మౌన పునీతుడు: పునీత యోసేపు జీవితం నుండి పాఠాలు

 


మౌన పునీతుడు  

మనం తరచుగా గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసిన వారి గురించి, అద్భుతాలు సాధించిన పునీతుల గురించి ఎంతో ఆసక్తిగా మాట్లాడుకుంటాము. కానీ సువిశేషాలలో  ఒక్క మాట కూడా మాటలాడకుండా, నిశ్శబ్దంగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన ఒక అసాధారణ పునీతుడు ఉన్నాడు. ఎంతటి కష్టాన్ని ఎదుర్కొన్న, మానసిక వేదనను పొందిన, శారీరక అలసట పొందిన ఏమి మాటలాడకుండా కేవలం దేవుని కుమారుని కాపాడుటనే తన భాధ్యతగా జీవించిన పునీతుడు.  ఆయనే పునీత యోసేపు. యేసు ప్రభువుని పెంపుడు తండ్రి.

పరిశుద్ధ గ్రంథంలో యోసేపు పెదవుల నుండి వచ్చిన ఒక్క పదం కూడా నమోదవలేదు. కాని  ఆయన జీవితం మాటలతో కాకుండా, చేతలతో, దైవచిత్తానికి సంపూర్ణంగా లోబడటం ద్వారా మాట్లాడింది. ఆధునిక ప్రపంచంలో అర్ధం లేని మాటలు, ఆడంబరాలు ఎక్కువైన వేళ, పునీత యోసేపు మౌనం మనకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలుస్తుంది.

1. న్యాయం మరియు కరుణల మేళవింపు

యోసేపు నజరేతు గ్రామంలో సాధారణ వడ్రంగి. పరిశుద్ధ కన్య మరియమాతను వివాహం చేసుకోబోతున్న తరుణంలో,  ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అని తెలుసుకున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం, అతను ఆమెను బహిరంగంగా విమర్శించవచ్చు లేదా రాళ్లతో కొట్టి చంపేలా న్యాయస్థానానికి అప్పగించవచ్చు. లేదా రహస్యంగా ఇద్దరి సమక్షంలో ఆమెను విడనాడవచ్చు.  అయితే మత్తయి సువార్త ఆయన హృదయ వైశాల్యాన్ని ఇలా వర్ణిస్తుంది.  "ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టములేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను." - మత్తయి 1:19 ఇక్కడే పునీత యోసేపు అంతరంగం స్పష్టమవుతుంది. ఆయన న్యాయవంతుడే, కానీ ఆయన న్యాయం కరుణతో కూడుకున్నది. అవమానించడం కంటే, ప్రేమతో రక్షించడానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటమంటే ఇతరులను శిక్షించడం కాదు, వారి పట్ల కరుణ చూపడమేనని ఆయన నిరూపించాడు.

 

2. శూన్యం కాని మౌనం: తక్షణ విధేయత

దేవదూత కలలో కనిపించి, "యోసేపు ఇట్లు తలంచు చుండగా, ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపూ! నీ భార్యయైన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయన, ఆమె పవిత్రాత్మ ప్రభావమువలన గర్భము ధరించినది." (మత్తయి 1:20) అని చెప్పిన వెంటనే, యోసేపు ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. దేవుని ప్రణాళిక తన ఆలోచనలకు భిన్నంగా ఉన్నప్పటికీ, ఆయన వెంటనే విధేయుడయ్యాడు. ఆయన ఎటువంటి  ప్రశ్న అడుగలేదు. తక్షణమే తన కర్తవ్యం నెరవేర్చడానికి నిర్ణయించుకున్నాడు.

యోసేపు జీవితంలో ఈ నిశ్శబ్ద విధేయత పునరావృతమవుతూనే ఉంటుంది.  బేత్లెహేము పయనం: మరియమాత  ప్రసవ సమయం దగ్గరపడినప్పుడు బేత్లెహేములో స్థలం లేకపోయినా నిందించకుండా సత్రం  తరువాత సత్రం వెతికాడు. ఈజిప్టుకు పారిపోవడం: హేరోదు రాజు బాల యేసును చంపాలని చూసినప్పుడు, దేవదూత చెప్పిన మరుక్షణమే అర్ధరాత్రి లేచి అపరిచిత దేశానికి పయనమయ్యాడు. తిరిగి నజరేతుకు రావడం: ప్రమాదం తొలిగిపోయిందని వినగానే దేవుని నడిపింపు ప్రకారమే కుటుంబంతో తిరిగి వచ్చాడు. ప్రతిసారీ యోసేపు తన సొంత ప్రణాళికలను, తన సౌకర్యాలను పక్కనబెట్టి, దేవుని చిత్తానికి మొదటిస్థానం ఇచ్చాడు. ఆయన మౌనం శూన్యత కాదు; అది దేవుని స్వరానికి వినే లోతైన ప్రార్థనాభరిత విధేయత. ఆయన జీవితం మొత్తం పరిశీలించినప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అది ఏమిటంటె, జీవితం మొత్తం కూడా మారు మాటలాడకుండా ఎలా ఆయన దేవునికి అంత  విధేయత చూపించగలిగాడు. ఎందుకంటే పునీత యోసేపూకు దేవుని చిత్తమే ముఖ్యం. ఇదే మనస్తత్వం మరియమాత మరియు యేసు ప్రభువులో కూడా చూస్తాము.  

3. కార్మెలియ  ఆధ్యాత్మికత -  మౌనంలో దేవుని సంభాషణ

కార్మెలియ  ఆధ్యాత్మికతలో (Carmelite Spirituality) మౌనానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పునీత సిలువ యోహాను (St. John of the Cross) పేర్కొన్నట్లు: "దేవుడు మన హృదయ అంతరంగంతో మౌనంలోనే సంభాషించేది." బాహ్య ప్రపంచపు శబ్దాలు తగ్గినప్పుడే అంతరంగంలో దేవుని మాట స్పష్టంగా వినిపిస్తుంది. పునీత యోసేపు ఈ నిశ్శబ్ద ప్రార్థనా జీవితానికి సజీవ సాక్ష్యం. ఆయన ప్రతి రోజూ తన పనిలో, కుటుంబ సంరక్షణలో దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించాడు.

4. 'రహస్య  జీవితం' – శ్రమకు దైవ  గౌరవం

యేసు ప్రభువు  తన జీవితంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని నజరేతులో "రహస్య  జీవితం" (Hidden Life) గా గడిపాడు. యేసు ప్రభువును వడ్రంగి కుమారుడిగా మాత్రమే కాకుండా, స్వయంగా వడ్రంగి అని కూడా బైబిలు సంబోధిస్తుంది. అంటే, యేసు  ప్రభువు యోసేపు పక్కనే నిలబడి ఈ పనిని నేర్చుకున్నాడు.  శ్రమకు పవిత్రత: యోసేపు తన వృత్తిని దేవునికి సమర్పణగా మార్చాడు. కష్టపడి పనిచేయడం ద్వారా కుటుంబాన్ని పోషించడం దైవ కార్యమేనని చూపించాడు. నిశ్శబ్ద పాత్ర: ఒక తండ్రిగా, గురువుగా, రక్షకుడిగా తన బాధ్యతను ఎటువంటి గుర్తింపును కోరుకోకుండా నిశ్శబ్దంగా నెరవేర్చాడు, ఇది పునీత యోసేపు జీవితంలో అత్యంత గొప్ప గుణం.

5. సార్వత్రిక తిరుసభ సంరక్షకుడు

కతోలిక తిరుసభ పునీత యోసేపుకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తుంది: పరిశుద్ధ కుటుంబ సంరక్షకునిగా బాల యేసును, మరియమాతను  భూమిపై కంటికి రెప్పలా కాపాడిన నమ్మకమైన సంరక్షకుడు.   కార్మికుల పోషకుడు: శ్రమ విలువను చాటిచెప్పిన నిరాడంబర హృదయుడు. ప్రశాంత మరణానికి పోషకుడు: సంప్రదాయం ప్రకారం, పునీత యోసేపు తన అంతిమ ఘడియలలో యేసు ప్రభువు  మరియు మరియమాతల  చేతుల మధ్య ప్రశాంతంగా కన్నుమూశారు. అందుకే మంచి మరణం పొందడానికి ఆయనను వేడుకుంటారు.

6. నేటి ఆధునిక ప్రపంచానికి యోసేపు నేర్పే దైవిక పాఠాలు

నేటి సామాజములో ప్రతి చిన్న విషయాన్ని ప్రకటించుకోవాలని, ఇతరుల గుర్తింపు పొందాలని తపించడం సహజమైపోయింది. ఈ వాతావరణంలో పునీత యోసేపు జీవితం మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. అవి ఏమిటంటె

ఫలితం కంటే విశ్వసనీయత ముఖ్యం: మనం చేసే పనికి లోకంలో పేరు రాకపోయినా, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండడమే ముఖ్యమని యోసేపు జీవితం చాటుతుంది. ప్రతికూలతల్లో సణగకపోవడం: ఈజిప్టు పయనం వంటి కష్ట సమయాలలో ఆయన దేవుడిని ప్రశ్నించలేదు, సణగలేదు. ధైర్యంగా బాధ్యతను స్వీకరించాడు. కుటుంబానికి ఆధ్యాత్మిక రక్షణ: కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తూనే, ఆధ్యాత్మికంగా కుటుంబాన్ని దేవుని వైపు నడిపించడం ప్రతి తండ్రికి యోసేపు నేర్పే గొప్ప సందేశం. పునీత యోసేపు జీవితం ఒక గొప్ప నిశ్శబ్ద కావ్యం. మాటల కంటే చేతలే మిన్న అని, ఆర్భాటాల కంటే లోతైన దైవభక్తి గొప్పదని ఆయన మనకు నిరూపించాడు. మన అనుదిన జీవితంలో వచ్చే శోధనలు, కష్టాల మధ్య ప్రశాంతంగా దేవుని చిత్తానికి లొంగిపోవడానికి ఆయన జీవితం మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం.

ప్రార్థన

ఓ పునీత యోసేపూ, మౌనపునీతుడా ! నీ విధేయత మరియు నిశ్శబ్ద విశ్వసనీయత మాకు మార్గదర్శకముగా ఉండును గాక. మా అనుదిన జీవితంలో దేవుని పిలుపును వెంటనే గుర్తించి, ఎలాంటి భయం లేకుండా, సణగకుండా స్పందించే పవిత్ర హృదయమును మాకు ప్రసాదించుమని, మా కుటుంబాలను, మేము చేసే ప్రతి పనిని, మరియు మా జీవిత అంతిమ క్షణాలను నీ పవిత్ర సంరక్షణలో ఉంచుమని,  నిశ్శబ్ద శ్రమ ద్వారా దేవుని మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని మీ పెంపుడు కుమారుని వేడుకోండి. ఆమెన్.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు