వ్యాకుల మాత స్మరణ

 

వ్యాకుల మాత  స్మరణ

" ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది."

సెప్టెంబర్ 14న పరిశుద్ధ సిలువ మహోత్సవాన్ని  జరుపుకున్న మరుసటి రోజే, సెప్టెంబర్ 15న శ్రీసభ వ్యాకుల మాతను స్మరిస్తుంది.(Our Lady of Sorrows) ఈ రెండు పండుగలు కలిసి ఉండటం యాదృచ్ఛికం కాదు,  సిలువను హెచ్చించిన మరుసటి రోజే, ఆ సిలువ కింద నిలబడిన తల్లిని మనం స్మరించుకుంటాము.

బాధ, కష్టం, నష్టం ఎరుగని మానవ జీవితం లేదు. దేవుని తల్లి కూడా అదే బాధలను  అనుభవించిందని తెలుసుకోవడం మనకు ఎనలేని ఓదార్పు నిస్తుంది. మరియమాత  మన మధ్యలోనే, మన కన్నీళ్ల మధ్యలోనే నిలబడి ఉంది. మరియమాత  బాధలను  ధ్యానించడం అంటే దుఃఖాన్ని  కీర్తించడం కాదు. అనివార్యమైన బాధలను కష్టాలను ఎలా  ఎదుర్కోవాలో మరియమాత  జీవితం మనకు నేర్పుతుంది.

ఈ భక్తికి మూలం పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. యేసు ప్రభువును దేవాలయంలో సమర్పించినప్పుడు, సిమియోను మరియమాతతో " ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది" అని చెబుతాడు. (లూకా 2: 35). ఈ ప్రవచనం సిలువ దగ్గర పరిపూర్ణంగా నెరవేరింది. యోహాను సువార్త చెబుతుంది: "యేసు సిలువ వద్ద  ఆయన తల్లి... నిలువబడి యుండిరి" (యోహాను 19:25). మరియమాత  పారిపోలేదు, స్పృహ తప్పి పడిపోలేదు.  ఆమె అక్కడే  నిలబడి వుంది. ఆమె తల్లి కాబట్టి శిష్యుల వలె పారిపోలేదు, కాని ఆమె తన బాధకు కారకులమీద నింద మోపలేదు. కేవలం సిలువ క్రిందనే నిలుచుని ఉంది.

నజరేతులో "ఇదిగో ప్రభువు దాసురాలను" (లూకా 1:38) అని పలికిన మరియమాతే, ముప్పై మూడు సంవత్సరాల తరువాత సిలువ దగ్గర కూడా అదే విశ్వాసంతో నిలబడింది. బేత్లెహేములో శిశువును ఎత్తుకున్న ఆ చేతులే, కల్వరిలో మృత దేహాన్ని తన ఒడిలో పట్టుకున్నాయి. దేవుని చిత్తానికి  మనం చెప్పే "అవును" ఒకసారితో ముగిసేది కాదు, అది జీవితమంతా, ముఖ్యంగా కష్టకాలాలలో, పునరుద్ఘాటించవలసిన నిబద్ధత.

సిలువ దగ్గర యేసు ప్రభువు తన ప్రియ శిష్యుడైన యోహానును తన తల్లికి అప్పగించాడు. "అమ్మా, ఇదిగో నీ కుమారుడు" (యోహాను 19:26-27) అని చెప్పాడు. ఆ క్షణమే ఆమె విశ్వ శ్రీ సభకు తల్లి అవుతుంది. అప్పటి నుండి శ్రీసభ ప్రతి బాధలో ఆమె పాలు పంచుకుంటుంది. శిష్యులు అందరు పై గదిలో భయంతో ఉన్నప్పుడు ఆమె అక్కడ  ఉంది.  

శ్రీసభ మరియమాతను  "నూతన ఏవ"గా  చూసింది. ఏవ మంచి చెడుల  చెట్టు వద్ద అవిశ్వాసం చూపగా, మరియమాత  సిలువ చెట్టు వద్ద విశ్వాసంతో నిలబడింది.

వ్యాకుల మాత స్మరణ

పండేడు, పదమూడవ శతాబ్దాలలో సిలువపై, యేసు ప్రభువు  బాధలపై ఎక్కువగా ధ్యానించేవారు; ఈ కాలంలోనే వ్యాకుల మాత  శ్లోకం రచించబడింది. ఈ భక్తిని మరియమాత సేవకులు అనే సన్యాస సభ వారు వ్యవస్థీకరించారు. ఐదవ బెనెడిక్ట్ పోపుగారు 1304 లో ఈ సభను  అధికారికంగా గుర్తించారు. 1814లో ఏడవ భక్తినాధ్ పోపుగారు దీనిని నెపోలియన్ చెరసాల నుండి విడుదలైన తరువాత కృతజ్ఞతగా శ్రీసభ మొత్తానికి విస్తరించారు. 1913లో పదవ భక్తినాధ్ పాపుగారు దీనిని సెప్టెంబర్ 15కు స్మరణను శాశ్వతంగా నిర్ణయించారు.

దుఃఖాల తల్లి హృదయం

యేసు ప్రభువు సిలువ మీద మరణించే సమయంలో సిలువ దగ్గర మరియమాత నిలబడి ఉంది . ఆమె పరిగెత్తలేదు, కేకలు వేయలేదు, మూర్ఛపోలేదు. యోహాను సువార్త ఈ విషయమును గురించి ఒక్క మాటలో "యేసు సిలువ దగ్గర ఆయన తల్లి నిలిచియుండెను" అని చెబుతుంది (యోహాను 19:25). సిలువ దగ్గర నిలబడి ఉంది. కాని ఆ నిశ్శబ్ద నిలుకడలోనే మరియ మాత హృదయం మనకు ఎంతో బోధిస్తుంది.

మనం కూడా జీవితంలో సిలువ దగ్గర నిలబడవలసిన క్షణాలు ఎదుర్కొంటాము. ప్రియమైన వారి అనారోగ్యం, కుటుంబంలో విరిగిపోయిన సంబంధాలు, ఆర్థిక భారాలు, భవిష్యత్తు గురించి భయం. అలాంటప్పుడు మనం ఏమి చేయాలో తెలియక కుప్పకూలిపోతాము. కానీ మరియ మాత మనకు వేరే మార్గం చూపిస్తుంది: పారిపోకుండా, నిలబడటం. అర్థం కాకపోయినా, నమ్మకం వదలకపోవడం.

"ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది." - లూకా 2:35

మరియమాతకు  దేవాలయంలో సిమియోను ఈ మాటలను చెప్పినప్పుడు, యేసు ప్రభువు పసి బాలుడు. ఆ ఖడ్గం ఏనాటికి వస్తుందో ఆమెకు తెలియదు. కానీ ఆ మాట ఆమె హృదయంలో ఎప్పుడూ నిలిచి ఉండేది. భరించలేని ఈ బాధ  ఎప్పుడైనా రావచ్చు అని ఎరిగి ఆమె ప్రతి రోజూ జీవించింది. మనం కూడా అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటూనే, ప్రస్తుత క్షణంలో నమ్మకంగా జీవించాలని ఆమె జీవితం మనకు గుర్తుచేస్తుంది.

వ్యాకుల మాత 

తీరుసభ  సంప్రదాయంలో మరియమాతను "వ్యాకుల మాత " (Our Lady of Sorrows) అని పిలుస్తారు.  వ్యాకుల మాత గురించి మాటలాడినప్పుడు సహజముగా ఆమె పొందిన ఏడు దుఃఖాల గురించి మాటలాడుతారు. ఈ ఏడు దుఃఖాలు ఆమె జీవితంలో ఒక్కసారిగా వచ్చినవి కావు; అవి సంవత్సరాల తరబడి, వేర్వేరు సందర్భాలలో ఆమె హృదయాన్ని గుచ్చుకుంటున్న  ముళ్ళు.

మొదటిది, సిమియోను ప్రవచనం, "ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది" అనే మాట. రెండవది, ఐగుప్తుకు పారిపోవడం, బాల  యేసును కాపాడుకోవడానికి రాత్రికి రాత్రి తెలియని దేశానికి పారిపోవలసి రావడం. మూడవది, దేవాలయంలో బాల యేసును కోల్పోవడం, మూడు రోజుల పాటు తన కుమారుడు ఎక్కడున్నాడో తెలియని ఆందోళన. నాలుగవది, కల్వరి మార్గంలో సిలువను మోసుకుంటున్న యేసు ప్రభువును కలవడం. ఐదవది, సిలువ దగ్గర ఆయన మరణాన్ని కళ్ళారా చూడడం. ఆరవది, సిలువ నుండి దించిన యేసు ప్రభువును  దేహాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం. ఏడవది, ఆయన శరీరాన్ని సమాధిలో ఉంచడం.

ఈ ఏడు దుఃఖాలను ధ్యానించడం వల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మరియమాత దుఃఖం ఒక్క క్షణంలో ముగిసిపోయింది కాదు. అది జీవితమంతా, చిన్న చిన్న సంఘటనల్లో, పదే పదే ఆమెను పరీక్షించింది. మన జీవితంలో కూడా దుఃఖం అలాగే వస్తుంది.  ఒక్కసారిగా కాదు, అనేక రూపాల్లో, అనేక సందర్భాల్లోవస్తూనే ఉంది. మరియమాత జీవితం మనకు నేర్పేది, ప్రతి కొత్త దుఃఖాన్ని కూడా అదే నమ్మకంతో ఎదుర్కోవాలని.

కల్వరి మార్గంలో తల్లి అడుగులు

సిలువను  మోసుకొని వస్తున్న  యేసు ప్రభువును చూసినప్పుడు మరియమాత ఏమి చేసిందో సువార్తలు వివరంగా చెప్పవు. కానీ తిరుసభ సంప్రదాయం, ముఖ్యంగా "సిలువ మార్గం" (Way of the Cross) లోని నాలుగవ పాటుల మార్గములో  ఆమె తన కుమారుడిని కలిసిన క్షణాన్ని గుర్తు చేస్తుంది. ఒక తల్లి తన కుమారుడు రక్తసిక్తమైన శరీరంతో, ముళ్ళ కిరీటంతో, బరువైన సిలువను మోస్తూ నడుస్తుంటే చూసిన ఆ క్షణం ఎంత భయంకరమైనదో ఊహించుకోండి. అయినా ఆమె అతని వెంటే నడిచింది. దూరంగా వెళ్ళిపోలేదు, కళ్ళు మూసుకోలేదు. ప్రతి అడుగులో ఆయనతో పాటే ఉంది.

ఇది మనకు ఒక ముఖ్యమైన విషయం  నేర్పిస్తుంది,  ప్రేమ ఉన్నచోట, కష్టాన్ని చూసి పారిపోవడం సాధ్యం కాదు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, మనం వారి బాధను తీసివేయలేకపోయినా, వారి పక్కన నిలబడగలగాలి, దానినే మనం ఇక్కడ చూస్తాము. మరియమాత యేసు ప్రభువుని బాధను  తీసివేయలేకపోయింది, కానీ ఆయనతో పాటు నడిచింది. కొన్నిసార్లు ప్రేమ అంటే పరిష్కారం చూపడం కాదు, కేవలం తోడుగా ఉండడం.

"ఇదిగో నీ కుమారుడు" - సిలువ దగ్గర లభించిన కొత్త కుటుంబం

యేసు ప్రభువు సిలువ మీద ఉన్న చివరి క్షణాల్లో యేసు ప్రభువు  తన తల్లికి, తనకు ఇష్టమైన శిష్యుడైన యోహానుకు ఒక కొత్త సంబంధాన్ని ఇచ్చాడు. "స్త్రీ, ఇదిగో నీ కుమారుడు" అని తల్లితో, "ఇదిగో నీ తల్లి" అని యోహానుతో చెప్పాడు (యోహాను 19:26-27). తన స్వంత మరణ వేదనలో కూడా యేసు ప్రభువు  తన తల్లి భవిష్యత్తు గురించి ఆలోచించాడు.  ఆమెను ఒంటరిగా వదిలిపెట్టలేదు.

ఈ మాటల్లో తీరుసభ  మరో లోతైన అర్థాన్ని కూడా కనుగొంటుంది, మరియమాత కేవలం యోహానుకే కాదు, ప్రతి విశ్వాసికీ ఆధ్యాత్మిక తల్లిగా ఇవ్వబడింది. మన అత్యంత బాధాకరమైన క్షణాల్లో కూడా, తండ్రి మనలను ఒంటరిగా వదిలిపెట్టడు.  ఒక తల్లి ప్రేమను మనకు అనుగ్రహించాడు. దుఃఖంలో ఉన్నప్పుడు మనం మరియమాతను తల్లిగా ఆశ్రయించవచ్చు, ఎందుకంటే ఆమెకు దుఃఖం అంటే ఏమిటో స్వయంగా అనుభవం ఉంది.

మౌనంలో ఉన్న బలం

ఈనాటి ప్రపంచంలో మనం బాధను ఎదుర్కొన్నప్పుడు వెంటనే మాట్లాడాలని, వివరించాలని, ఎవరో ఒకరికి చెప్పి తేలిక పడాలని అనుకుంటాము. కానీ మరియమాత జీవితం మనకు మరో మార్గాన్ని కూడా చూపిస్తుంది.  మౌనంగా, దేవుని సన్నిధిలో దుఃఖాన్ని మోయడం. లూకా సువార్తలో "మరియ ఈ సంగతులన్నిటిని తన హృదయములో పదిలపరచుకొని  ధ్యానించుచుండెను" అని రెండు సందర్భాల్లో చెప్పబడింది (లూకా 2:19, 2:51). ఆమె ప్రతిదీ బహిరంగంగా చెప్పలేదు; తన హృదయంలో దాచుకుని దేవునితో ధ్యానించింది.

ఇది మనకు నేర్పే విషయం ఏమిటంటే, ప్రతి బాధను వెంటనే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చొని, మన హృదయంలోని భారాన్ని ఆయనకు అప్పగించడమే గొప్ప ప్రార్థన అవుతుంది.

పునరుత్థాన ఆశ

మరియమాత దుఃఖం నిరాశతో ముగియలేదు అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. శనివారం నాడు, యేసు ప్రభువు  సమాధిలో ఉన్నప్పుడు, తిరుసభ  ఆమెను "విశ్వాసానికి చిహ్నం"గా భావిస్తుంది. ఎందుకంటే ఆ చీకటి రోజున కూడా ఆమె తన కుమారుడు తిరిగి లేస్తాడని నమ్మకం కోల్పోలేదు.  శుక్రవారం సిలువ, ఆదివారం పునరుత్థానం మధ్య శనివారం నిశ్శబ్దం ఉంది, ఆ నిశ్శబ్దంలోనే మరియమాత విశ్వాసం నిలిచి ఉంది.

మన జీవితంలో కూడా, దుఃఖం శాశ్వతం కాదు అని ఈ సత్యం మనకు గుర్తు చేస్తుంది. మనం సిలువ దగ్గర ఆగిపోము.  పునరుత్థానం వైపు నడుస్తున్నాము. ఇప్పుడు ఖడ్గం మన హృదయాన్ని దూసుకుపోతున్నట్లు అనిపించినా, దేవుని ప్రణాళికలో ప్రతి శుక్రవారం తర్వాత ఒక ఆదివారం ఉంటుంది.

మరియమాతను ఎలా అనుకరించాలి

  1. ప్రార్థనలో నిలబడటం నేర్చుకోవాలి,  కష్ట సమయాల్లో దేవుని నుండి పారిపోకుండా, ప్రార్థనలో ఆయన సన్నిధిలో నిలబడాలి, జవాబు వెంటనే రాకపోయినా నిరీక్షణలో ఉండాలి.
  2. ఇతరుల బాధలో తోడుగా ఉండాలి - ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారికి పరిష్కారాలు చెప్పే బదులు, మరియమాత లాగా వారి పక్కన మౌనంగా నిలబడి తోడుగా ఉండాలి.
  3. హృదయంలో ధ్యానించాలి - ప్రతి అనుభవాన్ని వెంటనే అర్థం చేసుకోవాలని ప్రయత్నించే బదులు, దానిని దేవుని ముందు ఉంచి, సమయం తీసుకుని ధ్యానించాలి.
  4. ఆశను వదలకూడదు  - శనివారం నిశ్శబ్దంలో కూడా ఆదివారం వస్తుందని నమ్మిన మరియమాత విశ్వాసాన్ని మనం అనుకరించాలి.
  5. మరియమాతను తల్లిగా ఆశ్రయించాలి – యేసు ప్రభువు  స్వయంగా ఆమెను మనకు తల్లిగా ఇచ్చాడు కాబట్టి, మన బాధలను ఆమెకు అప్పగించడానికి వెనుకాడకూడదు.

ఈ రోజు, మీ హృదయంలో ఏదైనా 'ఖడ్గం' గుచ్చుకుంటున్నట్లు అనిపిస్తే, మరియమాత దగ్గరకు వెళ్ళవచ్చు. ఆమెకు మన పరిస్థితి వివరించాల్సిన అవసరం లేదు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో ఆమెకు తెలుసు. కేవలం ఆమె పక్కన నిలబడి, ఆమెతో పాటు మౌనంగా ఉన్నట్లయితే, దుఃఖంలో కూడా విశ్వాసం కోల్పోకుండా ఎలా నిలబడాలో ఆమె మనకు నేర్పిస్తుంది. మరియు ఆమె వెంట నడిచేవారికి, శుక్రవారం చీకటి తర్వాత ఆదివారం వెలుగు తప్పకుండా వస్తుందని కూడా ఆమె గుర్తు చేస్తుంది.

ప్రార్థన

దుఃఖాల తల్లీ, సిలువ దగ్గర నిలబడిన నీ ధైర్యాన్ని మాకు దయచేయుమని, మా హృదయాన్ని గుచ్చే ప్రతి ఖడ్గాన్ని నీతో పాటు మౌనంగా భరించే శక్తినివ్వమని, మేము ఎప్పుడూ పారిపోకుండా, విశ్వాసంతో మీ వలె నిలబడునట్లు మమ్మును కాపాడుమని ప్రభువుకు మా కొరకు వెదుకొనండి. మా దుఃఖాలన్నిటిలో నీవు మాకు తల్లిగా తోడుగా ఉండి, పునరుత్థాన ఆశను మా హృదయాలలో నిలిపి ఉంచమని వేడుకుంటున్నాము. ఆమెన్.


Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి