యేసు వెంట నడిచిన స్త్రీలు – లూకా 8:1-3 వ్యాఖ్యానం

 


యేసు వెంట నడిచిన స్త్రీలు

లూకా సువార్త 8:1-3 పై ధ్యానాత్మక వ్యాఖ్యానం

“ఆ తరువాత యేసు పట్టణములందును, గ్రామములందును పర్యటించుచు, దైవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను. పన్నిద్దరు శిష్యులును ఆయన వెంట ఉండిరి. అపవిత్రాత్మలనుండియు, రోగముల నుండియు స్వస్థులైన కొందరు స్త్రీలును ఆయన వెంట ఉండిరి. ఏడుదయ్యములనుండి విముక్తి పొందిన మగ్దలేన అనబడు మరియమ్మ, హేరోదు గృహ నిర్వాహకుడగు 'ఖూజా' భార్యయగు యోహాన్నయు, సూసన్నయు, మరియు వారిసొంత వనరులనుండి వారి నిత్యావసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది ఇతర స్త్రీలును వెంట ఉండిరి.” - లూకా 8:1-3

యూదా సమాజంలో స్త్రీలకు బహిరంగ స్థానం లేని ఆ కాలంలో, ఒక సువార్తికుడు తన కథనంలో నలుగురు స్త్రీల పేర్లను నమోదు చేయడం ఒక చిన్న విషయం కాదు. లూకా సువార్తలోని ఈ మూడు వచనాలు పైకి కేవలం ఒక ప్రయాణ వివరణలా కనిపిస్తాయి,  యేసు ఎక్కడికి వెళ్ళాడు, ఎవరు ఆయన వెంట ఉన్నారు అనేది మాత్రమే బయటకు కనపడుతుంది. కానీ లోతుగా చదివితే, ఇది దైవరాజ్య స్వభావాన్ని, శిష్యరికం అంటే ఏమిటో, కృతజ్ఞత ఎలా సేవగా మారుతుందో బోధించే ఒక చిన్న, సమగ్రమైన సువార్త.

1. “ఆ తరువాత” - ఒక కొత్త అధ్యాయం

లూకా 7వ అధ్యాయం చివరలో ఒక పేరులేని పాపాత్మురాలిగా పరిగనించబడిన స్త్రీ పరిసయ్యుడైన సీమోను ఇంట్లో యేసు ప్రభువు  పాదాలను కన్నీళ్లతో కడిగి, పరిమళ తైలం పూసింది. ఆమెతో  యేసు ప్రభువు “నీ విశ్వాసము నిన్ను రక్షించినది; సమాధానముతో వెళ్లుము” అని పలికాడు. ఆ క్షమాపణ కథ ముగిసిన వెంటనే, లూకా “ఆ తరువాత” అని 8వ అధ్యాయాన్ని ప్రారంభించాడు.  క్షమింపబడిన, స్వస్థపరచబడిన స్త్రీలు ఇప్పుడు యేసు ప్రభువు  వెంట నడుస్తూ, తమకు ఉన్న  వనరులతో ఆయన సేవకు తోడ్పడుతున్న దృశ్యంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. దేవుని కృపను పొందినవారు  ఆయనను కృతజ్ఞతతో అనుసరించడం అనే క్రమాన్ని లూకా ఇక్కడ చూపిస్తున్నాడు.

యేసు ప్రభువు  ఇక్కడ ఒక స్థిరమైన వేదిక మీద కూర్చొని ప్రజలు తన వద్దకు రావాలని ఎదురుచూడలేదు. ఆయన “పట్టణములందును, గ్రామములందును” పర్యటించాడు,  పెద్ద నగరాలే కాదు, ఎవరూ పట్టించుకోని చిన్న పల్లెలు కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి. దేవుని రాజ్యం ఎంపిక చేసిన కొందరికే కాదు, ప్రతి వీధికి, ప్రతి ఇంటికి చేరాలనేది ఆయన ఉద్దేశం.

2. దైవరాజ్య సువార్త మరియు పన్నిద్దరు శిష్యులు

యేసు ప్రభువుని  పరిచర్య  యొక్క సారాంశం “దైవరాజ్యం”. ఇది భవిష్యత్తులో మాత్రమే వచ్చే ఏదో దూరమైన విషయం కాదు; దేవుని ప్రేమ, క్షమాపణ, స్వస్థత, న్యాయం మనుషుల మధ్య  ఇప్పుడు మొదలవటమే  ఆ రాజ్యం. యేసు ప్రభువు  దేవుని రాజ్యాన్ని  కేవలం బోధించలేదు,  తన చేసిన  స్వస్థతలలో  స్పర్శలో, తన క్షమాపణలో, సమాజం వెలివేసిన వారిని దగ్గరకు తీసుకోవడంలో ప్రత్యక్షంగా చూపించాడు.

ఆయన వెంట పన్నిద్దరు శిష్యులు ఉన్నారు. అది  ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలను ప్రతిబింబించే సంఖ్య, దేవుడు ఒక కొత్త ప్రజా సమూహాన్ని నిర్మిస్తున్నాడని సూచించేది. కానీ లూకా ఇక్కడితో ఆగక, అతని దృష్టి మరో వైపుకు కూడా మళ్ళుతుంది,  ఆ బృందంలో స్త్రీలు కూడా ఉన్నారు.

3. స్వస్థత నుండి శిష్యత్వానికి

“అపవిత్రాత్మలనుండియు, రోగముల నుండియు స్వస్థులైన కొందరు స్త్రీలు” అనే మాటలో ఒక ఆధ్యాత్మిక క్రమం దాగి ఉంది: బాధలో  ఉన్నప్పుడు  యేసు ప్రభువును కలవడం, ఆ  కలయికలో,  విముక్తి పొందడం, దానికి  కృతజ్ఞత చూపుతూ ఆయనను  అనుసరించడం. స్త్రీలు యేసు ప్రభువు  వద్ద కేవలం బోధ వినడానికి రాలేదు; వారు ఆయన శక్తిని స్వయంగా అనుభవించారు, వారి జీవితాలు మారిపోయాయి. దేవుని ప్రేమను నిజంగా అనుభవించినవారి మొదటి స్పందన సేవే.

వీరిలో మొదట పేర్కొనబడినది మగ్దల మరియమ్మ,  గలిలయ సముద్ర తీరంలోని మగ్దల గ్రామం నుండి వచ్చినది. ఆమె “ఏడు దయ్యముల నుండి విముక్తి” పొందింది; బైబిలులో “ఏడు” సంఖ్య సంపూర్ణతను సూచిస్తుంది గనుక, ఆమె అనుభవించిన బంధకం ఎంత తీవ్రమైనదో, యేసు ప్రభువు ఇచ్చిన విముక్తి ఎంత సంపూర్ణమైనదో ఈ మాట తెలియజేస్తుంది. ఒక చారిత్రక సత్యాన్ని ఇక్కడ స్పష్టం చేయాలి,  మగ్దల  మరియమ్మను లూకా 7లోని పేరులేని పాపి స్త్రీతో ముడిపెట్టడానికి బైబిలులో ఎలాంటి ఆధారం లేదు. ఈ గందరగోళం శతాబ్దాల తరువాత పుట్టిన సంప్రదాయం మాత్రమే. వాస్తవానికి మగ్దల మరియమ్మ నాలుగు సువార్తలలోనూ సిలువ చెంత, సమాధి చెంత, పునరుత్థానానికి మొదటి సాక్షిగా అత్యంత గౌరవప్రదమైన స్థానంలో నిలుస్తుంది.  ఆమెను “అపొస్తలులకు అపొస్తలురాలు” అని గౌరవిస్తారు.

4. యోహాన్న - రాజభవనం నుండి రాజ్య సేవకు

తరువాత లూకా యోహాన్నను గురించి  చెబుతున్నాడు.  ఆమె హేరోదు అంతిపాసు గృహ నిర్వాహకుడైన ఖూజా భార్య. ఖూజా హోదా అంటే రాజ కుటుంబపు ఆర్థిక, పరిపాలనా వ్యవహారాలు చూసే ఉన్నతాధికారి,  అంటే యోహాన్న సంపద, అధికారం, సామాజిక గౌరవం కలిగిన కుటుంబానికి చెందినది. హేరోదు, బాప్తిస్మ  యోహానును చంపించిన రాజు, తరువాత యేసు ప్రభువు  విచారణలో కూడా భాగం వహించిన రాజు. అటువంటి రాజ ఆస్థానానికి చెందిన స్త్రీ యేసు ప్రభువును బహిరంగంగా అనుసరించడం, రాజభవన సౌఖ్యాలను వదిలి సామాన్య శిష్యురాలిగా నిలవడం అంటే అది ఆమె గొప్ప ధైర్యమునకు నిదర్శనం.

ఇక్కడ దైవరాజ్యం గొప్పదనము మనకు కనిపిస్తుంది,  ఏడు దయ్యముల బంధకం నుండి వచ్చిన మరియ, రాజభవన అధికార వర్గం నుండి వచ్చిన యోహాన్న, ఇద్దరూ ఒకే బృందంలో, యేసు ప్రభువు వెంట, ఒకే లక్ష్యంతో నడుస్తున్నారు. దేవుని రాజ్యంలో గతం ఎలాంటిదైనా, సామాజిక స్థాయి ఎంతైనా, వాటికి  సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ స్థానం ఉంది.

5. సూసన్న -  పేరు తెలియకున్నా సేవ చిరస్థాయి

సూసన్న గురించి బైబిలులో మరిన్ని వివరాలు లేవు; ఆమె పేరు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అయినా లూకా ఆమె పేరును జాగ్రత్తగా నమోదు చేశాడు. ఇది మనకు ఒక సున్నితమైన ఓదార్పు ఇస్తుంది. ప్రపంచం గుర్తించకపోయినా, ప్రచారం లేకపోయినా, దేవుని దృష్టిలో నమ్మకమైన సేవ ఎన్నటికీ వ్యర్థం కాదు. చరిత్ర పుస్తకాలలో పేరు లేకున్నా, దేవుని జ్ఞాపకంలో ఆ పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

6. “సొంత వనరులనుండి తోడ్పడుచున్న” - నిశ్శబ్ద పరిచర్య

 సువిశేష భాగంలో అత్యంత ప్రాముఖ్యమైన మాట ఇది, ఈ స్త్రీలు “తమ సొంత వనరుల నుండి” యేసు ప్రభువు  మరియు శిష్యుల నిత్యావసరాలకు తోడ్పడుతూ ఉన్నారు. మూల గ్రీకు భాషలో వాడిన  “పరిచర్య” (diakonia) అనే పదం తరువాత క్రైస్తవ సంఘంలో “డీకన్” అనే పరిచర్యా హోదాకు మూలమైంది. అంటే ఈ స్త్రీలు చేసినది సాధారణ ఆతిథ్యం కాదు,  ఇది సంఘపరిచర్యగా గుర్తింపబడిన, గౌరవించదగిన కార్యం.

అప్పటి పితృస్వామిక సమాజంలో స్త్రీలు స్వతంత్రంగా ఆస్తిని నిర్వహించడం సాధారణంగా జరిగేది కాదు. అయినా ఈ స్త్రీలు తమ సంపదను, సమయాన్ని, శక్తిని స్వేచ్ఛగా దేవుని రాజ్య కార్యానికి అర్పించారు. వారి సేవ లేకుండా యేసు ప్రభువు, పన్నిద్దరు శిష్యుల ప్రయాణ  పరిచర్య  కార్యక్రమం సాఫీగా సాగేది కాదు. వాక్యం బోధించడం ఎంత అవసరమో, ఆ బోధకుల నిత్యావసరాలను చూసుకోవడం కూడా అంతే అవసరం, ఈ రెండు ఒకే రాజ్య కార్యంలో రెండు చేతులు.

7. కార్మెలియ  దృక్పథం

కార్మెలియ  ఆధ్యాత్మికత దేవునితో అంతరంగ స్నేహాన్ని, ప్రేమను నొక్కి చెబుతుంది,  కానీ ఆ అంతరంగ ప్రేమ ఎప్పుడూ ఏకాంతంలోనే ఆగిపోదు; అది సేవగా బయటకు ప్రవహిస్తుంది. అవిలాపూరి  తెరేసమ్మ దీనిని “liberty of spirit” అని పిలిచింది,  దేవుని ప్రేమతో నిండిన హృదయం భయం లేకుండా, స్వేచ్ఛగా తనను తాను దేవుని సేవకు, ఇతరుల సేవకు అర్పించుకోగలదు. మగ్దల మరియమ్మ  కథ సిలువ యోహాను చెప్పే “గాఢాంధకార  రాత్రి” నుండి వెలుగులోకి వచ్చే ప్రయాణాన్ని గుర్తుచేస్తుంది,  గాయం చివరి గుర్తు కాదు, దేవుని కృప కొత్త అధ్యాయాన్ని రాయగలదు. సూసన్న నిశ్శబ్ద సేవలో మనం చిన్న తెరేసమ్మ “చిరు మార్గాన్ని” చూస్తాం,  గొప్ప కార్యాలు కాదు, ప్రేమతో చేసిన చిన్న, రహస్య సేవలే దేవుని దృష్టిలో అమూల్యం. ఎలీయా ప్రవక్తను దేవుడు అనామకంగా ఉన్న వారిచే  ఆదరించినట్లే, ఈ స్త్రీలు కూడా ప్రచారం కోసం కాక ప్రేమ కోసమే సేవ చేశారు.

8. నేటి మన జీవితానికి

ఈ మూడు వచనాలు మనలను నిశ్శబ్దంగా ప్రశ్నిస్తాయి,  దేవుడు నా జీవితంలో చేసిన దానికి నా ప్రతిస్పందన ఏమిటి? మగ్దల మరియమ్మ, నా గతం ఎలాంటిదైనా,  దానిని దేవుని కృపకు సాక్ష్యంగా మార్చగలనా? యోహాన్నలా, నాకు ఉన్న వనరులు,  సమయం, ధనం, ప్రతిభ  వాటిని దేవుని రాజ్యానికి ఉదారంగా ఇవ్వగలనా? సూసన్నలా, ఎవరూ గుర్తించకపోయినా, ప్రచారం లేకపోయినా, నమ్మకంగా, ప్రేమతో సేవ చేయగలనా?

సువిశేషంలో ఈ వాక్యభాగం తిరుసభలోని ప్రతి పరిచర్యకూ ఒక గుర్తు,  బహిరంగంగా బోధించే వారి పనీ, తెరవెనుక సేవించే వారి పనీ, రెండూ ఒకే “దైవరాజ్య” కార్యంలో సమాన గౌరవం కలిగినవి. కుటుంబంలో వంట చేసేవారు, పిల్లలను పెంచేవారు, అనారోగ్యుల ప్రక్కన కూర్చునేవారు, ఆర్థికంగా చిన్న సహాయం చేసేవారు,  వీరందరూ ఈ స్త్రీల వారసులే. దేవుని రాజ్యం ఒక్కరి ప్రతిభతో నిర్మించబడదు; అది దేవుని సేవకు అంకితం చేయబడిన, సమర్పించబడిన అనేక చిన్న జీవితాల సహకారంతో నిర్మించబడుతుంది.

ముగింపు

లూకా 8:1-3లో మనం చూసేది కేవలం ఒక ప్రయాణ జాబితా కాదు, ఇది దైవరాజ్యపు ఒక సజీవ చిత్రం. యేసు ప్రభువు  సువార్తను ప్రకటిస్తున్నాడు; పన్నిద్దరు శిష్యులు ఆయనతో నడుస్తున్నారు; స్వస్థత పొందిన, కృతజ్ఞతతో నిండిన స్త్రీలు తమ జీవితాలను, తమ వనరులను ఆ రాజ్యానికి సమర్పిస్తున్నారు. మగ్దల మరియ, యోహాన్న, సూసన్న  వీరి పేర్లు వేల సంవత్సరాల తరువాత కూడా మనం చదువుతున్నామంటే, దేవుని దృష్టిలో నిజమైన సేవ ఎన్నటికీ మరుగున పడదని అర్థం. వారి ఆదర్శం మనలను ఒక్కటే అడుగుతుంది,  దేవుడు నాకు ఇచ్చిన దానితో, నేను ఆయన రాజ్యానికి ఏమి చేయగలను?

ప్రార్థన

ప్రభువా, పట్టణాలకూ గ్రామాలకూ వెళ్ళి దైవరాజ్య సువార్తను  మీరు ప్రకటించారు, మా హృదయాలలో కూడా నీ రాజ్యాన్ని స్థాపించుము. మగ్దల మరియమ్మను అనేక బంధనాల  నుండి విముక్తి చేసి మీ  వెంట నడిపించినట్లే, మా గత గాయాలను మీ  కృపకు సాక్ష్యాలుగా మార్చుము. యోహాన్నలా మా వనరులను నీ రాజ్య సేవకు ఉదారంగా అర్పించే హృదయాన్ని ప్రసాదించుము. సూసన్నలా, ఎవరూ గుర్తించకపోయినా ప్రేమతో సేవచేసే వినయాన్ని ఇవ్వుము. నీ వెంట నడిచే కృపను, నీ రాజ్యానికి సేవచేసే హృదయాన్ని మాకు ప్రసాదించు. ఆమెన్.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు