ద్రాక్షతోట ఉపమానం: దేవుని ప్రేమ, మన ఫలం – 27వ ఆదివార ప్రసంగం

 


ద్రాక్షతోట – దేవుని ప్రేమ, మన ఫలం

సామాన్య కాలపు 27వ ఆదివారం (సంవత్సరం A) – ప్రసంగం

 యెషయా 5:1-7  ఫిలిప్పీయులకు 4:6-9  మత్తయి 21:33-43

ఒక రైతు తన ఇంటి వద్ద ఎంతో కష్టపడి ఒక తోటను నాటాడు.  ఆ తోటను వేయుటకు ఒక కొండను కష్టపడి తవ్వాడు, రాళ్ళను వేరివేశాడు. మొక్కలు తెచ్చాడు, నాటాడు,  నీరు పెట్టాడు, కాపలా కాశాడు. కాపు కాలం వచ్చేవరకు దానికి కావలసినవి అన్ని ఇచ్చాడు.  ఇప్పుడు పంట కాలం వచ్చింది. అతని కళ్లల్లో ఆశ ఉంది. ఆ ఆశ ఫలించిందా, లేక నిరాశగా మారిందా? ఈ రోజు పఠనాలన్నీ ఆ రైతు కళ్లల్లోని ప్రశ్నలనే మనకు చూపిస్తున్నాయి. ఆ రైతు దేవుడు. ఆ తోట మనమే.

1. ప్రేమగీతంతో మొదలైన కథ

యెషయా ప్రవక్త ప్రజల ముందు నిలబడి ఒక పాట పాడతాడు. పెళ్లి వేడుకలో, పంటల పండుగలో పాడే పాటలా ఉంది అది, నా ప్రియునికై, ఆయన ద్రాక్షతోట గురించి ఒక పాట పాడతాను అంటున్నాడు. ప్రజలు ఆసక్తిగా వింటారు. తమకు తెలిసిన రైతు పాటే అనుకుంటారు.

ఆ ప్రియుడు ఏమేమి చేశాడో వినండి. సారవంతమైన కొండను ఎంచుకున్నాడు. నేలను తవ్వాడు. రాళ్లను ఏరివేశాడు. శ్రేష్ఠమైన ద్రాక్ష తీగలను నాటాడు. తోట మధ్యలో కావలి గోపురం కట్టాడు. ద్రాక్షను తొక్కే తొట్టి తవ్వాడు.

రాళ్లు ఏరడం ఎంత కష్టమైన పని! కొండ నేలలో రాళ్లు లెక్కలేనన్ని ఉంటాయి. ప్రతి రాయినీ చేతులతో ఏరాలి. అది ఎవరికీ కనబడని పని. కానీ ఆ పని చేయకపోతే వేర్లు లోతుకు పోవు. దేవుడు మన జీవితాల్లో కూడా ఇలా ఎన్ని రాళ్లను ఏరివేశాడో మనకు తెలియదు. మనకు రాకుండా ఆపిన ప్రమాదాలు, మనం తెలియకుండానే తప్పించుకున్న చెడు మార్గాలు, మనకోసం ఎవరో చేసిన ప్రార్థనలు ఇవన్నీ దేవుడు మన మీద ప్రేమతో చేసినవే.

మనం తీసుకున్న బాప్తిస్మం,  మనకు ఇవ్వబడిన విశ్వాసం, కుటుంబం,  మనం పొందే దివ్య సంస్కారాలు, ఎన్నో క్షమాపణలు. ఇవన్నీ ఆ తవ్వకం, ఆ కంచె, ఆ కావలి గోపురంలోని భాగాలే మనం మంచి ఫలాలను ఇస్తామని ప్రభువు మనకు అందించిన వరాలే. అందుకే ఆ రైతు వేదనతో అడుగుతాడు,  "నా తోటకు నేను చేయనిది ఇంకేముంది?" ఈ ప్రశ్నలో కోపం లేదు, బాధ ఉంది. తన ప్రేమ వృథా అయిందని కుమిలిపోయే తండ్రి గొంతు అది. తన పిల్లవాడి కోసం అన్నీ చేసి, ఆ పిల్లవాడు తన వైపు తిరిగి చూడకపోతే ఏ తండ్రి హృదయం బాధపడదు?

2. ఆశించిన ఫలం, వచ్చిన ఫలం

"మంచి ద్రాక్షలు కాస్తాయని ఎదురుచూశాను, కానీ అడవి ద్రాక్షలు కాశాయి." ఆ అడవి ద్రాక్ష పుల్లగా, చేదుగా, తినడానికి పనికిరాకుండా ఉంటుంది. రైతు చేసిన  శ్రమ అంతా కనపబడుతుంది. ప్రేమ అంతా తెలుస్తుంది. కానీ ఫలితం  మాత్రం నిరాశ. అసలు దేవుడు ఆశించిన ఫలం ఏమిటో యెషయా చివర్లో చెబుతున్నాడు, "ఆయన న్యాయాన్ని ఆశించాడు, కానీ రక్తపాతం కనబడింది. ధర్మాన్ని ఆశించాడు, కానీ ఆక్రందన వినబడింది."

హీబ్రూ భాషలో ఇక్కడ ఒక చక్కని పదప్రయోగం కనపడుతుంది. న్యాయం అనే పదం "మిష్పాత్". రక్తపాతం అనే పదం "మిస్పాహ్". ధర్మం "సెదాకా", ఆక్రందన "సెఆకా". వినడానికి దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కానీ అర్థాలు భూమ్యాకాశాలంత దూరం. పైకి చూస్తే మంచి క్రమశిక్షణ  కనిపిస్తుంది, లోపల చూస్తే అన్యాయం ఉంటుంది. యెషయా మనకు చెప్పే సత్యం ఇది. ఆలయాలు, పండుగలు, ప్రార్థనలు ఉండవచ్చు. కానీ పక్కింటి పేదవాని కన్నీరు మనకు కనబడకపోతే, దేవుని దృష్టిలో అది అడవి ద్రాక్షే.

మనం పండుగలను ఘనంగా జరుపుకుంటాం. కానీ ఆ పండుగ రోజున ఆకలితో ఉన్న ఒక్క వ్యక్తికైనా అన్నం పెట్టామా? మన భక్తి, మన బంధువుల పట్ల, పనివారి పట్ల, అవసరంలో ఉన్నవారి పట్ల న్యాయంగా మారుతోందా? లేదా? ఇదే దేవుని ప్రశ్న.

3. కంచె తీసివేయబడినప్పుడు

తోట ఫలించనప్పుడు రైతు కంచెను తీసివేస్తాడు, గోడను పడగొడతాడు. అప్పుడు జంతువులు తోటను తొక్కేస్తాయి, ముళ్లపొదలు పెరుగుతాయి. దేవుడు కొరడా పట్టుకుని వచ్చి కొట్టడు. ఆయన తన కాపుదలను వెనక్కి తీసుకుంటాడు. మనం ఆయన రక్షణను పట్టించుకోకుండా మనకు నచ్చినట్లు జీవిస్తే, మన జీవితాలు వాటంతట అవే ముళ్లతో నిండిపోతాయి. పాపం చేసిన ఫలమే పాపానికి శిక్షగా మారుతుంది. క్షమ లేని ఇల్లు చేదుగా మారుతుంది. ప్రార్థన లేని హృదయం ఖాళీ అవుతుంది. దేవుడు లేని జీవితానికి కంచె ఉండదు.

4. సువార్తలో అదే తోట, కొత్త మలుపు

యేసు ప్రభువు  యెరూషలేము దేవాలయంలో నిలబడి ఉన్నాడు. సిలువ మరణానికి కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. ముందు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఉన్నారు. వారు "నీనీవు  ఏ అధికారంతో ఇవి చేస్తున్నావు?" అని ఆయనను నిలదీస్తున్నారు. జవాబుగా ప్రభువు  ఈ ఉపమానం చెబుతున్నాడు.

"ఒక యజమాని ద్రాక్షతోట నాటి, చుట్టూ కంచె వేసి, తొట్టి తవ్వి, గోపురం కట్టి..." ఈ మాటలు వినగానే వారికి యెషయా గీతం గుర్తొచ్చింది. కానీ యేసు ప్రభువు  ఒక మార్పు చేశాడు. యెషయాలో తీగలే చేదు ఫలాలు కాశాయి. యేసు ప్రభువు చెప్పిన  ఉపమానంలో తోట మంచి ఫలమే ఇచ్చింది. సమస్య కౌలుదారులతో. అంటే దేవుని ప్రజలను నడిపించే బాధ్యత ఉన్నవారితో.

యజమాని తోటను కౌలుదారులకు అప్పగించి దూరదేశం వెళ్ళాడు. ఇది కౌలు దారుల మీద ఆయన నమ్మకానికి గుర్తు. దేవుడు మనకు కూడా ఎన్నో అప్పగించాడు. కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ప్రతిభ, సంపద, పదవి, విశ్వాసం వంటివి. మనం వాటికి యజమానులం కాదు. కౌలుదారులం, నిర్వాహకులం మాత్రమే.

పంట కాలం వచ్చినప్పుడు యజమాని తన భాగం కోసం సేవకులను పంపాడు. న్యాయమైన కోరికే కదా, తోట ఆయనది, ఆయన భాగం ఆయనకు ఇవ్వాలి. కానీ కౌలుదారులు ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, ఒకరిని రాళ్లతో కొట్టారు. ఇది ఇస్రాయేలు చరిత్రలో ప్రవక్తలకు జరిగిన దానికి ఉదాహరణ. దేవుని మాట చెప్పడానికి వచ్చినవారిని తిరస్కరించడం, హింసించడం ఒక అలవాటుగా వారు చేసుకున్నారు.

5. ఆశ్చర్యకరమైన ఓర్పు

యజమాని ప్రవర్తన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మొదటి సేవకులు చంపబడినప్పుడు అతడు సైన్యాన్ని పంపలేదు. మరికొందరిని పంపాడు. వారినీ అలాగే చేసినా, చివరికి తన కుమారుడినే పంపాడు. "వారు నా కుమారుని గౌరవిస్తారులే" అనుకున్నాడు.

లోకం దృష్టిలో ఇది వెర్రితనం. కానీ దేవుని ప్రేమ ఇలాగే ఉంటుంది. ప్రేమ ఎప్పుడూ ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. తిరస్కరణ ముప్పు ఉన్నా తన ప్రియ కుమారుణ్ణే అప్పగించేంత కరుణ ఆయనది. "దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు" అనే వాక్యం ఈ ఉపమానంలో మన కళ్ల ముందు కనిపిస్తుంది.

దేవుడు మన విషయంలోనూ ఓపికగా ఉన్నాడు. ఎన్నిసార్లు ఆయన మనకు సేవకులను పంపాడు! ఒక ప్రసంగం ద్వారా, ఒక స్నేహితుని మాట ద్వారా, తల్లి కన్నీటి ద్వారా, మన అంతరాత్మ స్వరం తన సందేశం పంపుతూనే ఉన్నాడు. మనం ఎన్నిసార్లు వాటిని వినకుండా పక్కన పెట్టాం? అయినా ఆయన ఇంకా పిలుస్తూనే ఉన్నాడు. ఆయన ఓర్పే మనకు మరో అవకాశం.

6. "ఇది నాది" అనే పాపం

కౌలుదారులు కుమారుని చూసి ఏమన్నారు? "వీడే వారసుడు, రండి, వీనిని చంపి వీని వారసత్వాన్ని స్వాధీనం చేసుకుందాం" అని అంటున్నారు. వారి పాపానికి మూలం ఇదే.  తోటను తమ సొంతంగా భావించడం. దేవుడు లేకుండా తామే యజమానులుగా ఉండాలనే కోరిక. "మనమే దేవునిలా అవుదాం"అని అనుకుంటున్నారు.

ఇది మనలోనూ కనిపిస్తుంది. నా సమయం నాది, నా డబ్బు నాది, నా పిల్లలు నా ఇష్టప్రకారం ఉండాలి, నా పదవి నా గొప్పతనం కోసం ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన దాన్ని మనకే కావాలని  అనుకుంటామో, అప్పుడు యజమాని పంపిన సేవకులు మనకు శత్రువుల్లా కనిపిస్తారు. మనల్ని సరిదిద్దేవారు, హెచ్చరించేవారు చికాకు కలిగిస్తారు. ఆయన కుమారుని స్వరం మన స్వార్థానికి అడ్డంకి అవుతుంది.

ఈ ఉపమానం రెండు వేల ఏళ్ల క్రితం ఎవరికో చెప్పిన కథ కాదు. ఇది ఈ రోజు మన ఇంటి కథ, మన సంఘం కథ, మన హృదయం కథ. గురువులు, కన్యాస్త్రీలు, సంఘ పెద్దలు, సేవకులు అందరం కౌలుదారులమే. తిరుసభ దేవునిదే, మనం సేవకులం మాత్రమే. పదవి సేవకు, ప్రభావాలు  ప్రేమకు సాధనాలు కావాలి.

కొడుకును "తోట వెలుపలికి తోసి చంపారు." యేసు ప్రభువును కూడా యెరూషలేము పట్టణ ద్వారం వెలుపలే సిలువ వేయబడ్డాడు. ఈ ఉపమానం ఒక విధంగా ఆయన సొంత మరణం గురించిన ప్రవచనం కూడా. తనకు ఏమి జరుగబోతుందో  తెలిసినా ప్రభువు  వెనుకంజ వేయలేదు.

7. తిరస్కరించబడిన రాయి

యేసు ప్రభువు,  "ఆ యజమాని వచ్చినప్పుడు కౌలుదారులను ఏమి చేస్తాడు?"  అని వారినే అడుగుతున్నాడు. వారు తమను తామే ఖండించుకునే జవాబు ఇస్తారు. తమ గురించే చెప్పుకుంటున్నారని వారికి అప్పటికి తెలియదు. అప్పుడు యేసు ప్రభువు "ఇల్లు కట్టువారు వదిలివేసిన రాయియే మూలరాయి ఆయెను" అనే కీర్తనను చెబుతున్నాడు.  మనుషులు తిరస్కరించిన క్రీస్తునే దేవుడు మహిమ పరుస్తున్నాడు. సిలువ మరణం ముగింపు కాదు. పునరుత్థానమే దేవుని జవాబు. మానవ తిరస్కరణ దేవుని ప్రణాళికను ఆపలేదు. దాని ద్వారానే ఆ ప్రణాళిక నెరవేరింది.

మన జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోయినట్లు అనిపించవచ్చు. మన ప్రయత్నాలు విఫలమై, మనం తిరస్కరించబడినట్లు అనిపించవచ్చు. కానీ దేవునికి అసాధ్యమనేది లేదు.  తోట వదలబడినట్లు కనిపించినా, కుమారుడు చంపబడినా, ఆయన ప్రణాళిక ఆగదు. తిరస్కరించబడిన రాయి మూలరాయి అవుతుంది.

"దేవుని రాజ్యం మీ నుండి తీసివేయబడి, దాని ఫలమిచ్చే జనులకు ఇవ్వబడును." దీన్ని ఒక జాతిపై తీర్పుగా కాదు, ఫలమివ్వని ప్రతి తరానికి వర్తించే హెచ్చరిక. యేసు ప్రభువు  శిష్యులు, మొదటి క్రైస్తవులు అందరూ యూదులే. ఈ మాట ఈ రోజు మనకే. క్రైస్తవులమని పేరు చెప్పుకుంటే చాలదు. బాప్తిస్మం పొందితే చాలదు. ఫలమే ప్రమాణం. పేరు కాదు, పదవి కాదు, వంశం కాదు, కనుక మంచి ఫలము ఇచ్చేవారిగా ఉండాలి.

8. చెరసాల నుండి వచ్చిన శాంతి సందేశం

ఇంత తీవ్రమైన హెచ్చరికల మధ్య పౌలు లేఖ చల్లని నీటి చెలమలా వస్తుంది. పౌలు ఈ మాటలను ఎక్కడి నుండి రాస్తున్నాడో గుర్తుంచుకోండి. ఆయన చెరసాలలో ఉన్నాడు. భవిష్యత్తు అనిశ్చితం. అయినా ఆయన, దేనిని గూర్చియు విచారింపకుడి అని అంటున్నాడు.

విచారం లేకుండా ఉండటం ఎలా? పౌలు దానికి  ఒక మార్గం చెబుతున్నాడు. ప్రతి విషయను ప్రార్థనతో, విన్నపంతో, కృతజ్ఞతాస్తుతితో మీ అభ్యర్థనలను దేవునికి తెలియజేయండి అని అంటున్నాడు. కృతజ్ఞత కూడా ఇందులో భాగమని గమనించండి. అడగడానికి ముందే, ఇప్పటికే పొందిన వాటికి కృతజ్ఞత చెప్పడం మన చింతల స్వభావాన్నే మార్చేస్తుంది. చింత మనల్ని మన సమస్యల చుట్టూ తిప్పుతుంది. కృతజ్ఞత మన చూపును దేవుని మంచితనం వైపు తీసుకువెళుతుంది.

దాని ఫలితం ఏమిటి? అంటే, మానవ అవగాహనకు అతీతమైన దేవునిశాంతి మీ హృదయములను, మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగ ఉంచును. " భద్రముగ" అనేది సైనిక భాష. ఫిలిప్పీ ఒక రోమన్ సైనిక పట్టణం. అక్కడి ప్రజలు కావలి సైనికుడి చిత్రాన్ని వెంటనే అర్థం చేసుకునేవారు. దేవుని శాంతి మన హృదయ ద్వారం వద్ద కాపలా కాసే సైనికునిలా నిలుస్తుంది.

యెషయా గీతంలో రైతు తోటకు కంచె వేసి కావలి గోపురం కట్టాడు. ఇక్కడ దేవుని శాంతియే మన హృదయానికి కావలి. ఈ శాంతి సమస్యలు లేకపోవడం కాదు. తుఫాను మధ్యలో, పడవలో నిద్రపోయిన యేసు ప్రభువుని  ప్రశాంతత అది.

9. మన మనస్సు కూడా ఒక తోట

పౌలు తరువాత ఒక అందమైన జాబితా ఇస్తాడు,  మంచివియు, స్తుతిపాత్రములునైన వానితో మీ మనస్సులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్ధమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు విషయములు అట్టివి. వీటిని ధ్యానించండి అంటున్నాడు.

ఇది ద్రాక్షతోట ఉపమానానికి సరిగ్గా సరిపోతుంది. తోట ఫలించాలంటే ముందు నేల సిద్ధం కావాలి. మన మనస్సే ఆ నేల. మనం నిరంతరం ఏది చూస్తామో, వింటామో, ఆలోచిస్తామో అదే మన హృదయంలో పొదుగుతుంది.

మన ఆలోచనలే  విత్తనాలు, మాటలే  మొక్కలు, చేతలే  ఫలాలు. ద్వేషాన్ని పెంచుకుంటే ద్వేషపు ఫలాలు వస్తాయి. అసూయను పెంచుకుంటే అసూయ ఫలాలు వస్తాయి. కానీ కృతజ్ఞత, ఆశ, ప్రేమను పెంచుకుంటే మన జీవితం మంచి ఫలాలు ఇస్తుంది. కాబట్టి ఏది పోషించాలో, ఏది కత్తిరించాలో ఎంచుకోవడం ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఈ వారం మీరు ఏ వార్తలకు, ఏ మాటలకు మీ మనస్సులో చోటిచ్చారు? అవి ద్రాక్షను పండిస్తున్నాయా, ముళ్లను పెంచుతున్నాయా?

పునీత  పౌలు ధైర్యంగా " నా మాటలనుండియు, చేతలనుండియు మీరు గ్రహించినవానిని, పొందినవానిని, ఆచరణలో పెట్టుడు" అని అంటున్నాడు. బోధ మాటల్లో కాదు, జీవితంలో కనబడాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు అందరికీ ఇది వర్తిస్తుంది.

10. మూడు పఠనాలు

మొదటి పఠనంలో రైతు ఎంతో శ్రమించిన తరువాతే ఫలం ఆశిస్తాడు. సువార్తలోనూ అంతే. దేవుడు మన నుండి ఏదైనా కోరే ముందు, ఇప్పటికే ఎంతో ఇచ్చాడు. మన ఫలం భారం కాదు, ఆయన ఇచ్చిన  ప్రేమకు స్పందనను ఆయన ఆశిస్తున్నాడు.  ఫలం అంటే ఏమిటి? యెషయా దానిని న్యాయం, ధర్మం అన్నాడు. పౌలు దానిని సత్యం, పవిత్రత, ప్రేమించదగినది, శాంతి అన్నాడు. ప్రభువు  దానిని సకాలంలో యజమానికి ఇవ్వవలసిన పంట అన్నాడు. అన్నీ కలిపితే, దేవునిపై విశ్వాసం, తోటివారి పట్ల న్యాయం, లోపల శాంతి. ఈ మూడూ కలిసిన జీవితమే ఫలించే జీవితం. ఇందులో వైఫల్యం ఎక్కడ మొదలవుతుంది? దేవుని ప్రేమను మరచి "ఇది నాది" అనుకున్నప్పుడు. కనుక మనకు ఉన్నదంతా దేవుని వరమని గుర్తించడం ముఖ్యం. అందుకే పునీత పౌలు "కృతజ్ఞతాస్తుతి" అని  ప్రత్యేకంగా చెప్పింది. యోహాను సువార్తలో  యేసు ప్రభువు, "నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి" అని చెబుతాడు.  ఇస్రాయేలు విఫలమైన చోట క్రీస్తు సంపూర్ణంగా విజయం సాధించాడు. ఆయనకు తండ్రి పట్ల పూర్తి విధేయత ఉంది. కాబట్టి మన ఫలానికి ఆధారం మన స్వంత శక్తి కాదు. క్రీస్తుతో ఉన్న అనుబంధం. కొమ్మ తీగ నుండి తెగిపోతే ఫలించలేదు. ప్రార్థన, పవిత్ర గ్రంథ పఠనం, దివ్యసత్ప్రసాదం, సంఘ సహవాసం ద్వారా మనం ఆ తీగలో నిలిచి ఉంటాం.

ముగింపు

యెషయా పాడిన గీతం దేవుని హృదయ వేదనను వినిపిస్తుంది. యేసు  ప్రభువు చెప్పిన ఉపమానం ఆ వేదన ఎంత లోతైనదో చూపిస్తుంది. పౌలు లేఖ ఆ వేదనను ఆనందంగా మార్చే మార్గాన్ని చూపిస్తుంది. దేవుడు మనలను తన తోటలో నాటాడు. మనకు కంచె, కావలి గోపురం, గానుగ గుంట ఇచ్చాడు. అంటే వాక్యం, సంస్కారాలు, తిరుసభ, క్షమాపణ. ఇప్పుడు ఆయన కళ్లల్లో ఆశతో మన వైపు చూస్తున్నాడు. ఆ ఫలం న్యాయం, ప్రేమ, క్షమ, కరుణ, శాంతి రూపంలో మన కుటుంబాల్లో, సంఘంలో, సమాజంలో కనిపించాలి. మనం విఫలమైనప్పుడు కూడా ఆయన తోటను వదిలిపెట్టడు. ఆయన తన కుమారుణ్ణే మనకోసం పంపాడు. ఆ కుమారుడే నిజమైన ద్రాక్షావల్లి. ఆయనలో నిలిచి ఉందాం. ఆయన జీవం మనలో ప్రవహిస్తే, మన జీవితం సకాలంలో మంచి ఫలమిస్తుంది.

ప్రార్ధన

ప్రభువా! నీవు మమ్మల్ని నీ తోటగా ఎన్నుకున్నావు. మా కోసం నేలను తవ్వావు, రాళ్లను ఏరివేశావు, నీ ఏకైక కుమారుని కూడా పంపావు. నీ ప్రేమకు తగిన ఫలమివ్వలేనప్పుడు మమ్మల్ని విడిచిపెట్టకు. మా విచారములను  నీ చేతుల్లో పెట్టే విశ్వాసాన్ని, మా మనస్సులను మంచితో నింపే వివేకాన్ని, తోటివారి పట్ల న్యాయం చూపే ధైర్యాన్ని మాకు దయచేయి. తిరస్కరించబడి మూలరాయిగా నిలిచిన మీలా   సకాలంలో మంచి ఫలమిచ్చే వారిగా చేయుము. ఆమెన్.

 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి