సత్యం, ప్రేమ, పునరుద్ధరణ – 23వ సాధారణ ఆదివారం ప్రసంగం (మత్తయి 18:15-20)

 


సత్యం, ప్రేమ, పునరుద్ధరణ

యెహెజ్కేలు 33:7-9 · రోమీయులకు 13:8-10 · మత్తయి 18:15-20

ఒక స్నేహితుడు తప్పుడు  మార్గంలో వెళ్తున్నాడని మీకు తెలిస్తే మీరేమి చేస్తారు? మౌనంగా ఉండి "అది వాడి ఇష్టం, నాకెందుకు" అనుకుంటారా? లేక అతని వెనుక ఇతరులతో చర్చిస్తారా? లేక ధైర్యం చేసి అతనితోనే మాట్లాడతారా? నిత్యజీవితంలో ఎదురయ్యే ఈ చిన్న ప్రశ్న వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. బైబిలులో మూడు వేర్వేరు కాలాలలో,  దేవుడు ఈ ప్రశ్నకు ఒకే సమాధానం ఇస్తాడు. యెహెజ్కేలు ప్రవక్త కావలివాని బాధ్యతను గుర్తుచేస్తాడు,  అపొస్తులుడైన పౌలు ప్రేమ అనే తీరని ఋణాన్ని చూపిస్తాడు,  యేసు ప్రభువు సోదరుని తిరిగి సంపాదించుకొనే ఒక సున్నితమైన, క్రమబద్ధమైన మార్గాన్ని బోధిస్తాడు. ఈ మూడు స్వరాలను కలిపి వింటే, క్రైస్తవ జీవితంలో సత్యం, ప్రేమ, పునరుద్ధరణ అనేవి ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో మనకు స్పష్టమవుతుంది. మనం ఈ మూడు పఠనాలు  ఒక్కొక్కటిగా పరిశీలించి, తరువాత వాటి సమగ్ర సందేశాన్ని, కార్మెలియ  ఆధ్యాత్మికతలో వాటి ప్రతిధ్వనిని, నేటి జీవితానికి వాటి అనువర్తనను ధ్యానిద్దాం.

1. కావలివాని కేక - యెహెజ్కేలు 33:7-9

 నరపుత్రుడా! నేను నిన్ను యిస్రాయేలీయులకు కావలివానినిగా నియమించితిని. నీవు నా హెచ్చరికలను వారికి వినిపించుచుండవలెను. నేనెవడైన పాపాత్ముడు చచ్చునని పలికితినేని, నీవతనిని హెచ్చరించి అతడు తన మార్గమును మార్చుకొనునట్లు చేయవేని, అతడు పాపిగానే మరణించును. అప్పుడు నీవతని మరణమునకు బాధ్యుడవగుదువు. కాని నీవెవడినైన దుష్టుని హెచ్చరించి పశ్చాత్తాపపడుమని చెప్పినను పశ్చాత్తాపపడడని అతడు పాపిగానే చని పోవును. అప్పుడు నీ ప్రాణములకు ముప్పుకలుగదు." (యెహెజ్కేలు 33:7-8)

యెరూషలేము పతనమైన తరువాత, బాబిలోనియా  నదీతీరాన కూర్చుని ఏడుస్తున్న ప్రవాసుల మధ్య యెహెజ్కేలుకు ప్రవక్తకు దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు. ప్రజలు నిరాశలో మునిగిపోయి, 'మా పాపములు అక్రమములు మాపై భారమువలె నిలిచియున్నవి. మేము కృశించి పోవుచున్నాము. ఇక బ్రతుకుటెట్లు?' అని నిరంతరము పలుకుచు నిరాశలో ఉన్న సమయంలో  (33:10) దేవుడు ప్రవక్తను ఒక పట్టణ గోడపై నిలబడే కావలివానిగా  చూపుతున్నాడు. పురాతన కాలంలో నగర ప్రాకారాలపై కావలివాడు రాత్రింబవళ్లు మేల్కొని ఉండేవాడు; దూరాన శత్రుసైన్యపు దుమ్ము లేచినా, ఆయుధాల మెరుపు కనిపించినా, వెంటనే బూర ఊదవలసిన బాధ్యత అతనిది. అతని పని శత్రువును ఓడించడం కాదు; అతని పని కేవలం హెచ్చరించడం. అతడు హెచ్చరించకపోతే ఆ నష్టానికి అతడే బాధ్యుడు; హెచ్చరించినా ప్రజలు వినకపోతే వారి ప్రాణమే పోతుంది, కావలివాడు తన ప్రాణమును దక్కించుకుంటాడు.

ఇది యెహెజ్కేలు 3వ అధ్యాయంలో అతని పరిచర్య ప్రారంభంలోనే ఇవ్వబడిన పిలుపు  గురించి మరల చెప్పడం జరుగుతుంది.  దేవుడు దీనిని మళ్ళీ నొక్కి చెప్పడం యాదృచ్ఛికం కాదు,  నిరాశలో మునిగిన ప్రజలకు అవసరమైనది కేవలం సానుభూతి మాత్రమే కాదు, స్పష్టమైన సత్యం కూడా. దేవుడు ప్రవక్తతో "నీకు కనిపించినది చెప్పు" అని చెబుతున్నాడు తప్ప, "నీకు నచ్చినది చెప్పు" అని కాదు. ప్రవక్తకు వాక్యం అప్పగించబడింది గనుక అతనికి మౌనంగా ఉండే హక్కు లేదు. నిర్లక్ష్యం చేసిన కావలివాని చేతికి   ఆ నిర్లక్ష్యానికి గల  నైతిక అపరాధం అంటుకుంటుంది.

ఇక్కడ మనం గమనించవలసిన మూడు సూక్ష్మమైన సత్యాలు ఉన్నాయి. మొదటిది, హెచ్చరించే బాధ్యత ప్రవక్తది, కానీ మార్పు తీసుకొనే నిర్ణయం వినేవానిది.  దేవుడు మనలను నియంత్రించమని కాదు, శ్రద్ధ వహించమని పిలుస్తాడు. మనం ఇతరుల హృదయాలను బలవంతంగా మార్చలేము; మనం చేయగలిగినదల్లా ప్రేమతో సత్యాన్ని అందించడం మాత్రమే.

రెండవది, మౌనం ఎప్పుడూ తటస్థమైనది   కాదు; భయం వల్లనో, సౌకర్యం కోసమో, సంబంధం చెడిపోతుందనే భయం వల్లనో మనం మాట్లాడకుండా ఉంటే, అది ప్రేమరాహిత్యానికి మారుపేరు అవుతుంది. "నాకెందుకు" అనే ఆధునిక మనస్తత్వం తరచుగా జ్ఞానంలా కనిపిస్తుంది గానీ, వాస్తవానికి అది బాధ్యత నుండి తప్పించుకోవడమే.

మూడవది, ఈ బాధ్యత ప్రవక్తలకు మాత్రమే పరిమితం కాదు. తల్లిదండ్రులకు పిల్లల పట్ల, పిల్లలకు తల్లిదండ్రుల పట్ల, స్నేహితులకు స్నేహితుల పట్ల, సంఘ నాయకులకు తమ ప్రజల పట్ల, కావలివాని హృదయం అవసరం. ప్రతి క్రైస్తవుని జీవితం "నేను ఎలా ఉన్నానో నాకు చాలు" అనే వ్యక్తివాద జీవితం కాదు,  అది "నా సోదరుడు ఎలా ఉన్నాడు?" అని అడిగే జీవితం.

2. తీరని ఋణం - రోమీయులకు 13:8-10

" ఎవరికిని ఏమియును బాకీపడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు. అది ఒకరినొకరిని అన్యోన్యము ప్రేమించుకొనుటయే. తోటివానిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు. ఏలయన, “వ్యభిచరింపకుము. హత్యచేయకుము, దొంగిలింపకుము, ఇతరుల సొత్తుకై ఆశపడకుము" అను ఈ ఆజ్ఞలు అన్నియును, ఇతర ఆజ్ఞలేవియైనను, “నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము” అను ఒకే ఆజ్ఞయందు ఇమిడియున్నవి. తోటివానిని ప్రేమించువాడు, వానికి ఏ కీడును చేయడు. కనుక ప్రేమ కలిగియుండుట ధర్మ శాస్త్రమును నెరవేర్చుటయే. " (రోమీయులకు 13:8-10)

పునీత పౌలు ఈ లేఖ రోమియులకు రాసేటప్పటికి, అక్కడ యూదక్రైస్తవులు, అన్యజనుల నుండి వచ్చినవారు కలిసి జీవిస్తున్నారు, అది  ఆచారాలు, అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్న ఒక మిశ్రమ సమాజం. పౌర అధికారులకు లోబడాలని బోధించిన వెంటనే పౌలు తన బోధనను ఒక అందమైన మలుపుకు  తిప్పుతున్నాడు, అన్ని అప్పులు తీర్చండి, కానీ ప్రేమ అనే అప్పు మాత్రం ఎన్నటికీ పూర్తిగా తీరనిది. ఎందుకంటే  ఆర్థిక ఋణాలు తీర్చినకొద్దీ తరిగిపోతాయి, కానీ ప్రేమ అనే ఋణం మాత్రం మనం ఎంత ఇచ్చినా తరిగిపోదు; పైగా అది మరింత ఇవ్వడానికి మనలను పిలుస్తూనే ఉంటుంది. ఇతర ఋణాల వలె కాక, ఈ ఋణం చెల్లించినకొద్దీ పెరుగుతుంది.

పౌలు వ్యభిచారం, హత్య, దొంగతనం, ఆశ అనే ఆజ్ఞలను ప్రస్తావించి, వాటన్నింటినీ ఒకే వాక్యంలో సంగ్రహిసస్తున్నాడు.  నీ పొరుగువానిని నీవలె ప్రేమించుము అని ధర్మ శాస్త్రం చెబుతుంది. (లేవీయకాండము 19:18). ధర్మశాస్త్రం అనేది బాహ్య నియమాల భారం కాదు; అది ప్రేమ అనే అంతరంగిక వాస్తవికతను బయట చూపించే విధానం మాత్రమే. హృదయంలో నిజమైన ప్రేమ ఉంటే, ఆజ్ఞలన్నీ దానంతటదే నెరవేరుతాయి,  ప్రేమించే వ్యక్తి హత్య చేయాలా వద్దా అని ఆలోచించడు, దొంగిలించాలా వద్దా అని లెక్కించడు; ప్రేమే అతని ప్రతి చర్యను నడిపిస్తుంది.

బైబిలులో ప్రేమ అనేది కేవలం ఒక భావోద్వేగం కాదు,  "నిన్ను నేను ఇష్టపడుతున్నాను" అనేది మాత్రమే కాదు. నిజమైన క్రైస్తవ ప్రేమ అంటే "నీ మేలు నాకు ముఖ్యం" అని చెప్పడం. అందుకే ఒక వ్యక్తి నాశనకరమైన మార్గంలో వెళ్తున్నప్పుడు, అతన్ని నిజంగా ప్రేమించే వ్యక్తి మౌనంగా ఉండడు; అతడు ప్రేమతో చెబుతాడు, "సోదరా, నీవు వెళ్తున్న ఈ మార్గం నీకు హానికరం కావచ్చు." ఇదే యెహెజ్కేలు 33కు, రోమా 13కు మధ్య ఉన్న సున్నితమైన వారధి.  యెహెజ్కేలు "హెచ్చరించు" అంటే, పౌలు "దానిని ప్రేమతో చేయి" అని జతచేస్తాడు. ప్రేమ లేకుండా చేసే హెచ్చరిక తీర్పుగా మారుతుంది; ప్రేమతో చేసే హెచ్చరిక రక్షణగా మారుతుంది.

3. సోదరుని సంపాదించుకొనుట  మత్తయి 18:15-20

 “నీ సోదరుడు నీకు విరుద్ధముగ తప్పిదము చేసినయెడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధిచెప్పుము. నీ మాటలు అతడు ఆలకించినయెడల వానిని నీవు సంపాదించు కొనిన వాడవగుదువు. నీ మాటలను అతడు ఆలకింపనియెడల ఒకరిద్దరను నీ వెంట తీసికొని పొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షులు పలుకు ప్రతిమాట స్థిరపడును.అతడు వారి మాట కూడ విననియెడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘ మును కూడ అతడు లెక్కింపనియెడల, వానిని అవిశ్వా సునిగను, సుంకరిగను పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. భూలోకమున మీలో ఇద్దరు ఏకమనస్కులై ఏమి ప్రార్థించినను, పరలోకమందుండు నా తండ్రి వారికి అది ఒసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయన, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారిమధ్య ఉన్నాను.” మత్తయి 18:15-20)

ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువుని బోధ ఒంటరిగా నిలవదు, ఇది తప్పిపోయిన గొర్రె ఉపమానానికి (18:10-14) తరువాత, అపరిమిత క్షమాపణ గురించిన బోధకు (18:21-35) ముందు వస్తుంది. అంటే, సరిదిద్దుబాటు అనేది వెతుకులాట ప్రేమకు, క్షమాపణ హృదయానికి మధ్య ఉంది.  ఇది శిక్షించే సాధనం కాదు, పునరుద్ధరణ సాధనం. యేసు ప్రభువు పునరుద్దరణకు ఇక్కడ నాలుగు స్పష్టమైన మెట్లను గురించి చెబుతున్నాడు.  మొదట ఒంటరిగా వెళ్లి మాట్లాడటం, వినకపోతే ఒకరిద్దరు సాక్షులతో వెళ్లడం (ద్వితీయోపదేశకాండము 19:15 నియమం ప్రకారం), అప్పటికీ వినకపోతే సంఘానికి తెలియజేయడం, చివరకు అతనిని అన్యునిగా ఎంచుకోవడం.

ఈ క్రమం ఎంత జాగ్రత్తగా రూపొందించబడిందో గమనించండి. మొదటి మెట్టు వ్యక్తి గౌరవాన్ని కాపాడుతుంది.  బహిరంగంగా ఎండగట్టడం సరిదిద్దడం కాదు,అది  అవమానపరచడం మాత్రమే. మనకు తెలిసిన విషయం పూర్తిగా నిజం కాకపోవచ్చు, మన తెలుసుకున్నది, అర్థం చేసుకున్నది  తప్పు కావచ్చు గనుక, వ్యక్తికి తనను తాను వివరించుకునే అవకాశం ఇవ్వడం అవసరం. రెండవ మెట్టు వాస్తవాన్ని నిర్ధారిస్తుంది, అపార్థాన్ని తొలగిస్తుంది, భావోద్వేగాన్ని నియంత్రిస్తుంది. మూడవ మెట్టు సమాజ బాధ్యతను తీసుకువస్తుంది.  తీవ్రమైన పాపం సమాజాన్ని  మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే సంఘానికి అవసరం ఉంది. నాలుగవది కూడా పూర్తి తిరస్కరణ కాదు,  యేసు ప్రభువు స్వయంగా అన్యులతో, సుంకరులతో స్నేహం చేసినవాడు గనుక, ఇది కొత్త దృష్టితో, కొన్ని ప్రత్యేక లేమి ఉన్న వ్యక్తిగా,  మళ్ళీ ఆ  వ్యక్తిని  చూడమని సూచిస్తుంది. దీని లక్ష్యం ఎప్పుడూ ఒక్కటే: "నీ సహోదరుని సంపాదించుకొవాలి"  వాదనలో గెలవడం కాదు, సంబంధాన్ని తిరిగి పొందడం ముఖ్యం.

యేసు ప్రభువు  తరువాత ఒక కీలకమైన అధికార ప్రకటన చేస్తున్నాడు. "భూమిమీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును" (18:18)  ఇది 16:19లో పేతురుకు ఇచ్చిన అధికారం ఇప్పుడు మొత్తం సంఘానికి ఇవ్వబడినది. సంఘం ఏకపక్షంగా కాదు, క్రీస్తు నామంలో, క్రీస్తు మనస్సుతో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి దైవ  ధృవీకరణ ఉంటుంది.

చివరిగా యేసు ప్రభువు  ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు.  " ఏలయన, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారిమధ్య ఉన్నాను." ఈ మాటను తరచుగా ప్రార్థన సందర్భంలో మాత్రమే ఉపయోగిస్తారు, కానీ ఇక్కడ దీని అసలైన స్థానం సరిదిద్దుబాటు, సమాధానపరచడం అనే కష్టమైన సందర్భంలోనే ఉంది. అంటే క్రీస్తు కేవలం ఆరాధనలో మాత్రమే కాదు, ఒక కష్టమైన సంభాషణలో, ఒక సున్నితమైన సవరణలో, దారితప్పుతున్న సోదరుని దారిలో పెట్టుటలో ముఖ్యముగా ప్రభువు  మన మధ్య ఉంటాడు.

4. మూడు స్వరాలు, ఒకే హృదయం

ఈ మూడు లేఖనాలను కలిపి చూసినప్పుడు ఒక అందమైన గొలుసు కనిపిస్తుంది. యెహెజ్కేలు మనకు  జరుగుతున్నది చెప్పవలసిన అత్యవసరతను తెలియజేస్తాడు. పౌలు మనకు ప్రేరణను ఇస్తాడు, ఆ అత్యవసరత ప్రేమ నుండి పుట్టాలి, భయం నుండి కాదు అని తెలియజేస్తున్నాడు.  యేసు ప్రభువు  మనకు  అది ఎలా చేయాలో పద్ధతిని, ఆ తరువాత ఏమి చేయాలో తెలియజేస్తున్నాడు.   ఈ మూడు పఠనాలు రెండు  తప్పులను తిరస్కరిస్తాయి.  ఒకటి, భయం లేదా అలసత్వంతో నిండిన మౌనం; రెండు, ప్రేమలేని కఠిన తీర్పు. సత్యాన్ని ప్రేమతో చెప్పడం ఇది మనకు నేర్పుతుంది.

ఈ మూడు లేఖనాలలో దేనిలోనూ "పట్టించుకోకు", “మౌనంగా ఉండు” అనేఆలోచన లేదు. కావలివాడు మౌనంగా ఉండలేడు; ప్రేమికుడు ఋణం తీర్చకుండా ఉండలేడు; సహోదరుడు తన సోదరుని నిర్లక్ష్యం చేయలేడు. అయితే అదే సమయంలో ఏ ఒక్కటీ బలవంతాన్ని అనుమతించదు.  కావలివాడు వినేవాని నిర్ణయాన్ని మార్చలేడు, ప్రేమ కీడు చేయదు, సరిదిద్దుబాటు గౌరవాన్ని కాపాడుతూనే జరుగుతుంది. ఇది క్రైస్తవ సమాజానికి ఒక సున్నితమైన సమతుల్యతను నేర్పుతుంది, అది  నిర్లక్ష్యానికి, నియంత్రణకు మధ్య, జాగ్రత్తగా, ప్రేమతో నడవడం.

ఈ మూడు పఠనాలు  నేర్చుకొనవలసినవి,  యెహెజ్కేలు ద్వారా  "ప్రమాదాన్ని చూసినప్పుడు హెచ్చరించడం” పౌలు ద్వారా  "అది ప్రేమతో చేయడం." యేసు ప్రభువు ద్వారా  "అతన్ని తిరిగి సంపాదించడానికి చేయడం." ఈ మూడు విషయాలను  హృదయంలో ఉంచుకుంటే, ఏ సరిదిద్దుబాటైనా  అది కుటుంబంలో అయినా, స్నేహంలో అయినా, సంఘంలో అయినా  దాని అసలైన దిశను కోల్పోదు.

దేవుని మూడు లక్షణాలు

ఈ మూడు లేఖనాలలో దేవుని స్వభావానికి సంబంధించిన మూడు లక్షణాలు కనిపిస్తాయి, అవి మొదటిది, దేవుడు న్యాయవంతుడు,  పాపాన్ని ఆయన నిర్లక్ష్యం చేయడు, తేలికగా చూడడు; అందుకే కావలివాడు హెచ్చరించాలని పట్టుబడతాడు. రెండవది, దేవుడు కరుణామయుడు, " నా జీవముతోడు, యాకోబు ప్రభుడనైన నా మాటలుగా నీవు వారితో ఇట్లనుము. దుష్టుడు చనిపోవుటవలన నాకు సంతుష్టి కలుగదు. దుష్టుడు తన మార్గమునుండి వెనుకకు మరలి బ్రతుకుటవలన నాకు సంతోషము కలుగును. యిస్రాయేలీయులారా! మీరు మీ దుష్టమార్గమునుండి వెనుకకు మరలుడు. మీరు అనవసరముగా చావనేల!" (యెహెజ్కేలు 33:11) అని స్వయంగా ప్రకటిస్తాడు. పాపి నశించడం దేవుని లక్ష్యం కాదు; అతడు మారి బ్రతకాలనేదే దేవుని హృదయకోరిక. మూడవది, దేవుడు సమాజాన్ని నిర్మించే దేవుడు, ఆయన వ్యక్తులను మాత్రమే రక్షించడు, ఒకరినొకరు ప్రేమించే, ఒకరికొకరు బాధ్యత వహించే ఒక సమాజాన్ని నిర్మిస్తాడు. కాబట్టి క్రైస్తవ రక్షణ వ్యక్తిగతమైనదే అయినప్పటికీ, దాని ఫలితం ఎల్లప్పుడూ సామూహికమైనది.

ఈ మూడు లక్షణాలను హృదయంలో ఉంచుకుంటే, సరిదిద్దుబాటు అనేది కేవలం మానవ న్యాయనిర్ణయం కాదని, అది దేవుని స్వంత హృదయంలో పాల్గొనడమని మనకు అర్థమవుతుంది. మనం ఇతరులను సరిదిద్దేటప్పుడు దేవుని న్యాయాన్ని మాత్రమే ప్రతిబింబించకూడదు; ఆయన కరుణను కూడా అదే స్థాయిలో ప్రతిబింబించాలి. న్యాయం లేని కరుణ బలహీనమైనది; కరుణ లేని న్యాయం కఠినమైనది. యేసు ప్రభువు  మనకు చూపించే మార్గం ఈ రెండింటినీ కలిపిన మార్గం.

5. నేటి డిజిటల్ యుగానికి ఒక సవాలు

సామాజిక మాధ్యమాల యుగంలో యేసు ప్రభువు  బోధించిన మొదటి మెట్టు,  " ఒంటరిగా వెళ్లి మాట్లాడటం "  మరింత విలువైనదిగా మారింది. ఒక వ్యక్తి తప్పు చేశాడని తెలిసిన వెంటనే WhatsApp గ్రూపులో పంచుకోవడం, Facebookలో పరోక్షంగా విమర్శించడం, బహిరంగంగా అవమానించడం చాలా సులభంగా మారిపోయింది. కానీ ఇది యేసు ప్రభువు  చూపించిన మార్గానికి పూర్తి విరుద్ధం. బహిరంగ మందలింపు  మనకు తాత్కాలిక సంతృప్తిని ఇవ్వవచ్చు, కానీ అది సోదరుని హృదయాన్ని మూసివేస్తుంది తప్ప తెరవదు.

అలాగే, ఎవరినైనా సరిదిద్దే ముందు మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.  ఇది నిజంగా తప్పేనా, నాకు పూర్తి సమాచారం ఉందా, నేను ప్రేమతో మాట్లాడుతున్నానా, నేను వ్యక్తిగతంగా మాట్లాడగలనా? ఈ ప్రశ్నలు మనలను తొందరపాటు తీర్పు నుండి రక్షిస్తాయి. ప్రార్థనలో మొదలుపెట్టిన సంభాషణ, ప్రేమతో నడిచిన సంభాషణ మాత్రమే నిజమైన మార్పును తీసుకురాగలదు.

ఒక సోదరుడు తప్పు చేసినప్పుడు సాధారణంగా మూడు రకాల ప్రతిస్పందనలు కనిపిస్తాయి. మొదటిది మౌనం "నాకు సంబంధం లేదు" అనుకోవడం, ఇది యెహెజ్కేలు సందేశానికి పూర్తిగా విరుద్ధం. రెండవది పుకారులు, "అతను ఏం చేశాడో తెలుసా" అని ఇతరులతో చర్చించడం, ఇది మత్తయి 18 పద్ధతికి విరుద్ధం. మూడవది, ప్రేమతో కూడిన సంభాషణ  "సోదరా, మనం మాట్లాడుకోవచ్చా?" అని అడగడం, ఇదే యేసు ప్రభువు  చూపించిన మార్గం. మనం ప్రతిరోజూ ఈ మూడింటిలో ఒకదానిని ఎంచుకుంటూనే ఉంటాము; ఏది ఎంచుకుంటామో అదే మన హృదయ స్థితిని బయటపెడుతుంది.

6. కుటుంబం, స్నేహం, సంఘం — ఆచరణలో

ఈ సందేశం కేవలం సంఘపరమైన క్రమశిక్షణకే పరిమితం కాదు. ఇది ప్రతి సంబంధానికి వర్తిస్తుంది. కుటుంబంలో, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమతో సరిదిద్దుకోవడం ఆరోగ్యకరమైన వివాహానికి పునాది. తల్లిదండ్రులు పిల్లలను సరిదిద్దేటప్పుడు అవమానించే మాటలు కాకుండా, గౌరవంతో కూడిన సంభాషణను ఎంచుకోవాలి. స్నేహంలో, నిజమైన స్నేహితుడు మనలను మెచ్చుకోవడమే కాదు, అవసరమైనప్పుడు ప్రేమతో హెచ్చరించేవాడు కూడా. సంఘ జీవితంలో, నాయకులు కావలివారుగా ఎక్కువ బాధ్యత కలిగి ఉంటారు, కానీ వారు కూడా అదే ప్రేమతో కూడిన ప్రక్రియకు లోబడాలి. తామే మినహాయింపు అనుకోకూడదు.

ఈ మూడు పఠనాలు మనకు గుర్తుచేసేది ఏమిటంటే, క్రైస్తవ సంఘం పరిపూర్ణుల సమూహం కాదు.  అది పరిపూర్ణత వైపు కలిసి ప్రయాణించే పాపుల సమాజం. అందుకే మనకు ఒకరికొకరు హెచ్చరించడానికి, ప్రేమించడానికి, క్షమించడానికి, తిరిగి స్వీకరించడానికి అవసరం. ఈ ప్రయాణంలో మనం ఒంటరిగా లేము  "ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియున్నచోట నేను వారి మధ్యన ఉందును" అని చెప్పిన క్రీస్తే మన ప్రతి కష్టమైన సంభాషణలో, ప్రతి సున్నితమైన సరిదిద్దుబాటులో మన మధ్య ఉంటాడు. మన లక్ష్యం ఎప్పుడూ "నేను గెలవాలి" అనేది కాదు, "నా సోదరుడు తిరిగి రావాలి" అనేదే.

7. క్షమాపణ — సరిదిద్దుబాటు యొక్క నిజమైన గమ్యం

మత్తయి 18వ అధ్యాయాన్ని పూర్తిగా చదివితే, సరిదిద్దుబాటుకు సంబంధించిన ఈ బోధన వెంటనే క్షమాపణ గురించిన బోధనలోకి, పేతురు అడిగే ప్రశ్న ("ప్రభువా, నా సహోదరుడు నాయెడల ఎన్నిమారులు తప్పిదము చేసిన నేనతని క్షమింపవలెను?") వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, సరిదిద్దుబాటు యొక్క అంతిమ లక్ష్యం ప్రతీకారం కాదు, క్షమాపణ ద్వారా వచ్చే సంబంధ పునరుద్ధరణ. ఒక వ్యక్తి తన తప్పును అంగీకరించినప్పుడు, అతనికి మార్పుకు అవకాశం ఇవ్వాలి. క్రైస్తవుడు "నువ్వు ఒకసారి తప్పు చేశావు గనుక ఇక నిన్ను ఎప్పటికీ నమ్మను" అని అనకూడదు.

అదే సమయంలో క్షమాపణ అంటే వివేకాన్ని విడిచిపెట్టడం కాదు. క్షమించవచ్చు, అయినప్పటికీ అవసరమైన జాగ్రత్తలను, పరిమితులను కొనసాగించవచ్చు. ప్రేమకు జ్ఞానం అవసరం. ముఖ్యంగా అధికార అసమానతలు ఉన్న సందర్భాలలో ఉదాహరణకు, గృహహింస వంటి పరిస్థితులలో,  ఒంటరిగా ముఖాముఖి మాట్లాడే మొదటి మెట్టు కొన్నిసార్లు సురక్షితం కాకపోవచ్చు. అటువంటి సందర్భాలలో సాక్షుల భాగస్వామ్యం, సంఘం యొక్క రక్షణ మరింత ముందుగానే అవసరం కావచ్చు. లేఖనం మనకు ఇచ్చే క్రమం ఒక కఠినమైన సూత్రావళి కాదు, ప్రేమతో కూడిన వివేకంతో అన్వయించవలసిన ఒక మార్గదర్శకత్వం.

ప్రార్థన

ప్రభువా, యెహెజ్కేలు వలె సత్యాన్ని ప్రకటించే ధైర్యాన్ని, పౌలు వలె ప్రేమించే విశాల హృదయాన్ని, నీ వలె తప్పిపోయిన సోదరుని తిరిగి సంపాదించే కరుణను మాకు ప్రసాదించు. మా కుటుంబాలలో, మా సంఘాలలో పుకార్ల  బదులు వ్యక్తి గత సంభాషణను, తీర్పుకు బదులు కరుణను, మౌనానికి బదులు ప్రేమతో కూడిన సత్యాన్ని స్థాపించడానికి మమ్మల్ని నీ సాధనాలుగా ఉపయోగించుకో. ఆమెన్

 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు