ్యతను, రూతును వివాహం చేసుకునే బాధ్యతను, గుర్తుచేసే ప్రతీకాత్మక చర్య. "వస్త్రమును  తీయుట" అనేది రక్షణ మరియు వివాహ ఒడంబడికకు ప్రతీక (యెహెజ్కేలు 16:8లో ఇదే చిత్రం కనిపిస్తుంది, అక్కడ దేవుడు ఇశ్రాయేలును తన వస్త్రముతో  కప్పి, తనతో ఒడంబడిక చేసుకుంటాడు).

రూతు నవొమి సూచనను నమ్మకంగా అనుసరించింది.  "నీవు చెప్పినదంతయు నేను చేసెదను" అని చెప్పింది. అర్ధరాత్రి సమయంలో, బోవసు  మేల్కొని, తన పాదాల వద్ద ఒక స్త్రీ పండుకొని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. "నీవు ఎవరు?" అని అడిగాడు. రూతు " అయ్యా! నేను నీ దాసురాలనైన రూతును. నీవు మాకు దగ్గరి చుట్టము. మా సంగతి విచారింపవలసినవాడవు నివే. కనుక నన్ను దేవరన్యాయమున పెండ్లియాడుము. ఈ నీ దాసురాలిపై నీ వస్త్రము కప్పుము" అని జవాబిచ్చింది.  ఈ మాటలు  "నీ వస్త్రము కప్పుము " అనేది  నేరుగా వివాహ ప్రతిపాదన. రూతు బోవసును తనను వివాహం చేసుకోమని, తన "గోయేల్" బాధ్యతను నిర్వర్తించమని అడుగుతోంది.

బోవసు  స్పందన మరోసారి అతని పాత్రను వెల్లడిస్తుంది. అతను భయపడలేదు, కోపగించలేదు, ఆమెను తప్పుగా అర్థం చేసుకోలేదు. బదులుగా, అతను ఆమెను ఆశీర్వదించాడు: " అమ్మా! నీవు యావే దీవెననొందినదానవు. నీవు ధనవంతునిగాని, దరిద్రుని గాని, మరియొక యువకుని కోరుకొనక నా యొద్దకే వచ్చితివి. నీవు మునుపు మెలగిన తీరుకంటెను ఇప్పుడు మెలగిన తీరు నీకు అధిక గౌరవమును చేకూర్చును." ఇక్కడ బోవసు రూతు నిర్ణయాన్ని అభినందిస్తున్నాడు.  ఆమె ఒక యువకుడిని వెతుక్కుంటూ వెళ్ళలేదు, బదులుగా తన కుటుంబ బాధ్యతను, నవొమి పట్ల తన నిబద్ధతను గౌరవించే వ్యక్తిని ఎంచుకుంది.

అయితే, బోవసు  ఒక ముఖ్యమైన విషయాన్ని  వెల్లడించాడు.  తనకంటే మరింత సన్నిహిత బంధువు ఒకడు ఉన్నాడు, ధర్మశాస్త్ర ప్రకారం అతనికి మొదట ఈ బాధ్యతను నిర్వర్తించే హక్కు ఉంది. బోవసు  రూతును ఆ రాత్రి భద్రంగా ఉండమని, తెల్లవారుజామున ఎవరూ చూడకముందే ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పాడు.  ఆమె పరువును కాపాడుతూ. వెళ్ళేముందు, అతను ఆమెకు ఖాళీ చేతులతో నవొమి వద్దకు వెళ్ళకూడదని ఆరు కొలల యవలు ఇచ్చి పంపాడు.  

రూతు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, నవోమి ఏమి జరిగినది అని  ఆమెను అడిగింది.  రూతు జరిగినదంతా వివరించింది, అప్పుడు  నవొమి, తన అనుభవంతో,  " తల్లీ! కొంచెము ఓపికపట్టుము. ఈ కథ ఎట్లు నడచునో చూతము. బోవసు ఈ వ్యవహారమును నేడే పరిష్కరించి తీరును" అని చెప్పింది. నవొమికి బోవసు  స్వభావం తెలుసు.  అతను తన మాట నిలబెట్టుకునే వ్యక్తి అని ఆమెకు నమ్మకం ఉంది.

7. ఊరి గుమ్మం వద్ద: విమోచన న్యాయస్థానం

బోవసు  ఏమాత్రం ఆలస్యం చేయలేదు. అదే రోజు, అతను ఊరి గుమ్మం వద్దకు వెళ్ళాడు, ఆ కాలంలో ఇది న్యాయపరమైన, వ్యాపారపరమైన లావాదేవీలు జరిగే బహిరంగ స్థలం. అక్కడ అతను ఆ సన్నిహిత బంధువు కోసం వేచి చూశాడు, అతను రాగానే, ",  కూర్చుండమని పిలిచి, పది మంది ఊరి పెద్దలను సాక్షులుగా సమావేశపరిచాడు.

బోవసు  మొదట భూమి విషయం ప్రస్తావించాడు. నవొమి తన భర్త ఎలీమెలెకుకు చెందిన భూమిని అమ్మాలని అనుకుంటోందని, మరియు ఆ బంధువుకు దానిని కొనుగోలు చేసే మొదటి హక్కు ఉందని చెప్పాడు. ఆ బంధువు వెంటనే "నేను దానిని విమోచించెదను" అని అంగీకరించాడు.  భూమి కొనుగోలు అతనికి ఆర్థికంగా లాభదాయకంగా అనిపించింది. అయితే బోవసు  తర్వాత అసలు షరతును వెల్లడించాడు.  " నీవు నవోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరుచునట్లు, చనిపోయినవాని భార్యయైన రూతు అను మోవాబీయురాలు యొద్దనుండి దానిని సంపాదించుకొనవలెను." భూమిని కొనడమే కాదు, రూతును వివాహం చేసుకుని, ఆమెకు పుట్టే మొదటి కుమారుడికి మృతుని (ఎలీమెలెకు వంశం, మహలోను  పేరు) వారసత్వం ఇవ్వాలి. దీని అర్థం ఏమిటంటే, ఆ బంధువు తన సొంత ఆస్తికి ఖర్చు చేసినా, భూమి చివరికి అతని సొంత వారసులకు కాకుండా, మృతుని వారసుడికి చెందుతుంది.

ఈ షరతు విన్న వెంటనే, ఆ బంధువు వెనక్కి తగ్గాడు: " అటులయినచో నేను ఆ పొలమును విడిపింపలేను. క్రొత్తసంతానము వలన నా పిల్లలకు దక్కవలసిన ఆస్తి తగ్గిపోవును. కనుక నీవే ఆ భూమిని తీసికోవచ్చును." ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన వైరుధ్యాన్ని చూస్తాము ఆ పేరులేని బంధువు తన సొంత ఆర్థిక ప్రయోజనాన్ని రూతు, నవొమి క్షేమం కంటే ఎక్కువగా విలువైనదిగా చూశాడు. బోవసు, దీనికి విరుద్ధంగా, తన సొంత లాభాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు  ఇది నిజమైన "హెసెద్" యొక్క మరో ఉదాహరణ.

ఆ కాలపు ఆచారం ప్రకారం, ఒక వ్యక్తి తన హక్కును మరొకరికి బదిలీ చేసేటప్పుడు, తన చెప్పు తీసి ఇచ్చేవాడు. ఇది లావాదేవీని ధృవీకరించే చర్య. ఆ బంధువు తన చెప్పు తీసి బోవసుకు ఇచ్చాడు, బోవసు  పెద్దలందరి ఎదుట " వినుడు, నేడు నేను ఎలీమెలెకు, కిల్యోను, మహ్లోనులకు చెందిన ఆస్తినంతటిని నవోమి నుండి కొంటిననుటకు మీరే సాక్షులు. మహ్లోను భార్యయు మోవాబీయురాలైన రూతును నేను పెండ్లి యాడుదును. ఆమెకు కలిగిన సంతానము ఎలీమెలెకు పొలమునకు వారసులగుదురు. ఈ రీతిగా గతించిన ఎలీమెలెకు కుటుంబము మన జనమందును, మన నగరమందును వర్ధిల్లును. మీరందరు దీనికి సాక్షులు” అనెను.."

గుమ్మం వద్ద ఉన్న పెద్దలు, ప్రజలు అందరూ సాక్షులుగా, బోవసును ఆశీర్వదించారు: " నీ ఇంట అడుగుపెట్టనున్న ఈ యిల్లాలు కూడ, పూర్వము యాకోబునకు పెక్కుమంది బిడ్డలను కనిన రాహేలు, లేయాలవలె ప్రభువు కృపవలన సంతానవతి అగును గాక! నీవు ఎఫ్రాతా తెగనందు సంపన్నుడవగుదువు గాక! బేత్లెహేమున సుప్రసిద్ధుడవగుదువుగాక! ప్రభువు నీకును ఈ యువతికిని ప్రసాదించు సంతానము వలన పూర్వము యూదా తామారులు కనిన పెరెసు కుటుంబమువలె నీ కుటుంబమును కీర్తి కెక్కును గాక!” అని దీవించిరి. " ఈ ఆశీర్వాదం రాహేలు, లేయా, తామారు వంటి ఇశ్రాయేలు చరిత్రలోని గొప్ప స్త్రీలను ప్రస్తావిస్తూ, రూతును కూడా వారి కోవలో చేరుస్తుంది.

8. వివాహం మరియు ఓబేదు జననం

బోవసు  రూతును వివాహం చేసుకున్నాడు, మరియు యావే  ఆమెకు గర్భం దయచేయగా, ఆమె ఒక కుమారుడిని కన్నది. ఈ క్షణం కథలో పరిపూర్ణ మలుపు నవొమి , ఒకప్పుడు తనను "మారా" (చేదు) అని పిలవమని కోరిన స్త్రీ, ఇప్పుడు తన ఒడిలో ఒక మనవడిని ఎత్తుకుంది.

బేత్లెహేము స్త్రీలు నవోమి ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు: "యావేకు  స్తోత్రము; నేడు నిన్ను విమోచింపకుండ ఆయన నిన్ను విడనాడలేదు; ఇశ్రాయేలీయులలో అతని పేరు ప్రసిద్ధమగునుగాక. అతడు నీ ప్రాణమునకు జీవాధారమును ముదిమిలో నిన్ను పోషించువాడునగును; ఏలయనగా నిన్ను ప్రేమించి నీ కోడలికి నీవన్న ప్రాణముకదా! ఆమె నీకు ఏడుగురు కుమారులకంటెను మిన్న. " ఈ ఒక్క వాక్యం రూతు యొక్క విలువను శిఖరాగ్రానికి చేరుస్తుంది.  ఆమె "ఏడుగురు కుమారుల కంటే శ్రేష్ఠురాలు" అని ఊరి స్త్రీలే ప్రకటించారు, అది ఆ కాలపు సమాజంలో అత్యున్నత ప్రశంస.

నవొమి ఆ బిడ్డను తన హృదయానికి హత్తుకుని, అతనికి పెంపుడు తల్లిగా  మారింది. పొరుగు స్త్రీలు అతనికి "ఓబేదు" అని పేరు పెట్టారు. "సేవించువాడు" లేదా "ఆరాధించువాడు" అని అర్థం.

9. వంశావళి: దావీదు వరకు, క్రీస్తు వరకు

రూతు గ్రంథం చాలా  చిన్న చిన్నది, కానీ అపారమైన ప్రాముఖ్యత కలిగిన వంశావళితో ముగుస్తుంది: "ఓబేదు కుమారుడు యిషాయి , యిషాయి  కుమారుడు దావీదు." ఈ ఒక్క వాక్యం మొత్తం కథ యొక్క నిజమైన పరిమాణాన్ని వెల్లడిస్తుంది. ఒక కరువు కారణంగా మోవాబుకు వలస వెళ్ళిన సామాన్య కుటుంబం, ఒక మోవాబీయ వితంతువు తన అత్తగారి పట్ల చూపిన విశ్వసనీయత, ఒక దయగల భూస్వామి యొక్క ధర్మశీలత  ఇవన్నీ కలిసి, ఇశ్రాయేలు యొక్క గొప్ప రాజైన దావీదు జననానికి పునాది వేశాయి.

ఇది కేవలం ఒక ఆసక్తికరమైన చారిత్రక వివరం కాదు.  ఇది దైవశాస్త్ర పరంగా  అపారమైన ప్రాముఖ్యత కలిగినది. దావీదు వంశం నుండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో స్పష్టంగా చూపినట్లు, యేసుక్రీస్తు జన్మించాడు. మత్తయి తన వంశావళిలో రూతును ప్రత్యేకంగా పేర్కొంటాడు.  ఆ కాలపు యూదా సమాజంలో స్త్రీలను వంశావళిలో ప్రస్తావించడం అరుదు, మరియు ఒక విదేశీయురాలిని ప్రస్తావించడం మరింత అరుదు. అయినా, రూతు ఒక మోవాబీయురాలు, ఇశ్రాయేలుకు చారిత్రక శత్రు జాతికి చెందినది మెస్సీయ వంశావళిలో శాశ్వతంగా చోటు సంపాదించుకుంది.

ఇది దేవుని సంరక్షణ  యొక్క అద్భుతమైన లోతును చూపిస్తుంది. కరువు, మరణం, వితంతుత్వం, విదేశీయత వంటి విషాదాల గొలుసు  మానవ కంటికి యాదృచ్ఛికంగా, అర్థరహితంగా కనిపించే సంఘటనల పరంపర,  వాస్తవానికి దేవుని రక్షణ ప్రణాళికలో ఒక అనివార్యమైన లింకుగా ఉంది. నవొమి తన కుటుంబాన్ని కోల్పోయినప్పుడు, ఆమెకు ఇది తెలియదు. రూతు మోవాబు నుండి బయలుదేరినప్పుడు, ఆమెకు తాను మెస్సీయ వంశావళిలో భాగం అవుతానని తెలియదు. బోవసు తన పొలంలో ఒక అపరిచిత మోవాబీయ స్త్రీని చూసినప్పుడు, తాను దేవుని రక్షణ చరిత్రలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నానని అతనికి తెలియదు. ఇదే దేవుని సంరక్షణ  యొక్క స్వభావం.  అది తరచుగా మన కంటికి కనిపించదు, కానీ అది నిరంతరం, నమ్మకంగా పనిచేస్తూనే ఉంటుంది.

10. విశ్వసనీయత (హెసెద్) — కథ యొక్క హృదయస్పందన

రూతు గ్రంథం మొత్తంలో, "హెసెద్" అనే భావన మూడు వేర్వేరు స్థాయిలలో కనిపిస్తుంది. మొదటిది, రూతు నయోమి పట్ల చూపిన హెసెద్. ఒక కోడలు తన అత్తగారి పట్ల ఎలాంటి బాధ్యత లేనప్పుడు కూడా, ఆమెను వదలకుండా, తన సొంత భవిష్యత్తును పణంగా పెట్టి కూడా నిలబడింది. రెండవది, బోవసు  రూతు మరియు నయోమి పట్ల చూపిన హెసెద్.  తన సొంత ఆర్థిక ప్రయోజనాన్ని త్యాగం చేసి, ధర్మశాస్త్రం కోరే దానికంటే ఎక్కువగా దయ చూపించాడు. మూడవది, మరియు అన్నింటికంటే లోతైనది  దేవుడు ఈ ముగ్గురు పట్ల చూపిన హెసెద్, నిశ్శబ్దంగా, తెరవెనుక నుండి, ప్రతి సంఘటనను వారి మేలుకొరకు అల్లుతూ సాధారణ విషయాల ద్వారా వారిని సంరక్షిస్తూ వచ్చారు.

ఈ మూడు స్థాయిల హెసెద్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అనే విషయం గమనార్హం. రూతు యొక్క మానవ విశ్వసనీయత లేకుండా, బోయజుకు ఆమెతో పరిచయమే కలిగేది కాదు. బోవసు  యొక్క దయాగుణం లేకుండా, రూతు, నవొమి పేదరికంలోనే మిగిలిపోయేవారు. మరియు ఈ మానవ చర్యలు రెండూ లేకుండా, దేవుని పెద్ద ప్రణాళిక  దావీదు రాజు జననం, మరియు అంతిమంగా క్రీస్తు జననం నెరవేరేది కాదు. దేవుడు మానవ స్వేచ్ఛా చిత్తాన్ని, మానవ ఎంపికలను తోసిపుచ్చకుండా, వాటి ద్వారానే తన ప్రణాళికను నెరవేరుస్తాడు. ఇది దేవుని సంరక్షణ  యొక్క ఒక లోతైన సత్యం. ఆయన మనలను తోలుబొమ్మలుగా ఉపయోగించడు; ఆయన మన నిజమైన ప్రేమ చర్యలను, మన నిజమైన ఎంపికలను తన శాశ్వత ప్రణాళికలో చేర్చుకుంటాడు.

రూతు యొక్క హెసెద్ ప్రత్యేకంగా గమనార్హం ఎందుకంటే అది "ఎంపిక చేసుకున్న" ప్రేమ, "బాధ్యతగా వచ్చిన" ప్రేమ కాదు. ఆమెకు నవొమి పట్ల ఎలాంటి రక్త సంబంధం లేదు. ఆమె భర్త చనిపోయిన తర్వాత, ధర్మశాస్త్రపరంగా కూడా ఆమెకు నవొమి పట్ల ఎలాంటి బాధ్యత మిగలలేదు. ఆమె స్వేచ్ఛగా తన సొంత తల్లి ఇంటికి, తన సొంత దేవుళ్ళ వద్దకు తిరిగి వెళ్ళగలిగేది.  ఒర్పా చేసినట్లు. కానీ రూతు ఎంచుకుంది. ఇదే నిజమైన హెసెద్ యొక్క గుర్తు.  అది బాధ్యత నుండి పుట్టదు, ప్రేమ నుండి పుడుతుంది; అది ఒప్పందం నుండి పుట్టదు, నిబద్ధత నుండి పుడుతుంది.

11. దైవ సంరక్షణ  — తెరవెనుక పనిచేసే దేవుని చేయి

రూతు గ్రంథం యొక్క మరో విశేషమైన లక్షణం ఏమిటంటే, ఇందులో దేవుడు ఎప్పుడూ నేరుగా కనిపించడు, మాట్లాడడు, అద్భుతం చేయడు. ఆయన ఎప్పుడూ తెరవెనుక ఉంటాడు.  కరువు ముగించడంలో, "దైవఘటనవలన" రూతు అడుగులను బోవసు  పొలానికి నడిపించడంలో, రూతు గర్భం దాల్చడంలో. ఈ నిశ్శబ్ద సంరక్షణలో  బైబిలులోని అనేక ఇతర గ్రంథాల నుండి రూతు గ్రంథాన్ని వేరుచేస్తుంది.   నిర్గమకాండములో దేవుడు మేఘస్తంభం, అగ్నిస్తంభంగా కనిపిస్తాడు; ఏలీయా కథలో ఆయన అగ్నివర్షం కురిపిస్తాడు. కానీ రూతు కథలో, దేవుడు కేవలం "సాధారణ" సంఘటనల ద్వారానే పనిచేస్తాడు.   ఒక కరువు, ఒక మరణం, ఒక నిర్ణయం, ఒక పరిచయం, ఒక వివాహం.

ఇది మనకు ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది: దేవుడు మన జీవితంలో ఎప్పుడూ నాటకీయ అద్భుతాల ద్వారానే పనిచేయడు. చాలావరకు, ఆయన మన సాధారణ నిర్ణయాల ద్వారా, మన సాధారణ కలయికల ద్వారా, మన రోజువారీ విశ్వసనీయత చర్యల ద్వారా పనిచేస్తాడు. మనం "దేవుడు నా జీవితంలో ఎక్కడ ఉన్నాడు?" అని అడిగినప్పుడు, మనం ఆకాశం వైపు చూడనవసరం లేదు.  మన నిత్య జీవితంలోని సాధారణ సంఘటనలను, సాధారణ కలయికలను, జాగ్రత్తగా పరిశీలిస్తే, దేవుని చేయి అక్కడే కనిపిస్తుంది.

12. నేటి విశ్వాసులకు ఈ కథ చెప్పేది ఏమిటి?

రూతు మరియు నవొమి కథ మూడు వేల సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ, ఇది నేటి మన జీవితాలకు, నేటి మన సమాజానికి అనేక గొప్ప  సందేశాలను అందిస్తుంది.

మొదటిది, నష్టంలో  కూడా దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. నవొమి తన భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోయినప్పుడు, ఆమెకు దేవుని ప్రణాళిక ఏమాత్రం కనిపించలేదు. ఆమె తనను తాను "మారా" (చేదు) అని పిలుచుకుంది. ఈ రోజు మనలో చాలామంది జీవితంలో ఇలాంటి "మారా" క్షణాలను ఎదుర్కొంటారు.  ప్రియమైనవారి మరణం, ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సంక్షోభం, కుటుంబంలో విభేదాలు. ఆ క్షణాలలో దేవుడు మనలను వదిలిపెట్టాడని అనిపించవచ్చు. కానీ నవొమి కథ మనకు చీకటిలో ఉన్నప్పుడు కూడా, దేవుడు నిశ్శబ్దంగా, మన మేలుకొరకు పనిచేస్తూనే ఉంటాడు అని గుర్తుచేస్తుంది. మన చేదు అనుభవం చివరి స్థితి  కాదు.

రెండవది, చిన్న, రోజువారీ విశ్వసనీయ చర్యలు అపారమైన ప్రాముఖ్యత కలిగినవి. రూతు దావీదు రాజు, లేదా క్రీస్తు జననం గురించి ఆలోచించి నవొమిని వెంబడించలేదు. ఆమె కేవలం ప్రేమతో, నిబద్ధతతో ఒక నిర్ణయం తీసుకుంది. బోవసు  రూతును తన పొలంలో దయతో చూసుకున్నప్పుడు, తాను మెస్సీయ వంశావళిలో భాగం అవుతున్నానని అతనికి తెలియదు. మనం చేసే దయతో కూడిన చిన్న  చర్యలు, మనకు తెలియకుండానే దేవుని పెద్ద ప్రణాళికలో భాగం కావచ్చు. ఒక వృద్ధురాలిని జాగ్రత్తగా చూసుకోవడం, ఒక అపరిచితుడికి దయ చూపడం, కుటుంబ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడం.   ఇవి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ దేవుడు వీటిని తన శాశ్వత ప్రణాళికలో ఉపయోగించుకుంటాడు.

మూడవది, దేవుని రాజ్యంలో "బయటివారు" అనే వర్గం లేదు. రూతు ఒక మోవాబీయురాలు ఇశ్రాయేలియుల శత్రు జాతికి చెందినది, ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలు సమాజంలో పూర్తిగా చేరలేని వ్యక్తి. అయినా, ఆమె విశ్వసనీయత, ఆమె విశ్వాసం కారణంగా, దావీదు రాజు అంతిమంగా క్రీస్తు పూర్వీకురాలిగా మారింది. ఇది నేటి మనకు ఒక శక్తివంతమైన సందేశం  దేవుని దయ జాతి, జాతీయత, గత చరిత్ర ఆధారంగా పరిమితం కాదు. మన సమాజంలో, మన సంఘాలలో, "బయటివారు"గా, "అపరిచితులు"గా చూడబడేవారిని కూడా దేవుడు తన ప్రణాళికలో గొప్ప స్థానానికి ఎత్తగలడు.

నాలుగవది, కుటుంబ బాధ్యతలను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం పవిత్రమైన పిలుపు. రూతు నవొమిని జాగ్రత్తగా చూసుకోవడం, ఆమెకు ఆహారం సంపాదించడం, ఆమెతో పాటు నివసించడం ఇది ఆధునిక సమాజంలో మనం తరచుగా విస్మరించే విలువ. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, బంధువులను జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఒక భారంగా కాకుండా, దేవుని దృష్టిలో ఒక పవిత్రమైన సేవగా చూడాలి.  దీనిని రూతు కథ మనకు చూపిస్తుంది.  ఇలాంటి నిస్వార్థ సేవ దేవుని దృష్టిలో ఎంతో విలువైనది, మరియు దేవుడు దానిని తప్పకుండా గుర్తిస్తాడు, ప్రతిఫలమిస్తాడు.

ఐదవది, దేవుని సంరక్షణను  నమ్మడం అంటే నిష్క్రియంగా వేచి ఉండటం కాదు. నవొమి, రూతు ఇద్దరూ తమ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించారు.  రూతు పరిగె ఏరుకోవడానికి బయలుదేరింది, నవొమి  ఎప్పుడు ఏమి చేయాలో ఒక ప్రణాళిక రూపొందించింది. దేవుని సంరక్షణ  నమ్మడం అంటే మనం ఏమీ చేయకుండా ఉండటం కాదు, అది మన బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తిస్తూ, ఫలితాన్ని దేవుని చేతికి వదిలిపెట్టడం.

చివరిగా, ఈ కథ మనకు ఆశను అందిస్తుంది. నవొమి కథ ఖాళీ చేతులతో, చేదు హృదయంతో మొదలైంది. కానీ అది ఒక మనవడిని ఒడిలో ఎత్తుకోవడంతో, "ఏడుగురు కుమారుళ్లకంటే శ్రేష్ఠురాలైన" కోడలి ప్రేమతో ముగిసింది. మన జీవితంలో కూడా, ప్రస్తుత చీకటి, ప్రస్తుత నష్టం, అనేది చివరి స్తితి కాదు. దేవుడు మన "మారా" క్షణాలను కూడా తన మహిమాన్విత ప్రణాళికలో ఒక గొప్ప  అధ్యాయంగా మార్చగలడు.  మనం ఊహించలేని విధంగా, మనం ఊహించలేని సమయంలో అలా చేయగలడు.

ముగింపు

రూతు మరియు నవొమి కథ  కరువుతో మొదలై, మరణాలతో కొనసాగి, ఒక కోడలి అసాధారణ విశ్వసనీయతతో మలుపు తిరిగి, ఒక దయగల బంధువు ధర్మశీలతతో పరిపూర్ణమై, చివరికి దావీదు రాజు జననంతో, అంతిమంగా క్రీస్తు జననంతో శిఖరాగ్రానికి చేరిన కథ.  మనకు బోధించేది ఒక్కటే: దేవుడు మన నష్టాలను, మన విషాదాలను, మన సాధారణ రోజువారీ నిర్ణయాలను కూడా తన శాశ్వత రక్షణ ప్రణాళికలో చేయగలడు. మనం చేయవలసినది కేవలం ఒక్కటే  రూతులా విశ్వసనీయంగా ఉండటం, నవొమిలా నిజాయితీగా దుఃఖించి కూడా ఆశను వదులుకోకుండా ఉండటం, బోవసులా దయతో, ధర్మశీలతతో జీవించడం. మిగతాది దేవుని చేతిలో ఉంది.  

 ప్రార్థన

ప్రభూవా, నవొమి జీవితపు  చేదు క్షణాలలో కూడా నీవు ఆమెను విడిచిపెట్టనట్లే, మా జీవితంలోని చీకటి క్షణాలలో కూడా నీవు మమ్మల్ని విడిచిపెట్టవని నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయి. రూతు చూపిన నిస్వార్థ విశ్వసనీయతను, ప్రతిఫలం ఆశించని ప్రేమను మా హృదయాలలో నాటు. బోవసు  చూపిన దయను, ధర్మశీలతను, తనకంటే ఇతరుల మేలును ముందు పెట్టే మనసును మాకు అనుగ్రహించు. మా జీవితంలోని ప్రతి "మారా" క్షణంలో, ప్రతి చేదు అనుభవంలో, నీవు తెరవెనుక నిశ్శబ్దంగా పనిచేస్తున్నావని నమ్మే ఓర్పును మాకు దయచేయి. మేము చేసే చిన్న చిన్న దయతో కూడిన  చర్యలను, చిన్న విశ్వసనీయత చర్యలను, నీ గొప్ప ప్రణాళికలో ఉపయోగించుకో. మా కుటుంబాలలో వృద్ధులను, దుర్బలులను, ఒంటరివారిని ప్రేమతో చూసుకునే హృదయాన్ని మాకు ఇవ్వు. "బయటివారు"గా, "అపరిచితులు"గా చూడబడేవారిని నీ ప్రేమతో స్వీకరించే విశాల హృదయాన్ని మాకు దయచేయి.  రూతును నీ సొంత రాజవంశంలో చేర్చుకున్నట్లే. మా జీవితంలోని ప్రతి సాధారణ దినాన్ని, ప్రతి సాధారణ కలయికను, నీ అద్భుతమైన ప్రణాళికలో భాగంగా మార్చుకో. ఆమెన్.

 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు