ధన్యతలు, అనర్థాలు - లూకా 6:20-26 మైదాన ప్రసంగం వ్యాఖ్యానం
లూకా 6:20-26
యేసు కనులెత్తి శిష్యులవైపు చూచి ,
ఇట్లు ఉపదేశింప ఆరంభించెను: “పేదలగు మీరు ధన్యులు. దేవరాజ్య ము మీది. ఇపుడు ఆకలిగొనియున్న మీరు ధన్యులు. మీరు
సంతృప్తి పరపబడుదురు. ఇపుడు శోకించు మీరు ధన్యులు, మీరు
ఆనందింతురు. మనుష్యకుమారుని నిమిత్తము, మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడగొట్టినపుడు మీరు ధన్యులు. ఆరోజున మీరు ఆనందపడుడు. మహానందపడుడు.
ఏలయన, పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తలపట్ల ఇట్లే
ప్రవర్తించిరి. అయ్యో! ధనికులారా!
మీకనర్థము. మీరు మీ సుఖములను అనుభవించియున్నారు. అయ్యో! ఇపుడు కడుపునిండినవారలారా! మీకు అనర్ధము. మీరు ఆకలితో
అలమటింతురు. అయ్యో! ఇపుడు నవ్వుచున్నవారలారా! మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరు మిమ్ము ప్రశంసించినప్పుడు
మీకు అనర్థము, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే
ప్రవర్తించిరి.
పరిచయం
యేసు ప్రభువు కొండమీద చేసిన ప్రసంగం (మత్తయి 5:1-12) చాలా
ప్రసిద్ధి చెందినది. లూకా సువార్తలోని ఈ భాగం దానికి సమాంతరమైనదే అయినా, "సమతల
మైదానం"లో (లూకా 6:17) చేసిన ప్రసంగం గనుక దీన్ని
"మైదాన ప్రసంగం" అంటారు. ఇక్కడ యేసు ప్రభువు శిష్యులు, జనసమూహాలు
ఆయన చుట్టూ చేరారు. వ్యాధిగ్రస్తులు, దయ్యములచేత
పీడితులు, అలసిపోయిన హృదయాలు గల ప్రజలు అందరూ అక్కడే
ఉన్నారు. ఆ మైదానంలోనే, కళ్లెత్తి వారందరి వైపు
సూటిగా చూస్తూ, యేసు ప్రభువు ప్రపంచాన్ని
తలకిందులు చేసే మాటలు పలికాడు, వాటిలోనివి ఇవే "పేదలగు మీరు ధన్యులు."
మత్తయి సువార్తలో అష్ట భాగ్యాలు ఆధ్యాత్మికంగా, సున్నితంగా
సాగితే ("దీనాత్ములు," "నీతి కోసం
ఆకలిగొనువారు"), లూకా సువార్తలో నాలుగు భాగ్యాలు, వాటికి
సరిగ్గా ప్రతిస్పందించే నాలుగు "అయ్యో" వచనాలు నిర్మొహమాటంగా ఉంటాయి. "పేదలు," "ఆకలిగొనువారు"
అని మాత్రమే. ఈ బోధన వెనుక ఉన్నది పేదల పక్షాన నిలబడే దేవుని స్వరం.
సువిశేష భాగ
నిర్మాణం
ఈ ఎనిమిది వాక్యాలు యాదృచ్ఛికంగా పేర్చినవి కావు. ఇవి ఒక జాగ్రత్తగా అమర్చిన జతల నిర్మాణం. ప్రతి ధన్యతకూ, అదే క్రమంలో, డానికి వ్యతిరేక స్థితిని ఖండించే ఒక "అయ్యో" అనే అనర్ధం వచ్చే భాగం ఉంది. ఇది ఒకే సందేశాన్ని నాలుగు కోణాల నుండి పలికే ఒకే ప్రసంగం. మొదటిది ఆర్థిక స్థితిని (పేదరికం-సంపద), రెండోది శారీరక అవసరాన్ని (ఆకలి-తృప్తి), మూడోది భావోద్వేగ స్థితిని (దుఃఖం-నవ్వు), నాలుగోది సామాజిక గుర్తింపును (నింద-ప్రశంస) చూపుతాయి. అంటే యేసు మనిషి జీవితంలోని ప్రతి పొరనూ, డబ్బు, శరీరం, హృదయం, పేరు-ప్రతిష్ఠలను తాకుతూ ఒకే సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఎవరిపైన ఆధారపడకుండా దేవునిపైనే ఆధారపడేవారు, ఇప్పుడు ఎలాంటి లేమిలో ఉన్నా, రేపు దేవుని రాజ్యంలో పూర్తి తృప్తి పొందుతారు. అదే విధంగా, ఇప్పుడు దేని మీదైనా (సంపద, సుఖం, పేరు) ఆధారపడి తృప్తిగా ఉన్నవారు, ఆ ఆధారం శాశ్వతం కాదని ఒకరోజు తెలుసుకుంటారు. కాబట్టి ఇది నాలుగు వేర్వేరు హెచ్చరికలు కాదు. జీవితం మొత్తాన్ని ఎవరి మీద నిర్మించుకోవాలి అనే ఒకే ప్రశ్నకు నాలుగు జవాబులు.
I. చారిత్రిక నేపథ్యం -ఆకలిగొన్న గలిలయ
యేసు ప్రభువు కాలంనాటి గలిలయ ప్రాంతం సారవంతమైన
భూమి అయినా, సామాన్య ప్రజలకు దాని ఫలాలు అందేవి కాదు. రోమా
సామ్రాజ్యపు పన్నులు, హేరోదు రాజవంశపు అదనపు
వసూళ్లు, ఆలయానికి చెల్లించవలసిన దశమ భాగాలు, ఇవన్నీ
కలిసి చిన్న రైతును అప్పుల ఊబిలోకి నెట్టేవి. డబ్బులేక భూములు కుదువ పెట్టిన, లేదా
అమ్ముకున్న కుటుంబాలు కూలీలుగా మారాయి; ఆకలితో అలమటించే పిల్లలు, రోగాల పాలైన
వృద్ధులు, ఇదీ ఆనాటి సాధారణ దృశ్యం. యేసు ప్రభువు ఈ జనసమూహాన్నే చూస్తూ బోధించాడు.
కాబట్టి "పేదలు" అనేది ఆయనకు తెలియని భావన కాదు. అది తన కళ్ల ముందున్న
వాస్తవం.
పేదరికం, పీడించబడినవారు అనే స్వరం లూకా సువార్త అంతటా వినిపిస్తుంది, నజరేతు ప్రార్థన మందిరంలో యేసు ప్రభువు యెషయా
గ్రంథం నుండి చదువుతూ తనను తాను "పేదలకు సువార్త ప్రకటించుటకు"
అభిషేకించబడినవానిగా ప్రకటించుకోవడం (4:18), వంటివి యేసు ప్రభువు కేవలం ఆధ్యాత్మిక విషయాల
గురించి కాదు, ఆర్ధిక పేదరికం గురించి మాటలాడుతున్నాడు అనే విషయం తెలియజేస్తున్నది,
లూకా సువార్త పేదలకు, అన్యులకు, అట్టడుగు
వర్గాల కోసం రాయబడింది; వారికి ఇక్కడ ఒకే సందేశం దొరుకుతుంది.
అది "దేవుడు మిమ్మల్ని
మరచిపోలేదు."
ఈ చారిత్రిక వాస్తవం మరో మూలాన్ని కూడా వెల్లడిస్తుంది: యేసు ప్రభువు ఇక్కడ ఏదో కొత్తగా కనిపెట్టడం లేదు. ఆయన ఆమోసు, యెషయా వంటి ప్రవక్తల వారసత్వాన్నే కొనసాగిస్తున్నాడు. ఆమోసు ప్రవక్త ధనికుల అన్యాయాన్ని, పేదల దోపిడీని తీవ్రంగా ఖండించాడు (ఆమోసు 5:11-12; 8:4-6). ఇక్కడ వాడిన "అయ్యో" అనే పదం ద్వేషపూరిత శాపం కాదు, రాబోయే ప్రమాదాన్ని ముందుగా చూపే ప్రేమపూర్వక హెచ్చరిక.
II. నాలుగు ధన్యతలు
1. "పేదలగు మీరు
ధన్యులు. దేవరాజ్యము మీది." ఇక్కడ వాడిన
గ్రీకు మూలపదం "ప్టోకోయ్" (ptōchoi) ఇది తక్కువ సంపద ఉన్నవారిని గురించి చెప్పినది కాదు, ఏమీ లేక
పూర్తిగా ఇతరులపై ఆధారపడిన వారిని సూచిస్తుంది. ఇది ఆర్థిక పేదరికమే అయినా, దాని వెనుక
ఒక ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది, తనపై తాను
ఆధారపడేందుకు ఏమీ లేనివాడు తప్పనిసరిగా దేవుని కృపపైనే ఆధారపడతాడు. ధనికుడు తన
సంపదను, తన ప్రణాళికలను నమ్ముకుంటాడు; పేదవాడికి
నమ్ముకోడానికి దేవుడు తప్ప మరేమీ లేదు. అటువంటి వారికి దేవుడు భవిష్యత్తులో దేవ రాజ్యము
ఇస్తాను అని చెప్పడం లేదు, "దేవరాజ్యము మీది" అనేది వర్తమాన
కాలంలో ఉంది. భవిష్యత్తు వాగ్దానం మాత్రమే
కాదు, యేసు ప్రభువు సన్నిధిలోనే ఇప్పటికే ఆరంభమైన వాస్తవం. ప్రభువు వద్దకు
వచ్చి అతని మాట వింటే అది ఆరంభం
అవుతుంది.
2. "ఇపుడు
ఆకలిగొనియున్న మీరు ధన్యులు. మీరు సంతృప్తి పరపబడుదురు." ఇక్కడ యేసు ప్రభువు మాట్లాడేది నిజమైన, శారీరక ఆకలి
గురించి. ఆకలి మంచిదని కాదు, దేవుడు వారి
కేకను విన్నాడని, వారి బాధను చూశాడని చెప్పే ప్రకటన ఇది. "సంతృప్తి
పరపబడుదురు" అనే వాగ్దానం ఈ లోకంలో న్యాయం జరగాలని, పరలోకంలో
పరిపూర్ణత లభించాలని రెండు భావాలను కలిగి ఉంది. యేసు ప్రభువు
బోధన కేవలం పరలోకం గురించినదే కాదు, ఈ లోకంలో కూడా సంతృప్తి పొందాలని.
3. "ఇపుడు
శోకించు మీరు ధన్యులు, మీరు
ఆనందింతురు." మరణం, వ్యాధి, అన్యాయం, ఒంటరితనం
వల్ల కలిగే కన్నీళ్లను యేసు ప్రభువు తక్కువ చేయడం లేదు, ఆయనే స్వయంగా లాజరు సమాధి వద్ద కన్నీరు కార్చాడు
(యోహాను 11:35). దుఃఖం మనిషిని లోతుగా చూసేలా చేస్తుంది; సుఖకాలంలో
మనం దేవుని మరచిపోవచ్చు, బాధలో మన నిజమైన బలహీనతను
గుర్తిస్తాము. "మీరు ఆనందింతురు" అనేది దుఃఖం చివరి మాట కాదని
ప్రకటిస్తుంది.
4. "మనుష్యకుమారుని నిమిత్తము... మీరు ధన్యులు." ఇది మిగతా మూడింటి నుండి భిన్నమైనది, ఇది శిష్యత్వం చెల్లించవలసిన మూల్యం గురించి చెబుతుంది. యేసు ప్రభువు కోసం ద్వేషించబడటం, వెలివేయబడటం, నిందించబడటం, సత్యం కోసం నిలబడేవారికి తప్పనిసరిగా ఎదురయ్యే అనుభవాలు. "వారి పితరులు ప్రవక్తలపట్ల ఇట్లే ప్రవర్తించిరి" అని యేసు ప్రభువు తన శిష్యులను పాత నిబంధన ప్రవక్తల వరుసలో ఉంచుతున్నాడు. ఏలీయా, యిర్మియా వంటివారు సత్యం చెప్పినందుకే హింసలు పొందారు. "ఆరోజున ఆనందపడుడు, మహానందపడుడు" అనేది బాధను కోరుకోమని కాదు, బాధ వచ్చినప్పుడు ధైర్యం కోల్పోవద్దని చెప్పే మాట.
III. నాలుగు అనర్థాలు
పైన చూసిన నిర్మాణం ప్రకారం, ప్రతి
"అయ్యో" వచనం తనకు ముందున్న ధన్యతకు సరైన అద్దం.
1. "అయ్యో!
ధనికులారా! మీరు మీ సుఖములను అనుభవించియున్నారు." (పేదరికానికి
ప్రతిస్పందన) ధనం స్వయంగా పాపం కాదు, యేసు ప్రభువు ఖండిస్తున్నది సంపదను కాదు, సంపదపై అతిగా
ఆధారపడటాన్ని, దాని మీద ఉన్న మొహాన్ని. "మీరు మీ సుఖములను అనుభవించియున్నారు"
అనే మాట, ఇతరుల బాధను పట్టించుకోకుండా ఈ లోకపు సౌకర్యాలనే
జీవితపు అంతిమ లక్ష్యంగా చేసుకున్న జీవన విధానాన్ని ఎత్తిచూపుతుంది.
ధనవంతుడు-లాజరు ఉపమానం (16:19-31) ఈ
హెచ్చరికకు ఉదాహరణ, అక్కడ ద్వారం ముందున్న పేదవాడిని చూడలేని కళ్లే అసలు ప్రమాదం. అటువంటి
మనస్తత్వాన్ని మార్చుకోమనే హెచ్చరిక ఇది.
2. "అయ్యో!
ఇపుడు కడుపునిండినవారలారా! మీరు ఆకలితో అలమటింతురు." (ఆకలికి
ప్రతిస్పందన) ఇక్కడ హెచ్చరించబడేది మనం తృప్తిగా ఉండి ఇతరుల
ఆకలిని మరచిపోయే మనస్తత్వం. కొన్నిసార్లు కడుపు నిండినా హృదయం ఖాళీగా ఉండవచ్చు, ఇతరుల ఆకలిని మరచిపోయే తృప్తి, దేవుని
న్యాయం ముందు తనను తానే బహిర్గతం చేసుకుంటుంది. ఈ హెచ్చరిక ఆకలితో
ఉన్నవారిని పట్టించుకోమని.
3. "అయ్యో!
ఇపుడు నవ్వుచున్నవారలారా! మీరు దుఃఖించి ఏడ్చెదరు." (దుఃఖానికి
ప్రతిస్పందన) యేసు ప్రభువు ఆనందాన్ని నిషేధించడం లేదు. వివాహాలు, పండుగలు, స్నేహాల
ఆనందం దేవుని వరాలే. ఇక్కడ హెచ్చరించబడేది ఇతరుల బాధను చూసి నిర్లక్ష్యంగా నవ్వడం, జీవితపు
లోతైన సత్యాలను పట్టించుకోకపోవడం.
4. "ప్రజలెల్లరు మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము." (నిందకు ప్రతిస్పందన) ఇది కపట ప్రవక్తల గురించిన హెచ్చరిక. నిజమైన ప్రవక్తలు సత్యాన్ని ప్రకటించి తరచూ వ్యతిరేకతను ఎదుర్కొంటారు; కపట ప్రవక్తలు ప్రజలు వినాలనుకున్నదే చెప్పి అందరి మెప్పు పొందుతారు (యిర్మియా 6:14). నాలుగవ ధన్యతలో "నిందకు" లభించే బహుమానానికి, ఇక్కడి "ప్రశంసకు" లభించే అనర్థానికి మధ్య ఉన్న ఈ ఖచ్చితమైన వ్యతిరేకతే.
IV. మహా విలోమం - సువిశేష సారాంశం
ఈ ఎనిమిది వాక్యాల వెనుక ఉన్న కేంద్ర సూత్రం
"మహా విలోమం" (Great Reversal). "ఇపుడు"
అనుభవిస్తున్న స్థితికి, రేపటి వాగ్దానానికి మధ్య యేసు
ప్రభువు స్పష్టమైన వ్యత్యాసాన్ని
చూపుతున్నాడు. ఆకలి, సంతృప్తి, దుఃఖం, ఆనందం, నింద, పరలోక బహుమానం అనే ఒక దిశలో; సుఖం, శోకం, తృప్తి, ఆకలి, నవ్వు, ఏడుపు అనే వ్యతిరేక దిశలో, లోకం పైకి చూస్తుంది; యేసు ప్రభువు
అట్టడుగున ఉన్నవారి వైపు చూస్తాడు. లోకం విజయాన్ని కొలుస్తుంది; యేసు ప్రభువు
కనిపించని లోతును చూస్తాడు.
ఇది కేవలం నైతిక బోధన కాదు, ఇది యేసు ప్రభువు తన స్వంత జీవితంలో నెరవేరిన సత్యం. దేవుడైనవాడు పేదవాడయ్యాడు (2 కొరింథీ 8:9). అందుకే
"దేవరాజ్యము మీది" అనేది కేవలం భవిష్యత్ వాగ్దానం కాదు, క్రీస్తులో ఇప్పటికే ఆరంభమై, పరిపూర్ణత
కోసం ఎదురుచూస్తున్న వాస్తవికత. ఈ "ఇప్పటికే, ఇంకా
పూర్తికాలేదు" అని గుర్తించడం ముఖ్యం. ఇది "అంతా ఇప్పుడే బాగుండాలి" అనే
అమాయక ఆశావాదాన్ని, మరో వైపు "పరలోకంలోనే
బాగుంటుంది కాబట్టి ఇప్పటి అన్యాయాన్ని అంగీకరించాలి" అనే నిష్క్రియత్వాన్ని,
రెండింటినీ తిరస్కరిస్తుంది. బదులుగా ఆశ మరియు క్రియాశీలత రెండింటినీ కలిపి
ఉంచుతుంది.
V. ఆచరణాత్మక అనువర్తనం
ఈ సువిశేష భాగం ప్రకారం, నా జీవితం దేని మీద
నిలబడి ఉంది? అని ప్రశ్నించుకోవాలి.
- వ్యక్తిగత జీవితంలో: నా భద్రత ధనంలో ఉందా, దేవునిలో ఉందా? నా తృప్తి ఇతరుల ఆకలిని మరచిపోయేలా చేస్తోందా? నా నవ్వు ఇతరుల కన్నీళ్లను నిర్లక్ష్యం చేస్తోందా?
- కుటుంబ జీవితంలో: ఆర్థిక కష్టాల్లో ఉన్న
కుటుంబం దేవుని దృష్టిలో తక్కువ కాదు; పరస్పర ఆదరణ, సమాజ సహకారం అవసరం. సంపద ఉన్న కుటుంబాలు ఇతరులతో పంచుకోవడం తెలుసుకోవాలి
తమ వారికి వినయం, కృతజ్ఞత నేర్పించాలి.
- సంఘ జీవితంలో: క్రైస్తవ సంఘం పేదల పట్ల
మూడు విధాలుగా స్పందించాలి, కరుణ
(ఆకలిగొన్నవారికి ఆహారం, అనారోగ్యులకు సేవ), న్యాయం (పేదరికానికి కారణమయ్యే అన్యాయాలను ప్రశ్నించడం), భాగస్వామ్యం (పేదలను సహాయం పొందేవారిగా మాత్రమే కాక సమాజ నిర్మాణంలో
భాగస్వాములుగా చూడటం). దేవుని సేవకులు ప్రజల మెప్పు కోసం సత్యాన్ని
మార్చకూడదు.
- సమాజంలో: ఆధునిక వినియోగ సంస్కృతి
"ఇంకా ఎక్కువ సంపాదించు, ఇంకా ఎక్కువ కొను"
అని బోధిస్తుంది. యేసు ప్రభువుని ప్రశ్న దీనికి భిన్నం: "నీ సంపద నీ
హృదయాన్ని ఎక్కడికి తీసుకెళుతోంది?" సంపదను
స్వార్థం కోసమో, భద్రత కోసమో కాక సేవ
కోసం ఉపయోగించడమే క్రైస్తవ ఆర్థిక ధర్మం.
ముగింపు
లూకా 6:20-26లో యేసు ప్రభువు ఒక కొత్త వ్యవస్థను ప్రతిపాదిస్తున్నాడు. ఇది
"పేదరికమే పవిత్రత," "ధనికులందరూ
చెడ్డవారు," "బాధను కోరుకోవాలి" అనే తప్పుడు అర్థాలను
సమర్థించదు. బదులుగా ఇది మూడు స్పష్టమైన పిలుపులు ఇస్తుంది. పేదరికాన్ని తొలగించడానికి కృషి చేయాలి; ధనవంతులు తమ
సంపదను న్యాయంగా, సేవగా ఉపయోగించాలి; బాధను
కోరుకోకపోయినా అది వచ్చినప్పుడు విశ్వాసం విడువకూడదు. ధన్యులు అనగా కేవలం
బాధపడేవారు కాదు, దేవుని కృపకు తమ
హృదయాలను తెరిచి, ఆ కృపను ఇతరులతో
పంచుకునేవారు.
ప్రార్థన
ప్రభువా, పేదలలో నీ ముఖాన్ని చూడగల
కృపను మాకు ప్రసాదించు. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వగల హృదయాన్ని, దుఃఖిస్తున్నవారిని
ఆదరించగల కరుణను మాకు ఇవ్వు. నీ నామం కోసం అవమానం ఎదురైనప్పుడు విశ్వాసాన్ని
విడిచిపెట్టకుండా ఉండే ధైర్యాన్ని దయచేయి. మా సంపద మమ్మల్ని నీ నుండి దూరం
చేయనీయకు; మా తృప్తి ఇతరుల ఆకలిని మరచిపోయేలా చేయనీయకు; ప్రజల
ప్రశంస కోసం సత్యాన్ని విడిచిపెట్టనీయకు. నీ రాజ్యపు విలువలలో జీవిస్తూ, పేదలకు ఆశగా, బాధపడుతున్నవారికి
ఆదరణగా మమ్మల్ని మార్చు. ఆమేన్.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment