అవిలాపూరి తెరేసమ్మ నవదిన ప్రార్థనలు - ఆరవ రోజు
అక్టోబర్ 11 • దుఃఖంలో ప్రార్థన, గురువుల కోసం ప్రార్థన
బాధలో కూడా ప్రార్థన ఆగకూడదు
మన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంతోషాలతో పాటు బాధలు కూడా వస్తాయి. ప్రియమైనవారిని కోల్పోవడం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో విభేదాలు, ఒంటరితనం ఇవన్నీ మనలను కుంగదీస్తాయి. అలాంటి సమయాల్లో చాలా మంది ప్రార్థన మానేస్తారు. "దేవుడు నా మొర వినడం లేదు" అని అనుకుంటారు. కానీ పునీత తెరేసమ్మ మనకు వేరే మార్గం చూపిస్తుంది. బాధలో కూడా ప్రార్థన కొనసాగించడం, ఆ బాధను ఇతరుల కోసం అర్పణగా మార్చడం. ఈ రోజు ఈ అంశాలను ధ్యానిద్దాం.
2 కొరింథీయులకు 1:3-4లో పౌలు, “మన యేసు క్రీస్తు ప్రభువు తండ్రి దేవునికు కృతజ్ఞతలను అర్పించుదము. మన తండ్రి కృపామూర్తి, ఆ దేవుని నుండియే ఆదరణ సర్వదా మనకు లభించును. మన కష్టములన్నిటిలో ఆయన మనలను ఆదుకొనును. అప్పుడు దేవుని నుండి మనకు లభించిన ఆదరణతో పలురకములైన కష్టములలో ఉన్న మనము ఆదుకొనగలము” అని చెబుతూన్నాడు. మనం దేవుని నుండి పొందిన ఓదార్పుతో ఇతరులను ఓదార్చగలగాలి. ఇక్కడ ఒక అందమైన క్రమం ఉంది. దేవుడు మనలను ఓదారుస్తాడు, మనం ఇతరులను ఓదారుస్తాం. మన బాధ ఇతరులకు ఓదార్పుగా మారగలదు.
తెరేసమ్మ అనుభవించిన బాధలు
తెరేసమ్మ జీవితం బాధలతో నిండినది. యువతిగా ఉన్నప్పుడే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. జీవితాంతం ఆమెను తలనొప్పులు, కడుపు నొప్పులు, జ్వరాలు వేధించాయి. ఇవి కాకుండా, ప్రార్థనలో ఆమె చాలా సంవత్సరాలు ఆధ్యాత్మిక శుష్కతను అనుభవించింది. దేవుడు తనకు దూరంగా ఉన్నట్లు అనిపించే సమయాలు చాలా ఉన్నాయి. తన సంస్కరణ కార్యక్రమం వల్ల సొంత సభలోని వారి నుండే వ్యతిరేకత ఎదుర్కొంది. కొందరు ఆమె రచనలను అనుమానించారు. ఆమె తన జీవిత చివరి సంవత్సరాల వరకు కొత్త మఠాలు స్థాపించడానికి కష్టతరమైన ప్రయాణాలు చేసింది.
ఇంతటి బాధల మధ్య కూడా ఆమె ప్రార్థనను విడువలేదు. ఆమె తన సోదరీమణులకు, శ్రమలను దేవుని పట్ల ప్రేమతో స్వీకరిస్తే అవి ఎంతో ఫలాన్ని ఇస్తాయి అని చెప్పేది. ఆమె బాధను వ్యర్థంగా పోనివ్వలేదు. తన నొప్పిని తిరుసభ కోసం, పాపుల కోసం, తన సభ కోసం సమర్పించింది.
బాధలో దేవుడు మన పక్కనే
మన బాధలో దేవుడు మనకు దూరంగా ఉండడు. యేసు ప్రభువు స్వయంగా బాధలను అనుభవించాడు. గెత్సేమనే తోటలో ఆయన కన్నీళ్ళు కార్చాడు. సిలువపై ఆయన ఒంటరితనాన్ని, నొప్పిని, అవమానాన్ని అనుభవించాడు. కాబట్టి మనం ఏ బాధలో ఉన్నా ఆయన మనలను అర్థం చేసుకోగలడు. ఆయన మన బాధను చూసి దూరంగా నిలబడే దేవుడు కాదు, మన బాధలో పాలుపంచుకునే దేవుడు.
బాధలో ఉన్నప్పుడు ప్రార్థన కష్టంగా ఉంటుంది. మాటలు రావు. అలాంటప్పుడు సులభమైన ప్రార్థన చాలు. "యేసయ్యా, నాకు తోడుగా ఉండు అనేమాట చాలు." కొన్నిసార్లు కేవలం కన్నీళ్ళే ప్రార్థన అవుతాయి. కీర్తనల గ్రంథంలో కూడా దుఃఖంలో రాసిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. దేవుడు మన కన్నీళ్ళను చూస్తాడు, వాటిని విలువైనవిగా భావిస్తాడు.
తెరేసా సభ స్థాపన ఉద్దేశం
తెరేసమ్మ జీవించిన పదహారవ శతాబ్దంలో తిరుసభ గొప్ప విభజనలను, సంక్షోభాలను ఎదుర్కొన్నది, ఐక్యత దెబ్బతిన్నది. ఈ వార్తలు తెరేసమ్మను చాలా బాధించాయి. ఆమె తన "పరిపూర్ణతా మార్గం" అనే గ్రంథంలో, తిరుసభను సంరక్షించడానికి పోరాడేవారికి, గురువులకు, బోధకులకు, మన ప్రార్థన అవసరం. పురుషులు బయట పని చేయగలరు, కానీ కన్యాస్త్రీలు మఠంలో ప్రార్థన ద్వారా సంఘాన్ని బలపరచగలరు. అందుకే ఆమె తన మఠంలో సోదరీమణులు గురువుల కోసం, తిరుసభ సేవకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరింది.
పునీత సూక్తి: గురువుల కోసం ప్రార్థన.
తిరుసభను రక్షించే వారి కోసం, గురువుల కోసం, బోధకుల కోసం ప్రార్థించడమే తన సోదరీల పిలుపు అని తెరేసమ్మ చెప్పింది. – పరిపూర్ణతా మార్గం.
ఆమె దృష్టిలో ప్రార్థన ఎంతో శక్తివంతమైన సేవ. ఒక గురువు ప్రసంగం చేస్తున్నప్పుడు, ఒక పల్లెలో దివ్యబలిపూజ చేస్తున్నప్పుడు, ఒక రోగిని దర్శిస్తున్నప్పుడు, దాని వెనుక ఎందరో ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనా శక్తియే వారికి బలమిస్తుంది.
గురువుల కోసం ఎందుకు ప్రార్థించాలి?
గురువులు కూడా మనలాంటి మనుషులే. వారికి అలసట, ఒంటరితనం, శోధనలు, భయాలు ఉంటాయి. వారు ఇతరుల బాధలను విని, ఓదార్చి, బలపరుస్తారు. కానీ వారికి ఓదార్పునిచ్చేవారు ఎవరు? మన పల్లెల్లో గురువులు కొన్నిసార్లు చాలా కష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తారు. చాలా గ్రామాలను ఒక్కరే చూసుకుంటారు. రాత్రీ పగలూ అత్యవసర పిలుపులు వస్తాయి. అలసిపోయినా సేవ ఆపలేరు. వారి కోసం మనం ప్రార్థించకపోతే, వారు నిరుత్సాహపడవచ్చు.
యేసు ప్రభువు స్వయంగా పేతురు కోసం ప్రార్థించాడు, అలాగే మనం కూడా గురువుల కోసం ప్రార్థించాలి. వారు నమ్మకంగా, పరిశుద్ధంగా, ఆనందంగా సేవ చేయడానికి మన ప్రార్థన సహాయపడుతుంది. ఒక గురువు తన సేవలో పరిశుద్ధుడైతే, ఆ ఫలం సంఘం మొత్తం అనుభవిస్తుంది.
మన బాధను అర్పణగా మార్చుకోవడం
బాధను నివారించలేనప్పుడు దాన్ని విలువైనదిగా చేసుకునే మార్గం ఒకటుంది. దాన్ని ఇతరుల కోసం ఆర్పణగా సమర్పించడం. "ప్రభువా, నా ఈ బాధను మా విచారణ గురువు కోసం, పాపుల కోసం సమర్పిస్తున్నాను" అని చెప్పండి. అప్పుడు బాధ అర్థం లేనిదిగా కాక, ప్రేమ అర్పణగా మారుతుంది. దీనివల్ల బాధ తక్షణం తగ్గకపోవచ్చు. కానీ దానిలో ఒక ఉద్దేశం కనిపిస్తుంది. ఉద్దేశం ఉన్న బాధను భరించడం సులభమవుతుంది.
ఈ అర్పణను యేసు ప్రభువు సిలువ బలితో కలపండి. యేసుప్రభువు సిలువపై అర్పించిన బలి మన రక్షణకు మూలం. మన చిన్న బాధలను ఆ గొప్ప బలితో కలిపినప్పుడు వాటికి కొత్త శక్తి వస్తుంది. ఇది తెరేసమ్మ జీవితమంతా ఆచరించిన రహస్యం.
మన విచారణ కోసం, మన కుటుంబాల కోసం
మీ గురువులను గుర్తుచేసుకోండి. అదే విధంగా మీ ఊరి కన్యాస్త్రీల కోసం, బోధకుల కోసం, సంఘ నాయకుల కోసం ప్రార్థించండి. పిల్లలకు కూడా వారికోసం ప్రార్థించడం నేర్పండి. ఒక గురువు కోసం ప్రార్థించే ఇల్లు అనేక దీవెనలు పొందుతుంది. మీ కుటుంబంలో ఎవరైనా గురువు కావాలని, కన్యాస్త్రీ కావాలని దేవుడు పిలిస్తే, ఆ పిలుపును ప్రోత్సహించడానికి కూడా ఇలాంటి ప్రార్థన సహాయపడుతుంది.
బాధ అడ్డంకి కాదు, ద్వారం కావచ్చు
బాధ వచ్చినప్పుడు మన మొదటి స్పందన "ఇది ఎందుకు నాకే రావాలి?" అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు మనకు ఎప్పుడూ పూర్తి జవాబు దొరకదు. కానీ తెరేసమ్మ అనుభవం మరో విషయం చూపిస్తుంది. బాధ మనలను దేవునికి మరింత దగ్గరకు తీసుకెళ్ళగలదు. ఆమె అనారోగ్యంలో ఉన్న సంవత్సరాలలోనే ప్రార్థన గురించి చాలా లోతైన పాఠాలు నేర్చుకుంది. సౌఖ్యంలో మనం దేవుని మీద ఆధారపడటం తగ్గుతుంది. బాధలో మనకు ఎవరు తోడు రారని తెలిసి ఆయన వైపు తిరుగుతాం. అందుకే చాలా మంది పునీతులు తమ శ్రమల కాలాన్నే తమ ఆధ్యాత్మిక ఎదుగుదల కాలంగా చెప్పుకున్నారు.
దీని అర్థం బాధను కోరుకోవాలని కాదు. బాధ మనకు వచ్చినప్పుడు దాన్ని వ్యర్థం కానివ్వకూడదని. మీ బాధలో దేవుడు మీతో ఉన్నాడని నమ్మండి. అది మీ విశ్వాసాన్ని లోతు చేసే సమయం కావచ్చు. ఒక్కోసారి ఒక కుటుంబానికి వచ్చిన కష్టం ఆ కుటుంబమంతా కలిసి ప్రార్థించడం మొదలుపెట్టడానికి కారణమవుతుంది.
ఓదార్చే సేవ
పౌలు చెప్పినట్లు, మనం పొందిన ఓదార్పును ఇతరులకు పంచాలి. మీరు ఒకప్పుడు ఒక కష్టాన్ని దాటి వచ్చి ఉంటే, అదే కష్టంలో ఉన్న మరొకరిని ఎలా ఓదార్చాలో మీకు తెలుస్తుంది. ఒక తల్లిని కోల్పోయిన వ్యక్తి, మరొక తల్లిని కోల్పోయినవారి పక్కన ఎలా కూర్చోవాలో బాగా అర్థం చేసుకుంటాడు. అనారోగ్యం నుండి కోలుకున్నవారు రోగుల పక్కన ఉండగలరు. ఈ సేవకు గొప్ప మాటలు అవసరం లేదు. కేవలం వారి పక్కన ఉండటం, వారి కోసం ప్రార్థించడం, వారి మాట వినడం చాలు.
అవిలా పునీత తెరేసా నవదినం: ఆరవ రోజు (అక్టోబర్ 11)
దుఃఖంలో ప్రార్థన, గురువుల కోసం ప్రార్థన
గురువు: పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.
ప్రజలు: ఆమెన్.
గురువు: ప్రభువు, మీతో ఉండును గాక
ప్రజలు: మీ ఆత్మతోను ఉండును గాక
గురువు: ప్రియ సహోదరి సహోదరులారా, పునీత తెరేసమ్మ తన బాధలలో కూడా ప్రార్థనను విడువలేదు. ఈ రోజు మన బాధలలో దేవుని ఓదార్పును ధ్యానించి, గురువుల కోసం, తిరుసభ సేవకుల కోసం ప్రార్థిద్దాం.
గురువు: ప్రార్థించుదము.
ఓదార్పునిచ్చే తండ్రీ, శ్రమలలో మాతో ఉన్న దేవా, అవిలాపురి తెరేసమ్మ తన బాధలను తిరుసభ కోరకు అర్పణగా అర్పించింది. ఆమెతో కలిసి మా బాధలను నీ చేతిలో ఉంచి, మా గురువుల కోసం, సంఘం కోసం ప్రార్థించే హృదయాన్ని మాకు ఇవ్వు. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రజలు: ఆమెన్.
వాక్య పఠనం
పఠకుడు (2 కొరింథీయులకు 1:3-4): మన యేసు క్రీస్తు ప్రభువు తండ్రి దేవునికు కృతజ్ఞతలను అర్పించుదము. మన తండ్రి కృపామూర్తి, ఆ దేవుని నుండియే ఆదరణ సర్వదా మనకు లభించును. మన కష్టములన్నిటిలో ఆయన మనలను ఆదుకొనును. అప్పుడు దేవుని నుండి మనకు లభించిన ఆదరణతో పలురకములైన కష్టములలో ఉన్న మనము ఆదుకొనగలము.
పఠనకుడు: ఇది ప్రభువు వాక్కు
ప్రజలు: సర్వేశ్వరునికి వందనములు
దుఃఖంలో ఉన్నవారి కోసం విన్నపాలు
గురువు: అనారోగ్యంతో, నొప్పితో బాధపడేవారి కోసం.
ప్రజలు: ప్రభువా, వారికి నీ ఓదార్పును ప్రసాదించు.
గురువు: ప్రియమైనవారిని కోల్పోయి దుఃఖిస్తున్న వారి కోసం.
ప్రజలు: ప్రభువా, వారిని నీ కౌగిలిలో చేర్చుకో.
గురువు: దేవుడు తమ మొర వినడం లేదని భావించేవారి కోసం.
ప్రజలు: ప్రభువా, వారికి నీ అనుభవాన్ని ప్రసాదించు
పునీత సూక్తి
గురువు:
తిరుసభను సంరక్షించే వారి కోసం, గురువుల కోసం, బోధకుల కోసం ప్రార్థించడమే తన సోదరీల పిలుపు అని తెరేసమ్మ చెప్పింది." (పరిపూర్ణతా మార్గం)
గురువు: తెరేసా తన శారీరక బాధల్లో కూడా ప్రార్థనను విడువలేదు.
ప్రజలు: ప్రభువా, మా బాధలలో కూడా ప్రార్థన కొనసాగించే బలం ఇవ్వు.
గురువు: ఆమె తన బాధను సంఘం కోసం అర్పించింది.
ప్రజలు: ప్రభువా, మా బాధలను ప్రేమకు కానుకగా మార్చు.
గురువు: ఆమె గురువుల కోసం, బోధకుల కోసం ప్రార్థించింది.
ప్రజలు: ప్రభువా, మా గురువుల కోసం ప్రార్థించే హృదయం మాకు ఇవ్వు.
గురువుల కోసం, సంఘ సేవకుల కోసం
గురువు: మా విచారణ గురువు కోసం, ఆయన సేవలో అలసటను, ఒంటరితనాన్ని అనుభవించే గురువులందరి కోసం.
ప్రజలు: ప్రభువా, వారిని నీ ప్రేమతో బలపరచు.
గురువు: కన్యాస్త్రీల కోసం, ప్రబోధకుల కోసం, సంఘ నాయకుల కోసం.
ప్రజలు: ప్రభువా, వారి విశ్వాసం క్షీణించకుండా కాపాడు.
గురువు: గురువులుగా, కన్యాస్త్రీలుగా నీ పిలుపు వినే యువత కోసం.
ప్రజలు: ప్రభువా, వారికి ధైర్యం ఇవ్వు.
ఆత్మపరిశీలన
గురువు: నా బాధలో నేను ప్రార్థనను మానేస్తున్నానా, లేక ఇంకా దగ్గరగా దేవుని వైపు తిరుగుతున్నానా? (మౌనం)
నా బాధను ఇతరుల కోసం కానుకగా సమర్పించడం ఎప్పుడైనా ప్రయత్నించానా? (మౌనం)
నా విచారణ గురువును, కన్యాస్త్రీలను చివరిసారి ఎప్పుడు ప్రార్థనలో గుర్తుచేసుకున్నాను? (మౌనం)
గురువు: ప్రార్ధించుదము
అందరూ: ఓదార్పునిచ్చే దేవా, దుఃఖంలో ఉన్నవారిని నీ కౌగిలిలో చేర్చుకోనుము. మేము, మా కుటుంబాలు, మా పరిచయస్తులు అనుభవిస్తున్న బాధలను నీ చేతికి అప్పగించుతున్నాము. మా గురువులను, కన్యాస్త్రీలను, సంఘ సేవకులను నీ ప్రేమతో బలపరచు. వారి విశ్వాసం క్షీణించకుండా కాపాడు. అవిలాపురి తెరేసమ్మ, మా కోసం ప్రార్థించండి. ఆమెన్.
మధ్యవర్తిత్వ విన్నపాలు
గురువు: పునీత అవిలాపురి తెరేసమ్మ
ప్రజలు: మా కోసం ప్రార్థించండి.
గురువు: తిరుసభ ప్రార్థనా గురువా,
ప్ర.: మా కోసం ప్రార్థించండి.
గురువు: తిరుసభ పండితురాలా,
ప్ర.: మా కోసం ప్రార్థించండి.
గురువు: కార్మెల్ సభ సంస్కర్తా,
ప్ర.: మా కోసం ప్రార్థించండి.
గురువు : యేసు ప్రేమలో జ్వలించిన ఆత్మా,
ప్రజలు : మా కోసం ప్రార్థించండి.
వ్యక్తిగత విన్నపాలు
గురువు: ఇప్పుడు మన కుటుంబాల అవసరాలను, ఈ నవదినంలో మనం అడుగుతున్న ప్రత్యేక ఉద్దేశ్యాలను ప్రభువుకు సమర్పిద్దాం. (కొద్దిసేపు మౌనం)
గురువు: ప్రభువా, మా ఈ మనవులను ఆలకించండి
ప్రజలు: ఆమెన్
గురువు: నవదిన ఉద్దేశ్యాల కోసం మనం కలిసి ప్రార్థిద్దాం.
అందరూ: పరలోక జపం, మంగళ వార్త జపం, త్రిత్వ స్తోత్రం
గురువు: ప్రార్థించుదము: ప్రేమమయుడైన దేవా, అవిలాపురి తెరేసమ్మ మాదిరిగా బాధలలో నీపై నమ్మకం ఉంచి, తిరుసభ కోసం ప్రార్థించే వరం మాకు ప్రసాదించు. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రజలు: ఆమెన్.
గురువు: ఈ రోజు సంకల్పం: మీ గ్రామంలో లేదా మీ సంఘంలో ఒక గురువు పేరు పెట్టి ప్రార్థించండి. ఈ రోజు మీకు ఒక చిన్న ఇబ్బంది కలిగినా, దాన్ని "ప్రభువా, ఇది మా గురువు కోసం" అని అర్పించండి.
గురువు: ప్రభువు మీతో ఉండుగాక.
ప్రజలు: మీ ఆత్మతోను ఉండును గాక .
గురువు: సర్వశక్తిమంతుడైన దేవుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి కాపాడుదురు గాక
ప్రజలు: ఆమెన్.
గురువు: సమాధానంతో వెళ్ళుము
ప్రజలు: దేవునికి కృతజ్ఞతలు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి