మెల్కీసెదెకు ఎవరు? షాలేము రాజు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు
సర్వోన్నతుడైనదేవుని యాజకుడు
పరిచయం
పవిత్ర గ్రంధంలో కొంతమంది
వ్యక్తులు తక్కువ సార్లు కనిపించినా, వారి
ప్రభావం వేల సంవత్సరాలు ఉంటుంది. మెల్కీసెదెకు అలాంటి వ్యక్తి. ఆదికాండములో కేవలం
మూడు వచనాల్లో (14:18-20) ఆయన కనిపిస్తాడు.
తర్వాత కీర్తనల గ్రంథంలో ఒక్క వచనంలో (110:4), ఆపై కొత్త నిబంధనలో
హెబ్రీయులకు రాసిన లేఖలో కొన్ని అధ్యాయాల్లో ఆయన ప్రస్తావన వస్తుంది. కాని ఆయన ప్రాముఖ్యత
చాలా ముఖ్యమైనది.
ఆయన ఎక్కడినుండి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో పవిత్ర గ్రంధం చెప్పదు. అయినా ఆయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడు, షాలేము రాజు అని చెబుతుంది. ఇశ్రాయేలు జాతి ఏర్పడక ముందే, లేవీయ యాజకత్వం స్థాపించబడక ముందే, రాజు మరియు యాజకుడు అయిన వ్యక్తి మెల్కీసెదెకు. అందుకే తిరుసభ ఆయనను క్రీస్తు యాజకత్వానికి గుర్తుగా గౌరవిస్తుంది.
మెల్కీసెదెకు పేరు యొక్క అర్థం
హీబ్రూ భాషలో "మెల్కీసెదెకు" అనే పేరు
మెల్కె -సెదెక్ అను రెండు పదాల కలయిక. మెలెక్ అంటే రాజు అని సెదెక్ అంటే నీతి, న్యాయం అని అర్ధం.
మెల్కీసెదెకు అంటే మొదట "నీతిమంతుడగు రాజు" అని అర్థం. ఆయన పరిపాలించిన పట్టణం పేరు షాలేము. హీబ్రూలో
"షాలోమ్" అంటే శాంతి, సంపూర్ణత అని అర్ధం, కనుక
అతడు శాంతికరమైన రాజు.
హెబ్రీయులకు రాసిన లేఖ ఈ
రెండు అర్థాలను స్పష్టంగా తెలుపుతుంది. మొదట ఆయన పేరు ప్రకారం నీతిమంతుడగు రాజు అని, తర్వాత షాలేము
రాజు కనుక అతడు శాంతికాముకుడగు రాజు అని తెలియజేస్తుంది.
(హెబ్రీ 7:2) నీతి, శాంతి ఈ రెండూ మెస్సీయ
రాజ్యానికి గుర్తులు. యెషయా ప్రవక్త మెస్సీయను "శాంతి కారుడైన
రాజు అని పిలిచాడు “ఏలయన, మనకొక
శిశువు జన్మించెను. మనమొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభారము వహించును.
“ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు” అని అతడికి పేరిడుదురు” (యెషయా 9:6).
కీర్తనకారుడు "కృపయు, విశ్వసనీయతయు ఒకదానిని ఒకటి కలిసికొనును. న్యాయమును, శాంతియు ఒకదానిని ఒకటి ముద్దుపెట్టుకొనును" అని పాడాడు (కీర్తన 85:10). ఈ రెండు గుణాలు ఒకే వ్యక్తిలో కలిసి కనిపించే మొదటి వ్యక్తి మెల్కీసెదెకు.
చారిత్రక నేపథ్యం: అబ్రాహాము యుద్ధం
మెల్కీసెదెకు కథను అర్థం చేసుకోవాలంటే ముందు
ఆదికాండము 14వ అధ్యాయంలోని యుద్ధ నేపథ్యం తెలుసుకోవాలి.
రాజుల కూటమి
కనాను దేశంలో సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము, బెలా అనే
ఐదు పట్టణ రాజ్యాలు ఉండేవి. ఈ రాజులు పన్నెండు సంవత్సరాలు ఏలాము రాజు
కెదొర్లాయోమెరుకు సామంతులుగా ఉండి కప్పం చెల్లించారు. పదమూడవ సంవత్సరం వారు
తిరుగుబాటు చేశారు. అటు తరువాత పద్నాలుగవ సంవత్సరం కెదొర్లాయోమెరు, అతని మిత్ర
రాజులైన అమ్రాఫెలు (షీనారు రాజు), అర్యోకు (ఎల్లాసరు రాజు), తిదాలు
(గోయీము రాజు) తిరుగుబాటును అణచివేయడానికి వచ్చారు. వారు మార్గంలో అనేక జాతులను
ఓడించుకుంటూ వచ్చారు. రెఫాయీయులు, సూసియులు, ఏమీయులు, హోరీయులు, అమాలేకీయులు, అమోరీయులును
మొదలగువారందరిని ఓడించారు.
సిద్దీము లోయ యుద్ధం
సొదొమ, గొమొర్రా రాజులు సిద్దీము
లోయలో (ఉప్పు సముద్రం) ఏలాము కూటమితో యుద్ధం చేశారు. ఆ లోయ మొత్తం గుంటలతో నిండి
ఉంది. సొదొమ, గొమొర్రా రాజులు ఓడిపోయి పారిపోతూ ఆ గుంటల్లో
పడిపోయారు, మిగిలినవారు కొండల్లోకి పారిపోయారు.
విజేతలు సొదొమ, గొమొర్రాల
సంపదను, ఆహారాన్నీ దోచుకుని వెళ్ళారు. లోతు అబ్రాహాము సోదరుని కుమారుడు సొదొమలో
నివసిస్తున్నవాడు, అతని కుటుంబాన్ని, ఆస్తిని
కూడా బంధించి తీసుకువెళ్ళారు.
అబ్రాహాము రక్షణ చర్య
అక్కడ నుండి తప్పించుకున్న ఒక వ్యక్తి అబ్రహముకు ఈ విషయం
చెప్పాడు. అప్పుడు అబ్రాహాము మమ్రే వద్ద నివసిస్తున్నాడు. లోతు బందీ అయ్యాడని విని, అతడు తన
ఇంట్లో పుట్టి శిక్షణ పొందిన మూడువందల పద్దెనిమిది మంది సేవకులను తీసుకొని ఆయుధాలతో సమకూర్చుకొని, దాను వరకు
శత్రువులను వెంబడించాడు.
రాత్రివేళ తన సేవకులను విభజించి ఆకస్మిక వారపై దాడి చేసి, దమస్కుకు ఉత్తరాన ఉన్న హోబా వరకు వారిని తరిమాడు. లోతును, అతని ఆస్తినీ, స్త్రీలను, ప్రజలను, దోపిడీ సొత్తును తిరిగి తెచ్చాడు. ఇక్కడ అబ్రాహాము తన ఒక్కడి బలంతో కాక, దేవుని సహాయంతో గెలిచాడు. తర్వాత మెల్కీసెదెకు చెప్పిన మాటలు ఇదే ధృవీకరిస్తాయి.
ఆదికాండము 14 అధ్యాయం
అబ్రహమును ఇద్దరు రాజుల కలయుట
అబ్రాహాము విజయంతో తిరిగి వస్తున్నప్పుడు ఇద్దరు
రాజులు అతన్ని కలవడానికి వచ్చారు. మొదటివాడు సొదొమ రాజు. అతడు షావే లోయలో అబ్రాహామును కలిశాడు. రెండవవాడు
మెల్కీసెదెకు. ఆదికాండము 14:18-20: ఆ తర్వాత షాలేము రాజైన మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరకు వచ్చాడు. అతడు సర్వోన్నతుడైన
దేవుని యాజకుడు. "షాలేము రాజయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షసారాయమును
కొనివచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు దేవునకు యాజకుడు. అతడు అబ్రామునకు ఇట్లు
దీవెనలు పలికెను. “సర్వోన్నతుడై, భూమ్యాకాశములను సృష్టించిన దేవుడు అబ్రామును
ఆశీర్వదించును గాక! శత్రువులను నీ వశముచేసిన సర్వోన్నతుడగు దేవుడు
స్తుతింపబడునుగాక!” అపుడు అబ్రాము అతనికి తన సమస్తములో పదియవ వంతును అప్పగించెను."
అబ్రాము అతనికి సమస్తంలో పదవ భాగం ఇచ్చాడు.”
ఘట్టంలోని
మూడు చర్యలు
ఈ చిన్న సంఘటనలో మూడు కీలక చర్యలు ఉన్నాయి.
- మెల్కీసెదెకు రొట్టె, ద్రాక్షారసం
తెచ్చాడు (అర్పణ, ఆతిథ్యం)
- మెల్కీసెదెకు అబ్రాహామును ఆశీర్వదించాడు (యాజక కర్తవ్యం)
- అబ్రాహాము దశమ భాగం ఇచ్చాడు (గౌరవ అంగీకారం)
ఇక్కడ జరిగిన ప్రతి చర్యకు ప్రత్యేకమైన అర్థం ఉంది.
సొదొమ రాజుతో వ్యత్యాసం
మెల్కీసెదెకు ఆశీర్వదించి వెళ్ళిన తర్వాత సొదొమ రాజు అబ్రాహాముతో, "మనుషులను నాకివ్వు, సొత్తును నువ్వే ఉంచుకో" అన్నాడు. అబ్రాహాము అతనితో, "దానికి అబ్రాము 'సర్వోన్నతుడై భూమ్యాకాశములను సృష్టించిన ప్రభుడగు దేవుని యెదుట నా చేయియెత్తి ప్రమాణములు చేసియున్నాను. నీకుచెందిన నూలు పోగునుగాని, చెప్పుల దారమునుగాని, ఇంకదేనినైనను నేను ముట్టను. ఏనాడును నీవు 'నేను అబ్రామును ధనవంతుని చేసితిని' అని అనకుందువుగాక!” అన్నాడు. అబ్రాహాము దేవుణ్ణి "సర్వోన్నతుడైన దేవుడు" అని పిలిచాడు, మెల్కీసెదెకు వాడిన పదం కూడా అదే. మెల్కీసెదెకు ఆశీర్వాదం అబ్రాహాము విశ్వాసాన్ని బలపరిచింది. సొదొమ రాజు ఇచ్చే సంపదను తిరస్కరించి, దేవుడు ఇచ్చిన విజయం ఆయనదే అనే స్పష్టతతో నిలబడ్డాడు.
షాలేము ఎక్కడ
ఉంది?
షాలేము - యెరూషలేము
షాలేము ఎక్కడ ఉన్నదో భిన్న అభిప్రాయాలు ఉన్నా, ప్రాచీన యూదయ
మరియు క్రైస్తవ సంప్రదాయం దీనిని యెరూషలేము అని
చెబుతుంది. దీనికి పవిత్ర గ్రంధమే ఆధారము. ఎందుకంటే కీర్తన 76:2: "షాలేమున
అతని గుడారమున్నది. సియోనున అతని నివాసగృహమున్నది" అని చెబుతుంది. ఇక్కడ "షాలేము" సీయోనుతో సమాంతరంగా
చెప్పబడింది, అంటే అది యెరూషలేమే.
యూదా చరిత్రకారుడు జోసెఫస్ కూడా మెల్కీసెదెకు
యెరూషలేము రాజని, ఆయనే ఆ
పట్టణాన్ని మొదట పవిత్రం చేశాడని రాశాడు. తర్వాత దావీదు ఆ పట్టణాన్ని స్వాధీనం
చేసుకున్నప్పుడు, అక్కడే దేవాలయం
నిర్మించబడింది.
ఈ గుర్తింపు
ఎందుకు ముఖ్యం?
ఈ విషయం ఎందుకు ముఖ్యమైనది అంటే,
- దేవుడు తన నివాసంగా ఎంచుకున్న పట్టణంలో, దేవాలయం కట్టడానికి శతాబ్దాల ముందే, ఆయనకు అక్కడ యాజకుడు ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవునికి యాజకత్వం చేసినవాడు మెల్కీసెదెకు.
- దావీదు వంశపు రాజులు యెరూషలేము నుండి పరిపాలించినప్పుడు, వారు ఒక విధంగా మెల్కీసెదెకు రాజరిక వారసత్వాన్ని ముందుకు
తీసుకెళ్ళారు. అందుకే కీర్తన 110లో దావీదు వంశపు రాజుకు
"మెల్కీసెదెకు యాజక క్రమం" అనే చెప్పబడింది.
- క్రీస్తు సిలువ వేయబడి, మరణించి, లేచినది ఇదే యెరూషలేములో, కాబట్టి రాజు-యాజకుడైన క్రీస్తు తన చివరి
బలిని అర్పించిన స్థలం, మొదటి రాజు-యాజకుడైన
మెల్కీసెదెకు పరిపాలించిన స్థలమే.
రాజు మరియు యాజకుడు: రెండు బాధ్యతల కలయిక
ఇశ్రాయేలు చరిత్రలో రెండు బాధ్యతల విభజన
ఇశ్రాయేలు చరిత్రలో రాజు పదవి, యాజక పదవి
వేరు వేరుగా ఉన్నాయి.
- యాజకత్వం ఆరోను వంశానికి, లేవీ తెగకు ఇవ్వబడింది.
- రాజరికం యూదా తెగకు, ప్రత్యేకంగా దావీదు వంశానికి ఇవ్వబడింది.
ఈ విభజన కఠినంగా పాటించబడింది. సౌలు యాజకుడు
కాకుండా బలి అర్పించినప్పుడు సమూయేలు అతన్ని గద్దించాడు (1 సమూ 13:8-14). ఉజ్జీయా రాజు ధూపం వేయడానికి దేవాలయంలోకి
ప్రవేశించినప్పుడు అతనికి కుష్టు రోగం వచ్చింది.
(2రా. దిన 26:16-21).
మెల్కీసెదెకులో కలయిక
మెల్కీసెదెకులో ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తిలో
ఉన్నాయి. ఆయన రాజు (షాలేము
పాలకుడు) మరియు యాజకుడు (సర్వోన్నతుడైన
దేవుని సేవకుడు). ఆయన యాజకత్వం ఏ వంశం నుండీ రాలేదు, ఏ
ధర్మశాస్త్రం నుండీ రాలేదు. అది ఆరోను యాజకత్వం కంటే ముందే, భిన్నమైన
పునాదిపై ఉంది.
మెస్సీయ నిరీక్షణ
రాజు-యాజక సమ్మేళనం ఇశ్రాయేలు నిరీక్షణలో లోతుగా
నాటుకుపోయిన ఒక అంశం. జెకర్యా ప్రవక్త మెస్సీయ గురించి "ఆ
జనుడు దేవళమునుకట్టి రాజ గౌరవమును బడసి సింహాసనాసీనుడై పాలించును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయును'. ఈ ఇరుబాధ్యతలమధ్య శాంతిసామరస్యములు నెలకొని
యుండును" అని ప్రవచించాడు. (జెకర్యా 6:13).
యేసు ప్రభువు ఈ రెండు బాధ్యతలను పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన దావీదు వంశపు రాజు (మత్తయి 1:1), మరియు తన సొంత రక్తం ద్వారా శాశ్వత బలి అర్పించిన ప్రధాన యాజకుడు (హెబ్రీ 9:11-12).
రొట్టె, ద్రాక్షారసం
అర్పణగా
లేదా ఆతిథ్యంగా?
మెల్కీసెదెకు "రొట్టెను, ద్రాక్షారసాన్ని
తీసుకువచ్చాడు" అని పవిత్ర గ్రంధం చెబుతుంది. ఇది యుద్ధం నుండి అలసిపోయి వచ్చిన
అబ్రాహాముకు అతని మనుషులకు ఆతిథ్యం ఇచ్చి సత్కరించే చర్య అని కొందరు
పండితులు చెబుతారు. అది నిజమే కావచ్చు. కానీ వెంటనే "అతడు సర్వోన్నతుడైన
దేవుని యాజకుడు" అని చెప్పడం ఈ చర్యకు అర్పణ రూపం ఉందని సూచిస్తుంది.
యాజకుడు చేసే పని అర్పణ చేయడం, ఆశీర్వదించడం.
కాబట్టి ఈ రొట్టె, ద్రాక్షారసాలను దేవునికి
అర్పించి, తర్వాత అబ్రాహాముకు అతని మనుషులకు పంచుకోవడానికి ఇచ్చాడని తిరుసభ సంప్రాదాయ భావన.
రొట్టె, ద్రాక్షారసం దేనికి సూచన?
రొట్టె, ద్రాక్షారసం భూమి నుండి పండించే ప్రాథమిక ఆహారాలు. ఇవి దేవుడు ఇచ్చిన
సృష్టి వరాలు, మానవుని శ్రమ ఫలాలు. దివ్య పూజబలి కానుకల సమయంలో
యాజకుడు, "సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వరా, నీకు స్తుతికలుగునుగాక.
ఎలయన మేము అర్పించు ఈ అప్పము మీ ఉదారత్వము వలన పొందితిమి. భూఫలమును మానవ
శ్రమ ఫలమునైన ఇది మాకు జీవాహరము కానున్నది” అని ప్రార్ధిస్తాడు.
క్రీస్తు కడరా భోజనంలో రొట్టెను తీసుకుని, " మీరు దీనిని తీసుకొని భుజింపుడు ఎలయన ఇది నా శరీరము" అన్నాడు. ద్రాక్షారసపు పాత్రను తీసుకుని, "మీరు దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము" అన్నాడు. తిరుసభ మెల్కీసెదెకు తెచ్చిన రొట్టె, ద్రాక్షారసాన్ని ఈ దివ్య సత్ప్రసాదానికి పూర్వచిత్రంగా అర్థం చేసుకుంది. అబ్రాహాము ఆ ఆహారాన్ని పొంది బలపడ్డాడు; అలాగే విశ్వాసులు క్రీస్తు శరీర రక్తాల ద్వారా ఆధ్యాత్మిక బలం పొందుతారు.
ఆశీర్వాదం మరియు దశమ భాగం
ఆశీర్వాదం
మెల్కీసెదెకు అబ్రాహామును ఆశీర్వదించిన మాటల్లో
రెండు భాగాలు ఉన్నాయి:
- అబ్రాహాముకు ఆశీర్వాదం: " భూమ్యాకాశములను
సృష్టించిన దేవుడు అబ్రామును ఆశీర్వదించును గాక."
- దేవునికి స్తుతి: " శత్రువులను
నీ వశముచేసిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక!"
ఆశీర్వాదం ఇవ్వడం యాజకుని పని (సంఖ్యా 6:22–27). మెల్కీసెదెకు
ఈ ఆశీర్వాదం ద్వారా అబ్రాహాముకు విజయము అతని శక్తి వల్ల కాదు, దేవుని
సహాయం వల్ల కలిగిందని ప్రకటించాడు. ఇది ఎంతో వినయపూర్వకమైన సత్యం, విజయం వచ్చినప్పుడు కీర్తి దేవునికి చెందాలి.
హెబ్రీయులకు రాసిన లేఖలో రచయిత ఈ ఘట్టం నుండి ఒక సూత్రం తీస్తాడు: "తక్కువ
వాడు ఎక్కువ వానిచేత దీవింపబడుననుట నిర్వివాదము." (హెబ్రీ 7:7). కాబట్టి
మెల్కీసెదెకు అబ్రాహామును ఆశీర్వదించడం ద్వారా ఆ సందర్భంలో అబ్రాహాము కంటే ఉన్నత
స్థానంలో ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే అబ్రాహాము ఇశ్రాయేలు
జాతికి మూలపురుషుడు, విశ్వాసులకు తండ్రి.
దశమ భాగం
అబ్రాహాము మెల్కీసెదెకుకు "సమస్తంలో పదవ
భాగం" ఇచ్చాడు. ఇది పవిత్ర గ్రంధంలో దశమ భాగం ఇచ్చిన మొదటి ఘట్టం. అప్పటికి
మోషే ధర్మశాస్త్రం లేదు, కాబట్టి ఇది ధర్మశాస్త్రం
విధించిన బాధ్యత కాదు, అబ్రాహాము స్వచ్ఛందంగా చేసిన
గౌరవ చర్య. తనకు విజయం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతను, ఆయన
యాజకునికి గౌరవాన్ని అబ్రహాము పదవ భాగం ఇవ్వడం
ద్వారా తెలియజేస్తున్నాడు.
హెబ్రీయులకు రాసిన లేఖ దీని ప్రాముఖ్యతను వివరిస్తు, లేవీయ యాజకులు ధర్మశాస్త్రం ప్రకారం ప్రజల నుండి దశమ భాగం పొందుతారు. కానీ మెల్కీసెదెకు లేవీ వంశం వాడు కాకపోయినా అబ్రాహాము నుండి దశమ భాగం పొందాడు. లేవీ అప్పటికి అబ్రాహాము శరీరంలో (వంశవృక్షంగా) ఉన్నాడు కాబట్టి, అబ్రాహాము ద్వారా లేవీ కూడా మెల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చినట్టే అని చెబుతుంది. (హెబ్రీ 7:9–10). అంటే మెల్కీసెదెకు యాజకత్వం లేవీయ యాజకత్వం కంటే ఉన్నతమైనది.
మెల్కీసెదెకు ఎవరు? సంప్రదాయ అభిప్రాయాలు
పవిత్ర గ్రంధం మెల్కీసెదెకు తల్లిదండ్రులు, జననం, మరణం
గురించి ఏమీ చెప్పవు.
పవిత్ర గ్రంధ మౌనం యొక్క అర్ధం
హెబ్రీయులకు రాసిన లేఖలో " తండ్రి, తల్లి వంశావళిలేని, జీవిత
కాలమునకు ఆదియైనను, జీవమునకు అంతమైనను లేని అతడు దేవుని కుమారుని పొలియున్నాడు. అతడు
శాశ్వతముగ యాజకుడై ఉండును. " (హెబ్రీ 7:3).
ఇది మెల్కీసెదెకు తల్లిదండ్రులు లేకుండా
పుట్టాడని చెప్పడం కాదు. లేవీయ యాజకులకు వంశావళి చాలా ముఖ్యం; వంశావళి
నిరూపించలేనివారు యాజకత్వం నుండి తొలగించబడ్డారు (ఎజ్రా 2:61–62). కానీ
మెల్కీసెదెకు యాజకత్వం వంశం మీద ఆధారపడలేదు. పవిత్ర గ్రంధం ఆయన వంశావళిని ప్రస్తావించకపోవడం ఒక సంకేతంగా
ఉపయోగపడుతుంది. క్రీస్తు యాజకత్వం కూడా
లేవీయ వంశావళి వల్ల రాలేదు, అది దేవుని కుమారునిగా
ఆయనకున్న శాశ్వత స్థితి వల్ల వచ్చింది. మెల్కీసెదెకు
"క్రీస్తును పోలినవాడు", క్రీస్తు ఆయనను పోలినవాడు
కాదు. అంటే ఆయన ఒక ముందు నీడ, అసలు వాస్తవం క్రీస్తు.
మెల్కీసెదెకు
ఒక మానవుడా, దేవదూతా, క్రీస్తేనా?
మెల్కీసెదెకు గురించి చరిత్రలో కొన్ని అసాధారణ
అభిప్రాయాలు వచ్చాయి.
- కొన్ని ప్రాచీన విభాగాలు మెల్కీసెదెకు ఒక దేవదూత అని చెబుతాయి. (మృత
సముద్ర గ్రంథాల్లో 11Q13 అనే
ప్రతి మెల్కీసెదెకును ఒక దివ్య విమోచకుడిగా చిత్రించింది.)
- హెబ్రీయులకు లేఖ "ఆయన క్రీస్తును పోలినవాడు" అని చెబుతుంది
కాబట్టి మెల్కీసెదెకు వేరు, క్రీస్తు వేరు.
- కొన్ని యూదా సంప్రదాయాలు (ఉదా. తాల్ముద్, కొన్ని టార్గుమ్‌లు) మెల్కీసెదెకును నోవహు కుమారుడైన షేముతో
గుర్తించాయి. షేము అబ్రాహాము కాలంలో జీవించి ఉండే అవకాశం వంశావళి లెక్కల
ప్రకారం ఉంది.
- మెల్కీసెదెకు నిజమైన చారిత్రక వ్యక్తి. ఆయన కనాను దేశంలోని యెరూషలేమ్
(షాలేము) రాజు, దేవునిపై విశ్వాసం ఉన్న ఆరాధకుడు.
అబ్రాహాము ద్వారా ఎంపిక చేయబడిన జాతికి వెలుపల కూడా దేవుడు నిజమైన ఆరాధకులను
కలిగి ఉన్నాడనడానికి ఆయన సాక్ష్యం.
110వ కీర్తన - మెస్సీయ గురించి ప్రవచనం
ఆదికాండము 14వ అధ్యాయం తర్వాత
సుమారు వెయ్యి సంవత్సరాలకు పైగా మెల్కీసెదెకు పేరు లేఖనాల్లో కనిపించదు. తర్వాత
దావీదు రాసిన 110వ కీర్తనలో ఆయన గురించి
చూస్తాము.
110వ కీర్తన , "ప్రభువు నా ప్రభువుతో ఇట్లనెను, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయువరకు నీవు నా కుడిపార్శ్వమున ఆసీనుడవు కమ్ము." నాలుగవ వచనం “నీవు మెల్కీసెదెకువలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడవుగానుందువు” అని చెబుతుంది.
ఈ కీర్తన ప్రత్యేకత
ఈ కీర్తనలో ప్రత్యేకంగా నిలిచేవి మూడు అంశాలు ఉన్నవి.
- ఇది మెస్సీయ కీర్తన. దావీదు తన కుమారుడిని ("తన ప్రభువు") ఉద్దేశించి
మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు ఈ
కీర్తనను ఉపయోగించి పరిసయ్యులను ప్రశ్నించాడు. "దావీదు ఆయనను 'ప్రభువు' అని పిలిస్తే ఆయన దావీదు
కుమారుడెలా అవుతాడు?" (మత్తయి
22:41-46). అంటే
మెస్సీయ దావీదు వంశస్థుడు మాత్రమే కాదు, దావీదు కంటే ఉన్నతుడు అని
దీని అర్ధం.
- ఇది దేవుని ప్రమాణం. లేవీయ యాజకత్వం ధర్మశాస్త్రం ప్రకారం ఇవ్వబడింది కానీ దేవుడు ప్రమాణం చేయలేదు. మెల్కీసెదెకు క్రమంలో
యాజకత్వం ప్రమాణంతో స్థిరపరచబడింది. హెబ్రీయులకు లేఖ దీన్ని ఎత్తిచూపుతుంది
(హెబ్రీ 7:20-22).
- ఇది శాశ్వత యాజకత్వం. లేవీయ యాజకులు మరణం వల్ల పదవి విడిచేవారు. కానీ ఈ యాజకత్వం
"శాశ్వతం".
దావీదు వంశపు రాజు మరియు యాజకుడు
దావీదు యెరూషలేమును జయించి దాన్ని రాజధానిగా చేసుకున్నప్పుడు, ఒక విధంగా మెల్కీసెదెకు షాలేము సింహాసనానికి వారసుడయ్యాడు. అందుకే దావీదు వంశపు రాజు "మెల్కీసెదెకు యాజకక్రమం"లో యాజకుడిగా వర్ణించబడ్డాడు. దాని పూర్తి నెరవేర్పు దావీదు వంశపు పరిపూర్ణ రాజైన యేసు క్రీస్తులో జరుగుతుంది.
హెబ్రీయులకు రాసిన లేఖ: క్రీస్తు యాజకత్వం
మెల్కీసెదెకు గురించి అత్యంత వివరమైన విశ్లేషణ
హెబ్రీయులకు రాసిన లేఖలో ఉంది. ఇది యూదా క్రైస్తవులకు క్రీస్తు యాజకత్వం ఆరోను
యాజకత్వం కంటే ఎందుకు ఉన్నతమైనదో వివరించడానికి మెల్కీసెదెకును గురించి
వివరించబడినది.
లేఖ ప్రధాన
వాదన
క్రీస్తు యాజకత్వం దేవుని నియామకం
క్రీస్తు మానవ బాధను అనుభవించిన యాజకుడు
మెల్కీసెదెకు యాజకత్వం లేవీయ యాజకత్వం కంటే ఉన్నతం
లేవీయ యాజకత్వం పరిపూర్ణతను ఇవ్వలేకపోయింది
క్రీస్తు శాశ్వత యాజకుడు
క్రీస్తు ఒక్కసారే తన బలి అర్పించాడు
క్రీస్తు వచ్చి నెరవేర్చాడు
హెబ్రీయులకు లేఖ , మనకు అలాంటి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు; ఆయన పరలోకంలో తండ్రి సింహాసనం కుడివైపున కూర్చున్నాడు (హెబ్రీ 8:1). క్రీస్తు యాజకత్వం ఒక భూసంబంధమైన సంప్రదాయం కాదు; అది దేవుడు స్వయంగా స్థాపించిన, ధర్మశాస్త్రం కంటే ముందు నుంచీ ఉన్న, శాశ్వత యాజకత్వం అని చెబుతుంది.
మెల్కీసెదెకు నుండి నేర్చుకొనవలసినవి
విజయంలో వినయం
మెల్కీసెదెకు అబ్రాహామును ఆశీర్వదించినప్పుడు
విజయం దేవుని పని అని ప్రకటించాడు. మనం విజయం సాధించినప్పుడు గర్వపడకుండా, "దేవునికి
స్తుతికలగాలి " అనే వైఖరి కలిగి ఉండాలి.
ఆశీర్వాదం కోసం సిద్ధంగా ఉండటం
అబ్రాహాము తన కంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక
అధికారాన్ని గుర్తించి ఆశీర్వాదం స్వీకరించాడు. మనం కూడా మన పాపమైన స్థితిని
గుర్తించి, యాజకుల ద్వారా దేవుని ఆశీర్వాదం, క్షమాపణ
పొందడానికి వినయంగా ఉండాలి.
దేవునికి మొదటి భాగం
అబ్రాహాము తనకున్న దానిలో పదవ భాగం ఇచ్చాడు. ఇది
దేవునికి కృతజ్ఞతతో ఇవ్వడం నేర్పుతుంది. సంఘ సేవ, పేదలకు
సహాయం, ఆలయ నిర్వహణ ఇవన్నీ ఈ కృతజ్ఞతా చర్యలో భాగమే.
సొదొమ రాజు మరియు మెల్కీసెదెకు
అబ్రాహాము ఇద్దరు రాజులు వచ్చారు, ఒకరు సంపద
ఇస్తామన్నాడు (సొదొమ రాజు), మరొకరు ఆశీర్వాదం ఇచ్చాడు
(మెల్కీసెదెకు). అబ్రాహాము ఆశీర్వాదం ఎంచుకున్నాడు, లోకపు
లాభాన్ని తిరస్కరించాడు. మన జీవితంలోనూ దేవుని ఆశీర్వాదం, లోక లాభం
మధ్య ఎంపికలు వస్తాయి.అప్పుడు దేవుని ఆశీర్వాదానికి సిద్దంగా ఉండాలి.
దివ్య పూజ బలి పట్ల భక్తి
రొట్టె, ద్రాక్షారసం ద్వారా దేవుడు
మనలను బలపరుస్తాడు. దివ్య బలిలో పాల్గొనడం ద్వారా మనం మెల్కీసెదెకు నుండి
క్రీస్తు వరకు సాగిన అదే బలిలో పాలుపంచుకుంటాం.
యాజకుల కోసం ప్రార్థన
మెల్కీసెదెకు యాజకత్వం ద్వారా అబ్రాహాము
ఆశీర్వదించబడ్డాడు. నేటి యాజకులు కూడా సంఘానికి ఆశీర్వాదాలు తెస్తారు. వారి కోసం
ప్రార్థించడం, వారిని గౌరవించడం, వారి
పరిచర్యకు సహకరించడం మన బాధ్యత.
నాయకత్వంలో
నీతి, శాంతి
నాయకులు (కుటుంబంలో, సమాజంలో, సంఘంలో)
నీతి, శాంతి అనే రెండు గుణాలను కలిగి ఉండాలి.
మెల్కీసెదెకు వాటికి ఆదర్శం.
దేవుని ప్రణాళిక ఊహించని చోట్ల పనిచేస్తుంది
మనం ఊహించని మనుషుల ద్వారా, ఊహించని చోట్ల దేవుడు పనిచేయగలడు. మెల్కీసెదెకు కథ దేవుని కృప సరిహద్దులను మనం నిర్ణయించలేమని గుర్తు చేస్తుంది.
ముగింపు
మెల్కీసెదెకు కథ పవిత్ర గ్రంధంలో అత్యంత
క్లుప్తమైనదైనా అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆదికాండములోని మూడు వచనాలు, కీర్తనలోని
ఒక వచనం, హెబ్రీయులకు లేఖలోని కొన్ని అధ్యాయాలు ఈ వ్యక్తి
ద్వారా రక్షణ చరిత్రలోని పెద్ద సత్యాన్ని చూపిస్తాయి.
మెల్కీసెదెకు యేసు ప్రభువును చూపిస్తున్నాడు. మెల్కీసెదెకును మాత్రమే చూసి ఆగిపోకుండా, ఆయన చూపించే
క్రీస్తు వైపు మన హృదయాలను తిప్పడమే ఈ కథ లక్ష్యం. రాజుగా, యాజకుడిగా, శాంతి నీతుల
అధిపతిగా క్రీస్తు ఈ రోజు కూడా మనతో ఉన్నాడు, తన బలిని ప్రతి దివ్య
బలిపూజలో మనకు అందిస్తున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి కృతజ్ఞతలు తెలుపుదాం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి