తండ్రి ప్రేమ - హృదయ పరివర్తనకు పిలుపు దైవ ధ్యానం | కార్మెల్ శోభ
తండ్రి ప్రేమ -హృదయ పరివర్తనకు పిలుపు
తప్పిపోయిన
కుమారుని కథ: దేవుని అపారమైన ప్రేమ మరియు హృదయ పరివర్తన (లూకా 15)
మన దైనందిన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తుంటాం, దేవునికి
దూరమవుతుంటాం. కానీ, దేవుని దృష్టిలో మన
పశ్చాత్తాప కన్నీరు ఎంతో అమూల్యమైనది. దేవుడు మన కష్టాన్ని, కన్నీరును
చూసి తట్టుకోలేరు. దేవుడు చూపించిన ప్రేమకు మనం సరిగా బదులు ఇవ్వకుండా, ఆయనను బాధకు
గురి చేసినందుకు వచ్చేటువంటి అపరాధ భావమే పశ్చాత్తాపం. ఈ
పశ్చాత్తాపంతో దేవుని వైపు మరలి, ఆయన మార్గమును అనుసరించుటయే హృదయ పరివర్తన. మనం
ఎప్పుడైతే ఈ పరివర్తన కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మనలను
క్షమిస్తాడు.
సహజంగా మనం ఎప్పుడు దేవుని నుండి దూరంగా
వెళ్ళుతాము అనేది యేసు ప్రభువు చెప్పిన "తప్పిపోయిన
కుమారుని కథ" (The Prodigal Son) ద్వారా
స్పష్టంగా తెలుసుకోవచ్చు. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్న ఈ కథను మనం
మూడు భాగాలుగా విభజించవచ్చు:
- చిన్న కుమారుని పతనం మరియు తిరుగుప్రయాణం
- పెద్ద కుమారుని కోపం మరియు అసూయ
- కుమారుల పట్ల తండ్రికి గల అపరిమితమైన ప్రేమ
ఈ ఉపమానం
చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటి?
ఈ కథ చెప్పడానికి గల కారణాలను మనం లూకా 15:1-3 వచనాలలో
చూడవచ్చు. పాపులు, సుంకరులు యేసు ప్రభువు మాటలు
వినాలని ఆయన దగ్గరకు వస్తున్నారు, ఆయనతో కలిసి భోజనం
చేస్తున్నారు. అది నచ్చని పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర బోధకులు సణుగుకొనడం
ప్రారంభించారు. వారి దృష్టిలో ఒక దైవజనుడు పాపులతో కలిసి ఉండటం తప్పు.
కానీ యేసు ప్రభువు వారి ఆలోచనలను మార్చడానికి, తాను ఈ
లోకానికి వచ్చినది దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వారిని వెదకి రక్షించడానికి అని తెలియజేయడానికే ఈ అద్భుతమైన కథను చెప్పారు.
1. చిన్న కుమారుని నిర్లక్ష్యం – ఆస్తి పాస్తి దుర్వినియోగం
ఈ కథలో చిన్న కుమారుడు తనకు ఉన్న అన్నీంటిని
(ఆస్తిని, సంపదను) వృధా చేసినవాడు. అతనిని పిలిచే ఇంగ్లీష్
పదం 'ప్రోడిగల్' (Prodigal), అంటే
కన్నుమిన్ను తెలియక మొత్తం వృధా చేసినవాడు అని అర్థం.
యూద సమాజంలో పిత్రార్జితం పంచుకోవడానికి
ప్రత్యేక శాసనాలు ఉన్నాయి (ద్వితీయోపదేశకాండము 21:17 ప్రకారం
పెద్దవానికి రెండు భాగాలు, మిగిలినవారికి ఒక్కో భాగం
వస్తుంది). అంటే చిన్న కుమారునికి తండ్రి మరణించిన తర్వాత మూడో వంతు ఆస్తి
వస్తుంది. కానీ, అతను తండ్రి బ్రతికి ఉండగానే
తన భాగాన్ని ఇప్పుడే ఇవ్వమని అడిగాడు. ఇది తండ్రికి తీవ్రమైన అవమానం. "నీవు
మరణించే వరకు నేను వేచి ఉండలేను" అని అనడంతో సమానమిది.
2. స్వయంకృతాపరాధం – దేవుని నుండి దూరం కావడంలో వచ్చే నష్టం
చిన్న కుమారుడు తన ఇష్టప్రకారంగా జీవించాలని
అనుకున్నాడు. మనం కూడా అనేక పర్యాయాలు చేసే తప్పు ఇదే. దేవుని ఇష్టప్రకారముగా కాక, మన స్వంత
ఇష్టప్రకారం జీవించాలనుకుంటాం. అలా జీవిస్తూ దేవుడు మనకిచ్చిన శారీరక, ఆర్థిక
ఆశీర్వాదాలను చెడు పనులకు వాడుతుంటాం. స్వార్థం, లోకాశలు
మనలను దేవుని నుండి, మనల్ని ప్రేమించే వారి నుండి
దూరం చేస్తాయి.
కర్తవ్యాన్ని విస్మరించడం: దేవుని ఆజ్ఞలలో తల్లిదండ్రులను గౌరవించడం చాలా
ముఖ్యమైనది. కానీ చిన్న కుమారుడు తన తండ్రిని ఆదరించడం, గౌరవించడం
అనే కర్తవ్యాన్ని పూర్తిగా విస్మరించాడు.
3. పతనం యొక్క పరాకాష్ట – జంతువుల స్థాయికి దిగజారడం
లూకా 15:13-16 వచనాల
ప్రకారం, చిన్న కుమారుడు ఆస్తిని సొమ్ము చేసుకొని, దూరదేశం
వెళ్ళి, అక్కడ దానిని దుర్వినియోగం చేశాడు. అంతలో అక్కడ
తీవ్రమైన కరువు రావడంతో ఇబ్బందులకు గురయ్యాడు. చివరికి ఆ దేశంలో ఒకని దగ్గర పందులు మేపే పనికి చేరాడు.
పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు.
ఇది మనకు ఒక హెచ్చరిక: మనం దేవునికి దూరమయ్యే
కొద్దీ ఎంత దీన స్థితికి దిగజారిపోతామో ఇది తెలియజేస్తుంది.
- తండ్రితో కలిసి రాజభోగాలు అనుభవించిన వ్యక్తి...
- మొదట "నా ఇష్టం" అన్నాడు,
- ఆస్తిని వృధా చేశాడు, దూరంగా వెళ్ళాడు,
- నైతికంగా దిగజారాడు, బానిసగా మారాడు,
- చివరికి పందుల స్థాయికి (జంతువు స్థాయికి) చేరుకున్నాడు.
4. కనువిప్పు మరియు నిజ స్థితిని గ్రహించడం
కొంతకాలానికి చిన్నవానికి కనువిప్పు కలిగింది. "నా తండ్రి దగ్గర ఎంతమంది కూలీలకు పుష్టిగా భోజనం
దొరకడం లేదు? నేను ఇక్కడ
ఆకలితో అలమటిస్తున్నాను" అని తలంచాడు. ఇక్కడ కనువిప్పు కలగడం అంటే
పరివర్తన మాత్రమే కాదు, తన నిజ స్థితిని తెలుసుకోవడం.
యూదా కుటుంబాలలో మూడు రకాల సేవకులు ఉండేవారు:
- కుటుంబ సేవకులు
- కుటుంబ సేవకులకు సహాయం చేసేవారు
- దినసరి కూలీలు (సేవకులు)
చిన్న కుమారుడు తన తండ్రిని కనీసం ఒక దినసరి కూలిగా అయినా తనను
ఒప్పుకోమని అడగాలని నిశ్చయించుకొని తండ్రి ఇంటి వైపు బయలుదేరాడు. మనం తప్పు
తెలుసుకుని దేవుని దగ్గరకు వెళ్లాలనుకున్నప్పుడే ఆయన మనలను క్షమిస్తాడు.
5. తండ్రి యొక్క అపరిమితమైన ప్రేమ – షరతులు లేని క్షమాపణ
(లూకా 15:20) కుమారుడు దూరంగా వస్తుండగానే
తండ్రి చూశాడు. జాలితో పరుగెత్తుకెళ్లి అతడిని కౌగలించుకున్నాడు. ఆ కుమారుడు చేసిన
పనికి సమాజం పరిహసిస్తుందని, గేలి చేస్తుందని తండ్రికి
తెలుసు. అందుకే ఇతరుల కంట పడకుండా, ఎవరు తూలనాడకుండా తండ్రియే
స్వయంగా ఎదురెళ్ళి కాపాడాడు.
పునీత ఆవిలపూరీ తెరేసమ్మ గారి మాటల్లో: "దేవుడు మన పాపాలు బయటపడకుండా మనలను కాపాడుతారు, ఎందుకంటే
అవి బయటపడితే ఇతరులు మనలను గౌరవించరేమో అని."
కుమారుడు "తండ్రీ, నేను
పరలోకమునకు విరోధముగను నీ యెదుటను పాపము చేసితిని" అని తాను
అనుకున్న మాటలు పూర్తిగా చెప్పకముందే తండ్రి అతనిని అంగీకరించాడు. తండ్రికి
కావలసింది కుమారుని పశ్చాత్తాపం మాత్రమే. వచ్చిన వెంటనే అతనికి క్రొత్త బట్టలు, ఉంగరం, చెప్పులు
ఇచ్చి, కోల్పోయిన స్వేచ్ఛను, కుమారుని
హోదాను తిరిగి ఇచ్చాడు.
6. పెద్ద కుమారుని ప్రవర్తన – అసూయ, స్వార్థం మరియు అహంకారం
(లూకా 15:25) పెద్ద కుమారుడు పొలం నుండి
రాగానే ఇంట్లో విందు, నృత్యాలు చూసి సేవకుని ద్వారా
తమ్ముడు తిరిగి వచ్చిన విషయం తెలుసుకున్నాడు. కోపంతో అతను ఇంట్లోకి రావడానికి
నిరాకరించాడు. తండ్రి బయటకు వచ్చి బ్రతిమాలినా వినలేదు.
నిజానికి పెద్ద కుమారుడు కూడా తమ్ముని కంటే
తక్కువేమీ కాదు.
- తమ్ముడు ఆస్తి అడుగుతున్నప్పుడు ఆపలేదు.
- తండ్రిని అగౌరవపరిచినప్పుడు తప్పు పట్టలేదు.
- తమ్ముడు పోతే ఆస్తి అంతా తనకే దక్కుతుందని స్వార్థంగా ఆలోచించాడు.
- ఇప్పుడు తమ్ముడు తిరిగి వస్తే తట్టుకోలేకపోతున్నాడు.
పరిసయ్యులు, ధర్మశాస్త్ర
బోధకులు కూడా ఇలాగే ఉన్నారు. పాపులు యేసు ప్రభువు దగ్గరకు వస్తే వారు
జీర్ణించుకోలేకపోయారు. యూదయా సంస్కృతి ప్రకారం పెద్ద కుమారుడు అతిథులను
ఆహ్వానించాలి, కానీ ఇక్కడ పెద్ద కుమారుడు తన తండ్రిని అందరి
ముందు కించపరుస్తూ, దేవుని దయను
తప్పుబడుతున్నాడు. మనం కూడా కొన్నిసార్లు దేవుడు ఇతరులకు చూపించే దయను చూసి
అసూయపడతాం.
7. బానిస మనస్తత్వం వర్సెస్ కుమారుని హక్కు
పెద్ద కుమారుడు తండ్రితో "ఇన్ని
సంవత్సరాలు నేను నీకు ఊడిగం (బానిసత్వం) చేశాను, ఎప్పుడూ నీ
మాట జవదాటలేదు. కానీ నా స్నేహితులతో విందు
చేసుకోవడానికి ఒక చిన్న మేకపిల్లను కూడా ఇవ్వలేదు. కానీ వేశ్యలతో ఆస్తిని తగలేసిన
నీ కుమారుడు రాగానే విందు చేశావు" అన్నాడు.
అతను తండ్రిని 'నీవు' అని, తమ్ముడిని 'నీ కుమారుడు' అని
సంబోధించాడు. కానీ తండ్రి మాత్రం ప్రేమతో "కుమారా!
నాకు ఉన్నదంతయు నీదే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి
దొరికాడు, కాబట్టి మనం
విందు చేసుకొనుట యుక్తము" అన్నాడు. పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నా బానిసలా
బ్రతికాడు కానీ తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేదు.
ముగింపు:
మనకు లభించే ఆధ్యాత్మిక సందేశం
ఈ 'తప్పిపోయిన కుమారుని కథ' ద్వారా
దేవుడు మనకు ఇచ్చే స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే ఎంతటి దుర్భర స్థితికి
నెట్టబడతామో తెలుస్తుంది. అయితే, దేవుని ప్రేమ ఎటువంటి షరతులు
లేనిది. మనలను అంగీకరించడంలో, క్షమించడంలో దేవుడు ఎప్పుడూ
అలసట చెందరు. ప్రతినిత్యం ఆయన మనకోసం ఎదురుచూస్తూనే ఉంటారు.
కాబట్టి, మనం పెద్ద కుమారుని లాంటి అసూయను వీడి, చిన్న కుమారుని లాంటి పశ్చాత్తాప మనస్సుతో, పరలోక తండ్రి వైపు అడుగులు వేద్దాం. తప్పిపోయిన కుమారుని జీవితం, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను మనం సరిగా వాడుకోక పోతే మనం ఎటువంటి, ధుర్భర పరిస్థితిలోనికి నెట్టబడతామో తెలియచేస్తుంది. ఆ పరిస్తితిలోనే ఉండక, పశ్చత్తాపం ద్వారం తండ్రి దగ్గరకు రావాలని తెలియజేస్తుంది. మనలను అంగీకరించడంలో, క్షమించడం లో దేవుడు ఎప్పుడు అలసట చెందరు, ప్రతినిత్యం సిద్దంగానే ఉంటారు. దేవుని ప్రేమ ఎటువంటి షరతులు లేనిది, ఎల్లప్పుడు నీకోసం పరితపిస్తుంది, నీకోసం ఎదురుచూస్తుంది. కనుక ఎప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళుటకు వెనుకడుగువేయక ముందుకు పోదాం. ఆమెన్
Fr. Amruth
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment