అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు – నాల్గవ రోజు

 



అక్టోబర్ 9-  యేసు ప్రభువుతో స్నేహం, ప్రేమ

ప్రార్థన అంటే ఏమిటి?

ప్రార్థన అనగానే చాలా మందికి గుర్తొచ్చేది కంఠస్థం చేసిన మాటలు, జపమాల, పొడవైన కీర్తనలు మరియు  గీతాలు. అవన్నీ మంచివే. కానీ ప్రార్థన అంటే ఏమిటని అడిగితే, తెరేసమ్మ  చాలా సరళమైన జవాబు ఇచ్చింది. ఆ జవాబు ఈనాటికీ లక్షలాది మందికి ప్రార్థన ద్వారాన్ని తెరిచింది. ఈ రోజు ఆ నిర్వచనాన్ని ధ్యానిద్దాం. ఇది పండితుల కోసం మాత్రమే కాదు, పొలంలో పనిచేసే రైతు కోసం, వంటింట్లో ఉన్న తల్లి కోసం, పాఠశాలకు వెళ్ళే పిల్లవాడి కోసం కూడా ఉపయోగపడుతుంది.

వాక్యభాగం: యోహాను 15:14-15

కడరా  భోజన సమయంలో యేసు ప్రభువు తన శిష్యులతో,  "నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులైయుందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇకమీదట నేను మిమ్ములను దాసులని పిలువక, స్నేహితులని పిలిచెదను. ఏలయన, నేను నా తండ్రివలన వినినదంతయు మీకు విశదపరచితిని.." ఇది ఎంత గొప్ప దేవుని అనుగ్రహము! సృష్టికర్త, రాజులకు రాజు మనలను సేవకులుగా కాదు, స్నేహితులుగా పిలుస్తున్నాడు. సేవకునికి యజమాని రహస్యాలు తెలియవు. కానీ స్నేహితునికి హృదయంలోని అన్ని విషయాలను తెలియపరుస్తారు.  యేసు ప్రభువు తన హృదయాన్ని, తండ్రి హృదయాన్ని మనకు తెరిచాడు.

తెరేసమ్మ  జీవితాన్ని మార్చిన ఒక చిత్రం

తెరేసమ్మ  కార్మెల్  మఠంలో ఉన్నా, చాలా సంవత్సరాలు ఆమె ప్రార్థన జీవితం ఉత్సాహంతో లేదు. ఆమె మనసు ఇతర విషయాల్లో చెల్లాచెదురయ్యేది. ఒకరోజు ఆమె ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించినప్పుడు, తీవ్రంగా గాయపడిన యేసు ప్రభువు స్వరూపామును చూసింది. అది ఆయన శ్రమలను చూపించే స్వరూపం. ఆమె హృదయం కదిలిపోయింది. యేసు ప్రభువు  తన కోసం ఎంత బాధపడ్డాడో, తాను ఆయనకు ఎంత తక్కువ ప్రేమను తిరిగి ఇచ్చిందో ఆమెకు తెలిసివచ్చింది. ఆమె ఏడుస్తూ ఆయన పాదాల దగ్గర పడిపోయింది. ఆ క్షణం నుండి ఆమె ప్రార్థనా జీవితం కొత్త మలుపు తిరిగింది.

ఈ అనుభవం తెరేసమ్మకు  ఒక గొప్ప సత్యాన్ని నేర్పింది. యేసు ప్రభువు  మనకు ఒక దూరపు రాజు కాదు. ఆయన మన కోసం మనిషిగా వచ్చి, మన కోసం బాధలు అనుభవించిన స్నేహితుడు. అందుకే ఆమె తన సోదరిమనులకు ఎప్పుడూ, యేసు ప్రభువు  మానవత్వాన్ని ధ్యానించడం మానకండి అని చెప్పేది. ఆయన పుట్టుకను, ఆయన చేసిన పనులను, ఆయన శ్రమలను, ఆయన పునరుత్థానాన్ని ధ్యానించండి అని అడిగేది.

పునీత సూక్తి: ప్రార్థన ఒక స్నేహపూర్వక సంభాషణ

"ప్రార్థన అంటే మనలను ప్రేమిస్తున్నాడని  మనకు తెలిసిన ఆయనతో, తరచు ఏకాంతంగా గడిపే స్నేహపూర్వక సంభాషణ, సమయం  తప్ప మరేమీ కాదు." – తెరేసమ్మ  స్వీయ చరిత్ర, 8వ అధ్యాయం

ఈ ఒక్క వాక్యంలో ప్రార్థన గురించిన గొప్ప సత్యాలున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం.

మొదటి అంశం: ప్రార్థన ఒక స్నేహం

స్నేహంలో మనం నటించనవసరం లేదు. సంతోషంగా ఉన్నప్పుడు సంతోషాన్ని, బాధగా ఉన్నప్పుడు బాధను చెప్పుకుంటాము. కోపం వచ్చినా, సందేహం కలిగినా, అలసిపోయినా స్నేహితుని ముందు నిజాయితీగా ఉండవచ్చు. యేసు ప్రభువుతో మన సంబంధం కూడా అలాగే ఉండాలి. అందమైన భాషలో, పద్ధతి ప్రకారం మాట్లాడాలని ఏమీ లేదు. మీ సొంత మాటల్లో, మీకు తెలిసిన భాషలో మాట్లాడండి. యేసు ప్రభువుకు మీకు వచ్చిన భాష చక్కగా అర్థమవుతుంది.

రెండవ అంశం: తరచుగా  చేయాలి

స్నేహం ఏడాదికి ఒకసారి కలిస్తే పెరగదు. క్రమం తప్పకుండా సమయం గడిపినప్పుడే స్నేహం గాఢమవుతుంది. ప్రార్థన కూడా అంతే. ఆదివారం దివ్యబలిపూజలో పాల్గొనడం చాలా ముఖ్యమైనది. కానీ దానితో పాటు రోజువారీ చిన్న చిన్న ప్రార్థనలు కూడా అవసరం. ఉదయం ఐదు నిమిషాలు, రాత్రి ఐదు నిమిషాలు, మధ్యలో పనుల మధ్య ఒక చిన్న మాట. ఈ చిన్న చిన్న కలయికలే కాలక్రమంలో గొప్ప స్నేహంగా మారతాయి.

మూడవ అంశం: ఆయన మనలను ప్రేమిస్తున్నాడని తెలుసు

ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మనం ప్రార్థించడం ప్రారంభించడానికి కారణం, యేసు ప్రభువు మనలను ముందే ప్రేమించాడనే నమ్మకం. మనం ఆయనను వెతకడం కంటే ముందే ఆయన మనలను వెతికాడు. కొన్నిసార్లు మనం చాలా పాపాలు చేసి, ఆయన ముందుకు వెళ్ళడానికి సిగ్గుపడతాం. కానీ స్నేహితుడైన యేసు ప్రభువు  మనలను తిరస్కరించడు. ఆయన సిలువపై చేతులు చాపాడు, ఆ చేతులు మనలను తన వద్దకు తీసుకొనుటకే. ఈ నమ్మకం ఉన్నప్పుడు ప్రార్థన భయంతో కూడిన విధి కాదు, ఆనందకరమైన కలయిక అవుతుంది.

"ఏకాంతంగా" అంటే ఏమిటి?

తెరేసమ్మ  చెప్పిన "ఏకాంతంగా" అనే మాట ముఖ్యమైనది. స్నేహితులు తమ హృదయం విప్పి మాట్లాడుకోవడానికి గోప్యమైన సమయం కావాలి. ప్రార్థనలో కూడా అంతే. ప్రతి రోజు కొంత సమయం ఫోన్, టీవీ, ఇతర శబ్దాలకు దూరంగా కేవలం యేసు ప్రభువుతో ఉండండి. మీరు సంఘంలో కలిసి ప్రార్థించడం కూడా అవసరమే. కానీ వ్యక్తిగతంగా యేసు ప్రభువుతో గడిపే ఈ ఏకాంత సమయమే మన విశ్వాసాన్ని వేర్లతో సహా పెంచుతుంది.

యేసు ప్రభువును మరింత తెలుసుకోవడం

స్నేహితుడిని బాగా తెలుసుకోవాలంటే అతని గురించి తెలుసుకోవాలి. యేసు ప్రభువు  గురించి తెలుసుకోవడానికి సువార్తలే మన దగ్గర ఉన్న ఉత్తమ మార్గం. రోజుకు కేవలం ఒక చిన్న సువార్త భాగం చదవండి. ఆయన ఎలా మాట్లాడాడో, ఎలా కరుణ చూపాడో, పాపులను, రోగులను, పిల్లలను ఎలా ఆదరించాడో గమనించండి. అప్పుడు మీ ప్రార్థన ఆయనతో నిజమైన సంభాషణగా మారుతుంది. చదివిన తరువాత ఆయనతో "ప్రభువా, ఈ మాట నాకు ఏం చెబుతోంది?" అని అడగండి. ఆ ప్రశ్నే ధ్యానానికి ద్వారంగా ఉంటుంది.

మన కుటుంబాల్లో యేసు ప్రభువు స్నేహితుడిగా

మన ఇళ్ళలో యేసు ప్రభువు  చిత్రం  ఉండవచ్చు. కానీ ఆయన నిజంగా మన కుటుంబ సభ్యునిలా ఉన్నాడా? పిల్లలు తమ స్కూల్ విషయాలను, భయాలను యేసు ప్రభువుతో చెప్పుకోవడం నేర్చుకుంటే వారి విశ్వాసం బలంగా ఎదుగుతుంది. భార్యాభర్తలు తమ మధ్య విభేదాలను ఆయన ముందు ఉంచి ప్రార్థిస్తే సమాధానం దొరుకుతుంది. వృద్ధులు తమ ఒంటరితనాన్ని ఆయనతో పంచుకుంటే, వారికి ఓదార్పు లభిస్తుంది. స్నేహితుడైన యేసు ప్రభువు  ప్రతి వయసు వారికీ దగ్గరగానే ఉంటాడు.

యేసు  ప్రభువు పక్కనే ఉన్నాడని ఊహించుకోవడం

ప్రార్థనలో మనసు నిలవడం లేదని బాధపడేవారికి తెరేసమ్మ  ఒక సులభమైన సలహా ఇచ్చింది. అది ఏమిటంటె యేసు ప్రభువు  మీ పక్కనే ఉన్నాడని ఊహించుకోండి. ఆయనను దూరంగా వెతకనవసరం లేదు, మీ హృదయంలోనే, మీ ప్రక్కనే ఉన్నాడు. ఒక స్నేహితుడు పక్కన కూర్చుని ఉన్నట్లుగా ఆయనతో మాట్లాడండి. ఆయన ముఖంలోని ప్రేమను, కరుణను ఊహించుకోండి. ఈ పద్ధతి చిన్న పిల్లలకు కూడా సులభంగా అర్థమవుతుంది. ఇది కేవలం ఊహ కాదు, ఎందుకంటే నిజంగానే ఆయన మనతో ఉన్నాడు.

స్నేహంలో శుష్కత కాలాలు

ప్రతి స్నేహంలో లాగే యేసు ప్రభువుతో స్నేహంలో కూడా కొన్నిసార్లు ఏమీ అనిపించని సమయాలు వస్తాయి. ప్రార్థన నీరసంగా, పొడిగా అనిపిస్తుంది. ఏ అనుభూతి ఉండదు.  తెరేసమ్మ  కూడా ఇలాంటి కాలాలను చాలా సంవత్సరాలు అనుభవించింది. అలాంటి సమయంలో ఆమె ప్రార్థన మానలేదు. అనుభూతిపై కాకుండా విశ్వాసంపై నిలబడింది. నిజమైన స్నేహం అనుభూతుల మీద ఆధారపడదు, నమ్మకం మీద ఆధారపడుతుంది. మీకు ఏమీ అనిపించకపోయినా కొద్ది నిమిషాలు ఆయన ముందు కూర్చోండి. అదే ప్రేమకు గొప్ప నిదర్శనం.

స్నేహం ఆచరణలో కనిపించాలి

ప్రేమ మాటల్లోనే కాదు, పనుల్లో కనిపిస్తుంది. యేసు ప్రభువు  "నేను ఆజ్ఞాపించినవి చేస్తే మీరు నా స్నేహితులు" అన్నాడు. ఆయన ప్రధాన ఆజ్ఞ ప్రేమించడం. ప్రార్థనలో యేసు ప్రభువుతో గడిపిన తరువాత మన ప్రవర్తన మారాలి. ఇంట్లో కోపం తగ్గాలి, ఓపిక పెరగాలి. పొరుగువారి పట్ల దయ పెరగాలి. తెరేసమ్మ  కూడా ప్రార్థనను నిజమైన సేవతో కలిపింది. ఆమె మఠంలో సోదరీమణుల అవసరాలను గమనించి సహాయపడేది. యేసు ప్రభువుతో నిజమైన స్నేహం మనలను ఇతరులకు స్నేహితులుగా మారుస్తుంది.

పిల్లలకు ప్రార్థన నేర్పడం

తెరేసమ్మ  ఏడేళ్ళ వయసులోనే తన సోదరునితో కలిసి దేవుని కోసం ఏదైనా గొప్పపని చేయాలని కలలు కనేది. పిల్లల హృదయాలు దేవుని పట్ల చాలా సహజంగా స్పందిస్తాయి. కాబట్టి పిల్లలకు ప్రార్థనను భారంగా కాకుండా స్నేహంగా పరిచయం చేయాలి. "యేసయ్యతో మాట్లాడదామా?" అని అడగండి. వారు తమ సొంత మాటల్లో, ఏదో ఒకటి  చెప్పుకోనివ్వండి. తప్పులు దిద్దకండి. పిల్లలు తమ తల్లిదండ్రులు యేసు ప్రభువుతో మాట్లాడటం చూస్తే, వారికి యేసు ప్రభువు  ఒక నిజమైన స్నేహితుడని సహజంగా అర్థమవుతుంది.

సిలువ చెంత స్నేహం

నిజమైన స్నేహితుడు కష్టకాలంలో కూడా పక్కనే  ఉంటాడు. యేసు ప్రభువు సిలువపై ఉన్నప్పుడు ఆయన మనకోసం తన ప్రాణాన్నే ఇచ్చాడు. "తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం కంటే గొప్ప ప్రేమ లేదు" అని ఆయనే చెప్పాడు. ఈ ప్రేమను ధ్యానిస్తే మన హృదయం కరుగుతుంది. శుక్రవారాలు సిలువ మార్గం ధ్యానించడం, ఇంట్లో సిలువ ముందు కొద్దిసేపు కూర్చోవడం ద్వారా ఈ ప్రేమను గుర్తుచేసుకోవచ్చు. తెరేసమ్మను  ఈ  మార్గం ప్రేమ లోతుల్లోకి నడిపించింది.

ఒక చిన్న రోజువారీ అలవాటు

స్నేహం పెంచుకోవడానికి పెద్ద ప్రణాళికలు అవసరం లేదు. ఉదయం లేవగానే "యేసు ప్రభువుకు స్తుతి కలుగునుగాక" అని చెప్పండి. భోజనం చేసే ముందు కృతజ్ఞతలు చెప్పండి. బయటకు వెళ్ళే ముందు "నాతో రా" అని అడగండి. రాత్రి పడుకునే ముందు ఈ రోజు జరిగినదంతా ఆయనకు చెప్పండి. ఈ నాలుగు చిన్న మాటలు కొన్ని వారాల్లో మీ రోజంతటినీ ఆయన సన్నిధితో నింపుతాయి. స్నేహితునికి చెప్పినట్లే చెప్పండి, ఎటువంటి లాంఛనాలు అక్కర్లేదు.

 

పునీత తెరేసమ్మ- నవదిన ప్రార్ధనలు : నాలుగవ  రోజు 

యేసు ప్రభువు  పట్ల స్నేహం

గురువు:  పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.                    ప్రజలు: ఆమెన్.

గురువు: ప్రభువు , మీతో ఉందురుగాక .                      ప్రజలు: మీ ఆత్మతోను ఉండును గాక.

 

గురువు: ప్రియ సహోదరులారా, ఈ రోజు తెరేసమ్మ ఇచ్చిన ప్రార్థన నిర్వచనాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన అంటే మనలను ప్రేమించే స్నేహితునితో సమయం గడపడం.

గురువు: ప్రార్ధించుదం: ప్రేమా మయుడవైన తండ్రీ, నీ కుమారుడైన యేసు క్రీస్తు మమ్మల్ని సేవకులని కాక స్నేహితులని పిలిచాడు. అవిలాపురి  తెరేసమ్మ,  ఆయన శ్రమలను ధ్యానించి ప్రేమలో ఎదిగింది. ఆమెతో కలిసి యేసు ప్రభువుతో స్నేహం చేయడం నేర్చుకునేలా మా హృదయాలను తెరువుము. మా ప్రభువైన క్రీస్తునామమున ఈ మనవిని వేడుకొంటున్నాము.

ప్రజలు: ఆమెన్.

వాక్య పఠనం

పఠకుడు (యోహాను 15:14-15)

నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులైయుందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇకమీదట నేను మిమ్ములను దాసులని పిలువక, స్నేహితులని పిలిచెదను. ఏలయన, నేను నా తండ్రివలన వినినదంతయు మీకు విశదపరచితిని.

పఠనకుడు: ఇది క్రీస్తు సువిశేషం.

ప్రజలు: క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక

(కొద్దిసేపు మౌనం)

స్నేహం గురించి విన్నపాలు

గురువు: ప్రభువా!  మేము మిమ్ము  అవసరం ఉన్నప్పుడు మాత్రమే పిలవక.

ప్రజలు: మీతో  స్నేహపూరకంగా ఉంటూ,  మీ  స్నేహానికి ప్రేమతో జవాబిచ్చే హృదయం ఇవ్వుము.

గురువు: మీరు  మా కోసం పడిన శ్రమలను ధ్యానిస్తూ

ప్రజలు: మీ  ప్రేమను లోతుగా అర్థం చేసుకోనిమ్ము.

గురువు: మీతో ఏకాంతంగా సమయం గడిపే అలవాటు కోసం.

ప్రజలు: ప్రభువా, ప్రతిరోజూ మీ  సన్నిధికి మమ్మల్ని పిలువుము.

పునీత సూక్తి

గురువు: తెరేసమ్మ ప్రార్దన గురించి ఇచ్చిన నిర్వచనం ఏమిటి,  "ప్రార్థన అంటే మనలను ప్రేమిస్తున్నాడని  మనకు తెలిసిన ఆయనతో, తరచు ఏకాంతంగా గడిపే స్నేహపూర్వక సంభాషణ, మరియు సమయం  తప్ప మరేమీ కాదు." (తెరేసా స్వీయ చరిత్ర, 8వ అధ్యాయం)

గురువు: ప్రార్థన ఒక స్నేహపూర్వక సంభాషణ.

ప్రజలు: ప్రభువా, మీతో మా సొంత మాటల్లో మాట్లాడే చనువు మాకు ఇవ్వుము

గురువు: ఆ స్నేహం తరచు, ఏకాంతంగా సాగాలి.

ప్రజలు: ప్రభువా, రోజూ నీతో గడిపే సమయాన్ని మాకు ఇవ్వుము.

గురువు: ఆయన మనలను ప్రేమిస్తున్నాడని మనకు తెలుసు.

ప్రజలు: ప్రభువా, మీ  ప్రేమపై మా నమ్మకాన్ని బలపరచు.

గురువు: తమ భయాలను యేసు ప్రభువు తో చెప్పుకునే పిల్లల కోసం.

ప్రజలు: ప్రభువా, ఆ బిడ్డల  విశ్వాసాన్ని కాపాడు.

గురువు: తమ విభేదాలను నీ ముందు ఉంచే భార్యాభర్తల కోసం.

ప్రజలు: ప్రభువా, వారికి నీ సమాధానం ఇవ్వుము

గురువు: ఒంటరితనంతో బాధపడే వృద్ధుల కోసం.

ప్రజలు: ప్రభువా, నీ స్నేహంలో వారికి ఓదార్పు ఇవ్వుము

 ఆత్మపరిశీలన (గురువు నెమ్మదిగా చదివి, ప్రతి ప్రశ్న తరువాత కొద్దిసేపు మౌనం)

గురువు: యేసు ప్రభువును నేను యజమానిగా చూస్తున్నానా, లేక స్నేహితునిగా చూస్తున్నానా? (మౌనం)

నా ప్రార్థన ఎక్కువగా అడగడమేనా, లేక ఆయనతో సమయం గడపడమా? (మౌనం)

రోజులో యేసుతో ఏకాంతంగా గడిపే సమయం ఎంత? (మౌనం)

నేటి ప్రార్థన

గురువు: ప్రార్ధించుదము

అందరు: ప్రభువా, నీవు మమ్మల్ని స్నేహితులుగా పిలిచావు. మేము నిన్ను చాలాసార్లు అవసరం ఉన్నప్పుడు మాత్రమే పిలుస్తున్నాము. నీ స్నేహాన్ని ప్రేమతో తిరిగి ఇవ్వడం నేర్పుము. తెరేసమ్మలాగా నిన్ను ప్రేమించే హృదయం మాకు ఇవ్వుము. ఆమెన్.

 మధ్యవర్తిత్వ విన్నపాలు

గురువు: పునీత అవిలాపురి తెరేసమ్మ,                     ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

గురువు:  తిరుసభ ప్రార్థనా గురువా,                       ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

గురువు: తిరుసభ  పండితురాలా,                          ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

గురువు: కార్మెల్  సభ సంస్కర్తా,                           ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

గురువు: యేసు ప్రభువు ప్రేమలో జ్వలించిన ఆత్మా,     ప్రజలు: మా కోసం ప్రార్థించండి.

వ్యక్తిగత విన్నపాలు

గురువు: ఇప్పుడు మన కుటుంబాల అవసరాలను, ఈ నవదినాలలో మనం అడుగుతున్న ప్రత్యేక ఉద్దేశ్యాలను ప్రభువుకు సమర్పిద్దాం. (కొద్దిసేపు మౌనం)

గురువు: ప్రభువా, మా ఈ మనవులను  ఆలకించండి

ప్రజలు: ఆమెన్

గురువు: నవదిన ఉద్దేశ్యాల కోసం మనం కలిసి ప్రార్థిద్దాం.

అందరూ: పరలోక జపం, మంగళ వార్త జపం, త్రిత్వ స్తోత్రం

ముగింపు

గురువు: ప్రార్ధించుదము. ప్రేమమయుడైన తండ్రి, అవిలాపురి  తెరేసమ్మ  చూపిన స్నేహ మార్గంలో నడిచి, మీ కుమారుడైన యేసు ప్రభువుతో గాఢమైన స్నేహాన్ని పెంచుకునే వరం మాకు ప్రసాదించు. మా  ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా  ఈ మనవిని వేడుకుంటున్నాము.

ప్రజలు: ఆమెన్.

గురువు: ఈ రోజు సంకల్పం: సువార్త నుండి ఒక చిన్న భాగం చదివి, యేసు ప్రభువుతో స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడండి. ఈ రోజు మీకు జరిగిన ఒక సంతోషాన్ని, ఒక బాధను ఆయనకు చెప్పండి.

గురువు: ప్రభువు మీతో ఉండును గాక.

ప్రజలు: మీ ఆత్మతోను ఉండును గాక .

గురువు: సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి, కాపాడుదురు గాక.

ప్రజలు: ఆమెన్.

గురువు: సమాధానంతో వెళ్ళుము.

ప్రజలు: దేవునికి కృతజ్ఞతలు.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి