సామాన్య కాలపు 33వ ఆదివారం: వరహాల ఉపమానం
అప్పగించినదానిని నమ్మకంగా వాడుదాం
పఠనాలు: సామెతల గ్రంథం 31 (సద్గుణవతి
కవిత), 1 తెస్సలొనీకయులకు 5, మత్తయి
సువార్త 25 (వరహాల ఉపమానం).
పరిచయం
"ఈ రాత్రి నా జీవితం
ముగిసిపోతే, దేవుడు నాకు ఇచ్చినదానితో నేను ఏమి చేశానని
చెప్పగలను?" ఈ ఆదివారం మూడు పఠనాలూ మన ముందు ఉంచుతున్న
ప్రశ్న ఇదే. దైవార్చన సంవత్సరం ముగింపుకు వస్తుంది, వచ్చే
ఆదివారం క్రీస్తురాజు మహోత్సవం. అందుకే తిరుసభ మన జీవితాలను పరిశీలించుకొనమని
ఆహ్వానిస్తుంది. ఈ ఆహ్వానం మనలను భయపెట్టడానికి కాదు, మన జీవితానికి
ఒక అర్థం ఉందని గుర్తు చేయడానికి ఈ ఆహ్వానం ఇవ్వబడింది. ఈ మూడు పఠనాలు ఒకదానికొకటి
అల్లుకుని, మూడు ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నాయి. అవి ఎలా జీవించాలి, ఎందుకు
జీవించాలి, ఈ జీవితానికి
ఫలితం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాయి.
యోగ్యురాలైన గృహిణి (ఎలా జీవించాలి?)
మొదటి ప్రశ్నకు జవాబు సామెతల గ్రంథం చివరి
అధ్యాయంలోని కవితలో కనిపిస్తుంది. ఆదర్శమైన ఆ గృహిణిని గురించి ఇక్కడ వింటాము. హీబ్రూ
భాషలో "ఎషెత్ హాయిల్" అంటారు. "హాయిల్" అంటే బలం, శౌర్యం, సామర్థ్యం అని
అర్ధం. యుద్ధవీరులను వర్ణించడానికీ ఇదే
పదం వాడతారు. కాబట్టి ఆమె బలహీనురాలు కాదు, కుటుంబానికి వెన్నెముక. ఆమె
విలువ రత్నాల కన్నా ఎక్కువ అని వాక్యం చెబుతుంది (సామెతలు 31:10). ఆమె విలువ అందంలో కాదు, ఆస్తిలో
కాదు, ఆమె జీవన విధానంలో ఉంది. ఉదయమునే లేచి తన ఇంటిని
చక్కబెట్టి కుటుంబాన్ని నిర్వహించిన విధానం గురించి ఈ పఠనం చెబుతుంది.
మొదట ఆమె నమ్మకానికి పాత్రురాలు. ఆమె భర్త ఆమెను
విశ్వసిస్తాడు. భర్త ఆమెను ఎందుకు నమ్ముతాడు అంటే, జీవితకాలమంతా
ఆమె అతనికి మేలే చేస్తుంది (31:11-12). ఇంటిని
నిలబెట్టేది ధనం కాదు, ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం. ఈ
వాక్యం ఏదో ఒక రోజు ఆమె చేసిన గొప్ప పనిని
కాదు, ప్రతిరోజూ చూపే నిలకడైన విశ్వసనీయతను తెలియజేస్తుంది.
ఇస్సాకు రిబ్కా అడిగినది ఏది కాదనలేక పోయాడు.
ఎందుకంటే ఆమె ఇస్సాకును సుమారు 50 సంవత్సరాలు అంధత్వంలో ఉన్న సేవ చేసింది. భర్తకు
కళ్ళుగా మారింది. రెండవది, ఆమె శ్రమ
గొప్పది. ఆమె ఉన్ని, నార వెదికి ఆనందంగా పని చేస్తుంది (31:13). పునీత పౌలు
కొలొస్సీయులకు రాసినట్లు, మనం ఏ పని చేసినా ప్రభువు
కోసమే మనస్ఫూర్తిగా చేయాలి (కొలొస్సీయులు 3:23). అధర్శ గృహిణి
తన కుటుంబం కోసం ఎప్పుడు ఈ పని చేస్తూనే ఉంటుంది.
ఈ కవితలో ముఖ్యమైన మాట ఇరవయ్యవ వచనంలో ఉంది, ఆమె
పేదసాదలకు దానధర్మాలు చేయుటకు సంసిద్ధముగా ఉంటుంది. రాట్నం పట్టుకున్న చేతులే,
పేదల కోసం తెరుచుకుంటాయి. ఆమె శ్రమ ఫలం ఇంటి గుమ్మం దాటి అవసరంలో ఉన్నవారికి
చేరుతుంది. పేదలపై దయ చూపేవాడు ప్రభువుకే అప్పు ఇస్తున్నాడని సామెతల గ్రంథమే
చెబుతోంది (సామెతలు 19:17). యాకోబు కూడా, ఆకలితో
ఉన్నవారికి కేవలం మాటలు చెప్పి వదిలేసే విశ్వాసం నిర్జీవమైనదని హెచ్చరిస్తాడు
(యాకోబు 2). అందుకే నిజమైన భక్తి చేతులు జోడించి
ప్రార్థించడంతో ఆగదు, చేతులు చాపి సాయం చేయడానికి వెళ్తుంది. ఈ గృహిణి తన ఇంటిని చక్క పెడుతుంది, తన
ఇంటికి కావలసినవి సమకూరుస్తుంది, ఇతరులను ఆదరిస్తుంది. ఒక సైనికునిగా పని చేస్తుంది. కుటుంబాన్ని
నిలిపేది స్త్రీనే. కుటుంబ వీలువ పెంచేది స్త్రీనే.
ఎందుకు ఆమె ఇలా ఉంది అంటే, ఆమె ప్రభువు పట్ల భయభక్తులు కలిగిఉంది. ఈ పఠనంలో ముఖ్యమైన వాక్యం 30 వ వాక్యం. అది ఏమిటంటె తళుకు బెళుకులు నమ్మరానివి, అందము నిలుచునది కాదు, ప్రభువు పట్ల భయభక్తులుగల మహిళ మెచ్చుకొనదగినది అని చెబుతుంది, ఈ గృహిణి దీనిని తెలుసుకున్నది. అలానే జీవించినది. నేటి లోకం రూపాన్ని,బాహ్య ప్రదర్శనను, బయటికి కనిపించే విజయాన్ని ఆరాధిస్తుంది. కానీ దేవుని వాక్యం శాశ్వతమైన కొలమానాన్ని ఇస్తుంది. ఇక్కడ "భయభక్తులు" అంటే వణికిపోయే భయం కాదు. అది దేవుని గొప్పతనాన్ని గుర్తించి, గౌరవంతో, ప్రేమతో, కృతజ్ఞతతో జీవించడం. ఈ భయభక్తులే జ్ఞానానికి ఆరంభం (సామెతలు 1:7). కేవలం ఇది గృహిణి బాధ్యతే కాదు, భాద్యత కలిగి జీవించే ప్రతి వ్యక్తి ప్రశంసకు అర్హుడే. ఈ కవిత ముగింపులో ఆమె కృషి పది మందిలోను ప్రశంసలు పొందునుగాక అని వాక్యం చెబుతుంది. ఈ గొప్ప జీవితాన్ని ఎందుకు జీవించాలి అని రెండవ పఠనం చెబుతుంది.
వెలుగు
సంతానం (ఎందుకు జీవించాలి?)
ఇంత చక్కని జీవితాన్ని ఒక్కరోజు ఉత్సాహంగా
జీవించడం సులభం. కానీ సంవత్సరాల తరబడి, ఎవరూ చూడని చోట, ఎవరూ
మెచ్చని సమయంలో అలా జీవించగలమా? ఇక్కడే రెండవ పఠనం మన చేయి
పట్టుకుంటుంది. తెస్సలొనీక క్రైస్తవులు కష్టాల్లో ఉన్నారు, ప్రభువు
రాకడ గురించి ఆందోళన పడుతున్నారు. పునీత పౌలు వారికి ప్రభువు వచ్చే తేదీలు చెప్పడం లేదు.
ప్రభువు వచ్చే రోజు రాత్రివేళ దొంగ వచ్చినట్లు వస్తుందని అంటున్నాడు. (1 తెస్సలొ 5:2). యేసు
ప్రభువు స్వయంగా, మీ ప్రభువు
ఏ దినాన వస్తాడో మీకు తెలియదు కాబట్టి సిద్ధంగా ఉండండి అన్నాడు (మత్తయి 24). లెక్కలు
వేస్తూ కూర్చోవడం వ్యర్థం, సిద్ధంగా ఉండటమే ప్రధానమని దీని
భావం.
లోకం "శాంతి, భద్రత"
అని చెప్పుకుంటున్నప్పుడే ఆకస్మికంగా వినాశనం వస్తుందని పునీత పౌలు హెచ్చరిస్తాడు.
అంతా శాంతియుతంగా ఉంది అనేది, ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం ఇచ్చిన నినాదం. ఈనాడు
మనం ధనం, పదవి, ఆరోగ్యం, సాంకేతికతలో
భద్రత వెతుకుతాం. అవి ఒక్క క్షణంలో ఆవిరైపోగలవు. నిజమైన భద్రత దేవునితో మనకున్న
సంబంధంలోనే ఉంది. అందుకే దేవుడే మనకు
ఆశ్రయం, బలం అని కీర్తనకారుడు చెబుతాడు. (కీర్తన 46)
ఆకస్మికంగా
ప్రభువు రోజు వస్తుంది అని పునీత పౌలు చెబుతున్నపుడు, అతడు ప్రజలను భయంతో
ఉండమని చెప్పడం లేదు. మన నిజ స్థితిని తెలియ జేస్తున్నాడు. అది ఏమిటంటె మనము వెలుగు
పుత్రులం. మీరు చీకటిలో లేరు, మీరందరూ వెలుగు సంతానం, అని ధైర్యం
చెబుతున్నాడు. ఇది మన గుర్తింపు మనము వెలుగు బిడ్డలం. జ్ఞానస్నానం రోజున ప్రభువు
మనలను చీకటి నుండి తన అద్భుతమైన వెలుగులోకి పిలిచాడు. మనం ఎవరమో తెలిస్తేనే ఎలా
జీవించాలో తెలుస్తుంది. మనము వెలుగు పుత్రులుగా, పుత్రికలుగా జీవించాలి. ప్రభువు దినం భయంకరమైన దాడి కాదు, ఎదురుచూస్తున్న
రోజు. అందుకే పునీత పౌలు, ఇతరులవలె నిద్రపోక మెలకువగా, నిగ్రహంతో
ఉందామని పిలుపునిస్తున్నాడు. రోమీయులకు రాసిన లేఖలోనూ ఆయన, నిద్ర నుండి
మేల్కొనవలసిన సమయం వచ్చిందని గుర్తుచేస్తాడు (రోమీయులు 13).
ఏమిటి ఈ నిద్ర
ఈ "నిద్ర" శారీరక నిద్ర కాదు, ఆధ్యాత్మిక నిర్లక్ష్యం. "ఇంకా సమయం ఉందిలే" అని వాయిదా వేసే మనస్తత్వం, చల్లారిపోయిన ప్రార్థన జీవితం. పాపం పట్ల తగ్గిపోయిన సున్నితత్వం, పక్కవాడి బాధ మనసును తాకకపోవడం. "మత్తు" అంటే లోకపు ఆకర్షణల్లో మునిగి అసలు గమ్యాన్ని మరచిపోవడం. అంతులేని వినోదాలు, మన హృదయాలను మత్తెక్కించగలవు. అవి తప్పు అని కాదు. కానీ అవి మనలను ప్రార్థన నుండి, కుటుంబం నుండి, పేదల నుండి దూరం చేస్తే, అప్పుడు మనం ఇంకా నిద్రలోనే ఉంటాము. గమ్యం లేకుండా జీవిస్తాము.
వరహాల
ఉపమానం (ఫలితం ఏమిటి?)
మెలకువగా ఉండటం అంటే రోజంతా ఆకాశం వైపు చూస్తూ
కూర్చోవడమా? కాదని సువార్త చెబుతుంది. మెలకువ అంటే యజమాని
తిరిగి వచ్చే వరకు ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా చేయడం.
యజమాని దూర ప్రయాణానికి బయలుదేరుతూ తన ఆస్తిని
దాసులకు అప్పగించాడు. ఒకరికి ఐదు లక్షల వరహాలు, ఒకరికి
రెండు లక్షల వరహాలు, ఒకరికి ఒక లక్ష వరహాలు ఎవరి
సామర్థ్యం ప్రకారం వారికి ఇస్తాడు. ఒక లక్ష వరహాలు లేక తలాంతు అంటే సుమారు ఇరవై ఏళ్ళ కూలి, కాబట్టి
ఒక్క తలాంతు పొందినవాడిపై కూడా యజమాని గొప్ప నమ్మకం ఉంచాడు. ఇక్కడ మూడు సత్యాలను
గమనించాలి. మొదటిది, ఆస్తి యజమానికి చెందినది. మన
జీవితం, ఆరోగ్యం, సమయం, ప్రతిభలు
దేవుడు మనకు అప్పగించినవి. మనం యజమానులం కాదు, నిర్వాహకులం.
పునీత పౌలు చెప్పినట్లు, నిర్వాహకులకు
చేయవలసినది నమ్మకముగా చేయడమే. (1 కొరింథీయులు 4). పేతురు కూడా, ప్రతి
ఒక్కరూ తాము పొందిన వరాన్ని ఇతరుల సేవకు వాడాలని బోధిస్తాడు (1 పేతురు 4). రెండవది, దేవుడు
అందరికీ వారి సామర్థ్యము బట్టి తన అనుగ్రహాలను
ఇస్తాడు. కాబట్టి ఇతరులతో పోల్చుకుని కుంగిపోవాల్సిన పని లేదు. మూడవది, యజమాని
దూరంగా వెళ్ళాడు. ఎవరూ చూడని సమయంలోనే మన నమ్మకం పరీక్షకు నిలుస్తుంది. ఈ సమయంలోనే
మన మీద దేవుడు పెట్టిన నమ్మకాన్ని నిరూపించాలి.
ఐదు, రెండు లక్షల వరహాలు పొందినవారు వెంటనే వెళ్లి వ్యాపారం చేసి
రెట్టింపు చేశారు. ఇద్దరికీ యజమాని చెప్పిన మాట ఒక్కటే, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు. స్వల్ప విషయములయందు శ్రద్ద
వహించితివి, కనుక అనేక
విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో నీవు పాలుపంచుకొనుము. దేవుడు ఫలితం పరిమాణాన్ని చూడటం
లేదు, విశ్వాసనీయతను చూస్తున్నాడు. చిన్న
విషయంలో నమ్మకంగా ఉన్నవాడు పెద్ద విషయంలోనూ నమ్మకంగా ఉంటాడని ప్రభువే చెప్పాడు
(లూకా 16). వారికి లభించిన బహుమతి డబ్బు కాదు, యజమాని
సంతోషంలో పాలుపంచుకోవడం, అంటే దేవునితో ఆనందకరమైన
సహవాసం. దేవునితో సహవాసం మనము ఎలా పొందగలమో ఈ ఉపమానం మనకు
బోధిస్తుంది.
మూడవ సేవకుని జీవితం దీనికి భిన్నముగా ఉంది. అతను
దొంగిలించలేదు, వృథా చేయలేదు, భూమిలో
భద్రంగా దాచాడు. అయినా యజమాని అతన్ని "దుష్ట సేవకా! సోమరి " అంటున్నాడు.
అతడు పాపం ఏమీ చేయకపోవడం. చెడు చేయకపోవడమే
క్రైస్తవ జీవితం కాదు. మేలైనది చేయనెరిగి అట్లు
చేయనివాడు పాపము చేసినవాడగును అని యాకోబు రాశాడు (యాకోబు 4). యజమాని
గురించి మూడవ సేవకుడు తప్పుడు దృక్పధం కలిగి ఉన్నాడు. "నీవు
కఠినుడవని నాకు తెలుసు" అన్నాడు. కఠినుడని నమ్మాడు కాబట్టి భయపడ్డాడు, భయపడ్డాడు
కాబట్టి ఏమి చేయకుండ ఉన్నాడు. దేవుణ్ణి లెక్కల న్యాయాధిపతిగా మాత్రమే చూసేవాడు
ధైర్యంగా ప్రేమించలేడు, సేవ చేయలేడు. ఇది దేవుని అర్ధం
చేసుకొనుటలోని లోపం. నీవు అనుకున్నది కాదు దేవుని మనస్సు.
ఇక్కడ మూడు పఠనాలు కలిసిపోవడం చూడండి. సామెతల
స్త్రీ "భయభక్తులు" గలది, మూడవ దాసుడు
"భయపడ్డాడు". ఇద్దరి ఫలితం ఎంత వ్యత్యాసము కలిగిఉన్నవి. ఒక భయం దేవుని
ప్రేమను, గొప్పతనాన్ని గుర్తించి ధైర్యంగా పని
చేయిస్తుంది. మరొక భయం "తప్పు చేస్తానేమో" అని ముడుచుకుపోయేలా
చేస్తుంది. యోహాను చెప్పినట్లు, ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన
ప్రేమ భయాన్ని తీసివేస్తుంది. (1 యోహాను 4). దేవుడు
ప్రేమగల తండ్రి అని తెలుసుకున్నప్పుడు మనం భయాన్ని వదిలి సేవలోకి అడుగుపెడతాం.
"ఉన్న ప్రతివానికి ఇంకను ఇవ్వబడును" అనే మాట కఠినంగా వినిపించవచ్చు. కానీ ఇది ఆధ్యాత్మిక సూత్రం, యేసు ప్రభువు ఇదే మాటను మత్తయి 13వ అధ్యాయంలోనూ చెప్పాడు. దేవుడు మనకు ఇచ్చిన వరాలను వాడితే అవి ఇంకా పెరుగుతాయి, వాడకపోతే క్షీణిస్తాయి. ప్రార్థించేవారికి ప్రార్థన సులభమవుతుంది, ప్రేమించేవారి హృదయం విశాలమవుతుంది. సాధన మానేసిన సంగీతకారుని నైపుణ్యం మసకబారినట్లే, విశ్వాసమూ వాడకపోతే చల్లారిపోతుంది. చివరికి వినిపించే "వెలుపటి చీకటి" పునీత పౌలు చెప్పిన చీకటికి ప్రతిధ్వని. దేవుని అనుగ్రహాలను దాచేవారు తమను తామే వెలుగు నుండి దూరంగా వెళ్లిపోతారు.
మూడు పఠనాల సమన్వయం
ఈ మూడు పఠనాలను కలిపి చూస్తే సామెతల గ్రంధంలో ఆదర్శ
గృహిణి, ఎలా జీవించాలో చూపిస్తుంది. నమ్మకంగా, శ్రమతో, పేదల పట్ల
దయతో, దైవభక్తి అనే సుగుణాలు ఉండాలని చెబుతుంది. పునీత
పౌలు మనం వెలుగు సంతానం, కనుక ప్రభువు
దినం ఎప్పుడైనా రావచ్చు వెలుగు పుత్రులుగా జీవించూదాం అని పిలుస్తున్నాడు. ఈ నాటి సువిశేషం
ఆ గొప్ప జీవితం జీవించిన వారికి ఫలితాన్ని ప్రకటిస్తుంది. ఆ ఫలితం ఏమిటంటె, నమ్మకంగా పనిచేసినవారు యజమాని
ఆనందంలో పాలుపంచుకుంటారు.
ఈ వారం ఆచరణ
మొదట మనకు దేవుడు ఇచ్చిన దానిని గుర్తించాలి. "నాకు
ఏ ప్రతిభా లేదు" అనుకోవద్దు. వినే చెవి, ఓర్పు, వంట చేసే
చేయి, ప్రార్థించే హృదయం, కొంచెం సమయం, కొంచెం సంపద, ఇవన్నీ దేవుని
అనుగ్రహాలే, ఒకే ఆత్మ ఇచ్చిన వరాలే (1 కొరింథీయులు
12). మనం ఏ వరాన్ని
భూమిలో దాచామో ఆలోచిద్దాం. గాయక బృందంలో
చేరడానికి సంకోచమా? కుటుంబ ప్రార్థన
మొదలుపెట్టలేకపోవడమా? ఒంటరి వృద్ధుణ్ణి
పలకరించకపోవడమా? ఒక చిన్న అడుగు ఎంచుకుందాం.
అలాగే దేవుని గురించి మన అభిప్రాయాన్ని సరిచేసుకుందాం. ఆయన కఠినుడు కాదు, మనం తడబడినా
మన ప్రతి ప్రయత్నాన్ని గౌరవించే ప్రేమగల
తండ్రి.
ఈ ఆదివారమే పేదలకు చేయి చాపుదాం. అది డబ్బు కావచ్చు, సమయం కావచ్చు, భోజనం కావచ్చు, ఒక పలకరింపు కావచ్చు. "అత్యల్పులలో ఏ ఒక్కనికి మీరు ఇవి చేసిన అవి నాకే చేసితిరి" అని ప్రభువు ఇదే అధ్యాయంలో చెప్పాడు (మత్తయి 25:40). కనుక మెలకువను అలవాటు చేసుకుందాం. ఉదయం ప్రార్థన, రాత్రి ఆత్మపరిశీలన, ఆదివారం భక్తితో దివ్యబలిపూజలో పాల్గొనడం, అవసరమైతే పాపసంకీర్తన దివ్య సంస్కారం చేకొనటం. చివరిగా చిన్న విషయాలలో నమ్మకంగా ఉందాం.
ముగింపు
ప్రియ సహోదరీ సహోదరులారా, ఒకరోజు మన
జీవిత ప్రయాణం ముగుస్తుంది. ఆ రోజు మనం సంపాదించిన డబ్బు, కట్టిన
ఇళ్ళు, పొందిన పదవులు మనతో రావు. కానీ మనం ప్రేమించిన
వ్యక్తులు, చేసిన మంచి పనులు, పంచిన కరుణ, దేవునిపై
నిలిపిన విశ్వాసం మనతో ఉంటాయి. వారి క్రియలు వారిని వెంబడిస్తాయని దర్శన గ్రంథం
చెబుతోంది (ప్రకటన 14). ఆ రోజు ప్రభువు "నువ్వు
ఎంత గొప్పవాడివయ్యావు?" అని అడగడు. "నేను నీకు
అప్పగించినదానిని ఎంత నమ్మకంగా వాడావు?" అని అడుగుతాడు. మన మంచి
పనులను చూసి ప్రజలు పరలోక తండ్రిని స్తుతించాలని యేసు ప్రభువు కోరాడు (మత్తయి 5). మన జవాబు
సామెతల స్త్రీ వలె మన పనుల ద్వారా వినిపించాలి.
ప్రార్థన
ప్రభువా, నీవు మాకు అప్పగించిన జీవితాన్ని, వరాలను భయంతో దాచుకోకుండా, నీ ప్రేమను నమ్మి ధైర్యంగా ఫలింపజేసే కృపను ఇవ్వుము. వెలుగు సంతానంగా ఆధ్యాత్మిక నిద్ర నుండి మేల్కొని, మా చేతులను శ్రమలో నిమగ్నం చేసి, పేదల కోసం తెరిచి ఉంచే హృదయాన్ని దయచేయము. మా జీవిత చరమాంకంలో " మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు. స్వల్ప విషయములయందు శ్రద్ద వహించితివి, నీ యజమానుని ఆనందములో నీవు పాలుపంచుకొనుము. " అనే మధుర వాక్కును వినే భాగ్యాన్ని మాకు ప్రసాదించుము. ఆమెన్

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి