26వ సామాన్య ఆదివారం : తండ్రి పిలుపు, మారిన హృదయం
తండ్రి పిలుపు, మారిన హృదయం
యెహెఙ్కేలు 18:25-28, ఫిలిప్పీ 2:1-5, మత్తయి 21:28-32
ఈనాటి దైవవాక్యం మన ముందు ఒక్క ప్రశ్న ఉంచుతుంది, ఆ ప్రశ్న ఏమిటంటె, దేవుని ఎదుట నా నిజమైన స్థితి ఏమిటి? నేను నోటితో చెప్పేది వేరు, నా హృదయంలో ఉన్నది వేరు అయితే, దేవుని దృష్టిలో నిజంగా విలువైనది ఏది? యెహెఙ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు తన న్యాయం ఎలా ఉంటుందో ప్రకటిస్తున్నాడు; పునీత పౌలు ఫిలిప్పీయులకు క్రీస్తు వినయాన్ని జీవన మార్గంగా చూపిస్తున్నాడు; యేసు ప్రభువు సువిశేషంలో ఇద్దరు కుమారుల ఉపమానం ద్వారా మాటల కంటే క్రియలే నిజమైన విధేయతకు గుర్తు అని బోధిస్తున్నాడు. ఈ మూడు పఠనాలు ఒకే సందేశాన్ని అందిస్తున్నాయి. ఆ సందేశం మారుమనస్సు అనేది ఒకసారి జరిగే సంఘటన కాదు, అది ప్రతిదినం దేవుని ముందు నిలబడే హృదయ స్థితి, కనుక ఈ పఠనాలు ప్రతి రోజు మన జీవితం దైవ మార్గంలో ఉన్నదో లేదు బేరీజు వేసుకోమని చెబుతున్నవి.
క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేయడం, దివ్య బలిలో పాల్గొనడం, పవిత్ర గ్రంథాన్ని చదవడం, విశ్వాసాన్ని ప్రకటించడం ఇవన్నీ ముఖ్యమైనవే. అయితే ఇవన్నీ మన హృదయాన్ని మార్చి, మన ప్రవర్తనను దేవునికి అనుగుణంగా తీర్చిదిద్దాలి. మనం ఆలయంలో మోకరిల్లి, ఇంటికి వచ్చిన వెంటనే పాత స్వభావాన్నే ధరించుకుంటే, ఆ మోకరింపు అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఈ మూడు పఠనాలు మనకు గుర్తుచేసేది ఇదే. దేవుని ముందు మన గొప్పతనం, మనం చెప్పే మాటలలో కాదు, ఆయన చిత్తానికి విధేయులమై జీవించడంలో ఉంది.
దేవుని న్యాయం మనం అనుకున్నట్లు కాదు
యెహెఙ్కేలు ప్రవక్త బాబిలోనియా చెరలో ఉన్న ప్రజలకు ప్రవచించిన కాలంలో, వారు తమ కష్టాలకు కారణం తమ పూర్వీకుల పాపాలేనని భావిస్తూ,
"తండ్రులు పుల్లని ద్రాక్షపండ్లు, భుజింపగా తనయులకు పండ్లు పులుపెక్కెను"
అనే సామెతను వల్లించేవారు. వారు తమను తాము నిర్దోషులుగా చూసుకుంటూ, దేవుడు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. యెరూషలేము పతనమై,
దేవాలయం నేలమట్టమై, వేలాదిమంది బందీలుగా బాబిలోనియకు తీసుకుపోబడిన ఆ కాలంలో, ఇలా
భావించడం అర్థం చేసుకోదగినదే. తమ జీవితంపై తమకు అధికారం లేదని, తమ తలరాత ముందే రాయబడిందని వారు నమ్మారు. ఈ నిరాశ వెనుక ఒక
ప్రమాదకరమైన ఆలోచన దాగి ఉంది. "నేను ఏమి చేసినా ఫలితం మారదు" అనే
నిస్తేజమైన మనస్తత్వం. ఈ మనస్తత్వం మనుషులను మారుమనస్సు నుండి దూరం చేస్తుంది,
ఎందుకంటే మార్పు సాధ్యమేనని నమ్మకపోతే ప్రయత్నం కూడా ఆగిపోతుంది.
దేవుడు ఈ ఆరోపణకు నేరుగా జవాబిస్తున్నాడు. “వినుడు. నా మార్గము సబబైనదికాదా? మీ మార్గమే సబబైనదికాదు.” న్యాయం లేనిది దేవుని మార్గంలో కాదు, ప్రజల మార్గంలోనే. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే, అతని పాత నీతి అతన్ని రక్షించదు. అలాగే దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచి, ఆలోచించి, తన అతిక్రమాలన్నిటి నుండి వెనుదిరిగితే, అతడు నిశ్చయంగా జీవిస్తాడు. “దుష్టుడు తన పాపకార్యములనుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచిపనులు చేసెనేని, తన ప్రాణములను కాపాడు కొనును.” ఈ మాటలలో దేవుని హృదయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన శిక్షను కోరుకోడు, జీవాన్ని కోరుకుంటాడు (18:23). మన గతం ఎంత చీకటిగా ఉన్నా, ఈరోజు దేవుని వైపు తిరిగే మార్గం ఎప్పుడూ మూసుకుపోదు. అదే సమయంలో, గతంలో సంపాదించిన నీతి ఒక శాశ్వత భద్రతా పత్రం కాదు. అది ప్రతిరోజు కొత్తగా జీవించవలసిన బాధ్యత.
దేవుని ఈ న్యాయం మనకాలానికి కూడా వర్తిస్తుంది. మనం తరచూ ఇతరులను వారి గత చరిత్రను బట్టి శాశ్వతంగా అంచనా వేస్తాము. "వాడు ఎప్పుడూ అంతే," "ఆమెను నమ్మలేము, ఇదివరకు కూడా ఇలా చేసింది" అని చెబుతూ ఇతరుల మార్పు అవకాశాన్ని మనమే మూసివేస్తాము. కానీ దేవుడు అలా చేయడు. ఆయన ప్రతి క్షణం మనలను కొత్తగా చూస్తాడు, మన నేటి హృదయ స్థితిని బట్టి తీర్పు తీరుస్తాడు, నిన్నటి వరకు మనం ఏమిటో దాన్ని బట్టి మనలను చూడడు. ఇది మనకు ఒక ఓదార్పు, ఒక హెచ్చరిక రెండూను ఇస్తుంది. ఓదార్పు ఏమిటంటే, ఎన్ని సంవత్సరాలు దేవుని నుండి దూరంగా జీవించినా, ఈరోజే ఆయన వైపు తిరిగే అవకాశం మనకు ఉంది. ఒక కుమారుడు తన తండ్రిని ఏళ్ల తరబడి పట్టించుకోకపోయినా, ఇప్పుడు మనసు మార్చుకుని తిరిగి వస్తే, ఆ తండ్రి హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఇది తరువాత మనం సువార్తలో చూడబోయే తప్పిపోయిన కుమారుని ఉపమానాన్ని కూడా గుర్తుచేస్తుంది. హెచ్చరిక ఏమిటంటే, గతంలో ఎంత విశ్వాసంగా జీవించినా, ఇప్పుడు మనం అశ్రద్ధగా, గర్వంగా జీవిస్తే, ఆ పాత విశ్వాసం మనలను రక్షించదు. ప్రతి ఉదయం మనం కొత్తగా దేవుని ఎంచుకోవాలి.
క్రీస్తు మనస్సు - వినయం అనేది బలహీనత కాదు
ఫిలిప్పీయులకు రాసిన లేఖలో పునీత పౌలు ఆ సంఘంలో తలెత్తిన స్వల్ప విభేదాలను, పోటీతత్వాన్ని చూసి, ఐక్యతకు ఒక లోతైన మార్గాన్ని చూపిస్తాడు. " క్రీస్తునందలి మీ జీవితము మిమ్ము బలపరచు చున్నచో, ఆయన ప్రేమ మిమ్ము ఊరడించుచున్నచో, ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో, మీలో ఒకరియెడల ఒకరికి దయకనికరములు ఉన్నచో, ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి ఒక్కదాని యందే మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయుడు" అని పౌలు కోరుతున్నాడు. కానీ ఈ ఐక్యతకు మార్గం ఏమిటి? " స్వార్దముతోగాని, అహంభావముతో గాని ఎట్టి పనియు చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటె అధికులుగా భావింపుడు" అని పౌలు వారిని పిలుస్తున్నాడు.
పౌలు ఇక్కడ నాలుగు ఆధ్యాత్మిక వాస్తవాలను ప్రస్తావన చేస్తున్నాడు. క్రీస్తునందలి ప్రోత్సాహం, ప్రేమలోని ఆదరణ, ఆత్మలోని భాగస్వామ్యం, వాత్సల్యం-కనికరం. ఇవన్నీ ఫిలిప్పీయుల అనుభవంలో నిజంగా ఉన్నాయని అతడు భావిస్తున్నాడు, ఈ అనుభవం ఆధారంగానే ఐక్యతకు పిలుస్తున్నాడు. ఒక కుటుంబంలో అందరికీ ఒకే తండ్రి, ఒకే రక్తం ఉన్నట్లే, ఒక సంఘంలో అందరికీ ఒకే క్రీస్తు, ఒకే ఆత్మ ఉన్నాయి. ఈ ఉమ్మడి మూలం మనలను వేరుచేసే విభేదాల కంటే గొప్పది. మనం సంఘంలో గానీ, కుటుంబంలో గానీ విభేదాలు వచ్చినప్పుడు, మనం మర్చిపోయేది ఇదే, మనం ఎంత భిన్నంగా ఉన్నా, ఒకే క్రీస్తు రక్తంలో పాలుపంచుకున్నవారమన్న సత్యం.
ఆ కాలపు సమాజంలో "వినయం" అనేది గొప్ప సుగుణంగా చూడబడేది కాదు. అది బానిసలకు, తక్కువ స్థాయి వ్యక్తులకు తగినదిగా భావించేవారు. బలవంతుడు, అధికారం కలవాడు తనను తాను తగ్గించుకోవడం అప్పటి సమాజానికి అర్థంలేనిదిగా, అవమానకరంగా అనిపించేది. పౌలు ఈ మాటను తీసుకుని, దానిని క్రైస్తవ జీవితానికి కేంద్రంగా మార్చాడు, ఎందుకంటే ఇది స్వయంగా క్రీస్తు నడిచిన మార్గం. "క్రీస్తుయేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు " (2:5) అని పునీత పౌలు ముగిస్తున్నాడు. దేవుని రూపంలో ఉన్నవాడు తనను తాను రిక్తుని చేసుకుని, సేవకుని రూపము ధరించి, సిలువ మరణం వరకు విధేయుడయ్యాడు. ఇది బలహీనత నుండి పుట్టిన లొంగుబాటు కాదు. అపరిమిత శక్తి నుండి ప్రేమతో స్వచ్ఛందంగా ఎంచుకున్నది. నిజమైన వినయం అంటే తనను తాను తక్కువ చేసుకోవడం కాదు, ఇతరుల మేలును తన మేలుకు సమానంగా చూడగలిగే హృదయ విశాలత. ఇది ప్రభువు జీవితం మొత్తం చూస్తాము.
ఈ వినయం మన రోజువారీ జీవితంలో ఎలా కనిపిస్తుంది? ఒక భర్త తన భార్యతో వాదన జరిగినప్పుడు, "నేనే సరైనవాడిని" అని నిరూపించుకోవడం కంటే ఆమె భావాలను వినడానికి ప్రయత్నించడం వినయం. ఒక ఉద్యోగి తన సహోద్యోగి విజయాన్ని చూసి అసూయపడకుండా, హృదయపూర్వకంగా అభినందించడం వినయం. ఒక సంఘ నాయకుడు తన అభిప్రాయమే అంతిమమని పట్టుబట్టకుండా, ఇతరుల సలహాలను వినడానికి సిద్ధపడటం వినయం. ఒక తల్లి తన బిడ్డ తప్పు చేసినప్పుడు, తన కోపాన్ని అణచుకుని, ముందు బిడ్డ మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వినయం. ఇవన్నీ చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ ఇవే క్రీస్తు మనస్సు మనలో నిజంగా నివసిస్తుందో లేదో నిరూపించే రోజువారీ పరీక్షలు. వినయం అనేది ఒక ఒక్కసారి తీసుకునే నిర్ణయం కాదు, అది ప్రతిరోజూ, ప్రతి సంభాషణలో, ప్రతి సంబంధంలో పునరావృతమయ్యే ఎంపిక.
ఇద్దరు కుమారులు - మాటలు కాదు, క్రియలే నిజం
యేసు ప్రభువు ఈ ఉపమానాన్ని యెరూషలేము దేవాలయంలో, తన అధికారాన్ని ప్రశ్నించిన ప్రధాన యాజకుల, పెద్దల ముందు చెప్పాడు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. మొదటివాడిని ద్రాక్షతోటలో పనిచేయమని కోరగా, "వెళ్ళను" అని చెప్పి, తరువాత మనస్సు మార్చుకుని వెళ్ళాడు. రెండవవాడు "వెళ్తాను, " అని చెప్పి వెళ్ళలేదు. "ఈ ఇద్దరిలో తండ్రి చిత్తం చేసినవాడు ఎవడు?" అని యేసు ప్రభువు అడిగినప్పుడు, వారు "మొదటివాడు" అని జవాబిస్తారు. ఈ జవాబు ద్వారా వారు తమకు తామే తీర్పు తీర్చుకుంటారు.
"సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు" అని యేసు ప్రభువు ప్రకటిస్తాడు. ఎందుకంటే యోహాను నీతిమార్గంలో వచ్చినప్పుడు, వారు అతన్ని నమ్మి మారుమనస్సు పొందారు; మతనాయకులు మాత్రం చూసి కూడా మారలేదు. మొదటి కుమారుని తొలి తిరస్కారం అతని అంతిమ విధేయతను రద్దు చేయదు; రెండవ కుమారుని తొలి అంగీకారం అతని అంతిమ అవిధేయతను కప్పిపుచ్చలేదు.
ఈ ఉపమానం మతనాయకులకు బాధాకరంగా ఉండేది, ఎందుకంటే వారు మతపరమైన విషయాలలో, మత వేషధారణలో ఖచ్చితంగా ఉండేవారు, ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, కానీ యోహాను పిలుపుకు, యేసు ప్రభువు పిలుపుకు హృదయపూర్వకంగా స్పందించలేదు. మరోవైపు, సమాజం తృణీకరించిన సుంకరులు, వేశ్యలు, తమ పాపభరిత జీవితాన్ని దాచుకోకుండా, యోహాను పిలుపుకు హృదయపూర్వకంగా స్పందించి, మారుమనస్సు పొందారు. వారికి కాపాడుకోవలసిన పేరు ప్రతిష్ఠ లేదు, కాబట్టి తమ పాపాన్ని ఒప్పుకోవడం వారికి పెద్ద అవమానంగా అనిపించలేదు. మతనాయకులకు మారడం కష్టమైంది, ఎందుకంటే వారికి కాపాడుకోవలసిన స్థానం, గౌరవం ఉన్నాయి. ఇది మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తుంది, కొన్నిసార్లు మనం సంపాదించుకున్న "మంచివారు" అనే పేరు ప్రతిష్ఠే మనం నిజంగా మారడానికి పెద్ద అడ్డంకిగా మారుతుంది. మనం తప్పు చేశామని ఒప్పుకోవడం మన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని భయపడతాము, కాబట్టి తప్పును కప్పిపుచ్చుకుంటూనే ఉంటాము.
ఒక వ్యాపారి తన లాభం కోసం ఏళ్ల తరబడి పేదలను మోసం చేస్తూ వచ్చాడు. ఒకరోజు తన తప్పు అతనికి అర్థమైంది. అతడు పశ్చాత్తాపపడి, ప్రార్థన చేసి, ఇకపై మోసం చేయనని నిర్ణయించుకున్నాడు, గతంలో మోసపోయినవారికి వీలైనంత న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. ఇతడు మొదటి కుమారుడిలా జీవించడం. తొలి తిరస్కారాన్ని అధిగమించి, తన పనులతో మారుమనస్సును నిరూపించుకున్నాడు. మరో వ్యక్తి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ, "ప్రభూ, నేను నీ సేవ చేస్తాను" అని చెబుతూనే, వారంలోని మిగతా రోజులలో తన కుటుంబ సభ్యులతో కఠినంగా, తోటి పనివారితో అన్యాయంగా ప్రవర్తిస్తే, అతడు రెండవ కుమారుడిలా జీవిస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి చిత్తం చేశారో మనకు తెలుసు.
ఒక యువకుడు తన కుటుంబానికి, తన సంఘానికి దూరంగా, విశ్వాసానికి పూర్తిగా వ్యతిరేకంగా జీవించాడు. అతని తల్లిదండ్రులు అతని కోసం సంవత్సరాల తరబడి ప్రార్థించారు. ఒకరోజు ఒక చిన్న సంఘటన అతని హృదయాన్ని కదిలించింది, అతడు తిరిగి ప్రార్థనకు, సంఘానికి వచ్చాడు. ఇది మొదటి కుమారుని జీవన కథ. అదే సమయంలో, బాల్యం నుండి ప్రతి ఆచారాన్ని పాటిస్తూ పెరిగిన మరొక వ్యక్తి, తన మతభక్తిని చూసి తానే గొప్పవాడినని భావించి, తనకంటే తక్కువ మతభక్తి ఉన్నవారిని చిన్నచూపు చూస్తే, అతడు రెండవ కుమారుని జీవన కథను జీవిస్తున్నాడు. ఇద్దరిలో దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నదెవరో యేసు ప్రభువు స్పష్టం చేశాడు.
ఈ ఉపమానంలో తండ్రి ఇద్దరు కుమారులను సమానంగా ప్రేమిస్తాడు, సమానంగా ఆహ్వానిస్తాడు. ఆయన ఏ కుమారుడినీ ముందుగానే విడిచిపెట్టడు. మొదటివాడు "వెళ్ళను" అని చెప్పినప్పుడు తండ్రి అతన్ని త్రోసిపుచ్చడు, రెండవవాడు "వెళ్తాను" అని చెప్పినప్పుడు తండ్రి అతన్ని అధికంగా మెచ్చుకోడు. ఆయన కేవలం చూస్తూ, వేచి ఉంటాడు, ప్రతి కుమారుడి తుది క్రియను బట్టి ఆనందిస్తాడు లేదా బాధపడతాడు. ఇది దేవుని సహనానికి, ఆయన మనకిచ్చే స్వేచ్ఛకు ఒక అందమైన రూపం.
మూడు పఠనాలు కలిసి చెప్పే ఒకే సందేశం
ఈ మూడు పఠనాలను కలిపి చూసినప్పుడు, యెహెఙ్కేలు మనల్ని ఆత్మపరిశీలనకు ఆహ్వానిస్తున్నాడు, గతం శాశ్వతం కాదు, ప్రస్తుత దిశే నిర్ణయాత్మకం. పునీత పౌలు ఫిలిప్పీయుల ద్వార ఈ మారుమనస్సుకు అవసరమైన అంతర్గత వైఖరిని చూపిస్తున్నాడు. అది క్రీస్తు వినయం, ఇతరుల మేలును చూడగల హృదయం. మత్తయి ఈ మారుమనస్సు ఎలా క్రియారూపం దాల్చాలో చూపిస్తున్నాడు. మాటలు కాదు, క్రియలే ముఖ్యం అనే వాస్తవం ఇక్కడ చూపబడుతుంది. మొదటి కుమారుడు తన తొలి తిరస్కారాన్ని అధిగమించగలిగింది వినయం వల్లనే, తన తప్పును ఒప్పుకుని దిశ మార్చుకునే వినయం అతనిని దేవుని మాట పాటించేలా చేసింది. రెండవ కుమారుని పతనానికి కారణం అహంకారమే, మాటలలో భక్తిని ప్రదర్శిస్తూ, క్రియలో మారుమనస్సు అవసరాన్ని తిరస్కరించే గర్వం, అతనిని నాశనం చేస్తుంది.
ఈ మూడు పఠనాలు మనకు ఒక పూర్తి ఆధ్యాత్మిక చిత్రాన్ని ఇస్తాయి, దేవుని న్యాయం (యెహెఙ్కేలు) మనలను నిత్యనూతనమైన మారుమనస్సుకు పిలుస్తుంది; క్రీస్తు మనస్సు (ఫిలిప్పీయులు) ఆ మారుమనస్సుకు అవసరమైన హృదయ వైఖరిని నేర్పుతుంది; ఇద్దరు కుమారుల ఉపమానం ఆ మారుమనస్సు చేతలలో ఎలా కనిపించాలో చూపిస్తుంది. మూడూ కలిసి ఒకే వాస్తవాన్ని ధృవీకరిస్తాయి విశ్వాసం అనేది కేవలం మాటల ప్రకటన కాదు, జీవితమంతటినీ కలుపుకున్న నిత్య ప్రయాణం.
నేటి మన జీవితానికి పిలుపు
ఈ దైవవాక్యం మనలను మొదటి కుమారుడిగా లేదా రెండవ కుమారుడిగా వర్గీకరించుకొమని కోరదు. మనలోనే ఈ ఇద్దరు కుమారుల లక్షణాలు ఉన్నాయేమో పరిశీలించుకోమని కోరుతుంది. కుటుంబంలో, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తామని చెబుతూ వారి అవసరాలను నిర్లక్ష్యం చేయకూడదు; పిల్లలు తల్లిదండ్రులను గౌరవిస్తామని చెబుతూ వారి మాటలను వినకుండా ఉండకూడదు. సంఘంలో, మనం సేవ చేస్తున్నామని చెబుతూ మన స్వంత గౌరవాన్ని, అధికారాన్ని ముఖ్యమైనవిగా చూడకూడదు. సమాజంలో, నిజాయితీగా, న్యాయంగా వ్యవహరించడమే మన ప్రార్థనకు నిజమైన కొనసాగింపు కావాలి. పని స్థలంలో, మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ సహోద్యోగులతో అబద్ధమాడటం, వారి కష్టాన్ని దోచుకోవడం చేస్తే, మన నోటి మాటలు మన పనులకు పొంతన వుండదు.
ఈ వారం మనం మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకుందాం: నేను మాటలలో "అవును ప్రభూ" అని చెప్పి, చేతలలో నిర్లక్ష్యం చేస్తున్న విషయం ఏదైనా ఉందా? గతంలో నేను తప్పు దారిలో నడిచి, ఇప్పుడు తిరిగి రావాలని కోరుకుంటున్న ప్రాంతం ఏదైనా ఉందా? నేను ఎవరినైనా వారి గత చరిత్రను బట్టి శాశ్వతంగా, వీరు ఇంతే అని నిర్ధారించి ఉన్నానా? నా విశ్వాసం నా రోజువారీ నిర్ణయాలలో, నా మాటతీరులో, నా వ్యాపార లావాదేవీలలో నిజంగా కనిపిస్తుందా, లేక అది కేవలం దేవలయమునకే పరిమితమైందా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా జవాబు చెప్పినప్పుడు మారుమనస్సుకు మార్గం తెరుచుకుంటుంది.
ఈ రోజు దేవుని ముందు మనం ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం: నేను చేసిన తప్పులను నిజాయితీగా అంగీకరిస్తాను; నా జీవితాన్ని మార్చుకోవడానికి దేవుని కృపను కోరుకుంటాను; ఇతరులను తక్కువగా చూడకుండా వినయంతో జీవిస్తాను; నా మాటలకు, నా క్రియలు ఒకేలా ఉండేలా చూసుకుంటాను. దేవునికి మనం ఇచ్చే అత్యుత్తమ సమాధానం మన పెదవులతో పలికే "మీ చిత్తము జరగాలి అనే మాట " మాత్రమే కాదు దానికోసం మనం వ్యక్తపరిచే విధేయత.
ముగింపు
తండ్రి ఇద్దరు కుమారులనూ ప్రేమిస్తాడు,
ఇద్దరినీ ఆహ్వానిస్తాడు. ఆయన కోరుకునేది ఏమిటంటే, మనం మాటలతో మాత్రమే కాదు, క్రియలతో కూడా ఆయన
ద్రాక్షతోటలో వెళ్ళి పనిచేయాలని. ఈ రోజు, ఈ క్షణం, మనం ఏ కుమారునిలా జీవించాలో ఎంచుకునే అవకాశం మనకు ఉంది. దేవుని కృప
మనలను ఎప్పుడూ వదిలిపెట్టదు. ఆయన ఎప్పుడూ మనల్ని తిరిగి తన ద్రాక్షతోటలోకి
ఆహ్వానిస్తూనే ఉంటాడు.
ప్రార్ధన
ప్రభువా, మా
జీవితాలను నీ సన్నిధిలో నిజాయితీగా పరిశీలించుకునే కృపను మాకు ప్రసాదించుము. మా
తప్పులను ఇతరులపై నెట్టివేయకుండా, వాటిని అంగీకరించి విడిచిపెట్టే
హృదయాన్ని దయచేయుము. ప్రభువా, మీరు చూపించిన వినయాన్ని, విధేయతను
మాలో నింపుము, మా మాటలు మా క్రియలకు అనుగుణంగా
ఉండునట్లు మమ్మల్ని నడిపించుము. మేము ఎప్పుడు తప్పు దారిలో నడిచినా, మమ్మల్ని తిరిగి మీ వైపు
తిప్పే కృపను దయచేయుము, మా హృదయాలను ఎప్పటికీ మూసుకుపోనీయకుండా
కాపాడుము.ఆమెన్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి