అందరికంటే అధికుడు ఎవడు? – లూకా 9:46-50 బైబిల్ ధ్యానం

 


 అందరికంటే అధికుడు ఎవడు? - లూకా 9:46-50 

“మనలో అధికుడు ఎవడు?” అని శిష్యులు తమలో తాము చర్చించుకొన మొదలిడిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్నబిడ్డను తన చెంత నిలుపుకొని, “నా పేరిట ఈ చిన్న వానిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నా తండ్రిని స్వీకరించును. ఏలయన, మీ అందరిలో అత్యల్పుడైనవాడు' అందరికంటే అధికుడు” అని వారితో పలికెను. అపుడు యోహాను “ప్రభూ! మీ పేరిట ఒకడు దయ్యములను పారద్రోలుట చూచి మేము వానిని వారించితిమి. ఏలయన, అతడు మనలను అనుసరించువాడు కాడు” అని చెప్పెను. అందుకు యేసు “వానిని వారింపవలదు. మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే” అనెను.

లూకా సువార్తలోని వాక్యభాగం, యేసు ప్రభువుకి శిష్యులుగా ఉండేవారి  జీవితానికి సంబంధించిన విషయాలను తెలుపుతుంది. ఇది యేసు ప్రభువు దృష్టి , లోక దృష్టికి  మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తు, అహంకారాన్ని విడిచిపెట్టి, దేవుని రాజ్య విలువలను స్వీకరించమని శిష్యులను ఆహ్వానిస్తున్నది.

చారిత్రక నేపథ్యం

ఈ వాక్యభాగం యేసు ప్రభువు రూపాంతరం చెందిన  (లూకా 9:28-36) తరువాత, తన శ్రమలు, మరణం గురించి రెండవసారి తెలియజేసిన  సంధర్భంలో  (9:43-45) వస్తుంది.   శిష్యులు  ప్రభువు ఎటువంటి మెస్సీయ్యా అని అర్ధం చేసుకోలేక పోయారు. (9:45).  ఆయన శ్రమలు, మరణం గురించి మాటలాడితే వీరు మాత్రం   తమలో ఎవరు గొప్పవారు అని చర్చించుకొనడం మొదలుపెట్టారు.  ఈ వాదనల తరువాత యేసు ప్రభువు పేరిట ఒక వ్యక్తి దయ్యములను వెడలగొడుతుంటే వారు అతన్ని వారించారు. ఈ రెండు ఘటనలను లూకా ఒకదాని తరువాత ఒకటి ఉంచడం యాదృచ్ఛికం కాదు. మొదటి ఘటనలో శిష్యులు తమను తాము గొప్పవారిణిగా చూస్తే, రెండవ ఘటనలో వారు మరొకరిని కిందకు దించాలని చూస్తున్నారు.  రెండు ఘటనలలో  ఉన్న మూలకారణం ఒకటే,  మెమే గొప్ప వారిగా ఉండాలి, మరియు మా ద్వారానే ఏమైన జరగాలి అనే భావన.

అందుకే కాబోలు లూకా సువార్త పదేపదే ఈ ప్రశ్నను లేవనెత్తుతుంది, ఆ ప్రశ్నే  దేవుని రాజ్యంలో నిజమైన గొప్పతనం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం 14వ అధ్యాయంలో  విందుకు ఆహ్వానించబడినవారి ఉపమానంలోను, 18వ  అధ్యాయంలో పరిసయ్యుడు, సుంకరి ప్రార్థనలోను, 22వ అధ్యాయంలో కడరా  భోజనం సందర్భంలోను పునరావృతమవుతుంది.

చిన్నబిడ్డ మరియు నిజమైన గొప్పతనం (వచనాలు 46-48)

"మనలో అధికుడు ఎవడు?"  శిష్యుల మధ్య ఇది ఒకసారి జరిగిన సంభాషణ కాదు, పదే పదే తలెత్తిన ఆలోచన. యూదా సమాజంలో, రబ్బీల మధ్య, శిష్యుల బృందాలలో స్థానం, చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు గురువుకు దగ్గరగా కూర్చుంటారు, ఎవరు మొదట మాట్లాడతారు, ఎవరి అభిప్రాయానికి ఎక్కువ విలువ ఉంటుంది, అనేవి  ఆనాటి సామాజిక క్రమంలో భాగం.  యేసు ప్రభువు శిష్యులు కూడా  ఈ లోకసంబంధమైన ఆలోచనా విధానాన్నే దైవ  రాజ్యానికి అన్వయించుకుంటున్నారు.

యేసు ప్రభువు  వారి ఆలోచనను గ్రహించి, ఒక చిన్నబిడ్డను తీసుకుని తన ప్రక్కన నిలబెట్టాడు.  తరచుగా ప్రభువు  జీవిత  దృష్టాంతాల ద్వారా దైవ రాజ్య సత్యాలను వివరిస్తాడు. యూదా సమాజాలలో పిల్లలకు ఎటువంటి సామాజిక స్థానం ఉండేది కాదు. వారు పూర్తి వ్యక్తులుగా పరిగణించబడేవారు కాదు; వారికి చట్టపరమైన హక్కులు లేవు, ఆర్థిక స్వాతంత్ర్యం లేదు, సమాజంలో స్వరం లేదు. ఒక బిడ్డను ఆదర్శంగా చూపడం అంటే, అధికారం, హోదా, గుర్తింపు వంటి భావనలన్నింటినీ పూర్తిగా తలకిందులు చేయడమే.

"నా పేరిట ఈ చిన్న వానిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు" అనే మాటలో  ప్రభువు శిష్యుల ఆలోచనలకు  పూర్తి విరుద్ధముగా చేస్తున్నాడు.  "స్వీకరించుట" అనే పదం  చాలా ప్రాముఖ్యమైనది. ఇది కేవలం ప్రేమతో చూడటం కాదు; ఆతిథ్యం ఇవ్వడం, స్వాగతం పలకడం, తనకు ఏమీ తిరిగి ఇవ్వలేని వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించడం. ఆనాటి సమాజంలో ఆతిథ్యం అనేది ప్రతిఫలాపేక్షతో ముడిపడి ఉండేది.  ఒక అతిథిని ఆహ్వానిస్తే, భవిష్యత్తులో అతను తిరిగి ఆతిథ్యం ఇస్తాడని, లేదా ఏదో ఒక సామాజిక ప్రయోజనం కలుగుతుందని ఆశించేవారు. కానీ ఒక చిన్న బిడ్డకు ఏమీ తిరిగి ఇచ్చే శక్తి లేదు. కాబట్టి, ఒక బిడ్డను ఆహ్వానించడం అంటే, పూర్తిగా నిస్వార్థమైన, ప్రతిఫలాపేక్ష లేని ప్రేమను చూపడమే.

యేసు ప్రభువు  చిన్న బిడ్డను "తన చెంత" నిలబెట్టుకున్నాడు, అంటే, తన స్థానంలో, ఉంచుకున్నాడు. ఇది కేవలం ఒక ఉదాహరణగా చూపడం కాదు, ఆ బిడ్డను తన గౌరవ స్థానానికి భాగస్వామిని చేయడం. ఇది ఆనాటి రబ్బీల బోధనా పద్ధతికి పూర్తి భిన్నమైనది.  రబ్బీలు సాధారణంగా తమ శిష్యులను తమ చుట్టూ కూర్చోబెట్టుకుని బోధించేవారు, కానీ ఒక చిన్న బిడ్డను తమ గౌరవ స్థానంలో నిలబెట్టుకోవడం అనూహ్యమైనది. శిష్యులు గొప్ప వారు కావాలంటే, అల్పమైన, హోదాలు లేని, తిరిగి ఏమి ఇవ్వలేని, సమాజంలో స్వరం లేని వారిని స్వీకరించాలి, అలా స్వీకరిస్తే ప్రభువునే స్వీకరించిన వారు అవుతారు.

ఈ బోధన మత్తయి 25:40 లోని "ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితిరి" అనే మాటలతో సమానంగా ఉంది. చివరిగా, "మీ అందరిలో అత్యల్పుడైనవాడు అందరికంటే అధికుడు" అని చెబుతున్నాడు.  ఇది లోకపు ఆలోచనకు  పూర్తి విరుద్ధంగా  చేసే నియమం.  గొప్పతనం అధికారంలో కాదు, సేవలో ఉంది.

అపరిచిత అనుచరుడు  (వచనాలు 49-50)

యోహాను అప్పుడు,  "ప్రభూ! మీ పేరిట ఒకడు దయ్యములను పారద్రోలుట చూచి మేము వానిని వారించితిమి. ఏలయన, అతడు మనలను అనుసరించువాడు కాడు" అని అంటున్నాడు.  ఈ మాటలలో "మేము వారించితిమి" అనే పదం  గతంలో పూర్తయిన పనిని  సూచిస్తుంది.  అంటే, ఈ సంఘటన ఇప్పటికే జరిగిపోయింది.

ఈ అజ్ఞాత వ్యక్తి యేసు  ప్రభువు పేరిట దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, అంటే అతనికి యేసు  ప్రభువు శక్తిపై విశ్వాసం ఉంది, ఆయన నామాన్ని గౌరవిస్తున్నాడు. కానీ అతను పన్నెండు మంది  అపోస్తలుల బృందంలో భాగం కాదు. యోహాను దృష్టిలో, అధికారిక శిష్యరికం లేకుండా యేసు ప్రభువు  పేరును ఉపయోగించడం ఒక అతిక్రమణ. ఈ భావన నేటికీ కనిపిస్తుంది.

ఇది ఒక్క యోహాను వ్యక్తిగత నిర్ణయం కాదు, శిష్యుల బృందం మొత్తం తీసుకున్న నిర్ణయం. బహుశా, "మనలో అధికుడు ఎవడు?" అనే మునుపటి చర్చ వారి మనసులలో ఇంకా తాజాగా ఉండి, తమ ప్రత్యేకతను, తమ అధికారాన్ని కాపాడుకోవాలనే భావననే ఈ నిర్ణయానికి పురికొల్పి ఉండవచ్చు.

యేసు ప్రభువు, "వానిని వారింపవలదు. మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే"  అని చెబుతున్నాడు. ఈ మాట మత్తయి 12:30 లోని "నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతి కూలుడు." అనే మాటకు పైకి విరుద్ధంగా కనిపించవచ్చు. కానీ ఈ రెండు మాటల సందర్భాలు వేర్వేరు. మత్తయి 12లో యేసు ప్రభువు  పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, వారు యేసు ప్రభువు  అద్భుతాలను దెయ్యాల అధిపతి బెల్జెబూలు శక్తికి ఆపాదిస్తూ, బహిరంగంగా ఆయనను వ్యతిరేకిస్తున్నారు.ఆయనకు వ్యతిరేకముగా చేస్తున్నారు. కాని ఇక్కడ యేసు ప్రభువు  తన సొంత శిష్యులతో మాట్లాడుతున్నాడు. ప్రభువు పేరుతో పని చేస్తున్న వాని గురించి మాటలాడుతున్నాడు.

సేవ, వినయం, దేవుని ఆత్మ అందరికీ ఇవ్వబడును

దేవుని రాజ్యంలో గొప్పతనం అనేది లోకానికి బిన్నంగా నిర్వచించబడింది. లోకంలో గొప్పతనం అంటే అధికారం, సంపద, ప్రజాదరణ. దేవుని రాజ్యంలో గొప్పతనం అంటే వినయం, సేవ, తనను తాను అల్పునిగా చేసుకోవడం. పునీత పౌలు ఈ సూత్రాన్నే ఫిలిప్పీయులకు 2:5-8లో వివరిస్తున్నాడు.  క్రీస్తు దేవుడై కూడా తనను తాను రిక్తునిగా చేసుకొని, సేవక  రూపమెత్తుకున్నాడు.

దేవుని సన్నిధి అల్పులలో దాగి ఉంటుంది. చిన్న బిడ్డను స్వీకరించడం ద్వారా యేసు ప్రభువును స్వీకరించడమని, యేసు ప్రభువును స్వీకరించడం ద్వారా తండ్రిని స్వీకరిస్తామని చెప్పడం, దేవుని  సన్నిధిని అల్పమైన వారిగా లోకం పరిగణించే సేవించుటలో దొరుకుతుంది అనే తెలియజేస్తుంది.

దేవుని రాజ్యం మన హద్దుల కంటే విశాలమైనది. అపరిచిత వ్యక్తి ఘటన, సంఘం అనేది ఒక మూసిన క్లబ్బు కాదని, దేవుని ఆత్మ మన నియంత్రణలో లేని చోట్ల కూడా పనిచేయగలదని బోధిస్తుంది. సంఖ్యాకాండము 11:26-29లో ఎల్దాదు, మేదాదు అనే ఇద్దరు వ్యక్తులు శిబిరం వెలుపల ప్రవచించినప్పుడు, యెహోషువ వారిని ఆపమని మోషేను కోరాడు. మోషే "ఓయి! నా యెడలగల అభిమానముచే నీవు వారిమీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికి ఆత్మను అనుగ్రహించి వీరిచే గూడ ప్రవచనములు పలికించిన ఎంత బాగుండెడిది" అని చెబుతాడు.  

తరువాతి కాలంలో  పునీత  పౌలు కూడా ఇదే స్ఫూర్తిని ఫిలిప్పీయులకు 1:15-18లో ప్రదర్శిస్తాడు. కొందరు అసూయతో, పోటీ భావంతో క్రీస్తును ప్రకటిస్తున్నా, పునీత  పౌలు, "సత్సంకల్పముచేగాని లేక మరియొక విధ ముగాగాని ఎటులైనను సర్వవిధముల క్రీస్తునే బోధించుచున్నారుగదా! కనుక నేను సంతోషించెదను." అని చెబుతున్నాడు.

ఈ వాక్యభాగం మనకు ఒక సమగ్రమైన శిష్యరిక దృక్పథాన్ని అందిస్తుంది. అది ఏమిటంటె అల్పులను స్వీకరించె వినయం , ఇతరుల సేవను గుర్తించగలిగె హృదయ విశాలత్వం కలిసినప్పుడే నిజమైన క్రైస్తవ పరిపక్వత సాధ్యమవుతుంది.

నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదల వినయం అనే పునాదిపైనే నిర్మించబడుతుంది. ఆత్మ దేవునితో ఐక్యత వైపు ఎదిగే కొద్దీ, తనను తాను మరింత అల్పునిగా చూసుకోవడం నేర్చుకుంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదుగుదల అంటే అహాన్ని త్యజించి, దేవుని ముందు ఒక చిన్నబిడ్డలా నిలబడటం.

మన జీవితంలో  అనువర్తనం

నాయకత్వ భావన. మన సమాజంలో, సంఘాలలో, కుటుంబాలలో, ఉద్యోగ రంగాలలో నాయకత్వం అంటే తరచుగా అధికారం చెలాయించడం అని అర్థం చేసుకుంటారు. యేసు ప్రభువు  బోధించే నాయకత్వం దీనికి పూర్తి విరుద్ధం.  నాయకుడు అందరికంటే ఎక్కువ సేవ చేసేవాడు, అందరికంటే వినయంగా ఉండేవాడు.

వలస కార్మికులు, నిరుపేదలు, అట్టడుగు వర్గాల పట్ల మన వైఖరి. రోజువారీ కూలీలు, వలస కార్మికులు, గృహసేవకులు తరచుగా సమాజంలో అత్యల్ప స్థానంలో పరిగణించబడతారు. వీరిని "అధికారం లేనివారు," "మాట చెల్లనివారు" అని చూడటం సర్వసాధారణం. కానీ యేసు ప్రభువు బోధన ప్రకారం, ఈ అల్పులలోనే, వారి సామాజిక హోదాతో సంబంధం లేకుండా దేవుని సన్నిధి దాగి ఉంది. క్రైస్తవ సమాజం వీరిని ఎలా చూస్తుంది, ఎలా చూసుకుంటుంది అనేది ఆ సమాజపు ఆధ్యాత్మిక ఎదుగుదలను కొలిచే  ఒక కొలబద్దలాంటిది.

అపరిచిత వ్యక్తి  ఘటన నుండి ఒక విషయాన్ని గ్రహించవచ్చు.  మేలైన పని, మన నుండి కాకుండా వెలుపల నుండి వచ్చినా, గుర్తించే వినయం అలవర్చుకోవాలి. ఇది ఇతరులలో ఉన్న మంచితనాన్ని, న్యాయాన్ని, కరుణను గౌరవంతో చూడటం నేర్పుతుంది.

శిష్యుల సమస్యకు  మూలకారణం  ఒకరితో ఒకరు పోల్చుకోవడమే. మనం కూడా మన గొప్పతనాన్ని ఇతరుల పనితీరుతో కొలుచుకుంటే, అసూయ, గర్వం, అసంతృప్తి తలెత్తుతాయి. దానికి బదులు, మనం మన స్వంత పిలుపును, దేవుడు మనకు ఇచ్చిన నిర్దిష్ట సేవను నమ్మకంగా నెరవేర్చడం నేర్చుకోవాలి.

ముగింపు

లూకా 9:46-50 మనకు రెండు విషయాలను బోధిస్తుంది.  మొదటిది, గొప్పతనం అధికారంలో కాదు, సేవలో ఉంది; అల్పులను స్వీకరించడంలో దేవుని సన్నిధి దాగి ఉంది. రెండవది, దేవుని రాజ్యం మన హద్దుల కంటే విశాలమైనది; ఆయన ఆత్మ మన నియంత్రణ లేని చోట్ల కూడా పనిచేయగలదు. ఈ రెండు సత్యాలను హృదయంలో నింపుకున్నప్పుడు, మనం అసూయ, పోటీ, అహంకారాలను విడిచిపెట్టినప్పుడు, నిజమైన క్రైస్తవ విలువలతో జీవించగలుగుతాము. దేవుని రాజ్యంలో స్థానం, గుర్తింపు అనేవి మనం సాధించుకునేవి కావు, దేవుని ముందు వినయంగా నిలబడినప్పుడు ఆయనే మనకు అనుగ్రహించేవి.

ప్రార్థన

ప్రభువా, మీరు  చిన్నబిడ్డను మీ  ప్రక్కన నిలబెట్టుకుని, అల్పులలో మీ  సన్నిధిని చూపించారు. నా హృదయంలో ఉన్న అధికార వాంఛను, పోటీ భావాన్ని తీసివేసి, నిజమైన వినయాన్ని నాకు దయచేయుము. మీ  పేరిట మేలు చేసే ప్రతి వ్యక్తిని, నాతో  లేకపోయినా, వారిని ప్రేమతో గుర్తించే విశాల హృదయాన్ని నాకు అనుగ్రహించుము. ఆమెన్.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి