ఎస్తేరు: ప్రమాదకర సమయంలో ధైర్యం చూపిన స్త్రీ| కార్మెల్ శోభ
ఎస్తేరు
-
ప్రమాదకర సమయంలో ధైర్యం చూపిన స్త్రీ
పరిచయ మాట
పవిత్ర గ్రంధంలో ఎస్తేరు గ్రంథం చాలా విశేషమైనది. ఈ గ్రంథంలో దేవుని పేరు ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ప్రస్తావించబడలేదు, కానీ ప్రతి అధ్యాయంలోనూ దేవుని అదృశ్య హస్తం, ఆయన సార్వభౌమత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక అనాథ యూదయ యువతి, పరదేశంలో బానిసత్వంలో ఉన్న ప్రజల మధ్య నుండి, ప్రపంచంలోని అతి పెద్ద సామ్రాజ్యానికి రాణి అవుతుంది. ఆమె జీవితం విశ్వాసం, ధైర్యం, వినయం, జ్ఞానం మరియు దేవుని సంరక్షణ గురించి బోధిస్తుంది.
1. చారిత్రక నేపథ్యం - పారసీక సామ్రాజ్యం అహెష్వేరోషు రాజు
ఎస్తేరు గ్రంథం క్రీ.పూ. 5వ శతాబ్దంలో పారసీక సామ్రాజ్యంలో జరుగుతుంది. ఆ సమయంలో రాజు అహెష్వేరోషు
పరిపాలిస్తున్నాడు. ఇతని సామ్రాజ్యం ఇండియా నుండి ఇథియోపియా వరకు 127 రాష్ట్రాలను
కలిగి ఉండేది. అప్పటికి అదే ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన, శక్తివంతమైన సామ్రాజ్యం.
ఈ కథ మొదలయ్యేనాటికి, యూదులు తమ మాతృభూమి నుండి బబులోనియా చెరలోకి కొనిపోబడి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి.
కొందరు యూదులు యెరూషలేముకు తిరిగి వెళ్ళినప్పటికీ, చాలామంది
పారసీక సామ్రాజ్యంలోనే స్థిరపడిపోయారు. మొర్దెకయి, ఎస్తేరు వంటి వ్యక్తులు ఈ చెదిరిపోయిన
యూదుల్లో భాగంగా షూషను రాజధానిలో నివసిస్తున్నారు.
రాజు అహెష్వేరోషు తన పరిపాలన మూడవ సంవత్సరంలో షూషను కోటలో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఈ విందు తన సామ్రాజ్యంలోని అధిపతులు, సేవకులు, సైన్యాధిపతులు అందరికీ తన ఐశ్వర్యాన్ని, వైభవాన్ని ప్రదర్శించడానికి 180 రోజులపాటు కొనసాగింది. ఆ తరువాత షూషను నగర ప్రజలందరికీ ఏడు రోజుల మరో విందు ఏర్పాటు చేశాడు.
2. రాణి వష్టి తొలగింపు
విందు చివరి రోజున, రాజు అహెష్వేరోషు మద్యం సేవించి ఆనందంగా ఉన్నప్పుడు, తన రాణి వష్టిని తన
సౌందర్యాన్ని అతిథులకు ప్రదర్శించడానికి తన సన్నిధికి రావాలని ఆజ్ఞాపించాడు. కానీ
రాణి వష్టి ఈ ఆజ్ఞను తిరస్కరించింది. బహుశా అటువంటి బహిరంగ ప్రదర్శన తన గౌరవానికి
తగినది కాదని భావించి ఉండవచ్చు.
రాజు తీవ్ర కోపానికి గురయ్యాడు. తన
సలహాదారుల మాట విని, భార్యలు భర్త మాటలు వినలాని, చెప్పిన సలహాలను
అనుసరించి వష్టిని రాణి పదవి నుండి శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించాడు. ఈ
సంఘటన సామ్రాజ్యం మొత్తం ఒక చట్టంగా కూడా
ప్రకటించబడింది.
రాజు కోపం చల్లారిన తరువాత, తనకు వష్టి లేని లోటు అనుభవానికి వచ్చింది. అప్పుడు అతని సేవకులు
రాజ్యమంతటి నుండి అందమైన యువతులను తీసుకువచ్చి, వారిలో
నుండి కొత్త రాణిని ఎన్నుకోవాలని సలహా ఇచ్చారు.
మనుషుల నిర్ణయాలు, రాజకీయ మార్పులు అనేవి తరచుగా అస్థిరమైనవే. కానీ దేవుడు ఈ మానవ సంఘటనల వెనుక పనిచేస్తూ, తన ప్రజల కోసం ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. వష్టి తొలగింపు అనే సంఘటన లేకుండా ఎస్తేరు రాణి కావడం జరిగేది కాదు.
3. మొర్దెకయి మరియు ఎస్తేరు నేపథ్యం
మొర్దెకయి అనే యూదుడు షూషను రాజాస్థానంలో ఒక పెద్ద ఉద్యోగి, ఇతడు బెన్యామీను
గోత్రానికి చెందినవాడు. అతని పూర్వీకులు బబులోనియ రాజు నెబుకద్నెసరు చేత యెరూషలేము నుండి బందీలుగా
కొనిపోబడ్డారు.
మొర్దెకయికి హదస్సా అనే ఒక దగ్గరి బంధువు
(అతని పినతండ్రి కుమార్తె) ఉంది. ఆమెనే
ఎస్తేరు అని కూడా పిలిచేవారు. ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు, ఆమె తండ్రి, తల్లి
ఇద్దరూ చనిపోయారు. అనాథురాలైన ఎస్తేరును మొర్దెకయి తన స్వంత కుమార్తెగా పెంచి పోషించాడు.
పవిత్ర గ్రంధం ఎస్తేరు గురించి "ఆమె రూపవతి" అని వర్ణిస్తుంది. కానీ ఆమె సౌందర్యం మాత్రమే కాదు, ఆమె స్వభావం, వినయం, విధేయత కూడా ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
ఎస్తేరు జీవితం ప్రారంభంలోనే కష్టాలతో నిండి ఉంది. తల్లిదండ్రులు లేని అనాథ, పరదేశంలో నివసిస్తున్న బానిస జాతికి చెందినది. కానీ దేవుడు ఆమె పరిస్థితులను చూసి ఆమెను తోసిపుచ్చలేదు. మన గతం, మన పరిస్థితులు ఎంత కష్టమైనవైనా, దేవుడు వాటిని మన భవిష్యత్తు కోసం ఉపయోగించుకోగలడు. అలాగే, మొర్దెకయి చూపిన బాధ్యత, ప్రేమ కూడా ఇక్కడ ముఖ్యమైనవి. కుటుంబ బాధ్యతలను స్వీకరించడం దేవుని దృష్టిలో గొప్ప విలువ కలిగినది.
4. ఎస్తేరు రాణిగా ఎన్నికవడం
రాజు కొత్త రాణిని ఎన్నుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రక్రియలో భాగంగా, సామ్రాజ్యం నలుమూలల నుండి అందమైన కన్యలను షూషను కోటకు తీసుకువచ్చారు. ఎస్తేరు కూడా వారిలో ఒకరిగా ఎంపిక చేయబడింది. మొర్దెకయి, ఎస్తేరుకు తాను యూదు జాతికి చెందినదని ఎవరికీ చెప్పవద్దని ఆదేశించాడు. ఎందుకంటే ఆ కాలంలో యూదులు అనేక ప్రాంతాలలో ద్వేషానికి, వివక్షకు గురయ్యేవారు. ఎస్తేరు ఈ ఆజ్ఞను జాగ్రత్తగా పాటించింది.
రాజభవనంలో స్త్రీలను జాగ్రత్తగా చూసుకునే హేగాయి అనే అధికారి బాధ్యతలో, ఎస్తేరు ఇతర స్త్రీలందరి కంటే అతని దయను, అనుగ్రహాన్ని పొందింది. ఈ ప్రక్రియ మొత్తం ఒక సంవత్సరం పాటు కొనసాగింది. ఆరు నెలలు గంధపు నూనెతో, ఆరు నెలలు సుగంధ ద్రవ్యాలతో సౌందర్య చికిత్సలు జరిగాయి.
చివరకు, రాజు అహెష్వేరోషు తన పరిపాలన ఏడవ సంవత్సరం, పదవ నెలలో ఎస్తేరును తన సన్నిధికి పిలిపించాడు. రాజు ఎస్తేరును ఇతర స్త్రీల కంటే ఎక్కువగా ప్రేమించాడు. అతను ఆమె తలపై రాజ కిరీటాన్ని పెట్టి, వష్టి స్థానంలో ఆమెను రాణిగా చేశాడు. ఈ సందర్భంగా రాజు ఒక గొప్ప విందును కూడా ఏర్పాటు చేశాడు. దీనిని "ఎస్తేరు విందు" అని పిలిచారు.
ఇదంతా జరుగుతున్నప్పటికీ, ఎస్తేరు తన కుటుంబ నేపథ్యాన్ని, జాతిని
గోప్యంగా ఉంచింది. మరోవైపు, మొర్దెకయి ప్రతిరోజూ రాజభవన ద్వారం వద్దకు వచ్చి ఎస్తేరు
యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉండేవాడు.
ఎస్తేరు అనూహ్యమైన స్థానానికి చేరుకున్నప్పటికీ, తన వినయాన్ని, తన సంరక్షకుడి పట్ల విధేయతను కోల్పోలేదు. గొప్ప స్థానంలో ఉన్నప్పుడు కూడా వినయంగా, జ్ఞానంతో ప్రవర్తించడం ఆమె ముఖ్యమైన లక్షణం. దేవుడు మనలను ఎత్తైన స్థానాలకు తీసుకువెళ్ళినప్పుడు, అది మన స్వార్థం కోసం కాదు. ఒక పెద్ద ఉద్దేశం కోసమని మనం గుర్తుంచుకోవాలి.
5. రాజు హత్య కుట్రను బయటపెట్టిన మొర్దెకయి
ఎస్తేరు రాణి అయిన తరువాత, ఒకరోజు మొర్దెకయి రాజభవనం ద్వారం వద్ద సేవకులతో ఉన్నప్పుడు, రాజు
ద్వారపాలకులైన బిగ్తాను, తెరెషు అనే ఇద్దరు అధికారులు రాజుపై
కోపంతో, అతనిని హత్య చేయాలని కుట్ర
పన్నుతున్నట్లు విన్నాడు. మొర్దెకయి వెంటనే ఈ విషయాన్ని ఎస్తేరుకు తెలియజేశాడు,
ఎస్తేరు దీనిని రాజుకు మొర్దెకయి పేరు మీదుగా తెలియజేసింది.
రాజు విచారణ జరిపి ఈ విషయం నిజమని
తేలడంతో, ఆ ఇద్దరు అధికారులను ఉరితీశారు. ఈ సంఘటన
రాజ్య చరిత్ర పుస్తకంలో లిఖించబడింది. మొర్దెకయి చేసిన ఈ మేలు అధికారికంగా నమోదు చేయబడింది.
అయితే, ఈ మేలుకు తగిన ప్రతిఫలం వెంటనే ఇవ్వబడలేదు. ఇది తరువాత కథలో అత్యంత కీలకమైన మలుపుగా
మారుతుంది.
ఇక్కడ దేవుని సంరక్షణ చాలా సూక్ష్మంగా ఉన్న శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ చిన్న సంఘటన, రాజ్య చరిత్ర పుస్తకంలో లిఖించబడటం, భవిష్యత్తులో మొత్తం యూదు జాతి విమోచనకు కీలకమైన మలుపుగా మారుతుంది. దేవుడు మనం చేసే మంచి పనులను ఎప్పుడూ మరచిపోడు, తగిన సమయంలో వాటిని ఉపయోగించుకుంటాడు.
6. హామాను ఎదుగుదల మరియు అతని గర్వం
ఈ సంఘటనల తరువాత, రాజు అహెష్వేరోషు హామాను అనే వ్యక్తిని, అగాగీయుడైన హమ్మెదాతా కుమారుడిని తన అధిపతులందరిలో అత్యున్నత స్థానములో ఉంచాడు. రాజు ఆజ్ఞ ప్రకారం, రాజభవన ద్వారం వద్ద ఉన్న సేవకులందరూ హామాను ఎదుట మోకరిల్లి నమస్కరించాలి.
కానీ మొర్దెకయి హామానుకు నమస్కరించడానికి నిరాకరించాడు. మొర్ధేకయి దేవునికి తప్ప ఎవరికి మోకరించడానికి ఇష్టపడడు. కాని హమాను అగాగీయుడు కావడం గమనార్హం. అగాగు అమాలేకీయుల రాజు, మరియు అమాలేకీయులు చరిత్రలో ఇశ్రాయేలీయులకు శత్రువులు. యూదుడు నాకు మోకరించడం లేదని అతని మీద ద్వేషం పెంచుకున్నాడు.
హామాను దీనిని చూసి తీవ్ర కోపానికి
గురయ్యాడు. మొర్దెకయి ఒక్కడినే శిక్షించడం
సరిపోదని భావించి, మొత్తం యూద జాతినంతటినీ నాశనం చేయాలని
నిర్ణయించుకున్నాడు.
మొర్దెకయి తన మనస్సాక్షికి, తన విశ్వాసానికి కట్టుబడి ఉండటం, పెద్ద ప్రమాదానికి దారితీసింది. ఇది మనకు నేర్పే పాఠం ఏమిటంటే, సత్యానికి, నీతికి కట్టుబడి ఉండటం కొన్నిసార్లు మనల్ని కష్టాల్లోకి నెట్టవచ్చు, కానీ దేవుడు తన ప్రజలను ఎన్నటికీ విడిచిపెట్టడు.
7. హామాను కుట్ర - యూదులను నిర్మూలించే ప్రణాళిక
హామాను తన కోపాన్ని అమలు చేయడానికి ఒక భయంకరమైన ప్రణాళిక వేశాడు. అతను చీటీలు వేయడం ద్వారా యూదులను నాశనం చేయడానికి అనుకూలమైన తేదీని నిర్ణయించాడు అదర్ మాసం (పన్నెండవ నెల) పదమూడవ రోజు.
తరువాత హామాను రాజు వద్దకు వెళ్లి, మీ రాజ్యమంతటా చెదిరిపోయి ఉన్న ఒక జాతి ప్రజలు ఉన్నారు, వారి చట్టాలు మిగతా అందరి కంటే భిన్నంగా ఉంటాయి, వారు రాజు చట్టాలను పాటించరు, కాబట్టి వారిని బతకనివ్వడం రాజుకు ప్రయోజనకరం కాదని చెప్పాడు. అతను రాజును ఒప్పించి, యూదులందరినీ పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరినీ, ఒక్కరోజులో చంపి, వారి ఆస్తిని దోచుకోవాలనే శాసనం జారీ చేయించాడు. దీనికి ప్రతిఫలంగా అతను రాజ ఖజానాకు భారీ మొత్తంలో వెండిని కూడా ఇవ్వజూపాడు.
రాజు తన ఉంగరాన్ని హామానుకు ఇచ్చాడు,
దాంతో ఈ శాసనం రాజు అధికారంతో సామ్రాజ్యం నలుమూలలకు పంపబడింది. ఈ
శాసనం చదివిన షూషను నగరం మొత్తం కలవరపడింది, కానీ
రాజు, హామాను మాత్రం కూర్చొని మద్యం సేవిస్తూ ఉన్నారు.
ఇక్కడ మనం చూసేది మనుషులు ఎంత పెద్ద కుట్రలు పన్నినా, దేవుని ప్రణాళికను తారుమారు చేయలేరు.
8. మొర్దెకయి దుఃఖం మరియు ఎస్తేరుకు వర్తమానం
ఈ శాసనం గురించి తెలుసుకున్న మొర్దెకయి తన బట్టలు చించుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పూసుకొని, నగరం మధ్యలోకి వెళ్లి బిగ్గరగా, బాధాకరంగా విలపించాడు. అతను రాజభవన ద్వారం వరకు వెళ్లాడు, కానీ గోనెపట్ట ధరించిన వారెవరూ రాజద్వారం లోపలికి వెళ్లడానికి అనుమతి లేదు. ప్రతి రాష్ట్రములో కూడా యూదులు ఈ శాసనం గురించి తెలుసుకుని గొప్ప దుఃఖంతో, ఉపవాసంతో, ఏడుపుతో, గోనెపట్ట కట్టుకొని దుఃఖించారు.
ఎస్తేరు దాసీలు, నపుంసకులు ఆమెకు మొర్దెకయి పరిస్థితి గురించి తెలియజేశారు. ఎస్తేరు తీవ్రంగా కలవరపడి, మొర్దెకయి బట్టలు పంపింది, అతను గోనెపట్ట తీసివేయాలని కోరింది. కానీ మొర్దెకయి వాటిని తీసుకోలేదు.
అప్పుడు ఎస్తేరు హతాకు అనే తన నమ్మకమైన
సేవకుడిని మొర్దెకై వద్దకు పంపి, అసలు విషయం ఏమిటో తెలుసుకోమని కోరింది.
మొర్దెకయి హతాకుకు జరిగినదంతా
వివరించాడు, హామాను రాజుకు ఇవ్వజూపిన వెండి మొత్తం
గురించి కూడా చెప్పాడు. అంతేకాక, ఈ శాసనం ప్రతిని కూడా ఇచ్చి, దానిని ఎస్తేరుకు చూపించమని, ఆమె రాజు వద్దకు
వెళ్లి తన ప్రజల కోసం విన్నపం చేయాలని కోరమని చెప్పాడు.
మొర్దెకయి చూపిన ఈ దుఃఖం, ఈ ఆందోళన మనకు తెలిపేది ఏమిటంటే, తన ప్రజల పట్ల అతనికున్న ప్రేమ, బాధ్యత. ఈ కష్ట సమయంలో అతను తనకై తాను ఏమీ చేయలేని స్థితిలో, తన బంధువు ఎస్తేరు ద్వారా జోక్యం చేసుకోవాలని ప్రయత్నించాడు. ఇది మనకు నేర్పేది. కష్ట సమయాల్లో మనం మౌనంగా ఉండకూడదు, దేవుడు మనకు ఇచ్చిన మార్గాలను, సంబంధాలను ఉపయోగించి పరిష్కారం కోసం ప్రయత్నించాలి.
9. "ఇలాంటి సమయం కోసమే" మొర్దెకయి సవాలు
ఎస్తేరు హతాకు ద్వారా మొర్దెకయికి ఒక కష్టమైన సమాధానం పంపింది, రాజు పిలవకుండా ఎవరైనా అంతఃపురంలోకి వెళ్తే, రాజు తన బంగారు రాజదండాన్ని చాచకపోతే, వారికి మరణశిక్ష విధించబడుతుందని, ఈ చట్టం రాజ్యంలో అందరికీ తెలుసునని, తనను రాజు పిలిచి ముప్పై రోజులు అయిందని ఆమె వివరించింది. ఇది ఎస్తేరుకు నిజంగా ప్రాణాంతకమైన ప్రమాదం. ఆమె తన స్వంత ప్రాణాన్ని పణంగా పెట్టవలసిన పరిస్థితి. అప్పుడు మొర్దెకయి ఎస్తేరుకు బైబుల్‌లోని అత్యంత శక్తివంతమైన సందేశాలలో ఒకటి పంపాడు. ఈ మాటలు ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం, 13-14 వచనాలలో నమోదు చేయబడ్డాయి.
"అతడు ఈ క్రింది ప్రతి సందేశమును పంపెను: “నీవు సురక్షితముగా రాజసౌధమున ఉన్నంత మాత్రమున యూదులలో నీవు ఒక్కదానవే తప్పించుకో గలవని భావింపవలదు. ఇట్టి తరుణమున నీవు నోరు కదపవేని యూదులకు మరియొక దిశనుండి రక్షణము లభించితీరును. కాని నీవు తప్పకచత్తువు. నీ కుటుంబము పేరును మాసిపోవును. అయినను ఇప్పుడు నీవు రాణివైనది ఇట్టి గడ్డుకాలమున మమ్ము ఆదుకొనుటకేనేమో ఎవరు ఎరుగుదురు?'."
ఈ మాటలు రెండు లోతైన సత్యాలను వెల్లడిస్తాయి:
1. దేవుని ప్రజలను రక్షించే ప్రణాళిక
ఎస్తేరు మీద మాత్రమే ఆధారపడి లేదు. దేవుడు మరో మార్గం ద్వారానైనా తన ప్రజలను రక్షిస్తాడు.
2. కానీ ఎస్తేరు తనకు ఇవ్వబడిన ఈ ప్రత్యేక
అవకాశాన్ని, ఈ ప్రత్యేక స్థానాన్ని ఉపయోగించకపోతే,
ఆమె స్వయంగా నష్టపోతుంది.
“ఇట్టి గడ్డుకాలమున మమ్ము ఆదుకొనుటకేనేమో” లేక "ఇలాంటి సమయం కోసమే" అనే ఈ మాట పవిత్ర గ్రంధంలో అత్యంత ప్రసిద్ధమైన వాక్యాలలో ఒకటిగా మారింది. ఇది మనకు బోధించేది, దేవుడు మనలను ప్రత్యేక సమయాలలో, ప్రత్యేక స్థానాల్లో ఉంచుతాడు, అది కేవలం మన సౌకర్యం కోసం కాదు, ఒక ఉన్నత ఉద్దేశం కోసం. మనం జీవితంలో ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, అది దేవుడు మనకు ఇచ్చిన ఒక బాధ్యత, ఒక అవకాశం అని గుర్తించాలి.
10. ఎస్తేరు నిర్ణయం - ఉపవాసం మరియు ధైర్యం
ఈ సవాలుకు ఎస్తేరు స్పందించిన తీరు ఆమె గొప్పతనమును వెల్లడిచేస్తుంది. ఆమె మొర్దెకయికి ఇలా సమాధానం పంపింది.
“నీవు వెళ్ళి షూషను నగరములోని యూదులనెల్ల ప్రోగుచేయుము. మీరెల్లరు ఉపవాస ముండి నా కొరకు ప్రార్థనచేయుడు. మూడునాళ్ళ పాటు రేయింబవళ్లు ఏమి ముట్టుకొనక కటిక ఉపవాసముండుడు. నా దాసీ జనము, నేను అదే రీతిని ఉపవసింతుము. మూడు నాళ్ళు కడచిన పిదప రాజ శాసనమును గూడ ధిక్కరించి నేనతని సన్నిధికి వెళ్లెదను. అందుకుగాను నేను చావ వలసి వచ్చినచోచత్తును."
ఈ మాటలలో " నేను చావ వలసి వచ్చినచోచత్తును." అనేది ఎస్తేరు ధైర్యానికి, ఆమె త్యాగానికి పరాకాష్ట. ఆమె తన ప్రజల కోసం, తన విశ్వాసం కోసం, తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడింది. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎస్తేరు వెంటనే చర్యకు దిగలేదు. ఆమె మొదట మూడు రోజుల ఉపవాసాన్ని కోరింది. తనకోసం మాత్రమే కాదు, షూషనులోని యూదులందరూ కూడా తనతో పాటు ఉపవాసం ఉండాలని కోరింది. ఇది ఆమె దేవునిపై ఆధారపడటాన్ని, ప్రార్థన మరియు సమాజ మద్దతు యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఆమె తన సొంత తెలివితేటలపైనో, తన అందంపైనో ఆధారపడలేదు. ఆమె దేవుని సహాయాన్ని కోరింది.
ఇది ఎస్తేరు విశ్వాసానికి కేంద్ర బిందువు. నిజమైన ధైర్యం భయం లేకపోవడం కాదు. భయం ఉన్నప్పటికీ సరైనది చేయడం. ఎస్తేరుకు భయం ఉండి ఉండవచ్చు, కానీ ఆమె ఆ భయాన్ని ప్రార్థన, ఉపవాసం ద్వారా దేవునికి అప్పగించి, తన బాధ్యతను నెరవేర్చడానికి ముందుకు సాగింది. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు దేవుని సన్నిధిలో సమయం గడపడం, సమాజ ప్రార్థనా, మద్దతు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఇది మనకు చూపిస్తుంది.
11. రాజు సన్నిధిలో ఎస్తేరు
మూడు రోజుల ఉపవాసం తరువాత, ఎస్తేరు తన రాణి వస్త్రాలు ధరించి, రాజ సభాభవనం ఎదుట నిలబడింది. రాజు తన సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. ఎస్తేరు తన ప్రాణాన్ని పణంగా పెట్టిన క్షణం ఇది. రాజు ఎస్తేరును చూసినప్పుడు, ఆమెపై అనుగ్రహం చూపి, తన బంగారు రాజదండాన్ని ఆమె వైపు చాచాడు. ఇది ఆమెకు ప్రాణరక్షణను సూచించింది. ఎస్తేరు దగ్గరకు వచ్చి రాజదండం కొనను తాకింది.
రాజు ఆమెను "ఎస్తేరు
రాణీ, నీకేమి కావాలి? నీ మనవి ఏమిటి? రాజ్యంలో
సగం వరకైనా నీకిస్తాను" అని అన్నాడు. కానీ ఎస్తేరు వెంటనే తన అసలు అభ్యర్థనను
వెల్లడించలేదు. బదులుగా, ఆమె రాజును, హామానును
తాను ఏర్పాటు చేసిన ఒక విందుకు ఆహ్వానించింది.
ఎస్తేరు చూపిన జ్ఞానం, వ్యూహాత్మక ఆలోచన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తొందరపడలేదు. సరైన సమయం కోసం, సరైన వేదిక కోసం వేచి ఉంది. ధైర్యం అంటే అజాగ్రత్తగా ముందుకు దూకడం కాదు, జ్ఞానంతో, వివేకంతో అడుగులు వేయడం అని ఈ సన్నివేశం మనకు నేర్పుతుంది.
12. విందులు
ఎస్తేరు ఏర్పాటు చేసిన మొదటి విందులో, రాజు మళ్లీ ఆమెను ఆమె కోరిక ఏమిటని అడిగాడు. ఎస్తేరు మళ్లీ తన అభ్యర్థనను వాయిదా వేసి, మరుసటి రోజు మరో విందుకు రాజును, హామానును ఆహ్వానించింది.
ఈ మధ్యలో, హామాను
తన ఇంటికి వెళ్లి, తన స్నేహితులకు, భార్యకు
తన ఐశ్వర్యం గురించి, రాణి ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు
తనను మాత్రమే ఆహ్వానించడం గురించి గొప్పగా చెప్పుకున్నాడు. కానీ అతను మరొక విషయం కూడా చెప్పాడు. అది ఏమిటంటె మొర్దెకయి అనే యూదుడు రాజద్వారం వద్ద కూర్చొని నాకు
నమస్కరించనంత వరకు ఇదంతా నాకు ఏమీ సంతృప్తినివ్వదనే విషయాన్ని తెలియపరిచాడు. అతని
భార్య, స్నేహితులు 50 మూరల ఎత్తు ఉరికొయ్యను తయారు చేయించి,
రాజు అనుమతితో మొర్దెకయిని దానిపై ఉరితీయించమని అతనికి ఒక సలహా
ఇచ్చారు. హామాను ఈ సలహాను ఇష్టపడి, వెంటనే ఉరికొయ్య తయారీకి ఆజ్ఞాపించాడు.
హామాను గర్వం, ద్వేషం అతనిని గుడ్డిగా చేశాయి. అతను తన సొంత పతనానికి తానే బాటలు వేసుకుంటున్నాడని అతనికి తెలియదు. ఇది మనకు ఒక హెచ్చరిక. గర్వం, ద్వేషం మనలను నాశనం వైపు నడిపిస్తాయి. అదే సమయంలో, ఎస్తేరు ఓపిక, జ్ఞానం, ఆమె రెండు విందుల ద్వారా సరైన సమయం కోసం వేచి ఉండటం. దేవుని ప్రణాళిక పరిపూర్ణంగా అమలు కావడానికి అవకాశం ఇచ్చింది.
13. రాజు నిద్రలేమి రాత్రి - దేవుని సంరక్షణ అద్భుత క్షణం
అదే రాత్రి, రాజుకు
నిద్ర పట్టలేదు. ఇది కాకతాళీయం అనిపించినా, ఇది
కథలో అత్యంత కీలకమైన మలుపు. నిద్ర రాకపోవడంతో, రాజు
తన రాజ కార్యక్రమాల చరిత్ర పుస్తకాన్ని (chronicles)
తనకు చదివి వినిపించమని ఆజ్ఞాపించాడు.
చదువుతున్న క్రమంలో, మొర్దెకయి గతంలో రాజును హత్య చేయాలనుకున్న ఇద్దరు అధికారుల కుట్రను బయటపెట్టిన సంఘటన వచ్చింది. అప్పుడు రాజు "ఈ మేలుకు మొర్దెకయికి ఏమి గౌరవం, బహుమానం ఇవ్వబడింది?" అని అడిగాడు. "అతనికి ఏమీ ఇవ్వబడలేదు" అని సేవకులు సమాధానమిచ్చారు.
సరిగ్గా ఆ సమయంలోనే, హామాను రాజభవనములో ఉన్నాడు. మొర్దెకైని ఉరితీయడానికి రాజు అనుమతి కోరడానికి అతను వచ్చి ఉంటాడు. రాజు హామానును లోపలికి పిలిపించి అడిగాడు, "రాజు గౌరవించాలనుకునే వ్యక్తికి ఏమి చేయాలి?" అని అడిగాడు. హామాను ఇది తన గురించే అని అనుకుని, ఒక అద్భుతమైన సత్కారాన్ని సూచించాడు. రాజ వస్త్రాలు ధరింపజేసి, రాజు స్వయంగా స్వారీ చేసే గుర్రంపై ఎక్కించి, నగర వీధుల్లో ఊరేగించాలని చూచించాడు.
రాజు హామానుతో, నీవు చెప్పినట్లే చేసి,
మొర్దెకయికి ఈ గౌరవం ఇవ్వమని
అజ్ఞాపించాడు. హామాను దిగ్భ్రాంతికి
గురయ్యాడు, కానీ రాజాజ్ఞను ధిక్కరించలేక, తానే స్వయంగా మొర్దెకైని నగర వీధుల్లో ఊరేగించవలసి వచ్చింది. దీని తరువాత
అతడు అవమానంగా భావించి, ఇంటికి వెళ్ళాడు.
రాజుకు ఆ రాత్రి నిద్ర పట్టకపోవడం ఆ సంఘటన చదవబడటం, సరిగ్గా ఆ సమయంలో హామాను రావడం, ఇవన్నీ యాదృచ్ఛికం కావు. దేవుడు తెరవెనుక ప్రతి వివరాన్ని నియంత్రిస్తున్నాడు. మన జీవితంలో కూడా, యాదృచ్ఛికమని అనిపించే సంఘటనలు వాస్తవానికి దేవుని ప్రణాళికలో భాగం కావచ్చు.
14. రెండవ విందులో ఎస్తేరు నిజం వెల్లడించడం
మొర్దెకయిని ఊరేగించిన తరువాత, హామాను అవమానకరంగా తలవంచుకుని దుఃఖంతో ఇంటికి వెళ్ళాడు. అతను తన భార్యకు, స్నేహితులకు జరిగినది చెప్పగా, వారు అతనికి హెచ్చరిస్తు, "నీవు మొర్దెకయికి లొంగిపోయితివి. అతడు యూదుడు. నీవు అతనిని గెలువజాలవు. అతడు నిన్ను ఓడించితీరును" అని అన్నారు. ఈ మాటలు పూర్తి కాకముందే, రాజు నపుంసకులు హామానును ఎస్తేరు ఏర్పాటు చేసిన రెండవ విందుకు తీసుకువెళ్లడానికి వచ్చారు.
ఈ విందులో, రాజు
మూడవసారి ఎస్తేరును అడిగాడు, "నీ మనవి ఏమిటి? రాజ్యంలో
సగం వరకైనా ఇస్తాను" అని ఆమెతో అన్నాడు. అప్పుడు ఎస్తేరు సమయం వచ్చిందని
గ్రహించి, ధైర్యంగా తన హృదయంలోని నిజాన్ని
వెల్లడించింది,
" నేను ప్రభువుల వారి అనుగ్రహమును నోచుకొంటినేని నా మనవిని ఆలకింపుడు. తమరు నా ప్రాణములను, మా ప్రజల ప్రాణములను కాపాడ వేడెదను.నాకు మా ప్రజలకు చావు దాపురించినది. మేమెల్లరము సర్వనాశనము కానున్నాము. మేము ఏ బానిసలముగానో అమ్ముడుబోయినచో, నేనిపుడు నోరు కదిపెడిదాననుకాను. కాని ఇప్పుడు మాకు పట్టిన దుర్గతివలన ఏలికకు కలుగబోవు నష్టమును మా విరోధికూడ పూరింపజాలడు” అని చెప్పింది.
రాజు దిగ్భ్రాంతికి గురై, ఇది ఎవరు చేశారు? ఇలా చేయడానికి తెగించినవాడు ఎక్కడ ఉన్నాడు? అని అడిగాడు. ఎస్తేరు నేరుగా చూపుడు వేలుతో చూపిస్తూ చెప్పింది, " మా శత్రువు, మా హింసకుడు ఎవరో కాదు. ఈ దుష్టాత్ముడైన హామానే!" అని చెప్పింది.
హామాను అప్పుడు రాజు, రాణి ఎదుట భయంతో వణికిపోయాడు. రాజు తీవ్ర కోపంతో తోటలోకి వెళ్లగా, హామాను పడుక మీద పడి, ఎస్తేరు వద్ద తన ప్రాణభిక్ష కోసం వేడుకున్నాడు. రాజు తిరిగి వచ్చినప్పుడు, హామాను ఎస్తేరు పడుక మీద పడి ఉండటం చూసి మరింత కోపగించుకున్నాడు. రాజు, వీడు నా యింటనే నాయెదుటనే నా రాణిని బలవంతము చేయునాయేమి? అని అన్నాడు. వెంటనే హామాను ముఖం కప్పబడింది, అది మరణశిక్షకు సంకేతం.
అప్పుడు రాజు సేవకులలో ఒకడు, హామాను మొర్ధేకయి కోసం తయారు చేయించిన 50 మూరల ఉరికొయ్య గురించి రాజుకు తెలియజేశాడు. "అతనినే దానిపై ఉరితీయండి!" అని రాజు ఆజ్ఞాపించాడు హామాను తానే మొర్దెకయి కోసం తయారు చేయించిన ఉరికొయ్యపైనే ఉరితీయబడ్డాడు.
"ఎవరైతే ఇతరుల కోసం గొయ్యి తవ్వుతారో, వారే ఆ గొయ్యిలో పడతారు" అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ అది తప్పకుండా జరుగుతుంది. ఎస్తేరు తన సరైన సమయం కోసం వేచి ఉండటం, తగిన సమయంలో ధైర్యంగా నిజం మాట్లాడటం. ఈ రెండు లక్షణాలు కలిసి విజయాన్ని తెచ్చాయి.
15. మొర్దెకయికి ఉన్నత స్థానం, యూదుల రక్షణ కోసం రెండవ శాసనం
హామాను మరణించిన తరువాత, రాజు హామాను ఇంటిని, ఆస్తిని ఎస్తేరుకు ఇచ్చాడు. ఎస్తేరు తనకు మొర్దెకయి బంధువు అని రాజుకు తెలియజేసింది, రాజు తన ఉంగరాన్ని, గతంలో హామానుకు ఇచ్చినది. మొర్దెకయికి ఇచ్చాడు. ఎస్తేరు మొర్దెకయిని హామాను ఆస్తిపై అధికారిగా నియమించింది.
అయితే, హామాను జారీ చేయించిన యూదులను నిర్మూలించే శాసనం ఇంకా అమలులోనే ఉంది. పారసీక చట్టం ప్రకారం, రాజు ఉంగరంతో ముద్రించబడిన శాసనాన్ని రద్దు చేయడం సాధ్యం కాదు. ఎస్తేరు మళ్లీ రాజు ఎదుట కన్నీళ్లతో మోకరిల్లి, ఈ దుష్ట శాసనాన్ని ఆపడానికి ఏదైనా మార్గం చూపమని వేడుకుంది.
రాజు ఎస్తేరుకు, మొర్దెకయికి, తమకు అనుకూలమైన మరో శాసనాన్ని రాజు పేరు మీద, రాజు ఉంగరంతో ముద్రించి పంపే అధికారం ఇచ్చాడు. మొర్దెకయి వెంటనే లేఖకులను పిలిపించి, సామ్రాజ్యంలోని 127 రాష్ట్రాలకు, వారి వారి భాషలలో ఒక కొత్త శాసనాన్ని పంపించాడు. యూదులు తమను తాము రక్షించుకోవడానికి, తమపై దాడి చేసేవారిని ఎదిరించి, చంపే హక్కు వారికి ఇవ్వబడింది.
ఈ శాసనం అదర్ మాసం, 13వ రోజు అమలులోకి రావాల్సి ఉంది. సరిగ్గా హామాను నిర్ణయించిన అదే రోజు. ఇది యూదులకు ఎదురుదాడి చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది.
మొర్దెకయి రాజ వస్త్రాలు ధరించి, రాజు
సన్నిధి నుండి బయటకు వచ్చినప్పుడు, షూషను నగరం ఆనందంతో, సంతోషధ్వనులతో నిండిపోయింది. యూదులకు వెలుగు, సంతోషం,
ఆనందం, గౌరవం లభించాయి. ప్రతి రాష్ట్రంలో,
ప్రతి నగరంలో యూదులు ఆనందించారు, విందు
చేసుకున్నారు.
దేవుడు మనం చేసిన తప్పులను, మన గత నిర్ణయాలను పూర్తిగా చెరిపివేయకపోవచ్చు (ఇక్కడ మొదటి శాసనాన్ని రద్దు చేయలేకపోయారు), కానీ ఆయన కొత్త మార్గాలను, కొత్త పరిష్కారాలను చూపించగలడు. మన జీవితంలో కూడా, గతంలో జరిగిన నష్టాలను పూర్తిగా తుడిచివేయలేకపోయినా, దేవుడు వాటిని అధిగమించే మార్గాన్ని చూపిస్తాడు.
16. యూదుల విజయం మరియు పూరీము పండుగ స్థాపన
అదర్ మాసం 13వ రోజు వచ్చినప్పుడు, యూదులను ద్వేషించేవారు. వారిపై దాడి చేయాలని ఆశించారు, కానీ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. యూదులు తమను తాము రక్షించుకుంటూ, తమపై ద్వేషంతో దాడి చేయాలనుకున్నవారిని ఓడించారు. షూషను కోటలోనే యూదులు 500 మందిని, హామాను పదిమంది కుమారులను కూడా చంపారు. రాజు అభ్యర్థన మేరకు, ఎస్తేరు మరో రోజు కూడా ఈ రక్షణ చర్యను కొనసాగించమని కోరింది, తద్వారా షూషనులో మరో 300 మంది కూడా చంపబడ్డారు. సామ్రాజ్యం అంతటా యూదులు 75,000 మంది తమ శత్రువులను ఓడించారు. అయితే గమనించదగ్గ విషయం, ఏమిటంటె యూదులు ఎక్కడా ఆస్తిని దోచుకోలేదు, తమ ప్రాణాలను రక్షించుకోవడానికి మాత్రమే పోరాడారు.
ఈ విజయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మొర్దెకయి, ఎస్తేరు కలిసి అదర్ మాసంలోని 14, 15 తేదీలను శాశ్వతంగా జరుపుకోవాలని శాసనం జారీ చేశారు. ఈ పండుగకు "పూరీము" అనే పేరు పెట్టారు. హామాను యూదులను నాశనం చేయడానికి వేసిన "పూర్" (చీటీలు/లాటరీ) నుండి ఈ పేరు వచ్చింది. ఈ రోజులలో యూదులు విందులు చేసుకోవాలని, ఆనందించాలని, ఒకరికొకరు కానుకలు ఇచ్చుకోవాలని, పేదలకు దానం చేయాలని నిర్దేశించారు.
ఈ పండుగ నేటికీ యూదులు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత పురాతనమైన, నిరంతరాయంగా జరుపుకుంటున్న పండుగలలో ఒకటి.
దుఃఖం ఆనందంగా, భయం ధైర్యంగా, విషాదం విజయంగా మారిన ఈ కథ, దేవుని రక్షణను జ్ఞాపకం ఉంచుకోవడం, కృతజ్ఞత చూపడం ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది. మనం పొందిన విమోచనలను, రక్షణలను మరచిపోకుండా, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, భవిష్యత్ తరాలకు కూడా తెలియజేయాలి.
17. మొర్దెకయి ఉన్నత స్థానం - ముగింపు
ఎస్తేరు గ్రంథం చివరిలో, మొర్దెకయి రాజు తరువాత రెండవ స్థానానికి ఎదిగినట్లు తెలుస్తుంది. అతను యూదుల మేలు కోసం, తన జాతి శ్రేయస్సు కోసం పనిచేసిన గొప్ప నాయకుడిగా పేర్కొనబడ్డాడు. అతను తన ప్రజలందరి పక్షాన మాట్లాడేవాడు, వారి క్షేమాన్ని కోరేవాడు.ఇలా, ఒక అనాథ యువతి, ఆమెను పెంచిన బంధువు, వీరిద్దరూ కలిసి, దేవుని చేతిలో సాధనాలుగా ఉపయోగపడి, ఒక జాతి మొత్తాన్ని నాశనం నుండి రక్షించారు.
18. ఎస్తేరు విశ్వాసం - విశ్లేషణ
ఎస్తేరు గ్రంథంలో దేవుని పేరు ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించదు అనేది ఆసక్తికరమైన విషయం. కానీ ఇది ఎస్తేరు విశ్వాసం లేకపోవడాన్ని సూచించదు, బదులుగా, ఇది దేవుడు ఎప్పుడూ, ప్రతిచోటా, కనిపించకుండానే పనిచేస్తాడని చూపిస్తుంది. ఎస్తేరు విశ్వాసం ఈ క్రింది లక్షణాల ద్వారా వ్యక్తమవుతుంది.
1. విధేయత: ఎస్తేరు తన చిన్నతనం నుండి మొర్దెకయి మాటలను గౌరవించి పాటించింది. రాణి అయిన తరువాత కూడా ఆమె ఈ విధేయతను కొనసాగించింది.
2. వినయం: గొప్ప అందం, గొప్ప స్థానం ఉన్నప్పటికీ, ఎస్తేరు ఎప్పుడూ గర్వించలేదు. ఆమె తన స్థానాన్ని ఇతరుల సేవ కోసం ఉపయోగించింది.
3. ప్రార్థన మరియు ఉపవాసం: పెద్ద నిర్ణయం తీసుకునే ముందు, ఎస్తేరు దేవుని సహాయాన్ని కోరింది. ఉపవాసం ద్వారా, సమాజ మద్దతు ద్వారా దేవుని మార్గంలో సాగింది.
4. ధైర్యం: "చావ వలసి వచ్చినచోచత్తును " అనే మాటలు ఆమె ధైర్యానికి పరాకాష్ట. ఆమె తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడింది.
5. జ్ఞానం మరియు వ్యూహం: ఆమె తొందరపడకుండా, సరైన సమయం కోసం వేచి, జ్ఞానంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
6. నిస్వార్థత: ఆమె తన సొంత భద్రత కోసం కాకుండా, తన ప్రజల రక్షణ కోసం పోరాడింది.
19. ఎస్తేరు జీవితం నుండి మనం నేర్చుకోగల ముఖ్యమైన పాఠాలు
1. దేవుడు తాను ఎన్నుకొన్న వారి ద్వారా పనిచేస్తాడు
ఎస్తేరు గ్రంథంలో దేవుని పేరు కనిపించకపోయినా, ప్రతి సంఘటనలో ఆయన హస్తం స్పష్టంగా కనిపిస్తుంది. వష్టి రాణి తొలగింపు నుండి, ఎస్తేరు రాణి కావడం వరకు, రాజు నిద్రలేమి వరకు ఇది స్పష్టంగా కనపడుతుంది. మన జీవితంలో కూడా, దేవుడు ఎప్పుడూ ప్రత్యక్షంగా కనిపించకపోయినా, ఆయన మన పరిస్థితులను నియంత్రిస్తూనే ఉంటాడు.
2. మనం ఉన్న స్థానం యాదృచ్ఛికం కాదు
" నీవు రాణివైనది ఇట్టి గడ్డుకాలమున మమ్ము ఆదుకొనుటకేనేమో ఎవరు ఎరుగుదురు? " అనే మాట మనందరికీ వర్తిస్తుంది. మన ఉద్యోగం, మన కుటుంబం, మన సమాజంలో మన స్థానం, ఇవన్నీ దేవుని ప్రణాళికలో భాగం కావచ్చు.
3. నిజమైన ధైర్యం భయాన్ని జయించడం, భయం లేకపోవడం కాదు
ఎస్తేరుకు భయం ఉండేది, కానీ ఆమె ఆ భయాన్ని ప్రార్థన ద్వారా అధిగమించి ముందుకు సాగింది.
4. ప్రార్థన మరియు సమాజ మద్దతు ముఖ్యమైనవి
పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు, ఎస్తేరు ఒంటరిగా వెళ్లలేదు. ఆమె సమాజం మొత్తాన్ని ప్రార్థనలో కలుపుకుంది.
5. సరైన సమయం కోసం వేచి ఉండటం జ్ఞానం
ఎస్తేరు తొందరపడకుండా, రెండు విందుల ద్వారా సరైన క్షణం కోసం వేచింది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా, జ్ఞానంతో కూడిన సమయస్ఫూర్తి ముఖ్యం.
6. ఇతరుల కోసం త్యాగం చేయడం గొప్పతనం
ఎస్తేరు తన సొంత భద్రతను త్యజించి, తన ప్రజల కోసం నిలబడింది. ఇతరుల మేలు కోసం మనల్ని మనం అర్పించుకోవడం నిజమైన నాయకత్వ లక్షణం.
7. దేవుని న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది
హామాను దుష్ట ప్రణాళిక అతనిపైనే తిరగబడింది. చెడు ఎంత బలంగా కనిపించినా, దేవుని న్యాయం చివరకు విజయం సాధిస్తుంది.
8. మన మంచి పనులను దేవుడు మరచిపోడు
మొర్దెకై చేసిన మేలుకు తక్షణమే ప్రతిఫలం రాలేదు, కానీ సరైన సమయంలో అది గుర్తించబడింది. దేవుని సమయం మన సమయం కంటే భిన్నంగా ఉండవచ్చు, కానీ ఆయన ఖచ్చితంగా గుర్తుంచుకుంటాడు.
9. మన గతం మన భవిష్యత్తును నిర్ణయించదు
అనాథ, పరదేశంలో నివసిస్తున్న ఎస్తేరు ఒక సామ్రాజ్యానికి రాణి అయ్యింది. మన నేపథ్యం ఎంత కష్టమైనదైనా, దేవుడు మనలను గొప్ప ఉద్దేశాల కోసం ఉపయోగించగలడు.
10. కృతజ్ఞత మరియు జ్ఞాపకం ముఖ్యమైనవి
పూరీము పండుగ స్థాపన మనకు నేర్పేది, దేవుడు చేసిన మేళ్లను మరచిపోకుండా, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, తరతరాలకు తెలియజేయడం ముఖ్యము.
20. ఎస్తేరు గ్రంధ సందేశం
ఎస్తేరు జీవితం మనకు చూపేది ఏమిటంటే, దేవుడు సాధారణ మనుషులను అసాధారణమైన సమయాలలో, అసాధారణమైన పనుల కోసం ఉపయోగించుకుంటాడు. ఆమె ఒక అనాథ యువతి, పరదేశంలో నివసిస్తున్న అల్పసంఖ్యాక జాతికి చెందినది. కానీ ఆమె విధేయత, వినయం, ధైర్యం, జ్ఞానం, ప్రార్థన ఇవన్నీ కలిసి ఆమెను చరిత్రలో అత్యంత గొప్ప స్త్రీలలో ఒకరిగా నిలబెట్టాయి.
మనం కూడా జీవితంలో కష్టమైన నిర్ణయాలను
ఎదుర్కొన్నప్పుడు, ఎస్తేరు మాదిరిగా, భయపడినా ధైర్యం చూపిస్తూ, తొందరపడకుండా
జ్ఞానంతో వ్యవహరిస్తూ, ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని కోరుతూ,
ఇతరుల మేలు కోసం త్యాగం చేస్తూ ముందుకు సాగాలి. "ఇలాంటి సమయం
కోసమే" మనల్ని కూడా దేవుడు ఈ ప్రపంచంలో ఈ స్థానంలో ఉంచాడని గుర్తుంచుకుందాం.
దేవుడు మౌనంగా కనిపించినప్పుడు కూడా,
ఆయన పనిచేస్తూనే ఉంటాడు. మనకు తెలియకపోయినా మన విశ్వాసం, మన ధైర్యం, మన విధేయత, ఇవి దేవుని గొప్ప ప్రణాళికలో
భాగం కావచ్చు అనేదే ఎస్తేరు కథ మనకు ఇచ్చే అంతిమ సందేశం.
" నీవు రాణివైనది ఇట్టి గడ్డుకాలమున మమ్ము ఆదుకొనుటకేనేమో ఎవరు
ఎరుగుదురు?" ఎస్తేరు 4:14
గత పోస్టును చదవండి https://www.carmelshobha.com/2026/08/kananeeya-stree-viswasam-matthew-15-21-28-telugu-bible-study.html
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment