ప్రభువు దర్శన కాలమును గుర్తించుట – లూకా 19:41–44 ధ్యానము



 లూకా 19:41–44

యేసు యెరూషలేమును సమీపించి ఆ నగరమును చూచి ఇట్లు విలపించెను; “నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించియుండిన యెడల బాగుండెడిది. నీవు అటుల చేయలేకపోతివి. శత్రువులు నీ చుట్టు కందకములు త్రవ్వి, నిన్ను ముట్టడించి, అన్నివైపుల నిన్ను అరికట్టు కాలము వచ్చును. వారు నిన్ను, నీలో నివసించు ని సంతానమును మట్టిపాలు చేయుదురు. నీలో రాతి మీద రాయిని నిలువనీయరు. ఏలన, ప్రభువు నిన్ను దర్శింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు.”

యెరూషలేమును చూచి విలపించిన ప్రభువు

1. పరిచయము

సువార్తలలో యేసు ప్రభువు కన్నీరు కార్చిన సందర్భములు రెండు మాత్రమే కనబడతాయి. మొదటిది బేతనియాలో తన స్నేహితుడైన లాజరు సమాధి వద్ద (యోహాను 11:35). రెండవది, యెరూషలేము నగరమును చూచినప్పుడు. లాజరు విషయములో ఆయన ఒక వ్యక్తి మరణమునకు విలపించాడు. ఇక్కడ ఒక యోరుషలేము నగర ఆత్మీయ మరణము గురించి విలపిస్తున్నాడు.

ప్రజలు తమ వస్త్రములను దారిలో పరచుచున్నారు. శిష్యులు "ప్రభువు పేరిట వచ్చు రాజు ధన్యుడు" అని ఉత్సాహముగా కేకలు వేయుచున్నారు (లూకా 19:37-38). ఆ ఆనందమునకు మధ్యలో రాజు కన్నీరు కార్చుచున్నాడు. చుట్టూ ఉన్నవారు నవ్వుచుండగా ఆయన ఏడ్చుచున్నాడు. ఈ వైరుధ్యమే ఈ వాక్యభాగము యొక్క కేంద్రము.

గలిలయ నుండి యెరూషలేము వరకు

యేసు ప్రభువు 9 వ అధ్యాయములో మొదలుపెట్టిన  ప్రయాణము ఇప్పుడు 19వ అధ్యాయములో ముగింపునకు వచ్చుచున్నది.

దీనికి ముందు యెరికోలో జక్కయ్యకు రక్షణ లభించింది(19:1-10). "ఈనాడు ఈ ఇంటికి రక్షణ వచ్చెను" అని ప్రభువు చెప్పాడు. ఒక సుంకరి తన దర్శన కాలమును గుర్తించి, చెట్టు ఎక్కి, ప్రభువును ఇంటికి ఆహ్వానించాడు. అతడు రక్షణ పొందాడు. దీని తరువాత ఇదే అధ్యాయములో ఒక మహానగరము తన దర్శన కాలమును గుర్తింపలేక నాశనమునకు సిద్ధమగుచున్నది అని చూస్తాము. లూకా ఈ రెండు సంఘటనలను ఒకదాని వెనుక ఒకటి ఉంచుటము యాదృచ్ఛికము కాదు. ఒక పాపి రక్షణ పొందాడు, పవిత్ర నగరము గ్రహింపలేకపోయింది. దేవుని సందర్శనమునకు ఎవరు స్పందింతురనేది వారి హోదాను బట్టి కాక వారి హృదయమును బట్టి ఉంటుంది.

అంతకుముందు ప్రభువు పది వరహాల ఉపమానమును చెప్పాడు (19:11-27). యెరూషలేమును  సమీపించుచున్నందున దేవుని రాజ్యము వెంటనే ప్రత్యక్షమగునని ప్రజలు తలంచారు. రాజ్యము ఎట్లు వచ్చునో, రాజు ఎట్లు పరిపాలించునో వారికి ఇంకా అర్థము కాలేదు. వారు ఊహించిన రాజ్యము రాజకీయ విముక్తి, రోమా పాలన నుండి స్వేచ్ఛ. ప్రభువు తెచ్చుచున్నది, ఇది  హృదయ పరివర్తన ద్వారా వచ్చు శాంతి. ఈ అపార్థమే కన్నీటికి మూలకారణము.

ప్రభువు గాడిద పిల్ల మీద ఒలీవల కొండ నుండి దిగివచ్చుచున్నాడు.: సీయోను కుమారీ, ఆనందింపుము... నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన నీతిమంతుడును రక్షకుడునై దీనుడై గాడిదపై, గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు (జెకర్యా 9:9) అని జకర్యా ప్రవక్త ప్రవచించాడు.

"ఆయన ఆ నగరమును చూచి విలపించెను"

ఎ. ప్రభువు చూపు

"చూచి" అని వాక్యం చెబుతుంది. ఒలీవల కొండ నుండి యెరూషలేము అత్యంత మనోహరముగా ఉంటుంది. బంగారు వన్నెతో మెరిసే దేవాలయము, సున్నపురాతి కట్టడములు, ప్రాకారములు, ఉదయ సూర్యకాంతిలో ప్రకాశించు మహానగరము. యూదులు యాత్ర కొరకు వచ్చు ప్రతి పండుగలో ఈ దృశ్యమును చూచి వారు  పాటలు పాడెడివారు. ఇదే దృశ్యమును ప్రభువు తన కన్నులతో చూచుచున్నాడు. అయితే ఆయన చూపు వేరు. ఇతరులు అప్పటి  వైభవమును చూచుచుండగా ప్రభువు  రాబోవు నాశనమును కూడా చూచుచున్నాడు.

బి. "విలపించెను" అను పదము

ఇక్కడ లూకా వాడిన గ్రీకు పదము ఎక్లాయుసెన్ (ἔκλαυσεν). ఇది నిశ్శబ్దముగా కన్నీరు కార్చుటను సూచించు పదము కాదు. పెద్దగా రోదించుటను, హృదయ వేదనతో ఏడ్చుటను సూచిస్తుంది. లాజరు సమాధి వద్ద వాడిన పదము (యోహాను 11:35) కన్నీరు కార్చుటను మాత్రమే చెప్పును. ఇక్కడ అంతకంటే గాఢమైన వేదన ఉన్నది. దేవుని కుమారుడు బహిరంగముగా, అందరి ముందు, దుఃఖముతో రోదించుచున్నాడు.

దీని నుండి మనము నేర్చుకొనవలసినది, మన పతనము దేవునికి  కేవలము ఒక నివేదిక కాదు. తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురుచూచు తండ్రి వలె (లూకా 15), ఆయన మన కొరకు వేదన పడతాడు. మనము మనము నశించుట ఆయన హృదయమును గాయపరుస్తుంది.

"శాంతికి అవసరమైనది"

ఎ. యెరూషలేము అను పేరు

"యెరూషలేము" అను పేరుకు సాంప్రదాయికముగా "శాంతి నగరము" అని అర్థము చెబుతారు.  (షాలోమ్ అనగా శాంతి). శాంతి నగరమునకు శాంతి రహస్యమే తెలియకపోయింది. ఇదే ఇక్కడి విషాదము. కీర్తనకారుడు "యెరూషలేము శాంతికై ప్రార్థింపుడు" అని పాడాడు (కీర్తన 122:6). ఆ నగరము యాత్రికులకు శాంతి పాటలు పాడింది, కానీ తన మధ్యలోనే శాంతి ప్రభువు నిలిచి ఉండగా ఆయనను గుర్తించలేకపోయింది.

బి. శాంతి అనగా ఏమి?

పవిత్ర గ్రంధంలో శాంతి అనగా యుద్ధము లేకపోవుట మాత్రమే కాదు. అది దేవునితో సరియైన సంబంధము, సంపూర్ణత, రక్షణ, దేవుని ఆశీర్వాదములో జీవించుట ఇవి ఉన్నప్పుడు మాత్రమే నిజమైన శాంతి ఉంటుంది. ప్రభువు  జన్మించినప్పుడు దేవదూతలు "భూమిపై సన్మనస్కులకు శాంతి" అని పాడారు (లూకా 2:14). జెకర్యా ప్రవచనములో, శాంతి మార్గములో మనలను నడిపించుటకు ఉదయకాంతి వచ్చునని ఉంది. (లూకా 1:79) ఇప్పుడు ఆ శాంతి స్వయముగా నగర ద్వారముల వద్ద నిలిచి ఉన్నాడు. ప్రభువే ఆ శాంతి (ఎఫెసీయులకు 2:14).

"శాంతికి అవసరమైనది" ఏమిటి అంటే? యేసు ప్రభువును మెస్సీయాగా అంగీకరించి, ఆయన పిలుపునకు పశ్చాత్తాపముతో స్పందించి, దేవుని రాజ్యమును హృదయములో స్వీకరించాలి. ప్రజలు సైనిక విజయమును, రాజకీయ స్వేచ్ఛను కోరుకున్నారు. కానీ  వారికి  అవసరమైనది హృదయ పరివర్తన. ప్రవక్తలు శతాబ్దములుగా ఇదే చెప్పారు.

సి. "నేడైనను"

"నేడైనను నీవు... గుర్తించియుండిన యెడల బాగుండెడిది" అను వచనం అసంపూర్ణమైన నిట్టూర్పు వలె ఉంది. ప్రభువు తన వేదనలో పూర్తిగా పలుకలేకపోవుచున్నాడు. "నేడైనను" అను పదము ఒక చివరి ఆహ్వానము. ఇంకా సమయము ఉన్నది, ఇంకా తలుపు మూయబడలేదు అని ఈ పదము సూచిస్తుంది. దేవుడు చివరి క్షణము వరకు ఆశ వదులుకొనడు. తీర్పు ప్రకటించు వాక్యములోనే దేవుని కృప ద్వారము తెరచి ఉన్నది.

"నీవు అటుల చేయలేకపోతివి"- దాచబడిన కన్నులు

ఈ వాక్యమును అర్థము చేసికొనుటలో జాగ్రత్త అవసరము. "చేయలేకపోతివి" అనగా నగరమునకు శక్తి లేకుండెనని కాదు. ఇది దేవుడు ముందే నిర్ణయించి వారిని గుడ్డివారిగా చేసెనని అర్థము కాదు. ప్రజలు వినుటకు ఇష్టపడక చెవులు మూసికొనిరి. అసలు సమస్య హృదయ కాఠిన్యము. యెషయా ప్రవక్త వారు చూచుచున్నను చూడకుందురు, వినుచున్నను గ్రహింపకుందురు అని చెప్పాడు. (యెషయా 6:9).

ఈ గ్రుడ్డితనము అనేక విధములుగా ఉంటుంది.

మొదటిది, ఆశల గుడ్డితనము. వారు తమ మనస్సులో ఒక మెస్సీయా చిత్రమును ఏర్పరచుకున్నారు. ఖడ్గము ధరించి రోమా సామ్రాజ్యమును తరిమివేయు రాజు వస్తాడు అనుకున్నారు. దీనత్వముతో గాడిద మీద వచ్చు రాజు వారి ఊహకు సరిపోలలేదు. తమ ఊహకు సరిపోని దేవుని వారు గుర్తింపలేకపోయారు.

రెండవది, స్వీయ తృప్తి గుడ్డితనము. దేవాలయము ఉన్నది, బలులు జరుగుచున్నవి, పండుగలు జరుగుచున్నవి. మతాచారములు కొనసాగుచుండగా హృదయము దేవునికి దూరమూగ ఉన్నది. కొద్ది దినముల తరువాత ప్రభువు దేవాలయములో వ్యాపారులను వెళ్ళగొట్టి, "నా ఆలయము ప్రార్థనా మందిరము, మీరు దానిని దొంగల గుహగా చేసితిరి" అని పలుకుతాడు (లూకా 19:46). బాహ్య మతాచారము అంతరంగ భక్తికి ప్రత్యామ్నాయము కాదు.

మూడవది, నాయకత్వ గర్వము. ప్రధాన యాజకులు, ధర్మ శాస్త్ర బోధకులు  తమ స్థానమును కాపాడుకొనుటలో నిమగ్నులై ప్రభువును తిరస్కరించారు. పరిసయ్యులు ఆ ఉత్సాహ ధ్వనులను ఆపమని ప్రభువుతో చెప్పారు (19:39). అప్పుడు ప్రభువు, వీరు మౌనముగా ఉన్నచో ఈ రాళ్ళు కేకలు వేయును అని జవాబిచ్చాడు (19:40). ప్రజలు స్తుతించకపోయినను సృష్టి స్తుతించును. కానీ మనుష్యుల మౌనము విషాదము.

దేవుడు తన్ను తాను వెల్లడించుచున్నప్పుడు మనము స్పందింపకపోతే, మన  సామర్థ్యమే క్రమముగా తగ్గిపోతుంది. వినుటకు నిరాకరించినవాడు కాలక్రమేణా వినలేకపోతాడు. అందుకే ప్రభువు "చేయలేకపోతివి" అని విషాదముగా అంటున్నాడు. ఈ స్థితి ఒక్క రోజులో కాదు, అనేక చిన్న నిరాకరణల ఫలితమే ఈ స్థితి.

ముట్టడి ప్రవచనము

ఎ. ప్రవచన భాష

"శత్రువులు నీ చుట్టు కందకములు త్రవ్వి, నిన్ను ముట్టడించి, అన్నివైపుల నిన్ను అరికట్టు కాలము వచ్చును" (19:43). ఇది పాత నిబంధన ప్రవక్తల భాషను పోలి ఉంది. యిర్మీయా యెరూషలేము ముట్టడిని ముందే చెప్పాడు (యిర్మీయా 6:6). యెహెజ్కేలు కూడా ఇటువంటి ప్రవచనమును పలికాడు (యెహెజ్కేలు 4:1–3). క్రీస్తు పూర్వము 586లో బాబీలోనీయులు యెరూషలేమును పడగొట్టి, దేవాలయమును కాల్చి, ప్రజలను చెరపట్టారు.  137 వ కీర్తన ఆ చెర బాధను వర్ణిస్తుంది. ప్రభువు ఇప్పుడు అదే విధమైన విపత్తు మళ్ళీ రాబోవుచున్నదని హెచ్చరిస్తున్నాడు.

"వారు నీలో రాతి మీద రాయిని నిలువనీయరు" అను మాట కఠోరమైనది. నగరము మాత్రమే కాక దాని సంతానము కూడా మట్టిపాలగును. ఇది ప్రభువు క్రూరత్వము కాదు, ప్రవక్తలు చెప్పు సాంప్రదాయిక హెచ్చరిక.

బి. చరిత్ర సాక్ష్యము

క్రీ.శ. 66లో యూదులు రోమా పాలనపై తిరుగుబాటు చేసారు. క్రీ.శ. 70లో రోమా సేనాని టైటస్ యెరూషలేమును ముట్టడించాడు. అపుడు అపారమైన ప్రాణనష్టము సంభవించింది. చివరికి దేవాలయము అగ్నికి ఆహుతి అయ్యింది, ఈ రోజు పడమటి ప్రాకార గోడ (వెస్టర్న్ వాల్)   మిగిలియున్నది.

"రాతి మీద రాయిని నిలువనీయరు"

దేవాలయము ఇశ్రాయేలుకు  గర్వకారణము. అది దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. కానీ దేవుని సన్నిధిని గుర్తింపలేని హృదయములో ఆ భవనము కేవలము రాళ్ళ కుప్ప. భవనము పవిత్రమైనది దేవుని సన్నిధి వలన, భవనము వలన కాదు. ప్రభువు స్వయముగా అసలైన దేవాలయము. "ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దానిని లేపుదును"  అని చెప్పాడు.(యోహాను 2:19).

"ప్రభువు నిన్ను దర్శింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు"

దేవుని దర్శనమును గుర్తింపలేకపోవుట, నాశనమునకు కారణము.

ఎ. "దర్శనము" అను పదము

లూకా వాడిన గ్రీకు పదము ఎపిస్కొపే (ἐπισκοπή). దీనికి "సందర్శనము, పర్యవేక్షణ, కృపతో కూడిన పరిశీలన" అని అర్థము. దేవుడు తన ప్రజలను కనికరముతో సందర్శించుట అనేక సార్లు జరిగింది. కాని ఆయనను చూడలేదు, ఆయన కనికరాన్ని పొందలేదు.

బి. కాలము: "కైరోస్"

"కాలము" అను పదమునకు గ్రీకులో కైరోస్ (καιρός) అంటారు. ఇది గడియారము సూచించు కాలము (క్రోనోస్) కాదు. నిర్ణీతమైన, అవకాశముతో నిండిన, దేవుడు తన పని  చేయు ప్రత్యేక సమయము. రైతుకు విత్తనము విత్తు సమయము ఒకే ఒక అవకాశము వలె, కొన్ని కాలములు ఒక్కసారే వస్తాయి. యేసు ప్రభువు  ప్రజా పరిచర్యను ప్రారంభించినప్పుడు "కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించియున్నది" అని ప్రకటించాడు (మార్కు 1:15). ఇప్పుడు యెరూషలేము ఆ కైరోస్ ను అనుభవిస్తుంది.

సి. "గుర్తింపలేదు"

దేవుడు రాలేదని కాదు, ఆయన వచ్చినను గుర్తింపలేదు. దేవుడు తరచుగా మనము ఊహించని రూపములో వస్తాడు.  గాడిద మీద కూర్చున్న రాజు, పశువుల పాకలో శిశువు, సిలువ మీద వ్రేలాడు రక్షకుడు. ఎమ్మావు  మార్గములో శిష్యులు కూడా ప్రభువుతో కలిసి నడిచినను ఆయనను గుర్తింపలేకపోయారు (లూకా 24:16).

మనకు సందేశము

వ్యక్తిగత జీవితములో

యెరూషలేము మన ఆత్మయే. ప్రభువు మన హృదయ ద్వారము వద్ద నిలిచి తట్టుచున్నాడు (ప్రకటన 3:20). మనకు ఆయన దర్శనము అనేక రూపములలో వస్తుంది:

  • దైనందిన వాక్య ధ్యానములో
  • పాప సంకీర్తన దివ్య సంస్కారములో లభించు క్షమ
  • ఒక ఆపద సమయములో ఆదరణ చూపిన వ్యక్తి
  • మన మనస్సాక్షి యొక్క మృదువైన పిలుపు
  • పేదవారి ముఖములో కనబడు ప్రభువు (మత్తయి 25:40)

ఈ దర్శనములను మనము "తర్వాత చూచుకొందాము" అని వాయిదా వేయుచున్నామా? "నేడైనను" అను ప్రభువు పిలుపు ఇప్పుడు మనకు కూడా వర్తిస్తుంది. హెబ్రీయులకు వ్రాసిన లేఖ ఇట్లు "నేడు మీరు ఆయన స్వరము వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి" (హెబ్రీయులకు 3:15) అని హెచ్చరిస్తుంది.

ఆశా సందేశము

ఈ వాక్యభాగము భయము కలిగించుటకు ఇవ్వబడలేదు. ప్రభువు శిక్షించుటకు కాదు, రక్షించుటకు వస్తాడు. ఈ సువిశేష  భాగం తారువాత  కొద్ది రోజులలో ఆయన తన నగరమునకు వెలుపల సిలువ మీద తన ప్రాణమును అర్పిస్తాడు. తనను తిరస్కరించినవారి కొరకు  ఆయన , "తండ్రీ, వీరిని క్షమింపుము, వీరు చేయుచున్నది వీరెరుగరు" (లూకా 23:34) అని ప్రార్ధిస్తాడు. కన్నీటితో ప్రారంభమైన ఆ ప్రయాణము క్షమాపణ ప్రార్థనతో పరిపూర్ణమగును. ప్రభువు కన్నీరు నిరర్థకము కాలేదు. యెరూషలేము నుండే సువార్త లోకమంతటికి వ్యాపించింది.

ధ్యాన ప్రశ్నలు

  1. నా జీవితములో ప్రభువు నన్ను ఇటీవల ఏ విధముగా దర్శించెను? నేను దానిని గుర్తించితినా?
  2. నా మనస్సులో "ప్రభువు ఇట్లు ఉండవలెను" అను ఏ ఊహలు ప్రభువును గుర్తించకుండా నన్ను ఆపుచున్నవి?
  3. నా భక్తి కార్యములు, ఆలయ సందర్శనములు నన్ను నిజముగా ప్రభువునకు దగ్గరగా తీసికొనివచ్చుచున్నవా, లేక కేవలము అలవాటుగా మారినవా?
  4. నేను వాయిదా వేయుచున్న ఏ పరివర్తనను ఈ దినమే ప్రారంభింపవలెను?
  5. నా చుట్టునున్న ఎవరి కొరకు నేను ప్రభువు వలె కనికరముతో కన్నీరు కార్చవలెను?

ప్రార్థన

ప్రభువా, నీవు యెరూషలేమును చూచి విలపించితివి. మా నగరములను, మా కుటుంబములను, మా హృదయములను చూచి నీవు ఇప్పటికిని విలపించుచున్నావు. మా కన్నులు తెరువుము. మా మధ్య నీవు నడుచు సమయములను మేము గుర్తించునట్లు చేయుము. మా గర్వమును, మా ఊహలను, మా నిర్లక్ష్యమును క్షమింపుము. నీ శాంతిని మా హృదయములలో స్థాపింపుము. నీవు మమ్ములను దర్శించు ప్రతి క్షణమును మేము కృతజ్ఞతతో స్వీకరించునట్లు, "ప్రభువు పేరిట వచ్చువాడు ధన్యుడు" అని నిజమైన హృదయముతో పాడునట్లు అనుగ్రహింపుము. ఆమెన్

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి