ద్రాక్షతోట కూలీల ఉపమానం | 25వ సామాన్య ఆదివారం ప్రసంగం
దేవుని లెక్క వేరు
సామాన్య కాలపు 25వ ఆదివారం – సంవత్సరం A | యెషయా 55:6-9 · ఫిలిప్పీయులకు 1:20-24, 27a · మత్తయి 20:1-16
పట్టణంలోని ఏ
కూడలికైనా తెల్లవారుజామున వెళ్ళండి. రోడ్డు పక్కన కూలీలు గుంపులుగా నిలబడి ఉంటారు.
చేతిలో భోజనపు బాక్స్ , భుజం మీద తువ్వాలు, కళ్ళల్లో ఒకే ఆశ, “ఈ రోజు ఎవరైనా పిలుస్తారా?” ఎవరో ఒకరు వచ్చి “నలుగురు కావాలి” అంటారు. బలంగా, యవ్వనంగా ఉన్నవారు ముందు వెళ్ళిపోతారు. సూర్యుడు
పైకి ఎక్కుతుంటాడు. మిగిలినవారు వెళ్ళినవారి వైపు చూస్తూ నిలబడతారు, వృద్ధుడు లేక బక్కపలచని యువకుడు, చేతికి దెబ్బ తగిలినవాడు, నిన్న కూడా పని దొరకక ఇంటికి వెళ్ళినవాడు అక్కడే ఉండిపోవచ్చు.
మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అవుతుంది, అయినా వారు కదలరు. ఎందుకంటే ఖాళీ చేతులతో ఇంటికి
వెళ్తే ఆ రాత్రి ఇంటిలోని వారికి భోజనం ఉండకపోవచ్చు.
నేటి సువార్తలో
యేసు ప్రభువు చూపిస్తున్న దృశ్యం ఇదే. ఈ కథలో అసలైన కేంద్ర పాత్రలు సాయంత్రం ఐదు
గంటలకు కూడా నిలబడి ఉన్న ఆ కూలీలే. “ఇక్కడ ఎందుకు వారు
ఖాళీగా నిలబడ్డారు?” అని యజమాని అడిగినప్పుడు వారి జవాబు గమనించండి, “ఎవరూ మమ్మల్ని కూలికి పిలవలేదు.” వారు సోమరులు
కాదు. ఎవరైన కూలికి పిలువకపోతారా అనే ఆశతో
అక్కడే రోజంతా ఎదురుచూసినవారు.
తోటకు కూలీలా, కూలీలకు తోటా?
ఈ కథ మనకు తెలుసు.
ద్రాక్షతోట యజమాని తెల్లవారుజామున బయలుదేరి కూలీలను పిలిచి, రోజుకు ఒక దినారం కూలి అని ఒప్పందం చేసుకుంటాడు.
తొమ్మిది గంటలకు మళ్ళీ వెళ్తాడు, పన్నెండు గంటలకు, మరల మూడు గంటలకు వెళతాడు, చివరికి సాయంత్రం ఐదు గంటలకు, పని ముగియడానికి ఇంకా ఒక్క గంట ఉండగా కూడా వెళ్ళి, ఖాళీగా నిలబడినవారిని తోటలోకి పంపుతాడు.
ఇన్ని సార్లు యజమాని
స్వయంగా వెళ్ళాడు. తోటకు ఎంతమంది కావాలో లెక్క వేసుకొని ఉంటే ఉదయమే సరిపోయేది కదా.
ఆయన వెళ్ళింది తోట అవసరం కోసం కాదు, కూలీల అవసరం కోసం.
తోటకు కూలీలు కావాలి అన్నది సగం నిజం; కూలీలకు తోట కావాలి
అన్నది పూర్తి నిజం.
ఒక దినారం అంటే
ఏమిటో తెలుసా? ఆ రోజు పొయ్యిలో
మంట, పిల్లల కడుపులో
అన్నం, రేపటి కోసం ఆశ.
యజమానికి అది ధనం కాదు; ఒక కుటుంబాన్ని ఆ
రాత్రి కాపాడే బహుమతి.
సాయంత్రం కూలి
ఇచ్చే వేళ యజమాని చివరివారితో కూలి ఇవ్వడం మొదలుపెట్టమంటున్నాడు. ఒక్క గంట పని చేసినవారికి
ఒక దినారం వస్తుంది. ఆ మనుషుల ముఖాలు ఎలా
వెలిగి ఉంటాయో ఊహించండి. కానీ మొదట వచ్చిన కూలీలు అది చూస్తున్నారు, వారి మనసులో లెక్కలు మొదలవుతున్నాయి. ఇప్పుడే వచ్చిన
వీరికి మొత్తం కూలి ఇస్తే,
“మాకు ఇంకా ఎక్కువ వస్తుంది.” అనుకుంటున్నారు. కాని
తమ చేతిలో కూడా ఒక దినారమే పడినప్పుడు
వారు సణుగుతున్నారు. ఒక గంట పని చేసిన వీరిని
మాతో సమానం చేశావే అని బాధ పడుతున్నారు.
నిజానికి వారికి
ఎటువంటి అన్యాయం జరగలేదు. ఒప్పుకున్న కూలి వారికి అందింది. వారి బాధ తమ చేతిలో
ఉన్నదాని గురించి కాదు; పక్కవాడి చేతిలో
ఉన్నదాని గురించి. యజమాని జవాబు గుండెను తాకుతుంది: “'మిత్రమా! నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు ఒక
దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు
తీసికొని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపటి వానికిని ఇచ్చుట నా యిష్టము. నా ధనమును నా
యిచ్చవచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగానున్నదా?' అని పలికెను.” అసలు సమస్య యజమాని ఇవ్వడంలో కాదు; ఆయన మంచితనాన్ని చూసి సహించలేకపోవడంలో ఉంది. యజమాని
“మిత్రమా” అని పిలుస్తున్నాడు, ఆయన
కోపగించుకోవడం లేదు. సణిగినవారిని కూడా ప్రేమతో పలకరిస్తున్నాడు. లెక్కలు
వేసేవారిని కూడా దేవుడు దూరం చేయడు; వారిని కూడా తన
ఔదార్యం లోకి ఆహ్వానిస్తూనే ఉంటాడు.
మనలో దాగిన మొదటి కూలీ
మనలో చాలామంది ఈ మొదట
వచ్చిన కూలీల్లాగే ఉన్నాం. అది మనకు
తెలియదు, ఎందుకంటే మనం
మనల్ని అసూయపరులుగా చూసుకోం; “న్యాయం కోరేవారు”గా
చూసుకుంటాం. ఇంట్లో ఏళ్ళ తరబడి అమ్మను చూసుకున్న అక్క, ఈ మధ్యే వచ్చి అందరి ప్రేమ పొందే తమ్ముడి వైపు
చూసినప్పుడు కలిగే భావన ఇదే. ముప్ఫై ఏళ్ళు పరిచర్య చేసినవారు, నిన్న వచ్చిన యువకుడికి దక్కే ప్రశంసను
చూసినప్పుడు కలిగే భావన ఇదే. ఏళ్ళుగా ప్రతి ఆదివారం దేవాలయానికి వచ్చేవారు, ఎంతో కాలం దూరమై ఇప్పుడే తిరిగి వచ్చినవారికి
లభించే ఆదరణను చూసినప్పుడు కలిగే భావన ఇదే.
“నేను ఇన్ని
సంవత్సరాలు…” అనే మాట మన నోటి నుండి వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. ఆ మాటలో ఒక మొదటి
కూలీ మనస్తత్వం ఉంది.
దేవుని కృప ఎందుకు మనల్ని కలవరపెడుతుంది?
ఎందుకంటే మన
గుర్తింపును మనం తరచు మన సంపాదన మీద నిర్మించుకుంటాం. “నేను ఇంత పని చేశాను, సంపాదించాను, కాబట్టి నేను ఇంతవాడిని అయ్యాను” అనే భావన మనకు
భద్రత ఇస్తుంది అనుకుంటాం. కాని
దేవుని కృప ఆ భద్రతను కదిలిస్తుంది. ఎవరైనా ఏమీ
చేయకుండానే అదే ప్రేమను పొందుతున్నారంటే, మన శ్రమకు విలువ
లేదా అని మనసు అడుగుతుంది. కానీ దేవుని రాజ్యంలో మన విలువ మన శ్రమ మీద కాదు, ఆయన పిలుపు మీద ఆధారపడి ఉంది. ఆ సత్యాన్ని
అంగీకరించినప్పుడు మనం మొదటిసారి నిజంగా విశ్రమిస్తాం. మొత్తం ఆయన చేతులలోనికి వడాలిపెడతాం.
అసూయ ఆనందాన్ని దొంగిలిస్తుంది
మొదట వచ్చిన కూలీలకు నిజానికి ఏమీ తక్కువ కాలేదు. కానీ ఒక్క
క్షణంలో వారు తమ జీతాన్ని కాదు, తమ సంతోషాన్ని
పోగొట్టుకున్నారు. కొద్ది క్షణాల ముందు వరకు వారికి ఇంటికి ఒక దినారం తీసుకెళ్ళే
ఆనందం ఉండేది; పక్కవాడి చేతిని
చూసిన తరువాత ఆ దినారం భారంగా మారింది. అసూయ ఇలా చేస్తుంది, నీ ఆనందాన్ని దొంగిలిస్తుంది.
మనకు ఉన్నదానిని మన కళ్ళ ముందు నుండి
తీసివేసి, లేనిదానిని
చూపిస్తుంది. “కంటగింపు” అంటే ఇదే, మంచిని
చూడలేని కన్ను. ఇతరులకు దేవుడు ఇచ్చినదాన్ని చూసి బాధపడటం, తనకు దేవుడు ఇచ్చినదాన్ని చూడలేకపోవడం.
దేవుడు అన్యాయం చేయడు
ఇక్కడ మొదట వచ్చిన వానికి
న్యాయం జరిగింది. కానీ ఆయన న్యాయంతో ఆగిపోలేదు; న్యాయానికి మించి వెళ్ళాడు. మన ఇళ్ళలో దీనికి ఒక
చిత్రం ఉంది. ఒక తల్లి సాయంత్రం అందరు పిల్లలకూ అన్నం వడ్డిస్తుంది. పొద్దున్నే ఉద్యోగానికి
వెళ్ళిన పెద్దవాడికి, మధ్యాహ్నం వచ్చినవాడికి, ఆలస్యంగా అలసిపోయి ఇంటికి వచ్చిన చిన్నవాడికి, ఉద్యోగం
లేని వాడికి, అదే అన్నం వడ్డిస్తుంది. “నేను ఉదయం నుండి కష్టపడ్డాను” అని పెద్దవాడు
అంటే తల్లి ఏమంటుంది? “నీ పళ్ళెంలో ఏమైనా
తగ్గిందా నాన్నా? వాడు కూడా నా
బిడ్డే” అంటుంది. దేవుని రాజ్యం జీతాల
పట్టిక కాదు; తల్లి ఇల్లు.
యెషయా: ఆయన ఆలోచనలు వేరు
ఈ అసౌకర్యాన్ని
ముందే పసిగట్టినట్టు మొదటి పఠనంలో యెషయా ప్రవక్త “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాలు వంటివి కావు” అంటున్నాడు. యెషయా ప్రవక్త ఈ మాట చెప్పింది మొదట క్షమాపణ
గురించి. దుష్టుడు తన మార్గం విడిచి ప్రభువు వైపు తిరిగితే, ఆయన విస్తారంగా క్షమిస్తాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావు.
మనం క్షమను కొలిచి
ఇస్తాం. “ఎన్నిసార్లు తప్పు చేశావు? ఎంత చేశావు?” అని అడుగుతాం. దేవుడు లెక్కలు అడగడు. బాబిలోనియా, చెరలో ఉన్న ప్రజలకు ఇది గొప్ప వార్త! వారి నిరాశ, వారి తప్పులు, వారు వృథా చేసుకున్న సంవత్సరాలు, వీటన్నిటికంటే దేవుని కరుణ ఎత్తు ఎక్కువగా ఉంటుంది.
అందుకే “ప్రభువు దొరుకునప్పుడే ఆయనను
వెదకుడు” అని యోషయా ప్రవక్త చెబుతున్నాడు.
ఆలస్యమైందని నిరాశ పడవద్దు; కానీ ఆలస్యం
చేయవద్దు అని అంటున్నాడు. ఈ రోజు నీ తొలి గంట కావచ్చు, పదకొండవ గంట కావచ్చు, తోట తలుపు తెరిచే ఉంది. “మార్గం” అంటే మన నడవడి; “తలంపులు” అంటే మన లోపలి ఆలోచనలు, మనసులో మనం చెప్పుకునే మాటలు. తిరగడం అంటే రెండూ
మారడం: నడకా, లోపలి స్వరమూ.
యెషయా 55 ఈ మాటలకు
ముందే ఒక విందుకు పిలుస్తుంది: “ధనము లేనివారు కూడా రండి.” కొనడానికి డబ్బు
లేనివారిని రమ్మని పిలవడం విచిత్రం కదా! అది కొనుగోలు కాదు, బహుమతి. ఈ ఉచిత విందే నేటి సువార్తలో ఒక దినారంగా
మనకు కనబడుతుంది, ఇది మనం సంపాదించలేనిది, దేవుడు
ఇవ్వాలనుకున్నది.
ఎవరూ పిలవనివారికి శుభవార్త
ఈ ఉపమానంలో ఒక మాట మన మనసును ఎప్పుడూ కదిలిస్తుంది: “ఎవరూ మమ్మల్ని
పిలవలేదు.” మనలో కొందరు ఇలాంటి భావనతోనే జీవిస్తున్నారు. చదువు పూర్తయినా ఉద్యోగం
రాని యువకుడు. ఏళ్ళుగా ఎదురుచూస్తున్నా తనకు అవకాశం రాలేదనుకునే వృద్ధురాలు.
యవ్వనాన్ని తప్పు దారుల్లో వృథా చేసుకున్నానని బాధపడే వ్యక్తి. “నా సమయం
అయిపోయింది” అనుకునేవారు. ఈ సువార్త వారికి చెబుతున్నది: యజమాని ఇంకా సంతలో
ఉన్నాడు. ఆయన నీ కోసం వెదుకుతున్నాడు. నీవు ఆలస్యంగా వచ్చినందుకు ఆయన నిన్ను
తక్కువగా చూడడు; ఆయన నిన్ను పిలవడానికే
వచ్చాడు.
ఇక్కడ మనకు కూడా ఒక
బాధ్యత ఉంది. “ఎవరూ పిలవలేదు” అనే మాటలో ఒక ఆరోపణ ఉంది. కొన్నిసార్లు మనమే వారిని
పిలవడం మరచిపోయాం. ఒంటరిగా ఉన్న పొరుగువాడిని, పనిలేని యువకుడిని, సమాజం పక్కకు నెట్టిన కుటుంబాన్ని ఎవరు పిలుస్తారు? యజమాని స్వయంగా సంతకు వెళ్ళినట్టు, సంఘం కూడా తన గోడల బయటకు వెళ్ళాలి. దేవాలయం తలుపు
తెరిచి ఉంచడం సరిపోదు; సంతలో
నిలబడినవారిని వెదకి పిలవాలి.
అయితే ఇది మన శ్రమ
వ్యర్థమని చెప్పడం కాదు. తొలి కూలీలు యజమానితో ఎక్కువ కాలం తోటలో ఉన్నారు.
క్రీస్తుతో ఎక్కువ కాలం నడిచిన భాగ్యం అది. దానిని బరువుగా కాక, బహుమతిగా చూడగలిగితే వారు సణిగేవారు కాదు, ఆనందించేవారు. ఏళ్ళుగా సేవ చేసినవారి అసలైన బహుమతి,
ఆ సేవలోనే ప్రభువు సన్నిధి అనుభవించడం.
పౌలు: “నాకు బ్రతుకుట క్రీస్తే”
రెండవ పఠనంలో పౌలు
చెరసాల గోడల మధ్య నుండి మాట్లాడుతున్నాడు. రేపు విడుదల అవుతాడో, మరణశిక్ష పడుతుందో అతనికి తెలియదు. అటువంటి
స్థితిలో మనిషి తన జీవితాన్ని లెక్క వేసుకుంటాడు, ఇంకా ఎంతకాలం? ఏం మిగిలింది? అనుకుంటాడు.
కానీ ఆ పరిస్థితిలో కూడా పౌలు ఒకే ప్రశ్న
గురించి ఆలోచిస్తున్నాడు, “క్రీస్తు నా
ద్వారా ఘనపరచబడుతున్నాడా?” “నాకు బ్రతుకుట
క్రీస్తే, చావు లాభమే.”
కొందరికి ఈ మాట మరణ
కాంక్షలా వినిపిస్తుంది, పౌలు ఉద్దేశం అది కాదు. తరువాతి వచనాల్లోనే ఇది మనకు అర్ధం అవుతుంది.ఆయనకు
క్రీస్తుతో ఉండాలనే కోరిక ఉంది, కానీ “మీ నిమిత్తము జీవించుట అవసరము.” తనకు ఏది శ్రేష్ఠమో తెలిసి
కూడా, ఇతరులకు ఏది అవసరమో
దానిని ఎంచుకుంటున్నాడు. “నేను ఇరుప్రక్కల చిక్కుకొంటిని. ఈ జీవితమును త్యజించి
క్రీస్తును చేరవలెనని నేను గాఢముగా వాంఛించుచున్నాను. అది ఉత్తమమైనదే. నేను
జీవించియుండుట మీకు మరింత అవసరము.” తేడా చూడండి: మొదట వచ్చిన కూలీలు “నాకు ఎంత?” అని అడిగారు; పౌలు “మీకు ఏమి
కావాలి?” అని అడుగుతున్నాడు.
పౌలు కూడా ఒక
విధంగా పదకొండవ గంటలో వచ్చినవాడే. క్రీస్తు సంఘాన్ని పౌలు హింసించిన తరువాతనే దేవుడు పౌలును పిలిచాడు. అందుకే పౌలు “దేవుని కృపవలననే
నేను ఇలా ఉన్నాను” అని అంటున్నాడు. తన
శ్రమను లెక్కపెట్టే బదులు, తన పిలుపును కృపగా
చూశాడు. అటువంటి వ్యక్తికి పోలికలు చేసే తీరిక ఉండదు. ఎందుకంటే అతని దృష్టి ఇతరుల
చేతుల మీద కాదు, యజమాని మీద ఉంది.
అందుకే చివరలో “సువార్తకు తగినట్లుగా జీవించండి” అంటున్నాడు. అంటే దేవుని కృపను అర్థం చేసుకున్నవారిలా, ఇతరులతో ఉదారంగా జీవించండి.
ఈ భాగానికి
కొద్దిగా ముందే పౌలు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాడు. కొందరు అసూయతో, పోటీతో క్రీస్తును ప్రకటిస్తున్నారు; పౌలు చెరలో ఉండగా తాము మరింత పేరు సంపాదించవచ్చని
భావిస్తున్నారు. అందుకు పౌలు, “ఏ విధముగానైనను
క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు; అందుకు నేను
సంతోషించుచున్నాను.” తన స్థానం పోతుందనే భయం ఆయనకు లేదు. వేదిక ఎవరిదైనా, మాట క్రీస్తుదైతే చాలు. మొదట వచ్చిన కూలీలకు లేనిదీ ఇదే, ఇతరుల విజయంలో ఆనందించగల విశాలమైన హృదయం.
ఈ వారం మనం చేయవలసినవి
ఈ ఆదివారం మనం
ఇంటికి వెళ్ళేటప్పుడు మూడు చిన్న పనులను మనతో తీసుకెళ్దాం. ఈ వారం ఎవరి విషయంలో
మనసులో “వారికి ఎందుకు ఎక్కువ?” అనే ప్రశ్న మొదలవుతుందో
గుర్తుచేసుకోండి. ఆ వ్యక్తి కోసం ఒక్క
ప్రార్థన చేయండి. పోలిక ప్రార్థనకు లొంగినప్పుడు కరిగిపోతుంది.
ఆలస్యంగా తిరిగి
వచ్చేవారిని ఆహ్వానించండి. దూరమైన బంధువును, ఎంతో కాలం
దేవాలయానికి రాని పొరుగువాడిని “ఇంతకాలం ఎక్కడ ఉన్నావు?” అని కాక, “స్వాగతం, మేము నీ కోసం ఎదురుచూస్తున్నాం” అని పలకరించండి.
కూలీల అడ్డాలో నిలబడినవారిని గుర్తుంచుకోండి. మన
ఇంట్లో, పొలంలో, దుకాణంలో పని చేసేవారికి వారి కుటుంబం అన్నం
తినడానికి సరిపడా న్యాయమైన కూలి ఇవ్వండి. యజమాని ఇచ్చిన దేనారం ఆ కుటుంబపు ఆకలిని
తీర్చడానికే.
ముగింపు
మనం ఎన్నో లెక్కలు
వేసుకొని, ఎన్నో తప్పులు చేసి, ఎంతో ఆలస్యంగా వచ్చినా, యజమాని ఇప్పటికీ సంతలో మన కోసం వెదుకుతున్నాడు.
నీవు తొలి గంటకు వచ్చిన కూలీవైనా, పదకొండవ గంట కూలీవైనా, అదే దినారం అదే ప్రేమ, అదే పూర్తి జీవితం.
కనుక ఇతరుల చేతుల్లోని దినారాలను లెక్కపెట్టడం మాని, మన చేతిలో ఉన్న దినారానికి దేవునికి కృతజ్ఞత
చెబుదాం. ఆ కృతజ్ఞత మనలను ఇతరుల ఆనందంలో పాలుపంచుకునేలా చేస్తుంది.
ఇతరులను చెరదీసే సమయంలో
లెక్కలు వేయడం మానేద్దాం; తోటలో ఆనందంతో పని చేద్దాం. దేవుని ఇంట్లో స్థలం
అందరికీ ఉంది; అక్కడ ఎవరూ అతిథులు
కారు, అందరూ ఆయనకు చెందిన
వారే. ఎవరూ తమ శ్రమతో దేవుని రాజ్యాన్ని కొనలేరు; ప్రతి ఒక్కరూ యజమాని మంచితనం వల్లనే లోపలికి వెళ్లారు.
ప్రార్థన
ప్రభువా, నీ ఆలోచనలు మా ఆలోచనల కంటే ఉన్నతమైనవని నేడు మాకు
గుర్తు చేశావు. మేము ఇతరులతో పోల్చుకునే ప్రతిసారీ నీ ఔదార్యాన్ని చూసే కళ్ళు మాకు
ఇవ్వు. పౌలువలె, “నాకు బ్రతుకుట
క్రీస్తే” అని చెప్పగల హృదయాన్ని దయచేయి. ఆలస్యంగా నీ దగ్గరికి వచ్చేవారిని
ప్రేమతో స్వాగతించే మనసును మాకు ప్రసాదించు. కూలీల అడ్డాల్లో నీ పిలుపు కోసం ఎదురుచూసే సోదరులకు నీ
కృప అందేలా మమ్మల్ని సాధనాలుగా వాడుకో. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment