విత్తువాని ఉపమానం ధ్యానం - లూకా 8:4-15 వ్యాఖ్యానం

 

 

ప్రతి పట్టణమునుండి పెద్ద ప్రజా సమూహము యేసువద్దకు వచ్చెను. అపుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్ప నారంభించెను: “విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలు దేరెను. అతడు విత్తనములు చల్లునపుడు కొన్ని విత్తన ములు త్రోవప్రక్కనపడగా అవి తొక్కివేయబడెను, పక్షులువచ్చి వాటిని తినివేసెను. మరికొన్ని రాతినేలమీద పడగా తేమ లేనందున అవి మొలకలు ఎత్తగనే ఎండి పోయెను. మరికొన్ని విత్తనములు ముండ్లపొదల మధ్య పడినవి. కాని మొక్కలతో పాటు ముండ్లపొదలు ఎదిగి ఆ మొక్కలను అణచివేసినవి. ఇంకను కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలిచి పెరిగి నూరంతలుగా ఫలించినవి” అని చెప్పి, “వినుటకు వీనులున్నవాడు వినునుగాక!” అనెను. యేసు శిష్యులు అపుడు ఈ ఉపమానము యొక్క భావము ఏమిటని ఆయనను అడిగిరి. పరలోకరాజ్య పరమరహస్యముల జ్ఞానము అను గ్రహింపబడినది మీకే, ఇతరులు చూచియు చూడ కుండుటకు, వినియు గ్రహింపకుండుటకు, వారికి ఉపమానముల మూలమున బోధింపబడును. ఈ ఉపమానములోని భావము ఏమనగా, విత్తనము దేవుని వాక్కు. త్రోవప్రక్కనపడిన విత్తనములను పోలినవారు దేవునివాక్కులను ఆలకింతురుగాని, వారు నమ్మి రక్షింపబడకుండునట్లు సైతాను వారి హృదయమునుండి వాటిని ఎత్తుకొని పోవును. దేవుని వాక్కును ఆలకించి సంతోషముతో స్వీకరించువారు, రాతిమీదపడిన విత్తనముల వంటివారు. వేరు లేనందున అట్టివారు కొలదికాలము మాత్రమే విశ్వసించి శోధనకాలమున పతనమగుదురు. ముండ్లపొదల మధ్యన పడిన విత్తనము లను పోలినవారు సందేశమును ఆలకింతురుగాని, వారు ప్రాపంచిక చింతలచేత, ధనవ్యామోహముచేత, సుఖభోగములచేత అణచివేయబడి తగుఫలమును ఈయరు. సారవంతమైన నేలపైబడిన విత్తనము లను పోలినవారు, యోగ్యమైన మంచిమనస్సుతో దేవుని వాక్కును ఆలకించి, అవలంబించి ఓర్పుతో ఫలించువారు.

విత్తువాని ఉపమానం

లూకా సువార్త 8:4-15 పై ధ్యానాత్మక వ్యాఖ్యానం

1. పరిచయం - ఒకే వాక్కు, వేర్వేరు హృదయాలు

లూకా సువార్త 8వ అధ్యాయం ఆరంభంలో మనం జాగ్రత్తగా గమనించవలసినది,  యేసు ప్రభువు వెంట మగ్దల మరియ, యోహన్న, సూసన్న వంటి స్త్రీలు తమ సొంత వనరులతో సేవ చేస్తూ నడుస్తున్నారు (లూకా 8:1-3). "ప్రతి పట్టణమునుండి పెద్ద ప్రజా సమూహము" ఆయన వద్దకు వస్తుంది.  యేసు ప్రభువు  పరిచర్య విస్తృతి పెరుగుతున్నది.   వివిధ ఉద్దేశాలతో  ప్రజలు ఆయన మాటలు వినడానికి గుమిగూడారు. కొందరు ఆసక్తితో, కొందరు స్వస్థత కోసం, కొందరు అద్భుతాలు చూడటానికి, మరికొందరు నిజంగా సత్యాన్వేషణతో  అక్కడకి వచ్చారు.

ఈ నేపథ్యంలోనే యేసు ప్రభువు  విత్తువాని ఉపమానాన్ని చెప్పాడు. ఇది కేవలం ఒక వ్యవసాయ దృశ్యం కాదు; ఇక్కడ ప్రధాన ప్రశ్న 'విత్తనం మంచిదా, కాదా' అనేది కాదు,  విత్తనం ఎప్పుడూ ఒక్కటే, అది  దేవుని వాక్కు. అసలు ప్రశ్న,  ఆ వాక్కు పడే నేల ఎలాంటిది? అంటే, నా హృదయం ఎలాంటిది? ఈ ఉపమానం ఇతరులను వర్గీకరించడానికి ఇవ్వబడినది కాదు. ఇది మొదట మనలను, మన స్వంత హృదయాన్ని పరిశీలించుకోమని చెబుతున్నది. ఒకే సువార్తను ఇద్దరు వ్యక్తులు వింటారు.  ఒకరు మారిపోతారు, మరొకరు మారరు; ఒకరు క్షమించడం నేర్చుకుంటారు, మరొకరు ద్వేషాన్ని పేట్టుకొని ఉంటారు. దానికి కారణం వాక్కులో లేదు; వాక్కును స్వీకరించే హృదయంలో ఉంది.

2. వ్యవసాయ నేపథ్యం - నాలుగు నేలలు, ఒకే విత్తనం

ఆనాటి పాలస్తీనా వ్యవసాయ పద్ధతిలో రైతు ముందుగా విత్తనాలు చల్లి, ఆ తరువాత దుక్కి దున్నేవాడు. అంటే విత్తువాడు నేల ఎలా ఉందో ముందుగానే వేరు చేసి చూడకుండా, ఔదార్యంగా, విత్తనం వెదజల్లేవాడు,  త్రోవపైనా, రాళ్లమీదా, ముండ్ల మధ్యా, మంచి నేలపైనా సమానంగా విత్తనాలు జల్లబడతాయి. ఇది దేవుని వాక్కు ప్రకటన యొక్క గుణాన్నే సూచిస్తుంది.  దేవుడు ఎవరినీ ముందుగానే తీర్పు తీర్చి విడిచిపెట్టడు; ప్రతి హృదయానికీ సమానమైన అవకాశం ఇస్తాడు.

త్రోవప్రక్కన పడిన విత్తనం లోనికి చొచ్చుకుపోకుండా తొక్కబడి, పక్షులచే తినివేయబడుతుంది. రాతినేలపై పడినది, పైన కొద్దిపాటి మట్టి, కింద రాతి పొర ఉండటంతో,  వేగంగా మొలకెత్తినా, వేరు లోతుగా వెళ్లలేక ఎండిపోతుంది. ముండ్లపొదల మధ్య పడినది మొలకెత్తినా, ముండ్లు వేగంగా పెరిగి పోషకాలను, వెలుతురును, నీటిని లాక్కొని ఆ మొక్కను అణచివేస్తాయి. సారవంతమైన నేలపై పడినది మాత్రం లోతుగా వేరుపారి, పెరిగి నూరంతలుగా ఫలిస్తుంది.  ఆనాటి పాలస్తీనాలో సాధారణ దిగుబడి ఏడు నుండి పది రెట్లు మాత్రమే కావడంతో, నూరు రెట్లు అనేది వినేవారికి అద్భుతంగా, అసాధారణంగా అనిపించి ఉండాలి.

3. ఉపమానాలు ఎందుకు?

శిష్యులు ఉపమాన భావం అడిగినప్పుడు యేసు  ప్రభువు, "పరలోకరాజ్య పరమరహస్యముల జ్ఞానము అనుగ్రహింపబడినది మీకే, ఇతరులు చూచియు చూడకుండుటకు, వినియు గ్రహింపకుండుటకు, వారికి ఉపమానముల మూలమున బోధింపబడును" (లూకా 8:10) అని చెబుతున్నారు.  ఈ మాటలు యెషయా 6:9-10ను ప్రతిధ్వనిస్తాయి, అక్కడ ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజల హృదయ కాఠిన్యం గురించి దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు.

ఉపమానాలు దేవుని రహస్యాలను దాచడానికి ఉద్దేశించినవి కావు, ఉపమానం అందరికీ అందుబాటులో ఉండే సామాన్య, రోజువారీ దృష్టాంతం. కానీ దాని లోతైన అర్థం గ్రహించాలంటే హృదయం తెరిచి ఉండాలి, వినయంతో అడగాలి.  తెరిచిన హృదయానికి అది రహస్యాన్ని విప్పి చూపిస్తుంది.

4. మొదటి నేల - త్రోవప్రక్క, నిర్లక్ష్యపూరిత హృదయం

"త్రోవప్రక్కనపడిన విత్తనములను పోలినవారు దేవునివాక్కులను ఆలకింతురుగాని, వారు నమ్మి రక్షింపబడకుండునట్లు సైతాను వారి హృదయమునుండి వాటిని ఎత్తుకొని పోవును. అనేక పాదాల తొక్కుడుతో గట్టిపడిన త్రోవలా, ఈ హృదయం నిత్యజీవిత వ్యాపకాలతో, ఉదాసీనతతో కఠినమైపోయింది. వాక్కు చెవిలోకి వస్తుంది కానీ హృదయంలోకి చొచ్చుకుపోదు.

ఇక్కడ యేసు ప్రభువు  స్పష్టంగా సైతాను పాత్రను ప్రస్తావిస్తాడు,  వాక్కు హృదయంలో వేరూనుకునేలోపే దాన్ని దొంగిలించడానికి శత్రువు చురుగ్గా పనిచేస్తాడు. ఇది గుర్తుచేసేది ఏమిటంటే, వాక్కు వినడం మొదలైన క్షణం నుండే ఆరంభమవుతుంది. అశ్రద్ధగా వినడం, ధ్యానించకపోవడం ద్వారా హృదయం మరింత కఠినమవుతుంది.  ఫరో హృదయం వలె, ప్రతిసారీ వినడం ద్వారానే గట్టిపడుతుంది. కాబట్టి ప్రశ్న 'నేను వింటున్నానా' లేదా కాదు,  'విన్న తరువాత నేను ఏమి చేస్తున్నాను' అనేదే ముఖ్యమైనది.

5. రెండవ నేల - రాతినేల, లోతులేని విశ్వాసం

"దేవుని వాక్కును ఆలకించి సంతోషముతో స్వీకరించువారు, రాతిమీదపడిన విత్తనముల వంటివారు. వేరు లేనందున అట్టివారు కొలదికాలము మాత్రమే విశ్వసించి శోధనకాలమున పతనమగుదురు". ఇక్కడ వాక్కు తిరస్కరించబడలేదు,  పైగా సంతోషంగా స్వీకరించబడింది! రాతి పలక సూర్యుని వేడిని త్వరగా తీసుకొని  మొలకను వేగంగా తీసుకువస్తుంది. కానీ లోతైన వేరు లేదు.

ఒక మంచి ప్రసంగం విన్నప్పుడు ఉత్సాహపడవచ్చు; ఒక ఆధ్యాత్మిక సమావేశంలో కన్నీళ్లు రావచ్చు; ఒక శిబిరంలో దేవునికి దగ్గరయ్యామని అనిపించవచ్చు. కానీ ఆ అనుభూతి తర్వాత జీవితం మారకపోతే, వేరు ఏర్పడలేదు. వేరు అంటే ప్రార్థనలో స్థిరత్వం, వాక్కులో నిరంతర ధ్యానం, సంస్కార జీవితంలో నిబద్ధత, కష్టకాలంలో నిలబడే విశ్వాసం.

6. మూడవ నేల - ముండ్లపొదలు, విభజిత హృదయం

"ముండ్లపొదల మధ్యన పడిన విత్తనములను పోలినవారు సందేశమును ఆలకింతురుగాని, వారు ప్రాపంచిక చింతలచేత, ధనవ్యామోహముచేత, సుఖభోగములచేత అణచివేయబడి తగుఫలమును ఈయరు”. ఇది ఆధునిక జీవితానికి అత్యంత దగ్గరగా ఉన్న నేల. ఇక్కడ నేల చెడ్డది కాదు, నిజానికి ఇది సారవంతమైనదే, సమస్య నేలలో లేదు, దానిలో ఇప్పటికే పాతుకుపోయిన ముండ్ల వేళ్లలో ఉంది.

యేసు ప్రభువు  మూడు విషయాలను ప్రత్యేకంగా సూచిస్తున్నాడు. ప్రాపంచిక చింతలు,  కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక ఒత్తిడి, ఆరోగ్యం గురించిన ఆందోళనలు నిజమైనవే, వాటిని నిర్లక్ష్యం చేయమని యేసు ప్రభువు చెప్పడం లేదు; కానీ అవి దేవునికంటే పెద్దవిగా మారినప్పుడు ముండ్లుగా మారతాయి. ధనవ్యామోహం,  ధనం జీవించడానికి అవసరమే, కానీ 'ఇంకొంచెం సంపాదిస్తేనే సంతోషిస్తాను' అనే ఆలోచన దేవుని స్థానాన్ని ఆక్రమించినప్పుడు వ్యామోహంగా మారుతుంది. సుఖభోగాలు,  విశ్రాంతి తప్పు కాదు, కానీ అది జీవితానికి అంతిమ లక్ష్యంగా మారినప్పుడు ప్రార్థనకు, వాక్కు పఠనానికి, సేవకు సమయం మిగలదు.  కానీ వినోదానికి, సామాజిక మాధ్యమాలకు సమయం ఉంటుంది. అప్పుడు సమస్య సమయం లేకపోవడం కాదు,  మన ప్రాధాన్యతలు మారిపోవడం.

7. నాలుగవ నేల - సారవంతమైన నేల, ఆశ యొక్క సందేశం

"సారవంతమైన నేలపైబడిన విత్తనములను పోలినవారు, యోగ్యమైన మంచిమనస్సుతో దేవుని వాక్కును ఆలకించి, అవలంబించి ఓర్పుతో ఫలించువారు”. ఇక్కడ మూడు కీలక చర్యలు కనిపిస్తాయి.  వినడం, అవలంబించడం (నిలుపుకోవడం), ఓర్పుతో ఫలించడం.

వినడం అంటే చెవులతో మాత్రమే కాదు, హృదయంతో వినడం.  'ప్రభువా, ఈ వాక్కు నాతో ఏమి మాట్లాడుతోంది?' అని అడగడం. అవలంబించడం అంటే వాక్కును జీవితంలో ఆచరణలో పెట్టడం.  'క్షమించండి' అని వింటే క్షమించడం, 'ప్రార్థించండి' అని వింటే ప్రార్థించడం, 'పంచుకోండి' అని వింటే దానం చేయడం. ఓర్పు అనేది యేసు ప్రత్యేకంగా నొక్కి చెప్పే అంశం. విత్తనం వేసిన మరుసటి రోజే పంట రాదు; ఈరోజు ప్రార్థన మొదలుపెట్టాను కాబట్టి రేపే పరిపూర్ణుడిని కాలేను. పవిత్రత, ఆధ్యాత్మిక పరిపక్వత ఒక ప్రయాణం, ఒక్కరోజు అనుభవం కాదు.

ఇది ఉపమానంలోని ఆశావహ భాగం. నాలుగు నేలలలో ఒకటి సారవంతమైనది కావడం.  మనిషి మారలేడని కాదు అని చూపిస్తుంది. కఠినమైన హృదయం కూడా దేవుని కృపతో మృదువవుతుంది; రాతిలాంటి హృదయంలో కూడా వేరు పెరగవచ్చు; ముండ్లను తొలగించవచ్చు, దేవుని వాక్కుకు స్థలం కల్పించవచ్చు. మన గతం మన భవిష్యత్తును నిర్ణయించాల్సిన అవసరం లేదు. నిన్న మన హృదయం ఎలా ఉన్నా, ఈ రోజు దేవుని ముందు దాన్ని సమర్పించవచ్చు. ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే, ఈ నాలుగు నేలలు వేర్వేరు వ్యక్తులు మాత్రమే కాదు.  ఒకే వ్యక్తి జీవితంలో వేర్వేరు కాలాల్లో, వేర్వేరు విషయాలలో ఈ నాలుగు లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ప్రతిరోజూ ఆత్మపరిశీలన అవసరం.

8. కుటుంబం, సంఘం, సమాజం కోసం సందేశం

ఈ ఉపమానం వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంతో మాత్రమే పరిమితం కాదు. తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు, విద్య మాత్రమే ఇస్తే సరిపోదు,  దేవుని వాక్కు అనే విత్తనం కూడా ఇవ్వాలి. కానీ పిల్లలకు కేవలం 'ప్రార్థించు' అని చెప్పడం మాత్రమే కాదు; తల్లిదండ్రుల సొంత జీవితం ఆ వాక్కుకు సాక్ష్యంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులు క్షమించడాన్ని చూస్తేనే క్షమించడం నేర్చుకుంటారు; ప్రార్థించడం చూస్తేనే ప్రార్థన విలువను గ్రహిస్తారు. అందువల్ల కుటుంబం మొదటి సువార్త పాఠశాల.

ముగింపు

దేవుని వాక్కు ఎప్పుడూ జీవాన్ని కలిగించే విత్తనమే. కానీ అది మన జీవితంలో ఎంత ఫలిస్తుంది అనేది మన హృదయ స్పందనతో సంబంధం కలిగి ఉంటుంది. త్రోవప్రక్కన పడిన విత్తనం మనకు హెచ్చరిక ఇస్తుంది.  వాక్కును నిర్లక్ష్యం చేయవద్దు. అని  రాతినేల చెబుతుంది,  భావోద్వేగ విశ్వాసంతో మాత్రమే ఆగిపోవద్దు, లోతైన వేర్లు పెంచుకో. ముండ్లపొదలు హెచ్చరిస్తాయి,  చింతలు, ధనవ్యామోహం, సుఖభోగాలు వాక్కును అణచివేయనివ్వవద్దు. సారవంతమైన నేల మాత్రం ఆశను ఇస్తుంది,  విను, స్వీకరించు, ఆచరించు, ఓర్పుతో కొనసాగు; అప్పుడు జీవితం ఫలిస్తుంది.

మన శక్తితో మాత్రమే మంచి నేలగా మారడం సాధ్యం కాదు.  దేవుని కృప అవసరం. క్రీస్తు మన హృదయంలోకి వచ్చి దాన్ని దున్నాలి, మన కఠినతను మృదువుగా చేయాలి, మన రాళ్లను, ముండ్లను తొలగించాలి, తన వాక్కుకు స్థలం కల్పించాలి. అప్పుడు మన జీవితం ఫలించగలదు.  ఆ ఫలితం మన గొప్పతనం కాదు, దేవుని కృప మనలో పనిచేసిన ఫలితం.

 ప్రార్థన

ప్రభువా, నా హృదయం నీ వాక్కుకు సారవంతమైన నేలగా ఉండేలా చేయుము. నా హృదయంలోని కఠినత్వాన్ని  తొలగించుము, నా విశ్వాసానికి లోతైన వేర్లు ప్రసాదించుము. ప్రాపంచిక చింతలు, ధనవ్యామోహం, సుఖభోగాలు నా జీవితాన్ని అణచివేయకుండా నన్ను కాపాడుము. నీ వాక్కును విని, స్వీకరించి, ఓర్పుతో ఆచరించే కృపను ప్రసాదించుము. నా జీవితం ద్వారా ఇతరులకు ప్రేమ, క్షమ, ఆశ మరియు విశ్వాసం అనే ఫలాలను అందించునట్లు నన్ను మార్చుము. ఆమెన్ 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు