అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు – ఎనిమిదవ రోజు
అక్టోబర్ 13- దైనందిన జీవితంలో దేవుని హస్తం, త్రియేక దేవునిలో ఐక్యం
ప్రార్థనకు సమయం లేదని బాధపడే వారికి
"నాకు ప్రార్థన చేయాలని ఉంది, కానీ సమయమే దొరకడం లేదు." ఈ మాట మన
ఇళ్ళలో ఎన్నోసార్లు వినిపిస్తుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు పనులు ఆగవు.
వంట, పిల్లల
సంరక్షణ, పొలం పని, ఉద్యోగం, ఇంటి అవసరాలు ఒకదాని వెంట ఒకటి వస్తాయి. అలసిపోయి పడుకునే సరికి
ప్రార్థన చేయాలనే ఆలోచన కూడా ఉండదు. అలాంటి వారందరికీ పునీత తెరేసమ్మ ఈ రోజు ఒక గొప్ప ఓదార్పు మాట చెబుతోంది. దేవుడు
గుడిలో మాత్రమే కాదు, మన వంటగదిలో, మన పొలంలో, మన పనిలో కూడా ఉన్నాడు.
వాక్యభాగం: యోహాను 14:15, 23-24
కడరా భోజన సమయములో యేసు ప్రభువు తన శిష్యులతో, "మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను
పాటింతురు." అలాగే 23వ వచనంలో, "అంతట ఇస్కారియోతు కాని 'యూదా' “ప్రభూ!
లోకమునకుకాక మాకు మాత్రము తెలియపరచు కొనుట ఎట్లు సంభవించును?” అని అడిగెను."
అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను:
“నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అపుడు నా తండ్రి వానిని ప్రేమించును.
మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. ఈ మాటలు ఎంత గొప్పవి! తండ్రి, కుమారుడు మనలో
నివసిస్తారని యేసు ప్రభువు వాగ్దానం
చేశాడు. అంటే దేవుడు ఎక్కడో దూరంగా లేడు, మన హృదయమే ఆయన నివాసం. ఆ నివాసం ప్రేమ
ద్వారా సాధ్యమవుతుంది. ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను, అంటే ఆయన మాటను ఆచరించడం.
యేసు ప్రభువు ప్రేమను ఆజ్ఞలతో, అంటే ఆచరణతో కలిపాడు. ప్రేమ కేవలం భావన కాదు, ప్రతిరోజూ చేసే పనులలో వ్యక్తమయ్యే ప్రవర్తన. కాబట్టి మన రోజువారీ పనులు, ప్రేమతో చేసినచో అది దేవునితో మన సంబంధం వ్యక్తమవుతుంది.
ఏడవ నివాసం: త్రీయేక దేవునితో ఐక్యం
మొదటి రోజు మనం తెరేసమ్మ "అంతరంగిక కోట"ను ధ్యానించాం. ఆ కోటలో ఏడు
నివాసాలున్నాయి. ఆమె వాటిలో చివరిదైన ఏడవ నివాసాన్ని అత్యున్నత స్థితిగా
వర్ణించింది. అక్కడ ఆత్మ పరమ పవిత్ర త్రీయేక దైవంతో గాఢమైన ఐక్యంలో జీవిస్తుంది. పిత, పుత్ర,
పవిత్రాత్మ ఆ ఆత్మలో నివసిస్తున్నారని ఆమె స్పష్టంగా
అనుభవించింది. ఈ అనుభవాన్ని ఆమె "ఆధ్యాత్మిక వివాహం" అని పిలిచింది. ఇది
దేవునితో అత్యంత సన్నిహితమైన ప్రేమ సంబంధం.
ఇది విన్న వారికి ఒక ప్రశ్న వస్తుంది. ఇంత ఉన్నతమైన స్థితికి చేరిన వ్యక్తి లోకం నుండి
దూరంగా, ధ్యానంలోనే
గడుపుతుందా? తెరేసమ్మ జీవితం ఇందుకు
వ్యతిరేకంగా ఉంది. ఈ ఉన్నత స్థితి తరువాతే ఆమె అత్యంత చురుకుగా పని చేసింది. కొత్త
మఠాలు స్థాపించింది, లేఖలు రాసింది, ప్రయాణాలు చేసింది,
సోదరీమణులను నడిపించింది. ఎందుకంటే దేవునితో నిజమైన ఐక్యం మనలను
సేవకు పంపుతుంది, సేవ నుండి దూరం చేయదు.
పునీత సూక్తి: వంట పాత్రల మధ్య ప్రభువు
"ప్రభువు వంట పాత్రల మధ్య కూడా నడుస్తాడు." – స్థాపనలు గ్రంథం
తెరేసమ్మ తన మఠాల స్థాపన చరిత్రను
"స్థాపనలు" అనే గ్రంథంలో రాసింది. అందులో ఆమె సోదరీమణులకు ఎంతో
ఆచరణాత్మకమైన సలహాలు ఇచ్చింది. మఠంలో కొందరు సోదరీమణులు వంటగది పనులు చేయాల్సి
వచ్చేది. వారు "మేము ప్రార్థనకు సమయం కేటాయించలేకపోతున్నాం" అని
బాధపడేవారు. వారికి తెరేసమ్మ ఇచ్చిన
ఓదార్పు ఇది. ప్రభువు వంట పాత్రల మధ్య కూడా ఉన్నాడు. అంటే పని చేసే చేతులలోనే ఆయన
ఉన్నాడు. వారు ప్రేమతో చేస్తే,
వంట చేయడమే ప్రార్థనగా మారుతుంది.
ఈ మాటను ఇప్పటి మన పరిస్థితికి అన్వయించండి. ఇంటి పనులు, పొలం పనులు, ఉద్యోగంలో పనులు, బస్సులో ప్రయాణం ఇవన్నీ ఆయన సన్నిధిలో జరగగలవు. మనం చేయాల్సింది ఆ పనిని ఆయనకు అర్పించడమే. "ప్రభువా, ఇది నీ కోసం" అని చెప్పి చేసిన సాధారణ పని కూడా గొప్ప ఆరాధనగా మారుతుంది.
మార్త, మరియ ఇద్దరూ కలవాలి
"అంతరంగ కోట"లో తెరేసమ్మ మార్త, మరియమ్మ గురించి కూడా రాసింది. ఆమె చెప్పిన సారాంశం
ఏమిటంటే, ప్రార్థన యొక్క ఉద్దేశం కేవలం ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడం కాదు, సేవ చేయడానికి
శక్తి పొందడం. మరియ వలె ప్రభువు పాదాల చెంత కూర్చోవడం ఎంత ముఖ్యమో, మార్త వలె సేవ
చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండూ కలిసినప్పుడే నిజమైన క్రైస్తవ జీవితం. ప్రార్థన
లేని సేవ అలసటకు, చికాకుకు దారితీస్తుంది. సేవ లేని ప్రార్థన స్వార్థంగా మారవచ్చు.
అందుకే తెరేసమ్మ సమతుల్యతను నేర్పింది.
పనిని ప్రార్థనగా మార్చుకోవడం ఎలా?
కొన్ని సులభమైన పద్ధతులు మీ రోజువారీ
జీవితంలో ప్రయత్నించవచ్చు:
ఉదయం అర్పణ: ఉదయం లేవగానే "ప్రభువా, ఈ రోజు నా ప్రతి
పనిని నీకు అర్పిస్తున్నాను" అని చెప్పండి.
పనికి ముందు చిన్న మాట: ఏదైనా పని
మొదలుపెట్టే ముందు "ఇది నీ కోసం ప్రభువా" అని మనసులో చెప్పండి.
విసుగు వచ్చినప్పుడు: విసుగు, అలసట వచ్చినప్పుడు
వాటిని ఆయనకు ఆర్పణగా అర్పించండి.
పనిలో జపం: పని చేస్తూనే మనసులో
"యేసయ్యా, నీవు నాతో ఉన్నావు" అని జపించండి.
రాత్రి కృతజ్ఞత: రోజు ముగింపులో ఆ రోజు దేవునికి
కృతజ్ఞతలు చెప్పి ఆ రోజు పనులను దేవునికి అప్పగించండి.
ఈ పద్ధతులు ప్రార్థనకు ప్రత్యేక సమయాన్ని
భర్తీ చేయవు. ప్రతిరోజూ కొంత సమయం ప్రత్యేకంగా ప్రార్థించడం కూడా అవసరం. కానీ ఈ
చిన్న అలవాట్లు రోజంతా దేవుని సన్నిధిని మన స్పృహలో నిలుపుతాయి.
ఇంటిలో ఉండే తల్లులకు, శ్రామికులకు
ఇంటి బాధ్యతలు మోసే తల్లులకు ఈ సందేశం
ప్రత్యేకంగా ఓదార్పునిస్తుంది. వంట చేయడం, బట్టలు ఉతకడం, పిల్లలను
చూసుకోవడం వంటి పనులు తరచు గుర్తింపు లేనివిగా కనిపిస్తాయి. కానీ దేవుని దృష్టిలో
అవి ఎంతో విలువైనవి. నజరేతులో మరియమాత కూడా ఇలాంటి పనులే చేసింది. పొలంలో పని చేసే
రైతులకు, ఫ్యాక్టరీల్లో, ఆఫీసుల్లో, దుకాణాల్లో పని చేసేవారికి కూడా ఇదే వర్తిస్తుంది. వారి శ్రమను
దేవునికి అర్పిస్తే, అది ప్రార్థనగా మారుతుంది. అలాగే విద్యార్థులు తమ చదువును ఆయనకు ఆర్పణగా
సమర్పించవచ్చు.
త్రియేక దేవుని సన్నిధిని గుర్తుచేసుకోవడం
యేసు ప్రభువు "మేము అతని వద్దకు వచ్చి అతనితో నివసిస్తాము" అని చెప్పిన మాట త్రియేక దేవుని సన్నిధిని మన రోజువారీ జీవితంలో గుర్తుచేసుకోమని ఆహ్వానిస్తోంది. తండ్రి మనలను సృష్టించి, పోషిస్తున్నాడు. కుమారుడు మనలను రక్షించి, నడిపిస్తున్నాడు, పవిత్రాత్మ మనలో నివసించి, బలపరుస్తున్నాడు. ఈ ముగ్గురూ మన పనిలో మనతో ఉన్నారని విశ్వసించడం మన ధైర్యాన్ని పెంచుతుంది. సిలువ గుర్తు వేసుకుని "పిత, పుత్ర , పవిత్రాత్మ నామమున" అని పనిని ప్రారంభించడం ఒక మంచి అలవాటు.
ప్రేమతో చేసే చిన్న పనులు
తెరేసమ్మ అనుచరురాలైన చిన్న తెరేసమ్మ తరువాత "చిన్న పనులను గొప్ప ప్రేమతో
చేయడం" గురించి నేర్పింది. కానీ ఈ మార్గాన్ని మొదట చూపినది అవిలాపురి తెరేసమ్మ అని చెప్పవచ్చు. దేవునికి పనుల పరిమాణం కాదు, వాటి వెనుక ఉన్న
ప్రేమ ముఖ్యం. ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వడం, ఒక అలసిపోయిన వారికి చేయి అందించడం, ఒక చిన్న
పిల్లవాడిని ఓర్పుతో బుజ్జగించడం ఇవన్నీ ప్రేమతో చేస్తే దేవుని దృష్టిలో గొప్పవే.
ఒక సాధారణ రోజు, దేవునితో
ఒక సాధారణ రోజును ఊహించుకోండి. ఉదయం లేవగానే సిలువ గుర్తు వేసుకుని ఆ రోజును ఆయనకు అప్పగిస్తారు. వంట చేస్తూ లేదా పొలానికి వెళ్తూ మనసులో చిన్న ప్రార్థన చేస్తారు. పని మధ్యలో ఒక్క నిమిషం ఆగి కృతజ్ఞతలు చెబుతారు. మధ్యాహ్నం భోజనం ముందు ప్రార్థన చేస్తారు. సాయంత్రం కుటుంబంతో కలిసి కొద్దిసేపు కూర్చుని ప్రార్థిస్తారు. రాత్రి ఆ రోజు జరిగినదంతా దేవునికి అప్పగించి పడుకుంటారు. ఆ రోజులో గంటల తరబడి ప్రార్థన లేదు. కానీ రోజంతా దేవుని సన్నిధి ఉంది. తెరేసమ్మ ద్వారా తన సోదరీమణులు నేర్చుకున్నది ఇదే. ప్రార్థన, పని వేరు వేరు కాదు, ఒకే జీవితంలో రెండు కోణాలు.
ఇతరులతో సంబంధాల్లో దేవుని సన్నిధి
దేవుని సన్నిధి మనం చేసే పనిలోనే కాదు, మనం కలిసే
వ్యక్తులలో కూడా ఉంది. ఇంట్లో కోపంగా మాట్లాడే కుటుంబ సభ్యునిలో, పనిలో విసిగించే
సహోద్యోగిలో, దారిలో కలిసే ఒక అపరిచితునిలో కూడా దేవుని పోలిక ఉంది. అందరినీ ఆ
దృష్టితో చూడటం నేర్చుకుంటే, మన సంబంధాలు మారతాయి. మన మాటల్లో సౌమ్యత వస్తుంది, ఓర్పు
పెరుగుతుంది. తెరేసమ్మ తన సోదరీమణుల మధ్య
ప్రేమ, సంతోషం
ఉండాలని ఎంతో కోరింది. ఆమె దృష్టిలో ఇతరులను ప్రేమించడం దేవుని ప్రేమను నిరూపించే
గొప్ప సాక్ష్యం. కాబట్టి ఈ రోజు ఒక్క వ్యక్తిని ప్రత్యేకంగా ప్రేమతో, ఓర్పుతో చూడండి.
ఎంత ప్రయత్నించినా కొన్ని రోజుల్లో మనం దేవుణ్ణి మరచిపోతాం. పనుల హడావిడిలో ప్రార్థన పూర్తిగా తప్పిపోతుంది. అలాంటప్పుడు నిరాశ చెందకండి. రాత్రి పడుకునే ముందు ఆ రోజును ఆయన ముందు ఉంచి, "ప్రభువా, నేను మరచిపోయినా నీవు నన్ను మరవలేదు" అని చెప్పండి. మరుసటి రోజు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టండి. తెరేసమ్మ సోదరీమణులు కూడా ఇదే చేసేవారు.
అవిలాపురి తెరేసమ్మ నవదిన ప్రార్ధనలు: ఎనిమిదవ రోజు (అక్టోబర్ 13)
దైనందిన జీవితంలో దేవుని హస్తం, త్రియేక దేవునిలో ఐక్యం
గురువు: పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.
ప్రజలు: ఆమెన్.
గురువు:ప్రభువు, మీతో
ఉండును గాక
ప్రజలు: మీ ఆత్మతోను ఉండును గాక .
గురువు: ప్రియ సహోదరి సహోదరులారా, తెరేసమ్మ
ఆధ్యాత్మిక జీవితం పరమ పవిత్ర త్రియేక దేవునిలో ఐక్యత శిఖరానికి చేరింది. అయినా ఆ ఐక్యత ఆమెను వంటగదిలో, పనిలో
దేవుణ్ణి చూసేలా చేసింది. ఈ రోజు మన రోజువారీ జీవితంలో దేవుని సన్నిధిని
ధ్యానిద్దాం.
ప్రార్ధించుదము : త్రియేక దేవా, నీవు మా హృదయాల్లో నివసిస్తున్నావు. అవిలాపురి తెరేసమ్మ వంట పాత్రల మధ్య కూడా నీ సన్నిధిని చూసింది. మా దైనందిన పనులను ప్రేమతో నీకు కానుకగా సమర్పించే హృదయాన్ని మాకు ప్రసాదించు. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవిని వేడుకుంటున్నాము.
ప్రజలు: ఆమెన్.
వాక్య భాగం
పఠకుడు (యోహాను 14:15, 23): మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. అందుకు యేసు ఇట్లు
సమాధానమిచ్చెను: “నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అపుడు నా తండ్రి వానిని
ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము.
పఠకుడు: ఇది ప్రభువు వాక్కు.
ప్రజలు: సర్వేశ్వరునికి వందనములు
దైనందిన జీవితం కోసం విన్నపాలు
గురువు: ఇంటి పనులతో, పొలం పనులతో, ఉద్యోగంతో అలసిపోయిన సమయాలలో
ప్రజలు: ప్రభువా, మా
పనిలో మీ సన్నిధిని అనుభవించేలా చేయుము .
గురువు: ప్రార్థనకు సమయం లేదని బాధపడే సమయాలలో
.
ప్రజలు: ప్రభువా, మా
పనులనే ప్రార్థనగా మార్చుము.
గురువు: పిత, పుత్ర,
పవిత్రాత్మ, మా హృదయాల్లో నివసిస్తు .
ప్రజలు: మీ సన్నిధిని మాకు ఎల్లప్పుడూ గుర్తు చేయండి.
పునీత సూక్తి
గురువు:
"ప్రభువు వంట పాత్రల మధ్య కూడా
నడుస్తాడు." (స్థాపనలు గ్రంథం)అని రాసింది.
గురువు: వంట చేసే తల్లులు ప్రేమతో
చేసినట్లే .
ప్రజలు: ప్రభువా, మా
ప్రతి పనిని నీ ప్రేమకు ఆర్పణగా చేయులా చేయండి.
గురువు: తెరేసమ్మ సేవను, ప్రార్థనను కలిపినట్లు
ప్రజలు: ప్రభువా, మార్త,
మరియ ఇద్దరి వైఖరులు మాలో ఉండేలా చేయి.
గురువు: మా రోజువారీ దినచర్య పవిత్రం చేసుకొనుటకు
ప్రజలు: ప్రభువా, "ఇది నీ కోసం" అని చెప్పి పని చేసే అలవాటు ఇవ్వుము .
గురువు: ఇంటి బాధ్యతలు మోసే తల్లుల కోసం.
ప్రజలు: ప్రభువా, వారికి
నీ ఓదార్పును, బలాన్ని ఇవ్వుము
గురువు: రైతుల కోసం, కూలీల కోసం, ఉద్యోగుల కోసం.
ప్రజలు: ప్రభువా, వారి
శ్రమను ఆశీర్వదించుము.
గురువు: విద్యార్థుల కోసం, వారి చదువు కోసం.
ప్రజలు: ప్రభువా, వారి ప్రతి ప్రయత్నాన్ని నీ ప్రేమకు కానుకగా చేయి.
ఆత్మపరిశీలన
గురువు: నా రోజువారీ పనులలో నేను దేవుని
సన్నిధిని గుర్తుంచుకుంటున్నానా? (మౌనం)
ప్రార్థన, సేవ
మధ్య నా జీవితంలో సమతుల్యత ఉందా? (మౌనం)
ఈ రోజు ఏ పనిని నేను "ప్రభువా,
ఇది నీ కోసం" అని చేయగలను? (మౌనం)
నేటి ప్రార్థన
గురువు: ప్రార్ధించుదము
అందరూ: త్రియేక దేవా, నీవు మా చిన్న పనులలో, కుటుంబ జీవితంలో,
మా శ్రమలో కూడా ఉన్నావని మాకు గుర్తు చేయండి. మా ప్రతి పనిని నీ
ప్రేమకు ఆర్పణగా సమర్పించే హృదయం ఇవ్వండి. పునీత తెరేసమ్మ ద్వార , మా
దినచర్యను పవిత్రం చేసుకోవడం నేర్పమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంటున్నాము.
మధ్యవర్తిత్వ విన్నపాలు
గురువు: అవిలాపురి తెరేసమ్మ , ప్రజలు: మా కోసం ప్రార్థించండి.
గురువు: తిరుసభ ప్రార్థనా గురువా, ప్రజలు: మా కోసం ప్రార్థించండి.
గురువు: తిరుసభ పండితురాలా, ప్రజలు: మా కోసం ప్రార్థించండి.
గురువు: కార్మెల్ సభ సంస్కర్తా, ప్రజలు: మా కోసం ప్రార్థించండి.
గురువు: యేసు ప్రభువు ప్రేమలో జ్వలించిన ఆత్మా, ప్రజలు : మా కోసం ప్రార్థించండి.
గురువు: ఇప్పుడు మన కుటుంబాల అవసరాలను,
ఈ నవదిన ప్రార్ధనలలో మనం
అడుగుతున్న ప్రత్యేక ఉద్దేశ్యాలను ప్రభువుకు సమర్పిద్దాం. (కొద్దిసేపు మౌనం)
గురువు: ప్రభువా, మా ఈ మనవులను ఆలకించండి. ప్రజలు: ఆమెన్
గురువు: నవదిన ఉద్దేశ్యాల కోసం కలిసి
ప్రార్థిద్దాం.
అందరూ: పరలోక జపం, మంగళవార్త
జపం, త్రిత్వ
స్తోత్రం
ముగింపు
గురువు: ప్రార్ధించుదము. ప్రేమమయుడైన
దేవా, అవిలాపురి తెరేసమ్మ బోధించినట్లు మా రోజువారీ జీవితంలో మీ సన్నిధిని కనుగొని, ప్రతి
పనినీ ప్రేమతో చేసే వరం మాకు ప్రసాదించండి. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి
చేయుచున్నాము.
ప్రజలు: ఆమెన్.
గురువు: ఈ రోజు సంకల్పం: ఈ రోజు ఒక
సాధారణ పనిని "ప్రభువా, ఇది నీ కోసం" అని చెప్పి ప్రేమతో
చేయండి.
గురువు: ప్రభువు మీతో ఉండును గాక.
ప్రజలు: మీ ఆత్మతోను ఉండును గాక
గురువు: సర్వశక్తిమంతుడైన దేవుడు,
పిత , పుత్ర, పవిత్రాత్మ, మిమ్ములను ఆశీర్వదించి, కాపాడుదురుగాక.
ప్రజలు: ఆమెన్.
గురువు: సమాధానంతో వెళ్ళుము .
ప్రజలు: సర్వేశ్వరునికి వందనములు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి