దెబోరా న్యాయాధిపతి: ఇశ్రాయేలును నడిపించిన వీర స్త్రీ కథ | Deborah Story in Telugu|కార్మెల్ శోభ

 


దెబోరా న్యాయాధిపతి: ఇశ్రాయేలును నడిపించిన స్త్రీ కథ

పరిచయం

న్యాయాధిపతుల గ్రంథంలో నమోదైన నాయకులలో దెబోరా అత్యంత విశిష్టమైన స్థానం పొందిన వ్యక్తి. ఆమె ఒక ప్రవక్త్రి, న్యాయాధిపతి, ఒక యుద్ధనాయకురాలు, ఒక కవయిత్రి.  ఈ నాలుగు పాత్రలనూ ఏకకాలంలో పోషించిన అరుదైన వ్యక్తిత్వం. న్యాయాధిపతుల గ్రంథంలో నమోదైన పన్నెండు మంది న్యాయాధిపతులలో ఆమె ఒక్కరే స్త్రీ, మరియు బైబిల్ మొత్తంలో అధికారికంగా "న్యాయాధిపతి"గా, "ప్రవక్త్రి"గా పిలువబడిన కొద్దిమంది స్త్రీలలో ఆమె ఒకరు.

దెబోరా కథ న్యాయాధిపతుల గ్రంథంలో రెండుసార్లు చెప్పబడింది.  మొదట 4వ అధ్యాయంలో గద్య రూపంలో చారిత్రక కథనంగా, తరువాత 5వ అధ్యాయంలో పద్య రూపంలో కవితా గీతంగా.  గద్య కథనం సంఘటనల క్రమాన్ని, వాస్తవాలను స్పష్టంగా అందిస్తే, కవితా  ఆ సంఘటనల వెనుక ఉన్న భావోద్వేగాలను, ఆధ్యాత్మికపరమైన లోతును, చారిత్రక అనుభూతిని మనకు అందిస్తుంది. ఈ రెండు కథనాలనూ కలిపి పరిశీలించడం ద్వారానే మనం దెబోరా జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలం.

చారిత్రక నేపథ్యం - న్యాయాధిపతుల కాలం

దెబోరా కథను అర్థం చేసుకోవడానికి ముందుగా న్యాయాధిపతుల కాలపు పరిస్థితిని అర్థం చేసుకోవడం అవసరం. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో ప్రవేశించి, దానిని ఆక్రమించుకున్న తరువాత, యెహోషువ మరణించాక ఇశ్రాయేలుకు కేంద్రీకృత నాయకత్వం లేకుండా పోయింది. ప్రతి గోత్రం తన స్వంత భూభాగంలో స్థిరపడి, తరచుగా చుట్టుపక్కల అన్యజాతుల ప్రభావంలో పడిపోయేది. న్యాయాధిపతుల గ్రంథం ఒక పునరావృత చక్రాన్ని చూపిస్తుంది.   ఇశ్రాయేలీయులు దేవుని నుండి దూరమై విగ్రహారాధనలో పడటం, దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించడం, వారు బాధలో దేవునికి మొరపెట్టడం, దేవుడు ఒక న్యాయాధిపతిని లేపి వారిని విడిపించడం, కొంతకాలం శాంతి నెలకొనడం, ఆ న్యాయాధిపతి మరణించాక తిరిగి పాత చక్రం ప్రారంభం కావడం. దెబోరా కథ ఈ చక్రంలో నాలుగవ న్యాయాధిపతిగా, ఏహూదు మరణానంతరం సంభవించింది.

ఈ కాలంలో ఇశ్రాయేలుకు కేంద్రీకృత సైన్యం లేదు, రాజు లేడు, స్థిరమైన రాజధాని లేదు. గోత్రాలు వేర్వేరుగా, తరచుగా ఒకదానితో ఒకటి సమన్వయం లేకుండా జీవించేవి. ఇలాంటి విచ్ఛిన్నమైన, బలహీనమైన సమాజంలో దేవుడు దెబోరాను లేపి, ఆమె ద్వారా గోత్రాలను ఏకం చేసి, ఒక శక్తివంతమైన శత్రువుపై విజయం సాధించేలా చేశాడు.

దెబోరాకు ముందు దేవుడు ముగ్గురు న్యాయాధిపతులను లేపాడు.  ఒత్నీయేలు, ఏహూదు, షమ్గరు. ఒత్నీయేలు కాలేబు తమ్ముడు, మెసపొటమియా రాజు కూషన్రి షాతాయిము అణచివేత నుండి ఇశ్రాయేలును విడిపించాడు (న్యాయాధిపతులు 3:7-11). ఏహూదు మోవాబు రాజు ఎగ్లోనును వధించి, మోవాబీయుల అణచివేత నుండి ఇశ్రాయేలును విడిపించి, ఎనభై సంవత్సరాల శాంతిని తీసుకువచ్చాడు (న్యాయాధిపతులు 3:12-30). షమ్గరు ఫిలిస్తియులలో ఆరువందల మందిని ఒక ఎద్దుల మేకుతో హతమార్చి ఇశ్రాయేలును రక్షించాడు (న్యాయాధిపతులు 3:31). ఏహూదు మరణించిన తరువాత, ఈ ముగ్గురు న్యాయాధిపతుల నాయకత్వం ముగిసిన తరువాత, ఇశ్రాయేలీయులు మళ్ళీ తమ పాత విగ్రహారాధన వైపు మళ్ళారు, దేవుడు వారిని యాబీను చేతికి అప్పగించాడు.  ఇక్కడ నుండే దెబోరా కథ మొదలవుతుంది.

యాబీను రాజవంశం గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయం గమనించవలసినది. యెహోషువ కాలంలో కూడా హాసోరు రాజు పేరు యాబీను అని ఉంది (యెహోషువ 11:1-11), ఆ యాబీనును యెహోషువ ఓడించి హాసోరును తగలబెట్టాడు. దెబోరా కాలంనాటి యాబీను బహుశా అదే రాజవంశానికి చెందినవాడై, హాసోరు నగరాన్ని తిరిగి నిర్మించి, తిరిగి శక్తిని కూడగట్టుకుని ఉండవచ్చు. ఇది కనానీయుల శక్తి ఎంత పట్టుదలగా, పదేపదే పునరుజ్జీవం పొందుతూ ఉండేదో చూపిస్తుంది.  ఇశ్రాయేలీయులు తమ శత్రువులను పూర్తిగా నిర్మూలించకపోతే, ఆ శత్రుత్వం తరతరాలుగా తిరిగి తలెత్తుతూనే ఉంటుందని ఇది ఒక హెచ్చరికగా కూడా నిలుస్తుంది.

దెబోరా ఎవరు?  ప్రవక్త్రి, న్యాయాధిపతి, భార్య

న్యాయాధిపతులు 4:4 దెబోరాను పరిచయం చేసే వచనం అత్యంత ప్రాముఖ్యమైనది: "ఆ రోజులలో దెబోరా  ఇశ్రాయేలీయులకు  తీర్పు తీరచుచుండెను. ఆమె ప్రవక్తీ, లప్పిడోతు భార్య." ఈ ఒక్క వాక్యంలో ఆమెకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన వివరాలు ఇమిడి ఉన్నాయి - ఆమె పేరు దెబోరా, ఆమె భర్త పేరు లప్పీడోతు, ఆమె వృత్తి ప్రవక్త్రి, ఆమె బాధ్యత న్యాయాధిపతి.

"దెబోరా" అనే పేరుకు హిబ్రూ భాషలో "తేనెటీగ" అని అర్థం. ఈ పేరు యాదృచ్ఛికం కాదని చాలామంది వ్యాఖ్యాతలు భావిస్తారు.  తేనెటీగ చిన్నదైనప్పటికీ, తనను కదిలించే ఏ శక్తినైనా ఎదుర్కొనే ధైర్యం కలిగినది, తన కుట్టుతో గొప్ప ప్రభావాన్ని చూపగలిగినది, తన సమూహం (తేనెపట్టు) కోసం అవిశ్రాంతంగా శ్రమించేది. దెబోరా వ్యక్తిత్వంలో ఈ లక్షణాలన్నీ మనం చూడగలం.   చిన్న స్థాయి నుండి లేచి గొప్ప ప్రభావం చూపిన నాయకురాలు, ఇశ్రాయేలు అనే సమూహం కోసం అవిశ్రాంతంగా శ్రమించిన స్త్రీ.

ఆమె భర్త లప్పీడోతు గురించి బైబిల్ మరెక్కడా ప్రస్తావించదు. ఆయన వృత్తి, గోత్రం, స్వభావం ఏవీ మనకు తెలియవు. పవిత్ర గ్రంధం ఆమెను ఎవరి భార్యగానో మాత్రమే కాక, తన స్వంత పేరుతో, తన స్వంత అధికారంతో పరిచయం చేయడం విశేషమైనది.

దెబోరా "ప్రవక్త్రి" అని పిలువబడింది. అంటే ఆమె దేవుని సందేశాన్ని ప్రజలకు అందించే వ్యక్తి. పవిత్ర గ్రంధంలో ఆమెకు ముందు మిర్యాము (మోషే సోదరి) మాత్రమే ఈ బిరుదు పొందింది. దెబోరా తరువాత హుల్దా, మరికొందరు స్త్రీలు కూడా ప్రవక్త్రులుగా పేర్కొనబడ్డారు. ప్రవచన వరం పురుషులకే పరిమితం కాదని, దేవుడు తాను ఎంచుకున్న ఎవరికైనా ఈ వరాన్ని ఇవ్వగలడని ఇది స్పష్టం చేస్తుంది.

అంతేకాక, దెబోరా "న్యాయాధిపతి"గా కూడా సేవ చేసింది. న్యాయాధిపతుల కాలంలో "న్యాయాధిపతి" అనే పదానికి కేవలం న్యాయస్థానంలో తీర్పులు చెప్పేవారు అని మాత్రమే అర్థం కాదు, వారు సైనిక నాయకులుగా, రాజకీయ నాయకులుగా, ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా కూడా వ్యవహరించేవారు. దెబోరా ఈ అన్ని బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించింది.  ప్రజల వివాదాలను పరిష్కరించడం, దేవుని సందేశాన్ని ప్రకటించడం, చివరికి యుద్ధరంగంలో నాయకత్వం వహించడం.

దెబోరా ఖర్జూర చెట్టు

న్యాయాధిపతులు 4:5 దెబోరా ఎక్కడ తన బాధ్యతలు నిర్వహించేదో వివరిస్తుంది,  "ఎఫ్రాయీము కొండలలో రామా, బేతేలు నగరములకు మధ్యనున్న “దెబోరా ఖర్జూరము చెట్టు” క్రింద కూర్చుండియుండెడిది. యిస్రాయేలీయులు ఆమె చెంతకు వచ్చి తమ తగవులను పరిష్కరించు కొనెడి వారు."  ఈ వివరణ మనకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. మొదటిది, ఆమె ఒక నిర్దిష్ట స్థలంలో, బహిరంగంగా, అందరికీ అందుబాటులో ఉండేలా తన సేవ చేసేది.  ఇది ఆమె పారదర్శకతను, ప్రజలతో ఆమెకున్న ప్రత్యక్ష సంబంధాన్ని సూచిస్తుంది. రెండవది, ఆ చెట్టుకు తరువాత ఆమె పేరే స్థిరపడిపోయింది ("దెబోరా ఖర్జూరము చెట్టు ") - ఇది ఆమె ప్రభావం ఎంత గాఢంగా ఉండేదో చూపుతుంది, ప్రజలు ఆ స్థలాన్ని ఆమెతో శాశ్వతంగా ముడిపెట్టి గుర్తుంచుకున్నారు.

ఎఫ్రాయిము మన్యంలో రామా, బేతేలు అనే ఊర్ల మధ్య ఈ తాటిచెట్టు ఉండేది.  ఇది మధ్య ఇశ్రాయేలులో, గోత్రాల మధ్య రాకపోకలకు అనువైన కేంద్ర ప్రదేశం. ఇశ్రాయేలీయులు వివిధ గోత్రాల నుండి, దూరప్రాంతాల నుండి తమ వివాదాలను, సమస్యలను తీసుకుని ఆమె వద్దకు వచ్చేవారు. ఇది ఆమెపై ప్రజలకున్న విశ్వాసాన్ని, ఆమె తీర్పులపై వారికున్న గౌరవాన్ని తెలియజేస్తుంది. అంతేకాక, ఒక స్త్రీ బహిరంగంగా, ఒక చెట్టు కింద కూర్చుని, పురుషులతో సహా అందరికీ న్యాయం చేయడం ఆ కాలపు సమాజంలో అసాధారణమైన విషయం.  ఇది దేవుడు ఆమెకు ఇచ్చిన అధికారాన్ని ప్రజలు గుర్తించి, గౌరవించారని చూపుతుంది.

ఇశ్రాయేలు అణచివేత - యాబీను, సీస్రా

న్యాయాధిపతులు 4:1-3 ఆ కాలపు నేపథ్యాన్ని వివరిస్తుంది. ఏహూదు మరణించిన తరువాత, ఇశ్రాయేలీయులు మళ్ళీ యావే  దృష్టిలో  చెడు  చేశారు.  విగ్రహారాధనలో పడ్డారు, దేవుని ఆజ్ఞలను విస్మరించారు. ఫలితంగా దేవుడు వారిని కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు, అతను హాసోరులో పరిపాలించేవాడు. యాబీను సేనాధిపతి పేరు సిస్రా, అతను హరోషెతులో నివసించేవాడు. సీసెరాకు తొమ్మిది వందల ఇనుప రథాలు ఉండేవి.   ఆ కాలానికి ఇది అత్యంత భయంకరమైన సైనిక శక్తి, ఎందుకంటే ఇనుప రథాలను ఎదుర్కోవడం కాలినడకన పోరాడే సైన్యానికి దాదాపు అసాధ్యం. సీస్రా  ఇశ్రాయేలీయులను ఇరవై సంవత్సరాలు కఠినంగా బాధించాడు, వారు తీవ్ర భయంలో, అణచివేతలో జీవించారు.

ఈ ఇరవై సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలు పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదో దెబోరా పాటలో (న్యాయాధిపతులు 5:6-8) మరింత వివరంగా తెలుస్తుంది.  రహదారులు నిర్జనమయ్యాయి, ప్రయాణికులు అడ్డదారుల గుండా వెళ్ళవలసి వచ్చేది, గ్రామీణ జీవితం స్తంభించిపోయింది, ఇశ్రాయేలులో నలభైవేల మందికి కూడా డాలు గానీ ఈటె గానీ కనిపించలేదు. అంటే వారి వద్ద ఆయుధాలు కూడా లేవు, సీస్రా  సైనిక అణచివేత వారిని పూర్తిగా నిరాయుధులుగా, నిస్సహాయులుగా మార్చివేసింది. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఇశ్రాయేలీయులు యావేకు మొరపెట్టుకున్నారు (న్యాయాధిపతులు 4:3), దేవుడు వారి మొరను విన్నాడు.

దేవుని పిలుపు - బారాకును పిలవడం

న్యాయాధిపతులు 4:6-7లో దెబోరా సేవ ప్రారంభమవుతుంది. ఆమె నఫ్తాలి గోత్రానికి చెందిన కాదేషులో నివసించే బారాకు అనే వ్యక్తిని పిలిపించి, అతనితో ఇలా చెప్పింది: " ఆమె ఒకనాడు నఫ్తాలి మండలము నందలి కేదేషుకు చెందిన అబీనోవము కుమారుడు బారాకును పిలిపించి “వినుము, యిస్రాయేలు దేవుడైన యావే ఆజ్ఞ ఇది. నీవు నఫ్తాలి, సెబూలూను మండలముల నుండి పదివేలమంది యోధులను ప్రోగుజేసికొని తాబోరు కొండకు నడువుము.యాబీను సైన్యాధిపతియైన సీస్రా సైన్యములతో, రథములతో వచ్చి కీషోను వాగు వద్ద నిన్ను ఎదుర్కొనునట్లు చేయుదును. అతనిని నీ వశము చేయుదును” అని చెప్పెను."

ఈ ప్రవచనంలో మనం గమనించవలసిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది, దెబోరా ఈ ప్రణాళికను స్వయంగా రూపొందించలేదు.   ఇది స్పష్టంగా దేవుని ఆజ్ఞగా ఆమె ప్రకటించింది. ఆమె పాత్ర దేవుని సందేశాన్ని నమ్మకంగా ప్రసారం చేయడం. రెండవది, దేవుని ప్రణాళికలో నిర్దిష్ట వివరాలు ఉన్నాయి.  ఎంతమంది సైనికులు కావాలో (పదివేలు), ఏ గోత్రాల నుండి (నఫ్తాలి, జెబూలూను), ఎక్కడ సమావేశం కావాలో (తాబోరు కొండ), శత్రువును ఎక్కడికి రప్పించాలో (కీషోను నది)  ఇదంతా దేవుని పరిపూర్ణ ప్రణాళికను, ఆయన యుద్ధ వ్యూహాన్ని ముందుగానే నిర్ణయించి ఉంచాడని చూపుతుంది. మూడవది, విజయం ముందుగానే వాగ్దానం చేయబడింది.  "అతనిని  నీచేతికి అప్పగించెదను" అని దేవుడు హామీ ఇచ్చాడు, యుద్ధం జరగకముందే.

బారాకు సందేహం, దెబోరా ప్రతిస్పందన

బారాకు స్పందన ఆసక్తికరంగా ఉంటుంది. అతను దెబోరాతో “నీవును నా వెంట వచ్చెదవేని నేను వెళ్ళెదను. నీవు రావేని నేనును వెళ్ళను” అని అంటాడు (న్యాయాధిపతులు 4:8). ఈ మాటలు బారాకు స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి కీలకమైనవి. అతను దేవుని వాక్యాన్ని పూర్తిగా తిరస్కరించలేదు, కానీ దానిపై పూర్తి విశ్వాసంతో ముందుకు సాగడానికి కూడా సిద్ధపడలేదు. అతనికి దెబోరా భౌతిక సాన్నిధ్యం, ఆమె ద్వారా వచ్చే దైవిక హామీ ధైర్యం కోసం అవసరమైంది.

దెబోరా బదులిస్తూ ఇలా చెప్పింది: " నేను తప్పక నీతో వత్తును. కాని ఈ పయనము వలన నీకు కీర్తి కలుగదు. ప్రభువు సీస్రాను ఒక ఆడుపడుచు చేతికి అప్పగించును " (న్యాయాధిపతులు 4:9). ఈ ప్రవచనం రెండు రెట్లు ప్రాముఖ్యమైనది. మొదటిది, దెబోరా బారాకు అభ్యర్థనను అంగీకరించింది, తానే స్వయంగా అతనితో యుద్ధరంగానికి వెళ్ళడానికి సిద్ధపడింది.  ఇది ఆమె ధైర్యాన్ని, తన బాధ్యత పట్ల ఆమెకున్న అంకితభావాన్ని చూపుతుంది. రెండవది, ఆమె ఒక కొత్త ప్రవచనం చేసింది.  యుద్ధంలో అంతిమ ఘనత బారాకుకు కాక, ఒక స్త్రీకి దక్కుతుందని. ఈ ప్రవచనం కథ చివర్లో సీస్రా  ఒక స్త్రీ (యాయేలు) చేతిలో మరణించడం ద్వారా నెరవేరుతుంది.

ఇక్కడ దేవుని న్యాయం, హాస్యం రెండూ కలిసి కనిపిస్తాయి.  బారాకు ఒక స్త్రీ సహాయం లేకుండా ముందుకు సాగడానికి భయపడ్డాడు, ఫలితంగా అతని విజయపు కీర్తి కూడా ఒక స్త్రీకే దక్కింది.  మొదట దెబోరాకు, ఆమె ప్రవచనం, నాయకత్వం ద్వారా; తరువాత యాయేలుకు, ఆమె శత్రు సేనాధిపతిని వధించడం ద్వారా. ఈ ఘట్టం దేవుడు మానవ బలహీనతలను, భయాలను కూడా తన ఉద్దేశాలను నెరవేర్చడానికి వాడుకోగలడని చూపుతుంది.

అయితే బారాకును కేవలం పిరికివానిగా చూడటం సరైనది కాదు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో బారాకు పేరు కూడా చేర్చబడింది (హెబ్రీయులు 11:32)  అంటే తరువాతి తరాల క్రైస్తవ సంప్రదాయం అతనిని విశ్వాసం కలిగిన వ్యక్తిగానే గుర్తించింది. అతను దేవుని వాక్యాన్ని పూర్తిగా తిరస్కరించలేదు, తుది నిర్ణయంలో పదివేల మందిని సమకూర్చి యుద్ధానికి నడిపించాడు, తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అతని బలహీనత కేవలం అతనికి దెబోరా సమక్షం, ఆమె ద్వారా వచ్చే నిరంతర దైవ భరోసా కావాలని కోరుకోవడంలో ఉంది.  ఇది పూర్తి అపనమ్మకం కాదు, బలహీనమైన విశ్వాసం. దెబోరా, బారాకు ఇద్దరి కథ కలిపి మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తుంది  దేవుడు పరిపూర్ణమైన, భయరహితమైన విశ్వాసం ఉన్నవారిని మాత్రమే కాక, బలహీనమైన, సందేహాస్పదమైన విశ్వాసంతో కూడా తనను అనుసరించడానికి సిద్ధపడేవారిని కూడా ఉపయోగించుకుంటాడు.

యుద్ధ సన్నాహాలు - తాబోరు కొండ, పదివేల మంది

న్యాయాధిపతులు 4:10 ప్రకారం, దెబోరా బారాకుతో కలిసి కాదేషుకు వెళ్ళింది. అక్కడ నుండి బారాకు జెబూలూను, నఫ్తాలి గోత్రాలను సమావేశపరిచాడు, పదివేలమంది సైనికులు అతని వెంట తాబోరు కొండ వైపు కదిలారు, దెబోరా కూడా వారితోపాటు వెళ్ళింది. తాబోరు కొండ గలిలయ లోయలో ఉన్న ఒక ప్రత్యేకమైన, ఏకాంతంగా నిలిచిన కొండ . దాదాపు 588 మీటర్ల ఎత్తు కలిగినది, చుట్టుపక్కల మైదానం నుండి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొండను యుద్ధ స్థావరంగా ఎంచుకోవడం వ్యూహాత్మకంగా ముఖ్యమైనది  ఎత్తైన ప్రదేశం నుండి శత్రు సైన్యం కదలికలను గమనించవచ్చు, ఇనుప రథాలు కొండ ఎక్కి రాలేవు కాబట్టి ఇశ్రాయేలు సైన్యానికి ఒక సహజ రక్షణ లభించింది.

ఇదే సమయంలో, హెబెరు అనే కేనీయుడు తన కుటుంబంతో కాదేషు దగ్గర గుడారం వేసుకుని నివసిస్తున్న విషయం గ్రంథం ప్రస్తావిస్తుంది (న్యాయాధిపతులు 4:11). ఈ చిన్న వివరం కథ చివర్లో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది, ఎందుకంటే హెబెరు భార్య యాయేలు గుడారంలోనే సీస్రా  తలదాచుకుంటాడు. కేనీయులు మోషే మామ యిత్రో వంశానికి చెందినవారు, సాధారణంగా ఇశ్రాయేలీయులతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండేవారు, కానీ హెబెరు ప్రత్యేకంగా యాబీనుతో సంధి  కుదుర్చుకున్నాడని గ్రంథం పేర్కొంటుంది.   ఇది కథలో ఒక ఆసక్తికరమైన మలుపుకు వేదిక సిద్ధం చేస్తుంది.

తాబోరు కొండ, మెగిద్దో, తానాకు, కీషోను నది ఉన్న ఈ ప్రాంతం  యెస్రెయేలు లోయ అని పిలువబడేది.  ఇది పురాతన కాలం నుండి అనేక యుద్ధాలకు వేదికైన ఒక వ్యూహాత్మక భూభాగం. ఇది ఇశ్రాయేలు మధ్య భాగం నుండి గలిలయ ప్రాంతానికి, తీర ప్రాంతానికి వెళ్ళే ప్రధాన వాణిజ్య, సైనిక మార్గాలు కలిసే కూడలి. ఈ లోయలో నియంత్రణ సాధించినవారు ఉత్తర ఇశ్రాయేలు మొత్తంపై ఆధిపత్యం చెలాయించగలిగేవారు. అందుకే సీస్రా  తన బలమైన ఇనుప రథ దళాన్ని ఈ బహిరంగ మైదానంలో మోహరించాడు.   ఎత్తైన కొండలపై రథాలు పనికిరావు, కానీ విశాలమైన మైదానంలో అవి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయితే దేవుని ప్రణాళిక అదే మైదానాన్ని, ఆకస్మిక వర్షం ద్వారా బురద మయం చేసి, సీస్రా  బలాన్నే అతని పతనానికి కారణం అయ్యేలా  చేసింది.  

సీస్రాకు బారాకు తాబోరు కొండ ఎక్కిన వార్త చేరినప్పుడు, అతను తన తొమ్మిది వందల ఇనుప రథాలను, తన సైన్యమంతటినీ హరోషెతు నుండి కీషోను నది వైపు కదిలించాడు. (న్యాయాధిపతులు 4:12-13) సరిగ్గా దేవుడు ముందుగా చెప్పినట్టుగానే,  శత్రువు కూడా తెలియకుండానే, దేవుడు నిర్దేశించిన స్థలానికే వచ్చాడు.

కీషోను నది యుద్ధం

యుద్ధం ప్రారంభమయ్యే క్షణంలో దెబోరా బారాకుతో ఇలా చెప్పింది: " అపుడు దెబోరా బారాకును హెచ్చరించి, పోయి శత్రువుపై పడుము. నేడు యావే సీస్రాను నీ వశము చేసెను. ప్రభువు నీ సైన్యమునకు ముందుగా తరలి పోవును” అని చెప్పెను. బారాకు పదివేలమందిని వెంటతీసుకొని తాబోరు కొండదిగి శత్రువు ఎదుటికి వచ్చెను. " (న్యాయాధిపతులు 4:14).  ఇది యుద్ధ రంగంలో దెబోరా పాత్రకు అత్యంత కీలకమైన క్షణం.  ఆమె సైనిక వ్యూహకర్తగా, ఆధ్యాత్మిక ప్రోత్సాహకురాలిగా, దేవుని వాక్యాన్ని సరైన సమయంలో గుర్తుచేసే ప్రవక్త్రిగా వ్యవహరించింది. ఆమె మాటలు బారాకుకు, అతని సైన్యానికి అవసరమైన ధైర్యాన్ని, నమ్మకాన్ని అందించాయి.

బారాకు పదివేల మందితో తాబోరు కొండ దిగి యుద్ధానికి దిగాడు. (న్యాయాధిపతులు 4:15) ఈ యుద్ధ ఫలితాన్ని అత్యంత శక్తివంతంగా వర్ణిస్తుంది: " బారాకు రాగానే యావే సీస్రాకు, అతని రథములకు, సైన్యములకు భయము పుట్టించి వారిని కలవరపరచెను. సీస్రా రథముదిగి బ్రతుకు జీవుడాయని పిక్కబలముకొలది పారిపోయెను." ఇది బారాకు సైనిక నైపుణ్యం వల్ల వచ్చిన విజయం కాదు, యావే  స్వయంగా సాధించిన విజయం. దెబోరా పాటలో (న్యాయాధిపతులు 5:20-21) ఈ యుద్ధంలో ప్రకృతి శక్తులు కూడా ఇశ్రాయేలు పక్షాన పోరాడాయని వర్ణించింది.  ఆకాశం నుండి నక్షత్రాలు సీస్రాకు విరోధంగా యుద్ధం చేశాయని, కీషోను నది ఉప్పొంగి శత్రు సైన్యాన్ని కొట్టుకుపోయిందని కవితాత్మకంగా చెప్పంది. బహుశా భారీ వర్షం కురిసి కీషోను నది వరదెత్తి, సీస్రా ఇనుప రథాలు బురదలో చిక్కుకుపోగా, తమ అతిపెద్ద బలమే వారికి పెద్ద బలహీనతగా మారి ఉండవచ్చు.

సీస్రా  పలాయనం

యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు, సీస్రా  తన రథం దిగి కాలినడకన పారిపోయాడు (న్యాయాధిపతులు 4:15). ఇది సిస్రాకు  అవమానకరమైన పరిస్థితి.   తొమ్మిది వందల ఇనుప రథాలతో వచ్చిన శక్తివంతమైన సేనాధిపతి, తన సైన్యం మొత్తం నాశనమైపోగా, ఒంటరిగా, కాలినడకన, ప్రాణభయంతో పారిపోవలసి వచ్చింది. ఇంతలో బారాకు మిగిలిన రథాలను, సైన్యాన్ని హరోషెతు హగ్గోయీము వరకు తరిమి, సీస్రా సైన్యమంతటినీ హతమార్చాడు.  (న్యాయాధిపతులు 4:16). ఇరవై సంవత్సరాల అణచివేతకు కారణమైన శక్తివంతమైన సైన్యం ఒకే రోజులో సంపూర్ణంగా నాశనమైపోయింది.

యాయేలు గుడారం – సీస్రా  వధ

సీస్రా  పరుగెత్తుకుంటూ కేనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారానికి చేరుకున్నాడు, ఎందుకంటే హెబెరు కుటుంబానికి, యాబీనుకు మధ్య సంధి   ఉండేది కాబట్టి అక్కడ తనకు రక్షణ దొరుకుతుందని అతను భావించాడు (న్యాయాధిపతులు 4:17).  యాయేలు సీస్రాకు ఎదురుపోయి దొరా! ఇటురమ్ము. మా గుడారమున వసింపుము. ఇచటనేమియు భయపడనక్కరలేదు అని అతనిని ఆహ్వానించెను. అతడు ఆమె గుడారమున ప్రవే శించెను. యాయేలు సీస్రాను కంబళితో కప్పెను.” (న్యాయాధిపతులు 4:18). సీస్రా  దాహంతో నీళ్ళు అడిగినప్పుడు, యాయేలు పాలు ఇచ్చి, మళ్ళీ అతనిని కప్పింది (న్యాయాధిపతులు 4:19)  ఈ ఆతిథ్యం, పాలలోని కొవ్వు పదార్థం అతనిని మరింత గాఢనిద్రలోకి జారుకునేలా చేసి ఉండవచ్చు.

అలసిపోయిన సీసెరా యాయేలుతో గుడారము వాకిట నిలిచి, ఎవరైనా వచ్చి 'ఇక్కడ ఎవడైన ఉన్నాడా' అని అడిగినయెడల 'లేడు' అని చెప్పుము అని చెప్పి గాఢనిద్రలో మునిగిపోయాడు (న్యాయాధిపతులు 4:20). అతను తనను కాపాడమని యాయేలును కావలిగా ఉంచి, తాను  నిద్రపోయాడు. ఇది అతని పూర్తి నిస్సహాయ స్థితిని, యాయేలుపై అతనికి ఉన్న అమాయక నమ్మకాన్ని చూపుతుంది.

అప్పుడు యాయేలు గుడార మేకును, సుత్తిని తీసుకుని, మెల్లగా అతని దగ్గరకు వెళ్ళి, ఆ మేకును అతని కణతలలో  గుచ్చి సుత్తితో కొత్తగా అది భూమిలోకి దిగబడింది. ఆ విధంగా సిస్రా  మరణించాడు. (న్యాయాధిపతులు 4:21). ఇది సిస్రా జీవితంలో అత్యంత నాటకీయమైన, దిగ్భ్రాంతికరమైన ఘట్టం. ఆతిథ్యం ఇచ్చిన స్త్రీయే, రక్షణ వాగ్దానం చేసిన స్త్రీయే, తనను నమ్మి నిద్రపోయిన శత్రు సేనాధిపతిని వధించింది. ఈ చర్యను నైతికంగా అర్థం చేసుకోవడానికి ఆ కాలపు యుద్ధ నీతిని, ఇశ్రాయేలు శత్రువుపై యాయేలుకున్న వైఖరిని పరిగణించాలి. ఆమె ఇశ్రాయేలు దేవుని పక్షాన, తన కుటుంబపు రాజకీయ సర్దుబాట్లకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది.

బారాకు సీస్రాను వెంబడిస్తూ యాయేలు గుడారానికి చేరుకున్నప్పుడు, యాయేలు అతనిని కలుసుకొని "నా వెంటరమ్ము. నీవు వెదకు మనుజుని చూపింతును" అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళింది.  అక్కడ సీస్రా  చనిపోయి, గుడార మేకు అతని కణతలో గుచ్చుకుని పడి ఉండటం బారాకు చూశాడు (న్యాయాధిపతులు 4:22). దీనితో దెబోరా ప్రవచనం సంపూర్ణంగా నెరవేరింది.   యుద్ధ ఘనత బారాకుకు కాక ఒక స్త్రీకి దక్కింది.

న్యాయాధిపతులు 4:23-24 ఈ కథా భాగాన్ని ముగిస్తూ, ఆ దినమున దేవుడు కనాను రాజైన యాబీనును ఇశ్రాయేలీయుల ఎదుట అణచివేశాడని, ఇశ్రాయేలీయుల చెయ్యి యాబీనుపై అంతకంతకు బలపడి, చివరికి అతనిని నాశనం చేసేవరకు కొనసాగిందని పేర్కొంటుంది.

యాయేలు చర్య నైతిక పరిశీలన

యాయేలు చర్యను చదివేటప్పుడు ఆధునిక సమజానికి నైతిక ప్రశ్నలు తలెత్తడం సహజం.   ఆతిథ్యం ఇచ్చి, రక్షణ వాగ్దానం చేసి, తనను నమ్మి నిద్రపోయిన వ్యక్తిని వధించడం మోసపూరితంగా అనిపించవచ్చు. పవిత్ర  గ్రంథం ఈ చర్యను నేరుగా సమర్థించదు లేదా ఖండించదు.  అది కేవలం జరిగిన సంఘటనను వర్ణిస్తుంది, దెబోరా గీతం దానిని ప్రశంసిస్తుంది. ఈ నైతిక సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి కొన్ని అంశాలు గమనించాలి. మొదటిది, ఆ కాలపు యుద్ధ నీతి ఇప్పటి చట్టాలకు భిన్నంగా ఉండేది. శత్రు సేనాధిపతిని ఎలాగైనా నిర్మూలించడం ఆమోదయోగ్యమైన యుద్ధతంత్రంగా పరిగణించబడేది. రెండవది, యాయేలు ఒక కేనీయురాలిగా, ఇశ్రాయేలుతో ఎలాంటి అధికారిక ఒప్పందం లేకపోయినా, ఇశ్రాయేలు దేవుని పక్షాన నిర్ణయం తీసుకుంది.   ఇది ఆమె వ్యక్తిగత విశ్వాసాన్ని, న్యాయం పట్ల ఆమెకున్న నిబద్ధతను చూపుతుంది, ఆమె కుటుంబపు రాజకీయ సౌకర్యానికి విరుద్ధంగా చేసింది. మూడవది, సీస్రా  ఇరవై సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులపై కనికరం లేకుండా అత్యాచారాలు, హింసలు సాగించిన వ్యక్తి. దెబోరా గీతంలోనే సీస్రా  సైనికులు యుద్ధంలో ఓడిన స్త్రీలను దోపుడు సొమ్ముగా ఎలా పంచుకుంటారో ప్రస్తావించబడింది, ఇది సీస్రా  సైన్యపు క్రూరత్వానికి ఒక సూచన. ఈ నేపథ్యంలో యాయేలు చర్యను ఆ కాలపు  వ్యక్తులు ఒక న్యాయమైన ప్రతీకారంగా, దేవుని తీర్పు అమలుగా చూసారు.

పవిత్ర  గ్రంథంలో ఇలాంటి నైతికంగా సంక్లిష్టమైన సంఘటనలు అరుదు కాదు. పవిత్ర  గ్రంథం మానవ చరిత్రను, దాని లోని అన్ని సంక్లిష్టతలతో సహా యథాతథంగా నమోదు చేస్తుంది, ప్రతి పాత్ర చర్యను నైతిక ఆదర్శంగా  చూపదు. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి అసంపూర్ణమైన మానవ పరిస్థితులను, అసంపూర్ణమైన మానవ చర్యలను కూడా ఉపయోగించుకోగలడు.

 

దెబోరా గీతం  - విజయ కీర్తనం

న్యాయాధిపతులు 5వ అధ్యాయం మొత్తం దెబోరా, బారాకు కలిసి పాడిన ఒక విజయ గీతం.  పవిత్ర గ్రంధంలో  అత్యంత పురాతనమైన హిబ్రూ కవితలలో దీనిని ఒకటిగా భావిస్తారు.

గీతం  ప్రారంభం - దేవుని స్తుతి

పాట ప్రారంభంలో దెబోరా, బారాకు యావేను  స్తుతిస్తారు.   ఇశ్రాయేలులో నాయకులు ముందుకు నడిచినందుకు, ప్రజలు స్వచ్ఛందంగా యుద్ధానికి తమను తాము అర్పించుకున్నందుకు యావేను  స్తుతించమని పిలుపునిస్తారు (న్యాయాధిపతులు 5:2-3). రాజులు, అధిపతులు వినాలని, తాను స్వయంగా యావేకు  కీర్తన పాడతానని దెబోరా ప్రకటిస్తుంది. తరువాత సేయీరు నుండి, ఎదోము పొలము నుండి యావే  బయలుదేరినప్పుడు భూమి కంపించింది, ఆకాశాలు కురిశాయి, మేఘాలు నీళ్ళు కురిపించాయి, పర్వతాలు యావే  సన్నిధిలో కరిగిపోయాయని వర్ణించబడింది (న్యాయాధిపతులు 5:4-5)  ఇది సీనాయి పర్వతం వద్ద దేవుడు ఇశ్రాయేలుకు కనిపించిన సంఘటనను గుర్తుచేస్తుంది, దేవుని మహిమాన్విత శక్తిని నొక్కి చెబుతుంది.

గతంలో ఇశ్రాయేలు దుస్థితి

తరువాత ఈ గీతంలో గతంలో ఇశ్రాయేలు అనుభవించిన దయనీయ స్థితిని వర్ణిస్తుంది. షమ్గరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గాలు వెలవెలబోయాయి, ప్రయాణికులు అడ్డదారుల గుండా నడవవలసి వచ్చింది (న్యాయాధిపతులు 5:6). ఇశ్రాయేలులో గ్రామీణ నాయకత్వం కొరవడింది, దెబోరా ఇశ్రాయేలుకు "తల్లి"గా లేచేవరకు అది కొనసాగింది (న్యాయాధిపతులు 5:7). ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంచుకున్నప్పుడు యుద్ధం గుమ్మములలోకి వచ్చింది, నలభైవేల మందిలో ఒక్కరికైనా డాలు గానీ ఈటె గానీ కనిపించలేదు (న్యాయాధిపతులు 5:8)  అంటే వారు పూర్తిగా నిరాయుధులుగా, రక్షణ లేకుండా ఉన్నారని తెలియజేస్తుంది.

దెబోరా "ఇశ్రాయేలుకు తల్లి"గా విజయము చేయుట  

న్యాయాధిపతులు 5:7లోని "దెబోరా! నీవు యిస్రాయేలీయులపాలిటి తల్లివలె విజయము చేయువరకును ఈ దేశమంతయు నిర్జీవమై యుండెను." అనే వాక్యం అత్యంత ప్రాముఖ్యమైనది. ఇది దెబోరా తనను తాను ఎలా చూసుకుందో తెలియజేసే స్వీయవర్ణన. "తల్లి" అనే పదం ఆమె నాయకత్వ శైలిని అర్థం చేసుకోవడానికి కీలకం.   ఆమె అధికారాన్ని కఠినంగా, నిరంకుశంగా వినియోగించలేదు,  బదులుగా ఒక తల్లి తన బిడ్డలను ఎలా కంటికి రెప్పలా కాపాడుతుందో, పోషిస్తుందో, సరిదిద్దుతుందో అలాంటి శైలిలో ఇశ్రాయేలును నడిపించింది. ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, ఒక చెల్లాచెదురైన, భయభ్రాంతమైన జాతిని తిరిగి ఏకం చేసి, రక్షించి, పోషించిన మాతృసదృశ నాయకత్వం.

వివిధ గోత్రాల భాగస్వామ్యం, నిరాకరణ

ఈ గీతంలో  ఆసక్తికరమైన మరో  భాగం వివిధ ఇశ్రాయేలు గోత్రాల ప్రవర్తనను వివరించే విభాగం (న్యాయాధిపతులు 5:14-18). ఎఫ్రాయిము, బెన్యామీను, మఖీరు, సేబూలూను, ఇస్సాఖారు గోత్రాలు యుద్ధానికి తమ నాయకులను, సైనికులను పంపి పాల్గొన్నాయని గీతం  ప్రశంసిస్తుంది. అయితే రూబేను గోత్రం గురించి  విమర్శనాత్మకంగా మాట్లాడుతుంది.  "రూబేను వీరులు చీలిపోయిరి. వారు వాదవివాదములతో కాలము వెళ్ళబుచ్చిరి. అన్నలార! మీరు గొఱ్ఱెల దొడ్లచెంత గుమిగూడి పిల్లనగ్రోవి పాటవినుచు జాగుచేయనేల?" అని ప్రశ్నిస్తుంది, రూబేనీయులు యుద్ధానికి రావాలా వద్దా అని "గొప్ప హృదయ ఆలోచనలు" చేస్తూ కూర్చున్నారని వ్యంగ్యంగా చెప్తుంది.  (న్యాయాధిపతులు 5:15-16). గిలాదు యొర్దాను అవతల ఉండిపోయింది, దాను గోత్రం ఓడలలో ఎందుకు నిలిచిపోయిందని, ఆషేరు సముద్రతీరాన కూర్చుని తన రేవుల దగ్గరే ఎందుకు ఉండిపోయిందని ఈ గీతం  ప్రశ్నిస్తుంది. (న్యాయాధిపతులు 5:17) దీనికి విరుద్ధంగా, సేబూలూను, నఫ్తాలి గోత్రాలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యుద్ధరంగంలో పోరాడాయని గొప్పగా కీర్తిస్తుంది (న్యాయాధిపతులు 5:18).

ఇక్కడ  ఇశ్రాయేలు గోత్రాల మధ్య ఐక్యత లోపాన్ని నిజాయితీగా బయటపెడుతుంది. దేశం మొత్తం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా, కొన్ని గోత్రాలు తమ స్వార్థ ప్రయోజనాలను, సౌకర్యాన్ని సంక్షోభం కంటే ప్రాధాన్యత ఇచ్చాయి. దెబోరా గీతం  ఈ వైఫల్యాన్ని దాచిపెట్టకుండా, స్పష్టంగా, ధైర్యంగా ఎత్తిచూపింది. ఇది ఆమె నాయకత్వంలోని నిజాయితీని, నిష్పక్షపాతతను తెలియజేస్తుంది.

కీషోను నది వరద వర్ణన

గీతం  తరువాత భాగంలో  యుద్ధ దృశ్యాన్ని కవితాత్మకంగా వర్ణిస్తుంది.  రాజులు వచ్చి యుద్ధం చేశారు, కనాను రాజులు తానాకులో మెగిద్దో నీళ్ళయొద్ద యుద్ధం చేశారు, కానీ ఏమీ దక్కలేదు (న్యాయాధిపతులు 5:19). ఆకాశము నుండి నక్షత్రములు తమ మార్గములలో సీస్రాతో యుద్ధం చేశాయని  చెప్తుంది. (న్యాయాధిపతులు 5:20)  ఇది బహుశా ఆకస్మిక భారీ వర్షాన్ని సూచిస్తూ ఉండవచ్చు. కీషోను నది వారిని కొట్టుకుపోయేలా చేసింది(న్యాయాధిపతులు 5:21).   నది వరదెత్తి ఇనుప రథాలను బురదలో నిలువరించి, శత్రు సైన్యాన్ని నిస్సహాయంగా మార్చివేసిందని ఇది సూచిస్తుంది. గుర్రాల డెక్కలు పరుగెత్తగా పరుగెత్తగా నేల దద్దరిల్లిందని పాట వర్ణిస్తుంది (న్యాయాధిపతులు 5:22) శత్రు గుర్రాల  దళం భయాందోళనతో గందరగోళంగా పరుగెత్తిన దృశ్యాన్ని ఇది చిత్రిస్తుంది.

మెరోసు శాపం

ఈ గీతంలో  ఒక విచిత్రమైన వచనం కనిపిస్తుంది. "అపుడు యావేదూత ఇట్లు వచించెను: మెరోసును శపింపుడు, శపింపుడు, ఆ పట్టణ వాసులను శపింపుడు. వారు యావేకు సాయము చేయుటకు రారైరి. యావే వీరులతో గూడి పోరుసల్పుటకు రారైరి." (న్యాయాధిపతులు 5:23). మెరోసు  అనే ఊరు ఎక్కడ ఉండేదో ఖచ్చితంగా తెలియదు, కానీ ఈ వచనం ద్వారా అర్థమయ్యేది ఏమిటంటే,  ఆ ఊరి ప్రజలు యుద్ధంలో సహాయం చేయడానికి రావలసి ఉండి కూడా రాలేదు, తటస్థంగా ఉండిపోయారు. ఈ నిష్క్రియాత్మకతను దేవుడు తీవ్రంగా శపించాడు,  ఇది సంక్షోభ సమయంలో నిష్క్రియత కూడా ఒక పాపమేనని, దేవుని ప్రజలకు సహాయం చేయవలసిన అవకాశం వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోవడం తటస్థత కాదు, అది వైఫల్యమేనని బోధిస్తుంది.

యాయేలును  ప్రశంసించుట

ఈ గీతం యాయేలును అత్యంత ఉన్నతంగా కీర్తిస్తుంది.   "కేనీయుడైన హెబేరుని భార్యయగు యాయేలు స్త్రీలందరికంటె ధన్యురాలు. గుడారములందు వసించు వనితలందరి కంటె ధన్యురాలు." (న్యాయాధిపతులు 5:24). ఆమె చర్యను గొప్పగా వర్ణిస్తుంది. “అతడు దాహమడుగగా ఆమె పాలు కొనివచ్చెను. యోగ్యమైన పాత్రమున పెరుగునందించెను. ఆమె చేయిచాచి గుడారపు మేకు గైకొనెను. కుడిచేతితో సుత్తె గైకొనెను. ఆ సుత్తెతో సీసాను మోది తలబ్రద్దలు చేసెను. అతని కణతలలో మేకు దిగగొట్టెను. అతడామె పాదములచెంత కూలినేలకొరగెను. ఆమె కాళ్ళచెంత కూలి నేల పైబడెను. తాను కూలినచోటనే చచ్చిపడెను. ఈ గీతం ఇక్కడ సిస్రా పతనాన్ని కళ్ళకు కట్టినట్లుగా చిత్రిస్తుంది.

 సిస్రా  తల్లి కిటికీ దగ్గర ఎదురుచూపు

ఇక్కడ  హృదయాన్ని కదిలించే, కవితాత్మకంగా శక్తివంతమైన భాగం సీస్రా  తల్లిని వర్ణించే విభాగం (న్యాయాధిపతులు 5:28-30). సీస్రా  తల్లి కిటికీలో నుండి తొంగిచూస్తూ, తెర గుండా కేకలు వేస్తూ, సిస్రా రథము రావడం ఎందుకు ఆలస్యమవుతున్నది? అతని రథముల డెక్కల చప్పుడు ఎందుకు ఆలస్యమవుతున్నది?" అని ఆత్రుతగా ప్రశ్నిస్తుంది. ఆమె తోటి స్త్రీలు, జ్ఞానవంతులైన ఆమె ఆంతరంగికులు ఆమెకు ఓదార్పు మాటలు చెబుతున్నారు.   "మన వీరులు కొల్లసొమ్ము పంచుకొనుచుందురు. మన శూరులలో ప్రతివాడు వనితలనొకర్తెనో ఇద్దరినో గైకొందురు. సీస్రాకు రంగురంగుల పట్టుసాలువలు రెండు లభించును. నాకును నగిషీ పని చేసిన పచ్చడములు రెండు” ఆ మాటలనే సీస్రా జననియు మననము చేసుకొనుచుండెను." అని ఊహిస్తారు (న్యాయాధిపతులు 5:29).

ఈ సన్నివేశం  యుద్ధపు క్రూరత్వాన్ని , దాని మూల్యాన్ని అత్యంత లోతుగా చిత్రిస్తుంది. ఒక తల్లి తన కుమారుడి రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది, తనకు తెలియకుండానే అప్పటికే చనిపోయాడని, ఆమె ఆశలన్నీ నిరాధారమైనవని ఆ తల్లికి   తెలియదు. శత్రు తల్లి కూడా, ఆమె కుమారుడు క్రూరుడైనప్పటికీ, తల్లి ప్రేమతో ఎదురుచూస్తోంది. అదే సమయంలో, ఈ వర్ణన సిస్రా  కుటుంబం ఇశ్రాయేలుపై అనేక సంవత్సరాలుగా చేసిన దోపిడీని, హింసను కూడా గుర్తుచేస్తుంది.  వారు దోపుడు సొమ్మును , బానిసలుగా చేసుకున్న స్త్రీలను ఎంత సాధారణంగా, నిర్లక్ష్యంగా చూసేవారో  చూపుతుంది.

గీతం  ముగింపు

ఈ గీతం ఒక ప్రార్థనతో ముగుస్తుంది - "ప్రభూ! నీ శత్రువులందరు సీస్రావలె నశింతురుగాక! నిన్ను ప్రేమించు జనులు మాత్రము ఉదయభానునివలె తేజముతో వెలుగొందుదురుగాక!” అటు తరువాత యిస్రాయేలీయులు నలువదియేండ్లు చీకుచింతలేకుండ జీవించిరి." (న్యాయాధిపతులు 5:31). దేవునికి విరోధులైనవారి అంతిమ గతి నాశనమే, కానీ ఆయనను ప్రేమించేవారు సూర్యుని వలె ప్రకాశవంతంగా, శక్తివంతంగా, నిత్యనూతనంగా ఉంటారు. దెబోరా, బారాకు నాయకత్వం ఇశ్రాయేలుకు ఇరవై సంవత్సరాల భయంకర అణచివేత తరువాత నలభై సంవత్సరాల సుదీర్ఘ శాంతిని, స్థిరత్వాన్ని అందించింది.

దెబోరా వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు

దెబోరా కథను మొత్తంగా పరిశీలిస్తే, ఆమె వ్యక్తిత్వంలోని అనేక విశిష్ట లక్షణాలు మనకు కనిపిస్తాయి. మొదటిది, ఆమెకున్న దేవుని పట్ల గాఢమైన విశ్వాసం.  ఆమె తన స్వంత తీర్పు లేదా వ్యూహాన్ని కాక, దేవుని  ఆజ్ఞను నమ్మి ప్రవర్తించింది. రెండవది, ఆమెకున్న ధైర్యం,  ఆమె కేవలం సందేశాన్ని అందించి తప్పుకోలేదు, స్వయంగా యుద్ధరంగానికి వెళ్ళి, ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడింది. మూడవది, ఆమెకున్న నిష్పక్షపాత న్యాయదృష్టి, గోత్రాల వైఫల్యాలను, విజయాలను ఇద్దరినీ సమానంగా, నిజాయితీగా అంచనా వేసింది, ఎవరినీ భయపడకుండా విమర్శించింది. నాలుగవది, ఆమెకున్న మాతృసదృశ నాయకత్వ శైలి.  అధికారాన్ని కఠినంగా వినియోగించకుండా, ప్రజలను పోషిస్తూ, రక్షిస్తూ నడిపించింది. ఐదవది, ఆమె కవిత్వం , ఆధ్యాత్మిక ప్రతిభ,   యుద్ధానంతరం ఆమె రచించిన గీతం దేవుని కార్యాలను స్మరించుకోవడానికి, భవిష్యత్ తరాలకు జ్ఞాపకంగా నిలవడానికి ఉపయోగపడింది.

ఆరవది, దెబోరాకున్న సహనశీలత, ఓపిక గమనించదగినది.  ఆమె తాటిచెట్టు కింద కూర్చుని రోజుల తరబడి, నెలల తరబడి ప్రజల సమస్యలను వినేది, తొందరపాటు తీర్పులు ఇవ్వకుండా ప్రతి వివాదాన్ని జాగ్రత్తగా పరిశీలించేది. ఏడవది, ఆమెకున్న వినయం,  ఆమె తనను తాను గొప్పగా ప్రచారం చేసుకోలేదు, బదులుగా విజయ ఘనతను స్పష్టంగా దేవునికి, ఆయన తరువాత మరో స్త్రీకి (యాయేలుకు) ఆపాదించింది. ఎనిమిదవది, బారాకుతో ఆమె వ్యవహరించిన తీరు ఆమెకున్న సహకార స్వభావాన్ని చూపుతుంది,  ఆమె అతని బలహీనతను చులకనగా చూడలేదు, అతని అభ్యర్థనను గౌరవించి, అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధపడింది, తనొక్కతే ఘనత పొందాలని ఆరాటపడలేదు. ఈ లక్షణాలన్నీ కలిపి దెబోరాను కేవలం ఒక చారిత్రక వ్యక్తిగా కాక, ప్రతి తరానికి అనుసరణీయమైన ఒక సంపూర్ణ నాయకత్వ నమూనాగా నిలబెడతాయి.

దైవశాస్త్ర పరమైన ప్రాముఖ్యత

దెబోరా కథ అనేక ముఖ్యమైన సూత్రాలను అందిస్తుంది. మొదటిది, దేవుడు తాను ఎంచుకున్న వ్యక్తులను ఉపయోగించుకుంటాడు, సామాజిక కట్టుబాట్లు లేదా అంచనాలతో సంబంధం లేకుండా,  ఆ కాలపు పితృస్వామిక సమాజంలో ఒక స్త్రీని ప్రవక్త్రిగా, న్యాయాధిపతిగా, యుద్ధనాయకురాలిగా నియమించడం దేవుని సర్వాధికారాన్ని, మానవ నియమాలను అధిగమించే,  ఆయన స్వేచ్ఛను చూపుతుంది. రెండవది, దేవుడు తన ప్రజల మొరను వింటాడు, తగిన సమయంలో విడుదల కలిగిస్తాడు. ఇరవై సంవత్సరాల బాధ తరువాత కూడా దేవుని కృప ఆలస్యం కాలేదు. మూడవది, విజయం మానవ శక్తి లేదా వ్యూహం వల్ల కాదు, దేవుని జోక్యం వల్లనే వస్తుంది.  తొమ్మిది వందల ఇనుప రథాలను ఎదుర్కొన్నది నిరాయుధులైన ఇశ్రాయేలు సైన్యం కాదు, స్వయంగా దేవుడే. నాలుగవది, విశ్వాసం, విధేయత చర్యలలో వ్యక్తమవ్వాలి,  దెబోరా కేవలం ప్రవచించడమే కాక, స్వయంగా యుద్ధరంగానికి వెళ్ళింది; సేబూలూను, నఫ్తాలి గోత్రాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పాల్గొన్నాయి.

ఐదవది, దెబోరా కథ న్యాయాధిపతుల గ్రంథం మొత్తంలో కనిపించే పునరావృత చక్రానికి ఒక ఆశాజనకమైన అధ్యాయం,  పాపం, అణచివేత, మొర, విడుదల, శాంతి అనే చక్రంలో దెబోరా కాలం అత్యంత దీర్ఘమైన శాంతి కాలాలలో ఒకటిగా (నలభై సంవత్సరాలు) నిలిచింది, ఇది ఆమె నాయకత్వం ఎంతటి పరిపూర్ణంగా, సమగ్రంగా పనిచేసిందో చూపుతుంది. ఆరవది, దెబోరా కథ దేవుని ప్రజలలో సమిష్టి బాధ్యత అనే భావనను నొక్కి చెబుతుంది.  ఒక్క గోత్రం మాత్రమే యుద్ధభారాన్ని మోయలేదు, అనేక గోత్రాలు తమ వంతు పాత్రను పోషించాయి, మరికొన్ని విఫలమయ్యాయి, ఈ రెండు వాస్తవాలనూ గ్రంథం నిజాయితీగా నమోదు చేస్తుంది.

ముగింపు

దెబోరా కథ - ప్రవక్త్రిగా, న్యాయాధిపతిగా, యుద్ధనాయకురాలిగా, కవయిత్రిగా ఆమె పోషించిన బహుముఖ పాత్రల కథ.   దేవుడు తన ప్రజలను రక్షించడానికి, నడిపించడానికి తాను ఎంచుకున్న వ్యక్తులను ఎలా ఉపయోగించుకుంటాడో చూపే అద్భుతమైన ఉదాహరణ. ఆమె బలహీనమైన, భయభ్రాంతమైన, నిరాయుధమైన ఇశ్రాయేలును ఏకం చేసి, దేవుని వాక్యంపై నమ్మకముంచి, తొమ్మిది వందల ఇనుప రథాలు కలిగిన శక్తివంతమైన శత్రువుపై సంపూర్ణ విజయం సాధించేలా నడిపించింది. ఆమె విజయ గీతం గోత్రాల విశ్వసనీయతను, వైఫల్యాన్ని నిజాయితీగా అంచనా వేస్తూ, దేవుని కార్యాలను శాశ్వతంగా స్మరించుకునేలా చేసింది.

దెబోరా కథలో మనం ఒక సమగ్రమైన నాయకత్వ చిత్రాన్ని చూస్తాం.  ఆధ్యాత్మిక సున్నితత్వం (ప్రవచన వరం), నైతిక దృఢత్వం (న్యాయాధిపతిగా తీర్పులు), వ్యూహాత్మక ధైర్యం (యుద్ధరంగ నాయకత్వం), సృజనాత్మక ప్రతిభ (గీత రచన) ఇవన్నీ ఒకే వ్యక్తిత్వంలో అల్లుకుపోయాయి. ఈ సమగ్రత నేటి నాయకులకు, ముఖ్యంగా సంఘంలో సేవ చేసేవారికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది.   నిజమైన ఆధ్యాత్మిక నాయకత్వం కేవలం ఒక్క కోణానికి పరిమితం కాదు, అది దేవుని వాక్యాన్ని వినడం, దానిని నమ్మకంగా ప్రకటించడం, న్యాయాన్ని నిలబెట్టడం, అవసరమైనప్పుడు ధైర్యంగా చర్య తీసుకోవడం, చివరికి దేవుని కార్యాలను స్తుతించడం అనే అన్ని కోణాలనూ కలిగి ఉండాలి.

ఈ రోజు మనం దెబోరా కథను స్మరించుకుంటూ, ఆమెలా మనం కూడా దేవుని స్వరాన్ని ప్రార్థనాపూర్వకంగా వినగలమని, ఆయన పిలిచినప్పుడు భయపడకుండా ముందుకు సాగగలమని, మన చుట్టూ ఉన్న అన్యాయాన్ని, అణచివేతను ధైర్యంగా ఎదిరించగలమని, మన సమాజంలో ఒక తల్లి వలె పోషణాత్మక, రక్షణాత్మక నాయకత్వాన్ని అందించగలమని విశ్వసిద్దాం.

ప్రార్థన: ప్రభువా, నీవు దెబోరాను ప్రవక్త్రిగా, న్యాయాధిపతిగా లేపి, ఆమె ద్వారా భయభ్రాంతమైన నీ ప్రజలను విడిపించి, నలభై సంవత్సరాల శాంతిని అనుగ్రహించావు. ఆమె విశ్వాసాన్ని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని బట్టి మాకు కూడా అటువంటి హృదయాన్ని దయచేయుము. మేము నీ స్వరాన్ని నిశ్శబ్దంగా వినే ఓపికను, నీవు పిలిచినప్పుడు భయం లేకుండా స్పందించే ధైర్యాన్ని, మా చుట్టూ ఉన్న అన్యాయాన్ని ఎదిరించే నిబద్ధతను, మా కుటుంబాలలో, మా సమాజాలలో తల్లి వంటి పోషణాత్మక నాయకత్వాన్ని అందించే వినయాన్ని దయచేయుము. మేము కూడా మా జీవితాలలో నీవు చేసిన గొప్ప కార్యాలను స్మరించుకుంటూ, వాటిని స్తుతి గీతాలుగా, సాక్ష్యాలుగా ఇతరులతో పంచుకునేలా మాకు సహాయం చేయుము. మా విశ్వాసం బలహీనంగా ఉన్నప్పుడు కూడా, నీవు మమ్మల్ని విడిచిపెట్టవని, నీ కృపతో మమ్మల్ని ముందుకు నడిపిస్తావని నమ్ముచున్నాము.ఆమెన్

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు