చిన్న తెరేసమ్మ - చిరు మార్గం గురించి 10 ప్రశ్నలు
1. చిన్న తెరేసమ్మ ఎవరు?
తెరేసా మార్టిన్ (1873-1897)
ఫ్రాన్స్‌లోని లిస్యూ పట్టణంలో జన్మించింది. కేవలం 15 సంవత్సరాల వయసులో కార్మెలైట్ సన్యాసినిగా మారి,
24 సంవత్సరాలకే క్షయవ్యాధితో
మరణించింది. ఆమె జీవితం చిన్నదే అయినా, ఆమె రాసిన 'ఒక ఆత్మ కథ'
(Story of a Soul) పుస్తకం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసింది. 1997లో రెండవ
జాన్ పాల్ పోపు గారు ఆమెను తిరుసభ పండితురాలిగా ప్రకటించారు . తీరు సభ చరిత్రలో ఆ
గౌరవం పొందిన నలుగురు స్త్రీలలో ఆమె మూడవ వారు.
2. 'చిరు మార్గం' అంటే ఏమిటి?
గొప్ప త్యాగాలు, అద్భుతమైన కార్యాలు చేయాలని చిన్న తెరేసమ్మ అనుకోలేదు. బదులుగా, ప్రతి చిన్న పనిని, గిన్నెలు కడగడం, నుండి
విసుగు తెప్పించే తోటి సన్యాసినుల ప్రవర్తనను సహనంతో భరించడం, చిరునవ్వుతో సేవ చేయడం, అపారమైన ప్రేమతో ప్రతి పనిని చేయడమే ఆమె మార్గం. ఆమె దీన్ని 'చిరు పుష్పాల మార్గం' అని కూడా పిలిచింది. ఎత్తైన కొండను అధిరోహించలేని
చిన్న పిల్లవాడు తండ్రి చేయి పట్టుకున్నట్లు, మనం కూడా దేవుని కృపపై పూర్తిగా ఆధారపడాలని ఆమె
బోధించింది.
"మీరు చిన్న బిడ్డలవలె కానియెడల
పరలోకరాజ్యములో ప్రవేశింపరు."
-మత్తయి
18:3
3. ఇది సోమరితనానికి సాకు కాదా?
కాదు. చిరు మార్గం అంటే తక్కువ ప్రయత్నం కాదు; అది ప్రతి క్షణంలో పూర్తి ప్రేమను పెట్టడం. తెరేసమ్మ
స్వయంగా చాలా కష్టపడింది. తనకు నచ్చని సన్యాసినితో కూడా ప్రత్యేక దయతో ప్రవర్తించడం, అనారోగ్యంతో బాధపడుతూ కూడా చిరునవ్వు కోల్పోకపోవడం
వంటి పనులు చేయడానికి చాలా ప్రయత్నం చేయాలి.
ఆమె తన సాధించిన ఘనతలపై కాక, దేవుని ప్రేమపై నమ్మకం పెట్టింది.
4. ఆమె 'ఆధ్యాత్మిక చీకటి రాత్రి' ఎదుర్కొందా?
అవును, చివరి సంవత్సరంన్నరలో ఆమెకు విశ్వాసమే సందేహాస్పదంగా
అనిపించింది. దేవుడు ఉన్నాడా, పరలోకం ఉందా అనే తీవ్రమైన చీకటి ఆమె హృదయాన్ని
ఆవరించింది. అయినా ఆమె ప్రార్థన మానలేదు, సేవ మానలేదు. ఈ అనుభవం సిలువ యోహాను
బోధించిన 'ఆత్మ
గాఢాంధకార రాత్రి'కి
దగ్గరగా ఉంటుంది. విశ్వాసం అనుభూతిపై కాదు, నిబద్ధతపై ఆధారపడి ఉంటుందని ఇది చూపిస్తుంది. కేవలం
దైవ అనుభవం ఉంటేనే నేను ఏమైన చేస్తాను, లేక పోతే చేయను అనుకుంటే విశ్వాస పరంగా ఏమి చేయలేము.
5. 'పూల వర్షం' వాగ్దానం ఏమిటి?
మరణానికి ముందు ఆమె
"నా పరలోకాన్ని భూమిపై మంచి చేయడంలో గడుపుతాను, గులాబీల వర్షం కురిపిస్తాను" అని చెప్పింది.
దీని అర్థం, తాను చనిపోయిన తర్వాత కూడా ప్రజల కోసం మధ్యవర్తిత్వం చేస్తూనే ఉంటానని.
గులాబీల వర్షం అంటె దేవుని అనుగ్రహాలను వర్షంలా కుమ్మరిస్తాను అని చెప్పింది. ఈ వాగ్దానం వల్లే ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఆమెను తమ కొరకు ప్రార్ధించమని అడుగుతారు.
6. ఈ బోధన నేటి మన జీవితానికి ఎలా వర్తిస్తుంది?
మనం రోజూ ఎదుర్కొనే చిన్న
చిరాకులు, ట్రాఫిక్‌లో ఆలస్యం, ఇంట్లో అపార్థాలు, పనిలో గుర్తింపు లేకపోవడం , వీటిని విసుగుతో కాక ప్రేమతో స్వీకరించమని ఆమె
బోధన చెబుతుంది. గొప్ప తీర్థయాత్రలు చేయలేకపోయినా, ఇంట్లో ఓపికగా ఉండటమే మన 'చిరు మార్గం' కావచ్చు.
7. ఆమెకు కార్మెల్ సభతో సంబంధం ఏమిటి?
చిన్న తెరేసమ్మ నిష్పాధుక కార్మెల్ సభ సన్యాసిని, అవిలాపురి తెరేసమ్మ సంస్కరించిన సంప్రదాయంలోనే ఆమె జీవించింది, ప్రార్థించింది. ఆవిలా తెరీసమ్మ 'అంతరంగిక
కోట'లో
బోధించిన లోతైన ధ్యానాన్ని, చిన్న
తెరేసమ్మ జీవితపు అతి చిన్న వాటిలోనికి
తీసుకువచ్చింది. ఇద్దరూ ఒకే మార్గానికి
రెండు వేర్వేరు దృక్కోణాలు.
8. ఆమెకు ఏ ప్రార్థన చేయవచ్చు?
పనిలో ఓపిక నశించినప్పుడు, కుటుంబ సభ్యులతో సహనం కోల్పోతున్నప్పుడు, లేదా విశ్వాసం బలహీనంగా అనిపించినప్పుడు, ఆమెను తలుచుకుని ఒక్క చిన్న ప్రార్థన చేయవచ్చు: 'చిన్న తెరేసమ్మా, ఈ క్షణంలో నాకు ప్రేమతో సేవ చేసే శక్తినివ్వు.'
9. చిన్న తెరేసమ్మ ఎవరికి పాలక పునీతురాలు
చిన్న తెరేసమ్మ ప్రేషిత
కార్యంలో ఉన్న ప్రతి మిషనరికి పునీత ఫ్రాన్సిస్ శౌరి వారితో పాటు పాలక పునీతురాలు.
ఆమె ఏ దేశానికి వెళ్ళి పరిచర్య చేయనప్పటికి మిషనరీల కోసం ప్రార్ధించేది. మరియు మిషినరీ
కావలనే కోరికతో ఉండేది.
10. చిన్న తెరేసమ్మ తిరుసభలో ఏమి కావలనుకుంది?
చిన్న తెరేసమ్మ తిరుసభలో
అన్నీ కావలనుకున్నది. అన్నీ కావాలనుకున్న అందుకు ఆమెకు శక్తి లేదని, పునీత పౌలు గారి పత్రిక ద్వారా అన్నిటికీ ప్రేమే
ముఖ్యం అని, ఆ ప్రేమ కలిగి ఉంటే అన్నీ అయినట్లేనని, తిరుసభ హృదయంలో ప్రేమ కావలనుకున్నది.
ప్రార్థన
పునీత చిన్న తెరేసమ్మా, నీ చిరు
మార్గమును మాకు బోధించు. మా జీవితములో అతి చిన్న పనులను కూడా అపారమైన ప్రేమతో నిర్వర్తించే
హృదయాన్ని మాకు దయచేయుము. మా విశ్వాసము చీకటిలో
ఉన్నప్పుడు కూడా, నీవు నడిచిన మార్గంలో స్థిరంగా నిలబడే శక్తినివ్వమని మా కొరకు వెడుకొనండి.
ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment