పదిమంది కన్యల ఉపమానం - మత్తయి 25:1-13 పూర్తి వివరణ

 


పదిమంది కన్యల ఉపమానం

మత్తయి 25:1-13

"పరలోకరాజ్యము ఇట్లుండును: పదిమంది కన్యలు తమ కాగడాలతో పెండ్లికుమారునకు స్వాగతమీయ ఎదురేగిరి. అందు అయిదుగురు వివేకవతులు, మరియైదుగురు అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతోపాటు నూనెను తీసికొనిపోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసికొనిపోయిరి. పెండ్లి కుమారుని రాక ఆలస్యముకాగా, వారెల్లరు కునికి పాట్లు పడుతు నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున 'ఇదిగో! పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు. అతనికి ఎదురు వెళ్ళుడు' అను కేక వినబడెను. అపుడు ఆ కన్యలందరు నిదురనుండి మేల్కొని తమ కాగడాలను సవరించు కొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో 'మా కాగడాలు కొడిగట్టుచున్నవి. మీ నూనెలో కొంత మాకీయుడు' అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, 'మాకును మీకును ఇది చాలదు. అంగడికి వెళ్ళి కొనితెచ్చుకొనుడు' అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగనున్నవారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపు మూయబడెను. తరువాత మిగిలిన కన్యలు వచ్చి 'ప్రభూ! ప్రభూ! తలుపుతీయుడు' అని మొర పెట్టిరి. ఆయన 'నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను' అనెను. కనుక మెలకువతో ఉండుడు. ఏలయన, ఆ దినమును, ఆ గడియను మీరెరుగరు.

"కనుక మెలకువతో ఉండుడు; ఏ దినమును, ఏ గడియను మీరు ఎరుగరు"

పరిచయం

యేసు ప్రభువు అంత్యకాలము గురించి చెప్పిన  బోధనలోని ఒక   ఉపమానం ఈ సువిశేష భాగం. పరలోకరాజ్యంలో ప్రవేశానికి కావలసిన ఆధ్యాత్మిక సంసిద్ధత గురించి బోధించే ముఖ్యమైన ఉపమానాలలో ఇది  ఒకటి. పదిమంది కన్యలు పెండ్లికుమారుని కోసం కాగడాలతో ఎదురుచూశారు. వారిలో  ఐదుగురు వివేకవతులు, ఐదుగురు అవివేకవతులు. బాహ్యంగా అందరూ ఒకేలా కనిపించారు.  అందరికీ కాగడాలు ఉన్నాయి, అందరూ ఎదురుచూశారు, అందరూ నిద్రించారు. కాని వారి మధ్య ఉన్న వ్యత్యాసం ఒకటే. అది ఏమిటంటె  వివేకవతులు అదనపు నూనెను తమ పాత్రలలో తీసుకువెళ్లారు, అవివేకవతులు తీసుకువెళ్లలేదు. ఈ ఒక్క వ్యత్యాసమే కథ యొక్క గమనాన్ని మొత్తాన్ని మారుస్తుంది. ఎవరు వివాహోత్సవంలో ప్రవేశిస్తారో, ఎవరు తలుపు బయటే మిగిలిపోతారో నిర్ణయిస్తుంది.

1. చారిత్రక నేపథ్యం:  కథ ఎందుకు ఇలా ఉంది

మొదటి శతాబ్దపు యూదుల వివాహాలలో మూడు దశలు ఉండేవి. అవి  నిశ్చితార్థం, వేచివుండే కాలం, తుది వివాహోత్సవ ఊరేగింపు. వరుడు తన ఇంటిని సిద్ధం చేసుకున్న తర్వాత రాత్రివేళ వధువును తీసుకెళ్లడానికి వచ్చేవాడు.  వరుడు వచ్చే  ఖచ్చితమైన సమయం ఎవరికీ తెలియకుండా వచ్చేవాడు. అందుకే వధువు స్నేహితురాళ్లు (కన్యలు) రాత్రంతా సిద్ధంగా ఉండాల్సి వచ్చేది. వారు వాడిన కాగడాల కర్రచివర గుడ్డ చుట్టి నూనెలో ముంచి వెలిగించి ఉండేవి. అవి  ఎక్కువ  వెలుగునిచ్చినా నూనె త్వరగా అయిపోయేది. కాబట్టి అదనపు నూనె తీసుకువెళ్లడం కేవలం జాగ్రత్త  మాత్రమే కాదు,  అది అనివార్యమైన అవసరం. అదనపు నూనె లేదు అంటే వారు ఎటువంటి సిద్దపాటు కలిగిఉండలేదు అని అర్ధం.

ఈ నేపథ్యం నుండి  ఈ ఉపమానమును అర్ధం చేసుకున్నప్పుడు వరుని ఆలస్యం ఊహించదగినదే. వరుడు ఎప్పుడు వస్తాడో ఖచ్చితంగా తెలియని పరిస్థితిలో, స్వల్పకాలిక సిద్ధపాటు  సరిపోదు; దీర్ఘకాలం నిలబడగల సిద్దపాటు  అవసరం. ఈ చారిత్రక వాస్తవం నుంచి నేరుగా ఉపమానంలోని ఆధ్యాత్మిక సందేశానికి వెళ్లవచ్చు, ఎందుకంటే యేసు ప్రభువు  ఈ సుపరిచితమైన దృశ్యాన్నే తన బోధనకు వేదికగా వాడుకున్నాడు.

2. పాత్రల అర్థం

ఈ ఉపమానములోని ప్రతీ అంశం ఒక సత్యాన్ని సూచిస్తుంది. కథలోని ప్రతి అంశానికీ ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. పెండ్లికుమారుడు అంటే  యేసుక్రీస్తు,  వధువు అంటే సంఘం . వరుడు తన వధువును చేరుకోవడానికి తిరిగి రాబోతున్నవాడు. యేసు క్రీస్తు తన సంఘం దగ్గరకు రాబోతున్నాడు.

పదిమంది కన్యలు -  క్రీస్తు రాకడ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకునే విశ్వాసుల సమూహం, అంటే సంఘ సభ్యులు. కాగడాలు అంటే   బాహ్యమైన మతాచరణ, క్రైస్తవ గుర్తింపు, కనిపించే సాక్ష్యం. నూనె: పరిశుద్ధాత్మ దేవుడు, అంతరంగంలో ఉండే నిజమైన విశ్వాసం, దేవునితో వ్యక్తిగత సంబంధం. అర్ధరాత్రి అంటే  ఊహించని సమయం, క్రీస్తు రెండవ రాకడ జరిగే క్షణం. తలుపు మూయబడుట:   దేవుని కృపా కాలం ముగియడం, అంతిమ నిర్ణయం.

 

ఈ ప్రతీకలను గుర్తుపెట్టుకుంటే, కథలోని ప్రతి సంఘటనకూ ఒక లోతైన అర్థం స్పష్టమవుతుంది.

3. బాహ్యంగా ఒకటే, అంతరంగంలో వేరు

పదిమంది కన్యలు పెండ్లికుమారుని కోసం ఎదురుచూశారు, అందరి దగ్గరా కాగడాలు ఉన్నాయి, అందరూ నిద్రించారు. బయటికి చూస్తే వారి మధ్య ఏ తేడాయూ కనిపించదు. ఇదే ఉపమానంలోని అత్యంత ముఖ్యమైన హెచ్చరిక: అవివేకవతులు పూర్తిగా అవిశ్వాసులు కాదు; వారు కూడా ఎదురుచూసేవారే. అయితే వారి సిద్ధపాటు అల్పమైనది. నూనె (అంతరంగిక సత్యం) లేని కాగడాలు (బాహ్య రూపం) మాత్రమే వారి వద్ద ఉన్నాయి.

ఇది నేటి విశ్వాసికి ఎంతో ముఖ్యమైన సందేశం. చర్చికి వెళ్లడం, ప్రార్థనలు చేయడం, క్రైస్తవ గుర్తింపు కలిగి ఉండడం,  ఇవన్నీ మంచివే, కానీ ఇవి మాత్రమే ఆధ్యాత్మిక సిద్ధతకు తుది ప్రమాణం కావు. బాహ్యముగా మతపరమైన రూపం మరియు అంతరంగ ఆధ్యాత్మిక జీవితం ఒకటి కాదు.

 4. ఆలస్యం, నిద్ర - పరీక్ష ప్రారంభం

పెండ్లికుమారుడు ఆలస్యం కావడంతో కన్యలందరూ నిద్రించారు, వారిలో  వివేకవతులు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతుంది, నిద్రపోవడం ఒక్కటే అవివేకానికి గుర్తు కాదు. మానవ శారీరక పరిమితిని యేసు  ప్రభువు అంగీకరిస్తున్నాడు. సమస్య నిద్ర కాదు,  నిద్రలోకి వెళ్లే ముందు సిద్ధత లేకపోవడమే సమస్య. కాబట్టి క్రైస్తవ "మెలకువ" అంటే శారీరకంగా నిద్రపోకుండా ఉండటం కాదు; అది ఆత్మీయంగా నిర్లక్షమును దరిదాపులలో లేకుండా చేయడం.

అదే సమయంలో, దేవుని వాగ్దానం వెంటనే నెరవేరనప్పుడు మనిషి విశ్వాసం పరీక్షించబడుతుంది. మనం ప్రార్థించిన దేవుని  సమాధానం ఆలస్యమవుతుంది; క్రీస్తు రాకను నమ్ముతాం, సంవత్సరాలు గడుస్తాయి. ఇటువంటి సమయంలో వివేకవంతమైన విశ్వాసం అంటే ఫలితం వచ్చినప్పుడు మాత్రమే నమ్మకం ఉంచడం కాదు,  ఆలస్యమైనా విశ్వాసంలో నిలబడటం.

 5. అర్ధరాత్రి కేక - ఊహించని క్షణం

అర్ధరాత్రి సమయాన "ఇదిగో! పెండ్లికుమారుడు వచ్చుచున్నాడు" అనే కేక వినిపించింది. ఎవరూ ఊహించని సమయంలో ఆయన వచ్చాడు. ఇక్కడ యేసు ప్రభువు నేర్పుతున్న పాఠం స్పష్టం. క్రీస్తు రాక సమయాన్ని మనిషి నియంత్రించలేడు. "ఇంకా సమయం ఉంది," "తర్వాత ప్రార్థిస్తాను," "వృద్ధాప్యంలో దేవుని దగ్గరకు వెళ్తాను" వంటి ఆలోచనలు ఆత్మీయంగా ప్రమాదకరమైనవి,  ఎందుకంటే మనకు "అర్ధరాత్రి" ఎప్పుడు వస్తుందో తెలియదు.

కేక వినగానే కన్యలందరూ మేల్కొని తమ కాగడాలను సవరించుకోసాగారు. ఇదొక ఆత్మపరిశీలన క్షణం. ఇక్కడే అవివేకవతులకు తమ లోటు తెలిసింది.  వారి కాగడాలు కొడిగడుతున్నాయి. కొన్నిసార్లు మనిషి తన ఆత్మీయ స్థితిని, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే గుర్తిస్తాడు. కానీ ఈ  ఉపమానం మనకు చెప్పేది ఏమిటంటె చివరి క్షణం కోసం ఆత్మీయ సిద్ధతను వాయిదా వేయకూడదు.

 6. మీ నూనెలో కొంత మాకీయుడు-అప్పుగా తీసుకోలేని విశ్వాసం

అవివేకవతులు వివేకవతులను నూనె అడిగారు. వివేకవతులు నిరాకరించారు.  "మాకును మీకును ఇది చాలదు." ఇది స్వార్థం కాదు; ఇది ఆధ్యాత్మిక జీవితంలోని ఒక వాస్తవం. జ్ఞానం పంచుకోవచ్చు, బోధ పంచుకోవచ్చు, ప్రార్థన చేయవచ్చు, ప్రోత్సాహం ఇవ్వవచ్చు, కానీ ఒకరి వ్యక్తిగత విశ్వాసాన్ని మరొకరు అప్పుగా ఇవ్వలేరు. తల్లిదండ్రుల విశ్వాసం పిల్లలకు రక్షణగా మారదు; గురువు  ప్రార్థన మన వ్యక్తిగత ప్రార్ధనకు  ప్రత్యామ్నాయం కాదు. ప్రతి ఒక్కరూ స్వయంగా క్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలి.  ఇదే ఈ సన్నివేశం యొక్క ముఖ్య  సందేశం.

 7. అంగడికి వెళ్లడం, తలుపు మూయబడటం - అవకాశానికి పరిమితి

అవివేకవతులు నూనె కొనడానికి వెళ్లారు. ఇంతలో పెండ్లికుమారుడు వచ్చాడు; సిద్ధంగా ఉన్నవారు ఆయనతో వెళ్లారు, తలుపు మూయబడింది. ఇక్కడ ఉపమానంలోని అత్యంత  ముఖ్యమైన సత్యం బయటపడుతుంది. పెండ్లికుమారుడు తప్పకుండా వచ్చాడు. ఆలస్యం ఆయన రాకను రద్దు చేయలేదు.  అలాగే క్రీస్తు రెండవ రాకడ ఆలస్యం అవుతున్నట్లు కనిపించినా, అది జరగదని అర్థం కాదు. దేవుని వాగ్దానం మనిషి గడియారం మీద ఆధారపడదు.

అయితే ఈ అవకాశానికి ఒక పరిమితి ఉంది. ప్రతి రోజు దేవుని కృపను స్వీకరించడానికి ఒక అవకాశం ప్రతి ప్రార్థన, ప్రతి పశ్చాత్తాపం, ప్రతి క్షమాపణ ఒక అవకాశమే. కానీ మనిషి నిరంతరం "రేపు" అని వాయిదా వేస్తూ పోతే, ఒకరోజు ఆ రేపు ఉండకపోవచ్చు.

 8. "నేను మిమ్ము ఎరుగను" - తీవ్రమైన  హెచ్చరిక

తర్వాత వచ్చిన అవివేకవతులు "ప్రభూ! ప్రభూ! తలుపుతీయుడు" అని మొరపెట్టారు. ఆ మొరకు సమాధానం వచ్చింది. కాని ఆ సమాధానం బాధించేది.  "నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను" అని ప్రభువు చెబుతున్నాడు.  ఈ మాటకు అర్థం దేవునికి వారి గురించి తెలియదని కాదు. ఇక్కడ "ఎరుగను" అంటే సంబంధాన్ని గుర్తించటం లేదు అని అర్ధం.  

ఇది క్రైస్తవ జీవితంలోని ఒక ప్రధాన సూత్రాన్ని వెల్లడిస్తుంది.  దేవుని గురించి తెలుసుకోవడం ఒక విషయం, దేవుణ్ణి తెలుసుకోవడం మరొక విషయం. బైబిల్ చదవడం ఒక విషయం, దాని ప్రకారం జీవించడం మరొక విషయం. చర్చికి వెళ్లడం ఒక విషయం, క్రీస్తు శరీరంలో నిజంగా జీవించడం మరొక విషయం. ప్రభువును "ప్రభూ, ప్రభూ" అని పిలిచినంత మాత్రాన సరిపోదు, ఆయనతో వ్యక్తిగత నిబంధన సంబంధం ఉండాలి.

 9. తుది ఆజ్ఞ -"మెలకువతో ఉండుడు"

 

ఉపమానం ముగింపులో యేసు ప్రభువు  స్పష్టమైన ఆదేశం ఇచ్చాడు.  "కనుక మెలకువతో ఉండుడు. ఏలయన, ఆ దినమును, ఆ గడియను మీరెరుగరు." మెలకువగా ఉండటం అంటే నిద్రపోకుండా ఉండటం కాదు (వివేకవతులు కూడా నిద్రించారు). మెలకువగా ఉండటం అంటే, ఎప్పుడు  ప్రభువు వచ్చినా ఆయనను ఎదుర్కొనేలా నూనె (పరిశుద్ధాత్మ నింపుదల, ప్రార్థన జీవితం, వాక్యానుసారమైన ప్రవర్తన) నిరంతరం కలిగి ఉండటం.

ఈ మెలకువకు నాలుగు ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి.  దేవునితో నిరంతర సంబంధమైన ప్రార్థన; తప్పును గుర్తించి దేవుని వైపు తిరిగే పశ్చాత్తాపం; దేవుణ్ణి మరియు పొరుగువానిని ప్రేమించే ప్రేమ; మరియు మనకు అప్పగించిన బాధ్యతలను విశ్వాసంగా నిర్వహించే సేవ. ఈ నాలుగు మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి.

 10. ఆచరణాత్మక అన్వయం - ఈరోజు మనం ఏం చేయాలి

ఈ ఉపమానం కేవలం భవిష్యత్తు గురించిన హెచ్చరిక మాత్రమే కాదు. ఇది ఈరోజు జీవించే విధానం గురించిన బోధన.  అందుకు కొన్ని ఆచరణాత్మక మార్గాలు.

ప్రతిరోజూ ప్రార్థించడం- దేవునితో సంబంధం నిరంతరం పెంచుకోవాలి.

దేవుని వాక్యాన్ని చదవడం- వాక్యం మన జీవితానికి వెలుగుగా ఉండాలి.

పాపాన్ని నిర్లక్ష్యం చేయకపోవడం- తప్పు తెలిసినప్పుడు వెంటనే పశ్చాత్తాపపడాలి.

క్షమించడం- హృదయంలో ద్వేషాన్ని నిల్వచేయకూడదు.

ప్రేమతో సేవ చేయడం- చుట్టూ ఉన్నవారిలో క్రీస్తును చూడాలి.

విశ్వాసంలో స్థిరంగా ఉండడం- దేవుని సమాధానం ఆలస్యమైనా విశ్వాసం కోల్పోకూడదు.

తర్వాత అనే మాటను తగ్గించడం- చివరి క్షణం కోసం ఆత్మీయ సిద్ధతను వాయిదా వేయకూడదు.

నేటి ప్రపంచంలో, సాంకేతికత, ఉద్యోగం, సామాజిక మాధ్యమాలు మన సమయాన్ని ఆక్రమిస్తున్న కాలంలో, ఆత్మీయ జీవితం నెమ్మదిగా నిర్లక్ష్యం చేయబడే ప్రమాదం ఉంది.

 ముగింపు

ఈ ఉపమానాన్ని చదివిన తర్వాత మనల్ని మనం ప్రశ్నించుకోవలసినవి: నా కాగడం వెలుగుతోందా? నా పాత్రలో నూనె ఉందా? ఆలస్యం కారణంగా నేను నిరుత్సాహపడుతున్నానా? నా విశ్వాసం ఇతరుల మీద మాత్రమే ఆధారపడుతోందా? "రేపు" అనే మాటతో ఆత్మీయ జీవితాన్ని వాయిదా వేస్తున్నానా? ప్రభువు ఈరోజే వస్తే నేను సిద్ధంగా ఉన్నానా? నేను క్రీస్తును కేవలం తెలుసుకున్నానా, లేక నిజంగా ఆయనతో జీవిస్తున్నానా?

ఈ మొత్తం ఉపమానాన్ని ఒకే వాక్యంలో చెప్పాలంటే, క్రీస్తు తప్పకుండా వస్తాడు; ఆయన రాక సమయం మనకు తెలియదు; కాబట్టి ఇప్పుడే విశ్వాసం, కృప, ప్రార్థన, ప్రేమ, పశ్చాత్తాపం మరియు మంచి కార్యాలతో సిద్ధంగా జీవించాలి.పెండ్లికుమారుడు ఆలస్యమయ్యాడు. కానీ వచ్చాడు. కన్యలు అందరూ నిద్రించారు కానీ అందరూ ఒకే స్థితిలో లేరు. కాగడాలు అందరికీ ఉన్నాయి.  కానీ నూనె అందరికీ లేదు.

మెలకువగా ఉండటం అంటే భయపడటం కాదు,  విశ్వాసంగా జీవించడం. అది ప్రపంచాన్ని విడిచి పారిపోవడం కాదు.  ప్రపంచంలో క్రీస్తు వెలుగుగా జీవించడం. అది "ప్రభువు ఎప్పుడు వస్తాడు?" అని ప్రశ్నించడం కాదు.  "ప్రభువు వచ్చినప్పుడు నేను ఆయనకు చెందినవాడిగా కనిపిస్తానా?" అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం.

"కనుక మెలకువతో ఉండుడు. ఏలయన, ఆ దినమును, ఆ గడియను మీరెరుగరు" (మత్తయి 25:13).

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు