లూకా 13:10–17 వ్యాఖ్యానం: వంగిపోయిన స్త్రీకి స్వస్థత – విశ్రాంతిదినాన విడుదల

 




లూకా 13:10–17

యేసు విశ్రాంతిదినమున ప్రార్థనా మందిరము నందు ఉపదేశించుచుండెను. అక్కడ పదు నెనిమిది సంవత్సరములనుండి అపవిత్రాత్మచే పీడింపబడుచున్న ఒక స్త్రీ ఉండెను. ఆమె నడుము వంగిపోయి తిన్నగ నిలబడలేకుండెను. యేసు అది చూచి ఆమెను పిలిచి, “ ఓ స్త్రీ! నీవు రోగమునుండి విముక్తి పొందితివి” అని చెప్పి ఆమెపై తన చేతు లుంచగా, తక్షణమే ఆమె తిన్నగ నిలబడి దేవుని స్తుతించెను. యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచి నందులకు ప్రార్థనామందిరాధికారి మండిపడి, అచట ఉన్న వారితో “పనిచేయుటకు ఆరు దినములు ఉన్నవి. ఆ దినములలో వచ్చి స్వస్థత పొందుడు. విశ్రాంతి దినమున కాదు” అని చెప్పెను. అందుకు యేసు, “కపట భక్తులారా! విశ్రాంతి దినమున మీలో ప్రతివాడు తన ఎద్దునుగాని, గాడిదనుగాని విప్పి, నీళ్ళు పెట్టుటకు తోలుకొని పోవుటలేదా? ఈమె అబ్రహాము పుత్రిక. పదునెనిమిది సంవత్సరముల నుండి సైతాను బంధములో ఉన్న ఈమెను విశ్రాంతి దినమున స్వస్థపరచుట తగదా?" అనెను. ఈ మాటలకు ఆయన విరోధులందరు సిగ్గుపడిరి. కాని, తక్కిన వారందరును ఆయన అద్భుతకార్యములకు సంతసించిరి.

వంగిపోయిన స్త్రీకి స్వస్థత

దేవుని కరుణ మతపరమైన నియమాల కంటే గొప్పదని ఈ సువిశేష  భాగం చూపిస్తుంది. ప్రార్థనామందిరాధికారి విశ్రాంతిదినమున స్వస్థపరచినందుకు మండిపడ్డాడు. యేసు ప్రభువు అతన్ని, అతనితో ఏకీభవించేవారిని "కపట భక్తులారా" అని పిలుస్తున్నాడు.  విశ్రాంతి దినాన పశువులను విప్పి నీళ్ళు పెట్టే వారు, "అబ్రహాము పుత్రిక"ను సాతాను బంధం నుండి విప్పడం తగదంటారా అని ప్రశ్నిస్తున్నాడు.

సందర్భం మరియు నేపథ్యం

ఈ సంఘటన లూకా సువార్తలో మాత్రమే ఉంది. దీనికి ముందు యేసు ప్రభువు (13:1–9) పశ్చాత్తాపం గురించి హెచ్చరించి, ఫలించని అంజూరపు చెట్టు ఉపమానం చెప్పాడు. అక్కడ తోటమాలి "ఈ సంవత్సరము కూడ దానిని వదలిపెట్టుడు" అని  దేవుని దయ కోరాడు. ఆ దయ ఇక్కడ ఒక వ్యక్తి జీవితంలో ప్రత్యక్షమవుతుంది. దేవుని రాజ్యం బంధాలను తెంచుతూ విస్తరిస్తుందని ఈ స్వస్థత ఆచరణలో చూపిస్తుంది.

యూదులకు విశ్రాంతిదినం రెండు విషయాలను గుర్తు చేస్తుంది, మొదట  సృష్టి తరువాత దేవుడు విశ్రమించడం (నిర్గమ 20:8–11), ఐగుప్తు దాస్యం నుండి విడుదల (ద్వితీ 5:12–15). రెండవది ఈ సంఘటనకు కీలకం. విడుదలను స్మరించే రోజున ఒక బందీకి విడుదల కలుగుతుంది.

బంధనంలో ఉన్న స్త్రీ

యేసు ప్రభువు  అలవాటు ప్రకారం విశ్రాంతిదినమున ప్రార్థనా మందిరంలో బోధిస్తున్నాడు (లూకా 4:16). ఆయన బోధన మధ్యలో ఆయన ఒక బాధితురాలిని గమనించడం, ఆయనకు వాక్యం, కరుణ వేరు కావని చూపుతుంది.

ఆ స్త్రీకి పేరు లేదు, ఆమె గుర్తింపు ఆమె బాధే. పద్దెనిమిది సంవత్సరాల కాలం ఆమె బాధ పడుతూనే ఉంది.  ఆమె "అపవిత్రాత్మ"  వలన బాధ పడుతుంది. గ్రీకు మూలంలో "బలహీనత కలిగించే ఆత్మ" అని ఉంది. దీని అర్థం ఆమె తన పాపం వల్ల బాధపడలేదు, ఆమె ఒక శత్రు శక్తి బంధంలో ఉన్న బాధితురాలు. యోహాను 9:2-3లో కూడా యేసు ప్రభువు బాధను పాపంతో ముడిపెట్టే ధోరణిని తిరస్కరించాడు.

ఆమె నడుము వంగిపోయింది. ఆకాశాన్ని, తోటివారి ముఖాలను చూడలేక నేలనే చూసేది. ఇది శారీరక వైకల్యమే కాదు, తలవంపు, ఒంటరితనం, గౌరవం కోల్పోయిన స్థితికి చిహ్నం కూడా. పాపం, భయం, భారం మనిషిని కుంగదీసి దేవుని వైపు తలెత్తకుండా చేస్తాయనే సత్యానికి ఇది  తార్కాణం. అయినా ఆమె ప్రార్థనా మందిరానికి రావడం మానలేదు. బాధ ఆమెను దేవుని నుండి దూరం చేయలేదు.

యేసు ప్రభువు  చొరవ మరియు స్వస్థత

యేసు ప్రభువు, ఆమెను చూస్తున్నాడు, పిలుస్తున్నాడు, మాటలాడుతున్నాడు, తాకుతున్నాడు. చూడటం: ఆమె ఏమీ అడగలేదు. జనసమూహంలో ఎవరూ పట్టించుకోని ఆమెను యేసు ప్రభువే  గమనించాడు. దేవుని కృప మనము అడుగక ముందే ఉంటుంది. బర్తిమయి, శతాధిపతి వంటి వారు వేడుకున్నారు, ఈమె వేడుకోలేదు.

పిలవడం: ఎక్కడో చివరన  ఉన్న ఆమెను అందరి మధ్యకు యేసు ప్రభువు  పిలిచాడు. ఇది ఆమె గౌరవాన్ని పునరుద్ధరించే మొదటి అడుగు.

మాట: "ఓ స్త్రీ! నీవు రోగమునుండి విముక్తి పొందితివి." విడుదల అప్పటికే జరిగింది, ప్రభువు ఆమె మీద చేతులు  ఉంచకముందే స్వస్థత ఆమెకు కలిగినది. ఇది బంధనం విప్పబడటాన్ని సూచిస్తుంది, వ్యాధి నయం కావడం కంటే ముఖ్యమైనది.

స్పర్శ: ప్రభువు ఆమెపై చేతులుంచాడు. సమాజం దూరం పెట్టినవారిని ఆయన తాకి అక్కున చేర్చుకుంటాడు. ఆ స్పర్శ "నీవు ఒంటరివి కావు, నీ విలువ తగ్గలేదు" అని చెబుతుంది.ఆమె తక్షణమే నిటారుగా నిలబడింది. నిటారుగా నిలబడటం గౌరవానికి చిహ్నం. పద్దెనిమిదేళ్ళ బంధనం ఒక్క క్షణంలో ముగిసిపోయింది. 

దేవుని స్తుతించడం: ఆమె కోల్పోయిన సంవత్సరాలను లెక్కించలేదు,తన  దృష్టిని దేవుని పైకి తిప్పింది. లూకా సువార్తలో స్వస్థత పొందినవారు దేవుని మహిమపరచడం ఒక ముఖ్య భాగం. (5:25, 17:15, 18:43). కృతజ్ఞతతో తిరిగి రావడం నిజమైన విముక్తికి గుర్తు.

అధికారి అభ్యంతరం

ఇక్కడ అద్భుతం జరిగినా అందరూ సంతోషించలేదు. ప్రార్థనామందిరాధికారి మండిపడ్డాడు. అతడు యేసు ప్రభువు తో నేరుగా మాట్లాడకుండా ప్రజలతో, "పనిచేయుటకు ఆరు దినములు ఉన్నవి. ఆ దినములలో వచ్చి స్వస్థత పొందుడు, విశ్రాంతి దినమున కాదు" అని చెబుతున్నాడు. ఈ పరోక్ష విమర్శ పిరికితనాన్ని చూపుతుంది. యేసు ప్రభువు ప్రజల మధ్య పొందుతున్న ఆదరణ తన అధికారానికి ముప్పని కూడా అతడు భావించి ఉండవచ్చు.

అతని వాదన నిర్గమఖాండం  20:9-10ను సూచిస్తుంది, కాని దానిలో మూడు లోపాలున్నాయి.

  1. ఈ అధికారి స్వస్థతను "పని"గా పరిగణించాడు. యేసు ప్రభువు ఆమెను చూశాడు  మాటలాడాడు, ఆమెను తాకాడు. సాంకేతకముగా చూస్తే ఇక్కడ శ్రమ లేదు.
  2. పద్దెనిమిదేళ్ళు వేచిన స్త్రీని మరొక రోజు వేచి ఉండమనడం అమానుషం.
  3. ఆమె స్వస్థత కోసం రాలేదు. యేసు ప్రభువే  ఆమెను పిలిచాడు.

ఈ అధికారి చెడ్డవాడని కాదు. అతనికి విశ్రాంతిదినం పట్ల గౌరవం ఉంది. అతని సమస్య, నియమం వెనుక ఉన్న దేవుని హృదయాన్ని గుర్తించలేకపోవడం. ధర్మశాస్త్రం తెలిసి దేవుని  కరుణను తెలుసుకోలేకపోయాడు.

యేసు ప్రభువు సమాధానం

యేసు ప్రభువు  సమాధానం "కపట భక్తులారా" అని మొదలవుతుంది.  ఈ మాట బహువచనంలో ఉంది, కాబట్టి అధికారితో పాటు ఏకీభవించిన అందరికీ ఇది వర్తిస్తుంది. కపటం అంటే బయట భక్తి చూపిస్తూ, లోపల కఠిన హృదయం కలిగి, తమ సౌలభ్యం కోసం నియమాలను  సడలించి, ఇతరుల అవసరానికి కఠినంగా పాటించడం.

ఎద్దు, గాడిద వాదన. విశ్రాంతిదినాన పశువులను విప్పి, నీళ్ళు పెట్టడానికి తోలుకెళ్ళడం వారు అనుమతిస్తారు. పశువుల పట్ల అంత కరుణ ఉంటే మనిషికి పట్ల ఇంకెంత ఉండాలి?  "విప్పి" అనే పదం 16వ వచనంలో "విడిపించుట" అని వస్తుంది. వారి మాటనే వారిపై యేసు ప్రభువు  చెబుతున్నాడు.

"అబ్రహాము పుత్రిక." ఇది ఈ భాగంలో అత్యంత శక్తివంతమైన మాట. యేసు ప్రభువు  ఆమెను "రోగి" అనీ లేక  "వంగిన స్త్రీ" అనీ కాక, దేవుని ఒడంబడిక కుటుంబంలో పూర్తి సభ్యురాలిగా ప్రకటించాడు.

"సాతాను బంధములో."  ఆమె బాధ దేవుడు పంపిన శిక్ష కాదు, శత్రువు వేసిన బంధనం. యేసు ప్రభువు ఆమెకు విడుదల ప్రకటించడానికి వచ్చాడు (4:18). అయితే అన్ని రోగాలూ సాతాను పని అని ఈ వచనం బోధించదు, వైద్య చికిత్సను నిరాకరించడానికి దీన్ని వాడకూడదు.  

"విశ్రాంతి దినాన స్వస్థత తగదా?" గ్రీకులో డెయ్ అంటే "తప్పనిసరి, దైవ సంకల్పం". విడుదల చేయడం విశ్రాంతిదినాన చేయకూడనిది  కాదు, ఆ రోజుకు తగినది. విడుదలను స్మరించే రోజున బంధితులను విడిపించడమే ఆ రోజు ఉద్దేశం.

రెండు స్పందనలు

ఈ కథ ముగింపులో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. యేసు ప్రభువు  విరోధులందరూ సిగ్గుపడ్డారు, వారి వాదన తప్పు. వారి సిగ్గు పశ్చాత్తాపానికి దారి తీయవచ్చు, లేదా కాఠిన్యానికి దారితీయవచ్చు.  సామాన్య ప్రజలందరూ ఆయన చేసిన మహిమకరమైన కార్యాలకు సంతోషించారు.

సువిశేషాలలో సామాన్యులు, పేదలు, బాధితులు యేసు ప్రభువును స్వీకరిస్తారు, మతపరమైన అధికారులు తరచు ప్రతిఘటిస్తారు. దేవుని రాజ్యం ప్రత్యక్షమైనప్పుడు మనిషి తటస్థంగా ఉండలేడు. అది బంధించేది కాదు. విడుదలను ఇస్తుంది. అవమానించదు, గౌరవిస్తుంది.

 ప్రధాన  అంశాలు

విశ్రాంతిదినం విడుదల దినం. యేసు ప్రభువు  విశ్రాంతిదినాన్ని రద్దు చేయదు, దాని అసలు అర్థాన్ని పునరుద్ధరించాడు.  "విశ్రాంతిదినము మనుష్యుని కొరకే ఏర్పడినది" (మార్కు 2:27). ఆయన దానికి ప్రభువు (లూకా 6:5). నియమాలు దేవునికి, మనుషులకు దగ్గర చేయడానికి ఉన్నాయి. అవి లక్ష్యమైపోతే మనిషిని బంధిస్తాయి.

దేవుని చొరవ. రక్షణ మన అర్హత వల్ల కాదు, దేవుని కృప వల్ల వస్తుంది. ఆమె అడగకముందే యేసు ప్రభువు ఆమెను చూశాడు. అయినా ఆమె ఆయన పిలుపుకు స్పందించి ముందుకు వచ్చింది. కృప మన సహకారాన్ని కోరుతుంది. మనం ఎప్పుడైతే దానికి సహకరిస్తామో అప్పుడు రక్షణ దొరుకుతుంది.

స్త్రీ గౌరవం. లూకా సువార్త స్త్రీల పట్ల యేసు ప్రభువు  శ్రద్ధను ప్రత్యేకంగా చూపుతుంది.  నాయీను వితంతువు (7:11-17), పాపాత్మురాలైన స్త్రీ (7:36-50), మార్త మరియ (10:38-42). "అబ్రహాము పుత్రిక" ఈ భాగం కూడా ఆ వరుసలోనే ఉంది. దేవుని రాజ్యంలో ఎవరూ రెండవ తరగతి వ్యక్తులు కాదు.

చెడుపై విజయం. యేసు ప్రభువు  పరిచర్య సాతాను  రాజ్యంతో పోరాటం (11:20). పద్దెనిమిదేళ్ళ బంధనానికి గురిచేసినప్పటికి సాతాను క్రీస్తు మాట ముందు నిలుపడలేక పోయింది. ఇది మన జీవితంలో ఏళ్ళ తరబడి ఉన్న అలవాట్లు, గాయాల పట్ల కూడా నిరీక్షణ ఇస్తుంది.

కపటత్వంపై హెచ్చరిక. బాహ్య భక్తి ఉన్నా కరుణ లేకపోతే అది కపటత్వమే (లూకా 11:39-44). ఇది మతంపై విమర్శ కాదు. ఏ మత సమాజంలోనైనా వచ్చే నియమ కాఠిన్యం గురించిన హెచ్చరిక.

కథోలిక దృక్పథం

తిరుసభ పితరులు  వంగిన స్త్రీని, భూసంబంధమైన విషయాలలో మునిగి ఆకాశం వైపు చూడలేని మానవాత్మకు ప్రతీకగా చూశారు. స్వార్థం, ధనాశ, లోకచింత మనిషిని భూమి వైపు వంచుతాయి. యేసు ప్రభువు  మాత్రమే "పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడి" (కొలొ 3:1) అనే పిలుపుకు మనల్ని సిద్ధం చేయగలడు.

కథోలిక బోధనలో ఈ భాగానికి  దివ్య సంస్కారిక అర్థాలున్నాయి.

  • చేతులు ఉంచడం అవస్థ  అభ్యంగనం, భద్రమైన అభ్యంగనం వంటి సంస్కారాలలో కనిపిస్తుంది.
  • "నీవు విముక్తి పొందితివి" పాపసంకీర్తనలో గురువు పలికే విముక్తి వాక్యాన్ని గుర్తు చేస్తుంది. అక్కడ క్రీస్తు మాటే పాప బంధాన్ని తెంచుతుంది.
  • వెంటనే స్తుతి దివ్యబలి పూజలోని కృతజ్ఞతా ఆరాధనను (యూకరిస్తు అంటే కృతజ్ఞత) సూచిస్తుంది.

నేటి జీవితానికి అన్వయం

మనలను వంచే బరువులు:  ప్రతి ఒక్కరిలో ఏదో ఒక "వంపు" ఉంటుంది. పాపపు అలవాటు, క్షమించలేని పగ, ఆర్థిక భారం, దీర్ఘ వ్యాధి, కుటుంబ బాధ, భయం, అపరాధ భావం. ఇవి మనల్ని దేవుని వైపు, తోటివారి వైపు చూడకుండా చేస్తాయి. మొదటి అడుగు, ఇది నా వంపు అని నిజాయితీగా గుర్తించడం.

యేసు ప్రభువు మనల్ని చూస్తున్నాడు:  ఆమె ప్రార్థనా మందిరంలో ఉంది కాబట్టే ఆయన చూపు ఆమెపై పడింది. సంఘ ఆరాధనలో, దివ్య  సంస్కారాలలో పాల్గొనుట అనుగ్రహం కలిగే చోట ఉండటమే. దివ్య సంస్కారాలను నిర్లక్ష్యం చేయడం, స్వస్థత అందుబాటులో ఉన్నా అటువైపు నడవకపోవడం లాంటిది.

నియమం కంటే కరుణ ముఖ్యం: నియమాలు అవసరమే, కాని అవి కరుణకు సేవకులు. ఇతరుల తప్పుకు తీర్పు చెప్పి, మన బలహీనతకు కరుణ కోరే ద్వంద్వ ప్రమాణం కూడా కపటత్వమే.

ఇతరుల బంధాలు విప్పడం:  ఒంటరివారిని పలకరించడం, రోగులను సందర్శించడం, అప్పుల బాధలో ఉన్నవారికి సహాయం, నిరాశలో ఉన్నవారికి ఆశ ఇవ్వడం, ఇవి ప్రభువుని విడుదల పరిచర్యలో మన భాగస్వామ్యం. అలాగే మనం పొందిన స్వస్థతలకు, క్షమాపణలకు ఆ స్త్రీలా దేవుణ్ణి స్తుతించడం ఆత్మీయ పరిపక్వతకు గుర్తు.

ధ్యాన ప్రశ్నలు

  1. నన్ను "వంచుతున్న" బరువు ఏమిటి? దానిని యేసు ప్రభువు  ముందుకు తెచ్చానా?
  2. యేసు ప్రభువు  నన్ను చూసి పిలుస్తున్న స్వరం వినగలుగుతున్నానా?
  3. నా సంఘంలో, కుటుంబంలో "ఇంకో రోజు రమ్ము" అని నేను ఎవరికి చెబుతున్నాను?
  4. నా మత ఆచరణలో కరుణకు తగిన స్థానం ఉందా? నియమాలు నాకు ఒకలా, ఇతరులకు ఒకలా ఉన్నాయా?
  5. నా చుట్టూ ఉన్న ఎవరి బంధాలను నేను విప్పగలను?

ప్రార్థన

ప్రభువా, వంగిపోయిన స్త్రీని కరుణతో చూసి, పిలిచి, నిటారుగా నిలబెట్టావా ? మమ్ములను వంచుతున్న బరువులను నీ ముందు ఉంచుతున్నాము. నీ వాక్కుతో, నీ దివ్య సంస్కారాలతో మమ్ములను విడిపించు. నియమాల పేరుతో ఇతరులను బాధించే కాఠిన్యం నుండి మమ్ములను కాపాడు. అవసరంలో ఉన్నవారిని కరుణతో చూసే హృదయాన్ని మాకు దయచేయి. నిటారుగా నిలబడిన ఆ స్త్రీలా మేము కూడా జీవితాంతం నిన్ను స్తుతించునట్లు చేయుము. ఆమెన్.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి