నీ విశ్వాసము నిన్ను రక్షించినది – లూకా 7:36-50 వ్యాఖ్యానం

 


నీ విశ్వాసము నిన్ను రక్షించినది

పరిసయ్యుడైన సీమోను ఇంట పాపాత్మురాలైన స్త్రీ -  లూకా 7:36-50

పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఆయన అందులకు అంగీకరించి, పరిసయ్వుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణములోని ఒక స్త్రీ, పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళెనని తెలిసికొని, చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసికొనివచ్చి, ఆయన పాదములు వెనుకగా నిలువబడి, ఏడ్చుచు, తన కన్నీటితో ఆ పాదములను తడిపి, తలవెంట్రుకలతో తుడిచి, ముద్దుపెట్టు కొనుచు, పరిమళద్రవ్యమును పూసెను. యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి “ఇతడు నిజముగా ప్రవక్త అయినచో తనను తాకుచున్న స్త్రీ ఎవరో, ఆమె ఎట్టిదియో గ్రహించెడివాడే. ఆమె పాపాత్మురాలుకదా!” అని తనలోతాను అనుకొనెను. యేసు అతనితో “సీమోనూ! నీకు ఒక విషయము చెప్పదలచితిని” అనగా, “బోధకుడా, చెప్పుము!" అని సీమోను పలికెను. అపుడు యేసు “ఒక వడ్డీ వ్యాపారికి ఇద్దరు ఋణస్థులు ఉండిరి. వారిలో ఒకడు అయిదువందల దీనారములు, రెండవ వాడు ఏబది దీనారములు అతనికి ఋణపడి ఉండిరి. ఋణము తీర్చుటకు వారికి శక్తిలే నందున అతడు వారిద్దరని క్షమించెను. ఇపుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము” అని ప్రశ్నించెను. అందుకు సీమోను “అధికముగ ఋణపడి క్షమింపబడినవాడే అని నాకు తోచుచున్నది” అని జవాబు ఇచ్చెను. “నీవు సరిగా సమాధానము ఇచ్చితివి" అని యేసు పలికెను. పిదప, యేసు ఆ స్త్రీని చూపుచు, సీమోనుతో “ఈమెను చూచుచుంటివికదా! నేను నీ ఇంటికి వచ్చితిని. నీవు కాళ్ళకు నీళ్ళు ఈయలేదు. కాని ఈమె తన కన్నీటితో నా పాదములు తడిపి తన తలవెంట్రుకలతో వానిని తుడిచినది. నీవు నన్ను ముదు పెట్టుకొనలేదు. నేను లోనికి అడుగిడినప్పటినుండియు ఈమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు. కాని ఈమె నా పాదములకు పరిమళద్రవ్యములు పూసినది. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. తక్కువగా క్షమింప బడువాడు తక్కువగనే ప్రేమించును అని నీతో చెప్పు చున్నాను” అని, ఆ స్త్రీతో “నీ పాపములు క్షమింప బడినవి” అని పలికెను. అపుడు ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్నవారు “పాపములు సహితము క్షమించుటకు ఇతడు ఎవరు?” అని అనుకొనసాగిరి. యేసు ఆమెతో “నీ విశ్వాసము నిన్ను రక్షించినది. సమాధా నముతో వెళ్ళుము” అని పలికెను.

లూకా 7:36-50లోని ఈ సంఘటన యేసు ప్రభువు చూపే  క్షమాపణ,  ఆయన కృప, ఆయనలో మనకు ఉండవలసిన  విశ్వాసం,  మన పాపముల పట్ల  మనకు ఉండవలనసిన పశ్చాత్తాపం మరియు  ప్రేమ ఎలా మనిషి యొక్క  పాపములు క్షమించేలా చేస్తుంది అనే  వాటి గురించి ప్రభువు ఇచ్చిన గొప్ప బోధ ఇది.  ఇది కేవలం ఒక పాపాత్మురాలైన స్త్రీ కథ మాత్రమే కాదు; దేవుని కృపను స్వీకరించే ప్రతి మనిషి కథ. ఒకవైపు తనను తాను నీతిమంతుడిగా భావించిన పరిసయ్యుడైన  సీమోను, మరోవైపు సమాజం “పాపాత్మురాలు” అని ముద్ర వేసిన ఒక స్త్రీ. ఈ ఇద్దరి  హృదయములలో వున్న వారి భావనలల్లో ఉన్న వైరుధ్యం, వారికి ఉన్న నీతి ఏమిటి అని తెలుపుతుంది.

చారిత్రక మరియు సాంస్కృతిక నేపథ్యం

ఆ కాలంలోని యూదయా  సమాజంలో పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని కఠినంగా పాటించే మతపరమైన నాయకులుగా భావించబడేవారు. వారు తమను తాము  పవిత్రులుగా, సుంకరులను మరియు పాపులుగా పరిగణించబడిన ఇతరులను అపవిత్రులుగా చూసేవారు. సీమోను యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించినప్పటికీ, అతని ఆహ్వానంలో సాధారణ ఆతిథ్య మర్యాదలు కనిపించలేదు.  ఒక గొప్ప అతిధిని  ఇంటికి ఆహ్వానించినప్పుడు అతిథికి కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వడం, స్వాగత ముద్దు పెట్టడం, తలకు సువాసన నూనె రాయడం ఆనాటి ఆతిథ్య సంప్రదాయాలు. సీమోను వీటిలో ఏదీ యేసు ప్రభువుకు చేయలేదు.

అయితే ఒక స్త్రీ యేసు ప్రభువు  వద్దకు వచ్చింది. ఆమె సమాజంలో “పాపాత్మురాలు”గా గుర్తించబడింది. ఆమె తనతో ఖరీదైన పరిమళద్రవ్యాన్ని తీసుకొచ్చింది. యేసు ప్రభువు  పాదాల వద్ద నిలబడి కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి, తన తలవెంట్రుకలతో వాటిని తుడిచి, వాటిని ముద్దుపెట్టుకొని, పరిమళద్రవ్యాన్ని పూసింది. ఆమెకు తన సామాజిక గౌరవం, ఇతరుల అభిప్రాయం కంటే యేసు ప్రభువు ఆమెకు ఇచ్చే క్షమాపణ ముఖ్యమైంది. ఆమె తన  మాటలతో తన, తన చర్యలతో పశ్చాత్తాపాన్ని వ్యక్త పరచి తన ప్రేమనుచూపించింది.

సీమోను అంతరంగ తీర్పు

 ఈ స్త్రీ వలె సీమోను  కూడా బయటకు ఏమి మాటలాడటం లేదు. అతను  యేసు ప్రభువును తన ఇంటికి పిలిచాడు కాని తన అంతరంగంలో కొనసాగుతున్న ఆలోచనలు మనకు స్పష్టం చేయబడ్డాయి. తన హృదయంలో యేసు ప్రభువును తీర్పు తీర్చడం ప్రారంభించాడు. “ఇతడు నిజముగా ప్రవక్త అయినచో ఈ స్త్రీ ఎట్టిదో తెలిసి ఉండాలి” అని అనుకున్నాడు.

సీమోను యొక్క సమస్య ఏమిటి అంటే, మొదట, పాపాత్ములను దూరంగా ఉంచడమే పవిత్రత అని భావించాడు. రెండవది, ఆ స్త్రీని ఆమె గతం ద్వారా మాత్రమే చూశాడు; ఆమె పశ్చాత్తాపాన్ని చూడలేదు. సీమోను దృష్టిలో  తీర్పు తీర్చి వారిని ఎప్పటికీ తప్పు చేసిన వారిని బయటనే ఉంచాలి అనే భావన. యేసు ప్రభువు దృష్టిలో పాపములో ఉన్న వారిని మార్చాలి, వారిని క్షమించాలి. దేవునితోటి సమాజం తోటి వారిని కలపాలి, అంటే పాపంతో తెగిపోయిన బంధాలను  పునరుద్ధరించాలి.

యేసు ప్రభువు సీమోను హృదయంలోని ఆలోచనలను కూడా తెలుసుకున్నాడు. సీమోను యేసు ప్రభువును పిలిచి, యేసు ప్రభువును పరిశీలిస్తున్నాడు, ఆయన ఎవరు అని నిర్ణయిస్తున్నాడు, కాని సీమోనుకు తెలియదు యేసు ప్రభువుకు మనిషి అంతరంగములో ఉన్న అన్నీ ఆలోచనలు తెలుసని, సీమోను హృదయములో ఏమి జరుగుతుందో, యేసు ప్రభువు పరిశీలిస్తున్నాడు.

ఇద్దరు ఋణస్థుల ఉపమానం

యేసు ప్రభువు  సీమోను మనసులోని ఆలోచనలను తెలుసుకొని ఆయనను నేరుగా  అవమానించకుండా ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యాపారికి ఇద్దరు వ్యక్తులు అప్పు పడ్డారు. ఒకడు 500 దీనారములు, మరొకడు 50 దీనారములు. ఇద్దరికీ అప్పు తీర్చే శక్తి లేదు. ఆ వడ్డీ వ్యాపారి ఇద్దరి అప్పులనూ క్షమించాడు. “వీరిద్దరిలో ఎవరు అతనిని ఎక్కువగా ప్రేమిస్తారు?” అని యేసు ప్రభువు  అడిగాడు. సీమోను, తటపటాయించకుండా  ఎక్కువగా క్షమింపబడినవాడే” అని సరైన సమాధానం చెప్పాడు. కానీ అతడు ఆ ఉపమానం తనకే వర్తిస్తుందని గ్రహించలేదు. పాపిగా పరిగణించబడుతున్న  స్త్రీ ఎంత పెద్ద పాపభారంతో ఉన్నప్పటికీ, సీమోను కూడా దేవుని కృప అవసరమైన వ్యక్తే. పాపం పరిమాణంలో తేడా ఉండవచ్చు; కానీ దేవుని క్షమ అందరికీ అవసరమే.

సీమోను మరియు స్త్రీ

యేసు ప్రభువు  ఇద్దరి మధ్య స్పష్టమైన పోలికను చూపించాడు. సీమోను యేసు ప్రభువు  పాదాలకు నీళ్లు ఇవ్వలేదు; స్త్రీ తన కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది. సీమోను  యేసు ప్రభువును ముద్దుపెట్టుకోలేదు;  స్త్రీ ఆయన పాదాలను ముద్దుపెట్టుకొనుట ఆపలేదు. సీమోను,  ప్రభువు తలకు నూనె రాయలేదు;  స్త్రీ ఖరీదైన పరిమళద్రవ్యాన్ని పూసింది. సీమోను ఆచారాన్ని మాత్రమే చేశాడు,  స్త్రీ తన హృదయాన్ని సమర్పించింది. సీమోను యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించాడు; స్త్రీ తన హృదయాన్ని యేసు ప్రభువు  పాదాల వద్ద ఉంచింది.

క్షమాపణ మరియు ప్రేమ

ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి” అనే యేసు ప్రభువు మాటను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ స్త్రీ ప్రేమ క్షమాపణను కొనుగోలు చేసినది కాదు.  అది ఆమె ప్రేమ అప్పటికే పొందిన క్షమాపణకు ఫలితం మరియు సాక్ష్యం. అది క్షమాపణ పొందిన తరువాత  కృతజ్ఞత చెల్లిస్తు చూపించిన ప్రేమ. దేవుని కృపను ఎంత లోతుగా అనుభవిస్తామో, అంత లోతుగా ఆయనను ప్రేమించగలుగుతాము. “తక్కువగా క్షమింపబడువాడు తక్కువగనే ప్రేమించును” అనే మాట సీమోను సమస్యను వెల్లడిస్తుంది. అతనికి తనకు కూడా క్షమ అవసరమని  తెలియక పోవడం వల్ల అతనిలో కృతజ్ఞత మరియు ప్రేమ తక్కువగా కనిపించాయి.

నీ పాపములు క్షమింపబడినవి”

యేసు ప్రభువు  ఆ స్త్రీతో బహిరంగంగా, “నీ పాపములు క్షమింపబడినవి” అని ప్రకటించాడు. సమాజం ఆమెను “పాపాత్మురాలు” అని గుర్తించినా, యేసు ప్రభువు  ఆమెను క్షమింపబడిన వ్యక్తిగా పునరుద్ధరించాడు.

అక్కడ ఉన్నవారు, “పాపములు సహితము క్షమించుటకు ఇతడు ఎవరు?” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న యేసు ప్రభువు  అధికారానికి సంబంధించిన ముఖ్యమైన సత్యాన్ని వెల్లడిస్తుంది. పాపాలను క్షమించే అధికారం దేవునికే ఉందనే సమయంలో, యేసు ప్రభువు  పాపాలను క్షమిస్తున్నాడు. అందువల్ల లూకా యేసు ప్రభువును  కేవలం బోధకుడిగా లేదా ప్రవక్తగా కాకుండా, దైవ అధికారమున్న ప్రభువుగా చూపిస్తున్నాడు.

నీ విశ్వాసము నిన్ను రక్షించినది”

చివరగా యేసు ప్రభువు, “నీ విశ్వాసము నిన్ను రక్షించినది. సమాధానముతో వెళ్ళుము” అని చెప్పాడు. ఇది కేవలం పాపక్షమాపణ కాదు; రక్షణ, శాంతి మరియు కొత్త జీవితానికి ఆహ్వానం.

ఆమె యేసు ప్రభువు  దగ్గరకు వచ్చినప్పుడు ఆమెలో  పాపభారం ఉంది; వెళ్లేటప్పుడు క్షమాపణ ఉంది. వచ్చినప్పుడు కన్నీళ్లు ఉన్నాయి; వెళ్లేటప్పుడు సమాధానం ఉంది. వచ్చినప్పుడు ఆమె గతం ఆమెను వెంటాడుతోంది; వెళ్లేటప్పుడు ఆమె భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉంది.

మనిషి తన స్వంత శక్తితో పాపాన్ని పూర్తిగా పరిహరించుకోలేడు. కేవలం దేవుని కృప వలనే మనం క్షమించబడతాము.  బాహ్య భక్తి కంటే అంతరంగ హృదయ మార్పు ముఖ్యం. సీమోను పరిసయ్యుడు, అతని హృదయంలో కరుణ మరియు కృతజ్ఞత కనిపించలేదు. ఆ స్త్రీ సమాజంలో పాపిగా గుర్తించబడినా, ఆమె హృదయంలో పశ్చాత్తాపం, ప్రేమ మరియు విశ్వాసం కనిపించాయి. యేసు ప్రభువు మానవుల అంతరంగాన్ని తెలుసుకొని, పాపాలను క్షమించే అధికారాన్ని కలవాడు, కనుక దానిని సంపూర్తిగా నెరవేర్చాడు.

కార్మెలియ  ఆధ్యాత్మిక దృష్టి

కార్మెలియ  ఆధ్యాత్మికతలో దేవునితో వ్యక్తిగత స్నేహం, అంతరంగ ప్రార్థన మరియు హృదయ పరివర్తన ముఖ్యమైనవి. ఈ స్త్రీ ఎక్కువ మాటలు మాట్లాడలేదు. ఆమె కన్నీళ్లు, వినయం, ప్రేమ మరియు సమర్పణ ఆమె ప్రార్థనగా మారాయి.

పునీత ఆవిలాపురి  తెరేసమ్మ  బోధించిన అంతరంగిక  కోటలో మనిషి తన బలహీనతలను నిజాయితీగా అంగీకరించితెనే  దేవుని సన్నిధిలోకి ప్రవేశిస్తాడు. సిలువ యోహానుగారు ఆధ్యాత్మిక మార్గంలో,  అహంకారాన్ని విడిచిపెట్టడం ద్వారా దేవుని వెలుగుకు మన జీవితాలలో  స్థానం  ఉంటుంది.

మన జీవితానికి అన్వయం

ఈ సంఘటన మన కుటుంబాలకు, కుటుంబంలో ఒకరి తప్పులను మాత్రమే గుర్తుచేస్తూ ఉంటే ఆ కుటుంబం సీమోనులా మారవచ్చు. క్షమ, కరుణ, పశ్చాత్తాపం మరియు ప్రేమ ఉంటే కుటుంబం క్రీస్తు సన్నిధిగా మారుతుంది.

క్రైస్తవ సంఘం కేవలం “మంచివాళ్ల” కోసం కాకుండా పాపభారం మోసేవారికి ఆశ్రయంగా, పశ్చాత్తాపంతో తిరిగి వచ్చేవారికి  అండగా, పడిపోయినవారికి పునరుద్ధరణకు మార్గంగా ఉండాలి.

సమాజంలో ఒక వ్యక్తి గత తప్పుతో జీవితాంతం అతని మీద ముద్ర వేయకూడదు. యేసు ప్రభువు  మనిషిని అతని గతంతో మాత్రమే చూడడు.

ఆత్మపరిశీలన

నేను సీమోనులా ఇతరుల పాపాలను మాత్రమే చూస్తున్నానా?
నా జీవితంలో దేవుని క్షమను గుర్తిస్తున్నానా?
నేను యేసు ప్రభువును ఇంటికి మాత్రమే ఆహ్వానించానా, లేక నా హృదయంలోకి కూడా ఆహ్వానించానా?
నా ప్రార్థనలో నిజమైన పశ్చాత్తాపం ఉందా?
ఇతరుల గతాన్ని పట్టుకొని వారిని తీర్పు చేస్తున్నానా?
నన్ను బాధించినవారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నానా?

లూకా 7:36-50 మనకు పాపం కంటే దేవుని కృప గొప్పదని,   స్వీయ నీతి మీద ఆధారపడటం కంటే దేవుని కృప మీద ఆధారపడటం మంచిదని తెలుపుతుంది. పాపాత్మురాలిగా పరిగణించబడిన ఆ  స్త్రీ నిజమైన పశ్చాత్తాపం, వినయం ద్వారా  విశ్వాసానికి ఉదాహరణగా నిలుస్తుంది. యేసు ప్రభువు  మనలను ఇతరులను తీర్పు చేయక  కరుణతో చూడమని  పిలుస్తున్నాడు.

ప్రార్థన

ప్రభువా, నా పాపాలను, బలహీనతలను, గతాన్ని నీ ముందు ఉంచుతున్నాను. ఇతరుల తప్పులను  చూసి నా తప్పులను మరచిపోయే  హృదయం కాకుండా, పాపాత్మురాలైన ఆ స్త్రీ వలె వినయంతో నీ పాదాల వద్దకు రావడానికి నాకు మీ  కృపనిమ్ము. నా పశ్చాత్తాపాన్ని నిజమైన మార్పుగా, నా కృతజ్ఞతను ప్రేమగా, నా విశ్వాసాన్ని సేవగా మార్చి,  నా గతం నేనేమిటో నిర్ణయించకుండ,  మీ కృప నన్ను నిర్ణయించేలా చేయండి.  ఆమెన్.  

నీ విశ్వాసము నిన్ను రక్షించినది. సమాధానముతో వెళ్ళుము.

 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు