పునీత అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు – ఐదవ రోజు

 

అక్టోబర్ 10- దేవుని స్వరం వినడం, మరియమాత  సాన్నిధ్యం

మనం మాట్లాడతాం, కానీ వింటున్నామా?

నిన్న ప్రార్థన అంటే యేసు ప్రభువుతో స్నేహపూర్వక సంభాషణ అని ధ్యానించాం. సంభాషణలో ఇద్దరూ ఉంటారు. ఒకరు మాట్లాడతారు, మరొకరు వింటారు. కానీ మన ప్రార్థనలో చాలాసార్లు మనమే మాట్లాడుతూ ఉంటాం. మన అవసరాలు, మన కోరికలు, మన ఫిర్యాదులు అన్నీ ఏకరువు పెట్టి, "ఆమెన్" అని చెప్పి వెళ్లిపోతాం. దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో వినడానికి మనం ఆగుతున్నామా? ఈ రోజు ఆ వినే కళను తెరేసమ్మతో  కలిసి నేర్చుకుందాం. దీనికి మరియమాత  గొప్ప ఆదర్శం.

వాక్యభాగం: 1 సమూయేలు 3:9- 10

1 సమూయేలు 3వ అధ్యాయంలో చిన్నవాడైన సమూయేలు రాత్రివేళ దేవుని స్వరం విన్నాడు. మొదట అది తన గురువైన ఏలీ స్వరం అనుకున్నాడు. మూడుసార్లు ఏలీ దగ్గరకు వెళ్ళి పిలిచితివా అని అడిగాడు. చివరికి ఏలీ, మళ్ళీ పిలిస్తే, "ప్రభువా, మాట్లాడుము, నీ సేవకుడు వినుచున్నాడు" అని చెప్పమని నేర్పాడు. సమూయేలు అలా చెప్పినప్పుడు దేవుడు తన సందేశాన్ని ఇచ్చాడు. దేవుడు మనతో మాట్లాడతాడు, కానీ మనం వినటానికి  సిద్ధముగా  ఉండాలి అని ఈ కథ చెబుతుంది.

లూకా 11:28లో ఒక స్త్రీ యేసు ప్రభువును చూసి, "నిన్ను కన్న గర్భం ధన్యమైనది" అని వెలుగెత్తి చాటినప్పుడు, యేసు ప్రభువు   "దేవుని వాక్కును  విని పాటించేవారే ఇంకా ధన్యులు" అని జవాబిచ్చాడు. ఇది మరియమాతను ఔనత్యాన్ని  తగ్గించే మాట కాదు. నిజానికి ఇది మరియమాత  గొప్పతనాన్ని మరింత గొప్పగా తెలుపుతుంది. ఆమె యేసు ప్రభువును గర్భంలో మోయడానికి ముందే  దేవుని వాక్కును తన హృదయంలో మోసింది.

వినే తల్లి మరియమాత

సువార్తలలో మరియమాత  ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఆమె వినినది, ఆలోచించినది,  తన హృదయంలో భద్రపరచుకుంది. గబ్రియేలు  దేవదూత మాటలు విన్నప్పుడు ఆమె "నీ మాట ప్రకారం నాకు జరుగును గాక" అంటున్నది. కాపరులు వచ్చి బాల యేసు గురించి చెప్పినప్పుడు, ఆమె ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రపరచుకుంది. కానా వివాహంలో ఆమె సేవకులతో "ఆయన చెప్పినట్లు చేయుడి" అంటుంది. ఈ ప్రతి సందర్భంలోనూ మరియమాత  దేవుని మాటకు ప్రథమ స్థానం ఇచ్చింది.

తెరేసమ్మకు  కూడా మరియమాత  పట్ల గాఢమైన భక్తి ఉంది. కార్మెల్  సభ అంతా మరియమాతకు  అంకితమై ఉంది. సభ పేరే "కార్మెలు మాత సహోదరులు". తెరేసమ్మ  తన మఠాలను "కార్మెలు మాత" సంరక్షణలో ఉంచింది. తన సోదరీమణులు మరియమాత  నుండి వినే హృదయాన్ని నేర్చుకోవాలని ఆమె కోరుకుంది.

తెరేసమ్మ  నేర్పిన నిశ్శబ్దం

తెరేసమ్మ  తన ప్రార్థనా పద్ధతిని "ఏకాగ్రత" లేదా "దేవుని సన్నిధిలో కూర్చోవడం" అని వర్ణించింది. ఆమె తన సోదరీమణులకు చెప్పేది, ప్రార్థనలో మీరు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో ఉండండి, ఆయన వైపు చూడండి అని చెప్పేది. ఆమె తన స్వంత అనుభవం నుండి ఈ మాటలను  చెప్పింది. ఆమెకు కూడా ప్రార్థనలో మనసు ఒక చోట నిలిచేది కాదు. ఆలోచనలు ఎటో పరుగెత్తేవి. అయినా ఆమె ప్రేమతో మళ్ళీ మళ్ళీ దేవుని వైపు తిరిగేది.

పునీత సూక్తి

"నేను ఎక్కువగా ఆలోచించమని కాదు, ఆయనను చూడమని మాత్రమే అడుగుతున్నాను." - పరిపూర్ణతా మార్గం పుస్తకంలో తెరేసమ్మ ఈ మాటలను రాసింది. ఈ మాటలో గొప్ప ఉపశమనం ఉంది. ప్రార్థనలో గొప్ప ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద వేదాంత విషయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన వైపు చూడండి. చిన్న పిల్లవాడు తల్లి ముఖంలోకి చూస్తూ ఉన్నట్లు, మనం ప్రేమతో యేసు ప్రభువు  వైపు చూడగలం. ఆయన కూడా మన వైపు చూస్తున్నాడు. ఆ పరస్పర దృష్టిలోనే ప్రార్థన ఉంది.

ఇది చదవడానికి సులభంగా ఉన్నా ఆచరించడం కష్టం. ఎందుకంటే మనం ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలనే అలవాటులో ఉన్నాం. కానీ ప్రార్థనలో "చేయకుండా ఉండటం" కూడా ఒక గొప్ప కృప. దేవుని ప్రేమను అందుకోవడానికి మనం చేయవలసింది, మన చేతులను తెరిచి ఉంచడమే.

మనసు చెల్లాచెదురైనప్పుడు

"నేను ప్రార్థనలో కూర్చుంటే ఎక్కడెక్కడో ఆలోచనలు పోతాయి. నేను సరిగా ప్రార్థించడం లేదు" అని చాలా మంది నిరుత్సాహపడతారు. తెరేసమ్మ  తన మనసు ఎంత చెల్లాచెదురయ్యేదో నిజాయితీగా రాసుకుంది. అంటే ఇది అందరికీ వచ్చే సమస్యే. ఆలోచనలను బలవంతంగా ఆపడం పరిష్కారం కాదు. ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని గమనించి, ప్రేమతో మళ్ళీ ప్రభువు వైపు తిరగడమే పరిష్కారం. ఒక్క ప్రార్థనలో మనసు వందసార్లు పారిపోతే, వందసార్లు తిరిగి రావడమే మంచి ప్రార్థన. ఎందుకంటే ప్రతిసారి తిరిగిరావడంలో మన ప్రేమ వ్యక్తమవుతుంది.

ఈ రోజుల్లో నిశ్శబ్దానికి అడ్డంకులు

తెరేసమ్మ  కాలంలోనే నిశ్శబ్దం ఉండటం కష్టంగా ఉండేది. ఇప్పుడు మన చేతుల్లో ఫోన్ ఉంది. ప్రతి నిమిషం సందేశాలు, వీడియోలు, వార్తలు. మనసు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు. ఈ అలవాటు ప్రార్థనలోకి కూడా వస్తుంది. నిశ్శబ్దంగా కూర్చున్న వెంటనే అసహనం కలుగుతుంది. ఇంట్లో అందరూ ఒకే సమయంలో కొద్దిసేపు శబ్దం లేకుండా ఉండే ఏర్పాటు చేయండి. ఈ చిన్న అలవాటే మీ ఇంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మార్చగలదు.

దేవుని స్వరాన్ని గుర్తించడం

దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? ఎక్కువగా ఆయన పవిత్ర  వాక్యం ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు మన హృదయంలో కలిగే శాంతి ద్వారా, కొన్నిసార్లు ఇతరుల మంచి మాటల ద్వారా, కొన్నిసార్లు జీవితంలో జరిగే సంఘటనల ద్వారా మాట్లాడతాడు. ఆయన స్వరం ఎప్పుడూ సువార్తకు విరుద్ధంగా ఉండదు. అది మనలను ప్రేమకు, వినయానికి, సేవకు నడిపిస్తుంది. భయం, గర్వం, ద్వేషం వైపు నడిపించే ఆలోచనలు దేవుని నుండి వచ్చినవి కావు. ఏది దేవుని స్వరమో తెలుసుకోవడంలో సందేహం కలిగితే మీ గురువును, విశ్వాసంలో పెద్దవారిని సలహా అడగండి.

వాక్యాన్ని వినడానికి ఒక సులభమైన పద్ధతి

దేవుని వాక్యాన్ని వినడానికి తిరుసభ  నుండి వచ్చిన ఒక పురాతన పద్ధతి ఉంది. దాన్ని "వాక్య ధ్యానం" అంటారు. ముందు ఒక చిన్న సువార్త భాగాన్ని నెమ్మదిగా చదవండి. రెండవసారి చదివినప్పుడు మీ హృదయాన్ని ఆకర్షించిన ఒక మాట లేదా వాక్యాన్ని గమనించండి. ఆ మాటను మనసులో మళ్ళీ మళ్ళీ పలకండి. అది మీ జీవితానికి ఏం చెబుతోందో ఆలోచించండి. తరువాత దానిపై యేసు ప్రభువుతో మాట్లాడండి. చివరగా కొద్దిసేపు మౌనంగా ఉండండి. ఈ ఐదు అడుగులకు పది నిమిషాలు చాలు. కొన్ని వారాల్లోనే మీ ప్రార్థనలో గొప్ప మార్పు కనిపిస్తుంది.

నిశ్శబ్దం ఇచ్చే ఫలాలు

దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా గడిపేవారి జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. వారి మాటలు తగ్గుతాయి, కానీ అవి అర్థవంతంగా మారతాయి. కోపం త్వరగా రాదు. ఇతరులను వినే ఓపిక పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు తగ్గుతుంది. గందరగోళం మధ్య కూడా ఒక అంతర్గత శాంతి నిలుస్తుంది. తెరేసమ్మ సోదరీమణులు కూడా ఈ ఫలాలను అనుభవించారు. వారి మఠం ప్రార్థన, నిశ్శబ్దంతో నిండి ఉన్నా, అక్కడ గాఢమైన ఆనందం ఉండేది.

ఇంట్లో వినే అలవాటు

దేవుని మాట వినడం నేర్చుకునే వారు ఇతరుల మాటలను కూడా శ్రద్ధగా వినడం నేర్చుకుంటారు. ఇంట్లో భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినకపోవడం, తల్లిదండ్రులు పిల్లల మనసును వినకపోవడం చాలా కుటుంబ సమస్యలకు కారణం. ఈ రోజు మీ ఇంట్లో ఒకరి మాటను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. మధ్యలో అడ్డుపడకండి, వెంటనే సలహా ఇవ్వకండి. కేవలం వినండి. ఇది కూడా ప్రార్థనే, ఎందుకంటే ప్రతి మనిషి ద్వార  దేవుడు మాట్లాడగలడు.

శబ్దాల మధ్యలో కూడా వినగలగడం

అందరికీ ప్రతిరోజూ గంటల తరబడి నిశ్శబ్దం దొరకదు. పిల్లలు ఉన్న ఇంట్లో, ఎప్పుడూ రద్దీగా ఉండే పనిస్థలంలో, బస్సులో ప్రయాణించేటప్పుడు నిశ్శబ్దం కష్టం. అయినా దేవుని స్వరం వినడం ఆగిపోకూడదు. అసలైన నిశ్శబ్దం బయటిది కాదు, అంతరంగంలోనిది. ఒక్క క్షణం మనసును ప్రశాంతం చేసుకుని "ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నావు" అని గుర్తు చేసుకుంటే, గందరగోళం మధ్య కూడా ఆయన సన్నిధి అనుభవమవుతుంది. తెరేసమ్మ  తన మఠంలో అనేక పనులు, సంభాషణలు, అవసరాల మధ్య ఈ అంతరంగ నిశ్శబ్దాన్ని కాపాడుకుంది. అందుకే రోజులో కొన్ని చిన్న క్షణాలను "వినే క్షణాలు"గా ఎంచుకోండి. ఉదయం టీ తాగేటప్పుడు, బస్సు కోసం ఎదురుచూసేటప్పుడు, పనిలో కొద్ది విరామంలో మనసును దేవుని వైపు తిప్పండి. ఈ చిన్న క్షణాలు మన హృదయాన్ని ఆయన స్వరానికి సున్నితంగా ఉంచుతాయి.

అవిలాపురి తెరేసమ్మ  నవదిన ప్రార్ధనలు-  ఐదవ రోజు 

దేవుని స్వరం వినడం, మరియమాత  సాన్నిధ్యం

గురువు: పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.

ప్రజలు: ఆమెన్.

గురువు: ప్రభువు, మీతో ఉందురు గాక.

ప్రజలు: మీ ఆత్మతోను ఉందును గాక.

గురువు: ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనలో మనం మాట్లాడతాం, కానీ వినడం మరచిపోతాం. ఈ రోజు నిశ్శబ్దంలో దేవుని స్వరం వినడం, దేవుని మాటను హృదయంలో భద్రపరచిన మరియమాత  ఆదర్శాన్ని ధ్యానిద్దాం.

గురువు: ప్రార్ధించుదము.

ప్రేమమముడవైన సర్వేశ్వరా! నీ వాక్యాన్ని విని, హృదయంలో భద్రపరచి, ఆచరించిన మరియమాతను మాకు తల్లిగా ఇచ్చావు. తెరేసమ్మ  నిశ్శబ్దంలోనే  నీ సన్నిధిలో కూర్చోవడం నేర్పింది. ఆమెతో కలిసి నీ స్వరం వినే చెవులను మాకు ప్రసాదించుమని  మా  ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము.

ప్రజలు: ఆమెన్.

 వాక్య పఠనం

పఠనకుడు (1 సమూయేలు 3:9-10): అతడు సమూవేలుతో “వెళ్ళి పడుకొమ్ము. నిన్నెవ్వరైన పిలిచినచో 'ప్రభూ! ఆనతి యిమ్ము. నీ దాసుడు ఆలించుచునే యున్నాడు' అని పలుకుము” అని చెప్పెను. సమూవేలు వెళ్ళి తన తావున పరుండెను. అంతట ప్రభువు ప్రత్యక్షమై నిలిచి వెనుకటి మాదిరిగా “సమూవేలూ!” అని పిలిచెను. అతడు “ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునే యున్నాడు” అనెను.

పఠకుడు: ఇది ప్రభువు వాక్కు

ప్రజలు : సర్వేశ్వరునికి వందనములు

వినడం గురించి విన్నపాలు

గురువు: మేము ఎక్కువగా మాట్లాడి, తక్కువగా వినే సమయాలలో .

ప్రజలు: ప్రభువా, మాట్లాడు, నీ సేవకులం వింటున్నాం అనేలా మమ్ము మార్చుము.

గురువు: మా చుట్టూ ఉన్న శబ్దాల మధ్య.

ప్రజలు: ప్రభువా, నీ స్వరం మాకు వినిపించేలా మా  చెవులను తెరువుము.

గురువు: దేవుని  వాక్యాన్ని వినడమే కాక ఆచరించే కృప కోసం.

ప్రజలు: ప్రభువా, మరియమాతలా నీ మాటను హృదయంలో భద్రపరచే మనసు ఇవ్వుము.

పునీత సూక్తి

గురువు: "నేను ఎక్కువగా ఆలోచించమని కాదు, ఆయనను చూడమని మాత్రమే అడుగుతున్నాను." అని తెరేసమ్మ చెబుతున్నారు (పరిపూర్ణతా మార్గం, భావానువాదం)

గురువు: ప్రార్థనలో గొప్ప ఆలోచనలు అవసరం లేదు.

ప్రజలు: ప్రభువా, ప్రేమతో నీ వైపు చూసే హృదయం ఇవ్వుము.

గురువు: మా మనసు చెల్లాచెదురైనప్పుడు.

ప్రజలు: ప్రభువా, నిరుత్సాహపడకుండా మళ్ళీ నీ వైపు తిరిగే ఓపిక ఇవ్వుము.

గురువు: నీవు మమ్మల్ని చూస్తున్నావని గుర్తు చేసుకునే కృప కోసం.

ప్రజలు: ప్రభువా, నీ సన్నిధిలో మేము విశ్రమించేలా చేయుము.

 మరియమాత  మధ్యవర్తిత్వం కోసం

గురువు: శిలువ క్రింద మాకు తల్లిగా ఇవ్వబడిన తల్లి.

ప్రజలు: మా కొరకు ప్రార్ధించండి

గురువు: ఇంట్లో ఒకరి మాట ఒకరు వినని కుటుంబాల కోసం.

ప్రజలు: ప్రభువా, వారికి ఇతరులను  వినే హృదయం ఇవ్వు.

గురువు: అనేక  శబ్దాలలో మునిగిన మా తరం కోసం.

ప్రజలు: ప్రభువా, నిశ్శబ్దాన్ని ప్రేమించడం మాకు నేర్పుము.

 ఆత్మపరిశీలన (గురువు నెమ్మదిగా చదివి, ప్రతి ప్రశ్న తరువాత కొద్దిసేపు మౌనం)

గురువు: నా ప్రార్థనలో నేను మాట్లాడటానికి, వినడానికి ఎంత సమయం ఇస్తున్నాను? (మౌనం)

దేవుని వాక్యాన్ని వినడమే కాక దాన్ని ఆచరించడానికి నేను ప్రయత్నిస్తున్నానా? (మౌనం)

నా చుట్టూ ఉన్న శబ్దాలలో దేవుని స్వరాన్ని వినకుండా నన్ను అడ్డుకుంటోంది  ఏమిటి ? (మౌనం)

నేటి ప్రార్థన

గురువు: ప్రార్ధించుదము.

అందరూ: ప్రభువా, "ప్రభు, మాట్లాడు, నీ సేవకుడు వింటున్నాడు" అని చెప్పే మనసు మాకు ఇవ్వుము. మా చుట్టూ ఉన్న శబ్దాల మధ్య నీ స్వరం వినిపించేలా మా చెవులను తెరువుము. మరియమాత, మా కోసం ప్రార్థించి, మేము దేవుని మాటను ఆచరించేలా నడిపించు. పునీత తెరేసమ్మ, మాకు వినే మనసును నేర్పించండి. ఆమెన్.

మధ్యవర్తిత్వ విన్నపాలు

గురువు:  ఆవిలాపురి తెరేసమ్మ,                     ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

గురువు:  తిరుసభ ప్రార్థనా గురువా,                 ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

గురువు: తిరుసభ  పండితురాలా,                   ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

గురువు: కార్మెల్  సభ సంస్కర్తా,                    ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

గురువు: ప్రభువుని   ప్రేమలో జ్వలించిన ఆత్మా,  ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

 వ్యక్తిగత విన్నపాలు

గురువు: ఇప్పుడు మన కుటుంబాల అవసరాలను, ఈ నవదినంలో మనం అడుగుతున్న ప్రత్యేక ఉద్దేశ్యాలను ప్రభువుకు సమర్పిద్దాం. (కొద్దిసేపు మౌనం,)

గురువు: ప్రభువా, మా ఈ  మనవులను ఆలకించుము.

ప్రజలు: ఆమెన్

గురువు: నవదిన ఉద్దేశ్యాల కోసం మనం కలిసి ప్రార్థిద్దాం.

అందరూ: పరలోక జపం, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం

ముగింపు

గురువు: ప్రార్ధించుదము. ప్రేమమయుడవైన తండ్రి, మరియమాత  ఆదర్శంతో, అవిలాపురి తెరేసమ్మ  బోధనలతో  నీ స్వరం వినే హృదయాన్ని మాకు ప్రసాదించమని  మా  ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము.

ప్రజలు: ఆమెన్.

గురువు: ఈ రోజు సంకల్పం: ఈ రోజు కొంతసేపు నిశ్శబ్దంగా గడపండి. ఆ సమయంలో "ప్రభువా, మాట్లాడు, నీ సేవకుడు వింటున్నాడు" అని చెప్పి ఆయన సన్నిధిలో కూర్చోండి.

గురువు: ప్రభువు మీతో ఉండుగాక.

ప్రజలు: మీ ఆత్మతోను వుండును గాక.

గురువు: సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ, మిమ్ములను ఆశీర్వదించి, కాపాడుదురుగాక.

ప్రజలు: ఆమెన్.

గురువు: సమాధనముతో వెళ్ళుము.

ప్రజలు: దేవునికి కృతజ్ఞతలు.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి