లూకా 6:39-42: దూలం, నలుసు - గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గం చూపగలడా?


 లూకా 6:39-42

గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా?

ఆయన మరల వారికి ఉపమాన పూర్వక ముగా ఇట్లు చెప్పెను. "గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అటుల చేసినచో వారు ఇరువు రును గోతిలో పడుదురుగదా!. శిష్యుడు తన గురువుకంటె గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువువలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపెదవేల?,నీ కంటిలోని దూలమును గమనింపక, నీ సోదరునితో, 'సోదరా! నీ కంటిలోని నలుసును తీసి వేయనిమ్ము' అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారీ! ముందుగా నీకంటిలోని దూలమును తీసివేసికొనుము. అపుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగానుండును.

పరిచయం

ప్రతి ఒక్కరి  జీవితంలో ఎదురయ్యే ఒక సాధారణ విషయం  ఏమిటంటె  ఇతరుల తప్పులను సులభంగా గుర్తించడం, కానీ తనలోని లోపాలను చూడటానికి ఇష్టపడకపోవడం. ఇతరుల జీవితాలను తీర్పు చేయడంలో మనకు ధైర్యం ఉంటుంది; మన జీవితాన్ని దేవుని వెలుగులో పరిశీలించడంలో మాత్రం వెనుకడుగు వేస్తాము. లూకా సువార్తలోని మైదాన ప్రసంగం (లూకా 6:17-49) అనేది మత్తయి సువార్తలోని పర్వత ప్రసంగానికి సమాంతరంగా ఉండే బోధన. యేసు ప్రభువు పన్నెండుమంది అపొస్తలులను ఎన్నుకున్న వెంటనే (6:12-16), శిష్యులకు మరియు అక్కడ ఉన్న ప్రజలకు  ఈ బోధను అందించాడు.  కాబట్టి ఇక్కడి మాటలు ప్రధానంగా శిష్యులను, భావి ఆధ్యాత్మిక నాయకులను ఉద్దేశించినవి.

యేసు ప్రభువు ఇక్కడ  మూడు పరస్పర సంబంధము ఉన్న ఉపమానాలను చెబుతున్నాడు.  గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గం చూపడం, గురు-శిష్య సంబంధం, మరియు కంటిలోని దూలం-నలుసు. ఇవి  ఇతరులకు మార్గ దర్శినిగా ఉండేవి.  మంచిని  నిర్ణయం చేయడం  వీటిలో సహజంగా ఉంటుంది. కాని ఇతి తీర్పు తీర్చడం కాదు.  తీర్పు తీర్చే ధోరణికి మూలకారణం ఏమిటంటే, తీర్పు తీర్చేవాడు తనను తాను స్పష్టంగా చూడలేకపోవడమే. ఈ మూడు ఉపమానాలు  వేర్వేరుగా కనిపించినా, ఒకే సత్యాన్ని వివిధ కోణాల నుండి బోధిస్తాయి.  ఆధ్యాత్మిక దృష్టి, వినయం, స్వీయ పరిశీలన లేకుండా ఇతరులకు మార్గదర్శకత్వం వహించడం అసాధ్యమని, ప్రమాదకరమని ఇవి మనకు నెరపుతున్నాయి.

1. వాక్యభాగ వివరణ


యేసు ప్రభువు  బోధనలో  సాధారణముగా ఉండే  లక్షణం ఏమిటంటె   నిత్యజీవిత ఉదాహరణల  ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను వివరిస్తారు.

గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము (6:39)


యేసు ప్రభువు అడిగే ప్రశ్న గుడ్డివాడు, గుడ్డివానికి మార్గం చూపునా? ఇది ఒక అలంకారిక ప్రశ్న. జవాబు  ఏమిటంటే మార్గము చూపలేడు.  దారి తెలియని వ్యక్తి మరొకరికి దారి చూపలేడు. ఇక్కడ "గ్రుడ్డితనం" శారీరక అంధత్వం గురించి  కాదు.  ఇది దేవుని సత్యాన్ని గ్రహించలేని ఆధ్యాత్మిక అంధత్వానికి సంకేతం. ఒక వ్యక్తి , తాను దేవుని సత్యాన్ని గ్రహించకుండా ఇతరులకు ఆత్మీయ గురువుగా చెలామణి అయితే తనను తాను నాశనం చేసుకోవడమే కాక, తనను అనుసరించే వారిని కూడా గోతిలోకి,  ఆధ్యాత్మిక విపత్తులోకి నడిపిస్తాడు.

గురువు-శిష్యుని సంబంధం (6:40)


మొదటి శతాబ్దపు యూదా సమాజంలో రబ్బీ(బోధకుడు)-శిష్యుని సంబంధం అత్యంత గౌరవప్రదమైనది. శిష్యుడు గురువుతో నివసించి, అతని జీవనశైలిని, స్వభావాన్నే పుణికిపుచ్చుకుంటాడు. కాబట్టి గురువు గ్రుడ్డివాడైతే శిష్యుడూ గ్రుడ్డివాడిగానే మిగిలిపోతాడు. అయితే ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు. ఇది ఆశాజనకమైన వాగ్దానం కూడా. పరిపూర్ణమైన గురువైన క్రీస్తు వద్ద సంపూర్ణ శిక్షణ పొందితే, శిష్యుడు క్రమంగా క్రీస్తు స్వరూపంలోకి మారతాడు. శిష్యత్వం అంటే కేవలం సమాచారం పొందడం కాదు; అది జీవితాన్ని నేర్చుకోవడం, గురువువలె మారడం.

దూలం-నలుసు ఉపమానం (6:41-42)


మూలభాషలో "నలుసు" చిన్న గడ్డి పొట్టు లేదా ధూళి రేణువు; "దూలం" భవన నిర్మాణంలో వాడే పెద్ద కలప దిమ్మె. ఈ విపరీతమైన పరిమాణ వ్యత్యాసం యేసు ప్రభువు  ఉద్దేశపూర్వకంగా వాడిన అతిశయోక్తి.  ఒక మనిషి కంటిలో ఇంటి కప్పుకు వాడే దూలం ఇమిడి ఉండటం భౌతికంగా అసంభవం. ఈ అసంభవతను చూపడం ద్వారా, మనం మన పెద్ద తప్పులను ఎంత తేలిగ్గా చూస్తామో, ఇతరుల చిన్న తప్పులను ఎంత ఘోరమైనవిగా  చూస్తామో ప్రభువు  ఉద్ఘాటిస్తున్నాడు. "కపట వేషధారీ" (హిపోక్రీటేస్) అనే పదం గ్రీకు నాటకరంగం నుండి వచ్చింది.  బయటికి నీతిమంతుడిగా కనిపిస్తూ, లోపల పాపంతో నిండి ఉండటమే ఈ కపటత్వం. యేసు  ప్రభువు ఇక్కడ సోదరుని కంటిలోని నలుసును తీసివేయకూడదని చెప్పడం లేదు. ఆయన నొక్కి చెప్పేది క్రమం "ముందుగా" నీది, (నీలోని లోపం) తర్వాతే ఇతరులది.

2. వాడబడిన పదాల  ఉద్దేశ్యాలు


ధర్మశాస్త్రంలో "గ్రుడ్డివాడు నడచు త్రోవలో దేనినైనను అడ్డము పెట్టి అతడు పడునట్లు చేయకుడు."  (లేవీయకాండము 19:14) అనే నియమం ఉంది. ఈ నేపథ్యంలో యేసు ప్రభువు ఈ ఉపమానాన్ని వాడటం ద్వారా, ఆధ్యాత్మిక అంధత్వంతో ఇతరులకు మార్గదర్శకత్వం వహించడం ఎంత పెద్ద  నైతిక ఉల్లంఘనో సూచిస్తున్నాడు. "గోతి" అనే పదం సెప్టుజింట్‌లో సమాధిని లేదా జంతువుల ఉచ్చును సూచించడానికి వాడబడింది. ఇవి  కొండ ప్రాంతాలలో తవ్విన ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన రంధ్రాలు. "సంపూర్తిగా శిక్షణ పొందిన" అనే పదం నియమించబడిన పని కోసం పూర్తిగా సన్నద్ధం చేయబడిన, బాగుచేయబడిన అనే అర్థాన్ని సూచిస్తుంది. "గమనింపక" అనే క్రియాపదం కేవలం చూడటం కాదు, లోతుగా ఆలోచించి, జాగ్రత్తగా పరిశీలించడం,  అంటే ఇతరుల దోషాలను వెతికే ధోరణి అనుకోకుండా జరిగేది కాదు, అది మనం చైతన్యంగా చేసే ఎంపిక అని సూచిస్తుంది.

3. సమాంతర పఠనం మరియు పితరుల వ్యాఖ్యానం


మత్తయి 7:1-5లో ఇదే బోధన  కనిపిస్తుంది, కానీ లూకా దీనికి ముందు "గ్రుడ్డివాడు-గ్రుడ్డివాడు" మరియు "గురు-శిష్యుడు" ఉపమానాలను జోడించాడు. తీర్పు తీర్చడం కేవలం నైతిక దోషం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక అంధత్వానికి, అసంపూర్ణ శిష్యరికానికి లక్షణం అని చూపించడానికి లూకా సువార్తికుడు ఈ ఉపమానాలు జోడించి వుండవచ్చు. మత్తయి 15:14లో యేసు ప్రభువు పరిసయ్యులను నేరుగా "గ్రుడ్డి మార్గదర్శకులు" అని పిలుస్తాడు.  కాబట్టి ఈ ఉపమానం సాధారణ నైతిక సూత్రం మాత్రమే కాదు, మతనాయకత్వం, బోధనాధికారం పట్ల ప్రత్యేక హెచ్చరిక కూడా. తిరుసభ పితరులు ఈ భాగాన్ని లోతుగా వ్యాఖ్యానించారు. పునీత  అగస్టీన్ దీన్ని ప్రేమ సందర్భంలో చూశాడు.  ఇతరుల దోషాలను సరిదిద్దడం తప్పు కాదు, వాస్తవానికి క్రైస్తవ సమాజంలో ఇది  అవసరమైన బాధ్యతే; కానీ అది వినయంతో, స్వీయ శుద్ధి తర్వాతే జరగాలి, లేకుంటే అది సరిదిద్దడం కాక తీర్పు తీర్చడం అవుతుంది.  పునీత  జాన్ క్రిసోస్టమ్ మానవ స్వభావంలోని వైచిత్రిని ఎత్తిచూపాడు.  మన పెద్ద పాపాలను తేలికగా క్షమించుకుంటాం, ఇతరుల చిన్న తప్పులను తీవ్రంగా విమర్శిస్తాం.

ఇతర క్రొత్త నిబంధన సాక్ష్యాలు


ఈ బోధనకు ప్రతిధ్వనులు క్రొత్త నిబంధనలో కనిపిస్తాయి. రోమీయులకు 2:1-3లో పౌలు, ఇతరులకు తీర్పు తీర్చే నీవు అదే పనులు చేస్తూ నిన్ను నీవే ఖండించుకుంటున్నావు అని హెచ్చరిస్తున్నాడు. యాకోబు 4:11-12లో "ధర్మశాస్త్రమును విధించువాడు, తీర్పరి ఒక్కడే" అని గుర్తుచేస్తూ, తోటివారిని దూషించడం తగదని బోధిస్తాడు. ఈ రెండు భాగాలు లూకా 6:39-42లోని  విషయమునే  వేరే మాటల్లో పునరుద్ఘాటిస్తాయి.

4. ధర్మశాస్త్ర  భావన: ఆధ్యాత్మిక అంధత్వం అంటే ఏమిటి?


బైబిల్ అంతటా "అంధత్వం" శారీరక స్థితి మాత్రమే కాక, దేవుని చిత్తాన్ని గ్రహించలేని ఆధ్యాత్మిక స్థితికి ప్రతీకగా వాడబడింది (యెషయా 6:10; యోహాను 9; 2 కొరింథీయులకు 4:4). ఈ సందర్భంలో "దూలం" కేవలం పెద్ద పాపం మాత్రమే  కాదు,  అది ఆత్మపరిశీలన లేని స్థితి, తన అంతరంగాన్ని నిజాయితీగా చూడలేని అసమర్థత. ఇది గర్వం నుండి పుడుతుంది. గర్వం మనలను మన దోషాల పట్ల గుడ్డివారిగా చేస్తూనే, ఇతరుల దోషాల పట్ల తీక్షణంగా చేస్తుంది.  ఎందుకంటే ఇతరులను తక్కువ చేయడం ద్వారా మనం మనల్ని గొప్పవారని చూపించుకోవచ్చు అనే భ్రమలో ఉంటాము. పరిసయ్యులు  ఇతరులను ధర్మశాస్త్ర ప్రమాణాలతో తీర్పు తీర్చేవారు, కానీ తమ హృదయాలను నిర్లక్ష్యం చేశారు. యేసు ప్రభువు  బాహ్య ఆచారం కంటే హృదయ పరివర్తనను నొక్కి చెప్పాడు.

5. మానసిక మరియు సామాజిక కోణం


ఆధునిక మనస్తత్వశాస్త్రం ఈ బోధనలోని సత్యాన్ని ధృవీకరిస్తుంది. "ప్రొజెక్షన్" అనే రక్షణ యంత్రాంగం ప్రకారం, మనలో అంగీకరించలేని లోపాలనే ఇతరులపై ఎక్కువగా ఆపాదిస్తాము, తీవ్రంగా విమర్శిస్తాము.  ఎందుకంటే అది మనలోని  ఆ భావం  నుండి మన దృష్టిని మళ్ళిస్తుంది. మన వైఫల్యాలకు పరిస్థితులను కారణంగా చూపుతాం, ఇతరుల వైఫల్యాలను వారి స్వభావానికి ఆపాదిస్తాం. తమ లోపాలను తాము గుర్తించలేకపోవడమే అతిపెద్ద బలహీనత.

6. కార్మెలైట్ ఆధ్యాత్మిక దృక్కోణం


కార్మెలియ  ఆధ్యాత్మికతలో ఈ వాక్యభాగానికి ప్రత్యేక లోతు ఉంది. తెరేసమ్మ తన "అంతరంగిక కోట"లో బోధించినట్టు, ఆత్మ దేవుని సన్నిధిలోకి ప్రవేశించే మొదటి మెట్టు స్వీయ జ్ఞానమే,  తనను తాను నిజాయితీగా చూడకుండా దేవుణ్ణి గానీ, తోటివారిని గానీ సరిగ్గా చూడలేము. మన కంటిలోని "దూలం" ఆమె భాషలో చెప్పాలంటే, ఆత్మ తనను తాను మోసం చేసుకునే చీకటి కోణం. బయటి ప్రపంచాన్ని సరిదిద్దే ముందు, మన అంతరంగాన్ని శుద్ది  చేసుకోవాలి.

7. నైతిక, నాయకత్వ మరియు సంఘ చరిత్ర దృక్కోణం


సాక్రటీస్ "పరిశీలించబడని జీవితం జీవించడానికి అర్హమైనది కాదు" అన్నాడు. యేసు ప్రభువు  ఇక్కడ అంతకంటే లోతైన ఆత్మపరిశీలనను కోరుతున్నాడు, ఇతరులను సరిదిద్దడానికి వ్యక్తిగత పవిత్రత అత్యంత ఆవశ్యకం. నాయకత్వ కోణంలో చూస్తే, ఒక నాయకుడి మాటలకంటే అతని జీవితం ఎక్కువగా బోధిస్తుంది. అందుకే నాయకత్వానికి మొదటి అర్హత ఇతరులను మార్చడం కాదు, ముందుగా తనను తాను మార్చుకోవడం.

8. ఆచరణాత్మక అన్వయం


గలతీయులకు 6:1లో పౌలు చెప్పినట్టు, సోదరుని తప్పును సాత్వికతతో సరిదిద్దాలి. ఈ సాత్వికత స్వీయ పరిశీలన నుండి వస్తుంది. ఇది "ఎప్పుడూ సరిదిద్దవద్దు" అనే బోధన కాదు,  మత్తయి 18:15 సహోదరుని సరిదిద్దడాన్నే బోధిస్తుంది,  కానీ క్రమం ముఖ్యం, మొదట స్వీయ శుద్ధి, తర్వాతే ప్రేమపూర్వక సహాయం.


రాజకీయ, సామాజిక విభజనల యుగంలో ఈ వచనాలు "మనం" మరియు "వారు" అనే విభజనను సవాలు చేస్తాయి. మనం ఇతరులను "గ్రుడ్డివారు" అని పిలిచే ముందు, మనం కూడా ఏదో ఒక విషయంలో గ్రుడ్డివారమే కావచ్చునని గుర్తించాలి. నిజమైన సామాజిక న్యాయం స్వీయ పరిశీలనతో, వినయంతో ప్రారంభమవుతుంది, ఇక్కడ శిక్ష కాకుండా, పునరుద్ధరణ లక్ష్యంగా ఉండాలి.

ఈ నాలుగు బోధనలను ఇలా సంక్షిప్తంగా చూడవచ్చు:


మొదటిగా గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపలేడు; అంటే ఆధ్యాత్మిక అవగాహన లేని వ్యక్తి నాయకత్వం వహిస్తే అది ప్రమాదకరం, కాబట్టి నాయకత్వం తీసుకునే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి. రెండోవది,  శిష్యుడు గురువు స్వభావాన్నే ప్రతిబింబిస్తాడు కాబట్టి క్రీస్తు వద్ద నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. మూడోవది,  మన కంటిలోని పెద్ద దూలం (మన తప్పులు) మనకి  కనిపించదు, కానీ ఇతరుల చిన్న నలుసు వెంటనే కనిపిస్తుంది; కాబట్టి ఇతరులను సరిదిద్దే ముందు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. నాలుగోది, దృష్టి శుద్ధి అయినప్పుడే మనం ఇతరులను ప్రేమతో, కరుణతో చూడగలుగుతాం, తీర్పుతో కాదు.

ఆత్మపరిశీలనకు ఒక ఆధ్యాత్మిక పద్ధతి


యేసు ప్రభువుని ఈ బోధనను మన దినచర్యగా మార్చుకోవడానికి ఒక సాధారణ పద్ధతిని అనుసరించవచ్చు. ప్రతి రాత్రి కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మూడు ప్రశ్నలు వేసుకోవచ్చు.  ఈ రోజు నేను ఎవరిని తీర్పు చేశాను? నేను విమర్శించిన అదే బలహీనత నాలో ఏ రూపంలో ఉంది? రేపు నేను ఏమి మార్చుకోవాలి? ఇలాంటి నిత్య అభ్యాసం క్రమంగా మన హృదయాన్ని, మన సంబంధాలను మారుస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం ఒక్కసారి తీసుకునే నిర్ణయం కాదు, అది ప్రతిదినం పునరుద్ధరించుకునే ప్రయాణం.

9. ముగింపు


లూకా 6:39-42లోని నిజమైన ఆధ్యాత్మిక దృష్టి, నిజమైన నాయకత్వం, నిజమైన సరిదిద్దుట ఇవన్నీ వినయపూర్వక స్వీయ పరిశీలన నుండి ప్రారంభమవుతాయి. గురువు వలె లేని శిష్యుడు, తనను తాను చూడలేని విమర్శకుడు, తన సొంత దూలాన్ని గుర్తించలేని కపటవ్యక్తిత్వం కలిగినవాడు,  వీరంతా ఆధ్యాత్మిక అంధత్వానికి వేర్వేరు రూపాలు. ఇతరులను తీర్పు తీర్చే ముందు, సరిదిద్దే ముందు, యేసు ప్రభువు మనలను ఆయన వెలుగులో మన హృదయాన్ని పరిశీలించుకోమని ఆహ్వానిస్తున్నాడు.
అప్పుడే మన దృష్టి స్పష్టమవుతుంది, మన ప్రేమ నిజమైనదవుతుంది, మన సేవ ఫలప్రదమవుతుంది. అప్పుడు మనం శత్రువులో కూడా మనిషిని చూస్తాం, బలహీనునిలో దేవుని బిడ్డను చూస్తాం, తప్పు చేసినవారిలో పశ్చాత్తాపానికి అవకాశం చూస్తాం, మనలను బాధించినవారిలో కూడా క్షమించవలసిన సోదరుణ్ని చూస్తాం,  అదే క్రీస్తు చూపు. చివరి ప్రశ్న ఇతరుల కంటిలో ఏముంది అనేది కాదు, నా కంటిలో ఏముంది అనేదే. మనం బలహీనులుగా ఉన్నప్పుడే బలంగా ఉంటాము; మన పాపాన్ని అంగీకరించినప్పుడే నీతిమంతులుగా ఉంటాము; మన అంధత్వాన్ని గుర్తించినప్పుడే నిజంగా చూడగలము.

ప్రార్థన


ప్రభువా, ఇతరుల కంటిలోని నలుసును వెతకడానికి ముందు నా కంటిలోని దూలమును నాకు చూపించు. నా హృదయాన్ని శుద్ధి చేసి, నా చూపును నీ చూపుగా మార్చి. నేను ఇతరులను తీర్పు తీర్చే వ్యక్తిగా కాకుండా, ప్రేమతో సరిదిద్దే సోదరునిగా మారునట్లు కృపనివ్వు. నా మాటలు గాయపరచకుండా స్వస్థపరచునట్లు చేసి, నా జీవితం ఇతరులకు నీ మార్గాన్ని చూపించే వెలుగుగా ఉండునట్లు నన్ను నీ శిష్యునిగా తీర్చిదిద్దుము. ఆమెన్.
Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు