యోబు జీవిత చరిత్ర - బాధలో నిలిచిన విశ్వాసం
1. పరిచయం
పాత
నిబంధనలో "జ్ఞాన సాహిత్యం" (Wisdom Literature) అనే
ప్రత్యేక సాహిత్య విభాగం ఉంది. అవి యోబు, కీర్తనలు, సామెతలు, ఉపదేశకుడు, పరమగీతము,
సోలోమోను జ్ఞాన గ్రంధము, సిరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంధం. ఇందులో యోబు గ్రంథం ముఖ్యమైనది. ఈ జ్ఞాన గ్రంథాలు చరిత్రను నేరుగా చెప్పవు, ధర్మశాస్త్రాన్ని కూడా నేరుగా బోధించవు. బదులుగా, జీవితంలోని లోతైన ప్రశ్నలయిన మంచితనం, బాధ, న్యాయం, దేవుని స్వభావం, మానవ పరిమితులు అన్వేషిస్తాయి. వీటిలో యోబు
గ్రంథం అత్యంత సంక్లిష్టమైనది అని చెప్పవచ్చు.
యోబు గ్రంథం
ప్రధానంగా ఒక్క ప్రశ్నను మన ముందుంచుతుంది,
అది ఏమిటంటె, "నీతిమంతుడు ఎందుకు బాధపడతాడు?" ఈ ప్రశ్నకు సులభమైన సమాధానం లేదు. సాంప్రదాయిక
హీబ్రూ ఆలోచనా విధానంలో "ప్రతిఫల సిద్ధాంతం" (Retribution Theology) అనేది ఉండేది. దీని అర్ధం ఏమిటంటె, మంచి పనులు చేసేవారికి మేలు జరుగుతుంది, చెడు పనులు చేసేవారికి కీడు జరుగుతుంది. యోబు
గ్రంథం ఈ సూత్రాన్ని సవాలు చేస్తుంది. యోబు నీతిమంతుడైనప్పటికీ, బాధను, కష్టాలను, నష్టాలను అనుభవిస్తాడు. ఈ గ్రంథం ద్వారా, బాధ అనేది ఎల్లప్పుడూ పాపానికి ఫలితం కాదని, దేవుని మార్గాలు మానవ అవగాహనకు మించినవని
బోధించబడుతుంది.
2. యోబు నేపథ్యం - ఊజు దేశపు నీతిమంతుడు
"ఊజు
దేశమున యోబు అను పేరుగల నరుడొకడు ఉండెడివాడు. అతడు ఋజువర్తనుడును, న్యాయవంతుడును మరియు దేవునిపట్ల భయభక్తులు కలిగి, పాపమునకు దూరముగా ఉండువాడు." (యోబు 1:1). ఊజు దేశం ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలియకపోయినా, ఇది ఇశ్రాయేలుకు వెలుపల, బహుశా ఎదోము లేదా అరేబియా ప్రాంతంలో ఉండి
ఉండవచ్చని పండితులు భావిస్తారు. యోబు ఇశ్రాయేలీయుడు కాదు, అయినప్పటికీ అతడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన
నీతిమంతుడు. బాధ, న్యాయం, దేవుని
గురించిన ప్రశ్నలు కేవలం ఒక జాతికి మాత్రమే పరిమితం కావు, అవి మానవాళి అందరికీ సంబంధించినవి.
యోబు
అపారమైన సంపద కలిగినవాడు. అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతని పశుసంపద
అపారమైనది, ఏడు వేల
గొఱ్ఱెలు, మూడు వేల ఒంటెలు, ఐదు వందల ఎడ్ల జతలు, ఐదు వందల ఆడ గాడిదలు, మరియు అనేకమంది సేవకులు ఉన్నారని పవిత్ర గ్రంథం స్పష్టంగా చెబుతుంది. "తూర్పు
దేశీయులందరికంటే అతడు మహాసంపన్నుడు." (యోబు 1:3). ఇది కేవలం ఆర్థిక వైభవాన్ని మాత్రమే కాదు, ఆ కాలపు సాంప్రదాయిక అవగాహన ప్రకారం దేవుని
ఆశీర్వాదానికి చిహ్నంగా చూపబడింది.
యోబు యొక్క
ధర్మనిష్ఠ కేవలం బాహ్యమైనది కాదు. అతను తన కుమారులు, కుమార్తెలు వారి విందుల అనంతరం పాపం చేసి
ఉండవచ్చని భయపడి, ప్రతి ఉదయం లేచి వారి కొరకు దహనబలులు
అర్పించేవాడు. "వారివారి విందుదినములు ముగియగనే యోబు కుమారులను పిలిపించి
శుద్ధిచేయించెడివాడు. వేకువనే లేచి ఒక్కొక్కపుత్రుని కొరకు దహనబలిని అర్పించి, ఒకవేళ తన కుమారులు పొరపాటున దేవుని నిందించి
పాపము కట్టుకొనిరేమోయని భయపడి, వారి
నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెడివాడు. ఇట్లు యోబు ఎల్లప్పుడును చేయుచుండెడివాడు.”(యోబు
1:5). ఇది యోబు యొక్క అంతరంగిక భక్తిని, జాగ్రత్తను, తన కుటుంబం పట్ల అతని బాధ్యతను చూపిస్తుంది.
అతడు కేవలం తన స్వంత నీతి గురించి మాత్రమే కాక, తన బిడ్డల ఆధ్యాత్మిక స్థితి గురించి కూడా
శ్రద్ధ వహించేవాడు.
ఈ వివరాల ద్వారా గ్రంథకర్త యోబు గురించి ఒక ప్రాథమిక నివేదికను ఇస్తున్నాడు. ఈ నివేదిక ప్రకారం యోబు ఒక పరిపూర్ణమైన, నీతిమంతుడైన, దైవభక్తుడైన మనిషి. అతని బాధ ఏ విధంగానూ అతని
స్వంత పాపం వల్ల వచ్చినది కాదు అని ముందుగానే స్పష్టం చేయబడుతుంది. ఇది చెప్పిన తరువాత కథ నాటకీయముగా మారుతుంది. భూమి నుండి
పరలోకమునకు కథ మారుతుంది.
3. పరలోక సభ - సాతాను సవాలు
"ఒక
దినము దేవదూతలు దేవుని సమక్షమునకు వచ్చిరి. వారితోపాటు సాతానుకూడ వచ్చెను."
(యోబు 1:6). ఇక్కడ "సాతాను" అనే పదం హీబ్రూలో
"హసాతాన్" (ha-satan) అని ఉంటుంది, దీని అర్థం "నిందించువాడు" లేదా
"ప్రత్యర్థి/అభియోగకర్త" అని.
అప్పుడు
దేవుడు సాతానుతో, “నీవు నా సేవకుడైన
యోబును చూచితివా? అతడు
ఋజువర్తనుడును, న్యాయవంతుడును
మరియు దేవునిపట్ల భయభక్తులు కలిగి, పాపమునకు
దూరముగా ఉండువాడు. అట్టివాడు మరియొకడు భూలోకమునలేడు” అనెను. (యోబు 1:8). దీనికి సాతాను సవాలుగా "యోబు ఉట్టినే
దేవుని యందు భయభక్తులు చూపువాడా? (యోబు 1:9). సాతాను ప్రకారం,
యోబు దేవుని ఆరాధించడానికి కారణం అతని
సంపద, సౌభాగ్యం మాత్రమే. అతని ఆస్తిపాస్తులను తీసివేస్తే, అతడు దేవుని దూషిస్తాడని సాతాను పందెం వేస్తాడు. “నీవు అతనికిని, అతని కుటుంబమునకును, అతని సిరిసంపదలకును చుట్టు కంచెవేసి
కాపాడుచున్నావు కదా? నీవు అతడు
చేపట్టిన కార్యములనెల్ల దీవించుటచే, అతనికున్నదెల్ల
దేశములో బహుగా వృద్ధిచెందినది. అయినను నీవు ఇపుడు నీ చేయిచాపి అతనికి కలిగిన
సమస్తమును మొత్తినచో, నీ ముఖముననే
నిన్ను దూషించి నిన్ను విడనాడును”యోబు 1:10-11
ఈ సవాలు
యోబు గ్రంథం మొత్తానికి కేంద్ర ప్రశ్నను నెలకొల్పుతుంది. మానవుడు నిస్వార్థంగా, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా దేవుని
ఆరాధించగలడా? ధర్మం అనేది కేవలం లాభదాయకమైన ఒప్పందమా, లేక అంతకుమించిన విలువ కలిగినదా? దేవుడు సాతానుకు యోబు ఆస్తిపాస్తుల మీద అధికారం
ఇస్తాడు, కానీ యోబు శరీరాన్ని ముట్టకూడదని షరతు పెడతాడు
(యోబు 1:12). మొదటి పరీక్షలో యోబు తన ఆస్తిని, పిల్లలను కోల్పోయినా దేవుని దూషించలేదని చూసిన
తరువాత, సాతాను మరో వాదన లేవనెత్తుతాడు: “నరుడు తన చర్మమును కాపాడుకొనుటకు చర్మమును, తన ప్రాణములను దక్కించుకొనుటకు సమస్తమును
త్యజించును.ఇంకొకసారి నీవు చేయిచాపి అతని దేహమును మొత్తినయెడల, అతడు నీ ముఖమెదుటనే నిన్ను దూషించి నిన్ను
విడనాడును” అని సాతాను చెప్పాడు. (యోబు 2:4-5). ఈసారి
దేవుడు యోబు ప్రాణాన్ని మాత్రం రక్షించాలనే షరతుతో, అతని శరీరంపై అధికారం సాతానుకు ఇచ్చాడు.
4. మొదటి పరీక్ష - సర్వనాశనం
ఒక రోజు, వరుసగా నలుగురు సేవకులు యోబు వద్దకు వచ్చి భయంకరమైన వార్తలు
తెలియజేస్తారు. మొదటివాడు షెబీయుయిలు అతని ఎడ్లను, గాడిదలను దోచుకొని సేవకులను చంపివేశారని
చెబుతాడు. రెండవవాడు వచ్చి, అగ్ని
ఆకాశం నుండి పడి గొఱ్ఱెలను, కాపరులను దహించివేసిందని చెబుతాడు. మూడవవాడు
కల్దీయులు మూడు గుంపులుగా వచ్చి ఒంటెలను దోచుకొని సేవకులను చంపారని చెబుతాడు.
నాలుగవవాడు అత్యంత భయంకరమైన వార్త చెబుతాడు, అది ఏమిటంటె యోబు పిల్లలు తమ అన్నయ్య ఇంట్లో విందు
చేసుకుంటుండగా, ఎడారి నుండి పెద్ద గాలివాన వచ్చి ఇంటిని కూలదోసి, పదిమంది పిల్లలందరూ మరణించారని చెబుతాడు. (యోబు 1:13-19).
ఈ నాలుగు
విపత్తులు వరుసగా, ఏమాత్రం విరామం లేకుండా వస్తాయి. ఒక్క రోజులో యోబు తన సంపద మొత్తాన్ని, తన పదిమంది పిల్లలను కోల్పోతాడు. ఇది మానవ
చరిత్రలో ఊహించలేనంత విషాదకరమైన సంఘటన. అయితే యోబు ప్రతిస్పందన అసాధారణమైనది. “నేను దిగంబరుడనుగానే తల్లి కడుపు నుండి
వెలువడితిని, దిగంబరుడనుగానే
ఇచ్చటి నుండి వెడలిపోయెదను. ప్రభువు ఇచ్చెను, ప్రభువే తీసుకొనెను. ప్రభువు నామమునకు స్తుతి
కలుగునుగాక!” అని పలికెను.ఇన్ని దురదృష్టములును వాటిల్లినను యోబు ఏ పాపమును
కట్టుకొనలేదు, దేవుడు
అన్యాయము చేసెను అని పెదవులతో సైతము పలుకలేదు." (యోబు 1:20-21).
ఇది యోబు
జీవితంలోని అత్యంత ప్రసిద్ధమైన వాక్యాలలో ఒకటి. అతని దుఃఖం నిజమైనది. వస్త్రాలు చించుకోవడం, తల గొరిగించుకోవడం అనేవి ఆ కాలపు తీవ్రమైన శోక
చిహ్నాలు. కానీ అటువంటి
దుఃఖంలో కూడా అతడు దేవుని దూషించలేదు, దేవుని
సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు. "ఇన్ని దురదృష్టములును వాటిల్లి నను యోబు ఏ
పాపమును కట్టుకొనలేదు, దేవుడు
అన్యాయము చేసెను అని పెదవులతో సైతము పలుకలేదు" అని గ్రంథకర్త చెబుతున్నాడు.(యోబు 1:22).
యోబు
తనకున్నదంతా దేవుడు ఇచ్చిన బహుమానంగా, తనది
కానిదిగా చూశాడు. అతని ఆస్తి, పిల్లలు కూడా అతని సొంతం కాదు, దేవుని దయవల్ల లభించినవి, కాబట్టి వాటిని దేవుడు తీసుకున్నా, అది అన్యాయం కాదని అతడు భావించాడు. ఇది ఒక
పరిపక్వమైన ఆధ్యాత్మిక దృక్పథం, కానీ ఇది ముగింపు కాదు.
5. రెండవ పరీక్ష - శారీరక వ్యాధి
యోబు మొదటి
పరీక్షలో నిలబడిన తరువాత, రెండవ పరీక్ష మరింత వ్యక్తిగతంగా, మరింత బాధాకరంగా వస్తుంది. సాతాను యోబు
శరీరాన్ని "అరకాలి మొదలుకొని నడినెత్తివరకు" భయంకరమైన కురుపులతో (boils) బాధపెడుతున్నాడు. (యోబు 2:7). యోబు ఒక చిల్లపెంకు తీసుకొని తన శరీరాన్ని
గోకుకుంటూ బూడిదలో కూర్చుంటాడు. ఇది
తీవ్రమైన శారీరక బాధను, సామాజిక అవమానాన్ని సూచించే దృశ్యం. ఒకప్పటి
" తూర్పు
దేశీయులందరికంటే అతడు మహాసంపన్నుడు, " ఇప్పుడు నగరం బయట, బూడిదకుప్పలో కూర్చున్న దీనస్థితికి
చేరుకున్నాడు.
ఈ సమయంలో
యోబు భార్య అతనితో ఇలా అంటుంది, “నీవింకను యదార్థత తను వదలవా? దేవుని దూషించి మరణించుము” (యోబు 2:9). ఇది ఒక హృదయవిదారకమైన క్షణం, యోబు భార్య కూడా తన
భర్త వలె తన పిల్లలందరినీ ఒకే రోజున కోల్పోయింది, ఆమె స్వంత దుఃఖం, నిస్పృహ ఈ మాటల్లో ప్రతిధ్వనిస్తుంది. అయితే
యోబు గొప్ప సమాధానం ఇస్తున్నాడు. " నీవు మూరురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు.
దేవుడు మనకు మేలులు దయచేసినపుడు స్వీకరించితిమి, మరి కీడులను పంపినపుడు స్వీకరింపవలదా?”?" (యోబు 2:10). మళ్ళీ, గ్రంథకర్త, ఇందులోనైనను యోబు తన పెదవులతో పాపము
చేయలేదు అని చెబుతున్నాడు."
ఇక్కడ
గమనించవలసిన విషయం ఏమిటంటే, "తన
పెదవులతో పాపము చేయలేదు" అనే మాట యోబు హృదయంలో సందేహాలు, ప్రశ్నలు మొదలవుతున్నాయని, కానీ అతడు ఇంకా వాటిని బహిరంగంగా వ్యక్తపరచలేదని
సూచిస్తుంది. ఇది తరువాతి అధ్యాయాలలో జరగబోయే గొప్ప అంతర్మథనానికి పునాది
వేస్తుంది.
6. ముగ్గురు స్నేహితుల రాక - మౌన సానుభూతి
యోబు దుస్థితి
గురించి తెలుసుకున్న అతని ముగ్గురు స్నేహితులు - తేమానీయుడైన ఎలీఫసు, షూహనియుడైన బిల్దదు, నామానీయుడైన సొఫరు అతనిని ఓదార్చడానికి, సానుభూతి తెలుపడానికి వస్తారు. వారు దూరం నుండి
యోబును చూసినప్పుడు, అతనిని గుర్తుపట్టలేకపోతారు, అతని రూపం పూర్తిగా
మారిపోయింది. వారు బిగ్గరగా ఏడ్చి, తమ వస్త్రాలు చించుకొని, తలపై దుమ్ము చల్లుకుంటారు. తరువాత వారు యోబుతో
పాటు ఏడు రోజులు, ఏడు రాత్రులు నేలమీద కూర్చుంటారు, “యోబు తీవ్రమైన బాధను అనుభవించుచుండెనని
గ్రహించి ఆ స్నేహితులతడితో ఒక్క పలుకైనను పలుకజాలరైరి." (యోబు 2:13).
ఈ ఏడు రోజుల మౌనం ఎంతో ముఖ్యమైనది. ఇది సానుభూతి ఎలా ఉండాలో చూపిస్తుంది. కొన్నిసార్లు తీవ్రమైన బాధలో ఉన్నవారికి మాటలు కంటే మౌన సాన్నిధ్యమే ఎక్కువ ఓదార్పునిస్తుంది. దురదృష్టవశాత్తూ, ఈ స్నేహితులు తమ మౌనాన్ని కొనసాగించలేకపోయారు. ఏడు రోజుల తరువాత, యోబు తన నోరు తెరిచి తన పుట్టిన దినాన్ని శపించడంతో మొదలై, గ్రంథంలో అత్యంత సుదీర్ఘమైన, తీవ్రమైన వాదోపవాదాల పరంపర ప్రారంభమవుతుంది.
7. యోబు మొదటి విలాపం - జననదినాన్ని శపించడం
మూడవ
అధ్యాయంలో, యోబు తన మౌనాన్ని విరమించి, తీవ్రమైన వేదనతో నిండిన ఒక దీర్ఘమైన విలాప
గీతాన్ని ఆలపిస్తాడు. అతడు తన జననదినాన్ని శపిస్తాడు. “నా తల్లి గర్భద్వారమును అది మూయనందుకు నా
నేత్రములకు అది బాధను మరుగుచేయనందులకు నేను పుట్టినదినము లేకపోవునుగాక! 'ఒక మగబిడ్డ ఆమె కడుపునపడెను'. అని ఒకడు చెప్పిన రేయి లేకపోవునుగాక! " అంటూ ఈ అధ్యాయం సాగిపోతుంది. (యోబు 3:3). అతడు తాను పుట్టకుండా ఉండి ఉంటే బాగుండేదని, లేదా పుట్టిన వెంటనే మరణించి ఉంటే బాగుండేదని
కోరుకుంటాడు. ఈ అధ్యాయం ఆత్మహత్యా వాంఛను వ్యక్తపరచదు, కానీ జీవితం పట్ల తీవ్రమైన నిస్పృహను, మరణం పట్ల ఒక విధమైన ఆకాంక్షను ప్రదర్శిస్తుంది.
ఈ విలాపం యోబు గ్రంథంలో మిగిలిన భాగానికి స్వరాన్ని నిర్దేశిస్తుంది. ఇక్కడి నుండి, గ్రంథం మూడు చక్రాల వాదోపవాదాలుగా నిర్మించబడింది. ఎలిఫసు బిల్దదు, సొఫరు ప్రతి ఒక్కరూ యోబుతో మాట్లాడతారు, యోబు ప్రతిసారీ సమాధానమిస్తాడు.
8. మొదటి వాదోపవాద చక్రం (అధ్యాయాలు 4-14)
ఎలీఫసు వాదన
, ఎలీఫసు మొదట
మాట్లాడతాడు, అతని వాదన సాంప్రదాయిక ప్రతిఫల సిద్ధాంతంపై
ఆధారపడింది, " ఋజువర్తనుడు నాశనమగుటగాని న్యాయవంతుడు చెడుటగాని
నీవు ఎన్నడైన కంటివా? నేను చూచిన
సంగతి చెప్పుచున్నాను వినుము. దుష్టత్వమను పొలమునుదున్ని దుర్మార్గమను పైరువేసిన
వారు, కడన పాపపు
పంటనే కోసికొందురు. " (యోబు 4:7-8). అతని ప్రకారం, బాధ అనేది ఎల్లప్పుడూ పాపానికి ఫలితం; కాబట్టి యోబు తప్పకుండా ఏదో పాపం చేసి ఉంటాడు, దానిని ఒప్పుకొని దేవుని వైపు తిరగాలని సలహా
ఇస్తాడు.
యోబు
సమాధానం: యోబుకు తన స్నేహితుల "ఓదార్పు" నిజానికి తనకు
మరింత బాధ కలిగిస్తోందని చెబుతాడు. అతడు తన బాధ యొక్క తీవ్రతను వర్ణిస్తూ, మరణమే తనకు ఉపశమనంగా ఉంటుందని అంటాడు. అయితే, అతడు తన నిర్దోషత్వాన్ని గట్టిగా
సమర్థించుకుంటాడు, తాను పాపం చేయలేదని పదేపదే నొక్కి చెబుతాడు.
బిల్దదు వాదన: బిల్దదు
మరింత కఠినంగా మాట్లాడతాడు. అతని దృష్టిలో, యోబు పిల్లల
మరణం వారి స్వంత పాపానికి ఫలితమే. " నీ కుమారులు దేవునికి ద్రోహము చేసియుందురేని ఆయన
వారిని తగిన రీతిగనే శిక్షించెను. " (యోబు 8:4). అతడు యోబును దేవుని వైపు తిరిగి, తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోమని కోరతాడు.
సొఫరు వాదన : ముగ్గురిలో
అత్యంత కఠినంగా మాట్లాడినవాడు సొఫరు. అతడు నేరుగా యోబును నిందిస్తాడు, యోబు తన పాపానికి తగినదానికంటే తక్కువ శిక్ష
అనుభవిస్తున్నాడని కూడా అంటాడు. "నీ
దోషమును విడనాడుము. అధర్మమును నీ ఇంటినుండి వెడలింపుము." (యోబు 11:6).
ఈ మొదటి వాదనల
అంతటా, యోబు తన నిర్దోషత్వాన్ని నిలబెట్టుకుంటూనే, దేవుని పట్ల తన గందరగోళాన్ని, నిరాశను వ్యక్తం చేస్తాడు. అతడు దేవునితో నేరుగా
మాట్లాడాలని, తన వాదనను దేవుని ముందు వ్యక్తపరచాలని కోరుకుంటాడు.
9. రెండవ మరియు మూడవ వాదోపవాద చక్రాలు (అధ్యాయాలు 15-31)
రెండవ మరియు
మూడవ వాదనలలో, స్నేహితుల వాదనలు మరింత తీవ్రమవుతాయి. వారు
దుష్టుల పతనం గురించి, దేవుని న్యాయం గురించి మరింత గట్టిగా
మాట్లాడతారు. ఎలీఫజు తన రెండవ వాదనలో యోబు
జ్ఞానాన్ని ప్రశ్నిస్తాడు, మూడవ వాదనలో అయితే యోబుపై ప్రత్యక్షంగా
నిర్దిష్ట పాపాలను ఆరోపిస్తాడు, అవి అనాథులను హింసించడం, పేదవారి నుండి తాకట్టు వస్తువులు తీసుకోవడం
వంటివి (యోబు 22:6-9). ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు, ఎందుకంటే గ్రంథం ప్రారంభంలోనే యోబు నీతిమంతుడని
స్పష్టం చేయబడింది.
యోబు
ప్రతిస్పందనలు కూడా మరింత తీవ్రమవుతాయి. అతడు దుష్టులు తరచుగా సుఖంగా జీవించి, వృద్ధాప్యంలో శాంతిగా మరణిస్తున్నారని గమనిస్తాడు (యోబు 21వ అధ్యాయం). ఇది సాంప్రదాయిక ప్రతిఫల సిద్ధాంతానికి
ప్రత్యక్ష విరుద్ధం. ఇది జ్ఞాన సాహిత్యంలో ఒక విప్లవాత్మక పరిశీలన మరియు వాస్తవ
ప్రపంచంలో, న్యాయం ఎల్లప్పుడూ కనిపించదు.
ఈ వాదనలలో యోబు దేవునితో నేరుగా వాదించాలనే కోరికను పదేపదే
వ్యక్తం చేస్తాడు. అతని ప్రసిద్ధమైన ప్రకటనలలో ఒకటి 19వ అధ్యాయంలో కనిపిస్తుంది. " అయినను, నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. ఈ
నా దేహము క్షీణించిపోయిన ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. " (యోబు 19:25-26). ఈ వాక్యాలు యోబు గొప్ప విశ్వాసాన్ని చూపిస్తాయి. తీవ్రమైన సందేహం మధ్యలో కూడా, అతనికి దేవునిపై ఏదో ఒక అంతిమ నమ్మకం మిగిలి
ఉంది.
28వ అధ్యాయం ప్రత్యేకమైనది. ఇది "జ్ఞానం
ఎక్కడ దొరుకుతుంది?" అనే ప్రశ్నపై ఒక ధ్యానాత్మక కవితా భాగం. నిజమైన
జ్ఞానం గురించి ఇక్కడ తెలుసుకుంటాము. మానవులు భూమి లోతుల్లోకి తవ్వి వెండి, బంగారం, రత్నాలు
వెలికితీయగలరు, కానీ నిజమైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో వారికి
తెలియదని చెబుతుంది. చివరకు, " ప్రభువు నరునితో ఇట్లనెను: దేవునికి భయపడుటయే
విజ్ఞానము, దుష్కార్యములను
విడనాడుటయే వివేకము" (యోబు 28:28) అనే ముగింపుకు వస్తుంది. ఇది యోబు గ్రంథం మధ్యలో
ఒక నిశ్శబ్ద విరామంగా పనిచేస్తుంది.
మూడవ వాదనలు 29-31 అధ్యాయాలలో వస్తాయి. ఇక్కడ యోబు తన గత వైభవాన్ని గుర్తుచేసుకుంటాడు (29వ అధ్యాయం), తన ప్రస్తుత దీనస్థితిని వర్ణిస్తాడు (30వ అధ్యాయం), మరియు చివరకు తన నిర్దోషత్వాన్ని ప్రమాణపూర్వకంగా ప్రకటిస్తాడు (31వ అధ్యాయం). ఇది "నిర్దోషత్వ ప్రమాణం" అని పిలువబడుతుంది. అతడు వ్యభిచారం, అబద్ధం, అన్యాయం, పేదవారి పట్ల నిర్లక్ష్యం వంటి అనేక పాపాల నుండి తాను దూరంగా ఉన్నానని ఒక్కొక్కటిగా ప్రమాణం చేస్తాడు. ఈ అధ్యాయంతో యోబు మాటలు ముగుస్తాయి.
10. ఎలీహు ప్రసంగాలు (అధ్యాయాలు 32-37)
ముగ్గురు
స్నేహితులు యోబుతో వాదించడం మానేసిన తరువాత, ఎలీహు అనే యువకుడు
అనూహ్యంగా రంగంలోకి ప్రవేశిస్తాడు. అతడు ఇంతవరకు మాట్లాడలేదు ఎందుకంటే తనకంటే
వయసులో పెద్దవారు ముందు మాట్లాడాలని గౌరవంతో వేచి ఉన్నాడు. అతడు కోపంగా
మాట్లాడతాడు, యోబు తనను తాను దేవుని కంటే నీతిమంతునిగా చూపించుకుంటున్నాడని, యోబుపై కోపంగా
ఎందుకు మాటలాడాడు. స్నేహితులపై కూడా కోపంగా మాటలాడాడు. ఎందుకంటే వారు యోబుకు సరైన సమాధానం
ఇవ్వలేకపోయారు.
ఎలీహు వాదన కొంతవరకు కొత్త దృక్కోణాన్ని తెస్తుంది. అతడు బాధ కేవలం శిక్ష మాత్రమే కాదని, అది దేవుడు మనుషులను హెచ్చరించడానికి, వారిని పాపం నుండి తప్పించడానికి, వారి పాత్రను శుద్ధి చేయడానికి ఉపయోగించే ఒక సాధనం కావచ్చని సూచిస్తాడు (యోబు 33వ అధ్యాయం). ఇది "క్రమ శిక్షణాత్మక బాధ" అనే భావనను ప్రవేశపెడుతుంది, ఇది శిక్షాత్మక దృక్పథం కంటే భిన్నమైనది. ఎలీహు దేవుని గొప్పతనాన్ని, ప్రకృతిలో కనిపించే ఆయన శక్తిని కూడా వర్ణిస్తాడు, ఇది తరువాత దేవుని స్వంత ప్రసంగానికి ఒక పూర్వరంగంగా పనిచేస్తుంది.
11. దేవుని వివరణ (అధ్యాయాలు 38-41)
యోబు
గ్రంథంలో అత్యంత నాటకీయమైన క్షణం ఇక్కడ వస్తుంది. దీర్ఘకాలంగా యోబు దేవునితో
నేరుగా మాట్లాడాలని, తన వాదనను దేవుడు వినాలని కోరుకున్నాడు. ఇప్పుడు, " అటుపిమ్మట యావేదేవుడు సుడిగాలిలోనుండి యోబుతో
ఇట్లు పలికెను" (యోబు 38:1). అయితే ఇది యోబు ఊహించినది కాదు. దేవుడు యోబు
ప్రశ్నలకు ప్రత్యక్ష సమాధానం ఇవ్వడు. తాను
ఎందుకు యోబును బాధపెట్టాడో వివరించడు, పరలోక సవాలు
గురించి కూడా చెప్పడు. బదులుగా, దేవుడు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు.
" జ్ఞానహీనమైన పలుకులతో ఆలోచనను చెరపుచున్న
వీడెవడు?... నేను ఈ భూమికి పునాదులెత్తినపుడు నీవు ఉంటివా? నీకంతటి విజ్ఞానమున్నచో నాకు జవాబుచెప్పుము"
(యోబు 38:2,4). దేవుడు సృష్టిలోని అద్భుతాలను, భూమి పునాదులు, సముద్రపు హద్దులు, ఉదయకాలపు వెలుగు, మంచు, వర్షం, నక్షత్రమండలాలు, సింహం, కొండమేక, అడవి గాడిద, గుర్రం, డేగ,
ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, యోబును వాటిని సృష్టించగలవా, నియంత్రించగలవా అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నలు వ్యంగ్యంగా కాదు, గంభీరమైన, గంభీరమైన
కవితా శైలిలో అడగబడతాయి.
రెండవ వాదనలో (40-41 అధ్యాయాలు), దేవుడు రెండు రహస్యమైన జీవులను, బెహేమోతు (Behemoth), లివ్యాతాను (Leviathan)ల గురించి వర్ణిస్తాడు. ఇవి బహుశా హిప్పోపొటామస్ (నీటి గుర్రం), మొసలి వంటి జంతువులను సూచిస్తూనే, అదే సమయంలో అనాగరిక, అదుపు చేయలేని ప్రకృతి శక్తులకు, గందరగోళానికి (chaos) ప్రతీకలుగా కూడా పనిచేస్తాయి. దేవుడు ఈ శక్తివంతమైన జీవులను నియంత్రించగలడు, కానీ యోబు వాటిని కూడా ఎదుర్కోలేడు. దేవుడు యోబు ప్రశ్నకు (" ఎందుకు బాధపడుతున్నాడు?") ప్రత్యక్షముగా సమాధానం ఇవ్వడు. బదులుగా, దేవుడు విశ్వం యొక్క విస్తారతను, సంక్లిష్టతను, తన సృష్టిలోని రహస్యాలను ప్రదర్శిస్తాడు, తద్వారా మానవ జ్ఞానం యొక్క పరిమితులను స్పష్టం చేస్తాడు. విశ్వం మానవ కేంద్రితమైనది కాదు; దేవుని ప్రణాళిక మానవ అవగాహనకు మించినది; మరియు దేవుని సన్నిధి, ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తించడం అనేది, అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందడం కంటే ముఖ్యమైనది.
12. యోబు పశ్చాత్తాపం మరియు పరివర్తన
దేవుని వివరణ
తరువాత, యోబు స్పందన అత్యంత ముఖ్యమైనది, "నేను
గత్యంతరము లేక మాటలాడితిని... నేను పలికిన పలుకులకు అసహ్యపడుచున్నాను. దుమ్ము, బూడిదపైన చల్లుకొని పశ్చాత్తాపపడుచున్నాను "
(యోబు 42:3,6). యోబు తన నిర్దోషత్వాన్ని ఉపసంహరించుకోలేదు; అతడు ఏదో పాపం చేసినట్లు ఒప్పుకోడు. బదులుగా, అతడు తన అవగాహన పరిమితమైనదని, తాను తన శక్తికి మించిన విషయాల గురించి
మాట్లాడానని గుర్తిస్తాడు.
యోబు, " పూర్వము వినికిడి వలన మాత్రమే నేను నిన్నెరిగితిని. కాని ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూచితిని. " (యోబు 42:5) అని చెబుతాడు. ఇది యోబు అనుభవం , అతని విశ్వాసం ఒక మేధోపరమైన, సిద్ధాంతపరమైన అవగాహన నుండి, ఒక ప్రత్యక్ష, వ్యక్తిగత దేవుని అనుభవానికి మారింది. అతని ప్రశ్నలకు సమాధానాలు రాలేదు, కానీ దేవుని సన్నిధి, దేవుని ఉనికి యొక్క వాస్తవికత అతనికి కొత్త రకమైన శాంతిని, అంగీకారాన్ని తెచ్చిపెట్టింది. కొన్నిసార్లు, బాధకు పరిష్కారం సమాధానాలలో కాదు, సన్నిధిలో ఉంటుంది. దేవుడు యోబుకు "ఎందుకు" అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, కానీ తనను తాను వ్యక్తపరచాడు, మరియు ఆ వెల్లడింపు యోబుకు తృప్తినిచ్చింది.
13. దేవుని తీర్పు - స్నేహితులపై, యోబుపై
గ్రంథం
ముగింపు భాగంలో, దేవుడు ఎలీఫసుతో మాట్లాడతాడు, ఆశ్చర్యకరమైన తీర్పు ఇస్తాడు: " ఓయి! నాకు నీ పట్లను, నీ యిరువురి మిత్రుల పట్ల ఆగ్రహము కలుగుచున్నది.
మీరు నా భక్తుడైన యోబువలె నన్నుగూర్చి యథార్థము చెప్పరైతిరి." (యోబు 42:7). ఇది ఆశ్చర్యకరమైనది, ఎందుకంటే, యోబు దేవుని పట్ల తీవ్రమైన ప్రశ్నలు, ఫిర్యాదులు వ్యక్తం చేసినప్పటికీ, దేవుడు అతనిని "సరిగా చెప్పినవాడు"గా
ప్రకటిస్తాడు, స్నేహితులను మాత్రం తప్పు పట్టుతాడు.
దీని అర్థం
ఏమిటి? యోబు తన నిజాయితీతో కూడిన ప్రశ్నలు వేశాడు, తన నిజమైన బాధను వ్యక్తం చేశాడు, దేవునితో ప్రత్యక్ష సంభాషణ కోరుకున్నాడు, ఇది స్నేహితుల సిద్ధాంతపరమైన, సూత్రబద్ధమైన, యథార్థత
లేని వాదనల కంటే దేవునికి మరింత ఆమోదయోగ్యమైనది యోబు యాదార్ధత. స్నేహితులు దేవుని
గురించి సరైన సిద్ధాంతాలు మాట్లాడారు, కానీ యోబు
వాస్తవ అనుభవం నుండి, హృదయపూర్వకంగా దేవునితో పోరాడాడు. ఇది పవిత్ర గ్రంధ
జ్ఞాన సాహిత్యంలో నిజాయితీతో కూడిన సందేహం, మౌనమైన అబద్ధ నమ్మకం కంటే మేలైనది కావచ్చు.
దేవుడు యోబు స్నేహితులను ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను దహనబలిగా అర్పించమని, యోబును వారి కొరకు ప్రార్థన చేయమని ఆజ్ఞాపిస్తాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు, దేవుడు వారిని క్షమిస్తాడు.
14. పునరుద్ధరణ - రెట్టింపు ఆశీర్వాదం
ఈ గ్రంథం చివరి భాగంలో, " యోబు తన ముగ్గురు మిత్రులకొరకు ప్రార్థనచేసిన
పిదప ప్రభువు అతనిని మరల సంపన్నుని చేసెను. పూర్వముకంటె రెట్టింపుగా సిరిసంపదలు
దయచేసెను." (యోబు 42:10). అతని పశుసంపద రెట్టింపు అవుతుంది, పదునాలుగు వేల
గొఱ్ఱెలు, ఆరు వేల ఒంటెలు, వెయ్యి ఎడ్ల జతలు, వెయ్యి ఆడు గాడిదలు. అతని అన్నదమ్ములు, బంధువులు, పూర్వపు
స్నేహితులు అతని వద్దకు తిరిగివచ్చి అతనితో భోజనం చేసి, ఓదార్చి, ఒక్కొక్కరు కొంత
సొమ్ము, బంగారు ఉంగరం బహూకరిస్తారు.
ఆసక్తికరంగా, యోబుకు మళ్ళీ ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు పుడతారు. అతని కుమార్తెల
పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించబడతాయి. మొదటి
కూతురు పేరు యెమీమా, రెండవ కూతురు పేరు కేసియా, చిన్నకూతురు పేరు కెరెనప్పుకు. ఆ దేశమంతటిలో
యోబు కుమార్తెలంత అందమైన స్త్రీలు లేరని, మరియు యోబు
వారికి కూడా వారి సోదరులతో సమానంగా ఆస్తిలో వారసత్వం ఇచ్చాడని (యోబు 42:15) చెబుతుంది, అది ఆ కాలానికి ఇది అసాధారణమైన, ప్రగతిశీలమైన చర్య.
యోబు ఆ
తరువాత నూట నలభై సంవత్సరాలు జీవించి, తన కుమారులను, మనుమలను నాలుగు తరాల వరకు చూసి, " అతడు చాల యేండ్లు జీవించి పండువంటి నిండు
ప్రాయమున కన్నుమూసెను." (యోబు 42:17).
15. జ్ఞాన సాహిత్య కోణం నుండి విశ్లేషణ
15.1 ప్రతిఫల సిద్ధాంతానికి సవాలు
పురాతన
ఇశ్రాయేలు జ్ఞాన సాహిత్యంలో ప్రబలంగా ఉన్న సరళమైన ప్రతిఫల సిద్ధాంతాన్ని యోబు గ్రంధం (mechanical retribution theology) సవాలు చేస్తుంది. సామెతల గ్రంథం, నీతిగా
జీవించేవారికి దీర్ఘాయుష్షు, సంపద, గౌరవం
లభిస్తాయి; మూర్ఖంగా, దుష్టంగా
జీవించేవారికి నాశనం సంభవిస్తుంది. ఇది సాధారణంగా నిజమే కావచ్చు, కానీ యోబు గ్రంథం ఇది సార్వత్రిక నియమం కాదు.
నీతిమంతులు కూడా తీవ్రంగా బాధపడవచ్చు, మరియు వారి
బాధకు కారణం వారి పాపం కాకపోవచ్చు, అని బోధిస్తుంది.
15.2 బాధ యొక్క రహస్యం
యోబు గ్రంథం
బాధకు ఒక్క సమగ్రమైన సమాధానం ఇవ్వదు. బదులుగా, ఇది అనేక కారణాలను అందిస్తుంది. స్నేహితుల శిక్షాత్మక దృక్పథం, ఎలీహు యొక్క క్రమశిక్షణాత్మక దృక్పథం, మరియు చివరకు దేవుని ద్వారా వచ్చే రహస్యాత్మక దృక్పథం. మానవ మేధస్సు
విశ్వం యొక్క సంపూర్ణ ప్రణాళికను గ్రహించలేదు, కాబట్టి ప్రతి బాధకూ తార్కికమైన వివరణ ఉండాలని
ఆశించడం అహంకారమే, అనే సందేశం ఈ గ్రంధం
ఇస్తుంది. ఈ గ్రంధం మొదటిలో యోబును దేవుడు ఎంతగానో నమ్మి ఎన్ని కష్టాలు అనుభవించిన
దేవున్ని విడనాడని, నిందించని వ్యక్తిగా చూస్తున్నాడు.
15.3 దేవుని స్వేచ్ఛ మరియు నీతి
యోబు గ్రంథం
దేవుని నీతిని మానవ న్యాయ ప్రమాణాలతో కొలవలేమని చూపిస్తుంది. దేవుడు మానవుడికి
జవాబుదారీగా ఉండడు; ఆయన సృష్టికర్త, మానవుడు సృష్టించబడినవాడు. ఇది దేవుని నీతి మానవ
కోణం కంటే విస్తారమైనదని, లోతైనదని సూచిస్తుంది.
15.4 నిజాయితీతో కూడిన విశ్వాసం
నిజమైన
విశ్వాసం అనేది సందేహాలు, ప్రశ్నలు, ఫిర్యాదులు
లేకుండా ఉండేది కాదు. యోబు దేవుని మీద తీవ్రంగా ఫిర్యాదు చేశాడు, తన బాధను వ్యక్తపరచాడు, దేవునితో వాదించాలని కోరాడు, అయినప్పటికీ దేవుడు
అతనిని "యాదార్ధం చెప్పినవాడి"గా
ప్రకటించాడు.
15.5 సమాజంలో బాధితుల పట్ల వైఖరి
యోబు
స్నేహితుల తప్పు, బాధలో ఉన్నవారిని వెంటనే నిందించడం. వారి "బాధ, కష్టం పాప
ఫలితం" అనే సూత్రాన్ని యాంత్రికంగా అన్వయించి, యోబు వేదనను మరింత పెంచారు. ఈ గ్రంథం సమాజానికి
ఒక హెచ్చరిక, బాధలో ఉన్నవారిని
చూసినప్పుడు, తొందరపడి తీర్పు తీర్చకూడదు, కారణాలు వెతకడం కంటే సానుభూతితో తోడుగా నిలవడం
ముఖ్యం.
15.6 జ్ఞానం యొక్క పరిమితులు
28వ అధ్యాయంలోని జ్ఞాన కవితా భాగం, యోబు గ్రంథం మొత్తానికి కేంద్ర సందేశాన్ని సూచిస్తుంది. నిజమైన జ్ఞానం మానవ శోధనతో పూర్తిగా అందదు, అది దేవుని యందు భయభక్తులతో మొదలవుతుంది. ఇది సామెతల గ్రంథంలోని ప్రధాన ఇతివృత్తానికి ప్రభువునందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము, కానీ యోబు గ్రంథం ఈ సూత్రాన్ని మరింత లోతుగా చూస్తుంది.
16. ముగింపు
యోబు జీవితం
మానవ చరిత్రలో బాధ, విశ్వాసం, న్యాయం అనే
శాశ్వతమైన ప్రశ్నలను ఎదుర్కొన్న అత్యంత లోతైన కథలలో ఒకటి. ఒక నీతిమంతుడైన, సంపన్నుడైన మనిషి క్షణాల్లో, తన పిల్లలను, తన ఆస్తిని, తన ఆరోగ్యాన్ని సర్వాన్ని కోల్పోతాడు. అతని స్నేహితులు అతనిని
ఓదార్చడానికి వచ్చినా, చివరకు అతనిని మరింత గాయపరుస్తారు. అతడు
దేవునితో నేరుగా వాదించాలని కోరుకుంటాడు, దేవుడు నేరుగా
సమాధానాలు ఇవ్వకుండా, విశ్వం యొక్క విస్తారతను, తన సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తాడు, యోబు, మానవ తార్కానికి దేవుని నియమాలు అందవని, దేవుడు
చేసేది మొత్తం ఆయన ప్రణాళికా ప్రకారమే అని,
యోబు తాను
దేవుని అనంత జ్ఞానం, శక్తి ముందు అల్పమైనవాడినని తెలుసుకొని, దేవుని ప్రశ్నించుటకు
తగనని తెలపుతాడు.
యోబు కథ
మనకు బోధించేది ఏమంటే, జీవితంలోని ప్రతి
బాధకూ తార్కికమైన, తక్షణ వివరణ దొరకాలని లేదు. కొన్నిసార్లు, విశ్వాసం అంటే సమాధానాలు పొందడం కాదు, అనిశ్చితి మధ్య కూడా దేవుని సన్నిధిని
విశ్వసించడం. యోబు తన ప్రశ్నలకు పూర్తి సమాధానం పొందలేదు, కానీ అతడు దేవుని ప్రత్యక్ష అనుభవాన్ని పొందాడు, యోబు దానితో తృప్తి పొందాడు.
యోబు గ్రంథం
జీవితం ఎల్లప్పుడూ చక్కటి సూత్రాలకు అనుగుణంగా నడవదని, మానవ జ్ఞానం పరిమితమైనదని, మరియు నిజమైన జ్ఞానం దేవుని ముందు వినయంతో, భయభక్తులతో నిలబడటంలోనే ఉందని బోధిస్తుంది. యోబు
జీవితం ప్రతి తరానికి బాధను ఎదుర్కొనే మానవాళికి ఒక శాశ్వతమైన మార్గదర్శిగా
నిలుస్తుంది.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment