బలాము ప్రవక్త: దేవుని మాట పలికినా నశించిన వ్యక్తి కథ

 


బలాము ప్రవక్త: బైబిల్‌లో ఒక విచిత్రమైన, హెచ్చరికగల కథ

పరిచయం

పవిత్ర గ్రంధంలోని వ్యక్తులలో బలాము కథ అత్యంత విచిత్రమైనది. ఇస్రాయేలీయుడు కాని ఒక వ్యక్తి దేవుని స్వరాన్ని వింటాడు. దేవుని పేరు ఉచ్చరిస్తాడు. ఇస్రాయేలు గురించి అద్భుతమైన ప్రవచనాలు పలుకుతాడు. అయినా చివరికి అతని పేరు హెచ్చరికగా మిగిలిపోతుంది. క్రొత్త నిబంధనలో అనేక సార్లు ఆయన పేరు  ప్రస్తావించబడింది. ఒక్క మనిషిలో ఇన్ని విరుద్ధమైన అంశాలు ఎలా ఉండగలవు? ఆయన నిజంగా దేవుని ప్రవక్తా, లేక ధనాశతో ప్రవచనాన్ని అమ్ముకున్న భవిష్యవాణి చేప్పేవాడా? ఈ ప్రశ్నలకు సమాధానం వెదకడానికి బలాము కథను పరిశీలిద్దాం. 

 బలాము ఎవరు?

పేరు, వంశం, నివాసం

సంఖ్యాకాండం 22:5 ప్రకారం బలాము బెయోరు కుమారుడు. అతని స్వస్థలం "యూఫ్రటీసు నదీ తీరంలోని పెతోరు." ద్వితీయోపదేశకాండం 23:4 కూడా "మెసపొటమియాలోని పెతోరు" అని చెబుతుంది. అంటే అతడు ఇస్రాయేలు ప్రజలు నివసిస్తున్న ప్రాంతానికి చాలా దూరంలో ఉన్నవాడు, వందల కిలోమీటర్ల అవతల నుండి వచ్చినవాడు. అతడు అబ్రాహాము వంశంలోని ఇస్రాయేలు గోత్రాలకు చెందినవాడు కాదు. ఒక అన్యదేశీయుడు.

"బలాము" అనే పేరుకు వివిధ అర్థాలు చెబుతారు. కొందరు "ప్రజలను మింగివేసేవాడు" అనే భావంతో అనువదిస్తారు. మరికొందరు "ప్రజల ప్రభువు" అని అంటారు. ప్రజలపై శాపాన్ని లేదా ఆశీర్వాదాన్ని పలికే శక్తి అతనికి ఉందని ఆనాటి ప్రజలు నమ్మిన వ్యక్తి అతడు.

ఆయన పాత్ర ఏమిటి?

బలాము ఒక ఆధ్యాత్మిక సలహాదారుడు, సోదె చెప్పేవాడు. ఆనాటి మెసపొటమియా సంస్కృతిలో ఇలాంటి వ్యక్తులు రాజుల వద్ద ప్రాముఖ్యత పొందేవారు. యుద్ధానికి వెళ్లే ముందు శాపాలు పలికి, శత్రువులను బలహీనపరచడం వారి పని. సంఖ్యాకాండం 22:6లో బాలాకు రాజు "నీవు ఆశీర్వదించిన వాడు ఆశీర్వదింపబడును; నీవు శపించినవాడు శపింపబడును అని నేనెరుగుదును"  అని చెబుతాడు. అంటే బలాము అప్పటికే ప్రఖ్యాతి గాంచినవాడు.

అయితే బలాము కథలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,  అతడు దేవుని ప్రజలకు చెందిన వాడు, అయినప్పటికీ దేవుని  పేరును ఉపయోగిస్తాడు. "నా దేవుడైన ప్రభువు" అని అంటాడు (22:18). దేవుడు అతనితో మాట్లాడతాడు. కానీ అతని హృదయం పూర్తిగా దేవునికి అంకితమైనదని పవిత్ర గ్రంధం చెప్పదు. అతని అంతరంగ స్థితి గురించి పవిత్ర గ్రంధం అనేక చోట్ల హెచ్చరిస్తుంది.

బైబుల్‌లో బలాము  ప్రస్తావనలు

బలాము సంఖ్యాకాండం 22-24 అధ్యాయాలలో ఎక్కువగా కనిపిస్తాడు. ఆ తర్వాత ఇతర గ్రంథాల్లోఅతని గురించిన ప్రస్తావనలు ఇలా ఉన్నాయి:

  • సంఖ్యాకాండం 25:1-3, 31:8, 31:16: పెయోరు సంఘటనలో, మిద్యానీయుల ద్వారా ఇస్రాయేలును పాపంలోకి నడిపించడంలో అతని పాత్ర ఉంది.
  • ద్వితీయోపదేశకాండం 23:4-5: మోవాబీయులు ఇస్రాయేలును శపించడానికి బలామును కూలికి పిలిచారు, కానీ దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు.
  • యెహోషువ 13:22, 24:9-10: బలాము ఖడ్గంతో చంపబడ్డాడు; దేవుడు అతనికి చెవియొగ్గలేదు.
  • మీకా 6:5: బాలాకు చేసిన ఆలోచన, బెయోరు కుమారుడు బలాము ఇచ్చిన జవాబు గుర్తుచేసుకోమని ప్రవక్త అడుగుతాడు.
  • నెహెమ్యా 13:2: ఇస్రాయేలును శపించడానికి కూలికి పిలిచిన సంఘటన.
  • 2పేతురు 2:15-16: బలాము మార్గాన్ని అనుసరించడం, దుర్మార్గపు కూలిని ప్రేమించడం.
  • యూదా 11: బలాము కూలి  కోసం తప్పులో పరుగెత్తడం.
  • ప్రకటన 2:14: పెర్గమం సంఘానికి హెచ్చరిక; బలాము బోధను అనుసరించేవారు.

ఇన్ని చోట్ల ఒక అన్యదేశీయుని పేరు కనిపించడం అతని కథ ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది.

బలాము  ఏ కాలంలో జీవించాడు?

బలాము మోషే కాలంలో, ఇస్రాయేలీయులు ఈజిప్టు నుండి విడుదలై, ఎడారిలో నలభై సంవత్సరాలు సాగించిన ప్రయాణపు ముగింపు దశలో ఉన్నప్పుడు చూస్తాము. మోషే నాయకత్వంలో ప్రజలు వాగ్దత్త భూమి సరిహద్దుకు చేరుకున్నారు. కనాను భూమిలో  ప్రవేశించడానికి యోర్దాను నది ఒడ్డున, యెరికోకు ఎదురుగా, మోవాబు మైదానాల్లో శిబిరం వేసుకున్నారు (సంఖ్యా 22:1).

ఈ సమయంలో ఇస్రాయేలు ప్రజలు అప్పటికే అనేక యుద్ధాలు గెలిచారు. (సంఖ్యా 21). ఈ విజయాల వార్త వారి చుట్టుపక్కల రాజ్యాలకు భయం పుట్టించింది. మోవాబు రాజు బాలాకు ఇస్రాయేలీయుల సంఖ్యాబలాన్ని, వారి విజయాలను చూసి వణికిపోయాడు. "ఈ సమూహం ఎద్దు పొలంలోని గడ్డిని నాకినట్లు మన చుట్టూ ఉన్నదంతా నాకివేయును" అని అతడు మిద్యానీయుల పెద్దలతో చెప్పాడు.  (22:4).

ఈ కాలం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానం ఇక్కడ పరీక్షకు గురవుతోంది. ఆదికాండం 12:3లో దేవుడు అబ్రాహాముతో, నిన్ను దీవించువారిని నేను దీవింతును; నిన్ను శపించువానిని నేను శపింతును అని వాగ్ధానం చేస్తాడు. ఇప్పుడు అబ్రాహాము సంతతి శపించబడే ప్రమాదంలో ఉంది. కాబట్టి ఈ కథ కేవలం రెండు రాజ్యాల మధ్య జరిగిన రాజకీయ విషయం కాదు. ఇది దేవుని వాగ్దానం, మానవ శక్తుల మధ్య ఘర్షణను చూపుతుంది.

సంఖ్యాకాండం 22-24

 బాలాకు భయం, బలాముకు పిలుపు (22:1-14)

మోవాబు రాజు బాలాకు తన సైన్యంతో ఇస్రాయేలును ఓడించడం అసాధ్యమని గ్రహించాడు. కాబట్టి అతడు ఆధ్యాత్మిక ఆయుధాన్ని ఆశ్రయించాడు. అది ముందుగా ఇశ్రాయేలును శాపించి వారి శక్తి సన్నగిలేలా చేసి, అప్పుడు వారిని ఓడించాలని ప్రణాళికా చేసుకున్నాడు. బాలాకు బలాము దగ్గరకు రాయబారులను పంపాడు. మోవాబు, మిద్యాను పెద్దలు శకునం చెప్పే కూలిని చేతిలో పట్టుకొని బలాము వద్దకు వెళ్లారు. వారు బాలాకు సందేశాన్నిబలాముకు అందించారు, "ఇదిగో ఒక జనము ఐగుప్తు నుండి వచ్చియున్నది... వచ్చి వారిని నాకొరకు శపించుము. అప్పుడు నేను వారిని ఓడించి దేశములో నుండి తరిమివేయగలను" అని చెప్పాడు.

బలాము ఆ రాత్రి దూతలను తన ఇంటిలో నిద్రించమని చెప్పాడు. ఉదాయమునే "యావే నాతో చెప్పిన ప్రకారం మీకు ప్రత్యుత్తరం ఇస్తాను" అన్నాడు. ఇక్కడ బలాము   దేవుని సంప్రదించాడు.   అది సరియైనదే. 

దేవుడు రాత్రివేళ బలాముతో మాట్లాడాడు: "నీవు వారితో వెళ్లకూడదు. ఆ జనులను శపించకూడదు, ఎందుకంటే వారు ఆశీర్వదింపబడినవారు" అని దేవుని సందేశం వచ్చింది.  ఉదయాన్నే బలాము లేచి బాలాకు దూతలతో, "మీ దేశానికి తిరిగి వెళ్లండి, ఎందుకంటే మీతో రావడానికి యావే  నాకు అనుమతి ఇవ్వలేదు" అన్నాడు.

కథ ఇక్కడే ముగిసి ఉండవచ్చు. దేవుని సమాధానం స్పష్టంగా ఉంది: "వెళ్లవద్దు. వారు ఆశీర్వదింపబడినవారు." కానీ కథ కొనసాగుతుంది. ఎందుకంటే మానవ హృదయంలోని ఆశ మరొక దారి వెదుకుతుంది.

 రెండవ రాయబారం, లోభం (22:15-21)

బాలాకు తన ఆలోచనను వదిలిపెట్టలేదు. అతడు మునుపటికంటే కంటే  గొప్ప,  గౌరవప్రదమైన అధిపతులను పంపాడు. ఈసారి వాగ్దానాలు ఇంకా పెద్దవి ఇచ్చాడు: "నీవు కోరినది ఏదైనా చేస్తాను. నిన్ను బాగా గౌరవిస్తాను. వచ్చి ఈ జనులను శపించు" అని రాయబారం పంపాడు.  బలాము ఇప్పుడు ఒక ఆసక్తికరమైన జవాబు ఇచ్చాడు. బాలాకు తన ఇంటి నిండా వెండి బంగారాలు నాకు ఇచ్చినప్పటికీ, నా దేవుడైన ప్రభువు ఆజ్ఞను మీరి తక్కువ పనైనా ఎక్కువ పనైనా నేను చేయజాలనని అన్నాడు. 

ఇవి గొప్ప మాటలు. ధనం తనను కొనలేదని బలాము ప్రకటించాడు. కానీ వెంటనే  "ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండండి. దేవుడు నాకు ఇంకా ఏమి చెప్పునో తెలుసుకొనెదను" అని చెప్పాడు. 

దేవుడు ఒకసారి స్పష్టంగా చెప్పాడు. మళ్లీ అడగడం ఎందుకు? దేవుడు "వద్దు" అనే సమాధానం స్పష్టంగా ఉన్నప్పుడు, మళ్లీ అడిగేవారు తరచుగా తమ మనసులో ఇప్పటికే వేరే జవాబును కోరుకుంటున్నారు. బలాము హృదయంలో ఆశ ఉంది. అతడు వాగ్దానం చేసిన కీర్తిని, ధనాన్ని వదులుకోలేకపోయాడు. పైకి ధైర్యంగా మాట్లాడినా, లోపల అతని కోరిక వేరే దిశలో లాగుతోంది.

ఈ సందర్భంలోనే దేవుడు, "ఆ మనుష్యులు నిన్ను పిలిచుటకు వచ్చినయెడల వారితో వెళ్ళుము; అయినను నేను నీతో చెప్పినదానినే నీవు చేయవలెను" అని చెప్పాడు. కొందరు వ్యాఖ్యాతలు ఇది దేవుని అనుమతి కాదు, అతని మొండితనానికి ఇచ్చిన బదులు అని భావిస్తారు. దేవుడు కొన్నిసార్లు మనిషి ఇష్టానికి వదిలిపెడతాడు, వారు తమ స్వంత మార్గంలో నడుస్తూ దాని పర్యవసానాలను అనుభవించడానికి అలా చేస్తాడు. బలాము తనకు కావలసిన జవాబును పొందినట్టు భావించి ఉదయాన్నే లేచి గాడిదకు జీను వేసుకొని మోవాబు అధిపతులతో బయలుదేరాడు.

 గాడిద, దేవదూత (22:22-35)

కథలో అత్యంత ప్రసిద్ధమైన భాగం ఇది. బలాము గాడిదపై ప్రయాణిస్తున్నాడు, ఇద్దరు సేవకులు అతనితో ఉన్నారు. మార్గంలో దేవ దూత కత్తి దూసి దారిలో నిలబడ్డాడు. ఆ దూతను గాడిద చూసింది, బలాము చూడలేదు.

మొదటిసారి గాడిద దారి విడిచి పొలంలోకి వెళ్లింది. బలాము దానిని కొట్టి మళ్లీ దారిలోకి తెచ్చాడు. రెండవసారి ద్రాక్షతోటల మధ్య ఇరుకు దారిలో ఇరుపక్కలా గోడలు ఉన్నాయి. అక్కడ దూత మళ్లీ నిలబడ్డాడు. గాడిద గోడకు ఒత్తుకొని బలాము కాలును నలిపింది. అతడు మళ్లీ కొట్టాడు. మూడవసారి దారి ఇంకా ఇరుకైన చోట ఎడమకు కుడికి తిరగడానికి వీలులేని చోట దేవదూత నిలబడ్డాడు. గాడిద కింద కూలబడింది. కోపంతో బలాము కర్రతో దానిని కొట్టాడు.

అప్పుడు దేవుడు  గాడిద నోరు తెరిచాడు. అది బలాముతో, "నేను నిన్ను ఏమి చేశాను? ఇప్పటికి మూడుసార్లు నన్ను ఎందుకు కొట్టావు?" ఇన్నాళ్ళు నీకు సేవచేసితిని కదా అని అడిగింది.  బలాము కోపంలో ఉన్నాడు, గాడిద మాట్లాడినందుకు ఆశ్చర్యపడకుండా అతడు దానితో వాదించాడు, "నీవు నన్ను ఎగతాళి చేశావు. నా చేతిలో కత్తి ఉంటే ఇప్పుడే నిన్ను చంపేవాడిని"  అని గాడిదతోటి మాటలాడుతున్నాడు. అప్పుడు గాడిద, నీవు చిరకాలంగా ఎక్కుతున్న గాడిదను నేను కాదా? నేను ఎప్పుడైనా ఇలా  ప్రవర్తించానా?" అని అడిగింది.  "లేదు" అని  బలాము సమాధానం చెప్పాడు.

అప్పుడే దేవుడు బలాము కళ్లు తెరిచాడు. దేవ దూత కత్తి దూసి నిలబడి ఉన్నాడు. బలాము దేవదూత ముందు సాష్టాంగపడ్డాడు. అపుడు దూత  "నీవు మూడుసార్లు నీ గాడిదను ఎందుకు కొట్టావు? నీ మార్గం నాకు వ్యతిరేకంగా ఉన్నది గనుక నేను నిన్ను ఎదిరించడానికి బయలుదేరాను. గాడిద నన్ను చూసి మూడుసార్లు తొలగిపోయింది. అది తొలగి ఉండకపోతే నేను నిన్ను చంపి దానిని బ్రతికించి ఉండేవాడిని" అని చెప్పింది. 

ఈ దృశ్యంలో వ్యంగ్యం ఉంది. "దర్శనాలు చూసేవాడు" అని పేరుపొందిన బలాము దేవదూతను చూడలేకపోయాడు. గాడిద చూసింది. ప్రవక్త గుడ్డివాడు, జంతువు చూడ గలిగింది. ఇది ఆధ్యాత్మిక అంధత్వం గురించి ఒక సూచన. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ప్రముఖుడిగా కనబడినా, అతని హృదయం దేవుని మార్గం నుండి తొలగినప్పుడు అతడు స్పష్టంగా చూడలేడు. లోభం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది.

బలాము, "నేను పాపం చేశాను. నీవు నాకు ఎదురుగా దారిలో నిలిచావని నాకు తెలియదు. ఇది నీకు ఇష్టం లేకపోతే నేను తిరిగి వెళ్తాను" అని దేవదూతతో చెప్పాడు. అపుడు దూత, "ఈ మనుష్యులతో వెళ్లు, కానీ నేను నీతో చెప్పే మాటనే మాట్లాడాలి" అని హెచ్చరించాడు.  దాని తరువాత బలాము వెళ్లాడు.

 మొదటి ప్రవచనం (22:36-23:12)

బలాము వచ్చాడని విని బాలాకు అతన్ని ఆహ్వానించడానికి సరిహద్దు వరకు వచ్చాడు. బలాముతో నేను నిన్ను  గొప్పగా సన్మానిస్తానని చెప్పాడు, మొదటి సారే ఎందుకు రాలేదు అని వాపోయాడు.  దానికి బలాము, ఇప్పుడు నేను వచ్చాను. కానీ నేను ఏమైనా చెప్పగలనా? దేవుడు నా నోట ఉంచే మాటనే నేను పలుకుతాను, అని బదులు పలికాడు. 

బాలాకు బలామును  మరుసటి రోజు బామోతు-బాలుకు తీసుకెళ్లాడు. అక్కడినుండి ఇస్రాయేలు శిబిరంలో కొంత భాగాన్ని చూడవచ్చు. బలాము ఏడు బలిపీఠాలు కట్టించమని, ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చేయమని కోరాడు. ఇది ఆనాటి మతాచారం. ఏడు సంఖ్య పరిపూర్ణతకు చిహ్నం. బలులు అర్పించిన తర్వాత బలాము ఒక ఎత్తైన స్థలంలో ఒంటరిగా వేచి ఉన్నాడు. దేవుడు ఒక మాట అతని నోట ఉంచాడు.

బలాము తిరిగి వచ్చి తన మొదటి ప్రవచనాన్ని పలికాడు (23:7-10). ఆ ప్రవచన సారాంశం, "బాలాకు నన్ను మెసపొటమియా నుండి పిలిపించాడు. నా కోసం యాకోబును శపించు, ఇస్రాయేలును నిందించు అన్నాడు. కానీ దేవుడు శపించనివాడిని నేను ఎలా శపించగలను? దేవుడు నిందించనివాడిని నేను ఎలా నిందించగలను? ఈ జనం ఒంటరిగా నివసిస్తారు, ఇతర జనములలో లెక్కింపబడరు. యాకోబు ధూళిని ఎవరు లెక్కించగలరు? ఇస్రాయేలు ధూళిలో నాలుగవ వంతును ఎవరు లెక్కించగలరు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కలుగునుగాక."

ఈ మాటలు విని బాలాకు కోపంతో ఊగిపోయాడు. "నన్నేం చేశావు? నా శత్రువులను శపించడానికి నిన్ను పిలిపించాను, నీవు వారిని ఆశీర్వదించావు"  అన్నాడు. బలాము, దేవుడు  నా నోట ఉంచిన మాటను పలకడం నాకు తప్పనిసరి కాదా? అని చెప్పాడు. 

 రెండవ ప్రవచనం (23:13-26)

బాలాకు పట్టు విడవక మరో ప్రయత్నం చేశాడు. అతడు బలామును వేరే స్థలానికి, సోఫీము పొలానికి, పిస్గా శిఖరానికి తీసుకెళ్లాడు. ఇక్కడినుండి ఇస్రాయేలు శిబిరంలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. బహుశా తక్కువ సంఖ్యను చూస్తే శాపించడం సులభమవుతుందని అతడు భావించి ఉండవచ్చు. మళ్లీ ఏడు బలిపీఠాలు నిర్మించారు, ఏడు ఎద్దులు, ఏడు పొట్టేళ్లు బలిగా అర్పించారు. 

ఈసారి బలాము ప్రవచనం మరింత బలంగా ఉంది (23:18-24), అతడు, దేవుడు అబద్ధమాడడానికి మనిషి కాదు, మనసు మార్చుకోవడానికి మనుష్య కుమారుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? వారిని ఆశీర్వదించమని నాకు ఆజ్ఞ వచ్చింది. ఆయన ఆశీర్వదించాడు, నేను దానిని మార్చలేను. యాకోబులో దుష్టత్వం కనబడలేదు, ఇస్రాయేలులో దుర్మార్గం కనబడలేదు. వారి దేవుడైన యావే  వారితో ఉన్నాడు,  జయధ్వని వారి మధ్య ఉంది. దేవుడు వారిని ఐగుప్తు నుండి తీసుకువచ్చాడు, వారికి అడవి ఎద్దులాంటి బలం ఉంది. యాకోబుకు వ్యతిరేకంగా శకునం లేదు, ఇస్రాయేలుకు వ్యతిరేకంగా సోదె లేదు. వారి మీద ఏ మాత్రం పారదు. ఆ జనం సింహం వలె లేస్తారు, తాము  వేటాడిన దానిని తిని రక్తం త్రాగే వరకు పడుకోరు, అనే మాటలతో ముగించాడు. 

ఈ ప్రవచనంలో ఒక గొప్ప సత్యం ఉంది. అది దేవుడు తన వాగ్దానాన్ని మార్చడు. దేవుడు అబద్ధమాడడానికి మనిషి కాదు. మనుష్యులు మాట ఇచ్చి మార్చుకుంటారు, కానీ దేవుడు అలా చేయడు.  వారు, ఇస్రాయేలు యొక్క విశ్వాసనియత వల్ల కాదు, దేవుని విశ్వాసనియత వల్ల వారు ఆశీర్వదింపబడ్డారు.

బాలాకు నిరాశతో, "నీవు వారిని శపించకపోయిన పరలేదు,  వారిని ఆశీర్వదించ వద్దు అని చెప్పాడు. " బలాము మరల  "యావే  చెప్పినదంతా నేను చేయాలి అని నీకు చెప్పలేదా?" అని చెప్పాడు. 

 మూడవ ప్రవచనం (23:27-24:14)

ఇంకా ఆశ చావని బాలాకు మూడవసారి ప్రయత్నించాడు. ఈసారి పెయోరు శిఖరానికి, ఎడారి వైపు చూసే ప్రదేశానికి తీసుకెళ్లాడు. మళ్లీ ఏడు బలిపీఠాలు కట్టి,  ఏడు ఎద్దులు, ఏడు పొట్టేళ్లు బలి ఇచ్చారు. ఈసారి బలాము ఒక మార్పు చేశాడు. మునుపటి రెండు సార్లు అతడు శకునాలు వెదకడానికి వెళ్లాడు, ఇప్పుడు వెళ్లలేదు. అతడు ఎడారి వైపు చూశాడు, గోత్రాల ప్రకారం ఇస్రాయేలు శిబిరాలు వరుసగా ఉండటం చూశాడు. అప్పుడు దేవుని ఆత్మ అతనిపై వచ్చింది.

మూడవ ప్రవచనంలో  (24:3-9)బెయోరు కుమారుడు బలాము పలుకుచున్నాడు, కన్నులు తెరువబడినవాడు పలుకుచున్నాడు, దేవుని మాటలు వినువాడు, సర్వశక్తుని దర్శనం చూచువాడు, సాష్టాంగపడి కన్నులు తెరిచినవాడు పలుకుచున్నాడు అంటూ ప్రవచనం చెప్పాడు. యాకోబూ, నీ గుడారాలు ఎంత రమణీయం! ఇస్రాయేలూ, నీ నివాసాలు ఎంత సుందరం! లోయల్లా విస్తరించి, నది ఒడ్డున తోటల్లా, యావే  నాటిన అగరు చెట్లలా, నీటి పక్కన దేవదారు వృక్షాల్లా ఉన్నాయి... నిన్ను దీవించేవారు దీవింపబడుదురు, నిన్ను శపించేవారు శపింపబడుదురు అని ఈ ప్రవచన సారంశం. 

ఇక్కడ బలాము అబ్రాహాముకు ఇచ్చిన దేవుని వాగ్దానంను  (ఆది 12:3)  ప్రతిధ్వనించాడు. అంటే బాలాకు శాపం పలకమని తెచ్చిన బలాము చివరికి ఇస్రాయేలుపై దేవుని ఆశీర్వాదాన్ని ప్రకటించాడు.

బాలాకు ఆగ్రహంతో చేతులు చరిచి, "నా శత్రువులను శపించడానికి నిన్ను పిలిచాను, నీవు ఈ మూడుసార్లు వారిని ఆశీర్వదించావు. ఇప్పుడు నీ స్థలానికి వెళ్లిపో. నిన్ను గొప్పగా సన్మానించాలని అనుకున్నాను, కానీ దేవుడు  నిన్ను సన్మానం నుండి ఆపాడు అన్నాడు.  అందుకు బలాము, బాలాకు తన ఇంటి నిండా వెండి బంగారాలు నాకిచ్చినా యావే  మాటను మీరి మంచిని గాని చెడును గాని నా ఇష్టప్రకారం చెప్పలేనని నీ దూతలతో చెప్పలేదా? అని చెప్పాడు. 

 నాలుగవ ప్రవచనం: యాకోబునుండి నక్షత్రం (24:15-25)

వెళ్లే ముందు బలాము బాలాకుకు చివరిగా ఒక హెచ్చరిక చేశాడు, "రాబోవు దినాలలో ఈ జనం నీ జనానికి ఏమి చేస్తుందో నేను చెబుతాను అంటూ, ప్రవచనం చెప్పాడు. ఇది నాలుగవ ప్రవచనం (24:15-19), ఇందులో అత్యంత ప్రసిద్ధమైన మాటలు ఉన్నాయి. 

 యాకోబు నుండి ఒక నక్షత్రం ఉదయిస్తుంది, ఇస్రాయేలు నుండి రాజదండం లేస్తుంది. అది మోవాబు యొక్క నొసళ్లను నలగగొడుతుంది, షేతు సంతతి వారందరినీ కూల్చివేస్తుంది.

ఈ ప్రవచనాన్ని యూదయ, క్రైస్తవ సంప్రదాయాలు మెస్సీయా గురించిన ప్రవచనంగా చూశాయి. తక్షణ అర్థంలో ఇది దావీదు రాజు మోవాబును, ఎదోమును జయించడాన్ని సూచిస్తుంది. కానీ దాని పరిపూర్ణమైన అర్థంలో ఇది క్రీస్తును, యాకోబు వంశం నుండి ఉదయించే రాజును సూచిస్తుందని తిరుసభ సంప్రదాయం భావిస్తుంది. 

చాలామంది తిరుసభ పితరులు, మత్తయి 2లోని జ్ఞానుల  కథను బలాము నక్షత్ర ప్రవచనంతో ముడిపెడతారు. తూర్పు దేశపు జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూసి యూదుల రాజును వెదుక్కుంటూ వచ్చారు. బలాము కూడా తూర్పు దేశం (మెసపొతేమియా) నుండి వచ్చినవాడు. ఒక అన్యదేశీయుని ప్రవచనం శతాబ్దాల తర్వాత అన్యదేశీయులైన జ్ఞానులకు క్రీస్తు వద్దకు మార్గం చూపి ఉండవచ్చు అనే భావన చాలా అందమైనది. ఇది ఖచ్చితమైన బైబుల్ ప్రకటన కాదు, సంప్రదాయ వ్యాఖ్యానం మాత్రమే అని గుర్తుంచుకోవాలి.

తర్వాత బలాము అమాలేకు, కేననీయులు, అష్షూరు గురించి మరికొన్ని ప్రవచనాలు పలికాడు (24:20-24). చివరికి బలాము లేచి తన స్థలానికి తిరిగి వెళ్లాడు, బాలాకు కూడా తన దారిన వెళ్లాడు.  (24:25)

 కథ ముగింపా? ఆ తర్వాత ఏమైంది?

సంఖ్యాకాండం 24వ అధ్యాయంతో బలాము కథ ముగిసిందని చాలామంది అనుకుంటారు. కానీ పవిత్ర  మరింత చెబుతుంది, అది కలవరపెట్టే భాగం.

 పెయోరు సంఘటన (సంఖ్యా 25)

సంఖ్యా కాండం 25వ అధ్యాయం ప్రకారం ఇస్రాయేలీయులు షిత్తీములో ఉన్నప్పుడు మోవాబు స్త్రీలతో లైంగిక పాపంలో పడ్డారు. ఆ స్త్రీలు వారిని తమ దేవతల బలులకు ఆహ్వానించారు. ఇస్రాయేలు ప్రజలు పెయెరు బాలును  ఆరాధించారు. దేవునికి  ఇస్రాయేలు పై కోపం వచ్చింది. అపుడు ఒక రోగము వచ్చి ఇరవై నాలుగు వేలమంది చనిపోయారు. పీనెహాసు తీవ్రమైన చర్య తీసుకున్న తర్వాతే జాడ్యము  ఆగింది.

ఇదంతా బలాముతో ఎలా సంబంధం కలిగి ఉందో సంఖ్యా 25లో నేరుగా చెప్పలేదు. కానీ సంఖ్యా 31:16లో మోషే "బాలము దుర్బోధలకు లొంగి, నాడు పెయెరు వద్ద మన ప్రజలు ప్రభువును విడనాడునట్లు చేసినది ఈ స్త్రీలే కదా? నాడు ఇస్రాయేలు అరిష్టమునకు నాశనమగుటకు  ఆ సంఘటనమే కారణముగదా!" అని అంటాడు. బలాము సలహా వలన ఈ స్త్రీలు పెయోరు విషయంలో ఇస్రాయేలీయులను యావేకు ద్రోహం చేయునట్లు చేశారు. 

అంటే బలాము ఇస్రాయేలును నేరుగా శపించలేకపోయాడు కాని వారిని దేవుని నుండి వేరుచేయడానికి వేరే మార్గం చూపాడు. దేవుడు శపించనివారిని వారే పాపం ద్వారా తమపై శాపం తెచ్చుకునేలా చేయవచ్చు. ఇస్రాయేలు తమ విశ్వసనీయతను, వదిలిపెడితే దేవుని రక్షణ నుండి బయటపడతారు. ఈ దుష్ట ఉపాయం బలాము యొక్క నిజమైన స్వభావాన్ని బయటపెట్టింది. అతడు పలికిన ఆశీర్వాదాలు దేవుడు అతని నోట పలికించినవి. కానీ అతని స్వంత హృదయం కూలి కోసం పనిచేసింది. అతడు దేవుని ఆజ్ఞను మీరలేకపోయినా, బాలాకు ఇచ్చే బహుమానాన్ని పొందడానికి వేరే మార్గాన్ని వెదికాడు.

 బలాము మరణం (సంఖ్యా 31:8)

తర్వాత ఇస్రాయేలు మిద్యానీయులపై యుద్ధం చేసినప్పుడు, ఆ యుద్ధంలో మిద్యాను రాజులతో పాటు బెయోరు కుమారుడు బలామును కూడా ఖడ్గంతో చంపారు (31:8). యెహోషువ 13:22 అతడిని సోదె చెప్పేవాడైన బలాము అని పిలుస్తుంది. అంటే అతడు ప్రవక్తగా కాక సోదెగాడిగా గుర్తింపు పొందాడు. అతని మరణం గౌరవప్రదం కాదు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న వారి మధ్య, ఆ శత్రువులతో పాటు అతడు నశించాడు.

ఇది ఒక భయంకరమైన ముగింపు. నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కలుగునుగాక (సంఖ్యా 23:10) అని అతడు ఒకసారి పలికాడు. కానీ అతడు అలాంటి మరణం పొందలేదు. నీతిమంతుల మార్గాన్ని మెచ్చుకొని ఆ మార్గంలో నడవనివారు ఆ మార్గం యొక్క అంతాన్ని పొందరు.

 క్రొత్త నిబంధన బలామును ఎలా చూస్తుంది?

 2 పేతురు 2:15-16

పునీత పేతురు తప్పుడు బోధకుల గురించి హెచ్చరిస్తూ "వారు ఋజు మార్గమును విడిచి త్రోవ తప్పినవారు. బెయోరు కుమారుడైన బలాము మార్గమునే వారు అనుసరించినారు. ఆ బలాము దుష్కార్య సముపార్జితమగు ధనమునే మోహించెను.అందుచేతనే తన అతిక్రమణకు అతడు దండింపబడెను. ఏలయన, ఒక నోరులేని గాడిద మానవవాణితో మాట్లాడి, ఆ ప్రవక్త పిచ్చి చేష్టలను మాన్పెను"  అని చెబుతాడు. ఇక్కడ పేతురు బలాము పాపాన్ని ఒక్క మాటలో చెబుతున్నాడు. అతడు "దుష్కార్య సముపార్జితమగు ధనమునే మోహించెను," బాహ్యంగా అతడు దేవుని ఆజ్ఞను పాటించాడు, కానీ అంతరంగంలో ధనాన్ని ప్రేమించాడు.

 యూదా 11

యూదా పత్రికలో ఎంత అనర్ధము! వారు కయీను త్రోవను అనుసరించిరి. ధనకాంక్షచె బలాము వలె దోషములకు తమ్ము అర్పించుకొనిరి. కోరాహు వలె తిరుగబడుట వలన నాశనము చేయబడిరి.  ఇక్కడ బిలాము తప్పు, లాభం కోసం ఆధ్యాత్మికతను ఉపయోగించుకోవడం.

ప్రకటన 2:14

పెర్గమం సంఘాన్ని హెచ్చరిస్తూ, మీ పై నేను ఒనర్చు ఆరోపణలు ఇవి: బిలాము  అనుయాయులు కొందరు మీలో ఉన్నారు. బాలాకునకు అతడే బోధకుడుకదా! ఆ బాలాకు ఇశ్రాయేలు ప్రజలనుపాపాత్ములను చేసెను. ఆ ఇశ్రాయేలు ప్రజలు విగ్రహములకు అర్పింపబడిన ఆహారమునే భుజించుచు, జారత్వము చేయునట్లు అతడు చేసెను." ఇది బలాము చేసిన అసలు పని గురించి స్పష్టమైన సాక్ష్యం.  అతడు ఇస్రాయేలును పాపంలోకి నడిపించే ఉపాయాన్ని బోధించాడు.

అంటే క్రొత్త నిబంధనలో బిలాము మూడు విషయాలకు ప్రతీక, ధనాశ (2 పేతురు), లాభం కోసం ఆధ్యాత్మికతను వాడుకోవడం (యూదా), లోకంతో రాజీపడి విశ్వాసులను పాపంలోకి నడిపించడం (దర్శన ).

బలాము ఎలాంటి వ్యక్తి? సంక్లిష్టమైన పాత్ర

బిలాము గురించి అనేక వ్యాఖ్యాతలు వేర్వేరు అభిప్రాయాలు చెప్పారు. కొందరు అతడు ఎల్లప్పుడూ దుష్టుడని అంటారు. మరికొందరు అతడు మొదట నిజాయితీగా దేవుణ్ణి వెదికిన వ్యక్తి, కాని లోభం అతడిని పతనం చేసిందని అంటారు.

మంచి అంశాలు

  • అతడు దేవుని మాటను వినడానికి ప్రయత్నించాడు.
  • దేవుడు చెప్పిన మాటను మార్చకుండా పలికాడు.
  • అతని ప్రవచనాలు నిజమైనవి, లోతైనవి.
  • అతడు ధనం గురించి గొప్ప మాటలు పలికాడు.

దుష్ట అంశాలు

  • దేవుడు "వద్దు" అని చెప్పిన తర్వాత కూడా మళ్లీ అడిగాడు.
  • అతని హృదయంలో లోభం ఉంది.
  • అతడు శాపం పలకలేకపోయినా, ఇస్రాయేలును పాడుచేయడానికి వేరే ఉపాయం చెప్పాడు.
  • అతడు అంతమందికి శాపం కలిగించిన పెయోరు పాపంలో భాగస్వామి అయ్యాడు.

దేవుడు గాడిద నోటి ద్వారా కూడా మాట్లాడగలడు. అంటే దేవుడు ప్రవచనం చెప్పించడానికి వ్యక్తి యొక్క నైతిక స్థితిపై ఆధారపడడు. ఒక వ్యక్తి దేవుని మాటను పలికినంత మాత్రాన అతడు దేవునికి సన్నిహితుడని చెప్పలేం. ప్రవచనం వరం, కానీ వరం కలిగి ఉండటం పవిత్రతకు రుజువు కాదు. 

బలాము ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాలు

 దేవుడు  "వద్దు" అన్నదానిని మళ్లీ అడగవద్దు

దేవుడు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా బలాము మళ్లీ ప్రార్థన చేసి వేరే సమాధానం కోసం ఎదురుచూశాడు. చాలాసార్లు మనం కూడా అదే చేస్తాం. దేవుని చిత్తం మనకు స్పష్టంగా తెలిసినా మనకు కావలసినది వేరే అయినప్పుడు మళ్లీ మళ్లీ ప్రార్థిస్తాం, వేరే జవాబు కోసం. కొన్నిసార్లు దేవుడు మన మొండితనానికి వదులు ఇస్తాడు, కానీ ఆ మార్గం ఆయన ఆశీర్వాదం ఉన్న మార్గం కాదు. నిజమైన ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని మన చిత్తానికి అనుగుణంగా మార్చడం కాదు, మన చిత్తాన్ని ఆయన చిత్తానికి అప్పగించడం. యేసు గెత్సేమనేలో చెప్పినట్లు: "నా ఇష్టప్రకారం కాదు, నీ ఇష్టప్రకారమే జరుగును గాక."

  ధనాశ ఆధ్యాత్మిక అంధత్వాన్ని కలిగిస్తుంది

బలాము దేవదూతను చూడలేకపోయాడు, గాడిద చూసింది. లోభం మనిషి కళ్లను కప్పివేస్తుంది. అందుకే పునీత పౌలు,  "ధనాపేక్ష సమస్త కీడులకు మూలం" అని చెబుతున్నాడు. (1 తిమోతి 6:10). సంపద స్వతహాగా చెడ్డది కాదు, కానీ దానిపై అతిగా ఆశ పెట్టుకుంటే అది మన ఆధ్యాత్మిక దృష్టిని మసకబారుస్తుంది. పరిచర్య చేసేవారికి, ప్రత్యేకించి మతబోధకులకు, ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. సేవ చేయడం ఒక ఉద్యోగంగా, లాభసాటి వ్యాపారంగా మారకూడదు. యేసు ప్రభువు  తన శిష్యులను పంపేటప్పుడు, "ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వుడి" అని చెబుతున్నాడు.  (మత్తయి 10:8).

పైకి మాట్లాడే మాటలు, లోపలి హృదయం ఒకటే కావాలి

బలాము గొప్ప మాటలు పలికాడు, "ఇంటి నిండా వెండి బంగారం ఇచ్చినా నేను దేవుని ఆజ్ఞను మీరను" కానీ అతని ప్రవర్తన వేరుగా ఉంది.   విశ్వాసం మాటల్లో కాదు, జీవితంలో కనిపించాలి. మనం ఎలా మాట్లాడతామో కాదు, ఒత్తిడి వచ్చినప్పుడు, ఆకర్షణ ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజస్థితి. యేసు ప్రభువు  పరిసయ్యుల గురించి చెప్పిన మాటలు ఇక్కడ వర్తిస్తాయి, ఈ ప్రజలు పెదవులతో నన్ను గౌరవిస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. (మత్తయి 15:8).

 వరం ఉండటం పవిత్రతకు రుజువు కాదు

బలాము నిజమైన ప్రవచనాలు పలికాడు. అయినా అతడు నశించాడు. ఆధ్యాత్మిక వరాలు, ప్రతిభ, ప్రసంగ నైపుణ్యం, ప్రజల మెప్పు అనేవి మన దేవునితో ఉన్న సంబంధానికి కొలమానం కావు. అందుకే పునీత పౌలు, మానవ భాషలను, దేవదూతల భాషలను కూడ నేను మాటలాడగలిగిన నాకు ప్రేమలేనిచో ణా వాక్కు మ్రోగేడి కంచుతో, గణ గణలాడెడి తాలముతో సమానము అని చెబుతాడు.  (1 కొరింథీ 13:1). ఎవరైనా పరిచర్యలో గొప్ప ఫలితాలు చూపిస్తున్నారని వారి హృదయం సరిగ్గా ఉందని అనుకోకూడదు. అలాగే మనం కూడా మన పరిచర్య ఫలితాలను చూసి మనం సురక్షితులమని భావించకూడదు.

 దేవుని వాగ్దానాలు మానవ కుట్రల కన్నా బలమైనవి

బాలాకు, బలాము కలిసి ఇస్రాయేలును శపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.  మూడు వేర్వేరు స్థలాలు, ఇరవై ఒక్క బలులు, రాజ్య వనరులు. కాని ఇవ్వాలనుకున్న  శాపం  ఆశీర్వాదంగా మారింది. ఎందుకంటే దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం మార్పులేనిది. నెహెమ్యా 13:2 చెప్పినట్లు, దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. మన జీవితంలో కూడా మనకు తెలియని ఎన్నో కుట్రలు, ప్రమాదాల నుండి దేవుడు మనలను కాపాడుతున్నాడు. రోమీయులకు 8:31లో  పునీత పౌలు చెప్పినట్లు, దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు? ఉండ గలడు. 

 శత్రువు శపించలేనప్పుడు, పాపంలోకి ప్రలోభపెడతాడు

బలాము ఇస్రాయేలును శపించలేకపోయాడు, కాబట్టి అతడు వారిని పాపంలోకి ప్రలోభపెట్టే మార్గం చూపాడు. ఇది సాతాను పద్ధతి. అతడు మన విశ్వాసాన్ని నేరుగా నాశనం చేయలేకపోతే, మనల్ని క్రమంగా రాజీకి, లోక సుఖాలకు, అనైతికతకు ఆకర్షిస్తాడు. నిజమైన ప్రమాదం బయటి శాపం కాదు, లోపలి రాజీ. 

అందుకే విశ్వాసులు ప్రత్యేకంగా లైంగిక పవిత్రత, విగ్రహారాధన నుండి దూరంగా ఉండాలి. లోకంతో స్నేహం చేయడం, లోక ఆచారాలను విశ్వాసంలో కలపడం ఒక నెమ్మదిగా వ్యాపించే విషం.

 దేవుడు ఎవరినైనా ఉపయోగించగలడు, కానీ ఉపయోగించబడటం రక్షణ కాదు

దేవుడు గాడిద ద్వారా మాట్లాడాడు, అన్యదేశీయుడైన బలాము ద్వారా ప్రవచనం పలికించాడు. అయినా బలాము రక్షణ పొందలేదు. మనం దేవుని సేవలో ఉపయోగించబడుతున్నామని అంటే మనం ఆయనకు అంకితమై ఉన్నామని కాదు. ఒక పరికరం ఉపయోగపడవచ్చు, కానీ ఆ పరికరానికి ప్రేమ, సంబంధం ఉండదు. మనం దేవుని చేతిలో కేవలం పరికరాలుగా కాక, ఆయన బిడ్డలుగా ఉండాలి.

 ఎంత దగ్గరగా వచ్చినా, ఇంకా తప్పిపోవచ్చు

బలాము దేవుని స్వరాన్ని విన్నాడు, దేవదూతను చూశాడు, ప్రవచనాలు పలికాడు, ఆత్మ అతనిపై వచ్చింది. అయినా అతడు తన హృదయాన్ని మార్చుకోలేదు. ఇది మనకు  హెచ్చరిక. బిలాము ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి ఉన్నాడు, కానీ హృదయ పరివర్తన లేదు.

 దేవుని సమీపంలో ఉన్న విషయాలు, దూరంలో ఉన్న హృదయం

బలాము "నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కలుగునుగాక" అని కోరుకున్నాడు. కానీ నీతిమంతుల జీవితం గడపడానికి ఇష్టపడలేదు. చాలామంది స్వర్గాన్ని కోరుకుంటారు, కానీ పరిశుద్ధతను కోరరు. మంచి మరణం కావాలి, కానీ మంచి జీవితం వద్దు. నిజమైన భక్తి అంటే అంతిమ ఫలితాన్ని మాత్రమే కాక, ఆ ఫలితానికి దారితీసే మార్గాన్ని కూడా ప్రేమించడం.

ప్రవచన వరం, పవిత్రత వేర్వేరు. తిరుసభ బోధన ప్రకారం, ఆధ్యాత్మిక వరాలు (చారిజమ్స్) దేవుని స్వేచ్ఛాయుత బహుమతులు, అవి గ్రహీత పవిత్రతను హామీ ఇవ్వవు.  అందుకే మనం కూడా మన పరిచర్యల ఫలితాలను చూసి గర్వపడకుండా మన అంతరంగ పరివర్తనను నిరంతరం పరిశీలించుకోవాలి.

పునీత సిలువ  యోహాను సిలువగారి బోధ. ఆధ్యాత్మిక అనుభవాలకు, వరాలకు అతిగా అంటిపెట్టుకోని ఉండవద్దని హెచ్చరిస్తాడు. దేవుని వరాలను కాక, వరదాతను వెదకాలని ఆయన బోధిస్తాడు. బలాము వరాలను ఉపయోగించాడు, కానీ వరదాతతో జీవంగల సంబంధం కలిగి లేడు.

 సారాంశం

బిలాము బెయోరు కుమారుడు, యూఫ్రటీసు తీరంలోని పెతోరు నివాసి, సోదె చెప్పే అన్యదేశీయుడు. మోషే కాలంలో ఇస్రాయేలీయులు మోవాబు మైదానంలో ఉన్నప్పుడు, మోవాబు రాజు బాలాకు వారిని శపించమని అతన్ని పిలిచాడు. దేవుడు మొదట "వెళ్లవద్దు" అన్నాడు. బిలాము ఆశతో మళ్లీ అడిగాడు, చివరికి బయలుదేరాడు. ప్రయాణ మార్గంలో గాడిద దేవదూతను చూసింది, బిలాము చూడలేకపోయాడు. తర్వాత అతడు మూడుసార్లు శపించడానికి ప్రయత్నించాడు, కానీ దేవుడు ప్రతిసారీ అతని నోట ఆశీర్వాదాన్ని ఉంచాడు. నాలుగవ ప్రవచనంలో "యాకోబు నుండి నక్షత్రం ఉదయిస్తుంది" అనే మెస్సీయా ప్రవచనం పలికాడు. కానీ అతని కథ అక్కడ ముగియలేదు. అతడు ఇస్రాయేలును మోవాబు, మిద్యాను స్త్రీల ద్వారా పెయోరు పాపంలోకి నడిపించాడు, దాని ఫలితంగా ఇరవై నాలుగు వేలమంది చనిపోయారు. చివరికి మిద్యానీయులతో పాటు ఖడ్గంతో చంపబడ్డాడు.

క్రొత్త నిబంధన అతన్ని ధనాశకు, తప్పుడు బోధకు, లోకంతో రాజీకి చిహ్నంగా చూపిస్తుంది.

బలాము కథ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, దేవుని మాట వినడం, ఆయన పేరు పలకడం, ఆయన వరాలు కలిగి ఉండటం సరిపోదు. మన హృదయం ఆయనకు చెందాలి. దేవుడు తన ప్రజలను కాపాడతాడు, కానీ ప్రతి వ్యక్తి తన హృదయాన్ని కాపాడుకోవాలి.  (సామెతలు 4:23).

ప్రార్థన

ప్రభువా, నీ చిత్తాన్ని స్పష్టంగా తెలిసినప్పుడు, దాని నుండి తప్పించుకునే మార్గాలు వెదకకుండా, ఆనందంగా అనుసరించే కృపను మాకు దయచేయుము. ధనాశ, కీర్తి కాంక్ష మా కన్నులను కప్పివేయకుండా కాపాడుము. మా పెదవులపై ఉన్న మాటలు, మా హృదయంలోని ఆలోచనలు ఒకటిగా ఉండునట్లు చేయుము. శత్రువు మమ్మల్ని పాపానికి ప్రలోభపెట్టకుండా మమ్మల్ని కాపాడు. నీ వరాలను కాక, నిన్నే ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించు. నీతిమంతుల మరణం కోరుకోవడమే కాక, నీతిమంతుల జీవితం గడిపే శక్తిని మాకు ప్రసాదించు. ఆమెన్.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి