పవిత్ర సిలువ మహోత్సవం – సెప్టెంబర్ 14 చరిత్ర, అర్థం, ప్రార్థన
పవిత్ర సిలువ మహోత్సవం
పరిచయము
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన తిరుసభ పరిశుద్ధ సిలువ ఔన్నత్యాన్ని అత్యంత
భక్తిశ్రద్ధలతో, కొనియాడుతుంది. సాధారణంగా మానవ దృష్టిలో, లౌకిక సమాజ ఆలోచనలలో సిలువ అనేది వేదనకు, దారుణమైన ఓటమికి, తీరని అవమానానికి, మరణానికి సంకేతంగా
కనిపిస్తుంది. అయితే క్రైస్తవ విశ్వాసంలో మరియు దైవిక దృక్పథంలో అదే సిలువ
అత్యున్నత విజయం, రక్షణ, అనంతమైన ప్రేమ, నిరపేక్ష క్షమ, జీవవంతమైన ఆశ, మహోన్నతమైన పునరుత్థానము
మరియు దేవుని నిత్య మహిమకు చిహ్నంగా మారింది. లాటిన్ భాషలో ఈ మహోత్సవాన్ని
ఎగ్జాల్తాతియో సాంక్తే క్రుసిస్ అని పిలుస్తారు. (Exaltation of the cross) ఇక్కడ ఔన్నత్యము అంటే ఒక వస్తువును లేదా భావాన్ని ఉన్నత స్థానానికి చేర్చడం, అత్యధికంగా ఘనపరచడం, మహిమపరచడం అని అర్థం. ప్రాచీన రోమా సామ్రాజ్య
కాలంలో సిలువ అనేది అత్యంత దారుణమైన, అవమానకరమైన మరణశిక్షా సాధనం.
కేవలం ఘోర నేరస్థులు, తిరుగుబాటు చేసిన బానిసలు, రాజద్రోహులకు మాత్రమే ఈ శిక్ష విధించేవారు.
అటువంటి ఘోరమైన అవమాన చిహ్నాన్ని తిరుసభ పరిశుద్ధమైనదిగా భావించి, దాని ఔన్నత్యాన్ని ఉత్సవంగా జరుపుకోవడం మొదటి
చూపులో ఒక పెద్ద వైరుధ్యంలా అనిపిస్తుంది. సిలువ బాహ్యంగా ఓటమిలా కనిపిస్తుంది, కానీ దాని అంతరంగంలో జయం ఉంది. సిలువ పైన మరణం
కనిపిస్తుంది, కానీ దాని లోతుల్లో నిత్యజీవం ఉంది. సిలువలో
తీవ్రమైన బాధ కనిపిస్తుంది, కానీ దాని మూలంలో దేవుని
అనంతమైన ప్రేమ నిక్షిప్తమై ఉంది. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో క్రీస్తు
విధేయతను వివరిస్తూ, ఆయన తనను తాను తగ్గించుకొని
మరణము వరకు, అనగా సిలువ మరణము వరకు విధేయత చూపించాడని
గుర్తుచేస్తారు. అయితే క్రీస్తు జీవితం ఆ
సిలువ మరణంతో ముగిసిపోలేదు. అందుచేతనే దేవుడు కూడా ఆయనను అత్యధికంగా హెచ్చించి, ప్రతి ఒక్కరు ఆయన ముందు మోకరించాలి అని చెప్పాడు.
అందువలన సిలువ అనేది క్రైస్తవ జీవితానికి
ముగింపు కాదు, అది మహోన్నతమైన పునరుత్థానానికి తెరిచిన దివ్య
ద్వారం.
సిలువ దివ్య రహస్యము మరియు క్రైస్తవ దృక్పథము
యేసు క్రీస్తు కల్వరి కొండపై
సిలువ వేయబడిన ఘడియలో, అక్కడ ఉన్న వారిలో కొందరికి, లౌకిక ఆలోచనాపరులకు ఆయన జీవితం పూర్తిగా విఫలమైపోయిందనే భావన కలిగి ఉండవచ్చు.
ఆయనను మూడేళ్ల పాటు అనుసరించిన శిష్యులు భయంతో చెదిరిపోయారు, సాధారణ ప్రజల ఆశలు అడియాసలయ్యాయి, ఆయనను ఇశ్రాయేలును విడిపించే మెస్సీయగా
భావించినవారు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఆయన శత్రువులు ఆయనను పూర్తిగా ఓడిపోయిన
వ్యక్తగా భావించి సంతోషించారు. కానీ దేవుని నిత్య ప్రణాళికలో అది ఓటమి కాదు, సాతాను మరియు పాపపు శక్తులపై సాధించిన అంతిమ
విజయం. అదే క్షణంలో యేసు ప్రభువు తన పరలోక
తండ్రి చిత్తానికి సంపూర్ణ విధేయతను ప్రకటించాడు. మానవాళి చిందించిన పాపానికి, ద్వేషానికి, హింసకు ప్రతిగా ఆయన తన ప్రాణత్యాగంతో కూడిన అనంతమైన ప్రేమను పరిపూర్ణంగా
అందించాడు. శాపానికి ప్రతిగా ఆశీర్వాదాన్ని, తీవ్రమైన హింసకు ప్రతిగా
సంపూర్ణ క్షమను ప్రసాదించాడు. అందుకే సిలువను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే కేవలం
దుఃఖభరితమైన గుడ్ ఫ్రైడే సంఘటనను మాత్రమే చూడకూడదు, దాని తరువాత వచ్చే పునరుత్థాన
వెలుగును చూడాలి. సిలువ లేకపోతే పునరుత్థానపు ప్రాముఖ్యత అర్థం కాదు, అలాగే పునరుత్థానం లేకపోతే సిలువ కేవలం ఒక
విషాదకరమైన చారిత్రక దురంతంగా మిగిలిపోతుంది.
చారిత్రక నేపథ్యము మరియు
పండుగ ఆవిర్భావము
ఈ పరిశుద్ధ సిలువ ఔన్నత్య మహోత్సవానికి
నాల్గవ శతాబ్దపుయేరుషలేముకు ఎంతో చారిత్రక సంబంధం ఉంది. క్రీస్తు
శకం 312వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి కాన్‌స్టంటైన్ ఒక
కీలకమైన యుద్ధానికి సిద్ధపడుతున్న సమయంలో, ఆకాశంలో ప్రకాశవంతమైన సిలువ
చిహ్నం ఆయనకు ఒక కల వచ్చింది. దానిలో సిలువ
చిహ్నంలో నీవు విజయం సాధిస్తావు అనే
సందేశం ఆయనకు అందిందని క్రైస్తవ సంప్రదాయం వెల్లడిస్తుంది. ఆ యుద్ధంలో విజయం
సాధించిన అనంతరం కాన్‌స్టంటైన్ క్రైస్తవాన్ని అధికారికంగా గుర్తించాడు. తరువాత ఆయన తల్లి హెలేనా
యేరుషలేముకు తీర్థయాత్రకు వెళ్ళింది. యేసు ప్రభువు సిలువ వేయబడిన గొల్గొతా స్థలాన్ని, సమాధిని
గుర్తించే అన్వేషణలో ఆమె మూడు సిలువలను కనుగొన్నదని సంప్రదాయం చెబుతుంది. ఆ
మూడింటిలో యేసు క్రీస్తును వేలాడదీసిన నిజమైన సిలువ ఏదో ఒక అద్భుతమైన స్వస్థత
సంఘటన ద్వారా గుర్తించబడింది.
పరిశుద్ధ సమాధి దేవాలయ ప్రతిష్ఠ మరియు అవశేషాల పునరుద్ధరణ
క్రీస్తు శకం 335వ సంవత్సరంలో యేరుషలేము నగరంలో క్రీస్తు మరణ పునరుత్థానాలకు సాక్ష్యంగా
నిర్మించబడిన Holy Sepulchre దేవాలయం అత్యంత ఘనంగా ప్రతిష్ఠించబడింది. ఆ రోజున పరిశుద్ధ సిలువను
ప్రజలందరూ దర్శించి ఆరాధించడానికి వీలుగా ఎత్తుగా ఉంచి ఆశీర్వదించారు. కాలక్రమేణా
ఈ ఉత్సవ ఆచరణ సార్వత్రిక తిరుసభ అంతటా విస్తరించింది. అనంతరం క్రీస్తు శకం 614లో పర్షియన్ల దండయాత్ర సమయంలో యేరుషలేమును ఆక్రమించుకొని
పరిశుద్ధ సిలువను తీసుకెళ్లారు. తరువాత
క్రీస్తు శకం 628 ప్రాంతంలో రోమన్ చక్రవర్తి హెరాక్లియస్
పర్షియన్లను ఓడించి ఆ సిలువను తిరిగి యేరుషలేముకు తీసుకువచ్చాడు.
పవిత్ర గ్రంథ ఆధారాలు మరియు ప్రవచన నెరవేర్పు
కంచు సర్పము నుండి క్రీస్తు సిలువ వరకు
పరిశుద్ధ సిలువ ఔన్నత్యానికి
పాతనిబంధనలోని సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన పునాది
కనిపిస్తుంది. యిస్రాయేలు ప్రజలు ఎడారిలో దేవునికి మరియు మోషేకు విరుద్ధంగా తిరుగుబాటు
చేసినప్పుడు వారి మధ్యకు విషసర్పాలు వచ్చాయి. అనేకమంది సర్పకాటుకు గురై
మరణిస్తున్న సమయంలో ప్రజలు తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి మోషేను
ఆశ్రయించారు. దేవుని ఆదేశం మేరకు మోషే ఒక కంచు సర్పాన్ని తయారుచేసి, దానిని అందరికీ కనిపించేలా ఒక స్తంభంపై ఎత్తి
ఉంచాడు. సర్పకాటుకు గురైన ఏ వ్యక్తి అయినా విశ్వాసంతో ఆ కంచు సర్పము వైపు చూస్తే వారు మరణించకుండా బ్రతికారు. ఈ సంఘటనను యేసు ప్రభువు యోహాను సువార్త 3వ అధ్యాయంలో తనకు స్వయంగా అన్వయించుకున్నాడు. మోషే అరణ్యములో కంచు సర్పమును ఎత్తినట్లుగానే మనుష్య కుమారుడు కూడా
ఎత్తబడవలెనని స్పష్టం చేశాడు. ఇక్కడ ఎత్తబడటం అనే పదానికి యోహాను సువార్తలో రెండు అర్థాలు
ఉన్నాయి. ఒకటి యేసు ప్రభువు కల్వరి
సిలువపై భౌతికంగా ఎత్తబడటం, రెండవది అదే సమయాన ఆయన తండ్రి
మహిమలోనికి ఎత్తబడటం. అందువల్ల యోహాను సువార్త ప్రకారం సిలువ అనేది ఓటమికి సంకేతం కాదు, అది క్రీస్తు హెచ్చించబడే మరియు మహిమపరచబడే
సమయం.
దేవుని అపరిమిత ప్రేమకు ప్రత్యక్ష సాక్ష్యము
సిలువ రహస్యాన్ని సంపూర్ణంగా
అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైన వాక్యం యోహాను సువార్త
3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే సత్యం
సిలువ ద్వారానే నిరూపించబడింది. యేసు ప్రభువు సిలువపై సమస్త మానవాళి రక్షణ కోసం తన జీవితాన్ని
ప్రేమయాగంగా అర్పించాడు. సిలువపై చాపబడిన ఆయన చేతులు సకల మానవాళికి ఒక గొప్ప
నిశ్శబ్ద సందేశాన్ని అందిస్తున్నాయి. అవి కేవలం నీతిమంతుల కోసం మాత్రమే కాదు, పాపుల కోసం, బలహీనుల కోసం, తనను తిరస్కరించిన శత్రువుల
కోసం కూడా చాచబడ్డాయి. అందుకే సిలువ దేవుని ప్రేమ ప్రకటనగా నిలిచింది.
పునీత పౌలు బోధనలలో సిలువ ప్రాముఖ్యత
దేవుని శక్తి మరియు జ్ఞానము
పౌలు తన లేఖలలో సిలువ
మర్మమును అత్యంత గొప్పగా విశ్లేషించాడు.
మొదటి కొరింథీయులకు రాసిన లేఖలో ఆయన మేము సిలువ వేయబడిన క్రీస్తును
ప్రకటించుచున్నామని స్పష్టంగా చెప్పారు. లౌకిక ప్రపంచపు దృష్టిలో, గ్రీకుల తత్త్వశాస్త్రంలో సిలువ అనేది ఒక
మూర్ఖత్వము మరియు బలహీనత. కానీ విశ్వసించే వారికి అది దేవుని అపారమైన శక్తి మరియు
అద్భుతమైన జ్ఞానము. లౌకిక ప్రపంచం విజయాన్ని లౌకిక అధికారంలో, సైనిక బలంలో, సంపదలో చూస్తుంది. కానీ క్రీస్తు తన విజయాన్ని సంపూర్ణమైన త్యాగంలో, వినయంలో నిరూపించాడు.
సిలువ యందు గర్వించుట
ఈ దివ్య సత్యాన్ని
గ్రహించినందుకే పౌలు గలతీయులకు రాసిన లేఖలో మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు
తప్ప నేను మరి దేనియందును గర్వించను అని
ప్రకటించాడు. “నేను మరి ఇతరములైన దేనియందును కాక, మన ప్రభువగు యేసు క్రీస్తు సిలువయందు మాత్రమే
గొప్పగ చెప్పుకొందును. ఏలయన, ఆయన సిలువ మూలముననే, నాకు ఈ లోకము, నేను ఈ లోకమునకు సిలువవేయబడితిమి.“ ఒక
క్రైస్తవునికి నిజమైన గర్వకారణం ఆయన వద్ద ఉన్న ధనకనక వస్తు వాహనాలలో లేదు, ఆయన పొందిన లౌకిక హోదాలలో లేదు. కేవలం క్రీస్తు
తన కోసం మోసిన సిలువలోనే ఉంది. సిలువ మనిషి యొక్క స్వార్థ అహంకారాన్ని, లౌకిక అతిశయాన్ని పూర్తిగా తుడిచివేసి, దేవుని కృపపై ఆధారపడేలా చేస్తుంది.
పాపము, మరణము మరియు చెడుపై అంతిమ విజయం
కొలొస్సయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో పౌలు సిలువను ఒక విజయ చిహ్నంగా వర్ణిస్తాడు. సిలువ మరణము మరియు పునరుత్థానము
ద్వారా క్రీస్తు పాపము, మరణము మరియు చెడు శక్తులపై
శాశ్వత విజయం సాధించాడు. మానవుడు తన సొంత ప్రయత్నాలతో, స్వయం శక్తులతో పాపపు బంధనాల నుండి సంపూర్ణంగా
విడుదల పొందలేడు. కానీ క్రీస్తు తన సిలువ త్యాగం ద్వారా నిత్య రక్షణకు మార్గాన్ని
సుగమం చేశాడు. మన గతం ఎంత చెడ్డదైనా, దేవుని కృప దానికంటే అత్యంత
విస్తృతమైనది. అందువల్ల సిలువ వైపు చూసే ప్రతి పాపి నా పాపం నా చివరి గుర్తింపు
కాదు, నేను క్రీస్తు రక్తంచేత విమోచించబడిన, ప్రేమించబడిన వ్యక్తిని అని ధైర్యంగా చెప్పగలడు.
పాతనిబంధన ప్రవచనాలు మరియు కీర్తనల ఆధ్యాత్మికత
యెషయా బాధామయ సేవకుని గీతం
యెషయా గ్రంథం 52, 53 అధ్యాయాలలో ఉన్న బాధామయ సేవకుని గీతం క్రైస్తవ
సంప్రదాయంలో సిలువ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకమైనది. నిజముగా అతడు
మన బాధలను భరించెను, మన వేదనలను మోసెను అని యెషయా ప్రవక్త ముందే ప్రవచించాడు. యేసు ప్రభువు మన శ్రమలను లేదా వేదనలను కేవలం పరలోకం నుండి చూస్తున్న
దేవుడు కాదు, ఆయన స్వయంగా మన బాధలలోను అనుభవించిన దేవుడు. మన
కంటి నుండి కారే కన్నీళ్లు ఆయనకు తెలియనివి కావు, మన అనుభవించే ఒంటరితనం, మానసిక వేదన, ఎదుర్కొనే అవమానాలు ఆయన స్వయంగా అనుభవించినవే. కల్వరి కొండ మనకు నిరంతరం చెబుతున్న సత్యం
ఏమిటంటే, నీవు అనుభవిస్తున్న ఏ బాధలోనూ నీవు ఒంటరివి కావు, నీతో పాటు సిలువ మోస్తున్న క్రీస్తు ఉన్నాడు.
22వ కీర్తన మరియు క్రైస్తవ నిరీక్షణ
యేసు ప్రభువు సిలువపై వేలాడుతూ పలికిన నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యివిడిచితివి
అనే తీవ్రమైన వేదన భరిత మాటలు పాతనిబంధనలోని 22వ కీర్తనను గుర్తుకు తెస్తాయి. ఈ కీర్తన అత్యంత భయంకరమైన
నిరాశ మరియు బాధతో ప్రారంభమవుతుంది, చివరికి దేవుని రక్షణను ప్రకటిస్తూ ముగుస్తుంది. ఇది ప్రతి క్రైస్తవుని
అనుభవపూర్వక జీవితానికి ఒక స్పష్టమైన ప్రతీక. మన అనుదిన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు
ఈ కీర్తన లాగా వుంటాయి. దేవా నీవు ఎక్కడ ఉన్నావు, నా కన్నీటి ప్రార్థనలు నీకు ఎందుకు వినిపించడం లేదా, నా జీవితంలోనే ఎందుకింత ఘోరమైన బాధ అని మనం
ప్రశ్నించవచ్చు. అయితే విశ్వాసం అంటే ప్రశ్నలు లేకపోవడం కాదు, తీవ్రమైన ప్రశ్నలు మరియు గాయాల మధ్య కూడా దేవుని
పై నమ్మకం ఉంచడం. ఇదే సిలువ మనకు నేర్పే
గొప్ప పాఠం.
ఏదేను తోట చెట్టు నుండి కల్వరి సిలువ వరకు
తిరుసభ పితరులు సిలువ రహస్యాన్ని
వివరించడానికి ఒక అద్భుతమైన పోలికను తరచుగా ఉపయోగించారు. మానవ చరిత్ర ఆరంభంలో
ఏదేను తోటలో ఒక చెట్టు ఉంది, అలాగే కల్వరి కొండపై మరొక
చెట్టు నిలపబడింది. ఏదేను తోటలోని చెట్టు వద్ద మొదటి మానవుడైన ఆదాము దేవునికి
అవిధేయత చూపించి పాపంలోనికి పడిపోయాడు. కల్వరి కొండపై ఉన్న సిలువ మ్రాను అనే చెట్టుపై రెండవ ఆదాము అయిన క్రీస్తు దేవుని
చిత్తానికి సంపూర్ణ విధేయతను కనపరిచాడు. ఏదేనులోని చెట్టు ద్వారా మానవాళిలోనికి
పాపము, శాపము, మరణము ప్రవేశించగా, కల్వరి సిలువ మాను ద్వారా రక్షణ, ఆశీర్వాదము, నిత్యజీవపు ద్వారాలు తెరవబడ్డాయి. పౌలు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో మొదటి ఆదాము అవిధేయతకు, క్రీస్తు సంపూర్ణ విధేయతకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని
వివరంగా విశ్లేషిస్తాడు. మానవుని పతనానికి కారణమైన స్థలాన్ని లేదా సాధనాన్ని
దేవుడు తన మహా కృప ద్వారా మానవాళి విమోచన మార్గంగా మార్చాడు.
వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో సిలువ ధ్యానం
కార్మెల్ ఆధ్యాత్మికతలో సిలువ దివ్య స్థానం
కార్మెలియ ఆధ్యాత్మికతలో పరిశుద్ధ సిలువకు అత్యున్నతమైన, నిగూఢమైన స్థానం ఉంది. సిలువ యోహాను జీవిత అనుభవాల ద్వారా సిలువ రహస్యాన్ని ధ్యానించవచ్చు. సిలువ యోహాను గారి బోధనల ప్రకారం సిలువ అనేది కేవలం
భరించవలసిన ఒక బాధ కాదు, అది దేవునితో సంపూర్ణ ఐక్యత సాధించడానికి దివ్య
మార్గం. ఆయన ప్రతిపాదించిన నాదా (అంటే ఏమీ లేకపోవడం) అనే ఆత్మీయ భావన ద్వారా, మనిషి తనలోని లౌకిక అనుబంధాలను, స్వార్థ కోరికలను, దేవుని స్థానాన్ని ఆక్రమించే సమస్తాన్ని విడిచిపెట్టాలని పిలుపునిచ్చాడు.
మానవుని అంతరంగం దేవుని దివ్య సమక్షంతో నింపబడాలంటే, ముందుగా అతనిలోని స్వార్థం లేదా అహంకారం ఖాళీ కావాలి. నాలోని నేను
తగ్గినప్పుడే క్రీస్తు నాలో పెరుగుతాడు. అందుకే సిలువ అనేది మన ఆత్మను, అహంకారాన్ని శుద్ధి చేసే దివ్య పాఠశాల.
చిన్న తెరేసమ్మ చిరు మార్గం
చిన్న తెరేసమ్మ సిలువ
ఆధ్యాత్మికతను సాధారణ జీవితంలోకి అతి సులభంగా తీసుకువచ్చింది. ఆమె దృష్టిలో సిలువ
మోయడం అంటే తప్పనిసరిగా పెద్ద పెద్ద త్యాగాలు చేయడం లేదా అమరవీరులుగా మారడం
మాత్రమే కాదు. అనుదిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అసౌకర్యాలను ఓర్పుతో భరించడం, మనలను బాధించిన వ్యక్తులపై ప్రతీకారం
తీర్చుకోకుండా వారి మేలు కోరుకోవడం, మన మనస్సుకు నచ్చని
వ్యక్తులను ప్రేమతో అంగీకరించడం, చిన్న అవమానాలను దేవుని మహిమ
కోసం అర్పించడం, ఇతరుల ఆత్మ రక్షణ కోసం నిశ్శబ్దంగా ప్రార్థించడం
ఇవన్నీ అనుదిన జీవితంలోని చిన్న సిలువలు. పరిశుద్ధత అనేది కేవలం గొప్ప గొప్ప
కార్యాలు చేయడంలోనే లేదు, అతి చిన్న పనులను కూడా
దేవునిపై ఉన్న గొప్ప ప్రేమతో చేయడంలో ఉందనే సత్యాన్ని ఆమె తన చిరు మార్గం ద్వారా లోకానికి చాటిచెప్పింది.
అనుదిన జీవితంలో సిలువ ఆచరణ
కుటుంబ జీవితంలో ఎదురయ్యే
సిలువలు
ప్రతి కుటుంబ జీవిత
ప్రయాణంలోనూ అనేక రకాల శ్రమలు లేదా సిలువలు ఉంటాయి. వృద్ధులైన తల్లిదండ్రుల
సంరక్షణ బాధ్యత, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న జీవిత
భాగస్వామిని ప్రేమగా చూసుకోవడం, పిల్లల భవిష్యత్తు మరియు
ప్రవర్తన గురించిన ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అభిప్రాయ భేదాలు, ఒంటరితనం ఇవన్నీ బయట ప్రపంచానికి కనిపించని
అంతరంగ సిలువలు. ఇటువంటి నిశ్శబ్ద శ్రమలను భరిస్తూ, ప్రతిరోజు ప్రేమతో, బాధ్యతతో కుటుంబ బాధ్యతలను
నెరవేర్చే తల్లి, తండ్రి, భార్యాభర్తల త్యాగాలలో
క్రీస్తు సిలువ ప్రతిబింబిస్తుంది. ఈ పండుగ మన ప్రతి ఒక్కరినీ ఒక ప్రశ్న
అడుగుతోంది, అదేమిటంటే నా ఇంట ఉన్న వారి సిలువ భారాన్ని నేను కొంచెమైనా
తేలిక చేస్తున్నానా? సీమోను అనే వ్యక్తి యేసు ప్రభువు
సిలువను మోయడంలో సహాయపడినట్లుగా, మనం కూడా తోటివారి కష్టాలలో
పాలుపంచుకోవాలి.
సామాజిక స్పందన మరియు మానవతా దృక్పథం
సిలువను కేవలం వ్యక్తిగత
భక్తి ఆచరణలకే పరిమితం చేయకూడదు. మన సమాజంలో అనేకమంది విభిన్నమైన సిలువలను మోస్తూ
అలసిపోతున్నారు. అప్పుల భారంతో నలిగిపోతున్న రైతులు, ఉపాధి లేక నగరాలకు వలస వెళ్లిన నిరుపేద కార్మికులు, పౌష్టికాహారం మరియు నివాసం లేక అలమటిస్తున్న
నిరుపేదలు, అనారోగ్యంతో ఆసుపత్రుల్లో నరకయాతన అనుభవిస్తున్న
రోగులు, దిక్కులేని వృద్ధులు వీరంతా సమాజంలో సిలువను
మోస్తున్న ప్రత్యక్ష రూపాలు. వీరి బాధలను చూసి వారి పూర్వ పాపాల వల్లనే ఇలా
జరుగుతుందని తీర్పు తీర్చడం క్రీస్తు సిలువ నేర్పే ఆధ్యాత్మికత కాదు. సిలువ మనకు
లౌకిక తీర్పులను కాక, దైవిక కరుణను నేర్పుతుంది.
యేసుప్రభువు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ అత్యల్పులైన నా సహోదరులకు మీరు
ఏమి చేశారో అది నాకే చేశారని స్పష్టం చేశాడు. కాబట్టి ఆకలితో ఉన్నవారికి అన్నం
పెట్టడం, బాధలో ఉన్నవారిని ఓదార్చడం, రోగులను పరామర్శించడం ద్వారా మనం నిజంగా
క్రీస్తు సిలువను మోస్తున్నట్లే.
సిలువ మరియు క్షమాగుణము
సిలువ ద్వారా మానవాళికి
లభించిన అత్యంత అద్భుతమైన దివ్య సందేశం క్షమ. యేసు ప్రభువు తనను సిలువకు మేకులు కొట్టి హింసిస్తున్న వారిని
చూసి తండ్రీ వీరిని క్షమించుము, వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు అని ప్రార్థించాడు. ఇది మానవ ఆలోచనకి అందని దైవ ప్రేమ. మన నిత్య
జీవితంలో మనలను గాయపరిచిన వారిని, మోసం చేసిన వారిని క్షమించడం
చాలా కష్టమైన విషయమే. అయితే క్షమించడం అంటే ఎదుటివారు చేసిన తప్పును సరియైనదిగా
అంగీకరించడం కాదు. క్షమించడం అంటే నా హృదయాన్ని ద్వేషానికి లేదా పగకు బానిసగా
ఉండనివ్వను అని నిర్ణయించుకోవడం. క్రీస్తు సిలువ పాదాల వద్ద మన ద్వేషాన్ని, పగను వదిలివేసి, ప్రభువా నన్ను గాయపరిచిన వారిని క్షమించే హృదయ వైశాల్యాన్ని నాకు
ప్రసాదించు అని ప్రార్థించాలి.
విశ్వాసంతో కూడిన నిరీక్షణ
మరియు అనుదిన ఆధ్యాత్మికత
క్రైస్తవుని నిరీక్షణ
క్రీస్తును అనుసరించే
క్రైస్తవుడు సిలువను చూసి నిరాశలో కూరుకుపోడు, ఎందుకంటే గుడ్ ఫ్రైడే శ్రమల తరువాత తప్పక ఈస్టర్ పునరుత్థాన ఆనందం
వస్తుందని అతనికి తెలుసు. అయితే ఈ నిరీక్షణను తప్పుగా అర్థం చేసుకోకూడదు. ప్రతి
లౌకిక సమస్య కొద్ది రోజుల్లోనే సమసిపోతుందని లేదా ప్రతి అనారోగ్యం వెంటనే
మాయమవుతుందని దీని అర్థం కాదు. క్రైస్తవ నిరీక్షణ యొక్క నిజమైన అర్థం ఏమిటంటే, దేవుడు అంతిమ తీర్పు చెప్పే వరకు మన జీవిత కథ
ముగిసిపోదు. ఈ రోజు మన జీవితంలో భయంకరమైన చీకటి అలముకోవచ్చు, కానీ దేవుని కృప వల్ల రేపటి ఉదయం కచ్చితంగా
వెలుగును తెస్తుంది.
ఇంటిలో సిలువ అనుభవాన్ని జీవించుట
సెప్టెంబర్ 14న పరిశుద్ధ సిలువ ఔన్నత్య మహోత్సవాన్ని పురస్కరించుకుని
కుటుంబ సమేతంగా ప్రత్యేక ప్రార్థన చేసుకోవడం ఎంతో మంచిది. కుటుంబ సభ్యులందరూ, తమ జీవితంలో మోస్తున్న శ్రమలను, భయాలను, అనారోగ్యాలను, అనుమానాలను క్రీస్తు సిలువ పాదాల వద్ద
సమర్పించాలి. నన్ను గాయపరిచిన వారిని క్షమించడానికి నాకు బలాన్ని ఇవ్వమని, ఇతరుల శ్రమల పట్ల కరుణ చూపించే హృదయాన్ని
ప్రసాదించమని వేడుకోవాలి. ఇలా చేయడం ద్వారా సిలువ అనేది కేవలం గోడపై వేలాడే ఒక
అలంకార వస్తువుగా కాకుండా, మన కుటుంబ ప్రాణస్పందనగా, ప్రార్థనా కేంద్రంగా మారుతుంది.
పిల్లలకు సిలువ ప్రాముఖ్యతను
బోధించుట
పిల్లలకు సిలువను ఒక భయానకమైన
చిహ్నంగా పరిచయం చేయకూడదు. యేసు ప్రభువు మనలను ఎంతగానో ప్రేమించి, మన రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించాడనే
సత్యాన్ని సున్నితంగా వివరించాలి. చిన్న పిల్లలు తమ అనుదిన జీవితంలో మోయగలిగే
చిన్న చిన్న సిలువలను గుర్తించేలా ప్రోత్సహించాలి. దీనివల్ల సిలువ అంటే భయం కాదని, అది ప్రేమతో చేసే త్యాగమని పిల్లలు చిన్నతనం నుండే గ్రహిస్తారు.
వ్యక్తిగత జీవితంలో అనుదిన సిలువ ధారణ
సువార్తలలో యేసు ప్రభువు ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తనను తాను త్యజించుకొని, ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని
స్పష్టంగా ఆజ్ఞాపించాడు. ఇక్కడ ప్రతిదినము అనే పదం అత్యంత ముఖ్యమైనది. సిలువను
మోయడం అనేది జీవితంలో ఏదో ఒక రోజు మాత్రమే చేసే పని కాదు. మన జీవితంలో ఎదురయ్యే
అనుదిన ఎంపికలలో వస్తుంది. ఆ ఎంపికలు స్వార్థమా
లేదా సేవా, పగ సాధించడమా లేదా క్షమించడమా, అహంకారమా లేదా వినయమా, లౌకిక సుఖమా లేదా క్రీస్తు మార్గమా అనే ఎంపికలు
ఎదురైనప్పుడు మనం క్రీస్తు వైపు నిలబడటమే సిలువను మోయడం.
సిలువ భావనను సరిగ్గా అర్థం చేసుకోవడం
సిలువను ప్రేమించడం అంటే
కావాలని శ్రమలను లేదా అనారోగ్యాలను కొనితెచ్చుకోవడం కాదు. అన్యాయాలను చూస్తూ
మౌనంగా ఉండటం లేదా కుటుంబ హింసను సమర్థించడం సిలువ మార్గం కాదు. శారీరక లేదా
మానసిక బాధలు ఎదురైనప్పుడు వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం విశ్వాస రాహిత్యం
అనిపించుకోదు.
ఆధ్యాత్మిక నిర్ణయాలు
సెప్టెంబర్ 14న తీసుకోవలసిన ఆధ్యాత్మిక నిర్ణయాలు
ఈ పరిశుద్ధ సిలువ ఔన్నత్య మహోత్సవాన్ని
కేవలం ఒక ఆచార పండుగగా ముగించకుండా, మన జీవితాలను మార్చే ఒక
పవిత్రమైన రోజుగా మలచుకోవాలి. ఈ పండుగ సందర్భంగా మనం మూడు ప్రాథమిక ఆధ్యాత్మిక
నిర్ణయాలు తీసుకోవాలి. మన అంతరంగంలో దాచుకున్న
తీవ్రమైన బాధలను, శ్రమలను క్రీస్తు సిలువ వద్ద సంపూర్ణంగా
సమర్పించాలి. మన చుట్టూ బాధపడుతున్న తోటి వ్యక్తుల సిలువ భారాన్ని తేలిక చేయడానికి
మన శక్తిమేరకు సహాయపడాలి. మన హృదయాలలో ఉన్న పగను, కోపాన్ని విడిచిపెట్టి, క్రీస్తు లాగా క్షమించడానికి
నిజాయితీగా ప్రయత్నించాలి.
ప్రార్థన
ప్రభువా! సిలువపై నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించావు, మా
జీవితంలోని ప్రతి శ్రమను, సిలువను నీ పాదాల వద్ద
ఉంచుతున్నాము. మేము మోయలేని భారాలను నీవు మోసి, మా కన్నీళ్లలో తోడుగా ఉండుము. మా
బలహీనతలలో మమ్మల్ని బలపరచి, మా పాపాలను క్షమించుము.
మమ్మల్ని గాయపరిచిన వారిని క్షమించే హృదయాన్ని, ఇతరుల బాధలను చూసి స్పందించే కరుణను మాకు ప్రసాదించుము.ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment