లూకా 7:31-35 వ్యాఖ్యానం: ఈ తరమువారిని ఎవరితో పోల్చుదును?
లూకా 7:31-35
“ఈ తరమువారిని నేను
ఎవరితో పోల్చుదును? వారెవరిని పోలియుందురు? వారు అంగడి వీధులలో కూర్చుండియున్న పిల్లలవలె
ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు 'మేము మీ కొరకు
వాద్యములు మ్రోగించితిమి. కాని, మీరు
నాట్యమాడరైతిరి. మేము విలపించితిమి. కాని, మీరు ఏడ్వరైతిరి' అని అనుచుందురు. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి
దయ్యముపట్టినదని మీరు చెప్పుచున్నారు. మనుష్యకుమారుడు అన్న పానీయములను పుచ్చుకొన్నచో ఆయన
భోజన ప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు, పాపాత్ములకు
మిత్రుడు అని చెప్పుచున్నారు. జ్ఞానము దానిని
స్వీకరించువారివలన నిరూపింప డుచున్నది” అని యేసు పలికెను.
ఈ తరమువారిని నేను ఎవరితో పోల్చుదును?
సందర్భం
రానున్న
మెస్సీయ్యా గురించి యోహాను బోధించాడు, వారు మారు మనస్సు పొందాలని చెప్పాడు.
హెరోదు యోహనును బంధించిన తరువాత ఆయన తన శిష్యులను రాబోయే మెస్సీయ్యా, యేసు ప్రభువేనా?
లేక వారు మరియొకని కోసం ఎదురుచూడాల అని అడుగుటకు తన శిష్యులను యేసు ప్రభువు దగ్గరకు
పంపాడు. అందుకు యేసు
ప్రభువు, తన ద్వార జరుగుతున్న విషయాలను చెప్పి, తన పనుల ద్వారా తెలుసుకోవాలని పరోక్షంగా
తెలియజేస్తాడు. అది విని యోహాను శిష్యులు వెల్లపోతారు. అప్పుడు యేసు
ప్రభువు యోహాను గురించి తన గురించి చెప్పి, ఎలా ప్రజలు ధర్మ శాస్త్ర బోధకులు,
పరిసయ్యులు వీరిని తిరస్కారిస్తున్నది తెలియజేసె సంధర్భం లోనిది ఈ సువిశేష భాగం.
"ఈ తరమువారిని నేను ఎవరితో పోల్చుదును ?"
ఈ ప్రశ్న
అక్కడి వారిని మరియు నేటి ప్రజలను కూడా ఆలోచింపచేసే ప్రశ్న. ఎందుకంటే ఒక ఆనాటి
వారు తమ హృదయాలను దేవుని ఆహ్వానాలన్నిటికి మూసివేశారు. ద్వితీయోపదేశకాండములో చెప్పినట్లుగా
, వక్రమైన మూర్ఖమైన తరము. ( ద్వితీ 32: 5) దేవుని పిలుపును
పదే పదే తిరస్కరించడం వీరి విధిలా ఉంది.
అంగడి వీధి పిల్లల ఉపమానం
మొదటి శతాబ్దపులో "అంగడి వీధులలో, కేవలం
క్రయవిక్రయాలకు మాత్రమే పరిమితమైన స్థలం కాదు. అది న్యాయస్థానాలు, బహిరంగ
చర్చలు, ప్రకటనలు, మరియు పిల్లల ఆటలకు కేంద్రం.
పిల్లలు జట్టులుగా కూర్చుని, ఒక జట్టును మరో జట్టును ఆటకు పిలుస్తూ ఆడుకోవడం సర్వసాధారణం. ఈ ఆటలు ఎక్కువగ
పెద్దల జీవితాలలోని పెండ్లి వేడుక, మరణ రోదన దృశ్యాలను అనుకరించి ఆడుకునేవారు. ఒక జట్టు పిల్ల గ్రోవిని ఊదిన రెండవ జట్టు స్పందించక
పోవడం, నాట్యమాడక పోవడం, మరణపు శోక గీతమునకు వాయించిన వారు స్పదించక పోవడం ఇది తెలియచేస్తుంది.
అంటే ఇది ఆనందానికి కాని, దుఃఖానికి కాని వారు స్పదించడం లేదు.
ఇక్కడ దేవుని ఆహ్వానం ఆగిపోలేదు, అది సంతోషం
రూపేణ, లేక దుఃఖ రూపేణ ఇది వస్తూనే ఉంది. కాని
ప్రజలు మాత్రం వారి హృదయాలను పూర్తిగా మూసివేసుకున్నారు. దేవుని నుండి వచ్చిన ప్రతి
ఆహ్వానాన్ని వీరు ఏదో ఒక రకముగా తిరస్కారించేవారు. దాని గురించి ఆలోచించకుండానే, ఆ
ఆహ్వానాన్ని తిరస్కరించారు. దేవుని ఆహ్వానం ఆగిపోలేదు, ఈ తిరస్కారం పునరావృతం అవుతూనే
ఉంది.
యోహాను పట్ల వచ్చిన ఆరోపణ
బాప్తిస్మ యోహాను ఎడారిలో నివసిస్తు, చఒంటె
వెంట్రుకల వస్త్రం ధరించి, కఠినమైన జీవితాన్ని జీవించాడు. అయినప్పటికీ
ప్రజలను ఆయనను దయ్యము పట్టినవాడు అన్నారు, ఆయన ద్వారా వచ్చిన ఆహ్వానాన్ని వారు పట్టించుకోలేదు.
యేసు ప్రభువు పట్ల వచ్చిన ఆరోపణ
యోహానుకు పూర్తి భిన్నంగా, యేసు ప్రభువు
తినుచు, త్రాగుచు, సుంకరులతో
పాపులతో కలిసి భోజనం చేశాడని ప్రజలు ఆయనను "భోజనప్రియుడు", "మద్యపానరతుడు"
(οἰνοπότης), "సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు" అని
నిందించారు.
రెండు విభిన్న బాటలు
యోహాను తినకపోతే విమర్శించారు, యేసు ప్రభువు
తింటే విమర్శించారు. యోహాను ఒంటరిగా ఎడారిలో ఉంటే విమర్శించారు, యేసు ప్రభువు
ప్రజల మధ్య ఉంటే విమర్శించారు. అంటే వారి
సమస్య ముందుగానే వ్యతిరేకముగా ఉండటానికి నిర్ణయించుకొని
ఉండటం. దేవుని ఆహ్వానాన్ని తిరస్కరించాలని
నిర్ణయించుకున్నారు. అప్పుడు దేవుని వాక్కు ఏమి చెప్పిన ఉపయోగం ఉండదు.
మానవ హృదయపు మొండితనం, స్పష్టమైన
సత్యాన్ని తిరస్కరించిన దేవుని
ఆహ్వానం జ్ఞానం కలిగిన వారు దానిని పొందుతారు.
దేవుని పిలుపు అప్పుడు ఒకే రకంగా ఉండదు. యోహాను కఠిన జీవితం ద్వారా, ఆయన హెచ్చరికల ద్వారా
పశ్చాత్తాపపు
పిలుపుగా దేవుని ఆహ్వానం వచ్చింది. యేసు ప్రభువు తన క్షమ ద్వారా, ఆయన
కృప, ఆయన సహవాసం ద్వారా , ఆనందంలో పాలుపంచుకోమని దేవుని పిలుపు వచ్చింది. రెండు దేవుని పిలుపులే. రెండూ ఒకే
దేవుని సందేశంలో భాగాలే, దేవుడు అనేక మార్గాల
ద్వారా మానవుని దగ్గరకు వస్తాడు. కాని మనిషి
అన్నీ విధాలుగా తన హృదయాన్ని మూసివేసుకుంటే, ఆయన విందులో పాల్గొనలేము. ఆయన సహవాసాన్ని
పొందలేము. ఎవరు అయితే దానిని గమణిస్తారో వారే దానిలో పాల్గొనగలరు. యేసు ప్రభువు ఇక్కడ విమర్శించినది సాధారణ ప్రజలను కాదు, ప్రత్యేకంగా
పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను (7:30) వారి నిజమైన సమస్య ముందుగానే తీసుకున్న నిర్ణయం,
"మేము దేనినీ అంగీకరించము." యోహాను దగ్గరకు వారి శిష్యులను పంపి నీవు ఎవరవు?
ఎందుకు బాప్తిస్మము ఇస్తున్నావు అని అడిగారు. యేసు ప్రభువును
నీకు బెల్జబులు వలన దయ్యములను వెడలగోడుతున్నారు
అన్నారు, దేవుడు వారికి తెలిసిన రీతిలోనే రావాలి, లేదా తన సందేశం పంపాలి అనే ఆలోచనలో ఉన్నారు, దేవుణ్ణి మనకు తెలిసిన పరిదిలోనే
ఉండాలను కోవడం మన మూర్ఖత్వం అవుతుంది. ఇది వీరిలో మనం చూస్తాము. వారు ఏ ఆహ్వానానికి
స్పందించక పోవుటకు ఇది ఓ కారణం ఇదే కావచ్చు.
ఇది దేవుని పట్ల ఒక రకమైన ప్రతిఘటన, ఇది చాల ఘోరమైనది.
పశ్చాత్తాపం - ఆనందం
యోహాను, యేసుప్రభువు ఇద్దరు వేరు వేరు సందేశాలు ఇవ్వలేదు. యోహాను పశ్చాతాపం పొందాలని
ప్రకటిస్తే , ఆ యేసు ప్రభువు ఆ పశ్చాతాపమును ప్రకటిస్తూనే అది పొందిన వారిని క్షమించి,
తన సాన్నిధ్య ఆనందమును వారికి ఇస్తున్నాడు. పశ్చాత్తాపం లేని ఆనందం క్షణికమైనదిగా మారవచ్చు. ఆనందం లేని
పశ్చాత్తాపం, క్షమాపణ పొందని భారమైన, నిరాశాజనకమైన
మతతత్వంగా మారే ప్రమాదం ఉంది. అందుకే యేసు ప్రభువు యోహాను బోధను కొనసాగించి,
ఆ బోధన అనుసరించిన వారికి అందరిని క్షమిస్తున్నారు. కనుక ఇద్దరి బోధనలు ఒకదానిని ఒకటి బలపరుస్తుంది.
కాని ఈ ఆహ్వానాన్ని అంగీకరించని వారు వారి పాపములోనే ఉండి పోతున్నారు. అంతే కాదు దేవుని
సందేశం వచ్చిన తీరును తప్పు పడుతున్నారు. ఒకరిని దయ్యం పట్టినది అని నిందిస్తున్నారు,
మరియొకరిని, త్రాగుబోతు, తిండిబోతు, పాపుల స్నేహితుడు అంటున్నారు. దేవుని సందేశమును
అంగీకరించిన వారు మారుతున్నారు, దేవుని సాన్నిధ్య ఆనందమును పొందుతున్నారు. ఆ సందేశమును
అంగీకరించినవారు జ్ఞానం వున్నవారు. అది వారి జీవితములో నిరూపించబడుతుంది.
జీవిత అన్వయం
ఈ సువిశేష భాగాన్ని మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి?
మన జీవితంలో అనేక మారులు మన తల్లిదండ్రులు, జీవితభాగస్వామి, గురువులు,
లేక స్నేహితులు ఎవరి ద్వారా అయిన దేవుని సందేశం
రావచ్చు. కేవలం నేను గొప్ప వారిగా భావించే వారి నుండే దేవుని సందేశం రావాలని, లేక నేను
అనుకునే విదానం లోనే రావాలని కోరుకుంటే, అప్పుడు నేను దేవుని సందేశాన్ని తిరస్కరిస్తున్నాననే
అర్ధం. వీరు నేను ఆలోచించే విధముగానే దేవుని సందేశం రావాలని అనుకున్న కూడా నేను దేవుని
సందేశమును గ్రహించలేను. దానిని తిరస్కరిస్తున్నట్లే. కొన్ని మారులు ఈ మాటలు కఠినముగా ఉన్నవని, లేక అవి
చాలా సులభముగా ఉన్నవని దేవుని సందేశాన్ని తిరస్కరించ వచ్చు. దేవుని మాటలు పాపము చేసినప్పుడు క్రమ శిక్షణలో పెడుతూ ఉంటాయి.
పశ్చాత్తాప పడితే సేదనిస్తాయి. అక్కున చేర్చుకుంటాయి. వెరే వారు సేద తిరుతున్నప్పుడు,
వారి పశ్చాత్తాపాన్ని గుర్తించక, నాకు వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించే సమయాలు ఉండవచ్చు.
నాకు నా జీవితానికి ఎప్పుడు ప్రభువు ఆహ్వానాన్ని స్వీకరిస్తూ, ఇతరుల ఆహ్వానం గురించి
తీర్పు తీర్చకుండ ఉండాలి. వారి ఆనందంలో పాలుపంచుకోవాలి. అప్పుడు మనం కూడా దైవ జ్ఞానం
పొందగలుగుతాము.
ఆత్మపరిశీలనకు ప్రశ్నలు
నాకు నచ్చిన విధంగా దేవుడు పనిచేయాలని నేను
కోరుతున్నానా? నాకు నచ్చని వ్యక్తి ద్వారా కూడా దేవుడు
మాట్లాడగలడని అంగీకరిస్తున్నానా? ఇతరులను త్వరగా తీర్పు
చేస్తున్నానా? పవిత్రంగా జీవించేవారిని అనుమానిస్తున్నానా, పాపులతో
కరుణతో వ్యవహరిస్తున్నానా? క్షమాపణ గురించి తెలిసి కూడా
క్షమించలేకపోతున్నానా? నేను తెలుసుకున్న దేవుని
సత్యం నా జీవితంలో నిజంగా ఫలిస్తున్నదా, లేక కేవలం మాటల్లోనే ఉందా?
సంఘ నాయకత్వానికి ఒక గమనిక
సంఘ నాయకులు, బోధకులు, తల్లిదండ్రులు
ఈ వాక్యభాగం ఒక సమతూకాన్ని బోధిస్తుంది. అందరి మెప్పు పొందాలని ప్రయత్నిస్తే అసలు ఉద్దేశమే
మారిపోతుంది. దేవుడు తనదైన విధానంలో, ఆహ్వానం పలుకుతాడాని గ్రహించి జీవించి
ఆయన పిలుపుకు అనుకూలముగా ఉండటము మన బాద్యత.
వివాహ విందు, అంత్యక్రియల చిత్రాల ప్రాముఖ్యత
యేసు ప్రభువు ఉద్దేశపూర్వకంగా రెండు అత్యంత భావోద్వేగభరిత సందర్భాలను, వివాహం, అంత్యక్రియలను ఎంచుకున్నాడు. యూదా సంస్కృతిలో ఈ రెండూ సమాజం మొత్తం కలిసి పాల్గొనే ముఖ్యమైన ఘట్టాలు; వివాహ వేడుకలో బంధువులు, స్నేహితులు అందరూ నాట్యంలో పాల్గొనడం, అంత్యక్రియలలో సమాజమంతా దుఃఖంలో పాలుపంచుకోవడం సాంఘిక బాధ్యతగా భావించేవారు. ఈ రెండు సందర్భాలకూ స్పందించని పిల్లలు సామాజికంగా కూడా అసాధారణంగా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని అర్థం. అదే విధంగా, యోహాను తెచ్చిన "దుఃఖపు" సందేశానికి (పశ్చాత్తాపం), యేసు ప్రభువు తెచ్చిన "ఆనందపు" సందేశానికి ( విందు) కూడా స్పందించని ఆ తరం, కేవలం మతపరంగా మాత్రమే కాక, మానవీయంగా కూడా ఒక అసాధారణ కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది.
ప్రార్థన
ప్రభువా, నా హృదయంలో ఉన్న అభిప్రాయాలను
తొలగించుము. నాకు నచ్చిన విధంగా మీరు చేయాలని కోరుకునే స్వభావం నుండి వైదొలగి మీరు చేయాలని అనుకునేదానికి
నన్ను ఒక సాధనంగా వాడండి. మీరు ఏ విధంగా ఆహ్వానం పంపిన దానిని
నేను తెలుసుకొని, దానికి స్పదించేలా చేయండి.
ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment